March 29, 2024

క్షమయా ధరిత్రీ …..

రచన: మంధా భానుమతి

 

ఆంధ్ర భోజుడు, శ్రీకృష్ణ దేవరాయల పాలనలో, అష్టదిగ్గజాల సమక్షంలో తెలుగు కవితామతల్లి అగ్రపీఠం అలంకరించి అందరి నోటా తెనుగు నానుడి వయ్యారాలు పోతున్నప్పుడు, కవులే కాక ఇతర వృత్తుల వారు కూడా సాహిత్యమంటే మక్కువ చూపించే వారని తెలిసిందే.

 

ఆ తరువాత అచ్యుతరాయల కాలంలో కన్నడ సాహిత్యానికి ప్రాముఖ్యత నిచ్చినా, విజయనగరంలో ఇంకా తెలుగు పలుకులు వినిపిస్తూనే ఉన్నాయి. అష్టదిగ్గజాల్లోని కవులు కొందరు తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు.

 

అటువంటి సంధికాలంలో…

 

“తిరువేంకట కృష్ణమాచార్యులవారు” బ్రాహ్మీ ముహుర్త కాలానికి స్నానపానాదులన్నీ ముగించి సంధ్యా వందనానికి కూర్చున్నారు. ఆచార్యులవారికి కోటలో ఘడియలు తెలిపే గంటలు చెవిన పడకముందే మెలకువ వచ్చేస్తుంది.

 

పరమనిష్ఠా గరిష్ఠులయిన కృష్ణమాచార్యులకి ఆ ప్రాతఃకాలం.. ఎందుకో హృదయం భారంగా అనిపించింది. గాయత్రీ మంత్రం నూటఎనిమిది సార్లు ఏకాగ్రతతో జపించే ఆచార్యులు పదిమార్లు జపించగానే ఉలిక్కిపడి కన్నులు తెరిచారు.

 

“నాలో ఈ అలజడిని ఆపలేనా? శరీరం అంతా నిస్త్రాణగా అయిపోయినట్లుంది. భౌతికంగా ఏ రుగ్మతా లేదు. మానసిక ఆందోళ తప్ప..” కనులు మూసుకుని ఆలోచిస్తున్నారు. కృష్ణపరమాత్మని తలుచుకుంటూ దీర్ఘ ఉచ్వాస నిశ్వాసలతో ఆజ్ఞాచక్రం మీద దృష్టినిలిపి పద్మాసనంలో కూర్చుండిపోయారు. ఆవిధంగా ఎంతసేపుండిపోయేవారో! కానీ..

 

“రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం..” పెరటి వాకిలి ఎదురుగా ఉన్న తులసికోట చుట్టూ కళ్ళాపు జల్లి ముగ్గులు పెడ్తూ ఆచార్యుల వారి ధర్మపత్ని మహలక్ష్మమ్మ సన్నని కంఠంతో స్తుతిస్తున్న ఆదిత్య హృదయం, వెనువెంటనే..

 

విశాలమైన దక్షిణ మండపంలో సా,పా,సా శృతి పట్టి సరళీస్వరాలు సాధన మొదలుపెట్టిన పదిమంది పిల్లల కంఠధ్వని.. కృష్ణమాచార్యులవారిని, ధ్యానంలోనుండి బైటికి తీసుకు వచ్చాయి.

 

అప్పటికే ప్రాచుర్యం పొందిన పురంధరదాసులవారి కర్ణాటక సంగీత ప్రారంభ సరళీ స్వరాలను వాడలోని పిల్లలచేత సాధన చేయిస్తోంది    ఆచార్యులవారి ఏకైక పుత్రిక పద్మావతి. ఆ ప్రాతః కాలమందు మాయామాళవగౌళ రాగం లో వినవచ్చే శృతి బద్ధమైన దాటు స్వరాలు ఆచార్యులవారి అంతరంగానికి ప్రతీకల్లా ఉన్నాయి.

 

విజయనగర సామ్రాజ్యంలో, కృష్ణమాచార్యులవారు వృత్తి రీత్యా శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన వైద్య బృందంలో సభ్యులు.. రాయలు వేటకి వెళ్ళినప్పుడు అడవుల్లోతిరిగి అనేక ఔషధవిలువలు కలిగిన ఆకులను, కాండాలను, వేర్లను సేకరిస్తూ ఉండేవారు. వారు వంశపారంపర్యంగా సంక్రమించిన తాళపత్ర గ్రంధాల సారాన్ని తండ్రి వద్ద అభ్యసించి, చూర్ణాలు, భస్మాలు, లేపనాలు తయారుచేసి భౌతిక, మానసిక రుగ్మతలను పోగొడుతూ అపర ధన్వంతరి అనిపేరు పొందారు.

 

అచార్యులవారి ప్రవృత్తి సంగీత సాహిత్యాలు. సంగీతంలో ప్రావీణ్యత, సాహిత్యంలో ప్రవేశం.. రాయలవారికి అత్యంత సన్నిహితుల్ని చేశాయి. తమ ప్రతిభతో అష్టదిగ్గజాలతో సమాన మయిన స్థానాన్ని కొలువులో పొందగలిగారు.

 

శ్రీకృష్ణ దేవరాయల అనంతరం కూడా కొలువులో కొనసాగుతూనే ఉన్నారు, అంతకు మునుపున్న ప్రాముఖ్యత లేకపోయినా, వయో భారం వలన, వనాలకి వెళ్ళి మూలికలు సేకరించలేకపోయినా కూడా!

 

ఆచార్యులవారు సంధ్యావందనం పూర్తి చేసి, హారతి ఇచ్చి పూజగదిలో నుంచి బయటికి రాగానే మహలక్ష్మమ్మ అందించిన వెండిగ్లాసులోని గోరు వెచ్చని మీగడ పాలని తాగి, మడి పంచె మార్చి పట్టువస్త్రాలు ధరించి వీధిలోకి వచ్చారు. మనసులో ఇదీ.. అని చెప్పలేని కలత. తూరుపున వెలుగురేఖలు విస్తరిస్తున్నాయి.

 

అదే సమయంలో, పక్కింటిలోని తెనాలి రామకృష్ణకవి కూడా భుజం మీది శాలువా సవరించుకుంటూ బయటికి వచ్చి చిరునవ్వు నవ్వాడు. వయసులో ఎక్కువ తేడా లేకపోయినా ఆచార్యులు గురుతుల్యులు అతనికి.

 

“ఆచార్యులవారి మోము ఎందుకో చిన్నబోయింది ఉదయానే..”

 

“ఏమో తెలియదు రామకృష్ణయ్యా! మనసంతా కలచివేసినట్లుంది. ఏదో అనూహ్య సంఘటన జరిగినట్లు.. జరుగుతున్నట్లు, ఒక అతీత శక్తి హెచ్చరిస్తోంది. ఏమీ పాలు పోవడం లేదు.”

 

ఆచార్యుల వారి నోట బలహీనంగా వస్తున్న మాటలు వింటుంటే రామకృష్ణకవికి కూడా ఆందోళనగా అనిపించింది. పాలిపోయినట్లున్న మోము, వణుకుతున్న పెదవులు కనగానే పరుగున వచ్చి కృష్ణమాచార్యులని చిత్రాసనం మీద కూర్చుండ బెట్టారు.

 

“మీ ఆరోగ్యం..”

 

“నాకేం ఫరవాలేదు రామకృష్ణా! అమ్మాయి గురించే నా చింత.”

 

“ఏమయింది స్వామీ! అపర ధన్వంతరులు మీరు. ఏ రుగ్మత వచ్చినా చిటికలో మాయ చెయ్యగల సమర్ధులు. మీరే ఈ విధంగా మధన పడితే..”

 

“ఏదయినా జబ్బు అయితే కుదర్చగలను.. మొండితనంకి నా వద్ద మందులేదు రామకృష్ణా!”

 

“మీ గృహ విషయాలలో నేను కల్పించుకోవడం అంత మంచిదికాదు ఆచార్యా!” రామకృష్ణయ్య మొహమాట పడ్డాడు. ఆచార్యులవారి ఇంటి సమస్య తానెలా తీర్చగలడు?

 

“ఫరవాలేదు.. ఎవరికో ఒకరికి చెప్పుకోకపోతే ముందు నాకు వైద్యుని అవసరం వచ్చేట్లుంది. కూర్చో. రాయల ఆస్థానంలో ఎన్నో చిక్కుముడులను విప్పినవాడివి నాక్కూడా ఏదయినా ఉపాయం చెప్పగలవేమో..”

 

“చెప్పండి..” సర్దుకుని వేరొక చిత్రాసనం మీద ఎదురుగా కూర్చున్నాడు రామకృష్ణయ్య. ఇంటిలోపల పిల్లలు పిళ్ళారిగీతాలు పాడుతున్నారు. పద్మావతి రజత పాత్రనిండా పాలు తీసుకొచ్చి రామకృష్ణయ్య పక్కన పెట్టి నమస్కారం చేసింది.

 

“శుభమస్తు..” ఆశీర్వదించి, పాత్రని స్వీకరించి అమ్మాయిని పరికించాడు.

 

పదహారేళ్ళు నిండాయో లేదో, పసితనం పూర్తిగా పోని చంద్రబింబం వంటి మోములో చిరునవ్వు.. సహజ సౌందర్యంతో మెరుపుతీగలా ఉంది. ఒద్దికగా వెనక్కి నడిచి గవాక్షం దాటాక వెనుతిరిగింది. ఈ అమ్మాయి సమస్య.. ఒక వేళ ఏదయినా ప్రేమ వ్యవహారం కాదు కదా! నేడో రేపో పెళ్ళి చేసి అత్తవారింటికి పంపవలసిన కన్య..

 

పద్మావతి లోపలికి వెళ్ళగానే కనకదాసు కీర్తనలు అందుకున్నారు పిల్లలు.

 

“నీ మాయ యొళగో.. నిన్నొళు మాయయో..

 

బయలు ఆలయ దొళగొ ఆలయ బయలు దొళగొ..”

 

(మాయలో నువ్వున్నావా, నీలో మాయ ఉందా?

 

అవనిలో ఆలయం ఉందా ఆలయంలో అవని ఉందా..)

 

“వింటున్నావుగా! అదీ సంగతి.” అచార్యులవారు నిట్టూర్చారు.

 

అందులో విచిత్రమేమీ వినిపించలేదు, కనిపించలేదు రామకృష్ణ కవికి.

 

“ఏమయింది మహానుభావా? చక్కని సంగీతం, అంత కన్నా చక్కని భావం.. కనకదాసు కీర్తనలు పాడిస్తోంది పిల్లలచేత.”

 

“అదే నయ్యా నాబాధ. తెలుగు భాషని పట్టించుకోకుండా, అన్నమయ్య కీర్తనల లోని తియ్యదనాన్ని, భక్తి భావాన్ని, వేదాంత సారాన్ని పంచకుండా, ఆ కన్నడ శూద్రుని లల్లాయి పదాల్ని వల్లిస్తోంది. పోనీ సంస్కృతం.. జయదేవుని అష్టపదులైనా గానం చెయ్యవచ్చును కదా!”

 

రామకృష్ణయ్య తెల్లబోయాడు. తామందరూ అపర కృష్ణావతారంగా భావించే రాయల ఆస్థాన వైద్యుడు, ఈ విధంగా మాట్లాడగలడా! ఇటువంటి భావనతో ఉండగలడా? ప్రజ్ఞ ఎక్కడ వుంటే అక్కడ పట్టం కట్టిన రాయల సాంగత్యంలో ఇదేనా నేర్చుకున్నది? పైగా కన్నడ పదాలు.. రాయలు కన్నడ రాజై ఉండి తెలుగు సాహిత్యానికి ఎంత గౌరవాన్నిచ్చాడు.. మరి అతని తెలుగు ప్రజలు కన్నడ సాహిత్యానికి అంతే గౌరవం ఇవ్వద్దా?

 

“ఒక్క పాటలు పాడడమే కాదయ్యా..”

 

అంతలో పద్మావతి మృధుమధురమైన కంఠస్వరం వినిపించింది. పిల్లలకి ఏదో కథ చెప్తున్నట్లుంది..

 

“ఒక సారి ఒక బియ్యపుగింజకీ, రాగిగింజకీ వివాదం వచ్చింది. రాగి ప్రజలందరి ఆకలీ తీరుస్తుంది, బియ్యం ఒక్క ధనవంతులుకే అందుబాటులో ఉంటుంది.. మరి దాని విలువ ఎక్కువ. కానీ రాగిలో పోషక విలువలు ఎక్కువ. నేను గొప్పంటే నేను గొప్పని రెండూ వాదులాడుకుంటూ రాముడి దగ్గరకు వెళ్ళాయి తీర్పు చెప్పమని.

 

ఇద్దరి వాదనలూ విన్న రాముడు ఆరు నెలలు రండు రకాల గింజల్నీ గాలి చొరని, చీకటికొట్లో బందీగా ఉండమన్నాడు. ఆరు నెలల అనంతరం బయటికి తీసి పరీక్ష చేయించాడు. బియ్యం గింజ పాడయిపోయి, పొడి పొడిగా రాలి పోయింది. రాగి గింజ చెక్కు చెదరకుండా నిలిచింది. అప్పుడన్నాడా దేముడు.. “కష్టించి పని చేసే జీవుల్లాగే రాగిగింజ కూడా ఎటువంటి స్థితినైనా తట్టుకుని నిలబడుతుంది.. ధనవంతుల శరీర మనో బుద్ధుల్లాగే బియ్యపుగింజ ఆటుపోట్లొస్తే జావ కారిపోతుంది. నా పేరు రాఘవ కదా.. అందుకని నిన్ను కూడా రాగి అని పిలుస్తారు అందరూ..” అని తీర్పు నిచ్చాడు.”

 

“భలే ఉంది అక్కా కథ. ఎవరు చెప్పారు?” పిల్లలు అడిగారు.

 

“భక్త కనక దాసు అని ఒక మహాను భావుడున్నాడు. వ్యాసరాయని శిష్యుడు. ఆయన రాసిందే ఇందాక మనం పాడిన పాట. ఆయన శూద్రకులంలో పుట్టి, సైనికుడిగా పోరాటాలు చేసి.. ఒక యుద్ధంలో బాగా గాయపడినప్పుడు ఆ ఆదికేశవుడు ఆయనకి పునర్జన్మనిచ్చాడు. తరువాత వ్యాసరాయలవారు ఆయనకి దాసుగా గుర్తింపునిచ్చారు.. పురంధర దాసు వలెనే. అనేక వేదాంత గీతాల్ని రచిస్తూ పాడుతున్నారు. కష్టించి పనిచేసే తక్కువ జాతులవారిని హీనంగా చూడడం నచ్చక, పాటలు, పదాల రూపంలో తన ఆవేదనని వెలిబుచ్చుతున్నాడు. ఆ కనక దాసరు పాడిన రామాధ్యాన చరిత్ర లోనిదే ఈ కథ.”

 

పిల్లలు ఆసక్తిగా వింటున్నారు. కానీ ఆచార్యులవారు అసహనంగా అటూ ఇటూ కదిలారు.

 

తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో వింటున్నారు. ప్రజల నోట ఎంత త్వరగా ప్రయాణించకపోతే ఇంత దూరం వచ్చి, ఈ ఆచార్యుల వారి ఇంట మారు మ్రోగుతున్నాయి కనకదాస కీర్తనలు! ఆనందంగా తల పంకించాడు.

 

కృష్ణమాచార్యులకి మాత్రం రామక్రిష్ణయ్య మొహంలో కనిపిస్తున్న మెచ్చుకోలు నచ్చలేదు.

 

“విన్నావా రామక్రిష్ణయ్యా! అమ్మాయి వరస ఇలా ఉంది. అదంతా సరే.. ఇంట్లో కూర్చుని ఏవో పాటలు పాడుకుంటోందిలే అనుకుంటే ఇప్పుడు ఉడిపి తీసుకెళ్ళమంటోంది. అసలే రాజ్యం అల్లకల్లోలంగా ఉంది. ఉమ్మత్తుర్, తిరువనంతపురం రాజుల తిరుగుబాటు అణచడానికి అచ్యుతరాయలు దక్షిణదేశం వెళ్ళారు. ఇక్కడ చూస్తే శ్రీకృష్ణ దేవరాయలవారి అల్లుడు, అళియరామరాయలు ఎప్పుడు సింహాసనం లాక్కుంటాడో తెలీదు. తనకి రాజ్యం ఇవ్వకుండా తమ్ముడ్ని రాజుని చేశాడని కినుకగా ఉన్నాడు. గుమ్మం కదిలితే ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో చెప్పలేము. ఈ సమయంలో ఉడిపి ఎందుకు చెప్పు?”

 

ఆచార్యులు చెప్తున్న మాట కూడా నిజమే. ఆడపిల్లని ఏవిధంగా అంత దూరం పంపాలి? దారి దోపిడీలు, క్రూరమృగాలు, విష కీటకాలు.. దారంతా అడవి మార్గం. ఎవరినైనా తోడు పంపడానికి ఆచార్యులవారికి అంత అంగబలం, అర్ధబలం లేవు.

 

“ఏం రామకృష్ణయ్యా మాట్లాడరు?”

 

“ఏం చెప్పగలను ఆచార్యా? మీరు చెప్తున్నదానిలో కూడా అర్ధముంది. ఎవరినైనా తోడునిచ్చి పంపుతే.. దైవ దర్శనానికి వెళ్తానంటే కాదని అనగలరా చెప్పండి?”

 

“ఒక్క దైవ దర్శనమయితే నాకు అంత క్షోభ ఉండేది కాదు.. ఆ కనకదాసు వెళ్తాడట.. ఆ సమయానికి ఆ మహా భక్తుడ్ని చూడడానికి వెళ్తుందిట. అక్కడే నాకు చిరచిరలాడుతోంది.” ఉత్తరీయంతో మొహం తుడుచుకున్నారు ఆచార్యులు.

 

నిజానికి రామకృష్ణయ్యకి కూడా వెళ్ళాలనే ఉంది. కాకపోతే ఇల్లాలి అనారోగ్యం ఇల్లు కదలనిచ్చేట్లు లేదు.

 

రామకృష్ణయ్య ఏదో చెప్పబోయేంతలో లోపల్నుంచి పద్మావతి బయటికి వచ్చింది. వెనుకే పిల్లలందరూ బిలబిలా వచ్చి తలో దిక్కూ వెళ్ళిపోయారు.

 

“తండ్రిగారు నా గురించే చెప్తున్నారా మామయ్యా! నాకు కనకదాసరు కీర్తనలు, ఆయన అభిప్రాయాలు ఎంతో ఇష్టం. నన్ను పంపడానికి భయపడనక్కర్లేదు కూడా. అంతఃపురకాంతలు కొందరు వెళ్తున్నారు. అందరం మగవేషాలు వేసుకుని వెళ్తాము. ఆ పైని కొంత సైనికబలం కూడా మావెంట వస్తోంది. అంత వెరవనవసరంలేదు మామయ్యా! నాకు గుర్రపుస్వారీ బాగా వచ్చు. కత్తి యుద్ధంకూడా నేర్చుకున్నాను. మీరైనా చెప్పండి.” తడుముకోకుండా.. అన్ని ఏర్పాట్లూ చేసేసుకున్నట్లు మాట్లాడుతున్న పద్మావతి వైపు రెప్ప వాల్చకుండా చూశాడు రామకిష్ణయ్య.

 

తండ్రిగారు కాదన్నా వెళ్ళేట్లే ఉంది.. ఆచార్యులవారికి నచ్చచెప్పక తపేట్లు లేదు.

 

……………….

 

ఉడిపి.. శ్రీకృష్ణ మందిరం వద్ద కోలాహలంగా ఉంది.

 

కనకదాసు వచ్చి రెండు దినములయింది. ఆలయ అధికారులు, పూజారులు హీన కులజుడైన దాసు ఆలయం లోనికి ప్రవేశించడానికి ఒప్పుకోవట్లేదు. ఆలయ ముఖద్వారం నుంచి నెట్టి వేశారు.

 

గుడి వెనుకభాగానికి వెళ్ళి తన ఏకతారాని మీటుతూ అందుకున్నాడు కనకదాసు..

 

“కుల కుల కుల వెందు హొడెధడ ధీరి..”

 

(మానవులారా! కులము కులమంటూ ఒకరి నుండి వేరొకరు విడిపోకండి.. అందరూ పుట్టేది ఒకలాగే, తినేది ఒకే విధమైన కూడే, తాగేది అదే నీరే.. ఏ ఒకరు ఇంకొకరి కంటే అధికులు కానేరు..)

 

అగ్రకులజులందరూ ఆలయం లోపల, మిగిలినవారు బయట వేచి చూస్తున్నారు. అందరికీ అలసటగా ఉంది.. ఒక్క కనకదాసుకి తప్ప. ఆయన మాత్రం ఒక కీర్తన వెంట ఇంకొకటి.. అనర్గళంగా ఆపకుండా పాడుతూనే ఉన్నాడు.

 

తిరువేంకట కృష్ణమాచార్యులు ఆలయంలోపల, గర్భగుడిలో పూజారులతో కాల వైపరీత్యం గురించి చర్చిస్తున్నారు.

 

పద్మావతి, అంతఃపురకాంతలతో కనకదాసుకి సమీపంలోనే వేచి కీర్తనలలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది.

 

భక్త కనకదాసు గొంతు బొంగురుపోయి.. ఆవేదనతో ఆయన శోషచెంది నేలకూలేట్లున్నాడు. అప్పుడు జరిగిందొక అద్భుతం..

 

ఈ అన్యాయం సహించలేనన్నట్లు భూమాత కంపించింది.

 

ఆలయ ప్రహారీ, గుడిలోపలి గోడ బీటదీస్తూ, రెండుగా విడిపోయాయి.

 

తూర్పు దిక్కుగా నిలిచి చూస్తూ భక్తులకి అభయమిచ్చే శ్రీకృష్ణుడు పశ్చిమదిక్కుగా తిరిగి కనకదాసుని తన కటాక్షవీక్షణాలతో కరుణించాడు.

 

జరుగుతున్న అద్భుతాన్ని చూస్తున్న ప్రజలందరూ నమ్మలేనట్లు లేచి నిలబడి ఆ పరమాత్మని స్తుతించసాగారు. ఆ ప్రదేశమంతా కృష్ణనామంతో మారు మ్రోగిపోయింది.

 

భక్త కనకదాసు కన్నులవెంట కావేరి వరద.. ఆలయప్రాంగణంలో ఉన్న వారందరూ నిశ్చేష్టులై నిలబడిపోయారు. గర్భగుడిలోని పూజరులు.. తమని వెలివేసినట్లు వెనుతిరిగిన శ్రీకృష్ణప్రమాత్మని క్షమించమని మోకరిల్లారు.

 

భూమాత ప్రకంపనలు ఆగలేదు. భక్తజనం అటూఇటూ కదలిపోతూనే భజన చేస్తున్నారు. శ్రీకృష్ణుని వీక్షణం మాత్రం కనకదాసు వంకనే..

 

పద్మావతి, ఆమె సహచారిణులు కనకదాసు పక్కనే నిలిచి రెప్పవేయకుండా నీలమేఘశ్యాముని చూస్తూ, భజిస్తున్నారు.

 

అప్పుడు.. తిరువేంకట కృష్ణమాచార్యులలో కదలిక వచ్చింది. విడివడిన గోడల మధ్యనుంచి బయటికి నడిచారు. ఆయన వెనుకే మిగిలిన అందరూ..

 

శ్రీకృష్ణుడిని, భూమాతని శాంతింపజేయమని భక్త కనకదాసుని చేతులు ముకుళించి వేడుకున్నారు.

 

ధరిత్రి క్షమించి శాంతించింది.. కానీ కృష్ణ విగ్రహం మాత్రం పశ్చిమ దిక్కుకే నిలబడి పోయింది.

 

చలనం లేకుండా స్థాణువులా నిలచిన తండ్రిగారిని పద్మావతి కదిలించి, ఆందోళనగా నాడి పరికించింది. ఫరవాలేదన్నట్లు తల పంకించి జ్ఞానోదయం చేసిన పుత్రికని అక్కున చేర్చుకున్నారు ఆచార్యులు ఆనందంతో.

 

“అమ్మా! నిన్ను ఎంతో క్షోభపెట్టాను.. క్షమించు తల్లీ!”

 

కన్నుల నీరు తిరగగా తండ్రిగారి కాళ్ళముందు మోకరిల్లింది పద్మావతి.. క్షమయా ధరిత్రి!

 

చరిత్రలో కనకదాసు చరిత్ర శాశ్వతంగా నిలిచిపోయింది. నేటికీ ఉడిపి క్షేత్రంలో విగ్రహం వెనుతిరిగి ఉంటుంది. భక్తులు, గర్భగుడి గోడకున్న కిటికీ లోనుండే దేముని వీక్షించాలి.

 

శ్రీకృష్ణ కటాక్ష సిద్ధిరస్తు!

 

*—————————*

4 thoughts on “క్షమయా ధరిత్రీ …..

  1. చాలా చక్కని శైలితో అద్భుతమైన రచన. అభినందనలు

  2. భానుమతిగారూ!

    మంచి సంగతి తెలియజేశారు. ఉడిపి క్షేత్రం గురించి విన్నాను కాని, ఇలా గర్భగుడిలో దేవుని విగ్రహం వెనక్కి తిరిగివుంటుందని ఇప్పటివరకూ తెలియదు. ఈ చారిత్రిక సత్యాన్ని తెలియజేసిన మీకు ధన్యవాఅములు.

    అన్నట్టు, మీ రచనాశైలి సైతం అనాటి వాతావరణానికి తగినట్టుగా చాలా బాగుంది. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *