March 29, 2024

చలువ కనుల శ్రీమాత చౌడేశ్వరీ దేవి

రచన:  శ్రీధర్ అయల


స్వస్తి శ్రీ చాంద్రమాన నందన నామ సంవత్సర మార్గశీర్ష పూర్ణిమ, శ్రీ దత్త జయంతి పర్వదినం !

రోమన్ కేలండరు ప్రకారం కి.శ. 1593వ సంవత్సరం.

తూరుపు దిశ ఎరుపెక్కుతోంది, అంతకు క్రితమే వెలువడిన ‘ఔషసి’( ఉషోదయ కాంతి) నందన వర రాజ ప్రాసాదాల మీద పడి, వాటి శోభని ఇనుమడింప జేస్తోంది. ఆ ప్రాసాదాల వరసలో రెండవ భవంతి లోని , ఆరవ కక్ష్యలో భవ్యమైన పూజా మందిరం ఉంది. ఆ పూజా మందిరం బయట, మంగళ వాయిద్యాలు, శంఖాలు పట్టుకొన్న వాద్యబృందం రెండు వరసలలో నిల్చొని, తమ తమ చేతుల లోని వాయుద్యాలని తత్పరతతో పట్టుకొని,  పూజామందిర ద్వారం వంక అనిమేష నయనాలతో ఎదురు చూస్తున్నారు.

పూజా మందిరం లోపల నుండి వాళ్లకి సంకేతాలు అందుతాయి. ఆ సంకేతాలని బట్టి వాళ్లు తమ తమ వాయిద్యాలని పలికిస్తారు.!

నందన మహారాజు గర్భగుడిలో ఏకాంతంగా కూర్చొని దీక్షతో శ్రీ దతాత్రేయ స్వామి పూజ చేస్తున్నాడు. పూజ ముగించి, హారతి వెలిగించి, వాయిద్యాలని వాయించమన్నట్లు చేతితో సంఙ్ఞ చేసాడు.

అంతే ! ఒక్క సారిగా మద్దెలలు మ్రోగాయి, సన్నాయిలు కులికాయి, గంటలు గలగల లాడాయి, శంఖాలు ధ్వనించాయి. భేరీ కాహళ ధ్వనులు మిన్నంటాయి.

హారతి ముగించాక మహారాజు ఎడమ చేతి చూపుడు వ్రేలుని పైకి ఎత్తాడు. దానితో వాయిద్యాల ద్వని గమ్మున ఆగి పోయింది ! శంఖ ధ్వని మూగ పోయింది. వాయిద్య కళాకారులు వెనుతిరిగి వెళ్లి పోయారు.వాళ్లకి పూజా మందిరం బయటి నుండి సంకేతాలు ఇస్తున్న ఆంతరంగిక సచివుడు కూడా బయటికి వచ్చి, గది తలుపులు మూసేసాడు.

స్వామి వారికి నివేదన సమర్పించి, నందన మహారాజు కూడా పూజా మందిరం తలుపులు కాసేపు మూసేసాడు. తరువాత నెమ్మదిగా వాటిని తెరచి ‘దత్తాత్రేయ స్వామి’ వారి విగ్రహం వంక తదేకంగా చూడ సాగాడు.

నందన రాజుని పీడిస్తున్న ప్రధాన సమస్య ఒకే ఒక్కటి ! దాని పరిష్కారం కోసమే నాలుగు నెలలుగా దత్తాత్రేయ స్వామి దీక్షని  మొదలు పెట్టి, ఈ నాటికి పూర్తి చేసాడు. స్వామి దానిని ఏ విధంగా పరిష్కరిస్తాడోనని ఆతృతతో ఎదురు చూడ సాగాడు.

నాలుగు నెలల క్రిందట అతనొక , గోల్కొండ వ్యాపారుల కన్యకని పెళ్లి చేసుకొన్నాడు. ముత్యంలాగ మెరిసే ఆమె దేహ చ్ఛాయ,సముద్రాలనే తమలో ఇముడ్చుకోగల విశాల నేత్రాలు కల కన్యక ఆమె ! ఆ ఇంటి ఆతిథ్యానికి వెళ్లి, అక్కడ ఆమెను చూసి వరించాడు. నిజానికి ఆమె ఎలాగున్నా అతను వివాహం చేసుకొనేవాడే ! కారణం ఆర్థిక సమస్య, అపార సంపద గల ఆ ఇంటివారితో సంబంధం కలుపుకొంటే ఆ ఆర్థిక సమస్య తీరుతుందనే దూరాలోచన ! ఆస్తితో పాటు అనుపమ సౌందర్యం గల ఆమెని ఇష్టపడే చేసుకొన్నాడు.

కాశిలో కన్యక తాతగారింట్లో వివాహం జరిగింది. వివాహమైన  తరువాత ‘ కాశీ విశాలాక్షి దేవిని’ దర్శించుకొనేందుకు వెళ్లారు వధూ వరులు.

అదుగో అప్పుడే వచ్చి పడిందొక సంప్రాప్త విపత్తు !

సహజంగా దత్తాత్రేయ భక్తుడు, ధార్మికుడు అయిన  ఆ నందన రాజుకి,  శ్రీమాత విశాలాక్షీ దేవి తన విశాలమైన నేత్రాలతో దర్శనమిచ్చి, అతని మనసుని కల్లోల సముద్రం చేసింది ! కారణమేమిటంటే ఆ తల్లి నేత్రాలు తన నవోఢ పత్ని నేత్రాలను పోలి ఉండడమే ! శరీరఛ్ఛాయని కూడ ఆ తల్లి నుండి పుణికి పుచ్చుకొన్నట్లున్న, తన పత్నిని, భార్యగా  ప్రియురాలిగా ఊహించ లేక పోయాడు !

అంతే !

దత్తాత్రేయ దీక్ష నెపంతో భార్య సముఖానికి రాకుండా, ఆమెని సమీపించకుండా, ఇన్నాళ్లూ ఎలాగో గడప గలిగాడు ! ఈ రాత్రితో దీక్ష ముగిసిపోతుంది. దత్తాత్రేయునికి తన గోడుని విన్నవించుకొని తన సమస్య పరిష్కారాన్ని కోరుతూ అలాగే స్వామి విగ్రహం ముందు మోకరిల్లాడు.

*****************

“చౌడా, చౌడా !” ముద్దు ముద్దుగా పిలిచింది పంజరంలో చిలుక.

“ చౌడా కాదే, చౌల, నీకు లకారం పలకదేమిటే ! ఎన్ని సార్లు చెప్పినా అలాగే పలుకుతావ్ !” అంది చౌలేశ్వరి.

“ దానిని నిందించి లాభమేముందమ్మా ! మీ నానమ్మ గారు అలాగే నేర్పించారు. ఇప్పుడు మార్చమంటే ఎలా మార్చుకుంటుంది ? అంది ఆమెతో పాటు పుట్టింటి నుంచి అరణంగా వచ్చిన సఖి, చెలికత్తె అయిన సావిత్రి.

“చౌడా, చౌడా !” మళ్లీ పిలిచింది శుకి.

“ దీనిచేత సరిగా పలికించడం కుదరదంటావా సావీ ?”

“ కష్టమేనమ్మా ! అయినా అదలా పిలుస్తే మీకు కలిగే నష్టమేముందమ్మా ? ”

“ చౌడ అనే పదానికి తెలుగులో అర్థం లేదే ! గోల్కొండ వైపు తుర్క తెలుగులో చౌడ అంటే, వెడల్పైన లేక విశాలమైన అని అర్థం ! నా కళ్లు అలా ఉంటాయని నానమ్మ నన్ను ,‘ చౌడేక్షిణీ’ అని పిలిచేది. అదే ఈ చిలుకకి అలవాటు అయిపోయింది.”

“ మీ పూర్వీకులు గోల్కొండ వ్యాపారులే కదమ్మా ?”

“‘ నిజమేనే ! మా నాన్నగారు నాకు పెట్టిన పేరు ‘చౌలేశ్వరి’ !‘ చౌలు’ అనే పదానికి తెలుగులో అర్థం తెలుసా ? ముత్యపు కాంతి, లేక లావణ్యము అనే అర్థాలు ఉన్నాయి ! నేను పుట్టగానే ముత్యంలాగ మెరిసి పోతూ కనిపించానట ! అందుకే మా నాన్నగారు ఆ పేరు పెట్టారు.”

“ రెండు పేర్లూ మీకు తగినవేనమ్మా ! మీ కళ్ళు చాల విశాలమైనవి, శరీర కాంతి ముత్యాలనే పరిహసించేలాగ ఉంటుంది! శరీర లావణ్యమా , దానికి తులదూగే వస్తువేదీ లేనే లేదమ్మా !”

పోవే సావీ, నీ కంతా వేళాకోలమే!అయినా ఎన్ని ఉండి ఏం లాభమే, భర్త కడగంటి చూపునైనా దక్కించుకోలేక పోయాక !” నిట్టూర్పు విడుస్తూ అంది చౌలేశ్వరి.

“ దిగులు పడబోకమ్మా ! ఈ రోజుతో మహారాజు గారి దీక్ష ముగిసింది కదా, ఇక మీ నిరీక్షణకి, మీ విరహానికీ ముగింపే కదా ? బహుశా ఈ రాత్రికే శ్రీవారు మిమ్ము సంధిస్తారేమో ! ఎలా అలంకరించమంటారమ్మా , నగలతోనా, పూలతోనా ?”

“ అతనికి ఏది ఇష్టమో నాకు అర్థమవుతే కదా ? నా సంపదని స్వీకరించారు గనుక నగలతోనే అలంకరించు.”

దత్తాత్రేయుని శిలా విగ్రహం ముందు సాగిలబడి పరుండిన నందన రాజుకి ఆ స్వామి స్వప్న దర్శనం ఇచ్చాడు.

“ నందన రాజా, వ్యసన పడకు ! నీ భార్య నీకు అమ్మవారిలాగ  కనిపించడమనేది  ఆ అమ్మవారి లీల ! ఈ సమస్యని ఆమె మాత్రమే పరిష్కరించ గలదు.ప్రతీ రోజూ బ్రాహ్మీ కాలానికి లేచి కాశీకి వెళ్లి, విశాలాక్షీ దేవిని అర్చిస్తూ ఉండు. ” అని ఆదేశించాడు.

“ స్వామీ ! కాశీ ఎన్నో వేల యోజనాల దీరంలో ఉంది. నిత్యమూ వెడలి ఆమెని ఎలా అర్చించగలను ? అంతే కాదు, పరిష్కార మార్గం దొరికే వరకూ నా భార్య నన్ను సంధించ కుండా ఎలా నివారించ గలను ?”

“ నంద రాజా ! నా విగ్రహం దగ్గరున్న పాదుకలు ధరించు. అవి నిన్ను మనోవేగంతో కాశీకి తీసుకొని వెళ్లి మరలి తేగలవు. సమయోచిత బుధ్ధితో మూల సమస్య తీరేవరకూ, నీ భార్యను కొన్నాళ్లు నిరోధించు.”

మహారాజు మెలకువ చెంది చూసాడు. దత్తాత్రేయ స్వామి కనిపించ లేదు, కాని పాదుకలు కనిపించాయి.వాటిని భక్తితో తీసుకొని కళ్లకి అద్దుకొన్నాడు నంద రాజు.

*****************

“ అమ్మా! మహారాజు గారు ఉత్తమ పుత్ర ప్రాప్తి కోసం మీతో సంగమానికి పదిహేను రోజుల తరువాత ముహూర్తం పెట్టించారట ! ఆ విషయాన్ని వారి పురోహితుల వారు చెప్పారు.”

“ సావీ ! ఆ విషయాన్ని మహారాజు నాతోనే చెప్పవచ్చు కదా ?.నా ముఖాన్ని కూడా చూడకూడదని అనుకొనేంతటి పాపం నేనేం చేసానే ?”

“ ధైర్యం తెచ్చుకోండమ్మా ! మహారాజుల వారి మనసు లోని మర్మాలు రహస్యాలు మనకెలా తెలుస్తాయమ్మా ? వేచి చూడడమే మీ వంతు పని !” అంది సావిత్రి . ఆమె మాటలలో శ్లేష , వేదన మిళితమయ్యాయి.

“ మర్మం అంటావేమిటే ?” కన్నీళ్లు తుడుచుకొంటూ అడిగింది చౌల,“ రహస్యాలు ఎలా తెలుస్తాయని అన్నావు, నిజంగానే అవి ఉన్నాయేమిటే ?”

“ ఏం చెప్పనమ్మా ! ప్రభువుల వారు నిత్యమూ రాత్రి బ్రాహ్మీ ముహూర్తానికే లేచి, ఎక్కడికో వెళ్లి, తిరిగి సూర్యోదయానికే వస్తున్నారట ! ఎక్కడికి వెళ్తున్నారో, ఎలా వెళ్తున్నారో కూడా తెలియడం లేదట ! అతని ఆంతరింగిక పరిచారకులు చర్చించుకొంటూ ఉంటే విన్నాను. ” అంది సావిత్రి.

మహారాణి ‘ చౌల ’ ఆ మాటలు  విని  నిరుత్తరురాలు అయింది. ఆ వార్తలో నిజా నిజాలు తెలుసుకోవాలని  అనిపించింది. “ సావీ ! పద, ఈ రాత్రికి మనం మహారాజు శయన కక్ష్యలో మారు వేషాలతో మాటు వేద్దాం. ఆ వార్త  వాస్తవాలు తెలుసుకొందాం.” అంది.

“ అలాగేనమ్మా, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాను.”

****************

రాణి ‘చౌల’ ఆమె  చెలికత్తె సావిత్రి, ఇద్దరూ పరిచారికల వేషాలు వేసుకొని అర్థరాత్రి దాటాక నంద రాజు పడక గదిని చేరుకొన్నారు. సావిత్రి , రాణికి అక్కడ పరదాల మాటున ఆసనం వేసింది. రాణి అక్కడే కూర్చొని నంద రాజు గతి విధులని గమనించసాగింది.

మహారాజు బ్రాహ్మీ ముహూర్తానికి నిద్ర లేచి, త్వరత్వరగా కాలకృత్యాలు నెరవేర్చుకొని, తన గది గవాక్షం తలుపులు

తెరచాడు. తరువాత ఆ గవాక్షం నుండి పాదుకలని ధరించి ఆకాశ మార్గం గుండా ఎగిరిపోయాడు.

ఆ దృశ్యాన్ని చూసిన రాణి నిశ్చేష్టురాలయింది. మహారాజుకి ఏవో శక్తులు ఉన్నాయనీ, అతను ఎవరెవరో అనిమేష కాంతలతో, లేక యక్ష కన్నియలతో పొందు కోసం వెళ్తున్నాడని తలచింది. మర్నాటి రాత్రి ఆ సంగతేదో తేల్చుకోవాలని నిశ్చయించుకొంది.

****************

మరునాడు రాత్రిబ్రాహ్మీ ముహూర్తానికి, చౌల  నంద రాజు మార్గాన్ని నిరోధించి నిలిచింది. “ స్వామీ ! మీరు ఎక్కడికి వెళ్తున్నారు, అనిమేష కాంతలతో సరస సల్లాపాలకే గదా ? నన్ను ఉపేక్ష చేసేది కూడ అందుకే  కదా ? అయినా మీకు ఇదెక్కడి బుధ్ధి, వివాహం  సంపద కోసమే చేసుకొన్నా , వివాహిత భార్య పట్ల కనీస మర్యాద పాటించాలని తెలియదా ? నాకు ఈ దినం సమాధానం చెప్తారా, లేక దత్తాత్రేయ మందిరంలో మౌన దీక్ష వహించమంటారా ?” అని అడిగింది.

దత్తత్రేయ మందిరంలో మౌన దీక్ష వహించడమంటే  రాజు వల్ల గాని రాజ బంధువుల వల్ల గాని లేక వారి ఆశ్రితుల వల్ల గాని ఘోరమైన అన్యాయానికి గురి అయి, న్యాయం చెయ్యమని అడగడానికి చేసే పోరాటం !

నందన రాజు దానికి సిధ్ధంగా లేడు. అందుకే ఆమెతో చెప్పాడు, “ దేవీ ! నీ పట్ల ఉపేక్ష వహించడం నిన్ను తక్కువ చేసి కాదు, తక్కువ చెయ్యలేక ! నాకు ఎలాంటి అనిమేష కాంతలతో గాని, మానవ కాంతలతో గాని ఏ విధమైన సంబంధం లేదు. నేను నిత్యమూ వెళ్లి వచ్చేది కాశీకి, అక్కడ శ్రీ మాత విశాలాక్షీ దేవిని అర్చించి వచ్చేందుకు ! అది కూడ దత్త స్వామి అనుమతి మీదనే ! ” అని.

చౌల అతని మాటలు నమ్మలేదు, “ మీ మాటలు వస్తవానికి దూరంగా ఉన్నాయి. ఎక్కడ కాశీ , ఎక్కడ విశాలాక్షీ దేవి ! కొన్ని గంటలలో ఆమెని అర్చించి రావడం సాధ్యమేనా ?”

“ దేవీ ! నీవు నమ్మినా నమ్మక పోయినా నేను చేసేది అదే ! ”

“ అలాగయితే నన్ను కూడా తీసుకొని వెళ్లండి” అంది చౌల.

నంద రాజు క్షణ కాలం ఆలోచించాడు. తన సమస్యకి పరిష్కారం ఆమెని తీసుకొని వెళ్లి కాశీ విశాలాక్షీ దేవిని చూపించడం వల్లనే సాధ్యమవుతుందని తలచాడు.

“ దేవీ నేను స్పర్శించి మలినం చెయ్యలేను. నీవు నన్ను వాహనంగా భావించి  నా వీపు పైన ఆశీనురాలివై నాతో రావచ్చును.” అన్నాడు

చౌలేశ్వరి కుతూహలంతో దానికిఅంగీకరించింది. అతని వీపు పైన ఆశీనిరాలు అయింది. నంద రాజు పాదుకలని ధరించి, ఆకాశ మార్గాన ఆమెను విశాలాక్షీ దేవి మందిరానికి చేర్చాడు.

అక్కడ ఆ దంపతులిద్దరూ శ్రీమాతను ఆరాధించారు. నంద రాజు దేవిని తన సమస్య తీర్చమని అడిగాడు. చౌల తన వ్యధను వెల్లడించి దానికి కారణమేమిటో తెలియజేయమంది.

విశాలాక్షీ దేవి వారికి  దర్శన మిచ్చింది. నంద రాజు ముకుళిత హస్తుడై తన్మయత్వంలో పడ్డాడు. చౌల ఆ దేవిని చూసి మ్రాన్పడి పోయింది. తన రూపం  ఆ దేవికి ప్రతిబింబమని గ్రహించ గలిగింది. భర్త అసమంజస ప్రవర్తనని అర్థం చేసుకొంది. అమ్మవారిలాగ కనిపించే భార్యను ఏ భర్త మాత్రం ప్రియరాలుగా చేసుకోగలడు ?

వారిరువురూ మౌనంగా దేవి ఆలయం నుండి బయట పడ్డారు.

తిరుగు ప్రయాణానికి పాదుకలు సహకరించ లేదు. రాజుకి లోపమేమిటో తెలియలేదు. రాణికి మాత్రం  ఆ లోపం అర్థమయింది. “ స్వామీ ! ఆలయం నుండి బయట పడిన వెంటనే, నాకు ఋతుస్రావం జరిగింది, అందుకే ఆ పాదుకలు తమ పవిత్రతను కోల్పోయి ఉంటాయి” అని చెప్పింది

ఆమె మాటలు నిజమేనని తెలుసుకొన్న రాజు వెంటనే అపరాధ ప్రక్షాలణ కోసం, కాశీ దత్త పీఠం  బ్రాహ్మణ సమాజం ముందు తన గోడు చెప్పుకొని, తనకి సహాయం చెయ్యమని అర్థించాడు.

*********************

బ్రాహ్మణ సమాజం హోమం చేసి పాదుకలని తిరిగి శక్తివంతం చేసారు. కాని  ఒకే ఒక పరి అవి పనిచేయగలవని చెప్పారు. ఆ ఉపకారానికి మారుగా రాజు వారిని కావలసినది కోరుకోమన్నాడు.

వారు నందన వరానికి తాము వస్తామని, అక్కడే తమకి కావలసినది కోరుకొంటామని, జాప్యం చేయకుండా తిరిగి వెళ్లమని రాజ దంపతులకి చెప్పారు.

సత్యాన్ని తెలుసుకొన్న దేవేరితో నంద రాజు ప్రశాంతమైన మనస్సుతో రాజధానిని చేరుకొన్నాడు. తన పాదుకా ప్రస్థానానికి విరామం పలికాడు. చౌలేశ్వరికి మాత్రం విపరీత పరిస్థితి ఎదురయి, ఆమె కంటికి కునుకుని దూరం చేసాయి.

ఇలా ఉండగా బ్రాహ్మణ సమాజం వారు నందన వరం చేరుకొన్నారు, రాజుని కలసి తమ కోరిక తీర్చమని అడిగారు.

చిత్రాతి చిత్రమైన విషయయం ఏమిటంటే నందరాజు ఆ బ్రాహ్మణులెవరో తనకి తెలియదని అన్నాడు. తాను ఎవరినీ ఏ సహాయమూ అర్థించ లేదని పలికి వారిని విస్మయంలో ముంచాడు!

బ్రాహ్మణులు కోపించారు. తాము సహాయం చేసిన దానికి రాణియే సాక్ష్యమని . ఆమెని పిలిపించమని అడిగారు.

నందరాజు మరునాడు రాజ సభకి  రాణిని పిలిపిస్తానని చెప్పి వారికి విడిది ఏర్పాట్లు చేసాడు.

********************

చౌలేశ్వరికి విషయం తెలిసింది. సహాయం చేసిన వారిని  నిరాకరించిన  రాజు ఆంతర్యం ఆమెకు అర్థం కాలేదు. భర్తకి  విరుధ్ధంగా సాక్ష్యం చెప్పడమనే నిజాన్ని ఆమె జీర్ణం చేసుకోలేక పోయింది. ఆమె  విషయం ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశ్యం తోనే రాజు అలా పలికాడని ఆమెకు తెలుసుకోలేక పోయింది !

ఫలితంగా ఆమె రాత్రంతా విశాలాక్షీ దేవిని ధ్యానం చేసి, మరునాటి ప్రాతః కాలానికే  ఆమె విగ్రహం ఎదుట తన ప్రాణాలు విడిచింది!!

రాణి చౌలేశ్వరి ఆత్మార్పణ రాజధానీ నగరాన్ని శోక సముద్రంలో ముంచెత్తింది.

******************

రాజ సభలో బ్రాహ్మణ సమాజం వారితో రాజు, రాణి చనిపోయిన విషయం చెప్పాడు. సాక్ష్యాలు లేని కారణంగా తాను వారికి  ఏమీ ఇవ్వనని స్పష్టం చేసాడు.

బ్రాహ్మణులు అలిగి విశాలాక్షీ దేవినే సాక్ష్య్యానికి పిలుస్తామని చెప్పారు. ఆ విధంగా రాజు ఆంతర్యం లోని కోరిక తీరీంది. ఆ బ్రాహ్మణుల  పూజ వల్ల విశాలాక్షీ దేవి రాజధాని  హోమ గుండం ఎదుట  సాక్షాత్కరించింది.

అందరూ విశాలాక్షీ దేవికిప్రణమిల్లారు. నందన రాజు  సాష్టాంగ పడి ఆమెను రకరకాలుగా  స్త్రోత్రం చేసాడు. “ తల్లీ నీ దర్శనాన్ని కోరి నేను బ్రాహ్మణుల ఎదుట ఏమీ తెలియయని వాడిలా నటించాను. నన్ను క్షమించు తల్లీ !” అంటూ.

విశాలాక్షీ దేవీ అందరికీ ఈ విధంగా సెలవిచ్చింది.

“ నందన రాజా ! చౌలేశ్వరి తల్లి తండ్రులు నాలుగు జన్మల నుండి నా భక్తులు. నన్ను పుత్రికగా బడయగోరి తపస్సు చేసారు. అందువల్ల నేను నా అంశతో వారికి చౌలేశ్వరిగా జన్మించాను, వారికి కన్యాదాన ఫలం దక్కేందుకు , ఈశ్వరాంశ గల నీతో పాణి గ్రహణాన్ని అనుమతించాను. ఇప్పుడామె నాలో ఐక్యమయింది, జరిగినదంతా నా లీల ! ఆమె పేరుతో, “ చౌడేశ్వరీ దేవిగా” ఇక్కడే అవతరిస్తాను. నాకు ఆలయం కట్టించు. కాశీకి వెళ్ల నవసరం లేకుండా నన్ను ఇక్కడే సేవించు వచ్చును.” అంటూ అంతర్థానమయింది.

*************

.కర్నూలు జిల్లా , బనగామ పల్లె మండలం లోని నందన వరంలో చౌడేశ్వరీ మాత దేవాలయం ఉంది. బనగాల పల్లె నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అవతరించిన ఈ దేవి భక్త జనులకు కొంగు బంగారమై, దక్షిణాది విశాలాక్షీ దేవిగా దర్శనమిస్తూ కోరికలు తీరుస్తోంది. బనగాల పల్లె మామిడి పళ్లనే ‘ బంగిన పల్లె మామిడిపండ్లని’ పిలుస్తారు. ఈ చరిత్రని స్థల పురాణానికి కొంత కల్పన కొంత నాటకీయత కలిపి కథలా వ్రాసాను.

( స్వాతి వారపత్రికలో నా ‘రశన’ చదువు తున్నారా ? చదవక పోతే ఒక అద్భుతాన్ని  నష్ట పోతారు )

ఎ.శ్రీధర్. క్షీరగంగ బ్లాగరు.

*****************

 

 

 

 

2 thoughts on “చలువ కనుల శ్రీమాత చౌడేశ్వరీ దేవి

  1. శ్రీధర్ గారు, చాలా అద్భుతంగా రాసారండి. మా పూర్వీకుల చరిత్ర అడిగితె ఇదే చెప్పేవారు మా పెద్దవారు. కాశి నుంచి వచ్చిన బ్రాహ్మణులు ఆ నందరాజు దానం ఇచ్చిన కొన్ని ఊళ్లలో స్తిరపడ్డారు, వాళ్ళని నందవరీకులంటారు. తాళ్ళపాక అన్నమాచార్యులవారు నందవరీకులే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *