April 20, 2024

ఇదేమైనా బాగుందా??

జనక మహరాజుగారు యజ్ఞం చేయాలనుకుని అందుకోసం ఏటి ఒడ్డున పూజ చేసి భూమిని దున్నుతుంటే ఆయనకు సీతాదేవి పసిబిడ్డగా దొరికింది. అంటే యజ్ఞం చేయకముందే ఫలం లభించినట్టే కదా..

దానికంటే కొన్నేళ్ల ముందు దశరధ మహారాజు పిల్లలు లేరని ఎవరో అయ్యను బతిమాలుకుని పుత్రకామేష్టీ అనే యాగం పూర్తి చేస్తే గాని ప్రసాదం దొరకలేదు. అది దొరికిన తర్వాత కూడా పెద్ద తంటా వచ్చి పడింది. మరి ఆయనకు  ఉన్నది ఒక్కరు కాదు ముగ్గురు భార్యలాయే. వాళ్లకు ఎలా పంచాలో తెలీక వాళ్లకే పాయసాన్ని ఇచ్చి సర్దుకోమని చెప్పాడు మహారాజు. వాళ్ళు కూడా తమలో తాము మాట్లాడుకుని ఎలాగో పంచేసుకుని తినేస్తారు. తొమ్మిది నెళ్ల తర్వాత నలుగురు  కొడుకులను కన్నారు.   అక్కడ సీతాదేవి ఏమో యజ్ణం చేయకుండానే బిడ్డలా దొరికింది. ఇక్కడేమో యజ్ఞం పూర్తి చేసాక ప్రసాదం పంచుకుని తిన్న తర్వాత గర్భవతులై కుమారులను కన్నారు.  ఇదేమైనా బావుందా? దశరధుడంటే ఆడంబరం కోసం భుజకీర్తులు కట్టుకుని, ఆసరా కోసం ఖడ్గాన్ని చేతికర్రగా వాడుకునే మామూలు మనిషి కాదు. దేవతలు , రాక్షసులు మాటా మాటా అనుకుని  యుద్ధానికి దిగే పరిస్థితి వచ్చినప్పుడు ధనుర్భాణాలన్నీ సర్దుకుని వచ్చి ఈ ముప్పును పోగొట్టమని ఈ మహారాజుకే కదా వర్తమానం పంపిస్తారు కదా. అలాంటి గొప్పవ్యక్తి  పిల్లలు లేక అల్లాడుతుంటే  ఒక్కరంటే ఒక్కరైనా  ప్రత్యుపకారమైనా చేసారా? తాను సాయం చేసిన దేవతలు ఈ చిన్ని వరం ఇవ్వలేకపోయారు. చివరకు అ మహారాజే యజ్ఞపురుషుడైన ఆదినారాయణమూర్తికి అర్జీ పెట్టుకుని అది మంజూరయ్యాక యాగం అది ఇదీ అని తిప్పలు పడ్డాక సంతానం కలిగింది.

అసలు ఈ దేవతలున్నారే.. వీళ్లలో ఒక్కరికైనా సంతానం ఉందా? అంటే వేరేవాళ్లను సంతానవంతులు కావాలి అని దీవించే యోగ్యత లేనట్టే కదా.. అవునయ్యా! మనకు దగ్గర లేనిది ఇంకొకరికి ఎలా ఇస్తాం. అసలు వీళ్లు అన్నం దినే మనుష్యులేనా? అమృతం తాగారు కనక ఆకలి ఉండదు. పాతికేళ్లకు మించి వయసు పెరగదు. కళ్ళు మూసుకుని నిద్ర కూడా పోరు. ఎప్పుడూ ఆ కల్పవృక్షం నీడలో ఉండాల్సిన వాళ్లు. అసలు వీళ్లకు సంతాన లోపం ఏంటి? ఒక్కరికంటే ఒక్కరికీ పిల్లలు లేరు. చెట్లను పెంచేవాడికి ఎప్పుడో ఒకప్పుడు కాయలు కనిపిస్తాయి కాని ఎదిగే మొక్కను నరికేస్తుంటే ఇక కాయలేం దొరుకుతాయి పొయ్యిలోకి కట్టెలు తప్ప? అసలు ఈ దేవతలున్నారే. యుద్ధమంటే మహా ఇష్టం వీళ్లకు ఎప్పుడు చూసినా ఆ రాక్షసులతో గొడవ పెట్టుకుని ఒంటికాలిమీద లేస్తారు, అప్పుడప్పుడు ఓడిపోయి చెట్లల్లో, కొండల్లో దాక్కుంటారు. వాళ్లకు అలా అలవాటైపోయింది మరి. ఇక వీళ్ల రాజున్నాడే ఆ దేవేంద్రుడు. ఒక్కరోజైనా ఇంటి పట్టున ఉండి వేళకింత అమృతం  తాగాడా అంట?  ఏదో ఒక తిక్కపని చేసి ఇల్లు వాకిలి, పెళ్ళాం పిల్లల్ని వదిలి తన చిరునామా కూడా ఎవ్వరికీ చెప్పకుండా ఎక్కడో  తలదాచుకుంటాడు. అందరినీ చల్లగా చూడాలి. అవసరమైనప్పుడు వెళ్లి కాపాడాలి అనుకునే విష్ణుమూర్తి హాయిగా పాలసముద్రంలో ఆదిశేషువుపై నిద్రపోయి ఉన్నాడు. నోరెత్తితే మూడో కన్ను తెరుస్తా అని భయపెట్టే మహాశివుడేమో కొండల్లో, కోనల్లో. ఏదీ దొరక్కపోతే స్మశానంలో ఉంటున్నాడు..

మరి ఈ ఇద్దరికి పిల్లాపీచు ఎందుకు లేరు అన్న  సందేహం రాకమానదు. ఏమంటారు?.. వీళ్లిద్దరూ అప్పుడప్పుడు చేతికి దొరికిన రాక్షసులను వదలకుండా శుభాంతం చేస్తారు. అంతే కాకుండా వాళ్ల తాలూకు మహానగరాలను కూడా నేలమట్టం చేసారు. మరి ఆ పాపం ఊరికే పోతుందా? ఈ పాపఫలమే విష్ణుమూర్తికి పిల్లల్లేకుండా చేసింది.. పాల సముద్రమే ఇల్లైనా పిల్లా పాప లేకపోయినప్పుడు ఈ పాలెవరు తాగుతారు? ఇక ఆ శివుడి విషయానికొస్తే.. ఈయనా, ఆ కుబేరుడు భుజం భుజం రాసుకుంటూ తిరిగే దోస్తులైనా ఈ సంసారికి ఒక ఇల్లూ లేదు, ఆస్థిపాస్థులు లేవు. ఎప్పుడూ గోచీపాతనే గతి. ఇదంతా ఎందుకు జరుగుతుంది. చేసిందానికి అనుభవించాలి కదా..

అదలా ఉంటే జన్మంతా తీన్ తేరగా ఉన్న దేవేంద్రుడికి పిల్లల్లున్నారు కదా అంటారు. ఎందుకు లేరు నిక్షేపంగా ఒక కొడుకున్నాడు. జయంతుడని..  అతను మన్మధుడంతటి  అందగాడని అనుకుంటారు కాని మనకు అసలు సంగతి తెలీదు కదా. కాని రంభ ఉంది చూసారూ…. ఆమె ఎవరా? స్వర్గంలో ఉన్న అప్సర స్త్రీలందరికీ నాయకురాలండి. ఆవిడ మనవాడి విషయంలో కాస్త ఆసక్తి చూపించిందంట.   దేవతలకు మనలా మాటికి మాటికి రెప్పలల్లార్చే అవసరం ఆగత్యం లేదు కదా అలాంటప్పుడు  ఎవరినైనా ఎంతసేపైనా అలా చూస్తూ ఉండొచ్చు కదా. ఊహూ ! అంత అందగాడిని ఎక్కువ సేపు చూడడానికి ఉన్న రెండు కళ్లు చాలక దేవరాజు ఇంద్రుడి కొలువులో నాట్యం చేసి మెప్పించి కొన్ని యుగాల పాటు ఆయనకున్న వెయ్యి కళ్లను అద్దెకు తీసుకుని జయంతుని చూసిందంట. అప్పుడు కాని కూసింత తృప్తి చెందేది కాదంట రంభ.. అలాంటివాడు, అందగాడు  ఒక మంచి హోదాలో ఉన్నట్టుగాని, వారసత్వంగా తండ్రి సంపాదించి పెట్టిన ఆ స్వర్గలోకాన్ని ఏలినట్టుగా కూడ వినలేదు. ఇక పిల్లదాని విషయం.. అందరికీ ఆమె పేరు జయంతి అని మాత్రమే తెలుసు. కాని ఆ అమ్మాయికు పెళ్ళైందా? ఎవరికిచ్చారు? అల్లుడెవరు? వాళ్ల వంశం ఎంత అభివృద్ధి చెందింది? ఈ విషయాలేమీ ఎక్కడా తెలీవు. నామరూపాలు లేకుండా సదరు జనాభాలో కలిసిపోయింది. ఏమిటిదంతా? తండ్రులు చేసిన అపకారపు పనులకు ఫలితం పిల్లల నెత్తిన పడుతుంది.

 
ఇంకో సంగతి చూడండి.. మన్మధుడు తెలుసు కదా? శ్రీమహావిష్ణువుకు కొడుకులాంటివాడు.. ఆ తల్లితండ్రుల అతని మీదే ప్రాణాలు పెట్టుకుని చూసుకుంటున్నారు. పుత్ర వ్యామోహంతో అతి గారాబంగా పెంచడంతో వాడో  కొరకరాని కొయ్యగా తయారై కాస్త లేత హృదయం కనపడగానే అందులోకి దూరి తిష్టవేస్తాడు. కంటికి నదురుగా  కాస్త  బుద్ధిమంతులైన  ఆడపిల్లకాని, మగపిల్లవాడు కాని కనడ్డారో  తన దగ్గర పూలతో తయారు చేసుకున్న  బాణాలన్నీ వాళ్ల మీద ద్రిమ్మరించేసి కుయ్యో మొర్రో అనేలా చేసేస్తాడు. ఆ విష్ణుమూర్తి మీద ఉన్న భయం, గౌరవంతోనో, చేతకానితనంతోనో ఆతని ఆకతాయితనాన్ని ముల్లోకాల వాళ్లు భరిస్తూ వచ్చారు. కాని ఒకసారి సదాశివుడి మీద కూడా ఇలాగే చిలిపితనం చూపించబోయాడు. అసలే ముక్కోపి ఊరుకుంటాడా?. భస్మం చేసాడు.

మన్మధుడేమి పరాయివాడు కాదు. విష్ణుమూర్తి తనకు దోస్తే కదా. పైగా త్రిపురాలను దహించేటప్పుడు దేవతల దగ్గర ఉన్న మందుగుండు సరిపొలేదని విష్ణుమూర్తే బాణంగా మారి సాయం చేసాడు కదా.. అలా తనకు అవసరానికి పనికివచ్చినవాడి కొడుకు అని కూడా జాలి చూపలేదు. ఆ పిల్లాడు తన మీద ఒక బాణం వేసాడో లేదొ టపీమని మూడో కన్ను తెరచి భస్మం చేసాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటారా? చేసింది తండ్రి.. చెడింది కొడుకు.. కాదంటారా? అందుకే దేవాదిదేవులు కాని, మామూలు మనుష్యులు కాని, ఎదుటివారి మేలెంచకుంటే వాళ్లు కూడా పిల్లాపాపలతో చల్లగ ఉండడం అనేది జరగదు. ఎక్కడో  కొడితే ఎప్పుడో ఒకప్పుడు అది ఎక్కడో తగుల్తుంది సుమా. జాగ్రత్త!

ఆ… బండి దారి మళ్లి డొంకదారి పట్టింది. దాన్ని రాదారి మీదకు తెద్దాం.

ఆ దేవేంద్రుడికి పిల్లలెందుకు అని మాట్లాడుకుంటున్నాం కదా మనం.. అనుకూలవతి అయిన భార్య ఇంట్లో ఉన్నప్పుడు మరే ఇతర వ్యాపకాలు లేనప్పుడు పిల్లలు కలగక ఏం చేస్తారు? అసలైతే ఇంద్రుడు బుద్ధిమంతుడే కాని యుద్ధాల రగడ, తపస్సు చేస్తున్నవారిని చెడగొట్టడం లాంటి పనులు నెత్తికెక్కించుకున్నాక ఇంటిపట్టున ఉండడం లేదు.  అసలు అతనికి ఇంటి ధ్యాస ఉంటుందా? నేడో రేపో అక్కరకు వచ్చే పిల్లలున్నారని అసలు గుర్తుంటుందా అని? తన పరిస్థితి అట్టిట్టయితే వాళ్ల భవిష్యత్తు ఏం కానూ అన్న జ్ఞానం ఉందా అసలు? లేదు కనుకనే ఒకటికి పదిసార్లు ఓడిపోయినా బుద్ధి తెచ్చుకోలేదు. తనంతటివాడు లేడనే ధీమాతో గౌతమ మహాముని  ఆశ్రమంలో ఏదో కోడికొక్కిరింపు పని చేసి అటు దేవతల్లో , ఇటు మనుషుల్లో కూడా తల ఎత్తుకుని తిరిగే అవకాశం పోగొట్టుకున్నాడు కదా.

 
అందుకే అంటాను.. ధర్మం అనేది మనిషికైనా, దేవుడికైనా ఒక్కటే అని. బాగోగులు కూడా సరిసమానమే.. సరేనయ్యా.. అలా దేవతలమీద పెట్టి మనుషులకు బుద్ధి చెప్పాలా? నేరుగా మొహాన్నే అనేస్తే ఐపోయేదిగా అంటారా? మాటవరసకు ఎవరితో ఐనా నువ్వు ఆ మల్లయ్యని, పుల్లయ్యని చూసి నేర్చుకోరాదా అని అంటే వాళు వింటారా? నేర్చుకుంటారా? అలా చెప్పినవాడిని మన్నిస్తారా?

అవతలివాడికన్నా నేనే గొప్పవాడిని, నాకు ఇంకోడు చెప్పడమా అనే ఆలోచన అంటే ఒక విధమైన గోరోజనం ఉన్న మనుష్యులు అన్ని కాలాల్లోనూ  ఉంటారు. ఏనాడో కొందరు మహాపురుషులు దేవుళ్ళ మీద పెట్టి మనకు బుద్ధి చెప్పారు. రుషులు, మహాత్ములు చెప్పే మాటలకు ఎంతో విలువ ఉందని నమ్మినవాళ్లు, ఆచరించినవాళ్లు ఎప్పటికి బాగుపడతారు,, బాగుపడుతూనే ఉన్నారు. తమకు తోచక, వేరేవాళ్లు చెప్పింది వినక, సొంతంగా ఆలోచించే నేర్పు లేక ఎవరి దోవన వాళు బాగుండడం సహించే ఓర్పు కూడా లేక విస్సన్న చెప్పిందే వేదం అనే మొండిపట్టూ ఉన్నవాళ్లకు ఎంత వయసు వస్తే ఏం లాభం? ఎన్ని సంపదలుండి ఏం ప్రయోజనం? కన్నబిడ్డలను దూరం చేసుకుని కొందరు, తల్లితండ్రులను దూరం చేసుకుని కొందరు ఇహానికి, పరానికి దూరం అవుతున్నారు….

అయ్ బాబోయ్.. ఈ మాటలన్నీ నావి కావండి బాబూ… ఎప్పుడో చాలా ఏళ్ళ క్రింద మల్లాది రామకృష్ణశాస్త్రిగారి కృష్ణాతీరంలో అప్పన్నగారు ఇలా సెలవిచ్చారు. మనకు పనికొచ్చే మాటలే కదా..

4 thoughts on “ఇదేమైనా బాగుందా??

  1. అవతలివాడికన్నా నేనే గొప్పవాడిని, నాకు ఇంకోడు చెప్పడమా అనే ఆలోచన అంటే ఒక విధమైన గోరోజనం ఉన్న మనుష్యులు అన్ని కాలాల్లోనూ ఉంటారు. ఏనాడో కొందరు మహాపురుషులు దేవుళ్ళ మీద పెట్టి మనకు బుద్ధి చెప్పారు.
    అవును….మంచి విషయం గుర్తు చెసారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *