April 20, 2024

సాహిత్య “ఈ” ప్రస్థానం

రచన: మాచర్ల హనుమంతరావు

 

సుదీర్ఘ చరిత్రగల సాహిత్య ప్రస్థానం అనంతమైనది, నిరంతరమైనది. అందులో తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికమైనా, రసాత్మకమైనా, జనజాగృతిలోనైనా, మనమెంతో గర్వపడేంత విశేషమైనదై, విశిష్టమైనదై, విలక్షణమైనదై వెలుగొందుతోంది. స్త్రీల కోకిల కంఠములలో, కార్మిక, కర్షక, శ్రామిక స్వేదంలో, జానపదుల మోదంలో మొదలైన తెలుగు సాహిత్యం , విభిన్న భావజాలాలతో, భిన్న విభిన్న ప్రక్రియలతో కాలనుగతంగా పరిణితి చెందుతూ ఆయా దేశ కాల సామాజిక పరిస్థితులను, అవసరాలనూ, ఆవశ్యకతలనూ, ప్రతిబింబిస్తూ జనాకాంక్షలను ప్రతిధ్వనిస్తూ అనేకానేక రూపాలు సంతరించుకుంటు వస్తోంది. అనంతమైన సాహిత్య రూపాలను గమనిస్తే – జానపద సాహిత్యం, వచన కవిత, పదకవిత, పద్య కవిత, చంపూ సాహిత్యం, శతక సాహిత్యం, నవలా సాహిత్యం, కధలు, అవధానాలు, ఆశుకవితా, సినిమాసాహిత్యం, విప్లవ సాహిత్యం ఇత్యాది ముఖ్యమైన ప్రక్రియలు కనిపిస్తాయి.

స్థూలంగా గమనిస్తే సాహిత్యమనేది ప్రపంచానికి వెలుగునిచ్చే దీపంలాంటిదని భావించవచ్చు. సాహిత్యపు ఆలోచనలను, తత్వాలను ప్రతిఒక్కరూ తమ నిత్యజీవితంలో ఏదో ఒక రోజు, అనుభవిస్తూనే వుంటారు. సాహిత్యం ఒకమనిషిని నాగరికుడిగా, సంస్కార వంతుడిగా మలుస్తుంది. సాహిత్య ప్రభావంవల్ల గతంలో అనేక దురాచారాలను, మూఢనమ్మకాలను చాలవరకు పారద్రోల గలిగాము. భారత స్వతంత్ర సమరాంగణాన ప్రతిపౌరిని ఒక సైనికునిగా మలచి నిలబెట్టడంలో సాహిత్యం పాత్ర అనిర్వచనీయమైనది. కుల మత లింగ వివక్షతలను రూపుమాపడంలో అనేకమంది కవులు, రచయితలు సాహిత్యంద్వారా తమ వంతు కృషిని అందించారు.

 

మానవ జీవన విధానానికి క్రియాశీలతను, ఆశాభావాన్ని, సంక్షుభితం నుండి రక్షణను కల్పించడంలో ఇతర కళారూపాలతో పాటు సాహిత్యం కూడ ముఖ్యభూమిక పోషిస్తోంది. సామాజికత సాహిత్యపు ప్రధమ లక్ష్యము, లక్షణము అయినప్పటికి దానిని సాధించాలంటే సాహిత్యానికి సామాన్యుని చేరువయ్యె తత్వము, సామాన్యునికి సాహిత్య అభిలాష, దానిని ఆశ్వాదించి ఆనిందించే మానసిక స్థితి, సామాజిక పరిస్థితి అత్యంత ఆవశ్యకం. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభలిన ఆర్థిక అసమానతలు కాలక్రమేణా శ్రమ జీవనానికి స్వస్తిపలికి భ్రమ జీవనా విధానంలో వినాశనకర శక్తులై విజృంభిస్తున్నాయి. వాణిజ్య వైపరీత్యాలు, విదేశీ సాంస్కృతిక వికృతులు గ్లోబలైజేషన్ ప్రభావంతో మన దేశంలో కూడ వేళ్లూనుకొని అట్టడుగు వర్గాల్నీ ఆర్థిక ప్రలోభాల వైపుకు విజయ వంతంగా మరల్చగలిగాయి. ఇప్పుడు సమాజంలో పెట్టుబడిదారీ వర్గాల దోపిడీని శ్రామిక వర్గాలు కూడా అనుకరిస్తున్నాయి. ఉన్నత వర్గాలు దోపిడీ ఆస్తులు కూడేసుకొని తరతరాలకు తరగని సంపదను దాచుకునేందుకైతే, శ్రామిక వర్గాల దోపిడీ, కుటుంబాల్ని పోషించటంలో ఉన్నత వర్గాల విలాసవంతమైన జీవితాల్ని అనుకరిస్తూ, వ్యసనాల్లో బలైపోతూ తీరని కోరికల్లో ఆశల పందిరికింద అర్థాకలితో కుమిలిపోతూ అందని మ్రాను పండ్లకోసం అర్రులు చాస్తూ ఉండడమే నేడు నవ జీవన విధానంగా భావిస్తున్నారు. ఈ నేపద్యం లో సాహిత్యాభిలాష అన్ని వర్గాల్లో క్రమేణా అడుగంటిపోవడం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనికి తోడు ఉరుకులు పరుగుల యాంత్రిక జీవనం, అధిభౌతికత ఇత్యాదికారణాలతో సంప్రదాయ సహిత్యవాసనలు ఆధునిక మానవునికి చేరలేక పోతున్నాయి.

 

ఇలాంటి పరిస్థితులలో సాహిత్యం తన ఉనికిని కోల్పోకుండా, అస్థిత్వాని నిరుపించుకోవడంతో పాటు తన గమ్యాన్ని ధ్యేయాన్ని లక్ష్యాన్ని సాధించడానికి అంది వచ్చిన మాధ్యమం సాంకేతికవిప్లవం, ముఖ్యంగా “అంతర్జాలం” అనడంలో అతిశయోక్తిలేదు. తెలుగునాట విరివిగా వస్తున్న సాహిత్యం రాశిలోను, వాశిలోను, ప్రపంచ భాషలోని ఏ సాహిత్యానికి ఎంతమాత్రం తీసిపోనప్పటికి, ప్రపంచవ్యాప్తంగా దానికి రావలసిన గుర్తింపు రాకపోవడానికి కారణాలు అనేకం. వాటిలో ముఖ్యమైంది పుంఖాను ఫుంఖాలుగా ముందుకొస్తున్న సాహిత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన పాఠకులకు అందించేందుకు అవసరమైన సరైన వేదికలు లేకపోవడం. తెలుగునాట గల పత్రికలు తెలుగు సాహిత్యానికి సరైన స్థానం ఇవ్వడంలో చాలవరకు వెనుకబడే ఉన్నాయి. ఆందుచేత అంతర్జాతీయంగా పాఠకుల కోసం తెలుగు సాహిత్యానికి కొంగ్రొత్త జాగాలను సృష్టించవలసిన అవసరం ఎంతైనాఉంది. ఈనేపధ్యంలో అవతరిస్తున్న, అభివృధ్ధిచెందుతున్న జాల పత్రికలు, బ్లాగులు, బ్లాగు సంకలనాలు తమ వంతు కృషిని ప్రారంభించి, కొనసాగిస్తున్నాయి. అయితే వీటిలో చాలవరకు వ్యక్తిగతమైనవి, ఔత్సాహిక కూటములు నిర్వహించేవే కన్పిస్తున్నాయి, వీటి పరిధి, వనరులు, అవకాశాలు సహజంగానే చాల పరిమితంగా వుంటాయి.

 

సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వస్తున్న వేగవంతమైన పరిణామాలను సాహిత్యం అందుకోవలసిన అవసరం ఎంతైనాఉంది. ఇంటర్నెట్, సమాచార విప్లవం సాహిత్య వ్యాప్తిలో గణనీయమైన మార్పు తెచ్చినప్పటికి సాహితీ విలువలు పునరుద్ధరించి అణగారి వున్న సాహితీ మేధస్సును సరైన లక్ష్యంతో రగిలించగలగాలి. అప్పుడే అత్యంత శక్తివంతమైన సాహిత్యం ఆవిర్భవిస్తుంది. భవిష్యత్ తరాలకు అది మార్గదర్శకమవుతుంది. ప్రస్థుత ప్రపంచీకరణ తరుణంలో దోపిడీ, పీడన, ఆణచివేత ఏకీకృతంగా దాడిచేస్తున్న సందర్భంలో దానికి వ్యతిరేకంగా వెల్లువెత్తే ప్రతిఘటనను పతిబింబించే సాహిత్యమూ ప్రపంచీకరించ బడితేనే ఒక బలమైన ప్రభావాన్ని కలిగిస్తుంది, సాహిత్యబలమూ పెరుగుతుంది. ప్రస్థుత సాహిత్యంలో లోపించిన సమిష్టి లక్షణమనే భావనను పునః ప్రతిష్టించి,  చీలికలు పేలికలుగా సాగుతున్న కృషిని ఏకీకృతపరచినప్పుడే  “ఈ” సాహిత్య ప్రస్థానం, మరో మహా ప్రస్థానమై మానవాళికి మహోపకారి కాగలుగుతుంది.

 

~ X ~

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *