June 24, 2024

శివధనుస్సు

రచన : రసజ్ఞ

 

సీతా స్వయంవరం అప్పుడు శివధనస్సు ఎక్కుపెడితే ఎందుకు విరిగిపోతుంది? విరిగిపోతే అందఱూ (బాధపడాలి కానీ) ఎందుకు సంతోషిస్తారు?

 

రాముడు అవతారపురుషుడు అని అందరికీ తెలిసినదే కదా! ఆయన ఏమి చేసినా ఒక మానవుడు ఎలా బ్రతకాలి తద్వారా మోక్షాన్ని ఎలా పొందాలి అని చెప్పడానికే చేశాడు. ఆయన ప్రతీ కదలికకీ అంతరార్థం, పరమార్థం ఉన్నాయి. అలానే శివధనుస్సు విషయానికి వస్తే…..

అకార ఉకార మకారములు ప్రణవము, ప్రణవం
ధనుహు, శరోహ్యాత్మ, బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే
అప్రమత్తేన వేధ్ధవ్యం శరవత్ తన్మయో భవేత్

అన్నారు. అంటే….  అ, ఉ, మ కలిస్తేనే ప్రణవ నాదమయిన ఓం కారం వస్తుంది. ధనుస్సు (ప్రణవం) అంటే ఈ ఓంకారం అనమాట. శరము (బాణము) అంటే ఆత్మ. బాణముతో ధనుస్సును ఎక్కుపెట్టినప్పుడు కనిపించే లక్ష్యమే బ్రహ్మ. ఇక్కడ బ్రహ్మ అనగా పరబ్రహ్మ లేదా పరమాత్మ. బాణాన్ని ఎప్పుడూ అప్రమత్తంగా, చిత్త శుద్ధితో కొడితేనే లయమయ్యి లక్ష్యాన్ని చేరుతుంది. ఇది ధనుస్సు యొక్క అంతరార్థం.

 

ఇక్కడ శివధనుస్సు ఆవిర్భావం గురించి మరికొన్ని విషయాలను తెలుసుకోవాలి. ఈ శివధనుస్సును శివుడు త్రిపురాసురుని సంహరించడం కోసం సృష్టించాడు అన్నది అందరికీ తెలిసినదే! ఈ త్రిపురాసురుడు ఒక జీవుడుని ప్రతిబింబిస్తాడు అని అంతరార్థం ఉంది. అదెలా అంటే, త్రిపురాసురుడు పాలించే మూడు పురములు అయినటువంటి కంచు, వెండి, బంగారములు వరుసగా జీవి యొక్క స్థూల (విశ్వ), సూక్ష్మ (తైజస), కారణ (ప్రాజ్ఞ) శరీరములను ప్రతిబింబిస్తాయి.

స్థూల శరీరం అంటే బాహ్యముగా ఈ విశ్వానికి కనిపించే శరీరం. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు విశ్వుడు అంటారు. ఈ దేహానికి కంచులాగా విలువ లేదు.

సూక్ష్మ శరీరం అంటే కలలో ఉన్నప్పుడు మనకి కనిపించే శరీరం. అది కేవలం ఆలోచన తప్ప అక్కడ ఒక కాయం అన్నది ప్రస్ఫుటముగా ఉండదు. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు తైజసుడు అంటారు. ఈ శరీరం వెండిలాంటిది.

కారణ శరీరం అంటే నేను, నాది అనుకునేది లోపల ఏదయితే ఉందో అది. దీనినే అంతరాత్మ అంటారు. ఇది ఒక రూపం కోసం మాత్రమే పై రెండు రకాల శరీరాల మీద ఆధారపడుతుంది. జీవుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అంటారు. ఇది బంగారంలా చాలా విలువయినది.

శివుడు ప్రణవమనే ధనస్సుతో, ఈ మూడు పురములు అనబడే మూడు రకాల శరీరాలని ఒకేసారి ఛేదించాడు. అప్పుడే త్రిపురాసురుడు అనబడే ఈ జీవుని సంహారం జరిగి మరు జన్మ ఉండదు.
ఈ మూడే కాక, మహాకారణ శరీరం అని ఒకటి ఉంది. అది అందరూ గాఢ నిద్రలో అనుభవించే స్థితి. దీనినే తులీయావస్థ అంటారు. ఈ స్థితిని మనం గుర్తించ గలిగి ఆ పరమాత్మలో లయం అవటాన్నే మోక్షం అంటారు. జీవుడిని ఆ మోక్షానికి చేరువ చేసేదే ఓం కారం అయిన ధనుస్సు.

 

శివుడు ఈ శివధనుస్సుని త్రిపురాసుర సంహారానంతరం దేవరాతుడు అనబడే జనకుని వంశ పూర్వీకునికి ఇవ్వగా ఆ నాటి నుండి వారి వద్ద పూజలందుకుంటూ ఉంది. దీనినే శ్రీరాముడు స్వయంవరంలో విరిచి అప్పుడు సీతమ్మ చేయి అందుకుంటాడు. అనగా గృహస్థాశ్రమంలోకి అడుగుపెట్టే ముందు దీనిని విరిచాడు కదా! ఒక మగవాడికి ధర్మార్థ కామ మోక్షాలు పొందడానికి అనువయిన, ఉత్తమమయినది ఈ గృహస్థాశ్రమం. ఇందాకా చెప్పుకున్నట్టు ధనుస్సు అంటే ప్రణవ నాదమయిన ఓంకారం కనుక దానిని విరవటం అంటే ఓం కారాన్ని విడగొట్టడం. అలా విడగొడితే వచ్చేవి మళ్ళీ అ, ఉ, మ. వీటిల్లో
అ – అంటే బ్రహ్మం లేదా పరబ్రహ్మం అంటే పరమాత్మ అయిన శివుడు
ఉ – అంటే అమ్మవారు సాక్షాత్తు శివుని అర్థ భాగం
మ – అంటే జీవుడు అంటే నేను అనే మగవాడు

ఏ మగవాడయినా పరమాత్మలో చేరడానికి కావలసిన మాధ్యమం అర్థభాగమయిన, అర్థాంగి అయిన భార్య. మనకున్న ధర్మార్థకామ మోక్షాలలో….
ధర్మం – ధర్మానికి ప్రతిరూపం భార్య ఆవిడ లేకపోతే ఏ పూజలకీ, యాగాలకీ, జపాలకీ, తపస్సులకీ జీవుడు పనికిరాడు.
అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి.
కామం – తనకు కావలసిన కోర్కెలు తీర్చుకోవడానికి భార్య కావాలి.
ఇలా ఎప్పుడయితే, ఏ మగవాడయితే ధర్మాన్నీ, అర్థాన్నీ పాటిస్తూ, ఈ రెండూ చెడకుండా కామాన్ని అనుభవిస్తాడో అతనే మోక్షాన్ని పొందే అర్హత సంపాదిస్తాడు.

రాముడు వీటన్నిటినీ ఆలంబిస్తూ ధనుస్సుని విరిచి తను ఈ గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే అర్హతని పొందాడు. కనుకనే అతను సీతకి తగినవాడు, అన్నిటినీ జయించినవాడు కనుక అందరూ సంతోషిస్తారు.

శివ ధనుస్సు లాగానే విష్ణు ధనుస్సు కూడా ఉంది. అది పరశురాముని వద్ద ఉంటుంది. ఎప్పుడయితే రాముడు శివ ధనుస్సుని విరిచి సీతని పరిణయమాడతాడో, అప్పుడు అది తెలిసిన పరశురాముడు ఈ విష్ణుధనుస్సుని, ఆయన శక్తిని కూడా రామునికి ఇచ్చేసి హరిహరులని ఏకం చేస్తాడు.

 

 

 

 

 

9 thoughts on “శివధనుస్సు

 1. @ కళ్యాణ్ గారూ
  నిజమే! మీరన్నట్టు నిజంగా ఈ కాలం యువతరం వీటిని తెలుసుకుని తదనుగుణంగా మసలుకుంటే ఎంతో బాగుంటుంది! ధన్యవాదాలు!

  @ లలిత గారూ
  నచ్చినందుకు, చదివి, వ్యాసం మీద మీ అభిప్రాయాలని తెలియపరచినందుకు ధన్యవాదాలు!

 2. ఈ వ్యాసం చదవడం వలన ఇదివరకు తెలీని విషయాలు చాలా తెలిసాయి. అన్నీ బాగా వివరించారు. ధన్యవాదాలు.

 3. @రసజ్ఞ గారు

  ఔరా ! విల్లును విరుచుట రాముడికి క్షనమాయెను కాని ఆ భావము ఇదియనుచు మీరిచ్చిన నిర్వచనము అ శబ్దమునే పట్టి అక్షరముగా చేసినట్టున్నది . పరమార్థమును పురుషార్థమును చాలా చక్కగా వివరించారు. సామాన్యులకు ఇటువంటి విషయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. పైగా ధర్మార్థ కామ మోక్షములను ఎలా ఉపయోగించుకోవాలి అనడానికి మంచి ఉదాహరణ ఈ సంఘటన. పైగా మీరు వివరించిన విధానము బాగున్నది. ఈ కాలంలో లో ఇలాంటి సమాచారం అందరికి ప్రత్యేకించి యువతరానికి ఎంతైనా అవసరం. ధన్యవాదాలు .

  1. @ బులుసు సుబ్రహ్మణ్యం గారూ
   వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు! నేను ఇందులో చెప్పినట్టు ఏ విధముగానయితే జీవుడు ఒక్కడే అయినా మూడు రకాల శరీరాలలో ఉంటాడో అదే విధంగా త్రిపురాసురుడు ఒక్కడే అయినా మూడు రూపాలలో మూడు పురాలని పాలిస్తాడు.

 4. రసజ్ఞగారూ! మంచి వ్యాసం అందించారు. ఐతే, చివరలో ధర్మార్థకామమోక్షముల గురించి వివరించినప్పుడు, “అర్థం – మగవానికి సంతాన ఉత్పత్తి కోసం భార్య కావాలి” అని చెప్పారేమిటి?….. అర్థం అంటే విత్తం(ధనం) కదా! వివరించగలరు.

  1. @ Satyanarayana గారూ
   వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు! అర్థం అంటే విత్తం కాక ప్రయోజనం, విలువ అని కూడా ఉంది. “ప్రజాయై గృహమేధినాం” అని కాళిదాసు రఘువంశంలో చెప్పారు. గృహస్థాశ్రమానికి ముఖ్య ప్రయోజనం సంతానం అని దాని అర్థం! అటువంటి సంతానం భార్య ద్వారానే జరగాలి కనుక నేను అలా వ్రాశాను.

 5. @ ఆనంద్ గారూ
  తురీయావస్థే పంపించేటప్పుడు అచ్చు తప్పు గమనించలేదు సవరణకు కృతజ్ఞతలు! మీ స్పందనకి ధన్యవాదాలు!

 6. రసజ్ఞ గారు వ్యాసం ఎంతో నిఘూడమైన విషయాలని తేటతెల్లం చేస్తూ, అందంగా విడమరచి వివరించింది. మరీన్ని ఇలాంటివి రాయాలని మా విన్నపం. ఇకపోతే చిన్న సవరణ, తులీయావస్థ కాదేమో తురీయావస్థేమో అని నా అనుమానం. దయచేసి పరిశీలించగలరు. ఇహపోతే బ్రహ్మచర్యం వీడి గృహస్తాశ్రమాన్ని స్వీకరించే నా జీవితంలోని ఈ దశలో ఈ వ్యాససారం ఎంతో ఉపకరిస్తుంది. ధన్యవాదాలు

  -భవదీయుడు
  ఆనంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *