March 29, 2024

సంపాదకీయం: సంక్రాంతి పండుగ

మాలిక సంక్రాంతి సంచిక కోసం ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ గారు ఇచ్చిన  కార్టూన్..

ఈ సంచిక సంపాదకురాలు: సుజాత బెడదకోట
సహాయకులు: కల్లూరి శైలబాల, జ్యోతి వలబోజు

 

 మాలిక పత్రిక ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా సంపాదక బృందానికి , రచయితలకు, చదువరులకు అందరికి  శుభాకాంక్షలు ..

 

పండగంటే తెల్లారుజామునే మెలకువొచ్చేసే ఉత్సాహం,హడావుడి,ఉల్లాసం,ప్రత్యేక వంటలతో భోజనం,భుక్తాయాసం,మధ్యాహ్నం కాస్త కునుకు….సాయంత్రం కొత్త బట్టలు..ఇలా ఉంటే బాగానే ఉంటుంది.

 

కానీ జీవితం ఇంట్లో ఒక అడుగూ, వీధిలో ఒకడుగూ లా బొత్తిగా హడావుడిగా మారిపోయింది చూస్తుండగానే! పండగ వస్తుందంటే ఏమిటో..ఒక పక్క సంతోషమేస్తున్నా…మరో పక్క నిరుత్సాహం! సిటీజీవితాల్లో  ఇది రెండింతలవుతుందేమో!

 

ఒక్కరో ఇద్దరో పిల్లలున్న ఇంట్లో భారీగా ఏవైనా వండాలన్నా చెల్లుతాయో చెల్లవో అని భయం! “ఉన్న నలుగురికీ ఏం వండుతాం లెద్దూ” అనేసి పులిహోర,గారెలు,పాయసాలతో సరిపెట్టేయడం, ఏ బొబ్బట్లో, అరిసెలో చేయాలంటే చాతగాక స్వగృహ ఫుడ్స్ లో ఆర్డరిచ్చేడం! ఆ పిండి దంచడాలు, ఆ నూనెల్లో తేలడాలు మనవల్లేమవుతుంది మరి?

 

పల్లెల్లో, టౌన్లలో చుట్టాలున్న అదృష్ట వంతులకు ఊర్నించి అరెసెలూ, సున్నుండలూ వస్తే….అందులో వాళ్లు మనకి ఒకటో రెండో ఇస్తే…నిజంగా పండగే మరి!

 

మొగుడూ పెళ్ళాలిద్దరికీ ఉజ్జోగాలుండటం, పండగ మర్నాడే ఆఫీసుండడం, (అసలు పండగ ఆదివారం రావడం అన్నింటికంటే ట్రాజెడీ)పండగ నాడూ స్పెషల్ క్లాసుకెళ్ళాల్సిన ఎంసెట్ పిల్లలు ఉంట్లో ఉండటం…నిజంగా పండగోత్సాహం చచ్చూరుకుంటుంది.

 

మనమిలా అనుకుంటుంటే పల్లెల్లో టౌన్లలో ఉన్నవాళ్ళు “మీరెంతో నయం! మీకు డబ్బు పోస్తే అన్నీ దొరుకుతాయి. మావిడాకుల నుంచీ, అరిసెల వరకూ! మాకు మావిడాకులు ఇళ్ళ చుట్టుపక్కల దొరకవు. అరిసెలు కావాలంటే చచ్చీచెడీ వండుకోవాల్సిందే! మీరు రోజంతా స్పెషల్ ప్రోగ్రాములన్న చూస్తారు టీవీలో! మాకు రోజుకు పది గంటలు కరెంటే ఉండదు..”అంటారు నిర్లిప్తంగా!

 

పీత కష్టాలు పీతవన్నమాట.

 

స్పెషల్ ప్రోగ్రాములంటే గుర్తొచ్చింది. ఎప్పుడో దూరదర్శన్ కాలంలో పండగ రోజు కర్టెన్లు మార్చని ఆ అట్ట గదిలో వేసే పండగ స్పెషల్ నాటికల కోసం ఎంతగా ఎదురు చూసేవాళ్ళమో!

 

ఇప్పుడు ఛానెళ్ళు పదుల సంఖ్యలో పెరిగి, త్వరలో వందల్లోకి చేరే ఉత్సాహంలో ఉన్నాయి! అందుకే ప్రతి టీవీ ఛానెల్ వాళ్ళూ..(వార్తా ఛానెళ్లతో సహా)పండగ ని రచ్చ రచ్చ చేసి జరిపేసి, అసలు మనింట్లో పండక్కి గుర్తింపు లేకుండా చేసేస్తున్నాయి.

 

మొదట్లో న్యూస్ రీడర్లు సంప్రదాయ దుస్తుల్లో వచ్చి వార్తలు చదవడంతో ఈ హడావుడి ఆగేది. ఇప్పుడు అల్లా కాదు. పోయినేడాది ఒక ఛానెల్లో వార్తలు చదివే వాళ్ళంతా పొలోమంటూ ఒక పల్లెటురుకెళ్ళి పడ్డారు. సూటూ బూటూ వేసుకుని కెలుకుడు వార్తలు(హతవిధీ..ఇక్కడా అదేనా?)వార్తలు చదివే ఒకాయన, బిగించి పంచె కట్టి ఎద్దులు బెదిరేలా ఒక్క ఊపున ఎద్దులబండీ ఎక్కి చేతిలో చెరుకు గడ పీక్కు తింటూ చిలిపిగా చూడబోయాడు.”ష” కీ “శ” కీ.., “ళ”కీ “ల” కీ మధ్య తేడా తెలీని యాంకరమ్మాయి రాళ్ళూ, పూసలు, గవ్వలు,కుందన్లూ,ముత్యాలూ,చెమికీలూ వగైరాలు కుట్టిన పచ్చ రంగు పట్టు పరికిణీ తో గలగల్లాడుతూ వచ్చి సంక్రాంతి అంటే ఏవిటో వివరిచబూనింది.

“అసలు సంక్రాంతి పండగ ఎందుకు చేస్తారో మనలో చాలామందికి తెలీదు” అట.

అబ్బ, ఇంత జనరలైజేషనా?

సంస్కృతి ఎంత మారినా, మరీ మూలాలు కూడా మర్చిపోయామనుకుంటారల్లే ఉంది ఈ జనాలు!

 

న్యూస్ ఛానెళ్ళ వాళ్ళు ఇలా ఉంటే…డైలీ సీరియల్స్ లో ఈ పండగల్ని అర్థాంతరంగా పాత్రలన్నీ (అంతకు హీరోవిను ముందు మెట్ల మీంచి జారిపడాలని కుట్రచేసిన వాంప్ తో సహా) కలిసి మెలిసి జరిపేసుకుంటారు.

 

 

అందువల్ల కాస్తో కూస్తో పండగ సరదా మిగిలి ఉండాలంటే ఆ రోజంతా కరెంట్ ఉండకూడదు. కుదరదా? సరే…ఆ రోజంతా పొరపాటున కూడా టీవీ పెట్టకూడదు.

 

“అబ్బ, అంత దూరమా? రేప్పొద్దున ఆఫీసుంది” అనుకోకుండా కాస్త దూరమైనా బంధువులతో కలసి కాసిన్న కమ్మని కబుర్లు చెప్పుకుంటే..మళ్ళీ మరో పండగ వచ్చేదాకా ఆ ఛార్జింగ్ మిగిలిపోతుంది.

 

కావాలంటే చేసి చూడండి మరి!

 

రంగు రంగుల ముగ్గులతో,కొత్త బియ్యం అరిసెలతో,కొత్తబట్టలు,కోరిన శిరులతో హాయిగా పండగ అందరూ జరుపుకోవాలని…….మాలిక ఆకాంక్షిస్తోంది

 

 ——– సుజాత బెడదకోట

3 thoughts on “సంపాదకీయం: సంక్రాంతి పండుగ

  1. >>> పల్లెల్లో, టౌన్లలో చుట్టాలున్న అదృష్ట వంతులకు ఊర్నించి అరెసెలూ, సున్నుండలూ వస్తే….అందులో వాళ్లు మనకి ఒకటో రెండో ఇస్తే…నిజంగా పండగే మరి!

    ఇవ్వకపోతే మంట కూడానూ…. దహా

    >>> కోరిన శిరులతో హాయిగా పండగ ….

    యాంకరమ్మ లు మీకు కూడా నేర్పినట్టున్నారు వారి భాష… అహా.

    పండగ గురించి ఉపన్యాసం ఇవ్వకుండా, సరదాగా సాగింది సంపాదకీయం.

    మాలికకు ప్రధమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని కోరుకుంటున్నాను.

  2. మొగుడూ పెళ్ళాలిద్దరికీ ఉజ్జోగాలుండటం, పండగ మర్నాడే ఆఫీసుండడం, (అసలు పండగ ఆదివారం రావడం అన్నింటికంటే ట్రాజెడీ)పండగ నాడూ స్పెషల్ క్లాసుకెళ్ళాల్సిన ఎంసెట్ పిల్లలు ఉంట్లో ఉండటం…నిజంగా పండగోత్సాహం చచ్చూరుకుంటుంది.

    వాస్తవం చెప్పారు…..అయినా పండగ అంటె యెందుకొ ఉత్శాహం వస్తూంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *