March 28, 2024

నన్నెచోడుడి ‘వస్తు కవిత ‘ పై ఒక ‘కాంతి ‘

రచన :  ఎం.వి.పట్వర్ధన్

 

రవికులశేఖరుండు కవిరాజశిఖామణి కావ్యకర్త స

త్కవి భువి నన్నెచోడు డటె! కావ్యము దివ్యకథం గుమార సం

భవ మటె! సత్కథాధిపతి భవ్యుడు జంగమ మల్లికార్జునుం

డవిచలితార్థ యోగధరు డట్టె! వినం గొనియాడజాలదే!

 

(కుమార సంభవము)

 

 

“మాలిక ఉగాది ప్రత్యేక సంచిక” కు ఒక శివకవిని పరిచయం చేయబోతున్నాను.  అట్లాంటి, ఇట్లాంటి మామూలు కవి కాదండోయ్!  కొద్దిలో తప్పిపోయింది కానీ, ఓ దశలో నన్నయగారి ఆదికవి స్థానానికే ఎసరు పెట్టిన కవిరాజశిఖామణి!!  నిజంగానే కవీ, రాజశిఖామణీ కూడాను.

 

ఈ కవి వంశానికి కలికాలచోడుడు మూలపురుషుడు.  చోడబల్లి, శ్రీసతి ఈయన తల్లిదండ్రులు.  తనను గూర్చి తాను ఎంత సగర్వంగా చెప్పుకొన్నాడో!………..

 

“కలుపొన్న విరులఁ బెరుగం

గలుకోడి రవంబు దిశలఁ గలయగఁ జెలగన్

బొలుచు నొరయూరి కధిపతి

నలఘు పరాక్రముడఁ డెంకణాదిత్యుండన్”

 

“నేను ‘ఒరయూరు ‘ నకు ప్రభువును.  అధిక పరాక్రమవంతుడను.  ‘దక్షిణదేశమునకు సూర్యుడు ‘ అనే అర్థాన్నిచ్చే ‘టెంకణాదిత్యుడు ‘ అనే బిరుదు గలవాడను”.

 

మనకు తెలిసినంతవరకు ఈతడే ప్రప్రథమ రాజకవి.  ఎవరాతడు?…… తెలుగులో “కుమారసంభవము” కావ్యమును వెలయించిన నన్నెచోడ కవీంద్రుడు.  ఇతడు నన్నయకూ, పాల్కురికి సోమనకూ నడిమికాలపువాడని పరిశోధకులు నిర్ణయించారు.

 

ఇంతటి మహాకవి గూర్చీ ఆమొన్న, అదేనండీ 1909 లో మారేపల్లి రామకృష్ణకవిగారు తంజావూరు గ్రంథాలయంలో ప్రతిని సంపాదించి పరిష్కరించి, ప్రకటించేదాకా మనకేమీ తెలీదంటే బోలెడంత ఆశ్చర్యమే కదా!  కాని ‘లేటుగా వచ్చినా లేటెస్టుగా’ వచ్చాడన్నట్టు తన ఉనికిని బయటిప్రపంచానికి ప్రకటించుకున్న మరుక్షణం నుంచీ ఈ కవిరాజశిఖామణి తెలుగు సాహిత్యలోకంలో లేపిన సంచలనం ఇంతా అంతా కాదు.  పండితశిఖామణుల సిగపట్లకు కొదవే లేదు.

 

నన్నెచోడుడు తన “కుమారసంభవము” లో ప్రధానంగా మూడు ప్రతిపాదనలు చేశాడు.  అవేంటో చూద్దాం.

 

1) జానుతెనుగు   2) మార్గకవిత్వము – దేశికవిత్వము  3) వస్తుకవిత్వము.

 

(1) జానుతెనుగు :  ‘జానుతెనుగు ‘ అన్న పదాన్ని ప్రయోగించిన మొదటికవి ఈతడే!  ‘జానుతెనుగు ‘ అంటే తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పలేదుగాని, సందర్భాన్ని బట్టి మనం గ్రహించవలసిందే!

 

“సరళము గాగ భావములు జానుతెనుంగున నింపు పెంపుతోఁ

బిరిగొన, వర్ణనల్, ఫణితి పేర్కొన, నర్థము లొత్తగిల్ల, బం

ధురముగఁ బ్రాణముల్ మధు మృదుత్వరసంబునఁ గందళింప, న

క్షరములు సూక్తు లార్యులకుఁ గర్ణరసాయన లీల గ్రాలగాన్”

 

అనే పద్యాన్ని బట్టి భావములు సరళముగా వ్యక్తంచేయడమే జానుతెనుగు లక్షణంగా భావించాలి.  పాల్కురికి సోమనాథుడు కూడా తన “పండితారాధ్య చరిత్ర” లో ‘జానుతెనుగు విశేషము ప్రసన్నతకు ‘ అంటాడు.  అసలు ‘జాను ‘ అంటేనే అందము, సౌందర్యము అనే అర్థాలున్నాయికదా!  ‘సంస్కృత పదబాహుళ్యానికి, సమాస భూయిష్ఠతకు దూరంగా, జన వ్యవహారానికి దగ్గరగా ఉన్న తెలుగులో భావాలు ప్రకటించాలి ‘ అని కవిరాజు చెపుతున్నాడన్నమాట.  తథాస్తు!

 

 

(2) మార్గ – దేశి కవిత్వములు :  పాపులర్ అయిపోవాలంటే పద్యాలు వేయి వ్రాయాలటండీ!  మన కవిగారి రెండు పద్యాలు చాలు.

 

మును మార్గకవిత లోకం

బున వెలయగ, దేశికవితఁ బుట్టించి తెనుం

గున నిలిపి రంధ్రవిషయం

బునఁ జనఁ జాళుక్యరాజు మొదలుగఁ బలువుర్.

 

మార్గ కుమార్గము, దేశియ

మార్గము వగవంగఁ దనకు మది వదలక దు

ర్మార్గ పదవర్తు లనదగు

మార్గకవులం దలప నలతి మహి సుకవులకున్.

 

పూర్వము మార్గకవిత లోకంలో ప్రసిద్ధమై ఉండగా ఆంధ్రదేశమున చాళుక్యరాజు మొదలైనవారు దేశికవితను పుట్టించారని, మార్గ కుమార్గము (చెడ్డ మార్గమని), దేశియ (దేశికవిత్వమే) సరైన మార్గమని పై పద్యాల భావం.  మార్గకవిత అనగా సంస్కృత కవిత్వమనీ, దేశికవిత్వమంటే తెలుగు కవిత్వమనీ, ఆ దేశికవిత్వాన్ని పుట్టించిన ఆ చాళుక్యరాజు తెలుగుభాషలోకి మహాభారతమును అనువదింపజేసిన రాజరాజనరేంద్రుడేనని మనం భావించవచ్చు.

 

 

(3) వస్తు కవిత్వము :  నన్నెచోడుడు తన “కుమారసంభవం” కావ్యములో అనేక పర్యాయాలు ‘వస్తు కవిత్వం’ అనే పదాన్ని ప్రయోగించాడు.  వాల్మీకి మహాకవిని ‘వస్తుకావ్యాబ్జ రవి (వస్తుకావ్యం అనే పద్మానికి సూర్యుడిలాంటివాడు) అనీ, “కిరాతార్జునీయం” అనే కావ్యాన్ని వ్రాసి ‘భారవే రర్థగౌరవం’ అని పేర్గాంచిన భారవి మహాకవిని ప్రశంసిస్తూ ‘భా-రవియును (కాంతిచేత సూర్యుడు ; భా = కాంతి), వస్తుకవితను భారవియును (వస్తుకవిత చేత భారవికవియూ) ప్రకాశిస్తారనీ, ఉద్భటుడు రచించిన సంస్కృతకావ్యం “కుమారసంభవం” ‘సాలంకారము, గూఢ వస్తుమయ కావ్యము ‘ అనీ!!

 

ఇన్నిసార్లు ‘వస్తుకవిత ‘ అనే పదాన్ని ప్రయోగించినా ‘అయ్యా! అదేంటండీ’ అంటే తాను చెప్పడు.  ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అని వేమన అన్నట్లు, ‘కవితలందు వస్తుకవిత వేరయా’ అని మనం అనుకోవాలా?!….. అసలు వస్తుకవితంటే ఏంటో ఆయన పద్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.

 

“మృదురీతి సూక్తు లింపొదవింప మేలిల్లు

భావమ్ము నెలమి బ్రీత్యావహముగ

మెఱుగుల కన్నులు మిరుమిట్లు వోవంగఁ

గాంతి సుధాసూతి కాంతి జెనయ

వర్ణన లెల్లచో వర్ణన కెక్కంగ

రసములు దళుకొత్తి జాలువాఱ

దేశి మార్గంబులు దేశీయములుగా న

లంకారముల దా నలంకరింప

 

నాదరించి విని సదర్థాతిశయమున

బుధులు నెమ్మనమున నిధులు నిలుప

వలవదే సమస్త వస్తు కవీశ్వర

నూత్న రుచిర కావ్య రత్నవీధి”

 

పద్యభావాన్ని బట్టి “వస్తుకవిత్వము మృదువులై ఆహ్లాదము కలిగించు సూక్తులతోనూ, ప్రీతిని కలిగించు మేలైన భావములతోనూ, వెన్నెల వెలుగుల వలె కన్నులు మిరుమిట్లు గొల్పు కాంత్యాది గుణములతోనూ, శృంగారాది రసములతోనూ, ప్రసిద్ధమైన వర్ణనలతోనూ, దేశికవితారీతులతోనూ, ఉపమాది అలంకారములతోనూ పండితు లాదరించే విధంగా ఉండాలని” తెలుస్తున్నది కదా!

 

నన్నెచోడుడు పేర్కొన్న సంస్కృతకవుల కావ్యాలన్నీ కథాప్రధానములై, వర్ణనాత్మకములై, అలంకారపరిమళభరితమైనట్టివే.  ఇతని “కుమారసంభవం” కూడా కథాప్రధానమూ, వర్ణనాత్మకమూ, అలంకారసహితమైనదే కాబట్టి పై లక్షణములతో కూడినదే వస్తుకవిత అని ఊహించుకొనవచ్చును.

 

అయితే, ఈమాత్రానికే నన్నెచోడుడు ‘వస్తుకవిత ‘ అంటూ అంత ఘనంగా చాటుకోవాలా?  వస్తు వర్ణనాలంకారములు లేని కవిత్వం కూడా ఉంటుందా?  అన్ని కావ్యాలూ వస్తుకావ్యాలూ, అన్ని కవితలూ వస్తుకవితలే కదా?!

 

ఇదే నన్నెచోడుడు వస్తుకవిత్వమన్నా, ప్రబంధమన్నా ఒక్కటే అనే విధంగా “కుమారసంభవము” ను వేరొకచోట ‘ప్రబంధం’ అంటాడు.

 

“జంగమ మల్లికార్జును నిసర్గ కవిస్తవనీయ సూక్తి యు

క్తిం గొనియాడి తత్కరుణ గేనములే కనురక్తయైన భా

షాంగన దక్కనేలిన మహత్త్వము లోకమునం బ్రసిద్ధిగా

భంగిగ విస్తరించెదఁ బ్రబంధము సద్రసబంధురంబుగన్”

 

ఈవిధంగా తిక్కనగారు మాటవరసకన్న ప్రబంధ శబ్దాన్ని ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రయోగించి ప్రబంధకవులకు ‘మార్గదర్శి ‘ అయ్యాడు నన్నెచోడుడు.

 

నామాటలెందుకు గానీ, వస్తుకవిత్వమంటే ఏంటో సెలవిచ్చిన ఒకరిద్దరు పెద్దల చద్దిమూటలు విప్పితే పోలా!

 

“ప్రనంధ కవితా లక్షణములలో సగమునకు పైగా ఈ వస్తుకవిత్వమున ఇమిడియున్నవి………. నన్నెచోడుడు తన కావ్యమును ప్రబంధమని కూడా పేర్కొన్నాడు.  తాను పేర్కొన్న అష్టాదశ వర్ణనములన్నింటినీ తన కావ్యములో ప్రవేశపెట్టినాడు…… ఒకవిధముగా ఊహించినచో వస్తుకావ్యమనగా ప్రబంధమనియే చెప్పవచ్చును……. కావున వర్ణనాత్మకమైన కావ్యము వస్తుకావ్యమని, అందులోని కవిత వస్తుకవిత యని నన్నెచోడుడు అభిప్రాయపడినాడు.”

 

(ఆధునికాంధ్ర కవిత్వము : సంప్రదాయములు, ప్రయోగములు — డా.సి.నారాయణరెడ్డి)

 

“……. దీనిని బట్టి యతని దృష్టిలో వస్తుకవిత్వమన్నను, బ్రబంధకవిత్వమన్నను నొక్కటే యని భావింపవచ్చును.  ఆంధ్ర సాహిత్యమున మొట్టమొదటి ప్రబంధమిదియే యని చెప్పవచ్చును.  ప్రబంధమునకు లక్షణములేవి యని చెప్పబడినవో, యవి యన్నియు నిందుఁ బుష్కలముగాఁ గలవు.”

 

(“కుమారసంభవము” పీఠిక — డా.జొన్నలగడ్డ మృత్యుంజయరావు)

 

వీరి అమూల్యాభిప్రాయములను బట్టి ప్రబంధకవితే వస్తుకవిత అని భావించవచ్చు.

 

నన్నెచోడుడు ఆదికవి వాల్మీకిని స్మరించిన విధం చూస్తే అతని అభిప్రాయం మరింత స్పష్టంగా తెలుస్తుంది.

 

“రామాయణము” కావ్యం.  రసప్రధానమైనది; వర్ణనాత్మకమైనది.  అంటే నన్నెచోడుడు తన కృతి కావ్యకళా ప్రధానంగా ఉంటుందని చెప్పాడన్నమాట.  కాని, “కుమారసంభవం” వర్ణనాత్మకమే కాక, కథాప్రాధాన్యం కూడా కలది.  కథలో పాత్రపోషణను తక్కువ చేయలేం కదా!  కవిగారి దృష్టిలో అన్యోన్యాశ్రయమైన కథ, పాత్రలు, వర్ణనలు వస్తువుగా గల కవిత్వమే వస్తుకవిత్వం.

 

నన్నెచోడుడు వస్తుకవితలోని ప్రధానగుణమేదో సూచ్యంగానూ, వాచ్యంగానూ చెప్పాడు.  అది “కాంతి”.  వాల్మీకిని రవి అంటాడు.  రవి అంటే కాంతి.  భారవిని భా-రవితో పోలుస్తాడు.  భా అంటే కాంతి.  “కాంతి సుధాసూతి(చంద్రుడు) కాంతి చెనయ”, ఉద్భటుడు “కవిత్వము మెఱయ(మెరుపుకాంతి)”.

 

ఇంతకూ ఏంటి ఈ కాంతి?!…… అక్కడికే వస్తున్నానండీ!

 

“శ్లేష, ప్రసాద, మాధుర్య, సౌకుమార్య, సమతా, అర్థదీపక, ఉదారతా, కాంతి, ఓజస్సు, సమాధి – ఈ పదింటినీ కావ్యగుణాలంటారు.”

(“కావ్యాలంకార సంగ్రహము – నరసభూపాలీయము”)

 

మనిషికి గుణాలెటువంటివో, కావ్యానికి గుణాలటువంటివి.  కావ్యంలో అలంకారాలు లేకున్నా లోపములేదు గానీ, గుణములు సముచితంగా లేకుంటే లోపమే!

 

ఆలంకారికుడైన వామనుడు

“కావ్యశోభయాః కర్తారో గుణాః

తదతిశయ హేతవస్త్వలంకారాః పూర్వేనిత్యా”

 

(గుణములు కావ్యశోభను గూర్చునవి.  అలంకారములు తదతిశయమును గలిగించును.  గుణములు నిత్యములు) అంటాడు.

 

పై పది గుణాల్లో నన్నెచోడుడు ‘కాంతి ‘ అనే గుణానికి అమిత ప్రాధాన్యతను ఇచ్చినట్లు అనిపిస్తున్నది.  “కాంతి అనే గుణం వలన గ్రామ్యదోషం పోతుంది” అంటాడు ‘ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణ ‘ కర్త.

 

“శ్రవణ సుభగములగు పదముల యొకానొక యుజ్జ్వలత్వమే కాంతి.  ఇట్టి యౌజ్జ్వల్య గుణములేని కవి వాక్కు రంగులుమాసిన పాత చిత్తరువు వలె శోభావిహీనమగునని యభియుక్తుల యభిప్రాయము.”

 

(“ఆంధ్ర ప్రతాపరుద్ర యశోభూషణము” – విద్వాన్ చెలమచెర్ల రంగాచార్యులు)

 

అంటే ఒక పద్యాన్ని వినగానే దానిలోని పదముల పొందిక ఇంపుగా (అక్షరరమ్యత??) ఉండాలన్నమాట.  ఆ పదాల పొందిక వలన పద్యానికి ఒక ‘కాంతి ‘ వస్తుంది.

 

ఇప్పుడు నన్నెచోడుని ప్రధాన కావ్యగుణమైన ‘కాంతి ‘ (ఇదీ నా ప్రతిపాదన!) తో “కుమారసంభవం” ఎలా వెలిగిపోయిందో ఒక్క (అక్షరాలా ఒక్కఠే!) పద్యాన్ని పరిశీలిస్తే తెలిసిపోతుందిగదా!

 

“హృదయాహ్లాదము తోడఁ బాయక సదానేక ప్రకారంబులన్

మదనాసక్తిఁ బెనంగుచున్న విలసన్మత్తేభ విక్రీడితం

బది దాక్షాయణి చూచి కౌతుకరతైకాలీన భావాభిలా

ష దృగత్యుజ్జ్వల దీధితుల్ పఱపె నీశానాననాబ్జంబుపైన్”

 

“సంతోషంగా క్రీడిస్తున్న మదగజాలను చూచి సతీదేవి మనస్సులో కోరికతో తన చూపుల యొక్క మిక్కిలి ప్రకాశము గల కాంతులను పరమేశ్వరుని ముఖముపై వ్యాపింపజేసింది.” అని ఈ పద్య భావం.

 

ఈ పద్యంలోని పదాలు చెవికి ఇంపుగా ఉండి, ఆలంకారికులు కాంతికి నిర్వచనంగా చెప్పిన ‘ఉజ్జ్వలత ‘ అనే పదం రావడం ఒక విశేషమైతే, మదగజాల విలాసక్రీడను మత్తేభవిక్రీడతంలోనే వర్ణించుట మరో విశేషం.  ఒక వృత్తంలో దాని పేరు వచ్చేటట్లు వ్రాస్తే అది ‘ముద్రాలంకారం’.  దీనికీ మన కవిగారే ఆద్యులు!!  హ్యాట్సాఫ్ నన్నెచోడులవారూ!  మీరు నిజంగా చాలా… గొప్పవారు.

 

ఇక ఈ ఆలంకారికభాషను వదలిపెట్టి, మామూలుగా చెప్పాలంటే ఏం చెప్పినా అందులో ఒక మెఱుపు, చమక్కు ఉండాలి.  అదీ కవిత్వంలో కాంతి అంటే!

 

ఈ వ్యాసం వ్రాస్తున్నరోజు కామదహనం.  కాబట్టి, అదే సందర్భాన్ని తీసుకుంటే,

 

“గిరిసుత మైఁ గామాగ్నియు,

హరుమై రోషాగ్నియుం, దదంగజుమై ను

ద్ధుర కాలాగ్నియు, రతిమై

నురు శోకాగ్నియును దగిలి యొక్కట నెగసెన్”

 

కందర్పుని దర్పాన్ని హరుడు సంహరించాడు.  ఆ తరువాత పార్వతీదేవి దేహంలోని కామాగ్ని, శివుని దేహంలోని కోపాగ్ని, మన్మథుని దేహంలోని కాలాగ్ని, రతీదేవి దేహంలోని శోకాగ్ని – ఇలా ఈ నాలుగు అగ్నులూ ఒక్కటయ్యి ఎగసాయట!……. చూశారా! ఈ ‘సూర్యవంశీకుని ‘ కవితాకాంతి!

 

ఇలా ఈ కావ్యంలో ఎన్నో పద్యాలు.  అవన్నీ మరోమారు.

 

ఏతావాతా నేను తేల్చినదేమంటే కథా, పాత్రపోషణా, వర్ణనా సహితమై ‘కాంతి ‘ నీనునదే నన్నెచోడుని వస్తుకవిత.  ఇలా అనడానికి నాకు స్వాతంత్ర్యం ఉంది.  కాదంటారా!  అనండి.  ఆ స్వాతంత్ర్యం మీకు మాత్రం లేదంటానా?….. కాని, ఒక్క షరతు.  మీరు ఆ మాట అనేముందు “కుమారసంభవం” కావ్యాన్ని చదవడం మాత్రం తప్పనిసరండోయ్!!

 

 

 

ఎం.వి.పట్వర్ధన్,

తెలుగు భాషోపన్యాసకులు,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల,

భైంసా, జిల్లా: ఆదిలాబాదు,

మొబైల్: 9393751540.

4 thoughts on “నన్నెచోడుడి ‘వస్తు కవిత ‘ పై ఒక ‘కాంతి ‘

  1. నేను ఎప్పటినుంచో చదవాలని అనుకుంటున్న వాటిల్లో కుమారసంభవం ఒకటి. ఇది వ్రాసినది నన్నెచోడుడు అని తెలుసు కాని ఇంత దివ్య కాంతి ఉందని ఇప్పుడే తెలిసింది. మీరు దీనిని ఇంత మధురంగా పరిచయం చేశాకా ఇక ఆలస్యం చేయను. ఇంత చక్కని కావ్యాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు!

  2. పట్వర్ధన్ గారికి నమస్కారములు.
    ఒక మంచి కవిని ,పరిచయం చేసి తెలుగు వెలుగులను విరజిమ్మి నందులకు కృతజ్ఞతలు , + ధన్య వాదములు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *