రచన: కవుటూరు ప్రసాద్

 

 

తెలుగువాఙ్మయంలో శతకసాహిత్యానికి ఒక ప్రత్యేకస్థానం ఉన్నది.  శతకం అంటే నూరు పద్యముల సమాహారం.  కొందరు కవులు తమతమ శతకాల్లో శతాధికంగా కూడా పద్యాలు రచించారు.  ముక్తకం, మకుటం అనేవి శతకం యొక్క ప్రధాన లక్షణాలు.  ‘ముక్తకం’ అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రభావ ప్రతిపత్తితో విరాజిల్లటం.  ‘మకుటం’ అంటే కిరీటం.  ప్రభువుకు మకుటం ఎంత ప్రధానమో, శతకానికీ మకుటం అనేది అంత ప్రధానం.  శతకంలోని ప్రతి పద్యం చివరనా ఈ మకుటం వస్తుంటుంది.  కొన్ని శతకాల్లో ద్విపాద మకుటాలు సైతం ఉన్నాయి.  శతకసాహిత్యంలో ఏనుగులక్ష్మణకవి రచించిన (భర్తృహరి సుభాషితములకు అనువాదం) శతకానికి మకుటం లేకపోవడం ఒక ప్రత్యేకలక్షణంగా పేర్కొనవచ్చు.

 

శతక కవులు తమ పద్యాల ద్వారా సమాజానికి నీతిని, రీతిని బోధించారు.  మానవజీతంలో వివిధస్థాయిల వారికి వివిధరకాల శతకాలు వారివారి మానసికస్థాయిని వికసింపజేయడానికి ఎంతగానో తోడ్పడతాయి అనటంలో అతిశయోక్తి లేదు.  బాల్య యౌవన కౌమార వార్ధక్యములు, భక్తి విజ్ఞాన వైరాగ్య భావములకు నిలయములని పెద్దలమాట (క్రమాలంకారము).

 

వేమన, సుమతి, భాస్కర, దాశరథి, శ్రీకాళహస్తీశ్వర, ఆంధ్రనాయక, నరసింహ, కుమార, కుమారీ శతకములు తెలుగుసాహిత్యంలో ప్రత్యేకస్థానమును సంతరించుకున్నాయి.  పైన పేర్కొన్నవే కాక మరెన్నో శతకాలు విశేష ప్రజాదరణ పొందినవి కూడా ఉన్నాయి.  తల్లి తన బిడ్డకు మమతానురాగాలను రంగరించి గోరుముద్దలు తినిపించినట్లు, చిరుప్రాయంలోని పిల్లలకు శతకకవులు వేమన, సుమతి, కుమార, కుమారీ ఇత్యాది శతకపద్యాల ద్వారా బంగారుబాట వేశారు.  ఉదాహరణకు వేమనశతకం తీసుకుంటే, పద్యంలోని మొదటి రెండు పాదములలో విషయవివరణ చేసి, మూడవపాదాన్ని ఒక ‘జర్కు ‘ తో ముగించటం దీని ప్రత్యేకత.  వేమనగారి ఆటవెలదులలో మూడవపాదములన్నీ సూక్తులు, లోకోక్తులు, నగ్నసత్యాలతో ముగుస్తాయి.  అక్షరాభ్యాసానికి ముందే సుమతి, వేమనాది సూక్తినిధులను పిల్లలకు వంటపట్టించవచ్చును.  అట్లు చేయుట ద్వారా పిల్లల మనోవికాసానికి దోహదం చేసినవారమవటమే కాక, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దినవారం అవుతాము.  సద్భావన, సదాచారం, పెద్దలయెడ గౌరవం ఇత్యాది విషయాలు చిన్నారుల హృదయాల్లో పాదుకొల్పినవారం అవుతాము.

 

‘స్థాలీపులాకన్యాయం’గా ఒక్కొక్క శతకంలో ఒకటి, రెండు పద్యాలను గ్రహించి విశ్లేషిస్తాను.  మొదటగా “వేమన శతకం” బాలలకు ఏవిధంగా ఉపకరిస్తుందో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తాను.

 

                        చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు

కొంచెమైన నదియు కొదువ కాదు

విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?

విశ్వదాభిరామ! వినుర వేమ!

 

‘ఏ పనిచేసినా చిత్తశుద్ధితో చేయాలి.  ఆ పని ఎంతటిది అనేది ముఖ్యం కాదు ‘ అనే సత్యాన్ని పెద్ద మఱ్ఱిచెట్టునకు విత్తనం ఎంత చిన్నదిగా ఉంటుంది అనే చక్కని ఉపమానంతో చెప్పారు వేమన!  మనస్ఫూర్తిగా చేసిన ఎంత చిన్నపని అయినా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనే సందేశం ఈ పద్యంలో ఉంది.

 

మరొక పద్యంలో

 

                            అల్పు డెపుడు పల్కు నాడంబరముగాను

సజ్జనుండు పల్కు చల్లగాను

కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?

విశ్వదాభిరామ! వినుర వేమ!                    అంటాడు.

 

అల్పునికి, సజ్జనునికి ఉన్న అంతరాన్ని కంచు కనకాలతో పోల్చి తెలుగువారి హృదయాలను చూరగొన్న వేమనకవీంద్రుడు చిరస్మరణీయుడు.  వారి పద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం.  ఇటువంటి సూక్తులు, హితోక్తులు పిల్లల మనసుల్లో చెరగని ముద్ర వేసి, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి అనడంలో సందేహం లేదు.

 

                             శ్రీరాముని దయ చేతను

నారూఢిగ సకలజనులు నౌరా యనగా

ధారాళమైన నీతులు

నోరూరగ చవులుబుట్ట నుడివెద సుమతీ!

 

అని “సుమతీ శతకం” ప్రారంభించిన బద్దెనకవి నీతిపద్యాలు వ్రాస్తానని ప్రతిన చేస్తూ, శ్రీరామచంద్రుని ఇష్టదేవతాస్తుతిగా పై పద్యాన్ని పేర్కొన్నాడు.  ఒకప్పుడు ఈ పద్యాన్ని పిల్లల నోట విని పెద్దలు ఎంతో మురిసిపోయేవారు.

 

అట్లే, ఎటువంటి ఊరు నివాసయోగ్యం, ఎటువంటిది కాదు అనే విషయం అలతి అలతి పదాలతో చెప్పిన తీరు అనితరసాధ్యమేమో అనిపిస్తుంది.

 

                            అప్పిచ్చువాడు, వైద్యుడు,

నెప్పుడు నెడతెగక పాఱు  యేరును, ద్విజుడున్

చొప్పడిన యూర నుండుము

చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ!

 

 

అదేవిధంగా, అపకారికి కూడా ఉపకారం చెయ్యాలనీ, తాను బాధపడక ఇతరులను బాధపెట్టక మనుగడ సాగించాలనీ, బంగారు సింహాసనంపై కుక్కను కూర్చోబెడితే అది వెనుకటి గుణాన్ని మానలేదనీ సార్వజనీనమైన సత్యాలను తెలుగువారికి ఎంతో హృద్యంగా అందించారు బద్దెనకవీశ్వరులు.

 

నేటి విద్యావిధానంలో నైతిక, సద్భావనాంశాలకు అంతగా ప్రాధాన్యత లేదని విజ్ఞుల అభిప్రాయం.  విద్యార్థ్జుల్లో పై రెండు అంశాలను పాదుకొల్పాలంటే శతకసాహిత్యాన్ని పరిచయం చేయటం అత్యంతావశ్యకం.  తత్సంబంధమైన విషయవిశ్లేషణకు “భాస్కర శతకం” ఎన్నదగింది.  ఒకింత ఏకాగ్రతతో సాధన చేస్తే పద్యం స్వంతం కాకమానదు.  నిత్యవ్యవహారంలో జరిగే విషయాలకు ఈ శతకం ఒక దర్పణం.  ఉదాహరణకు బలవంతుడు కారణాంతరాల వలన బలహీనుడైతే, మిత్రుడుగా ఉన్నవాడే శత్రువుగా మారిపోతాడని చెప్తూ, అగ్ని పరిపూర్ణుడై ఉన్నప్పుడు వాయువు అతనితో స్నేహం చేస్తాడనీ, అదే అగ్ని సూక్ష్మదీపం రూపంలో ఉన్నప్పుడు శత్రువుగా మారి ఆర్పివేస్తాడనీ చక్కని దృష్టాంతంతో పండిత పామర జనరంజకంగా రచించిన మారద వెంకయ్య ధన్యజీవి.  ఈ క్రింది పద్యం చూడండి.

 

                          బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడుగాని, యాతడే

బలము తొలంగెనేని తన పాలిటి శత్రు వదెట్లు పూర్ణుడై

జ్వలనుడు కాన గాల్చు తరి సఖ్యము జూపును వాయుదేవు, డా

బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా!

 

సామాజికాంశాల విశ్లేషణకు ఇంతకంటే మరేంకావాలి!  ఇటువంటి సంగతులను వంటపట్టించుకున్నవాడు ఉత్తమపౌరుడు కాకుండా ఉంటాడా?

 

‘చదువు – సంస్కారం’ అనే పదాలు నిత్యవ్యవహారంలో వాడుకలో ఉన్నవే!  ఐతే, చదువుతో పాటు సంస్కారం ఉన్నప్పుడే వ్యక్తి రాణిస్తాడు.  సంస్కారంలేని చదువు నిరర్థకమని చెప్పే ఈ క్రింది పద్యం చూడండి.

 

                          చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న, నా

చదువు నిరర్థకంబు, గుణసంయుతు లెవ్వరు మెచ్చరెచ్చటన్

బదునుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం

పొదవెడు నుప్పు లేక రుచి పుట్టగ నేర్చునటయ్య భాస్కరా!

 

పై పద్యంలో ‘రసజ్ఞత ‘ అనే పదానికి విస్తృతార్థం ఉన్నది.  సామాజికస్పృహకు, మనోవికాసానికి ఇది ఒక చక్కని తార్కాణం.  అట్లే, దక్షుడు లేని ఇల్లు ఏవిధంగా ఉంటుందో, పండితులైనవారు దిగువందగనుండగ ఒక అల్పుడు గొప్ప పీఠంపై కూర్చుంటే ఆ పండితులకేమి లోటు కలుగుతుంది? అనే విషయాలను చక్కని దృష్టాంతాలతో వివరించాడు కవి.  ఇటువంటి పద్యాలను ధారణ చేయించడం ద్వారా విద్యార్థుల్లో సమాజం పట్ల అవగాహన కలిగించవచ్చును.  వారి పఠనాసజ్తికి దోహదం కలిగించినవారమౌతాము.

 

దశరథకుమారుడైన శ్రీరామచంద్రుని స్తుతిస్తూ, రామదాసుగా గణుతికెక్కిన కంచర్లగోపన్న రచించిన “దాశరథీ శతకం” భక్తిరసప్రధాన శతకాలలో పేరెన్నిక గన్నది.  ఇది ఒకింత ప్రొఢమైనదే అయినా, ధారాశుద్ధి కలిగి పద్యం కమ్మచ్చులో తీసినట్లు ధారాళంగా సాగిపోతుంది.  సందర్భానుసారంగా ఈ శతకపద్యముల ద్వారా పౌరాణికపాత్రలను, ఆ పాత్రల వైశిష్ట్యాన్ని పరిచయం చేయవచ్చు.  ఉదాహరణకు…….

 

                    డాసిన చుట్టమా శబరి? దాని దయామతి నేలినావు! నీ

దాసుని దాసుడా గుహుడు? తావక దాస్యమొసంగినావు! నే

జేసిన పాపమా! వినుతి చేసిన గావవు! కావుమయ్య! నీ

దాసులలోన నేనొకడ! దాశరథీ! కరుణాపయోనిధీ!

 

పై పద్యం ద్వారా శ్రీరాముణ్ణి, తాదాత్మ్యంతో ఆ పురాణపురుషునికి తాను రుచి చూసిన ఎంగిలిపండ్లను తినిపించిన శబరి పాత్రను, దాశరథిని సీతా లక్ష్మణ సమేతంగా తన నావలో నది ఆవలి ఒడ్డుకు చేర్చిన గుహుని పాత్రను పరిచయం చేయవచ్చు.  తద్వారా పౌరాణికాంశాల ప్రస్తావనకు అవకాశం కలిగి, విద్యార్థులకు పురాణవిషయాల పట్ల ఆసక్తిని కలిగించవచ్చు.

 

అట్లే, సిరిసంపదలు ఉన్నప్పుడే దానధర్మాలు చెయ్యాలనీ, అవి తొలగిపోయిన పిదప చింతించినా ప్రయోజనం ఉండదనీ చక్కని ఉపమానంతో చెప్పిన ఈ క్రింది పద్యం అన్ని వయసులవారికీ, అన్ని కాలాల్లోనూ ఆదర్శవంతమైనది.

 

                    సిరిగలనాడు మైమరచి, చిక్కిననాడు తలంచి పుణ్యముల్

పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె?  గాలి చిచ్చుపై

కెరలినవేళ, దప్పిగొని కీడ్పడువేళ జలంబు గోరి త

త్తరమున ద్రవ్వినం గలదె! దాశరథీ! కరుణాపయోనిధీ!

 

ముందుగానే నీటి కొరకు బావిని త్రవ్వవలెనేగాని, మంటలకు గాలి తోడై గృహాలను తగులబెడుతున్నప్పుడు, దాహంతో తపిస్తున్న సమయంలో బావిని త్రవ్విన ఉపయోగమేమి కలుగుతుంది? అనే చక్కని లోకవ్యవహారాన్ని జోడించి ఎంతో మనోహరంగా చెప్పాడు.

 

ఈ శతకంలో మరొక విశేషం కూడా ఉన్నది.  సాధారణంగా శతకాలు ఏదో ఒక ఛందోరీతిని గ్రహించి మాత్రమే రచిస్తారు.  కాని, ఈ శతకకర్త ‘ఉత్పలమాల, చంపకమాల ‘ ఛందస్సులను గ్రహించి శతకాన్ని రచించారు.  అందుచేతనే, అవసరాన్ని బట్టి ‘భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ’ అని, మరికొన్నిచోట్ల ‘దాశరథీ కరుణాపయోనిధీ’ అనీ వ్రాయడం జరిగింది.  ఏమైనా, ఈ శతకానికి మకుటం ‘దాశరథీ కరుణాపయోనిధీ’ అని మాత్రమే చెప్పవలసివుంటుంది.

 

శతకసాహిత్యంలో మరొక ఆణిముత్యం ధూర్జటి రచించిన “శ్రీకాళహస్తీశ్వర శతకం”.  రాజుల ఆస్థానాల్లో ఉంటూనే, వారి సేవను నిర్మొగమాటంగా నిరసించిన ధీశాలి ఇతడు.  రాజుల సేవ నరకప్రాయమని చాటిచెప్పాడు.  ఈ క్రింది పద్యం చూడండి.

 

                    రాజుల్మత్తులు, వారి సేవ నరకప్రాయంబు, వారిచ్చు నం

బోజాక్షీ చతురంతయాన తురగీ భూషాదు లాత్మవ్యథా

బీజంబుల్, తదపేక్ష చాలు, పరితృప్తిం బొదితిన్, జ్ఞానల

క్ష్మీజాగ్రత్త్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా!

 

‘నిరంకుశః కవయః ‘  అనేది ధూర్జటికి అక్షరాలా వర్తిస్తుంది.

 

ఆయన పద్యాల్లో వైరాగ్యదృష్టి సైతం గోచరిస్తుంది.  జగత్తు మిథ్య అని తెలిసికూడా మానవుడు మోహార్ణవంలో మునిగితేలుతున్నాడనే వైరాగ్య వేదాంత విషయాలను ఎంతో చక్కగా ఈ క్రింది పద్యంలో తేటతెల్లం చేశాడు.

 

                    అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ సదా

కాంతల్పుత్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు తా

చింతాకంతయు చింత నిలపడు కదా! శ్రీకాళహస్తీశ్వరా!

 

పుత్రులు పుట్టలేదని బాధపడటం అర్థరహితమనీ, ధృతరాష్ట్రుడు తన నూర్గురు కొడుకులతో ఏ సద్గతి పొందాడనీ హితోపదేశం చేశాడు.  ఈవిధంగా సామాజిక దృక్పథం కూడా శతకంలో వ్యక్తపరచిన కవీంద్రుడు ధూర్జటి.  ఈ శతకం శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసిన పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ చెప్పిన ఉదాత్త శతకరాజం.

 

“ఆంధ్రనాయక శతకం” శతకసాహిత్యంలో మరొక ఆణిముత్యం.  ఈ శతక రచన ‘చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ! హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!’ అనే ద్విపాద మకుటంతో సాగింది.  ఈ శతకానికి సీసపద్యాన్ని ఎన్నుకున్నాడు రచయిత కాసుల పురుషోత్తమకవి.  సీసపద్యరచనలో విషయ వివరణకు విస్తారమైన అవకాశం ఉంటుంది.  నిందాస్తుతి అలంకారంతో విరాజిల్లే ఈ పద్యం తిలకించండి.

 

              పక్షంబు గలదండ్రు పాండుపుత్రులయందు, పాండవుల్ పడినట్టి పాటులేమి?

పూర్వజన్మమునందు పూజించె గజమండ్రు, గజరాజు పొందిన గాసి యేమి?

యల కుచేలునకు బాల్యస్నేహితుడవండ్రు, నెఱి కుచేలుడు వడ్డ నెవ్వలేమి?

ప్రహ్లాదు డాజన్మ భక్తియుక్తుండండ్రు, ప్రహ్లాదు డొందిన బాధలేమి?

 

యెంత యాలస్యముగ వారి నేలినాడ, విట్టిదే నీ దయారసం బెంచిచూడ

చిత్రచిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ! హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!

 

సామాన్యంగా బాహ్యార్థం శ్రీమహావిష్ణువును నిందించినట్లుగా కనిపిస్తుంది.  ‘పాండవులు, గజరాజు, కుచేలుడు, ప్రహ్లాదుడు వీరంతా నీ భక్తులే కదా!  అయినా వారు ఎన్ని ఇక్కట్లు పడ్డారు? ఎంత ఆలస్యంగా వారిని కాపాడావు?  ఇదేనా వారి యెడ నీకు గల దయ?’ అని నిందించినట్లు వాచ్యార్థం.  కాని, అంతర్లీనంగా పైన ఉదహరించిన నీ భక్తులంతా నీ దయారసాస్వాదనము చేతనే తరించారు కదా! అనే స్తుతి కనిపిస్తుంది.

 

              ఆలు నిర్వాహకురాలు భూదేవియై యఖిలభారకుడన్న నాఖ్య దెచ్చె!

నిష్టసంపన్నురా లిందిర భార్యయై కామితార్థదుడన్న ఘనత దెచ్చె!

కమలగర్భుడు సృష్టికర్త తనూజుడై బహుకుటుంబకుడన్న బలిమి దెచ్చె!

కలుషవిధ్వంసిని గంగ కుమారియై పతితపావనుడన్న ప్రతిభ దెచ్చె!

 

ఆలుబిడ్డలు దెచ్చు ప్రఖ్యాతిగాని, మొదటినుండియు నీవు దామోదరుడవె!

చిత్రచిత్ర ప్రభావ! దాక్షిణ్యభావ! హత విమతజీవ! శ్రీకాకుళాంధ్రదేవ!

 

‘శ్రీకాకుళాంధ్రదేవా!  నీకు అఖిలభారకుడన్న పేరు వచ్చినా, కామితార్థదుడన్న ఘనత కలిగినా, బహుకుటుంబీకుడన్న బలిమి వచ్చినా, పతితపావనుడన్న ప్రతిభ కలిగినా, నీ భార్యాపిల్లలు తెచ్చిన ప్రఖ్యాతియేగాని, మొదటినుండీ నీవు దామోదరుడవే సుమా!’ అని వాచ్యార్థంలో నింద వ్యక్తమౌతుంది.  కాని, అంతర్లీనంగా భూదేవిని నిర్వాహకురాలు అన్నా, ఇందిరను ఇష్టసంపన్నురాలన్నా, బ్రహ్మను గొప్పవాడన్నా, గంగాదేవిని కలుషవిధ్వంసిని అన్నా వారందరి గొప్పతనానికి నీవే కదా మూలకారకుడివి అనే స్తుతి ద్యోతకమౌతుంది.  దీనినే నిందాస్తుతి లేక వ్యాజస్తుతి అలంకారం అంటారు.  పైన చెప్పినట్లు ఈ శతకపద్యాల వలన ఎన్నో పౌరాణికగాథలు, పురాణపాత్రలు మనకు సాక్షాత్కరిస్తాయి.

 

శేషప్పకవి విరచించిన “నరసింహ శతకము” శతకవాఙ్మయములో పేరెన్నికగన్న శతకం.  ‘భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!’ అనే ద్విపాద మకుటంతో విరాజిల్లింది ఈ శతకరాజం.  ‘శ్రీధర్మపురనివాస!’ అంటే ‘సంపత్కరమైన పురమునందు నివసించువాడా’ అనీ, ‘ధర్మపురిలో వసించువాడా’ అనీ అర్థం చెప్పవచ్చును.  కరీం నగరం జిల్లాలోని ధర్మపురి క్షేత్రంలో వెలసిన శ్రీ నారసింహుని స్తుతిపరంగా సాగుతుంది ఈ శతకం.  ఈ క్రింది పద్యం చూడండి.

 

                         గార్ధభంబున కేల కస్తూరితిలకంబు? మర్కటంబున కేల మలయజంబు?

శార్దూలమున కేల శర్కరాపూపంబు? సూకరంబున కేల చూతఫలము?

మార్జాలమున కేల మల్లెపువ్వుల బంతి? గుడ్లగూబల కేల కుండలములు?

మహిషంబు కేల నిర్మలమైన వస్త్రముల్? బకసంతతికి నేల పంజరంబు?

ద్రోహచింతన జేసెడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామమంత్రమేల?

భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర!

 

 

‘ఓ స్వామీ! గాడిదకు కస్తూరిబొట్టు, కోతికి గంధము, బెబ్బులికి చక్కెరపిండివంటలు, పందికి మామిడిపండు, పిల్లికి మల్లెపూలచెండు, గుడ్లగూబలకు చెవిపోగులు, దున్నపోతుకు మంచి వస్త్రములు, కొంగలకు పంజరము ఏవిధంగా అవసరం లేదో, చెడు తలంపులు చేసేవానికి మధురమైనట్టి నీ నామమంత్రము అవసరం లేదు ‘ అనే ఆధ్యాత్మికతత్త్వాన్ని ప్రబోధిస్తున్నాడు కవి.

 

ఈ శతకంలో వైరాగ్య, సామాజిక విషయాలను సైతం ప్రస్తావించాడు కవి.  అందునల్ల, ఈ శతకపద్యములు అన్నివయసులవారికి అవశ్యం పఠనీయం.

 

 

                     తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంట రాదు

లక్షాధికారైన లవణమన్నమెగాని, మెఱుగుబంగారంబు మ్రింగబోడు

విత్త మార్జన జేసి విఱ్ఱవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కుడువబోడు

పొందుగా మరుగైన భూమిలోపల బెట్టి, దానధర్మము లేక దాచిదాచి

 

తుదకు దొంగల కిత్తురో! దొరల కవునొ!

తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు!

భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస!

దుష్టసంహార! నరసింహ! దురితదూర!

 

పై పద్యములో చెప్పబడినవన్నీ నగ్నసత్యాలు.  మానవుని నాలుగు దశల్లోని చివరి రెండు దశలైన ‘కౌమార, వార్ధకము ‘ ల వైరాగ్య, భావములకు చెందినవి.  ఇట్టి పద్యాల్లోని సారాంశం తెలుసుకున్నవాడు సంసారబంధాల వ్యామోహము నుండి బైటపడి, ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతాడు.

 

పక్కి అప్పలనర్సయ్యకవి రచించిన “కుమార శతకము”, వెంకటనరసింహకవి వ్రాసిన “కుమారీ శతకము” శతకసాహిత్యములో బాలబాలికలకు ఎంతో ఉపయుక్తమయ్యేవని ఆ, యా శతకాల మకుటాలు చూస్తేనే తేటతెల్లమౌతుంది.  ఈ ఇద్దరు కవులూ తమ శతకాలను సుమతీశతకకర్త బద్దెన వలెనే కందపద్యాల్లో వ్రాయటం విశేషం.  బాలబాలికల మనోవికాసానికి వేమన, సుమతీ శతకాల వలె కుమార, కుమారీ శతకాలు ఎంతగానో తోడ్పడతాయి.

 

మచ్చునకు ఈ క్రింది పద్యం చూడండి.

 

జారులతో, చోరులతో,

క్రూరులతో నెపుడు పొత్తు గోరక మది స

త్పూరుష పదాంబుజాతా

ధారుడవై బ్రతుకు! కీర్తి తనరు కుమారా!

 

చెడుబుద్ధి కలవారితోను, దొంగలతోను, కఠినులతోను ఏ కాలమందైననూ స్నేహం చేయవద్దు.  ఎప్పుడూ సజ్జనుల పాదసేవయే ముఖ్యముగా తలచి జీవితం సాగించిన కీర్తి వచ్చును.

 

                                   సద్గోష్ఠి సిరియు నొసగును,

సద్గోష్ఠియె కీర్తి బెంచు, సంతుష్టియు నా

సద్గోష్ఠియె యొనగూర్చును,

సద్గోష్ఠియె పాపములను జంపు కుమారా!

 

సత్పురుషులతో కూడిన సభలలో ఉన్నయెడల కీర్తిప్రతిష్ఠలు కలుగును.  వారితో జరిపిన సంభాషణలు తృప్తి నిచ్చును.  సంపదల నిచ్చును.  పాపములు తొలగించును.

 

పై రెండు పద్యములలోని హితోక్తులు పిల్లల హృదయాలను ప్రభావితం చేసి, వారిని ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దుతాయి అనుట అక్షరసత్యం.

 

వెంకటనరసింహకవి రచించిన “కుమారీ శతకం” కూడా ఈ కోవకు చెందినదే!  ‘కుమారీ’ అన్న మకుటంతో ఉన్న ఈ శతకం ముఖ్యంగా యువతులను ఉద్దేశించివ్రాయబడినది.  అప్పుడే పెళ్ళాడిన నవవధువులు అత్తవారింట భర్తతో, అత్తమామలతో, బావలతో, మరదులతో, ఆడబిడ్డలతో ఎలా ప్రవర్తించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఇరుగుపొరుగువారితో ఎలా మసలుకోవాలో, సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో చక్కని హితోక్తులతో బోధిస్తుంది ఈ శతకం.  దీనిని ఆంధ్రుల ప్రతి ఆడపడుచు చదివి, వారివారి సంసారజీవితాలను ఆనందమయం చేసుకొనవచ్చును.

 

ఈ శతకంలోని రెండు పద్యాలను ఈ సందర్భంగా ఉదహరిస్తాను.

 

                                తన బావల పిల్లల యెడ,

తన మరదుల పిల్లలందు, తన పిల్లల కం

టెను మక్కువ యుండవలెన్!

వనితల కటులైన వన్నె వచ్చు కుమారీ!

 

తన బావగారి బిడ్డలయందు, తన మరదుల పిల్లలయందు తన కన్నబిడ్డల కంటె ఎక్కువ ప్రేమ కలిగియుండిన స్త్రీ అధిక కీర్తివంతురాలై విరాజిల్లును.

 

                                 పతి కత్తకు మామకు స

మ్మతిగాని ప్రయోజనంబు మానగవలయున్

హిత మాచరింపవలయును

బ్రతుకున కొక వంక లేక పరగు కుమారీ!

 

భర్తకు, అత్తమామలకు ఇష్టంలేని పనులు మానవలెను.  వారికి మంచి కలిగించు పనులు చేయవలెను.  ప్రవర్తనయందు లోపము లేకుండా నడుచుకోవలెను.

 

ఈ శతకంలోని కొన్ని పద్యాలు ఆధునిక సమాజ మనబడే నేటికాలములో అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు!  కాని, వాస్తవంగా సంసారజీవితం సుఖశాంతులతో సాగాలంటే ఈ శతకంలోని అంశాలు ఆచరణయోగ్యాలేనని చెప్పవచ్చును.

 

ఏనుగు లక్ష్మణకవి తెలుగులోకి అనువదించిన భర్తృహరి సుభాషితములు శతక వాఙ్మయములో కరదీపికలవంటివి.  భర్తృహరి సుభాషితాలను మరికొందరు కవులు అనువదించినప్పటికీ, వాటికి ఈ పద్యాలకు వచ్చిన ప్రశస్తి రాలేదు.  ఉదాహరణకు ఈ క్రింది పద్యం తిలకించండి.

 

ఉరుతర పర్వతాగ్రమున నుండి దృఢంబగు ఱాతి మీద స

త్వరముగ త్రెళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, గాలిమే

పరిదొర వాత కేలిడుట బాగు, హుతాశన మధ్యపాతమున్

వరమగు, చారుశీల గుణవర్జన మర్హముకాదు చూడగన్

 

‘సద్గుణాలను విడిచిపెట్టటం కన్న ప్రాణత్యాగం చేయుట మిన్న ‘ అంటాడు ఈ కవి.  గుణవర్జన కంటే మిక్కిలి ఎత్తైన పర్వతాగ్రము నుండి దూకి చనిపోవడం మంచిది.  అట్లు కానిచో, సర్పరాజు నోటిలో చేయి పెట్టి కాటువడి మరణించడం మేలు.  అదీకాదంటే, అగ్నిలో దూకి తనువు చాలించవచ్చు అంటాడు.  దీనినిబట్టి సద్గుణాలకు ఎంత ప్రాధాన్యం ఉన్నదో వ్యక్తమౌతున్నది.

 

అట్లే, వివేకమును కోల్పోయినవారు ఏవిధంగా పతనం చెందుతారో ఈ క్రింది పద్యంలో మనోహరంగా చెప్పాడు లక్ష్మణకవి.

 

ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు

శ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి య

స్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ జేరె గం

గా కూలంకష! పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్

 

‘పవిత్రమైన గంగానది ఆకాశము నుండి శివుని శిరస్సు పైకి, అక్కడి నుండి హిమాలయం మీదికి, పవిత్రమైన హిమవన్నగము నుండి భూలోకానికి, అక్కడినుండి మహాసముద్రం లోనికి, ఆ పయోధి నుండి పాతాళలోకానికీ క్రమంగా పతనం చెందుతూ పోయినట్లు, వివేకభ్రష్టుడైనవాడు కూడా అనేకవిధాలుగా పతనం అవుతాడు ‘ అని ఎంతో అందంగా చెప్పిన లక్ష్మణకవి ఆంధ్రులకు ఆరాధ్య కవివర్యుడు.

 

ఇక్కడ ఒక అతి ముఖ్యమైన విషయం చెప్పాలి.  11వ శతాబ్దములో “ఆంధ్రమహాభారతము” రచన నారంభించి తెలుగులో “ఆదికవి” గా వెలుగొందిన నన్నయభట్టారకులవారే ఈ శతకప్రక్రియకు మార్గదర్శకులని సాహితీవిమర్శకుల అభిప్రాయం.  నన్నయగారి “మహాభారతం – ఆదిపర్వం (ప్రథమాశ్వాసం)” లో తక్షకుని వెంబడించి పట్టుకోవడానికి ఉదంకుడు నాగలోకం చేరి నాలుగు పద్యాలలో నాగరాజులను స్తుతిస్తాడు.  ఈ నాలుగు పద్యాల చివరన ‘మాకు ప్రసన్నుడయ్యెడున్ ‘ అనే పదాలున్నాయి.  తర్వాతికాలములో పలువురు కవులచేత వ్రాయబడిన సమాసమకుటం గల శతకపద్యాలకు ఈ నాలుగుపద్యాలే మార్గదర్శకాలైనవని విజ్ఞులు చెప్తారు.  ఆ నాలుగు పద్యాలు ఇవి:

 

1. బహువన పాదపాబ్ధి………………… మాకు ప్రసన్నుడయ్యెడున్

 

 

2. అరిది తపోవిభూతి………………… మాకు ప్రసన్నుడయ్యెడున్

 

3. దేవ మనుష్య లోకముల……………. మాకు ప్రసన్నుడయ్యెడున్

 

4. గోత్ర మహా మహీధర……………… మాకు ప్రసన్నుడయ్యెడున్

 

 

ఈ వ్యాసములో పైన పేర్కొన్న శతకాలే కాక, మరెన్నో శతకాలు తెలుగుసాహిత్య చరిత్రలో విరాజిల్లి, తెలుగుజాతికి రీతిని, నీతిని ఉద్బోధించాయి.  అది తెలుగువారి అదృష్టం.

 

ఈమధ్య నాకు(వ్యాస రచయితకు) లభించిన ‘లొల్ల సుబ్బరామయ్య ‘ అనే కవీంద్రుడు వ్రాసిన “శ్రీరామచంద్రప్రభు శతకము” భక్తిభావ సంభరితమై, చమత్కారములతో అలరారుతూ ఎంతో మనోహరముగా ఉన్నది.  మచ్చునకు వారి పద్యం ఒకటి ఉదహరిస్తాను.

 

                           పొలతుల్ కొందరు సంతుకై వగచి రేపుల్ మాపు లర్చింపగా

కలుగంజేయ దలంప విప్పటికి! సంతానాష్టకంబయ్యె చాల్

వలదో మొఱ్ఱో యటన్న నింకొకటి సంప్రాప్తంబు గావింతువా!

చలమా? నాదగు ఖర్మమా? ఇనకులేశా! రామచంద్రప్రభూ!

 

‘హే రామచంద్రా!  కొందరు సంతానముకై ఎన్ని నోములు నోచినా వారికి సంతానప్రాప్తి కలిగించవు.  నాకు ఇప్పటికి 8 మంది సంతానము.  ఇంక చాలు స్వామీ! అని మొర పెట్టుకున్నా ఇంకొకటి సంప్రాప్తం కావిస్తావా! ఇది నీ చపలత్వమా? నా ఖర్మమా?’ అని చమత్కారంగా, ధారాశుద్ధిగా చెప్పిన కవి అభినందనీయుడు.

 

ఈ సందర్భంగా నేను (ఈ వ్యాస రచయిత కవుటూరు ప్రసాద్) రచించిన “లోకాలోకనం” అనే శతకంలోని రెండు పద్యాలను ఉదహరిస్తాను.

 

                        ఆటపాటలైన యన్నపానములైన

చదువుసంధ్యలైన జగడమైన

హద్దు మీరకున్న హాయిని గూర్చురా!

మాటలోని మర్మ మరయుమయ్య!

 

అర్థము సుబోధకము.

 

                         ఆలి మాటమీద నత్యాదరము సూపి

తల్లి నింటినుండి  తరిమివేయ

నీవు కన్నవారు నిన్నాదరింతురా?

మాటలోని మర్మ మరయుమయ్య!

 

‘దీని భావమేమి తిరుమలేశ ‘ అనే మకుటంతో వచ్చిన శతక స్ఫూర్తితో ‘తెలుపు మెవరు వారు తెలుగుబాల ‘ అనే మకుటంతో “బాలవికాస శతకం” అనే మరో శతకాన్ని రచించాను.  ఈ శతకరచన ఉద్దేశ్యం బాలబాలికలకు జిజ్ఞాస కలిగించాలనే ఆకాంక్ష.  పద్యంలోని మూడు పాదాలలో కొన్ని సూచనలు చేసి, నాల్గవపాదంలో వారెవరో తెలుపవలసిందిగా విద్యార్థులను ప్రశ్నించటం దీని ప్రత్యేకత.  ఇందులోని పద్యాలను ‘ప్రాతఃస్మరణీయులు, చిరస్మరణీయులు, ఆరాధ్యులు, శాస్త్రవేత్తలు, అసామాన్యులు, అనితరసాధ్యులు ‘ అని 6 విభాగములు చేశాను.  వాటిలోని రెండు పద్యాలను ఉటంకించి, ఈ వ్యాసమును ముగిస్తాను.

 

                        భక్తిపరవశమున భద్రాచలంబున

నాలయంబు గట్టి నతులితముగ

రామవిభుని పేర రచియించె శతకంబు

తెలుపు మెవరు వారు తెలుగుబాల!             (జవాబు: కంచెర్లగోపన్న)

 

 

                        మట్టిబొమ్మయందు మనసు లగ్నము చేసి

విద్యలన్ని నేర్చె విబుధుడొకడు

మనసు కలిగియున్న మార్గంబులెన్నియో!

తెలుపు మెవరు వారు తెలుగుబాల!             (జవాబు: ఏకలవ్యుడు)

 

ఈ వ్యాసములో పేర్కొన్న శతకములే కాక పాల్కురికి సోమన రచించిన “వృషాధిప శతకం”, అన్నమాచార్యులవారి “శ్రీ వేంకటేశ్వర శతకం”, కూచిమంచి తిమ్మకవిగారి “కుక్కుటేశ్వర శతకం”, తాళ్ళపాక పెదతిరుమలాచార్యుని “వేంకటేశ్వర శతకం”, మల్లికార్జున పండితుడు వెలయించిన “శివతత్త్వసారము”, భద్రభూపాలుని “నీతిశాస్త్ర ముక్తావళి”, యధావాక్కుల అన్నమయ్య రచించిన “సర్వేశ్వర శతకం”, అమలాపురపు సన్యాసకవి వ్రాసిన “శ్రీ విశ్వనాథ శతకం మరియు గౌరీరమణ శతకం”, చిలకమర్తివారి “కృపాంబోనిధి శతకం”, దువ్వూరి రామిరెడ్డిగారి ” మాతృ శతకం”, దోమా వెంకటస్వామిగుప్తగారి “మహాత్మాగాంధీ శతకం”, శ్రీశ్రీ గారి “సిరిసిరిమువ్వ శతకం”, చల్లపిళ్ళవారి “మృత్యుంజయ శతకం”, డాక్టర్ సి.నారాయణరెడ్డిగారి “సుదర్శన శతకం” ఇత్యాది శతకాలెన్నో ఆంధ్రులకు తెలుగుకవులు ఒసగిన అమూల్య ధనరాశులు; భక్తి ముక్తి దాయకాలు.

 

 

ఉపసంహారము :

 

తెలుగు శతక వాఙ్మయము ఒక మహాసాగరం.  దానిని సమగ్రంగా విశ్లేషించడం నాబోటి మామూలు సాహిత్యాభిమానికి సాధ్యపడే విషయం కాదు.  ఐనా, నా శక్తిమేరకు విశ్లేషించే ప్రయత్నం చేశాను.  సహృదయులు ఆదరింతురుగాక!

 

 

By

5 thoughts on “శతక వాఙ్మయము – ఒక విశ్లేషణ”
  1. శ్రీ కవుటూరు ప్రాసాద్ కవీశ్వరులకు నమస్కారము.
    మీ విశ్లేషణా పూరిత వ్యాసం నా వంటి అజ్ఞానులకు, జిజ్ఞాసులకు చాలా ఉపయోగకరము.
    ధన్యవాదములు.

  2. చాలా చక్కని వ్యాసం. ఇక్కడ మీరు చెప్పినట్టు నేను మొట్టమొదట నేర్చుకున్న పద్యం శ్రీరాముని దయచేతను. అలానే భాస్కర శతకం అనగానే నా పేరుతో ఉన్న, మీరు చెప్పిన చదువది యెంత గల్గిన. ఇప్పటికీ కరెంటు పోతే శతక పద్యాలతో అంత్యాక్షరీ (మా ఇంట్లో అంత్యాక్షరీ పేరు చెప్తే పద్యాలే తప్ప సినిమా పాటలు పాడనిచ్చేవారు కాదు తాతగారు) లాంటివి ఆడుకుంటాం. ఇక్కడ నాదొక చిన్న సందేహం : ద్విపాద మకుటం గురించి మరింత వివరణ ఇవ్వగలరా? చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్యభావ! హత విమతజీవ శ్రీకాకుళాంధ్రదేవ!’,భూషణవికాస! శ్రీ ధర్మపుర నివాస! దుష్టసంహార! నరసింహ! దురితదూర! అనేవి ద్విపాద మకుటం అన్నారు అలా విశ్వదాభిరామ! వినుర వేమ! కూడా ద్విపాద మకుటంలోకి వస్తుందా? దయచేసి వివరించగలరు.

  3. శ్రీ ప్రసాద్ గారికి .నమస్కారములు.
    మీ” శతక వాజ్మయ ” వ్యాసం ప్రశంస నీయము. మకుటాయ మానమైన ఎందరో కవులను పరిచయం చేసి ఎన్నెన్నో పద్యాలను మా కందింఛి నందులకు ధన్య వాదములు. వీలు వెంబడిని మరిన్ని తెలుప గలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *