April 25, 2024

ఒక ప్రయాణం – ఒక పరిచయం

రచన: మధురవాణి 

డిసెంబరు 31, దుబాయ్ ఎయిర్ పోర్ట్
సమయం మధ్యాహ్నం రెండు గంటలు కావొస్తోంది. దాదాపు ఇంకో గంటలో అక్కడ నుంచి హైదరాబాదుకి బయలుదేరే ఫ్లైటు ఉంది. ఆ ఫ్లైటులో ఎక్కాల్సిన ప్రయాణీకులందరూ షాపింగులూ గట్రా ముగించుకుని మెల్లగా ఒక్కొక్కరే వచ్చి బోర్డింగ్ గేటు దగ్గర చేరుతున్నారు. మరి కొందరు ఆ పాటికే అక్కడున్న వాలు కుర్చీల్లో చేరి చిన్న కునుకు తీస్తున్నారు.

అక్కడే కూర్చున్న ఓ అబ్బాయి ఈ లోకంతో తనకే సంబంధం లేనట్టుగా చెవికి ఇయర్ ఫోన్స్ తగిలించుకుని ల్యాప్ టాప్లో ఏదో చూస్తూ మరో లోకంలో తిరుగుతున్నాడు. ఇంతలో అక్కడికి ఒకమ్మాయి వచ్చింది. ఎంత పిలిచినా ఆ అబ్బాయి పలక్కపోయేసరికి “హలో” అంటూ అతని మొహానికెదురుగా చేతిని అటూ ఇటూ తిప్పింది.

“ఓహ్.. సారీ!” అంటూ చెవికి తగిలించిన బంధాల్ని తొలగించి ఈ లోకంలోకి వచ్చాడా అబ్బాయి.

“ఇక్కడెవరైనా ఉన్నారా?” అంటూ అడిగిందా అమ్మాయి అతని పక్కన ఒక బ్యాగ్ పెట్టి ఉన్న కుర్చీని చూపిస్తూ.

“లేదండీ.. ఖాళీనే! మీరు కూర్చోవచ్చు. ఈ బ్యాగ్ నాదే!” అంటూ కుర్చీ ఖాళీ చేసిచ్చి మళ్ళీ చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించుక్కూర్చున్నాడు.

ఆ అమ్మాయి ఓ పుస్తకం పట్టుకుని అలా ఒక పది నిమిషాలు కూర్చుందో లేదో అంతలోనే వాళ్ళ ఫ్లైట్ కి సంబంధించిన ప్రకటన ఒకటి వచ్చింది. ఏవో అనివార్య కారణాల వలన అనుకోకుండా హైదరాబాదు వెళ్ళాల్సిన ఫ్లైటు రద్దయిందనీ, మళ్ళీ ఇంకో ఫ్లైటు బయలుదేరదీయడానికి మూడు గంటల పైనే పడుతుందనీ, ప్రయాణీకుల అసౌకర్యానికి చింతిస్తున్నామనీ ఒక అమ్మాయి బహు తియ్యటి గొంతుతో సెలవిచ్చింది.

ఇంకాసేపట్లో బయలుదేరి గమ్యస్థానం చేరిపోతామన్న ఉత్సాహంతో ఉన్న అందరి మొహాల్లోనూ అప్పటికప్పుడే నిరుత్సాహం నిండిపోయింది. హయ్యో అని ఉసూరుమనే వాళ్ళు కొందరైతే, విసుగు చెంది ఆవేశపడుతున్న వాళ్ళు మరి కొందరు, ఏం చేస్తాం.. వేచి చూడటం తప్పించి.. అన్న ధోరణిలో మరి కొందరు. కొంతమందేమో “హా.. దానిదేముందిలే! ఇంకాసేపు కునుకు తీస్తే సరి” అనుకుని ఎక్కడో చోట జాగా చూస్కుని పడుకునే ప్రయత్నాలు మొదలెట్టారు.

అంతకు ముందే అక్కడికి వచ్చి కూర్చున్న ఆ అమ్మాయి ఇప్పుడీ సమయమంతా ఎలా కాలక్షేపం చేయాలా అని తనలో తనే ఆలోచించుకుంటూ చుట్టూ ఉన్న జనాల్ని పరికిస్తోంది. ఇంతలో ఆ అమ్మాయి దృష్టి తన పక్కనే కూర్చున్న అబ్బాయి పైన ఆగింది. అక్కడ జరిగేదానితో తనకే సంబంధమూ లేదన్నట్టు ఇయర్ ఫోన్స్ తగిలించుకుని ల్యాప్ టాప్లో తల దూర్చిన ఆ అబ్బాయిని చూస్తూ “బాబోయ్.. ఈ శాల్తీ అసలీ లోకంలోనే లేడనుకుంటా.. చూడబోతే ఫ్లైటు తప్పిపోయినా కూడా పట్టించుకునేలా లేడు” అనుకుని నవ్వుకుంది.

ఇంతకీ అసలు విషయం వినిపించిందో లేదోనని, అతగాడికి ఓ మాట చెప్దామని పిలిచింది. అబ్బే.. అతడికి వినిపించే పరిస్థితి లేదసలు అక్కడ! చేత్తో మెల్లగా తట్టి పిలిచింది. వెంటనే ఉలిక్కిపడి గభాల్న ఆ ఇయర్ ఫోన్స్ తీసేసి “ఏంటండీ?” అని అడిగాడు.

“మీరు హైదరాబాద్ ఫ్లైటు కోసమే గనక వేచి చూస్తున్నట్టయితే అదింకో మూడు గంటల దాకా బయలుదేరదట. ఇప్పుడే అనౌన్స్ చేసారు. మీరు వినిపించుకోలేదేమోననిపించి చెప్దామని పిలిచాను. డిస్టర్బ్ చేసినందుకు సారీ!” అంది ఆ అమ్మాయి వస్తున్న నవ్వుని ఆపుకుంటూ.
కానీ ఊహించని విధంగా ఆ అబ్బాయి స్పందన మరోలా ఉంది.

“ఏంటీ?? ఫ్లైట్ మూడు గంటలు డిలే నా! మై గాడ్! అంటే, మనం వెళ్లేసరికి దాదాపు రాత్రి పన్నెండు దాటిపోతుందన్నమాట! ఛా.. ఎమిరేట్స్ వాడు సరిగ్గా టైము ప్రకారం తీసుకెళతాడు కదా అనుకుంటే.. ఇదేంటి ఇలా చేశాడు? ఆర్యూ షూర్? సరదాకి చెప్పట్లేదు కదా! ఒహ్హో.. దట్స్ టెర్రిబుల్!” అంటూ బోల్డంత ఆందోళన పడిపోతున్న ఆ అబ్బాయిని చూసి ఆశ్చర్యపోవడం ఆ అమ్మాయి వంతయింది.

“అయ్యో.. అంతిదిగా గంటలు లెక్కలు చూసుకుంటున్నారంటే మీరంత అర్జెంటుగా వెళ్ళాల్సి ఉందాండీ!” అని కంగారుగా అడిగిందా అమ్మాయి.
ఆ అమ్మాయి అలా అమాయకంగా అడిగిన తీరుకి అప్పటిదాకా ఉన్న చిరాకంతా పోయి చప్పున ఒక చిరునవ్వొచ్చేసింది ఆ అబ్బాయి మొహంలోకి. అప్రయత్నంగానే అతని స్వరతీవ్రత తగ్గి మామూలు స్థాయికొచ్చేసింది.

“అది కాదండీ.. మా ఫ్రెండ్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునే న్యూ ఇయర్ పార్టీకి అటెండ్ అవుదామనే ఉద్దేశ్యంతోనే లాస్ట్ మినిట్లో ఈ జర్నీ ప్లాన్ చేసుకున్నాను. తీరా చూస్తే ఇలా జరిగింది. అందుకని చాలా డిసప్పాయింట్ అయిపోయాను” ఉస్సూరంటూ చెప్పాడా అబ్బాయి.

“మీరింత హడావుడి చేసిందీ న్యూ ఇయర్ పార్టీ మిస్ అయిపోతున్నారనా! మై గాడ్! ఇందాక మీ ఆదుర్దా చూసి ఎంత అత్యవసరంగా వెళ్ళాల్సిన పనో ఏవిటో అనుకున్నాను. మీరు భలేవారండీ! అయినా, ప్రతిసారీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఏం బాగుంటుంది చెప్పండి. హ్యాపీగా ఈ సారికి ఆకాశంలోనో, దుబాయ్ లోనో ఉండి న్యూ ఇయర్ కి స్వాగతం చెప్పెయ్యండి. అయినా ఇంకో మూడు గంటల్లో బయలుదేరిపోతే న్యూ ఇయర్  వచ్చే టైముకి హైదరాబాదులోనే ఉంటామేమో!” అందా అమ్మాయి తేలిగ్గా నవ్వేస్తూ.

“మీరు ఏదైనా భలే తేలిగ్గా తీసుకుంటారనుకుంటా కదా! అయితే ఇప్పుడు మరో మూడు గంటలు కష్టపడి కాలక్షేపం చెయ్యాలన్నమాట” అన్నాడు ఆ అబ్బాయి కూడా నవ్వుతూ.

“ఏదైనా కాదు గానీ, తేలిగ్గా తీసుకోవాల్సినవి మాత్రం అలానే తీసుకుంటాను. అయినా, మీరు గానీ ల్యాప్ టాప్లో తల దూర్చితే మూడు గంటలేం ఖర్మ… మూడు రోజులైనా చిటికెలో గడిపెయ్యగల సమర్ధులు కదండీ..” అందా అమ్మాయి నవ్వుతూనే.

“టైం గడవడానికి ఏం చెయ్యాలో తెలీకనే దీన్ని ముందేసుకు కూర్చున్నానండీ!” అంటూ వివరణ ఇస్తున్నట్టుగా చెప్పాడా అబ్బాయి.
“ఇంత పెద్ద దుబాయ్ ఎయిర్పోర్టులో కాలక్షేపానికి కరువా.. అలా అలా ఒక్కసారి మొత్తం చుట్టేస్తే సరి! నేనా పన్లో ఉంటాను మరి..” అంటూ ‘బై’ చెప్పి అక్కడ నుంచి లేచింది ఆ అమ్మాయి.

అలా నాలుగడుగులేసిందో లేదో వెనక నుంచి “హలో హలో.. మిమ్మల్నేనండీ” అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది.

“మీకు అభ్యంతరం లేకపోతే నేనూ మీతో కలిసి తిరగొచ్చా?” అన్నాడా అబ్బాయి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా.

ఒక్క క్షణం ఆలోచించి “సరే పదండి” అందా అమ్మాయి.

ఇద్దరూ కలిసి మెల్లగా నడుస్తూ ఉన్నారు.

“మీ పేరేంటో తెల్సుకోవచ్చా?” అని అడిగాడు అబ్బాయి.

ఆ అమ్మాయి చప్పున కళ్ళెత్తి ఆ అబ్బాయి మొహంలోకి చూసేసరికి వెంటనే అబ్బాయి కాస్త గొంతు సర్దుకుని “అంటే.. అదీ.. మీ పేరేంటో తెలీకపోవడం వల్ల ఇందాక మిమ్మల్ని హలో హలో అని పిలవాల్సి వచ్చింది కదండీ.. అందుకని..” అంటూ వివరిస్తున్న అబ్బాయిని చూసి చిన్నగా నవ్వేసిందా అమ్మాయి.

“నా పేరు సంకీర్తన. మరి మీ పేరు?”

“హమ్మయ్యా.. బతికించేశారు. మీరొకేసారి అలా చూసేసరికి నిజంగా భయపడ్డానండీ ఎక్కడ తిట్టేస్తారోనని. మీ పేరు బాగుంది. నా పేరు కిరణ్. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాను. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను.”

“నేను కాలిఫోర్నియా నుంచి వస్తున్నాను. ప్రస్తుతం న్యూరోసైన్స్ లో మాస్టర్స్ చేస్తున్నాను” అని జవాబిచ్చిందా అమ్మాయి.

“అబ్బ.. మీకెంత ఒపికండీ! అంత దూరం నుంచి ప్రయాణం చేస్తూ కూడా ఫ్లైట్ ఆలస్యం అయితే అస్సలు చిరాకు పడకుండా ఎంత కూల్ గా ఉన్నారో!”

“చిరాకు పడే కొద్దీ ఇంకా విసుగు ఎక్కువవుతుంది కదండీ.. అందుకే సాధ్యమైనంత వరకూ దేని గురించైనా చిరాకు పడకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటాను.”

అలా అలా మాటల్లో పడిపోయిన వాళ్ళిద్దరూ మెల్లగా నడుస్తూ ఓ అరగంట గడిచేసరికి షాపింగ్ ఏరియా దగ్గరికి చేరుకున్నారు.

మాములుగానే ఎప్పుడూ కొన్ని వందల విద్యుద్దీపాల నడుమ మిలమిలా మెరిసిపోతుండే దుబాయ్ ఎయిర్పోర్ట్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చేసిన ప్రత్యేక అలంకరణలతో మరింతగా మెరిసిపోతూ దేదీప్యమానంగా వెలిగిపోతోంది.

చాక్లెట్లు మొదలుకుని ఫోన్లు, కంప్యూటర్ల వరకూ ప్రతీదీ అమ్మే షాపులన్నీ వరుసగా కొలువుదీరి ఉన్నాయి. ఏ షాపులో చూసినా జనం క్రిక్కిరిసిపోయి ఉన్నారు.
ముందుగా ఇద్దరూ కలిసి అక్కడున్న పెద్ద పుస్తకాల షాపులోకి నడిచారు. సంకీర్తన అక్కడున్న బోల్డన్ని పుస్తకాల్ని ఆసక్తిగా తిరగేస్తూ కాసేపు తిరిగాక ఒకరెండు పుస్తకాలు కొని కిరణ్ కోసం చుట్టూ చూసింది. పుస్తకాల షాపు మధ్యలో నించుని దిక్కులు చూస్తూ కనిపించాడు.
తను కొన్న పుస్తకాలకి బిల్లు కట్టేసి కిరణ్ దగ్గరికెళ్ళి “ఏంటండీ పుస్తకాలు చూడకుండా ఇంకేదో చూస్తున్నట్టున్నారు” అంది అల్లరిగా చుట్టూ ఉన్న అమ్మాయిలను చూస్తూ.

“అయ్యో అలాంటిదేం లేదండీ! నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. మీరేమో పుస్తకాలని చూడగానే ప్రపంచం మర్చిపోయినట్టు అంత ఆసక్తిగా చూస్తుండేసరికి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇటొచ్చి ఇలా దిక్కులు చూస్తున్నా. ఇంతకీ మీ పుస్తకాల షాపింగు అయిపోయినట్టేనా?” అని అడిగాడు తన చేతిలో ఉన్న పుస్తకాల వంక చూస్తూ.

“ఈ రోజుకి పుస్తకాల కోటా అయిపోయినట్టే! అయితే మీకు పుస్తకాలు బోర్ అన్నమాట! అలా అయితే మీకేం ఇష్టమో చెప్పండి. అవి చూద్దాం కాసేపు.”

“ఇప్పుడేం కొనాల్సింది లేదు గానీ ఎదురుగా ఉన్న ఎలక్ట్రానిక్స్ షాప్లో కెళ్ళి ఒకసారి అలా తిరిగేసి వస్తాను. కొత్తగా ఏం వస్తున్నాయో చూడటం చాలా సరదా నాకు.” అంటూ అటు వైపు నడిచాడు కిరణ్.

“పదండి.. నేనూ వస్తాను మీతో” అంటూ వెంట నడిచింది సంకీర్తన.

అక్కడున్న కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గురించి ఎంతో ఉత్సాహంగా వివరించి చెప్తున్న కిరణ్ మాటలు శ్రద్ధగా వింది సంకీర్తన. అక్కడ కాసేపు తిరిగాక పక్కనే ఉన్న చాక్లెట్ల షాపులోకి వెళ్ళారు. కిరణ్ తన చెల్లి కోసమని చెప్పి కొన్ని చాక్లెట్స్ కొన్నాడు.

అక్కడ కిరణ్ బిల్ కట్టేసి వచ్చే లోపు సంకీర్తన పక్కనే ఉన్న ‘స్వరోస్కి’ షాపులో అవీ ఇవీ చూస్తోంది. కిరణ్ కూడా వచ్చి తనతో పాటే అన్నీ గమనిస్తూ పక్కనే నించున్నాడు.

ఒక క్రిస్టల్ పెండెంట్ చూపించి “బాగుంది కదూ..” అనడిగింది సంకీర్తన. “ఇలాంటి వస్తువుల గురించి నాకస్సలు తెలీదండి. కానీ, చూడ్డానికి మాత్రం బాగుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్నదే ఇంకోటి నేను కూడా తీసుకోవచ్చా మా చెల్లి కోసం..” అని కాస్త జంకుతూ అడిగాడు కిరణ్.
సంకీర్తన ఏం సమాధానం చెప్పకుండా నవ్వేసి వెంటనే అలాంటి పెండెంట్స్ రెండింటిని విడివిడిగా ప్యాక్ చేయించింది.

ఆ తరువాత ఆ పక్కనే ఉన్న ఐస్క్రీం షాపుని చూడగానే తనకి ఆకలేస్తోందని చెప్పి ఐస్క్రీం కొనుక్కుంది సంకీర్తన. తనకి ఐస్క్రీం పెద్దగా నచ్చదని అక్కడే ఉన్న మరో షాపులో పండ్లరసం కొనుక్కున్నాడు కిరణ్.

ఆ తరవాత పక్కనే ఉన్న పెర్ఫ్యూమ్ షాపులో కెళ్ళి ఇంకే వాసనా గుర్తించలేం అని అనిపించేదాకా రకరకాల పెర్ఫ్యూములన్నీ ట్రై చేస్తూ చాలాసేపు నవ్వుకున్నారు.

అప్పటికే వాళ్ళిద్దరూ కలిసి తిరగడం మొదలెట్టి దాదాపు రెండు గంటల పైనే అయింది. ఇక వాళ్ళ ఫ్లైటు బయలుదేరే టైము తెలుసుకుందామని డిస్ప్లే బోర్డ్ వెతుకుతూ వెళ్తే మరో రెండు గంటలు పైనే ఎదురు చూడాలని తెలిసింది.

ఇంకాసేపు అటూ ఇటూ తిరిగి అలసిపోయినట్టనిపించి ఇక షాపింగుకి విరామం ఇచ్చి ఓ చోట తీరిగ్గా కూర్చుని కబుర్లలో పడ్డారు. సినిమాలూ, సంగీతం, క్రికెట్, స్నేహితులూ, రాజకీయాలు, చదువులూ, పుస్తకాలూ.. అలా అలా ఎన్నో కబుర్లు దొర్లిపోయాయి వాళ్ళిద్దరి మధ్యా!
ఫ్లైటు బోర్డింగ్ టైం దగ్గర పడేసరికి మళ్ళీ మెల్లగా గేటు దగ్గరికి చేరుకున్నారు.

“మీరు తోడుగా ఉండటం వల్ల వెయిటింగ్ టైమంతా చాలా సరదాగా గడచిపోయిందండి. థాంక్స్ ఎలాట్!” అన్నాడు కిరణ్. బదులుగా సన్నగా నవ్వింది సంకీర్తన.

ఇద్దరూ స్నేహంగా వీడ్కోలు చెప్పుకుని అందరు ప్రయాణీకులతో పాటు విమానంలోకి ఎక్కేసి వారి వారి సీట్లు వెతుక్కుని కూర్చున్నారు.

దుబాయ్ ఎయిర్ పోర్ట్, సమయం రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషాలు కావస్తోంది.
మరి కొద్ది నిమిషాల్లో హైదరాబాద్ బయలుదేరే విమానం గాల్లోకి ఎగురుతుందనగా ఒక ఎయిర్ హోస్టెస్ సంకీర్తన దగ్గరికి వచ్చి “నీ పక్కన సీటు అమ్మాయి మరో అబ్బాయితో సీట్ మార్చుకుంది. మరేం పర్లేదుగా” అనడిగితే తనకే అభ్యంతరమూ లేదని చెప్పింది.
మరో నిమిషానికి “హాయ్” అని సుపరిచితమైన గొంతు వినపడగానే పుస్తకంలో దూర్చిన తలెత్తి చప్పున పక్క సీట్లో ఉన్న వ్యక్తి మొహంలోకి చూసింది సంకీర్తన.
వెంటనే కాస్త కంగారుగా “అంటే.. అదీ.. సీటు మార్చుకుంది నేను కాదండీ.. ఆ అమ్మాయే!” అన్నాడు కిరణ్.
జవాబుగా చిన్నగా నవ్వేసింది సంకీర్తన. ఆ తర్వాత కాసేపు సంకీర్తన తన పుస్తకంలో తల దూరిస్తే, కిరణ్ తన చెవులకి ఇయర్ ఫోన్స్ తగిలించేశాడు. తరవాత భోజనం చేస్తూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.

కాసేపయ్యాక సంకీర్తన తను చదువుతున్న నవలని కథలాగా చెప్పింది కిరణ్ కి. ఆ తరవాత ఆ నవల్లో మిగిలిన భాగం పూర్తి చేస్తానని చెప్పి పుస్తకం చేతిలో పెట్టుకుని తనకి తెలీకుండానే కన్నంటుకుంది సంకీర్తనకి. నిద్రలో కాసేపటికి మెల్లగా కిరణ్ భుజం మీదకి తల వాల్చేసింది.

కిరణ్ కి మాత్రం అస్సలు నిద్ర రావట్లేదు. తన భుజం మీద తల వాల్చిన సంకీర్తనకి నిద్రాభంగం కలగకూడదని కొంచెం కూడా కదలకుండా బొమ్మలా కూర్చుండిపోయాడు. తనని చూస్తుంటే తామిద్దరి పరిచయం ఎప్పటిదో అనిపిస్తోంది. గడచిన ఆ రోజునంతా మనసులో గుర్తు చేసుకోసాగాడు.

ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ పార్టీ కోసం చివరి క్షణంలో హడావిడిగా బయలు దేరడం, అనుకోకుండా ఫ్లైటు ఆలస్యమవడం, సంకీర్తన పరిచయం, తామిద్దరూ చెప్పుకున్న కబుర్లు, ముచ్చటైన తన చిరునవ్వు.. అన్నీ తలచుకుంటుంటే అతనికి చాలా సంతోషంగా ఉంది.
ఈ న్యూ ఇయర్ సంకీర్తనని తనకి కానుకగా తీసుకొచ్చిందేమో అనిపించింది. అంతలోనే, ఈ విమానం హైదరాబాదు చేరాక తన దారిన తను వెళ్లిపోతుంది కదా అనిపించి కొంచెం దిగులుగా అనిపించింది.

పోనీ, తన ఈమెయిలో, ఫోన్ నంబరో అడిగితే అనే ఆలోచన వచ్చింది. అంతలోనే చురుకైన తన చూపులు గుర్తొచ్చి ఆ ఆలోచన విరమించుకున్నాడు. సరిగ్గా అప్పుడే సంకీర్తన నిద్రలో కదిలి అతని భుజం మీద నుంచి మరో వైపుకు తల వాల్చేసింది.

అప్పటిదాకా అతని ఊహల్లో అందంగా కనిపించిన రంగుల కలేదో అకస్మాత్తుగా సగంలోనే ఆగిపోయినట్టు అనిపించింది కిరణ్ కి.
అలా ఆలోచనల్లో పడి ఎంత సమయం గడిచిందో తెలీలేదు కిరణ్ కి. ఫ్లైట్లో లైట్లన్నీ వెలిగాయి. నిద్రలోకి జారుకున్న వారందరితో పాటుగా సంకీర్తనకి కూడా మెలకువ వచ్చింది. ప్రయాణీకులందరూ సీట్ బెల్టులు బిగించుకుని విమానం ఎప్పుడెప్పుడు గమ్యం చేరతామా అని ఉత్సాహంగా ఎదురు చూడసాగారు.
అప్పటి దాకా ఆకాశంలో మబ్బుల్ని దాటుకుంటూ పరుగులు తీసిన విహంగం గమ్యస్థానం చేరువవుతున్న కొద్దీ మెలమెల్లగా ఆకాశానికి దూరమవుతూ వచ్చి భద్రంగా నేలపైన దిగింది.

ఎమిరేట్స్ తరపు నుంచి “హ్యాపీ న్యూ ఇయర్” అంటూ విష్ చేసి అందరికీ స్వీట్స్ పంచుతూ వీడ్కోలు పలికారు ఎయిర్ హోస్టెస్ భామలు.

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్, డిసెంబరు 31.

రాత్రి పన్నెండు గంట కొట్టడానికి ఇంకా పదిహేను నిమిషాల సమయముంది.

దుబాయ్ నుంచి అప్పుడే వచ్చిన ఆ విమానం నుంచి దిగిన ప్రయాణీకులందరూ ఎంతో ఉత్సాహంగా తమ సామాను తీస్కుకోవాల్సిన వైపు నడుస్తున్నారు.
ఆ సమయంలో బహుశా కిరణ్ ఒక్కడేనేమో ఆ ప్రయాణం అయిపోయిందని బాధ పడుతోన్న మనిషి. కానీ, ఏ ప్రయాణమైనా ఎప్పుడో అప్పుడు ఎక్కడో ఓ చోట ఆగిపోవాల్సిందే కదా!

సంకీర్తన, కిరణ్ కూడా వెళ్లి అక్కడ నిలబడ్డారు.  కిరణ్ కేమో దిగులుగా ఉండి ఏం మాట్లాడాలో తోచట్లేదు. సంకీర్తనకేమో ఇంకా కొంచెం నిద్ర మత్తులోనే ఉన్నట్టుంది. మొత్తానికి ఇద్దరూ మౌనంగా నిలబడి తమ సామాను కోసం చూస్తున్నారు. తమ సామాను రాగానే ఒక్కోటీ అందుకుంటున్నారు.
ఈ తతంగమంతా మరి కాస్త ఆలస్యమైతే బాగుండు.. అప్పుడు మరి కాసేపు సంకీర్తన పక్కనే ఉంటుంది కదా.. అనిపిస్తోంది కిరణ్ కి. కానీ, అప్పటికైనా సంకీర్తన వెళ్లిపోతుందిగా.. అనిపించి అంతలోనే దిగులేసింది.

ఇలా కిరణ్ ఆలోచనల్లో సతమతమవుతూ ఉండగానే సంకీర్తన నిద్ర కళ్ళతోనే ఆవలిస్తూ “విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్” అంది నవ్వుతూ.
అప్పుడే నిద్ర లేవడం చేత కొంచెం చిన్నవైనట్టు కనిపిస్తున్న కళ్ళు, కొంచెం ముందుకొచ్చిన పై పెదవి, తలకట్టు కొద్దిగా చెదిరి మొహం మీదకి పడుతోన్న ముంగురులు.. అలా కనిపిస్తున్న సంకీర్తనని చూస్తుంటే చిన్నపాపలా చాలా ముద్దుగా అనిపించి అలా చూస్తూనే ఉండిపోయాడు కిరణ్.
తను తిరిగి “ఏంటీ.. మీ ఫ్రెండ్స్ తో చేసుకునే పార్టీలో తప్ప ఇంకెవరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పనని రెసొల్యూషన్ చేసుకున్నారా?” అనడిగేసరికి గబుక్కున

ఈ లోకంలోకి వచ్చేసి చేతికున్న వాచ్ కేసి చూసుకుని “అహా.. అలాంటిదేమీ లేదు. ఇంకా ఆరు నిమిషాలుంది కదా! సరిగ్గా టైముకి విష్ చేద్దామని ఆగాను” అనేశాడు అప్పటికప్పుడు కల్పించుకుని.

ఈ లోపు వాళ్ళిద్దరి సామానంతా వచ్చేసింది. ఇద్దరూ అది తీసుకుని బయటికెళ్ళే గేటు వైపు కదిలారు. సరిగ్గా ఆ గేటు ముందే మరో స్కానింగ్, కస్టమ్స్ చెకింగ్ చేయాల్సి ఉంది.

ముందు సంకీర్తన సామాను అంతా క్లియర్ అయిపోయేసరికి అక్కడి నుంచి గేటు దగ్గరకి వెళ్ళింది. బయట కాస్త దూరంలో వాళ్ళ అమ్మ, నాన్నగారు కనిపించారు చేతులూపుతూ. తను కూడా వాళ్ళని చూసి చేతులూపి, వెనక్కి తిరిగి చూసింది కిరణ్ కి చెప్పడం కోసం.

సరిగ్గా అదే టైముకి కిరణ్ సామానులో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి ఏదో ప్రశ్నలేస్తున్నాడు అక్కడున్న ఆఫీసరు. అక్కడే ఒక రెండు నిమిషాలు ఎదురు చూసినా కిరణ్ ఇంకా రాలేదు.

గేటు బయట తన వాళ్ళందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తుండేసరికి ఇక తప్పక కిరణ్ కి ‘బై’ చెప్పకుండానే బయటికి నడిచింది సంకీర్తన.
సరిగ్గా తను వెనుదిరిగే సమయానికి కిరణ్ కూడా అక్కడ నుంచి బయట పడి సంకీర్తన కోసం చుట్టూ చూసాడు. ఈ లోపు గడియారం పన్నెండు గంట కొట్టడంతో ఎయిర్ పోర్ట్లో అందరూ “హ్యాపీ న్యూ ఇయర్” అని కేకలు పెట్టారు.
కాసేపు చుట్టూ వెతికాక దూరంగా తన కుటుంబ సభ్యులతో సంతోషంగా మాట్లాడుతోన్న సంకీర్తన కనిపించింది. అంతలోనే ఉన్నట్టుండి కిరణ్ స్నేహితులందరూ ప్రత్యక్షమైపోయి కిరణ్ చుట్టూ మూగి “హ్యాపీ న్యూ ఇయర్” అంటూ అరిచారు.

 

సరిగ్గా అప్పుడే సంకీర్తన మరోసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ గుంపు మధ్యలో ఉన్న కిరణ్ కనిపించాడు. “హమ్మయ్యా.. కస్టమ్స్ వాళ్ళతో ఏ సమస్యా లేకుండా బయట పడ్డాడన్నమాట!” అని హాయిగా ఊపిరి పీల్చుకుని సంతోషంగా ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి నడిచింది.
కిరణ్ కి మళ్ళీ ఎంతగా వెతికి చూసినా సంకీర్తన కనపడలేదు.

కాల చక్రంలో మరో రెండేళ్ళు గడిచాక…

ఆ రోజు డిసెంబరు 31, సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలవుతోంది.

“చూడు సత్యా! ఇప్పుడు మనింటికి వచ్చే వాళ్ళు మీ బాబాయికి చాలా ఆత్మీయ స్నేహితులు. వాళ్ళది చాలా మంచి కుటుంబం, అబ్బాయి చాలా బుద్దిమంతుడు, నీకు సరిగ్గా జోడు అవుతాడని బాబాయి ఉద్దేశ్యం. వాళ్ళని కలిసి, నువ్వు అబ్బాయిని చూసి నచ్చలేదని చెప్తే బానే ఉంటుంది కానీ, ఊరికే చూడడానికి కూడా గొడవ చేస్తే ఎలాగమ్మడూ!” అంటూ సర్ది చెప్పాలని ప్రయత్నిస్తోంది సత్య వాళ్ళమ్మ.
ఇంతలో సత్య వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి “మేము నిన్ను ఇబ్బంది పెడతామా బంగారు తల్లీ! ఇదసలు పెళ్లి చూపులు కానే కాదు. వాళ్ళ కుటుంబాన్ని కేవలం మర్యాదపూర్వకంగా భోజనానికి పిలిచాం. అంతే! ఈ రోజు పెళ్ళికి సంబంధించిన మాటలేవీ రావు మన మధ్య. ఆ అబ్బాయిని చూసాక, నీకేమైనా ఆసక్తి ఉంటే అప్పుడే ఈ విషయంలో ముందుకెళ్దాం. సరేనా! ముందా మొహంలో విసుగు తీసేసి కాస్త నవ్వమ్మా..” అని బుజ్జగిస్తూ చెప్పారు సత్య నాన్నగారు.

ఇంతలో గేటు చప్పుడయింది. ఎదురు చూస్తున్న అతిథులు వచ్చారని వాళ్లకి ఆహ్వానం పలకడానికి సత్య వాళ్ళమ్మ, నాన్నగారు బయటికి నడిచారు. మరిహ తప్పదని సత్య కూడా వాళ్ళని అనుసరించింది.

ఆ వచ్చిన అతిథుల్లో తల్లీ, తండ్రీ, ఒక అమ్మాయి ముగ్గురే ఉండటం, సదరు పెళ్లి కొడుకనే శాల్తీ లేకపోవడం చూసి హమ్మయ్యా అనుకుంది సత్య.
ఇంతలోనే అదే సందేహం సత్య తల్లిదండ్రులు అడగడం, వాళ్ళేమో “అబ్బాయి ఎవరో స్నేహితులని కలవడానికి వెళ్ళాడండీ! మరో అయిదు నిమిషాల్లో నేరుగా ఇక్కడికే వచ్చేస్తాడు” అని సమాధానం చెప్పడం కూడా జరిగిపోయాయి.

 

రెండు కుటుంబాల వారూ పరస్పర పరిచయాలు చేసుకున్నారు. ఆ వచ్చినమ్మాయి పెళ్లి కొడుకు చెల్లెలనీ, పేరు సింధూర అనీ తెలిసింది.
పెద్ద వాళ్ళందరూ ఏవో మాటల్లో పడిపోతే మధ్యలో ఏం మాట్లాడాలో తెలీక సత్య, సింధూర ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు.
అక్కడ తనలాగే ఆ అమ్మాయికి కూడా ఇబ్బందిగానే ఉందని గ్రహించిన సత్య “మనం అలా ఇంటి ముందుకి వెళ్దామా అని అడిగింది సింధూరని. ఆ అమ్మాయి కూడా కాస్తంత రిలీఫ్ గా ఫీలయ్యి సరేనన్నాక ఇద్దరూ కలిసి ఇంటి ముందు వసారాలోకి వెళ్లి కూర్చుని చదువుల గురించి, కాలేజీల గురించి మాట్లాడుకోసాగారు.
ఉన్నట్టుండి సత్య దృష్టి సింధూర మెడలో మెరుస్తున్న ‘స్వరోస్కి’ పెండెంట్ మీద నిలిచింది. చప్పున ఏదో గుర్తొచ్చి తనని ఏదో అడగబోయేంతలో గేటు చప్పుడయింది.

“మా అన్నయ్య వచ్చేశాడు” అంటూ సింధూర ఎదురెళ్ళింది.
లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి సత్యకి ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. ఇహ అతని సంగతి సరే సరి! కలలో ఉన్నాడో ఇలలో ఉన్నాడో తేల్చుకోలేని స్థితి.
సత్య ముందుగా తేరుకుని “చందు అంటే నువ్వా.. మీరా?” అంది తడబడుతూ.

 

“అవును.. మా అన్నయ్య పేరు చంద్రకిరణ్. అంటే మీరిద్దరికీ ఇదివరకే పరిచయముందా?” అంటూ సింధూర ఆశ్చర్యపోయి చూస్తోంది ఆ ఇద్దరినీ.
అతికష్టం మీద నోరు పెగల్చుకుని “మరి సత్య?” అన్నాడు కిరణ్. “నేనే.. సత్య సంకీర్తన” అని జవాబిచ్చి కళ్ళెత్తి సూటిగా అతని మొహంలోకి చూసింది.
వెంటనే కిరణ్ “అంటే.. అదీ.. నేను కావాలని రాలేదు. అసలు మీ ఇల్లని నాకు తెలీదు. అసలు ఇక్కడికి రావడం నాకిష్టం లేదు” అంటూ ఏదో సర్ది చెప్పబోయాడు.

 

అతని కంగారు చూసి ఫక్కున నవ్వేసింది సత్య సంకీర్తన.

 

వీళ్ళిద్దరి వాలకం చూసిన సింధూరకి అన్నయ్య ఎప్పటి నుంచో చెప్తున్న సంకీర్తన ఈ సత్యేనని అర్థం అయిపోయి ఈ విషయం తన తల్లిదండ్రులతో చెప్పాలని హడావుడిగా ఇంట్లోకి పరుగు తీసింది.

 

అదే రోజు రాత్రి.. గడియారం పన్నెండు కొట్టడానికీ, మరో కొత్త సంవత్సరం పుట్టడానికీ ఇంకో నిమిషం సమయం ఉంది. మంచు కురుస్తున్న ఆ వెన్నెల రాత్రిలో మౌనంగా కూర్చుని ఉన్నాడు కిరణ్. మెలకువగానే అతని భుజంపై తల వాల్చి పక్కన కూర్చుంది సంకీర్తన. సరిగ్గా పన్నెండవగానే “హ్యాపీ న్యూ ఇయర్! చూసావా అన్నమాట ప్రకారం సరిగ్గా పన్నెండుకి విష్ చేసాను” అన్నాడు కిరణ్. “పెద్ద గొప్పేలే.. సరిగ్గా అంటే రెండేళ్ళు ఆలస్యంగా విష్ చేయడమా!” అని గలగలా నవ్వుతోంది సంకీర్తన.

 

ఎప్పుడో.. ఎక్కడో.. ఉన్నట్టుండి సగంలో ఆగిపోయిన తన అందమైన కల ఇప్పుడు.. ఈ క్షణాన.. సజీవంగా దర్శనమిచ్చింది కిరణ్ కళ్ళెదుటే.

40 thoughts on “ఒక ప్రయాణం – ఒక పరిచయం

  1. కథ చాలా బాగుందండి, సున్నితంగా నడిచిన చక్కటి ప్రేమకథ..

  2. కథ చాలా బావుంది మధురా.
    అంతసేపు ఎయిర్ పోర్ట్ లో తిరిగినా విసుగురాలేదు సుమా !
    ఇలాంటి సున్నితమైన కథలు, కబుర్లు చెప్పాలంటే నీతరవాతే ఎవరైనా .

  3. chaalaa baagundi madhuraa..ilaa rendu perlu undatam advantage kadaa….andukenemo andaru..first name middle name ani rendu perlu pettesukuntaaru happy gaa…katha naaku baagaa nachchindi

  4. కథ చాలా బాగుంది. ముగింపు సుఖాంతం, ఆ క్షణాన వారిరువురి మనసులు రెండేళ్ళ వెన్నక్కెళ్ళి కలిగే థ్రిల్ చివరి ఒక్క లైన్ లో ““పెద్ద గొప్పేలే.. సరిగ్గా అంటే రెండేళ్ళు ఆలస్యంగా విష్ చేయడమా!” అని గలగలా నవ్వుతోంది సంకీర్తన.” లో చూపించారు.

  5. చాలా బావుంది మీ కధనం.
    ఎందుకో చదువుతున్నంత సేపు “ప్రయాణం” సినిమా గుర్తుకు వచ్చింది. 🙂

  6. @ cbrao, జ్యోతిర్మయి, శ్రావ్య, తృష్ణ, శశికళ, చైతన్య, శ్రీలలిత, చిన్ని, కళ్యాణ్,

    మీ అందరికీ కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది. స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 🙂

  7. చాలా బావుందండీ…cute love story…ఒక్కటే సందేహం..మీ హీరో కీ హీరోఇన్ కీ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో 15 నిమిషాల్లోనే luggage వచ్చేసిందా :)…నాకేమిటో మరి గంటన్నర పట్టింది మరి…:(

    1. థాంక్యూ స్ఫురిత గారూ..
      హిహ్హిహ్హీ.. మీకు భలే సందేహమే వచ్చిందిగా మీకు. నా స్వానుభవంలో అయితే ఒకసారిలాగే చాలా ఫాస్ట్ గా బయట పడిపోయాను ఎయిర్పోర్ట్ నుంచి. అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళిద్దర్నీ కూడా ధైర్యంగా పదిహేను నిమిషాల్లో బయట పడేసాను! 😉
      కానీ, అదొక్కసారే అంత తొందరగా బయటపడటం.. సాధారణంగా ఎప్పుడైనా సరే కనీసం అరగంటైనా పడుతుంది. 🙂

  8. సున్నితమైన ప్రేమకథని అంతే సున్నితంగా చెప్పారు.
    అభినందనలు..

  9. చదువుతున్నంతసేపూ ఏదొ చక్కని మెలోడీ వింటున్నట్టు హాయిగా ఉంది, మధురా..
    నేనూ వాళ్ళతో షాపులన్నీ తిరిగేశాను.. కావాల్సినవి కొనేసుకున్నాను :))

  10. పొరపాటున ఎప్పుడైనా దుబాయ్ వెళ్తే తప్పకుండా laptop ఒళ్లో పెట్టుకొని, headphone చెవిలో పెట్టుకొని… bag నా పక్క seatలో పెట్టుకొని కూర్చుంటాను… 🙂

    చాలా చక్కటి narration.. బాగుంది మధుర గారు…

  11. మధుర గారు.. విడగొట్టి రెండేళ్ళకి కలిపారన్నమాట. మధ్యలో..అయ్యో..! అనిపించారు. కథనం చాలా బాగుంది.

    1. @ వనజ వనమాలి గారూ,
      ధన్యవాదాలండీ.. మధ్యలో అయ్యో అనిపించినా చివరికి హమ్మయ్యా అనిపించేసానుగా.. 😀

  12. చాలా బాగా రాశావు మధురా. చివర్లో “ఇంకంతే కథ అయిపోయిందీ” అని నీ మాడ్యులేషన్ లో ఊహించుకుని మరీ చదవడం ముగించా 🙂

    1. @ శంకర్,
      హహ్హహ్హా.. నేను మాత్రం “అన్నయ్య మెచ్చుకోలు.. అదే నాకు పదివేలు..” అని పాట పాడుకుంటూ చదివా మీ వ్యాఖ్యని.. 😀
      థాంక్యూ! 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *