April 19, 2024

తెలుగులో సైన్స్ ఫిక్షన్

రచన: శ్రీనివాస చక్రవర్తి

సామజిక ధర్మాలని ఉల్లంఘించేవారిని సంఘవిద్రోహ శక్తులు అంటారు. భౌతిక ధర్మాలని ఉల్లంఘించేవారిని సైన్స్ ఫిక్షన్ రచయితలు అంటారు.”

 

నిజానికి అనరు. కాని తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు చదువుతుంటే అలా అనాలనిపిస్తుంది.

ఈ మధ్యన తెలుగులో ఓ సైన్స్ ఫిక్షన్  నవల చదవడం జరిగింది. ఓ పత్రికలో అచ్చయిన, పోటీలో బహుమతి గెలిచిన ఓ చిట్టి నవల. 2012  లో యుగాంతం వస్తుందనే మాయన్ గాధ ప్రాతిపదికగా అల్లబడ్డ కథ.

భూమి దిశగా ఓ పెద్ద గ్రహం వస్తుందోని కనుక్కుంటారు ISRO  శాస్త్రవేత్తలు. సరిగ్గా రెండు నెలలలో భూమిని ఢీకొనబోతోందని అంచనా వేస్తారు. అంత పెద్ద గ్రహం మీది కొస్తుంటే మరి ఇంత కాలం గుర్తుపట్టకుండా ఎలా ఉన్నాం అని ఆశ్చర్యపోతారు. తమ ఆవిష్కరణని నిర్ధారించుకోడానికి ఇతర దేశాల అంతరిక్షకేంద్రాలని సంప్రదిస్తారు. కాని అందరూ ఏదో దాస్తున్నట్టుగా ప్రవర్తిస్తారు.

ఇక ఏం చెయ్యాలో దిక్కుతోచక శాస్త్రవేత్తలు, దేశనేతలు ఓ పెద్ద స్వామీజీని కలుసుకుంటారు. “అంతా శాంతియుతంగా బతకండి, మరేం ఫరవాలేదు,” అని స్వామీజీ అభయహస్తం ఇస్తారు. దేశ ప్రధానమంత్రి ఆ సందేశాన్ని ఇతర దేశాల నేతలకి కూడా పంపుతారు. దేశదేశాల నేతలంతా ఉన్నపళంగా మంచివాళ్లయిపోయి బుద్ధిగా నడుచుకోవడం మొదలెడతారు.

చివరికి దుర్ఘటన ముహూర్తం దగ్గర పడుతుంది. అల్లంత దూరంలో గ్రహం కనిపిస్తుంది. బలంగా గాలులు వీస్తుంటాయి. చెట్లు ఊగిపోతుంటాయి. మనుషుల క్రాఫింగు చెదిరిపోతుంటుంది. మరొక్క క్షణంలో గ్రహం ఢీకొనబోతోందనగా ఉన్నట్లుండి అంతా సర్దుకుంటుంది. ఏ అవాంతరం జరగకుండా ప్రమాదం నివారించబడుతుంది.

ఆ తరువాత శాస్త్రవేత్తలు గమనించింది ఏంటంటే ఆ సమయంలో ఒక్కక్షణం భూమి ఆగిపోతుంది. అందుకే భూమిని ఢీకొనబోయిన దుష్టగ్రహం పక్క నుండి దూసుకెళ్లిపోతుంది. వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పిపోతుంది. అదన్నమాట కథ.

 

ఈ కథ గురించి కాస్త చర్చించుకుందాం. తెలుగులో సైన్స్ ఫిక్షన్ నవలలే చాలా అపురూపం. అలాంటి నవలలు మొత్తం లెక్కపెట్టడానికి ఒక చేతి వేళ్లు సరిపోతాయేమో. అందుకే కొత్తగా ఎక్కడైనా సై.ఫై. నవల కనిపిస్తే ఆనందం వేస్తుంది. కాని తీరా చదివాక, సైన్స్ ఫిక్షన్ పేరుతో సైన్స్ కి సజీవసమాధి జరగడం చూసినప్పుడు, ఆ ఆనందం బధగా మారుతుంది.

అసలు ఈ కథకి మూలాలు ఎక్కడున్నాయో ఓసారి పరిశీలిద్దాం. మాయన్ కాలెండర్ ప్రకారం 2012  సంవత్సరంతో యుగం అంతమవుతుందనే కథ చాలా కాలంగా జనాన్ని ఇబ్బంది పెడుతోంది. ఆ యుగాంతం ఎలా వస్తుంది అన్న దానికి కూడా ఒక ఘాటైన కథనం ప్రచారంలో ఉంది. 1995  లో అమెరికాకి చెందిన నాన్సీ లీడర్  అనే వనిత ‘నిబీరూ’ అనే గ్రహం ఒకటి భూమి దిశగా దూసుకొస్తోందని, అది 2012  లో భూమిని ఢీకొనబోతోందని ప్రకటించింది. తన తలలో ఉన్న ఇంప్లాంట్ ద్వారా ఏదో సుదూర తారావ్యవస్థలో ఉండే “గ్రహాంతర వాసుల” నుండి తనకి ఈ సందేశం వచ్చిందని చెప్పుకుంది. అయితే ఈ నిబీరూ అనే గ్రహం యొక్క ప్రస్తావన జచారియా సిట్చిన్ అనే రచయిత రచనల్లో కూడా వస్తుంది. ప్రాచీన బాబిలోనియన్, సుమేరియన్ పురాణ గాధల ఆధారంగా అలాంటి గ్రహం ఒకటి ఉందని ఇతగాడి అభిప్రాయం.  ఈ నిబీరూ కథనం ఇంటర్నెట్ లో బాగా ప్రచారం అయ్యింది. ఈ కథే పైన చెప్పిన తెలుగు సైన్స్ ఫిక్షన్ కి మూల కథ అయ్యింది.

అయితే నిబీరూ కథ లాగానే ఈ తెలుగు కథలో కూడా శాస్త్రీయంగా చూస్తే ఎన్నో సమూలమైన దోషాలు ఉన్నాయి.

1) మొట్టమొదటిది భూమిని ఢీకొన వస్తున్న  గ్రహాలని కేవలం రెండు నెలల దూరంలోకి వచ్చినంత వరకు కూడా గుర్తించకపోవడం అసంభవం. దూరాన ఉండే వస్తువులని గుర్తించడంలో ప్రస్తుతం సాంకేతిక నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో చూద్దాం.

ఒక గ్రహం లాంటి పెద్ద వస్తువు మన పరికరాలకి చిక్కకుండా ఉండాలంటే ఎంత దూరంలో ఉండాలి అన్న విషయం గురించి మైక్ బ్రౌన్ అనే ఖగోళశాస్త్రవేత్త ఇలా అంటున్నాడు. భూమికి సూర్యుడికి మధ్య దూరాన్ని 1  Astronomical Unit (AU)  అంటారు (సుమారు 15 కోట్ల కిమీలు). మార్స్ అంత పెద్ద గ్రహం మనకి కనిపించకుండా ఉండాలంటే  300  AU  ల దూరంలో ఉండాలి. అంటే నెప్ట్యూన్ ఉన్న దూరానికి పది రెట్ల దూరం. అలాగే జూపిటర్ అంత పెద్ద గ్రహం కనిపించకుండా ఉండాలంటే అది 30,000 AU  ల దూరంలో ఉండాలి. అంటే ఇంచుమించు కాంతిసంవత్సరంలో సగం. కాని  పైన చెప్పిన తెలుగు కథలో గ్రహం యొక్క పరిమాణం గురించి గాని, వేగం గురించి గాని (దాని వేగం “అపరిమితం” అని ఊరుకుంటాడు రచయిత) ఏ వివరాలూ లేవు కనుక కచ్చితంగా వ్యతిరేకించే అవకాశం కూడా లేదు!

గ్రహాల మాట ఇలా ఉండగా ఇంకా చిన్న వస్తువులైన గ్రహశకలాలని (asteroids) కనుక్కోవడంలో కొంచెం ఇబ్బంది లేకపోలేదు. అయితే ఇక్కడ కూడా  ఎంత దూరం నుండి కనుక్కుంటారో చెప్పడానికి ఒక ఉదాహరణ. 2010, డిసెంబర్  10  నాడు ఎలెనిన్ అనే ఓ తోకచుక్కని కనుక్కున్నారు. అప్పటికి భూమి నుండి దాని దూరం 4 AU  లు పైగా ఉంది. ఈ తోకచుక్క పరిమాణం కేవలం  4  కిమీ లు. (దీనితో పోల్చుకోడానికి భూమి వ్యాసం 12,742 kms). అంత చిన్న వస్తువులని అంత దూరం నుండి పట్టుకోగలుగుతున్నప్పుడు ఏకంగా ఒక గ్రహం భూమితో దోబూచులాడడం హాస్యాస్పదంగా ఉంది.

 

2)  గ్రహం భూమిని ఢీకొనే దుర్ఘటన “కాస్తలో” తప్పిపోవడం!

ప్రపంచ శాస్త్రవేత్తలు (పోనీ భారతీయ శాస్త్రవేత్తలు మాత్రమే!) అంతా గుర్రుపెట్టి నిద్రపోవడం చేత దూసుకొస్తున్న గ్రహాన్ని గుర్తుపట్టలేదనే అనుకుందాం. కాని కథలో బొత్తిగా జీర్ణించుకోలేని విషయం మరొకటి ఉంది. అది ఆ గ్రహం భూమిని సమీపించే పద్ధతి.

ఒక కారు ప్రమాదమో, ఓ సైకిలు ప్రమాదమో తప్పిపోయినంత సులభంగా గ్రహం కొంచెంలో భూమిని ఢీకొనడం మానేసింది అన్నట్టు రాస్తాడు రచయిత.  ఒక పెద్ద గ్రహం భూమిని ఢీకొనకపోయినా, కేవలం భూమి సమీపం నుండి పోతే చాలు, భూమి మీద – భూమి రూపురేఖల మీద, కక్ష్య మీద – ప్రగాఢమైన మార్పులు తీసుకురావడానికి.

భూమి మీద జీవనం సుస్థిరంగా సాగడానికి ముఖ్య కారణాలలో పుష్కలమైన నీరు, ఆక్సిజన్ ఉన్న వాతావరణం, ఎక్కువ తక్కువ కాని ఉష్ణోగ్రత మొదలైనవి చెప్పుకుంటాం.  ఇవి కాక భూమి యొక్క గమనం, – అంటే దాని పరిభ్రమణం, దాని అక్షం యొక్క వాలు, సూర్యుడి చుట్టూ దాని కక్ష్య, – ఇవన్నీ స్థిరంగా ఉండడం కూడా జీవరాశి మనగల్గడానికి దొహదం చేస్తాయి. వీటిలో మార్పులు వస్తున్నా, అవి అతి నెమ్మదిగా రావడం చేత జీవరాశికి ప్రమాదం లేదు.

ఉదాహరణకి భూమి అక్షం  ఎప్పుడూ ధృవతార దిక్కుగానే తిరిగి ఉండదు. దాని అక్షంలో చిన్న చలనం ఉంటుంది. అది 26,000  ఏళ్లకి (గంటలు, ఘడియలు, నాళ్లు, నెలలు కాదు!)  ఒక సారి ఒక పూర్తి చుట్టు చుడుతుంది. దీన్నే విషువత్ చలనం అంటారు. భూమి అక్షం వాలు 23  డిగ్రీలు అని చిన్నప్పుడు చదువుకుంటాం. విషువత్ చలనం వల్ల ఆ వాలు 22.1 డిగ్రీలు, 24.5 డిగ్రీలకి మధ్య అతినెమ్మదిగా మారుతూ ఉంటుంది. ఇక సూర్యుడి చుట్టూ భూమి కక్ష్య ఇంకా నెమ్మదిగా మారుతుంది.

సౌరమండలంలో గ్రహాలు అన్నీ ఇలాంటి స్థిర చలనాలలో కుదురుకోవడం, అలా కుదురుకున్న కాలంలో మనం జీవించడం మన అదృష్టం. సౌరమండలం యొక్క తొలిదశల్లో కక్ష్యలు ఇంకా కుదురుకోని దశల్లో, గ్రహాల మధ్య, ఉపగ్రహాల మధ్య ఘర్షణలు  జరిగి ఉండొచ్చు. అలాంటి ఘర్షణ వల్ల భూమి లోంచి పెల్లగించబడ్డ ఓ మట్టిగడ్డే చంద్రుడు అని ఒక సిద్ధాంతం వుంది.  కాని స్థిరపడ్డ సౌరమండలంలో అలాంటి విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం లేదు.

సౌరమండలానికి బయటి నుండి ఏదైనా గ్రహం సౌరమండలంలోకి ప్రవేశించవచ్చు. ఇలాంటి ‘దారి తప్పిన గ్రహలని’ rogue planets  అంటారు. ఏ తారకీ కట్టుబడి ఉండకుండా విశాలమైన అంతరిక్షంలో స్వేచ్ఛగా సంచరించే సంచార గ్రహాలివి. అలాంటి గ్రహాలని కనుక్కున్నారు కూడా. అయితే మనకి తెలిసి సౌరమండలం దరిదాపుల్లో అలాంటివి లేవు.

పోనీ ఏదో కథ కోసం అలాంటి గ్రహం సౌరమండలంలోకి ప్రవేశించింది అనుకుందాం. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరిగే తలం (దీన్నే plane of the ecliptic  అంటారు) లోనే ఇది కూడా ప్రవేశించినట్టయితే ముందుగా దీని ప్రభావం బాహ్య గ్రహాల (నెప్ట్యూన్, యురేనస్ మొ॥) కక్ష్యల మీద కనిపిస్తుంది. ఆ మార్పులని మన పరికరాలు పట్టుకోగలవు. అంతే కాక అది భూమి దాకా రావడానికి దశాబ్దాలు, శతాబ్దాలు పడుతుంది – రోజులు, నెలలు కాదు.

ఇక అంతర సౌరమండలం (inner solar system)  లోకి ప్రవేశిస్తే భూమి కక్ష్య మీద కూడా బలమైన ప్రభావం ఉంటుంది. అసలు ఆ ప్రభావానికే భూమి మీద విపరీతమైన ఉపద్రవాలు సంభవించవచ్చు.

ఇక భూమిని ఢీకొనబోయినంత దగ్గరికి వస్తే  తెలెత్తే ఒక ముఖ్యమైన ప్రభావం ‘tidal force’. భూమి మీద ఆ కొత్త గ్రహం వైపు ఉన్న ప్రాంతాలు, భూమికి అవతలి వైపు ఉన్న ప్రాంతాల కన్నా, కొత్త గ్రహం వైపు మరింత బలంగా ఆకర్షించబడతాయి. చందమామకి భూమి మీద అలాంటి ప్రభావమే ఉంటుంది. అయితే చందమామ పరిమాణం తక్కువ, భూమి వ్యాసంతో (12,000 km) పోల్చితే చందమామ దూరం (300,000 km) ఎక్కువ. కనుక చందమామ ఆకర్షణ వల్ల సముద్రంలో తరంగాలు (tides)  పుడతాయి. అందుకే దీన్ని tidal effect  అంటారు.

ఈ tidal effect  వల్లనే ఒక గ్రహం చుట్టూ తిరిగే ఒక ఉపగ్రహం, గ్రహానికి మరీ దగ్గరిగా రాలేదు. ఒక నిర్ణీత దూరం కన్నా దగ్గరికి వచ్చిందంటే tidal effect  వల్ల ఉపగ్రహం పటాపంచలై, ఆ శకలాలు గ్రహం చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి తిరుగుతూ ఉంటాయి. సాటర్న్ చుట్టూ కనిపించే వలయాలు అలా ఏర్పడ్డవే.

 

ప్రతీ గ్రహానికి ఆ నిర్ణీత దూరం వేరుగా ఉంటుంది. ఆ దూరాన్ని Roche limit  అంటారు. భూమి-చందమామల వ్యవస్థకి Roche limit  18,260 km. అయితే ఆ విలువ భూమి-చందమామల జంటకే వర్తిస్తుంది. ఎందుకంటే ఇది ఈ రెండు వస్తువుల సాంద్రత మీద ఆధారపడుతుంది. ఏదేమైనా ఆ వచ్చే గ్రహం భూమికి కొన్ని పదుల వేల కిమీల దూరంలోకి వచ్చిందంటే ఇక మనం ఆశలు వదులుకోవచ్చు.

 

3) భూమి “ఒక్క క్షణం” ఆగిపోవడం!

దుష్ట గ్రహం దూసుకొచ్చి భూమిని రాసుకుంటూ వెళ్లిపోయింది అన్నా ఫరవాలేదు గాని (ఏదో మరి ఒక్కోసారి అలాక్కూడా అవుతుంది లే అని సర్దిపెట్టుకోవచ్చు!) ఆ సంఘర్షణ నివారించడానికి భూమిని “ఒక్కక్షణం” ఓ సైకిల్ ని బ్రేకేసి ఆపేసినట్టు అపేయడం  చాలా అన్యాయంగా అనిపిస్తుంది.

కదులుతున్న భూమిని అసలు ఆపడానికి ఎంత శక్తి అవసరం అవుతుందో చిన్న లెక్క వేద్దాం. దీనికి ఇంటర్మీడియెట్ భౌతిక శాస్త్రం తెలిస్తే చాలు.

భూమి సూర్యుడి చుట్టూ ఏడాది కొకసారి ప్రదక్షిణ చేస్తోంది కనుక, సూర్యుడి నుంచి భూమి దూరం 149  మిలియన్ కిమీలు కనుక, భూమి వేగం సుమారు 30 km/s  ఉంటుంది.

దీంతో పోల్చితే స్పేస్ షటిల్ వేగం (సుమారు  7 km/s)  చాలా తక్కువ.

ఇక భూమి భారం  = 6 X 1024 kg

కనుక భూమి యొక్క గతిశక్తి (kinetic energy) ఎంతో లెక్కకడితే,

½ X m X v X v = 2.7 X 1033 J

ఆధునిక ఆటం బాంబుల నుండి వెలువడే శక్తిని  మెగా టన్నులలో కొలుస్తారు.

1 megaton = 4.18 X 1015 J

కనుక భూమిని ఆపడానికి కావలసిన శక్తి

2.7 X 1033 J/4.18 X 1015  J

= 6.4 X 10 17 MT (megatons) (సుమారు)

భూమిని ఆపడానికి 6.4 X 10 17 MT (megatons) శక్తి కావాలి.

ఒక మెగాటన్ను ఎంత ఎక్కువో తెలియాలంటే, హిరోషిమా నాగసాకి మీద వేసిన ఆటంబాంబుల శక్తి కేవలం  15 kilo Tons ( 1 megaton = 1000 kilotons) మాత్రమే నని గమనించాలి.

అంటే భూమిని ఆపడానికి కొన్ని కోట్ల కోట్ల (ఒక కోటి = ఏడు సున్నాలు మరి, మనకి పదిహేడు సున్నాలు కావాలి) ఆధునిక ఆటం బాంబులు పేల్చితే వచ్చేంత శక్తి కావాలి!!!

అదీ గాక కథ ప్రకారం భూమిని ఒక్క సెకను కాలం మాత్రం ఆపడానికి అన్ని కోట్ల కోట్ల ఆటం బాంబులు కేవలం ఒక్క సెకను కాలంలోనే పేల్చాలి. ‘సముద్రస్నానానికి పోతే ఉన్నది కాస్తా…’ అన్నట్టు భూమి ఆపబోయి బొత్తిగా భూమి భవిష్యత్తునే రద్దు చేసినట్టు అవుతుంది. అంత శక్తిని ప్రయోగించి భూమిని ఆపినా, ఆ తరువాత మళ్లీ కదిలించడానికి పెద్దగా ఏమీ మిగలకపోవచ్చు!

కాబట్టి భూమిని ఆపడం పరిష్కారం కాదు. నిజంగా గ్రహం భూమిని ఢీకొనడానికి వస్తుంటే పెద్దగా చెయ్యగలిగేదేమీ ఉండదు. 1950  ల నాటి When Worlds collide  అనే సినిమాలో ఇదే కథావస్తువుగా తీసుకోబడింది.  ఆ సమస్యకి పరిష్కారంగా కొందరు ఓ అంతరిక్షనౌకలో భూమి నుండి పారిపోయి తప్పించుకున్నట్టు చూపిస్తారు. అదంత ఉదాత్తమైన పరిష్కారం కాదు కాని వాస్తవికమైన పరిష్కారం. భూమిని ఉన్నపళంగా ఆపేయడం కన్నా సులభమైన పరిష్కారం.

 

4)  ఇక చివరిగా ఈ నవలని రచయిత ఎందుకు రాసినట్టు?

సైన్స్ ఫిక్షన్ రచనల్లో అన్నీ శాస్త్రానికి విధేయంగా ఉంటాయని లేదు. అందుకే అది ఫిక్షన్ అయ్యింది. శాస్త్రవిషయంలో రచయిత కాస్త చొరవ తీసుకున్నా, తీసుకున్నందుకు కథ ఏదో విధంగా రక్తి కట్టాలి. ఓ  కుర్రదాని మనసుని దోచుకోబోయిన కుర్రాడి ప్రయత్నం లాంటిదే ఇదీను. చిన్నదానితో కాస్తంత చొరవ తీసుకుని బోలెడంత ఫలితం సాధించాలి. ఓ కాఫీకనో, సినిమాకనో తీసుకెళ్లి మనసు విప్పి చెప్పి, మనువు దాకా తీసుకెళ్ళాలి. అంతే గాని విరివిగా చొరవ తీసుకుని చివరికి పెళ్లి అనగానే తుళ్లి పడితే బాగోదు మరి.

ఉదాహరణకి ‘Journey to the Center of the Earth’  లో జూల్స్ వెర్న్ భూమి కేంద్రం వరకు ఇద్దరు వ్యక్తులు ప్రయాణించినట్టు రాస్తాడు. మనుషులు భూమిలోకి తవ్విన అతి లోతైన గోతులు చమురు బావులు. అవి పది కిమీలు మించి పోవు. ఇక భూమి కేంద్రం దాకా బిక్కు బిక్కు మంటూ ఇద్దరు మామా, అళ్లుళ్ళు (ఓ గైడ్ తో పాటు) ప్రయాణించడం జరగని పని. కాని తీసుకున్న ఆకాస్త చొరవకి రచయిత పాఠకులని ఓ విచిత్ర ఊహాలోకం లోకి తీసుకుపోతాడు. నిజంగా భూగర్బంలో అంత వింతైన ప్రపంచం రహస్యంగా ఉందా అని అబ్బురపోయేట్టు చేస్తాడు. తెలిసిన భౌగోళిక శాస్త్రాన్ని అద్భుతంగా వర్ణిస్తూ పాఠకుణ్ణి నమ్మింపజేస్తాడు, ఒప్పుకునేట్టు చేస్తాడు. అసంభవమని తెలిసినా తన ఊహని ఆనందంగా స్వీక రించేట్టు చేస్తాడు.

కాని పైన చెప్పుకున్న కథలో రచయిత అంత ‘చొరవ’ తీస్కున్నందుకు సాధించింది ఏంటి? అతి ప్రాథమిక భౌతిక నియమాలని కూడా ఉల్లంఘిస్తూ రాసిన ఈ కథకి ప్రయోజనం ఏంటి?

కథలో ఓ స్వామీజీ ఉపద్రవం నుండి అందరినీ రక్షిస్తానని హామీ ఇస్తాడు. అందరినీ శాంతియుతంగా, నీతిగా బతకమంటాడు. రాత్రికి రాత్రికి మానవాళి మనసు మారిపోతుంది. భగవంతుడి కృపాకటాక్షం వల్ల భూమి ఠక్కున ఆగిపోతుంది. ఉపద్రవం తప్పిపోతుంది. కనుక ఇక్కడ రచయిత  ఇవ్వదలచుకున్న సందేశం  వీటిల్లో ఏదైనా కావచ్చు.

“సైన్సు కన్నా దైవశక్తి గొప్పది”

“దేవుడు తలచుకుంటే భౌతిక నియమాలు ఓ లెక్క కాదు”

“సైంటిస్టుల కన్నా స్వామీజీలే మిన్న”

ఇక్కడే ఓ సైంటిస్ట్ గా నా బాధ కొద్దిగా వెళ్లగక్కాలని అనుకుంటున్నాను. దాన్ని ఎవడైనా పట్టించుకుంటాడని కాదు. కాని ఏదో నా చాదస్తం నాది.

రచయిత పాఠకుల మనసుల్లో దైవభక్తిని పెంచాలని అనుకుంటే ఏ రామాయణ, భాగవత కథనో ఓసారి ‘రీసైకిల్’ చేస్తే సరిపోయి ఉండేది. అందుకోసం పనిగట్టుకుని సైన్స్ ని మట్టికరిపించాల్సిన అవసరం కనిపించలేదు నాకు. “ఇది వట్టి కథ. ఎవరికి కావలసినట్టు వాళ్లు రాసుకోవచ్చు, మధ్యన నీ గొడవేంటి?” అంటారేమో. రావణాసురుడి భార్య సీత అని రాస్తే రామాయణాన్ని గౌరవించేవారు ఎలా విలవిలలాడతరో, వైజ్ఞానిక నియమాలకి ఉప్పుపాతర వేస్తూ కథలు రాస్తుంటే సైన్స్ ని గౌరవించేవారు ఎంతైనా  నొచ్చుకుంటారు మరి.

సైన్స్దేవుడుభారతీయ సంస్కృతి

మన సాహిత్యంలో, సినిమాలలో, పాపులర్ మీడియాలో అందరికీ అత్యంత చులకనైన విషయం సైన్స్ అనిపిస్తుంది కొన్ని సార్లు. మన సినిమా హీరోలు గురుత్వం పట్ల ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరిలో అదే కనిపిస్తుంది. సెల్ ఫోను, లాప్ టాప్ లేకుండా రోజు గడవని వాళ్ళు కూడా సైన్స్ ని దుమ్మెతి పోస్తుంటే అదే కనిపిస్తుంది. వాతావరణ  పొరలలో ‘యాంటీ మాగ్నెటిక్’ శక్తిని కలుగజేసి మీదికి వస్తున్న తారని వికర్షించి, ‘యుగాంతం’ ని నివారించబోయిన మన మేటి రచయితల రచనలలోనూ అదే కనిపిస్తుంది.

అధ్యాత్మికత పేరిట మన జనసామాన్యంలో ప్రచారమయ్యే కొన్ని అమాయక భావాలు కూడా సైన్స్ పట్ల ఈ రకమైన చులక భావానికి వత్తాసు పలుకుతున్నాయి. “అన్నిటికీ దేవుడు ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా భయపడాల్సింది లేదు. నలుగురూ కలిసి భజన చేస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. ఈ సైంటిస్టుల కేం తెలీదు. సమస్య వస్తే ఏ స్వామీజీ కాళ్ళో పట్టుకో. లేదా న్యూమరాలజీ ప్రకారం పేరు ఖూనీ చేసుకో. ఉంగరాలు పెట్టుకో, గజ్జెలు కట్టుకో…”   మొదలైనవి అన్నమాట.

మన సంస్కృతిలో జీవితమంతా చిత్రవిచిత్రమైన మహిమలతో, మహత్యాలతో సాగిపోయే ఓ మహాగారడీలా కనిపిస్తుందేమో. ఆ మహిమలు మనకి అనుకూలంగా జరిగేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి అన్నదాని మీదనే మన ధ్యాసంతా ఉంటుంది. అందుకే అదృష్టాన్ని నమ్మినంత సులభంగా స్వశక్తిని, గొప్ప పట్టుదలతో, ప్రతిభతో కూడుకున్న స్వయంకృషిని నమ్మం. ఇలాంటి జీవనం సోమరుల స్వర్గం.

భౌతిక ప్రపంచం కొన్ని కచ్చితమైన ధర్మాలని, నియమాలని అనుసరించి నడుస్తుంది అని మనం నమ్మం కనుక ఆ అపనమ్మకం యొక్క పర్యవసానాలు మన భౌతిక మానవ వ్యవస్థల పని తీరులో కూడా కనిపిస్తాయి. నియమాలని నమ్మం కనుక అడ్డదోవలు తొక్కనిదే పని అసాధ్యం అనుకుంటాం. అందుకే మనం ఎంత వేగంగా వ్యవస్థలని నిర్మించుకుంటామో, అంతే వేగంగా వాటిని చేతులార సర్వనాశనం చేసుకుంటాం.  స్టార్ వార్స్ చిత్రమాలిక (సై.ఫై. రంగంలో ఓ మరపురాని సృష్టి) లో ‘కి గాంగ్’ అనే జెడై గురువు తన చిన్నారి శిష్యుడు అయిన ఆనెకిన్ స్కైవాకర్ తో ఓ సారి అంటాడు – “Our focus determines our reality.” “మన భావం ఎలా ఉంటుందో మన యదార్థం కూడా అలాగే ఉంటుంది.” మన ఊహలలో, భావాలలో ఏ నియమాలూ లేని అస్తవ్యస్త ప్రపంచాన్ని ప్రతిష్టించుకుంటే, మన వాస్తవ ప్రపంచం కూడా అలాగే అస్తవ్యస్తంగా ఉంటుంది. మన భౌతిక జీవన స్రవంతి అల్లకల్లోలంగా ఉంటుంది.  శాస్త్రరంగంలో ఉన్నత స్థాయిలో ఉండే పాశ్యాత్య సంస్కృతులలో, పాశ్యాత్య ప్రపంచంలో ఉండే సమర్థవంతమైన, సలక్షణమైన, సామరస్యమైన బాహ్య జీవన పరిస్థితులు మన దేశంలో కనిపించకపోవడానికి కారణాలు మన అశాస్త్రీయతలో కనిపిస్తాయి నాకు. (అందుకేనేమో అక్కడి ట్రాఫిక్ సుశాంత గంగా ప్రవాహం అయితే, మన ట్రాఫిక్ చెల్లాచెదురు అవుతున్న అడవి దున్నల గుంపులా అనిపిస్తుంది).

మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేని, వ్యక్తులకి అతీతమైన ధర్మాలని అనుసరించి యదార్థం నడుస్తుందనే గుర్తింపే శాస్త్రీయతలో మొదటి పాఠం.  శాస్త్రీయ దృక్పథం యొక్క ముఖ్య లక్షణం శుద్ధ, కఠోర వాస్తవికత. భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కటి కొన్ని నియమాలని అనుసరించి జరుగుతుంది. ఆ నియమాలని అర్థం చేసుకుని, తగు రీతిలో పరిశ్రమిస్తే ఫలితం దక్కుతుంది. లేకుంటే (ఎంత లంచం పెట్టినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని తాయెత్తులు కట్టుకున్నా) దక్కదు. శాస్త్రీయ దృక్పథంతో జీవితాన్ని చూసినప్పుడు ఎక్కడా అడ్డుదోవలు కనిపించవు. Short cuts ఉండవు. ప్రతీ ఫలితానికి అందుకు అవసరమైన పరిశ్రమ చెయ్యక తప్పదు. ప్రతీ ఫలానికి చచ్చినట్టు మూల్యం చెల్లించక తప్పదు. చవకగా, ఉచితంగా ఏదీ దక్కదంటుంది. శాస్త్రీయ దృక్పథాన్ని స్వీకరించాలంటే వ్యక్తిత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, దమ్ముండాలి.

పోనీ అసలు మన సంస్కృతి ఏ నియమాలూ లేని ఆటవిక సంస్కృతి అనుకోవాలా? కచ్చితంగా కాదు. మనకి ఉన్నన్ని ‘కట్టుబాట్లు’ మరే ఇతర సంస్కృతిలోను ఉండవేమో. భూమి మీద పడిన నాడు మొదలుకొని అన్నప్రాసన, అక్షరాభ్యాసం, ఒడుగు, పెళ్లి, సీమంతం, షష్టిపూర్తి…ఇలా దారి పొడవునా వేయి వేడుకలే కాక, జీవన యాత్ర ముగిశాక కూడా చెయ్యాల్సిన మరెన్నో కర్మలు. ఇవి గాక పండుగలు, నోములు, వ్రతాలు. ఇవి చాలనట్టు దైనిక జీవనాన్ని శాసించే శతకోటి చిన్న చిన్న సూత్రాలు, చిట్కాలు.  ఎలా వండాలి, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎలా విశ్రమించాలి? నోరు విప్పితే మంత్రం, చెయ్యి కదిలిస్తే తంత్రం. ఇదీ మన సంస్కృతి. కనుక మనకి నియమాలు లేవని ఎవరన్నారు? అవి తప్ప మనకి పెద్దగా ఏమీ లేదంటే సబబు.

ఇక్కడే మనకి మన సంస్కృతిలో ఓ విచిత్రమైన అంతర్వైరుధ్యం కనిపిస్తుంది. ఒక రంగంలో అతి విస్తృతమైన నియమావళిని తరతరాలుగా పాటించే మన సంస్కృతి, మరో రంగానికి (అంటే భౌతిక రంగానికి)  చెందిన నియమావళిని అంతగా ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? వధూవరులు ‘బాసింగాలు’ పెట్టుకోవాలా వద్దా అన్న విషయం మనకి ఎంతో ప్రధానంగా కనిపిస్తుంది గాని,  ‘లేన్ చేంజ్ సిగ్నల్’ ఇవ్వాలన్న విషయం ఎందుకంత అల్పంగా కనిపిస్తుంది? గణేశ నిమజ్జనం మనకి భగవత్ ప్రీతి కోసం చేసే అర్చనలా కనిపిస్తుంది కాని, ప్రకృతి మీద చేసే పాశవిక దౌర్జన్యంగా ఎందుకు కనిపించదు? కనుక ఇక్కడ మనకి రెండు value systems, రెండు దృక్పథాలు  కనిపిస్తున్నాయి. ఒక దృక్పథంలో ఉన్నతంగా కనిపించే చేష్ట, మరో దృక్పథంలో హీనంగా కనిపిస్తుంది. ఈ రెండిట్లో మన సంస్కృతి ఒక దానికే విపరీతంగా ప్రాధాన్యత ఇస్తూ రెండవ దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. ఒక విధంగా అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రత్యేకత, గొప్పదనం. ఒక విధంగా అదే మన బలహీనత కూడా.

దైవోన్ముఖమైన జీవన విధానాన్ని బోధిస్తుంది భారతీయ సంస్కృతి. దైవం అనబడే ఓ అందమైన, అనిర్వచనీయమైన తత్వాన్ని చేరుకోవడమే జీవితం యొక్క ప్రయోజనం అంటుంది. అలాంటి సార్థకతని సాధించాలంటే ఎలా జీవించాలో నేర్పుతుంది. అలాంటి జీవనసరళి మన దేశం యొక్క ప్రత్యేకత అనుకోవాలేమో. మరే ఇతర సంస్కృతీ అంత అనితరంగా ఆత్మోన్ముఖమైన జీవనసరళిని బోధించలేదు. కాని సమస్య ఎక్కడొస్తుందంటే, మనిషి కేవలం దైవసాన్నిధ్యం కోసం పరితపించే జీవుడిగా జీవించడు. శరీరం గల ‘దేహి’గా ఈ భౌతిక ప్రపంచంలో సంచరిస్తాడు. మరి అంతర్లోకపు నియమాలు వేరు; మనకి బయట కనిపించే ఈ భౌతిక ప్రపంచపు నియమాలు వేరు. ఒక భూమికకి చెందిన ధర్మాలు మరో భూమికకి వర్తింపజేస్తే అయోమయ పరిస్థితి నెలకొంటుంది. ఆ ‘ధర్మసంకటం’ లేదా ‘ధర్మసంకరం’ మన ప్రస్తుత భారతీయ సమాజం ఎదుర్కుంటున్న కీలక సమస్యల్లో ఒకటి అనిపిస్తుంది.

ఈ సంకటాన్ని తీర్చాలంటే, ఈ సంకరాన్ని నయం చెయ్యాలంటే ముందుగా ఇక్కడ మనం రెండు పూర్తిగా వేరైన రంగాలతో వ్యవహరిస్తున్నామని గుర్తించాలి. ఒకటి ఆత్మైక రంగం, రెండవది భౌతిక రంగం. మొదటి దాని గురించి బోధించేది భారతీయ తత్వచింతన. రెండవ రంగం గురించి చెప్పేది ఆధునిక విజ్ఞానం. (విషయం ఇంత సులభం కాదని తెలుసు. కాని ఇలా అనుకుంటే కొంత స్పష్టత వస్తుంది.) రెండిటినీ వేరు వేరుగా వాటి శుద్ధ రూపంలో ముందు అర్థం చేసుకోవాలి. సులభంగా అంతుబట్టని ఆత్మైక విషయాలని కూడా చక్కగా క్రమబద్ధీకరించి, ఓ శాస్త్రంలా వ్యక్తం చేసిన మహామహులు మన పూర్వీకులు. పతంజలి యోగసూత్రాలు, నారద భక్తి సూత్రాలు మొదలుకొని ఆత్మ మార్గం గురించి ఓ శాస్త్రం లాగా బోధించే గొప్ప అధ్యాత్మిక సారస్వతం మనకి ఉంది. అలాగే సైన్స్ గురించి, వైజ్ఞానిక పద్ధతి గురించి, శాస్త్రీయ దృక్పథం గురించి నేర్పించడానికి సువిస్తారమైన ఆధునిక సాహిత్యం ఉండనే ఉంది.

ఈ ప్రయత్నంలో మనం ఒక విషయం ముఖ్యంగా గుర్తుంచుకోవాలని నా అభిప్రాయం. ఈ వ్యాసంలోని సారం కూడా అదేనేమో. అధ్యాత్మికతని, సైన్స్ ని – రెండిటినీ ముందు వేరు వేరుగా, క్షుణ్ణంగా అర్థం చేసుకోకుండా రెండిటినీ దుడుకుగా కలపడం ప్రమాదకరం. దేవుడు అన్న అంశాన్ని ప్రవేశపెట్టగానే సైన్స్ అంతా ప్రశ్నార్థకం అయిపోతుంది. ఎందుకంటే దేవుడు అనగానే నియమాలకి అతీతుడు, అగ్రాహ్యుడు, పరముడు, అన్న భావన వస్తుంది. మరి సైన్స్ ధ్యాస అంతా  కొన్ని నియమాల అనుసారం వర్తించే యదార్థం మీద ఉంటుంది. దేవుడు ప్రసక్తి రాగానే సైన్స్ స్తంభించిపోతుంది, రద్దు అయిపోతుంది. ఈ సమస్యని ఫ్రెంచ్ తాత్వికుడు దేకార్త్  (Des Cartes)  చాలా తెలివిగా పరిష్కరించాడు: “దేవుడు ఉన్నాడు. కొన్ని నిర్దిష్టమైన భౌతిక ధర్మాలని అనుసరించి పని చేసే ఈ విశ్వాన్ని సృష్టించాక ఆయన వెనక్కు మళ్లి నేపథ్యంలో ఉండిపోయాడు. కనుక ఇక సైన్స్ పరిధి లోకి రాడు.” ఆ విధంగా వైజ్ఞానిక రంగం నుండి దేవుణ్ణి తప్పించాక పాశ్చాత్య లోకంలో సైన్స్ పురోగతి విపరీతంగా పుంజుకుంది.   దే కార్త్ చింతనని మనం పట్టించుకున్నా లేకపోయినా, దేవుడి ప్రసక్తిని  సైన్స్ నుండి తొలగించకపోతే మన దేశంలో సైన్స్ కుంటినడక నడుస్తుందని, పాశ్చాత్య సమాజాలలో లాగా సమాజాన్ని ఉధ్ధరించగల ప్రబల శక్తిగా రూపుదేలదని నా నమ్మకం. అదే విధంగా అధ్యాత్మిక విషయాలకి వైజ్ఞానిక సంజాయిషీ వెతికే ప్రయత్నం కూడా విఫలం అనిపిస్తుంది. అలాంటి ప్రయత్నం వల్ల అధ్యాత్మికతని దిగజార్చుకోవడం తప్ప మరేమీ ఉండదు. ఎందుకంటే అధ్యాత్మికత స్వతహాగా ఇంద్రియాలకి అతీతమైన తత్వం గురించి మాట్లాడుతుంది.   కనుక అది సైన్స్ పరిధిలోకి రాలేదు. అటు అధ్యాత్మికతని, ఇటు సైన్స్ ని కూడా శుద్ధ రూపాలలో అర్థం చేసుకుంటే, రెండూ మన సమాజంలో లోతుగా వేళ్ళూనుతాయి. వాటి పరస్పర పూరక ప్రభావాల వల్ల భారతీయ జీవనం నిండుగా పుష్పిస్తుంది.

 

చివరి మాట

ఈ వ్యాసం యొక్క మూల వస్తువు అయిన సైన్స్ ఫిక్షన్ నవలికలో జరిగిన సమూలమైన పొరబాటు దేవుడికి సైన్స్ కి లంకె పెట్టాలనుకోవడమేనని నా అభిప్రాయం. పూర్తిగా వైజ్ఞానిక ప్రమాణాల అనుసారం పకడ్బందీగా రాసి వుంటే ఆ కథ మరెంతో రక్తి కట్టి వుండేది. అలాంటి సాహిత్యం వల్ల సమాజంలో సైన్స్ పట్ల సద్భావన కలిగి, అవగాహన పెరిగే అవకాశం ఉంది. అలంటి సాహిత్యం వల్ల సైన్స్ చదువులకి కూడా పోషణ దొరుకుతుంది. దైనిక జీవనంలో సైన్స్ ని విస్తృతంగా సద్వినియోగం చేసుకోగలిగితే దేశంలో శతాబ్దాలుగా తెగని దారిద్ర్యం సన్నగిల్లుతుంది. అందుకే తెలుగులో (అలాగే ఇతర భారతీయ భాషలలో కూడా) సలక్షణమైన సైన్స్ ఫిక్షన్ సాహిత్యాన్ని సృష్టించడం ఒక విధంగా సామాజిక సేవే అవుతుంది. కనుక ఇటు తెలుగు రచయితలు, అటు శాస్త్ర పరిచయం ఉన్న వారు కూడా (అవసరమైతే ఇరు వర్గాల వారు చెయ్యి కలిపి) తెలుగు సాహిత్యంలో సైన్స్ ఫిక్షన్ శాఖని బలపరుస్తారని ఆశ.

 

వికి సౌజన్యంతో ….

11 thoughts on “తెలుగులో సైన్స్ ఫిక్షన్

  1. Very good article and impressed me very much.But recently i read somewhere that there is a good scientific meaning in Ganesh immersion that the plants used for the Ganesh pooja will be usefil to the tanks for good filtration of water by driving the un wanted and harmful insects in the tanks and there by protect from water infections. If it is true the begining of the this tradition may be right ,but the comercial chages developed in the this poojas may covert in to adverse result.I think your comment on Ganesh immersion that it is an assault over the nature was made seeing present referications, but not went deep study over this tradition. However i once again say thanks and wish you to keep it up.— Ramarao.k, from Vizianagaram

  2. చాలా చాలా బాగుంది మీ వ్యాసం. ఆ నవల వ్రాసిన వారే కాదు దానికి బహుమతి ఇచ్చిన వారి దృక్ఫదం కూడా అంతే నను కుంటాను.

    సైన్స్ ఫిక్షన్ వ్రాయాలంటే కఠోర శ్రమ, ముందు తను అర్ధం చేసుకోవాలనే తపన ఉండాలి. ఇది ప్రస్థుత రచయితల్లో లోపించింది.

    మీ వ్యాసం చూసి కనీసం ఒకరిద్దరైనా నడుం బిగిస్తే సంతోషమే.

  3. శ్యామల రావు గారు,
    నిజమే తెలుగులో సైన్స్ సాహిత్యంలో ఉన్న వెలితి ఒక్కరు, ఇద్దరు పూడ్చలేనిది. చాలా పెద్ద ఎత్తున కృషి చెయ్యాల్సిన విషయం.
    ఈ దిశలో గత ఐదు ఆరు ఏళ్లుగా కొంత కృషి చేస్తూ వస్తున్నాను.
    ఇప్పటి దాకా 45 పుస్తకాలు వచ్చాయి. కొన్ని వివరాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి.
    http://scienceintelugu.blogspot.in/

    నాకు ఎప్పుడూ అనిపిస్తుంది… ఓ వంద మంది తెలుగు వాళ్లు కలిసి, తలా ఓ వంద పుస్తకాలు, ప్రతీ సమకాలీన రంగానికి సంబంధించిన పుస్తకాలు… ఇళ్ళు కట్టడం దగ్గర్నుండి, సినిమాలు తీయడం, అంతరిక్షయానం, సాపేక్షతా వాదం… గొప్ప వైవిధ్యం గల నాన్-ఫిక్షన్ పుస్తకాలు తెలుగులో రాసినట్టయితే, ఆ నూరుగురు తెలుగు జాతి రాతని మార్చినవాళ్లు అవుతారేమో!

  4. మురళీకృష్ణ గారు,
    తెలుగులో మంచి సై. ఫై. రాయడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి అభినందనలు.
    మీ రచనలు ఎక్కడ దొరుకుతాయి. పీడిఎఫ్ లు పంపగలరా?
    ధన్యవాదాలు.

  5. మీ వ్యాసం బాగుంది. తెలుగులో ఇంత నిశితమయిన విమ్ర్శలు లేకపోవటం చేత సరయిన విశ్లేషణలు పాఠకులను చేరటం లేదు. మీరు నేను రాసిన సైన్స్ ఫిక్షన్ కథలు చదివితే మీ అభిప్రాయం మారుతుందని నా విశ్వాసం. తెలుగులో వచ్చిన హార్డ్ కోర్, అంటే, అసలు సిసలు సైన్స్ ఫిక్షన్ కథలవి. అవి చదివి, ఇలాగే నొర్మొహమాటంగా విశ్లేషించాలని నా మనవి.

  6. మీరు చెప్పిన విదానం చలాబాగుంది మనస్సుకు హత్తుకునేటట్టు రాశారు . అయితే ప్రజలు అవి నమ్మడానికి సైన్సు గురించి తెలియదు అనుకొవాలా? అంతరిక్షంలొకి రాకెత్ పంపటాని స్రీహరికొట (పేరు గుర్తు లేదు) ప్రధాన అధికారి శ్రీ వెంకటేస్వర స్వామి ద్గ్గరికిపొయి విజయవంతం కావాలని మొక్కుకున్నానని తిరుమల కొండపైన చెప్పినాడు అది టీవీలలొను, పేపర్లలొను, వచ్చింది . మరి దీనికిఏమంటారు. మతాన్ని గాని సమాజంలొని మరేఇతర సమస్యను అర్దంచెసుకొవాలన్నా వర్గాల దగ్గరికి వెల్లాలి (పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం) నేడు మతం ఒక వ్యాపారంగా మారిపొఇంది ఆవ్యాపారంలొ కొట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వమే దానికి పండగలకీ, ఉత్సవాలకీ, గణనీయమైన మొత్తంలొ కర్చు చేస్తుంది ఇదంతా బుద్దిపుర్వకంగానే చెస్తుంది .ఇది ప్రబుత్వం ద్వారాజరిగే పని .ఇక ప్రజలలొ నమ్మకాలు. ఒక నిర్దిష్ట మైన సమాజంలొ ఒక నిర్దిష్టమైన ఆచార వ్యెవహారాలు నమ్మకాలు, ఆ సమాజ అభివ్రుద్దిస్తాయినిపట్టి వుంటాయి .పుర్వం తక్కువకులాల వారిని చాలా హీనంగా చుచెవారు. ఉదా…………… ఊరిలొకివచ్చెటప్పుడు చెప్పులు వేసుకొకుడదు వాళ్ళనీడ గొడలకు తగలకుడదు మొహానికి ముంత కట్టుకొవలి ఇలాగ చెప్పాలంటె ఎనైనా వుంటాయి . ఒక డాక్టరు తక్కువకులాల వారిని చెతితొ తాకడు .ఆ మనిషికి సైన్సు తెలియదు అనుకొవాలా? మొదటిది చుపుకి ఆ మనిషికి ఆచారవ్యెవహారాలు నరనరాన జీర్నించుకపొయి వుంటాయి కనుక ఆ మనిషికి సైన్సు ఎంతతెలిసినా దానినుంచి బైట పడలేడు దానికి స్వలాభం కుడా ఒక కారణం . మన ఇంకొంచం లొతుకు వెళ్ళి పరిసీలిస్తె సమాజంలొ మనుషుల మద్య అసమానతలే కారణంగా కనపడుతుంది . ఒక వ్యెక్తి పరిచ్చలలొ పాసైతె వెట్రుకలు ఇస్తానని ముక్కుకుంటాడు .,మరొక వెక్తి ఉద్వొగము వస్తె ఇస్తానని ముక్కుకుంటాడు ఆ సమస్యలలొ దేవుడి అనిర్వర్యంగా నమ్ముకుంటాడు .సమాజంలొ వ్యెక్తి గత ఆస్తివుండటం వలన ఒకొక్కరివి వ్యెక్తిగత సమస్యలైపొయినాయి యవరివీలును బట్టి వాళ్ళు పరిస్కారాలు వెతుకుంటువుంటారు.

    సైన్సు ను విస్రుతంగా వినియొగించుకొగలిగితె దారిద్యం పొతుందన్నారు ఆస్తి కొద్దిమంది చెతులలొ పొగుపడి వుంది ఎంత వినియొగించుకున్నా అది వాళ్ళకు లాభాలను తెచ్చిపెడుతుంది .

  7. తెలుగులో సైన్స్ పిక్షన్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. బహుశః నా అభిప్రాయం తప్పు కావచ్చును; అలా అయితే చాలా సంతోషిస్తాను కూడా. మీరన్నట్లు తెలుగులో వస్తున్న సైన్స్ పిక్షన్ కథనాలు హాస్యాస్పదంగా ఉంటున్నాయి.

    తెలుగులో సైన్స్ రెపోర్టింగ్ చాలా ప్రాథమికావస్థలో ఉండటం నా చిన్నప్పటినుండీ చూస్తున్నాను.

    సైన్స్ అప్డేటింగ్ మరియు సైన్స్ పుస్తకాల రచనలు రెండూ యెక్కడివేసిన గొంగళీ అక్కడే అన్నట్లుగా ఉన్న భాషలో సైన్స్ పిక్షన్ పరిస్థితి యింతకంటే మెరుగ్గా ఉంటుందని అనుకోవటం కూడా అత్యాశయేనేమో. ఒకరకంగా తెలుగు రచయితలందరూ దీనికి బాధ్యులే.

    చాలా ఆందోళనకలిగించే మరొక అంశం బాలల కొరకు వస్తున్న సైన్స్ రంగం రచనలు దాదాపు శూన్యం.

    ఇప్పటికైనా సమర్థులైన రచయితలు పూనుకోవలసి ఉంది.

    ఇతర భారతీయ భాషల్లో పరిస్థితి మీద నాకు అవగాహన లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *