October 16, 2021

“అమ్మగారికీ దండంపెట్టూ..”

రచన : జి.ఎస్.లక్ష్మి

“ఏంటే అక్కయ్యా… ఈ పెళ్ళి కైనా నువ్వు రాకపోతే ఇంక నీకు ఫోన్ చెయ్యనంతే..”

 

“అదికాదురా..” ఏదో చెప్పబోతున్న రేణుక మాటల్ని మధ్యలోనే ఆపేసి, “అసలు నువ్వే చెప్పవే.. ఎన్నాళ్ళైంది మనం కలిసి? పదేళ్ళు దాటటంలెదూ.. ఎప్పుడో పెద్దమావయ్యగారి పెద్దబావ పెళ్ళికి వచ్చేవ్. అంతే.. మళ్ళి మనం కలవందే. నా పెళ్ళిక్కూడా రాలేదు.  మా ఆవిణ్ణి చూడవూ?

 

“సరే.. చూస్తాలేరా..” అని ఫోన్ పెట్టేసింది రేణుక.

 

రేణుక వుండేది పూనాలో. రాజమండ్రీలో బుల్లిమావయ్య కూతురి పెళ్ళి. రాంబాబు ఈ విషయం గురించి అప్పుడే రెండోసారి ఫోన్ చేసేడు. ఈ ఉద్యోగాల్లో చుట్టాల పెళ్ళిళ్ళంటే సెలవులివ్వరుకదా. అదీకాక పిల్లలు రమ, సుమల చదువులోటి. ఇంకా పిల్లలు చిన్న క్లాసుల్లో ఉన్నప్పుడు సెలవు లిచ్చినప్పుడల్లా హైదరాబాదు అమ్మావాళ్ళింటికెళ్ళి పదిరోజులుండి వచ్చెయ్యడం తప్పితే చుట్టాలెవర్నీ కలవడం కుదిరేదికాదు. పిల్లలు కాస్త పెద్ద చదువుల కొచ్చేక ఆ వెళ్ళడం కూడా తగ్గిపోయింది. ఇంక ఈసారి పెళ్ళికెలాగైనా వెళ్ళాలనుకుంది.

 

రాంబాబు రేణుకకి చిన్నబాబాయ్ కొడుకు. వేసంకాలం వచ్చేసరికి మావయ్యలూ, పిన్నిలూ అందరూ పిల్లలతో సహా రాజమండ్రి అమ్మమ్మ గారింటికి చేరిపోయేవారు. ఆ సెలవులన్నీ ఎంత హాయిగా గడిచిపోయేవో. తల్చుకుంటే ఇప్పటికీ మనసులోంచి సంతోషం తన్నుకుంటూ పైకొచ్చేస్తుంది.

 

ఆ సంతోషం మళ్ళీ ఎవరితో పంచుకోగలం? కట్టుకున్న మొగుడితో చెబ్దావంటే ఆ చిన్నప్పటి పిల్లచేష్టలు విని తర్వాత సందర్భం దొరికినప్పుడల్లా వెటకారం చేస్తాడేమోనని రేణుక భర్త ముందు ఎప్పుడూ ఆ విషయాలే ఎత్తదు. పోనీ ఆ సరదా విషయాలు పిల్లలతో పంచుకోడానికి రేణుక ఎప్పుడైనా “మా పెద్దమావయ్య తెలుసా..” అని మొదలుపెట్టగానే వాళ్ళు “అబ్బా… అమ్మా… నువ్విప్పుడా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళకు..వచ్చై.. వచ్చై..ప్రజంట్ కొచ్చై..”అని ఓ దండం పెట్టేస్తారు. అంతే.. మరింక ఆ మాట ఎత్తదు.

 

కాని రేణుక మనసు అప్పుడప్పుడు  చిన్నప్పటి కబుర్లు ఎవరి తోనైనా చెప్పుకుందుకు తహతహలాడిపోతోంది. అందుకే ఈ పెళ్ళి కబురు వినగానే ఈసారి  ఎలాగైనా సరే బుల్లిమావయ్య కూతురి పెళ్ళి కెళ్ళడానికి సిధ్ధమైపోయింది.

 

ప్రయాణం అనుకున్న దగ్గర్నుంచీ మనిషికన్న ముందు మనసు అక్కడికి చేరిపోయింది. ఎన్నాళ్ళయింది అందర్నీ కలిసి.. పెదబావ, శంకరన్నయ్య, పాపాయొదిన, బుజ్జక్క, సుబ్బిగాడు.. సుబ్బిగాడి మాట గుర్తు రాగానే ఆ రోజుల్లో కెళ్ళిపోయింది. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ పిల్లలందర్లోనూ చిన్నవాడు రాంబాబు. రేణుక కన్న ఏడాది చిన్న. అందుకే అస్తమానం రేణుక వెనకాలే తిరుగుతూండేవాడు. మహా చురుకైనవాడు. పెద్దబావ దగ్గర్నించి అందరికీ నిక్ నేమ్ లు పెట్టేసేవాడు.

 

చిన్నమామయ్య కొడుకు సుబ్బిగాడికి అమ్మమ్మ పొద్దున్నే పాలిస్తే అవి గ్లాసు నిండుగా కనిపించాలి. పాపం అమ్మమ్మ వాడి కోసం గ్లాసు అంచులదాకా పాలు పోసి, అవి తొణికిపోకుండా వాడు తాగడం మొదలుపెట్టేదాకా పక్కనే కూర్చునేది. వాడికి “సోలగ్లాసు” అని పేరెట్టాడు రాంబాబు . వాడి గురించి ఏదైనా చెప్పాలన్నప్పుడల్లా “మన సోలగ్లాసు ఉన్నాడు చూడూ..” అని మొదలుపెట్టేవాడు. వాడెంత ఉడుక్కునేవాడో.

 

రాజ్యం అత్తయ్య కయితే బుల్లిమామయ్య రోజూ వస్తూ పకోడీలపొట్లం తేవల్సిందే. అది ఇంట్లో అందరికీ తెలుసు. కాని అందరూ కూడా తెలీనట్లుండేవారు. కాని రాంబాబు మటుకు అత్తయ్యని యేడిపించడానికి సరిగ్గా అత్తయ్య లాగె తిప్పుకుంటూ,

 

“ఏవిటోనర్రా.. అసలందరూ ఆ పకోడీలు ఎలా తింటారో నూనె వాసన వేస్తూనూ..మీ మావయ్యేవిటో ఒద్దన్నా తెస్తూంటారు” అనేవాడు.

 

ఇంక రాజ్యం అత్తయ్య మొహం కందగడ్డలా అయిపోయేది. చాటుగా రాంబాబుని ఒక్కడినీ పిలిచి రెండే రెండు పకోడీముక్కలు చేతిలో పెట్టి అలా మాట్లాడొద్దని బతిమాలుకునేది. ఆ రెండుముక్కలూ రేణుక, రాంబాబు కలిసి ఎవరికీ కనపడకుండా దొంగతనంగా తినేవారు. అబ్బ.. ఎంత బాగుండేవో అవి. ఇప్పటికీ ఆ  పకోడీ రుచి తల్చుకుంటే రేణుకకి నోట్లో నీళ్ళూరిపోతాయి.

 

మరింక పాపాయొదినని పట్టుకుని ఎంత ఏడిపించేవాడో.. వాళ్ళాయన ఒదిన ఏం చెప్తే అది చేసేవాడు. కాఫీగ్లాస్ చేతిలో పట్టుకుని పాపాయొదినకేసి “తాగనా” అన్నట్టు చూసేవాడు. ఒదిన తాగమంటేనే తాగేవాడు. ఆయనకి “గంగిరెద్దు” అని పేరుపెట్టేడు రాంబాబు. ఆయన కనపడినప్పుడల్లా ఒదినవైపు చూసి, “అమ్మగారికీ దండం పెట్టూ” అని ఏడిపించేవాడు. బలే నవ్వొచ్చేసేది.

 

తల్చుకున్నకొద్దీ  గుర్తొచ్చేస్తున్నాయి రేణుకకి ఒకటొకటీను. అప్పుడు రేణుకకి పదేళ్ళు. రాంబాబుకి తొమ్మిది. అప్పుడే బుల్లిపిన్నిపెళ్ళైంది. మగపెళ్ళివారిలో ఎవరో చుట్టపాయన భోజనం చేస్తూ చేస్తూ విస్తట్లో జిలేబీలు జాగ్రత్తగా పక్కనే ఉంచుకున్న సంచిలో వేసుకోడం చూసేడు రాంబాబు. ఆయన మళ్ళీ మళ్ళీ జిలేబీలు అడిగి వడ్డించుకుంటూనే ఉన్నాడు. ఇది చూసిన రేణుక, రాంబాబు భోజనం అయ్యాక ఆయన వెనకాల నడుస్తూ జంటకవుల్లా పదాలు అందుకున్నారు.

 

“ఒక తాయిలారు సంచిలో ఏముందోయ్..”  “చెప్పకు చెప్పకు చిట్టి చిన్నాయ్”

“చెపితే జిలేబి జారుతుందోయ్”   “జారిన జిలేబి ఏమందోయ్”

“పట్టుకొ పెట్టుకో కడుపులో అందోయ్”  “కడుపులొ వేస్తే ఏమందోయ్”

“గుడగుడ గుడమని గొడవందోయ్”   “గుడగుడ గొడవగ ఏమందోయ్”

“డాక్టర్ డాక్టర్ అనమందోయ్”

 

ఇలా ఆయన వెనకాల పడి రేణుక, రాంబాబు చేసిన అల్లరికి పాపం ఆ పెద్దమనిషి జిలేబీలతో పాటు ఆ సంచిని కూడా అక్కడే పందిరి రాట దగ్గర పెట్టేసి పారిపోయాడు.

 

ఈ రాంబాబు తనని మటుకు వదిలేడేవిటీ..? తన పెళ్ళిలో ఆయనకి ఎన్ని రకాల పేర్లు పెట్టి తనని ఎన్ని రకాలుగా ఏడ్పించాడో అనుకుంటున్నకొద్దీ రేణుకకి ఎప్పుడెప్పుడెళ్ళి మళ్ళీ రాంబాబు కబుర్లు విని హాయిగా నవ్వుకుందామా అనిపించింది.

 

అసలదికూడా కాదు.. అందరికీ ఇన్ని పేర్లు పెట్టి ఏడిపించినవాడు ఇంక వాళ్ళావిడకి ఎన్ని పేర్లు పెట్టేడోనని తెలుసుకుందుకు మరీ కుతూహలంగా ఉంది.

 

వాడి పెళ్ళికి వెళ్ళలేకపోయినందుకు ఎంత బాధపడిందో.. సరిగ్గా ఆ టైమ్ కే రమకి, సుమకి పరీక్షలు. చాలా కోపం వచ్చింది రాంబాబుకి రేణుక మీద. ఎన్నోసార్లు ఫోన్ చేసి సారీలు చెప్పుకుంది. కాస్త మామూలుగా మాట్లాడ్డం మొదలుపెట్టేక అడిగింది వాళ్ళావిడ గురించి. వాళ్ళావిడ పేరు సూర్యకాంతం.

 

“ఏరా.. మీ ఆవిడ సూర్యుళ్ళా భగభగ మండిపోతుంటుందా..?” అనడిగింది. అదేంటో.. పెళ్ళాం పేరెత్తగానే వాడి గొంతు మృదువుగా మారిపోయింది.

 

“అబ్బే.. అది చాలా సాఫ్టే. ఎంత అమాయకురాలొ తెలుసా? అసలిప్పటిదాకా నా జీతవెంతో కూడా అడగలేదు. నాకు కొంచెం తలనొప్పొస్తే చాలు ఏడుస్తూ కూర్చుంటుంది. నేనేం తెస్తే అది బాగుందంటుంది. అన్నింటికీ మీ ఇష్టవండీ అంటుంది. నన్నడక్కుండా పక్కింటిక్కూడా వెళ్ళదు తెల్సా.. అన్నింటికీ నేను పక్కనుండాలనుకో..” అలా పొగుడుతూనే ఉన్నాడు.    మొదట విన్నప్పుడు కాస్త బాగానె అనిపించినా ఫోన్ చేసినప్పుడల్లా రాంబాబు తన భార్య ఎంత అమాయకురాలో, నోట్లో వేలు పెట్టినా కొరకలేదన్నట్టు చెప్తుంటే ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలుంటారా అనిపించింది రేణుకకి.

 

మొత్తానికి రేణుక బ్రహ్మప్రయత్నం మీద ఆఫీస్ లో వారంరోజులు సెలవు తీసుకుని ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంది. ప్రయాణం అనుకోగానే ఇదే మొదటిసారి చూడడంకదా అని పూనాలో ప్రసిధ్ధమైన చీర ఒకటి తీసుకుంది రాంబాబు భార్యకోసం. వాళ్ల ఇద్దరు పిల్లలకీ ఏం తీసుకుందామా అనుకుని, ఏమీ తేల్చుకోలేక సరే డబ్బులే వాళ్ల చేతిలో పెట్టేద్దావులే అనుకుంది.

 

అసలు మామూలుగానే రేణుక కాళ్ళకి చక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతూ పనులు చేసుకుంటుంటుంది. అఫీస్ పనులూ, ఇంట్లో వంటే కాకుండా పిల్లల చదువులూ, కట్టాల్సిన బిల్లులూ, బైట బజారుపనులూ అన్నీ రేణుకే చేసుకోవడం అలవాటు. రేణుక భర్త రమణ్రావు ఏవీ పట్టించుకోడు. అలాగని తెలివితేటలు లేవనికాదు. చురుగ్గా, తెలివిగా భార్య అన్ని పనులూ చక్కబెట్టుకుంటోంది కదా అని ఆఫీస్ నుంచొచ్చి విశ్రాంతి తీసుకుంటుంటాడు. అందుకని ఈ ప్రయాణం అనుకున్న దగ్గర్నుంచీ మళ్ళీ తను తిరిగి వచ్చేవరకూ ఇంట్లోవాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్నీ అమర్చుకుని, ఇంక ట్రైన్ టైమ్ అయిపోతుంటే ఆయాసపడుతూ వచ్చి ట్రైన్ ఎక్కింది రేణుక. హైద్రాబాద్ లో దిగి అమ్మావాళ్ళింట్లో ఒక్కపూట మటుకు కనిపించి, సాయంత్రానికి విజయవాడ రాంబాబు ఇంటికెళ్ళాలని రేణుక ప్లాన్. వాడింట్లో రెండురోజులుండి అక్కడ్నించి రాజమండ్రీ పెళ్ళికి వాడితో కలిసి వెళ్ళాలని అనుకుంది. అలాగే అందరికీ చెప్పింది కూడా.

 

 

అనుకున్నట్టుగానే విజయవాడ స్టేషన్ లో దిగేటప్పటికి రేణుక కోసం రాంబాబు వచ్చేడు. దాదాపు పదేళ్ళ తర్వాత రాంబాబుని చూస్తే చాలా సంతోషంగా అన్పించింది రేణుకకి. అతన్ని చూస్తూనే నవ్వుతూ అంది” కాస్త బొజ్జ వచ్చినట్టుందే. మీ ఆవిడ బాగా రుచిగా చేసిపెడుతోందనుకుంటాను. ”

 

“అదో పిచ్చిదే. దాని గురించి ఎందుకులే కానీ నీ సంగతి చెప్పు. నీకు అప్పుడే చెంపలు నెరిసినట్టున్నాయే.” ఎదురు వేళాకోళం చేసేడు. ఎప్పుడు భార్య మాటెత్తినా ఒట్టి అమాయకురాలన్నట్టు చెప్తున్న రాంబాబుని చూసి పాపం ఇంత చలాకీ అయిన కుర్రాడికి అలాంటి పెళ్ళాన్నెందుకిచ్చేవురా భగవంతుడా అనుకుంది రేణుక.

 

వీళ్ళు ఇంటికి చేరేసరికి రాత్రి ఎనిమిదవుతోంది. భార్యని పరిచయం చేసేడు రాంబాబు. పరిశీలనగా చూసింది. ఫరవాలేదు. అందగత్తె అనీ చెప్పలేం అలాగని అనాకారీ అని చెప్పలేం. మొత్తానికి రాంబాబు భార్య కనక బాగుందనే అనిపించింది రేణుకకి.

 

“మీగురించి ఈయన అస్తమానం చెప్తుంటారు” అంది సూర్యకాంతం.

 

రాంబాబు బాత్ రూమ్ చూపించి, “అక్కయ్య, నువ్వు కాస్త ఫ్రెష్ అయిరావే ” అన్నాడు.

 

రేణుక లోపలికి వెళ్ళి కాస్త కాళ్ళూ. చేతులూ, మొహం కడుక్కు వస్తుంటే వాళ్ల మాటలు వినపడ్డాయి.

“అక్కయ్యకి కాస్త కాఫీ కలుపుతావా..?” అనడుగుతున్నాడు.

 

“పాలెక్కడివి? సాయంత్రం తోడు పెట్టేసేకదా. మీరు వెళ్ళి పాలు తెస్తే కాఫీ కలపడానికేం.” అదోరకంగా  మాటవిరుపుతో అంది కాంతం.

 

రేణుకని చూడగానే,”రావే అక్కయ్యా. కాసేపట్లో భోంచేసేద్దాం.” అన్నాడు.

 

ఈ లోపల “డాడీ, హోమ్ వర్క్” అంటూ పుస్తకాలు పట్టుకొచ్చేడు పెద్దకొడుకు ఏడేళ్ళవాడు. రెండోక్లాసు చదువుతున్నాడుట. వాణ్ణి కూర్చోబెట్టుకుని హోమ్ వర్క్ చేయించడంలో మునిగిపోయేడు రాంబాబు. రేణుక కాంతంతో నెమ్మదిగా వాళ్ళ పుట్టింటి వివరాలూ గట్రా అడుగుతూ మాటలు కలిపింది.

 

రేణుకతో మాట్లాడుతూ రాంబాబుని చూస్తున్న కాంతం చెప్పింది.

“మా వాడు వాళ్ల నాన్న పక్కన కూర్చుంటే తప్ప హోమ్ వర్క్ చెయ్యడు” అంటూ.

 

తర్వాతి పిల్ల అయిదేళ్ళది. వాళ్ళ అమ్మ దగ్గర కొచ్చి,”ఆకలీ” అంటూ రాగం మొదలుపెట్టింది.

“ముందు చంటిపిల్లకి అన్నం పెట్టై. వాడి హోమ్ వర్క్ అయ్యేక అందరం కలిసి తిందాం.” అని పెద్దరికంగా చెప్పింది రేణుక.

 

“అయ్యో.. అది తిందు కదండీ. వాళ్ళ నాన్న పెడితే తప్ప మెతుకు ముట్టదు.” అంది.

 

మరి కాసేపటికి పెద్దవాడి హోమ్ వర్క్ పూర్తిచేసి, పాపకి ముద్దలు చేసి అన్నం తినిపించి రాంబాబు రేణుకతో అన్నాడు.
“రావే అక్కయ్యా,  నీకు ఆకలేస్తోందో ఏంటో.. భోంచేద్దాం..” అని.

 

ఈ లోపల చంటిది ఏడుపు మొదలుపెట్టింది. ఏవిటా అనుకుంటుంటే రాంబాబు ఆ పిల్లని ఎత్తుకుని భుజం మీద వేసుకుని జోకొడుతూ పచార్లు మొదలుపెట్టేడు. ఇంకో పావుగంటకి కాని అది పడుకోలేదు.

 

కాంతం ఎంతో సంబరంతో చెప్పింది రేణుకకి..”బుల్లిముండ.. వాళ్ళ నాన్న జోకొడితేకాని పడుకోదు..” అని.

సరే.. చంటిది పడుకున్నాక, పెద్దపిల్లాణ్ణి టివీ ముందు కూర్చోబెట్టి ముగ్గురూ భోజనానికి కూర్చున్నారు.

 

“ఇదేవిటీ, పాఠోళీ చేస్తానన్నావ్. ఉట్టి పచ్చడొకటే చేసేవేంటీ..?” అడిగేడు భార్యని.

 

“చేద్దావనే అనుకున్నానండీ. కాని ఎదురింటి వదినగారు పేరంటం పిలవడానికొచ్చి, కాసేపు ఆమాటా. ఈమాటా మాట్లాడేటప్పటికి ఇంక టైమ్ లేకపోయింది.”

 

ఇంకేం మాట్లాడలేదు రాంబాబు. భోంచేస్తూ చుట్టాలందరూ ఎవరెక్కడున్నారో, వాళ్ల పిల్లలు ఏం చదువుతున్నారో మాట్లాడుకుంటూ భోజనం ముగించేరు.

 

భోజనం అయ్యేక రాంబాబూ, తనూ కూర్చుని చిన్నప్పుడు ఎవరెవర్ని ఎలా ఏడిపించేవారో మళ్ళీ మళ్ళి చెప్పుకుని నవ్వుకుందామని ఆశపడింది రేణుక. కాని భోజనాలయిన ఐదు నిమిషాలకే కాంతానికి పాపం తలనెప్పి విపరీతంగా వచ్చేసింది. ఇంక రాంబాబు ఖంగారు చెప్పక్కర్లేదు. పిల్లలిద్దర్నీ తీసుకొచ్చి ముందుగదిలో దివాన్ మీద పడుకోబెట్టేసేడు. బెడ్రూమ్ అంతా లైట్ లేకుండా చీకటి చేసేసేడు. టీవీ ఆపేసేడు. అంతా నిశ్శబ్దం. భార్యకి తలనెప్పి తగ్గడానికి టేబ్లెట్ ఇచ్చి, వేడి వేడిగా టీ పెట్టి ఇచ్చేడు. ఇదంతా చేస్తూ రేణుకతో నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టేడు.

అప్పుడప్పుడు కాంతానికి ఇలా విపరీతమైన తలనెప్పి వచ్చేస్తుందనీ, అలాంటప్పుడు ఇంక ఎవరితోనూ మాట్లాడకుండ పడుకుంటేకాని తగ్గదనీ చెప్పేడు.

 

రేణుక పాపం చాలా బాధపడింది. “ఒరే.. అలాంటప్పుడు ఎవరైనా స్పెషలిస్ట్ కి చూపించలేకపోయేవురా.. మైగ్రేన్ యేమో.. ” అంది.

 

“చూపించేనే. అలాంటిదేవీ లేదన్నారు. బహుశా సైకలాజికల్ ఏదైనా నేమో అన్నారు”

“అదేంట్రా..అంత మనసు బాధపడే విషయం ఏవైయుంటుందీ?”

“అబ్బే.. బాధేం లేదే.. ఈ ఊళ్ళో చాలా యేళ్ళనుంచీ ఉంటున్నాను కదా.. ఎవరి దగ్గరి కెళ్ళినా చాలా జాగ్రత్తగా చూసి ఏమీ ప్రోబ్లమ్ లేదని చెబుతుంటే అది అనుకుందీ..నాకు తెలిసినవాళ్ళున్నారు కనక నేను అలా జబ్బేవీ లేదని చెప్పిస్తున్నాననుకుంటోంది. తనకి నిజంగానే ఏదో పెద్ద జబ్బుఉందని దాని ఫీలింగ్. చెప్పేనుకదే ఒట్టి పిచ్చిది.”

 

రేణుకకి ఏవనడానికీ తోచలేదు. “ఇంక పడుకోవే. ఇంకా మనం మాట్లాడుకుంటుంటే పాపం దానికి డిస్టర్బెన్స్..” అంటూ లైట్ ఆఫ్ చేసేసేడు రాంబాబు.

 

రేణుకకి పడుకుంటే ఏంటో అసంతృప్తిగా అనిపించింది.

మర్నాడు ఉదయం రేణుక లేచేసరికి రాంబాబు కనిపించలేదు. కాంతం పిల్లలిద్దర్నీ పక్కన కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చుని భక్తి టీవీ చూస్తోంది. లేవగానే రేణుక కాంతాన్ని అడిగింది.

 

“ఎలా ఉందిప్పుడు నీకు..?” అంటూ.

 

“కాస్త నయవేనండీ. మీరు బ్రష్ చేసుకురండి.” అంది బరువైన గొంతుతో. ఇంకో మాట మాట్లాడితే ఆవిడ ఎక్కడ సైకలాజికల్ గా ఫీల్ అయిపోతుందోనని రేణుక వెళ్ళి బ్రష్ చేసుకొచ్చింది.

 

రేణుక వచ్చేటప్పటికి రాంబాబు ఎక్కడినుంచో కేన్ తొ పాలు పట్టుకొచ్చేడు. కాంతం ఆ పాలు తీసుకుని పిల్లలకి పాలూ, తమకి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది. రేణుకకి ఏవీ అర్ధం కాలేదు. పొద్దున్నే రాంబాబు వెళ్ళాలా పాలకి.. ఇంటికి ఎవరూ తేరా..? అదే అడిగింది.

 

“ఆ పాలపేకట్లు నిలవగా ఉంటాయంటుందే మా ఆవిడ. తను ఆ పాలతో కాఫీ తాగలేదు. అందుకే కాస్త దూరంలో అప్పటికప్పుడు గేదెల పాలు పిండించి తెస్తుంటాను. నువ్వే చూడు. కాఫీ ఎంత బాగుంటుందో..”అన్నాడు. రేణుక నోటమాట రాలేదు.

 

“ఇవాళ మీ అక్కయ్యగారొచ్చేరు కదా.. టిఫిన్ పూరీ, కూరా చేస్తానండీ..” అంది కాంతం కాఫీ తాగుతూ. రాంబాబు మొహం వెలిగిపోయింది.
“నీకు ఓపికుందా.. చెయ్యగలవా..” అని మళ్ళీ మళ్ళీ అడిగేడు.

 

కాంతం నవ్వుతూ లోపలికెళ్ళి పిండి కలపడం మొదలుపెట్టింది. ఈ లోపల రాంబాబు పెద్దవాణ్ణి స్కూల్ లో దింపి వచ్చేడు. సాయం ఏమైనా కావాలేమోనని వంటింట్లో కెళ్ళింది రేణుక. అక్కడి దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. కాంతం ఒక్కొక్క పూరీని నెమ్మదిగా ఒత్తుతూ, పక్కనే ఒక వారపత్రికని పెట్టుకుని ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క వత్తిన పూరీ పెడుతూ, ఆ పూరీలు ఒకదానికొకటి అంటుకోకుండా పెడుతోంది.

 

“నేను ఒత్తియ్యనా..?” అనడిగింది రేణుక.

 

“ఒద్దండీ. రాకరాక ఒచ్చేరు. మీచేత పని చేయిస్తానా..?” అంది నవ్వుతూ.

 

సరేననుకుంటూ రేణుక స్నానం చేసి వచ్చేసరికి ఇంకా స్టవ్ దగ్గరే ఉన్న కాంతాన్ని చూసింది. ఇంకా ఏం చెస్తోందా అని చూస్తే, నూనె పెట్టి, జాగ్రత్తగా ఒక్కొక్క పూరీని వేయించి ఒక బేసిన్ లో పెట్టి పక్కన పెట్టింది.

 

ఇదేంటి.. అప్పుడే తొమ్మిదవుతోంది. ఇంకా టిఫిన్ పెట్టకుండా మూత పెడుతోందేవిటి అనుకుంటుంటే, అప్పుడు తీరుబడిగా బుట్టలోంచి బంగాళాదుంపలు తీసి, నీళ్ళలో వేసి, ఆ గిన్నె స్టవ్ మీద పెట్టింది.

 

ఒక అరగంటకి అవి ఉడికేక , చిల్లుల పళ్ళెంలో చల్లార్చి, నెమ్మదిగా తొక్క తీసి మరో గిన్నెలో వేసి మూత పెట్టి, అప్పుడు కత్తిపీట ముందు కూర్చుని ఉల్లిపాయలు తరగడం మొదలుపెట్టింది. అవి తరిగి, అల్లం, పచ్చిమిరపకాయలు తరిగి, ఈ లోపల రాంబాబుని కరివేపాకు కోసం మార్కెట్ కి పంపించి, అది వచ్చేక, కూర పోపు వేసి, ఉడికించిన బంగాళాదుంపలు వేసి మొత్తానికి కూర అయిందనిపించేటప్పటికి పదిగంటలైంది. ఇదంతా చూస్తున్న రేణుకకి నీరసం వచ్చేసింది.

 

ఇదేవిటి.. ఆ కూర అంత సేపు చేసేదాకా ఆ పూరీల బేసిన్ చూస్తూ నోట్లో వేలు పెట్టుకుని కూర్చోవాలా.. అనుకుంటుంటే రాంబాబు అన్నాడు. “మా ఆవిడ పూరీ, కూరా బాగా చేస్తుందే.. .. నువ్వే మెచ్చుకుంటావ్ చూడు..” అంటూ.

 

కూర ముందుగా చేసి రెడీగా పెట్టుకుని, పూరీలు వేడి వేడిగా వేసి పెట్టేసే అరగంట పట్టే పనికి, ఏదో చాలా కష్టపడిపోతున్నట్టు అంత బిల్డప్ ఇస్తున్న కాంతం తెలివితేటలకి తెల్లబోయింది రేణుక.

 

మొత్తానికి ఆ చల్లారిపోయి గట్టిగా అయిపోయిన పూరీలు, నీళ్ళుగారిపోతున్న కూర తినేటప్పటికి పదకొండుగంటలై పోయింది. సరే..తనేవైనా పిండివంటలు తినడానికి రాలేదు కదా అనుకుంటూ, “ఇంకేవిట్రా కబుర్లూ..?” అంది. ఎందుకంటే రేణుక వస్తోందని రాంబాబు సెలవు పెట్టేసేడు ఆఫీస్ కి. కాస్త కబుర్లు చెప్పుకోవచ్చు ననుకుంటుంటే ఫోన్ వచ్చింది. కాంతం వాళ్ళ అక్కయ్య చేసింది ఫోన్. ఆ మధ్యాన్నానికి గుంటూరు వాళ్ల చెల్లెలింటికి వస్తోందనీ, కాంతాన్ని కూడా రమ్మనీ ఆ ఫోన్ సారాంశం.

 

“అయ్యో.. రాక రాక ఒదినగారు ఒచ్చేరు. ఇప్పుడు నేను వెడితే బాగుండదు. వెళ్ళను లెండీ..” అంది రాంబాబుతో.

రాంబాబు “అవున్నిజవే. ఇప్పుడెలా వెడతావ్. అందులోనూ రేపందరం కలిసి ఇక్కడినుంచే పెళ్ళి కెడదావనుకుంటున్నాం కదా..” అన్నాడు. కాసేపయేక మళ్ళి కాంతవే “ఇప్పుడు నేను ఎలాగూ వెళ్ళననుకోండి. పోనీలెండి.. వాళ్ళు ఏదైనా అనుకుంటే నన్నే అనుకుంటారు లెండి” అంది.

 

రాంబాబు మాట్లాడలేదు. ఇంకో నివిషవయ్యేక “ఏంటో.. మా చెల్లెల్ని చూసి అప్పుడే నెల దాటిందని చూడ్డాని కొస్తోందేమో మా అక్క.” అంది. అప్పుడూ రాంబాబు మాట్లాడలేదు.

 

“పోన్లెండి. మీరు మటుకు ఏం చేస్తారు. పరిస్థితులు అలా వచ్చేయి..”

 

ఇంకాస్సేపయేక ” అయినా పెళ్ళై ఓ మొగుడు దగ్గర కెళ్ళిపోయేక ఇంకా అక్కా, చెల్లీ అనుకుంటే ఎలా కుదుర్తుంది లెండి..” అంది.

 

వింటున్న కొద్దీ రేణుకకి తనవల్లే కాంతం వాళ్ళ చెల్లెలింటికి వెళ్ళట్లేదేమో నన్నంత అభిప్రాయం వచ్చేసేంతగా అలా ఏదో ఓటి మాట్లాడుతూనే ఉంది.

 

ఈ లోపల రాంబాబే అన్నాడు. “నువ్వలా ఫీలవకు కాంతం. మళ్ళీ తలనెప్పి వచ్చేస్తే చాలా బాధపడతావ్. పోన్లే.. అక్కయ్యా, నేనూ ఉంటాంలే గాని నువ్వెళ్ళిరా..” అన్నాడు.

 

తనవల్లే వాళ్ల చెల్లెలింటికి వెళ్ళడానికి కాంతం మొహమాట పడుతోందనుకున్న రేణుక “హమ్మయ్యా” అనుకుని ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి బైట పడింది.

 

కాని తనొక్కతే వెడితే మరి పిల్లల్ని పట్టుకోడం మాటలుకాదుకదా. దానికి మొగుడు పక్కనుండాలి. అందుకని మళ్ళీ అయిదు నిమిషాలకి మళ్ళీ మొదలెట్టింది కాంతం.

 

“చంటిది మీకోసం బెంగెట్టుకుంటుందేమోనండీ. పెద్దాడు మిమ్మల్ని వదిలి ఒక్క పూటేనా ఉండడయ్యె. పోనీ.. మానేస్తాలెండి” అంటూ, నెమ్మదిగా బెడ్ రూమ్ లో కెళ్ళిపోయి పడుకుండిపోయింది.

 

ఇంక అప్పుడు చూడాలి రాంబాబు విన్యాసాలు. ఓ నిమిషానికి బెడ్ రూమ్ లో కెళ్ళి, “కాఫీ ఏమైనా తాగుతావా?” అనడుగుతాడు పెళ్ళాన్ని. ఇంకో నిమిషానికి హాల్లో కొచ్చి,”ఇంకేంటే అక్కయ్యా విశేషాలూ..?” అంటాడు.

 

కాసేపు ఏడుస్తున్న చంటిపిల్లని ఎత్తుకుని తిప్పుతాడు. టైమ్ అవగానే వెళ్ళి స్కూల్ నుంచి కొడుకుని తెచ్చుకున్నాడు. ఇలా అష్టావధానం చేస్తున్న రాంబాబుతో ఎప్పుడేం మాట్లాడాలో తెలీక రేణుక ఆ రోజు పేపర్ మొత్తం చివరి పబ్లిషింగ్ తో సహా చదివేసింది.

 

స్కూల్ నుంచి కొడుకుని తీసుకొచ్చేక రాంబాబు రేణుక దగ్గరకొచ్చి అన్నాడు.

 

“ఒసే అక్కయ్యా.. కాంతం పాపం ఫీలవుతోందే. మేం ఇవాళ గుంటూరు వెళ్ళి, ఎల్లుండి అక్కణ్ణించే పెళ్ళి కొచ్చేస్తాం. మరి నువ్వు ఒక్కదానివీ రాజమండ్రీ వెళ్ళగలవా..?” అని మొహమాటపడిపోతూ అడిగేడు.

 

రేణుక వెంటనే, “ఫరవాలేదురా. పూనా నుంచి ఒక్కదాన్నీ ఒచ్చినదాన్ని, ట్రైన్ ఎక్కిస్తే ఇక్కడ్నించి రాజమండ్రీ వెళ్ళలేనా? నువ్వేం బెంగెట్టుకోకు. మీ ఆవిణ్ణి తీసుకుని గుంటూరు వెళ్ళు.” అంది.

 

రాంబాబు మొహం చేటంత అయ్యింది.

 

“అదేనే.. నువ్వు చురుకైనదానివి, తెలివైనదానివి. నువ్వు వెళ్ళగలవ్. అది ఒట్టి అమాయకురాలు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తానేం.” అన్నాడు.

 

రాంబాబు చాలా తెలివైనవాడని, ఎదుటిమనిషిని ఇట్టే చదివేస్తాడనీ అనుకున్న రేణుక, అంతకన్న తెలివిగా, పైపైన చల్లచల్లగా మాటలు చెపుతూనే తనకి కావల్సినది భర్త దగ్గర సాధించుకుంటున్న కాంతాన్ని చూసి ఆమె జాణతనానికి ఆశ్చర్యపడకుండా ఉండలేకపోయింది రేణుక .

 

సాయంత్రం తనని స్టేషన్ లో దింపి వెడుతున్న రాంబాబుని చూసి “అమ్మగారికీ దండం పెట్టూ..” అంటూ తన నోట్లోంచి రాబోయిన మాటని చేతితో నోరు మూసేసుకుని బలవంతంగా ఆపుకుంది రేణుక.

 

—————————————————————————————-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

12 thoughts on ““అమ్మగారికీ దండంపెట్టూ..”

 1. ఇంకా గమనించండి. ఒక్కళ్ళు కాదు బోల్డుమంది కనిపిస్తారు…

 2. సూర్యకాంతం పాత్రని నిజంగానే చూసానండోయ్!

  1. మీరు ఓహో సూర్యకాంతమే అనండీ.. మిమ్మల్ని కాదనగలమా.. దహా
   కథ నచ్చినందుకు ధన్యవాదాలు..

 3. హహహ! ఒకరిని ఏడిపించిన పాపం ఊరికనే పోతుందా? అందుకనే రాంబాబు గారికి కూడా అదే పరిస్థితి వచ్చినట్టుంది 😉 భలే ఉందండీ!

  1. రాంబాబు పరిస్థితికి కారణం బలే కనిపెట్టేసేరండీ..
   కథ నచ్చినందుకు ధన్యవాదాలు..

  1. కొన్ని కారెక్టర్లు అంతేనండీ..
   కథ నచ్చినందుకు ధన్యవాదాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *