April 19, 2024

రాముని భర్తృధర్మము

 

           రచయిత :- యఱ్ఱగుంట సుబ్బారావు

 

ధర్మప్రధానుడైన రాముడు దారనైనను, ధనమునైనను(అర్థకామములను) ధర్మబద్ధమైన వానినే స్వీకరించును. ప్రభువు, తండ్రి అయిన దశరథుని ఆజ్ఞానువర్తియగుటయే తన ధర్మమని రాముడు విశ్వసించినాడు. వంశసంప్రదాయమునుబట్టి, ప్రభువు ఆనతినిబట్టి జ్యేష్ఠుడైన తనకు లభించిన రాజ్యమును, వరముల వలలో చిక్కిన తండ్రి కోరగా భరతునికై పరిత్యజించినాడు, వనవాసమును అంగీకరించినాడు. అట్లే స్వపరాక్రమ విజితయు, స్వయంవరలబ్ధయు అయిన సీతను జనకుడు కన్యాదానము చేయుటకు జలపాత్రతో సిద్ధముకాగా తండ్రి అనుమతి లేకుండా ఆమెను స్వీకరించలేదు. తండ్రి అనుమతితో వివాహమాడిన సీతపై రామునకు ’ స్థిరానురాగమున్నది, తల్లిదండ్రులు(బిడ్డపై) చూపు వాత్సల్యమున్నది.’

 

                                          “స్థిరానురాగో మాతృవత్ పితృవత్ ప్రియః” – ( అయోధ్యా. ౧౧౮-౪)

 

అయితే ఈ “దారధనాదులు సాపవాదమైనచో” వానిని త్యజించు ధర్మనిష్ఠ రామునియందున్నది. రాముడు తనకు కల్గిన (రాజ్య)లాభ, నష్టములను గణింపక, సమదృష్టి కల్గియున్నను, ఇతర మనుష్యుల కష్టములకు దుంఖించు మృదుహృదయమున్నది. తన పట్టభంగమునకు దుఃఖించుచున్న తల్లి దుఃఖమును చూడలేక దుఃఖించినాడు. ప్రజలు తనను విడిచి వెనుకకు మరలక, రథమెక్కి వనములకేగుచున్న తనకూడా రాలేక వ్యథచెందుట చూచి వారికై రథము దిగి సరయూనదీ తీరము వరకు పాదచారియై వెళ్ళినాడు. అట్టి దయామయుడైన రాముడు సీత తనతో అడ్వులకు వచ్చి దుర్భర కష్టములు పడుటకు అంగీకరించలేదు. ఆమె అనేక విధములుగా ఆయనను ఒప్పించుటకు ప్రయత్నించినది. నారీధర్మములను ఉదహరించినది, నిష్టురములాడినది, ప్రాణములను విడుతుననినది, తుదకు దుర్నివారముగా దుఃఖించినది. ఇక్కడ ఒక ప్రశ్న కలుగును. తనవెంట వత్తుననిన కౌసల్యకు “భర్త బ్రతికి ఉండగా స్త్రీ కుమారుని అనుసరింపరాదని, భర్తకు సేవచేయవలెనని” స్త్రీ ధర్మములను ఆమెచే స్మరింపజేసిన రాముడు, ఇపుడదే ధర్మమును ఆచరించుటకు సిద్ధమైన సీతనేల వలదనినాడు? లోకమున స్త్రీ ధర్మములు రూఢమై ఉన్నను వానిని ఆచరించుటకు వారు(స్త్రీలు) మనఃపూర్వకముగా సిద్ధమై ఉండవలయును. అట్లుగాక అవి వారిపై బలాత్కారముగా విధించి, వారిచే ఆచరింపజేయ చూచిన ఆ ఆచరణము వికృతముగా పరిణమించును. తమంతట తాముగా సిద్ధమైనచో వారి ధర్మాచరణము వారికి సుఖముగా నుండును, ఇతరులకు తృప్తి కలుగును. లోకము కొఱకో, భర్త తృప్తి కొఱకో కాక సీత తాను చేయదలచిన ధర్మాచరణము తన కొఱకే అను విషయము తెలియవలసి ఉన్నది. అది తెలిసికొనుటకే, ఆమె ఆంతర్యమును ఎఱుగుటకే తుదవరకు ఆమెను శోధించినాడు. తనకొఱకు ఇతరులు కష్టపడుటను సహింపకపోవుట, సీత సర్వాభిప్రాయమును ఎఱుగదలచుట- ఈ రెండును సీత వనగమనమును రాముడు అంగీకరింపకపోవుటకు కారణములు. అంతియేగాని అడవిలో స్త్రీ సంరక్షణము చేయలేక కాదు. సీతను ముందు, తనను అనుసరింపరాదనుటకు హేతువును రాముడిట్లు చెప్పుచున్నాడు-” సీతా! నీ సర్వమైన అభిప్రాయము నెఱుగక, నిన్ను కాపాడ సమర్థుడనయ్యు నీ వనవాసమునకు అంగీకరింపనైతిని.”

 

తవ సర్వమభిప్రాయమవిజ్ఞాయ శుభాననే

వాసం న రోచయేరణ్యే శక్తిమానపి రక్షణే( అయోధ్యా. ౩౦-౨౮)

 

సీత సర్వాభిప్రాయము నెఱిగిన పిమ్మట ఆమె వనవాసమును అంగీకరించినాడు. దీనినిబట్టి భార్య అభిప్రాయమును, స్వాతంత్ర్యమును ఎట్లు మన్నించినది విశదమగుచున్నది. రాముడు సీతకు ఆమె స్వధర్మాచరణములో స్వేచ్ఛను ఇచ్చినను, ఆమె యెడల స్నిగ్ధముగా ఉన్నను ఆమె చెప్పిన ఆలోచనలన్నింటిని ఆయన ఆమోదించడు. అవి ధర్మబద్ధము కానిచో వానిని సహేతుకముగా తిరస్కరించును. విరాధవధ జరిగిన పిమ్మట రాక్షసులవలన హానిని శంకించి భయపడిన సీత రామునితో- “కారణము లేకనే రాక్షసులతో వైరము వలదు. క్షత్రియునకు శస్త్రసాంగత్యము తేజోవృద్ధి చేయును. దేశధర్మమునుబట్టి, అరణ్యములో ధనుర్బాణములు పరిత్యజించి, మునివృత్తి నవలంబించి, వనవాసవ్రతమును ముగించుకొని పట్టణమునకేగిన పిమ్మట క్షాత్రధర్మమును తిరిగి ఆచరింపవచ్చును. అయితే క్షత్రియులు ఆర్త్రత్రాణము చేయుటకు ఆయుధములు ధరింపవలసినదే”                       (అరణ్య. ౯-౧౪,౧౫౨౫,౨౬), అని పరస్పర విరుద్ధమైన అభిప్రాయములను వెలిబుచ్చినది. దానికి రాముడు- ” మునులు శరణు వేడగా రాక్షసుల బారినుండి వారిని రక్షింతునని బాస చేసితిని. ఆర్తులను రక్షించుటకు క్షత్రియుడు ఆయుధధారి కావచ్చునని నీవే చెప్పితివి. అట్టి స్థితిలో వారిని రక్షించుటకు ఆయుధములను ధరించి, వారికిచ్చిన మాటను కాపాడుకొనుటకు సిద్ధమైతిని”(అరణ్య. ౧౦-౩,౧౭) అని శరణాగతరక్షణమను క్షాత్రధర్మమునకు విరుద్ధములైన ఆమె అభిప్రాయములను మృదువుగా త్రోసిపుచ్చినాడు.

 

ధర్మబద్ధమైన రాముని కామపురుషార్థము ధర్మపత్నియగు సీతయందు ఫలించినది. వారు పన్నెండు సంవత్సరములు అయోధ్యలో సర్వసుఖములు అనుభవించిరి. సీత రామునకు ప్రాణములకంటె ఇష్టురాలైనది( ప్రాణైః ప్రియతరా మమ – అర.౫౮-౬), ప్రాణసహాయ అయినది (క్వ సా ప్రాణసహాయా మే వైదేహీ– అర.౫౮-౪). ఒకరి ప్రేమను ఒకరు పరీక్షించి చూచికొనిరి. ఒకరి హృదయమందొకరు ప్రతిష్టితులైరి. ఒకరిపై ఒకరికి విశ్వాసమున్నది. ఒకరిని విడిచి ఒకరు జీవించలేనంతగా సీతారాముల పరస్పర ప్రేమ ప్రవర్ధమానమయినది. “ఆత్మవంతుడు కీర్తిని విడువలేనట్లు నిన్ను విడుచుట నాకు శక్యము కాదు.”(అయోధ్య. ౩౦-౨౯) అని సీతతో రాముడనినాడు. రావణునకు భయపడుచునే వానిని, వాని మాటలను తృణీకరించి-“సర్వలక్షణలక్షితుడు, సత్యసంధుడు, మహానుభావుడు, సముద్రమువలె గంభీరుడు, నరసింహుడు, సింహమువంటివాడు, విశాలవక్షుడు, జితేంద్రియుడు, కీర్తిమంతుడు, మహాత్ముడు, రాచబిడ్డ అయిన రామునిని నేను అనువర్తించుదానను- “అహం రామమనువ్రతా”-(అరణ్య.౪౭-౩౬) అని సీత రావణునకు ప్రకటించినది. ఇట్టి వీరి అన్యోన్యనురాగమునకు వారికి కల్గిన వియోగము ఒక పరీక్ష అయినది. ఆ పరీక్షలో వారి ప్రేమలోని గాఢత్వము, ఔన్నత్యము లోకమునకు వెల్లడి అయినది. అట్టి వియోగదశలో వారి పరస్పర గాఢానురాగమును చూచి, విషాదము చెంది, మెచ్చుకుని, ఒకరి సందేశము ఒకరికి యెఱింగించి, వారిని యూరడించి, కడకట్టిన వారి ప్రాణములను నిలుపు మహద్భాగ్యము ఒక్క హనుమంతునకు లభించినది. రామవియోగములో, అశోకవనములో దీనయై, దుఃఖితయై, కర్శితయై, భీతయై, క్రూరవికృతరాక్షసీ పరివేష్టితయై, బంధుజనవియోగంతో ఏకాకియై, మలినగాత్రయై, అధశ్శాయియై, రామధ్యానపరయై ఉన్న సీతను దర్శించినాడు. సీతావియోగములో మధుమాంసములు వర్జించి, కేవల మూలఫలాదులను తిను రాముని, నిత్యశోకపరాయణుడై,(సీతా) ధ్యానపరాయణుడై,ఇంకొక విషయము చింతింపని రాముని, నిద్రలేని రాముని, ఒకవేళకు పట్టిన నిద్రనుండి తటాలున “సీతా!” అని పలవరించుచు లేచు రామునినీ దర్శించినాడు. రామవియోగములో సీత, సీత యెడబాటులో రాముడు జీవించియుండుటకు హేతువును హనుమంతుడు ఇట్లూహించుచున్నాడు.-” ఈమె మనస్సులో రాముడున్నాడు, ఆయన మనస్సులో సీత ఉన్నది. అందువలననే పతివ్రతయైన ఈమెయు, ధర్మాత్ముడైన రాముడు ముహుర్తకాలమైన జీవించియున్నారు.”

 

అస్యా దేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్

తేనేయం స చ ధర్మాత్మా  ముహూర్తమపి జీవతి(సుందర. ౧౫-౫౨)

 

ఇట్లు వారి ధార్మికనిష్టకు పరస్పరానురాగమునకు ముగ్ధుడైన హనుమంతుడు రామసందేశమును చెప్పి సీతను ఊరడించవలెనని, సీతాసందేశముతో రాముని సంతోషపరచవలెనని నిశ్చయించుకుని, అటులనే చేసినాడు.

 

దుర్భరవియోగములో నిగ్గుదేలిన ఈ ప్రేమమూర్తులకు పునస్సమాగమమును కలిగించు శుభపరిణామము ఏర్పడినది. కాని ఆ పునఃసమాగమము సుకరముగా, సుఖముగా సంభవించలేదు. ఏ సీతను ప్రాణాధికముగా ప్రేమించెనో, ఏ సీతకై చెట్టుచెట్టుకు, కొండకొండకు పరువులెత్తి వెదకెనో, ఏ సీతమీది ప్రేమచే ఉన్మాదివలె జడములగు చెట్లను, కొండలను, నదులను, మూగజీవులగు పశుపక్ష్యాదులను సీతను గూర్చి ప్రశ్నించెనో, ఏ సీతను పోగొట్టుకుని ఉత్సాహధైర్యములు జారిపోయి కర్తవ్యశూన్యుడై తనను అరణ్యములో విడిచి అయోధ్యకు తిరిగి వెళ్ళవలసినదిగా లక్ష్మణుని కోరెనో , కవగూడియున్న మృగపక్షి మిథునములను చూచి ఏ సీతను నిరంతరము స్మరించెనో, ఏ సీతా విరహతాపముతో దగ్ధమగుచున్న అగ్నిపర్వతమువలె ఉండెనో, ఏ సీతాధ్యానమగ్నుడై తన శరీరముపై పాకుచున్న చీమలను,దోమలను, పురుగులను సైతము తొలగించుకొనలేదో, ఏ సీతావార్తకై కన్నులలో ప్రాణములు పెట్టుకుని ఎదురుతెన్నులు చూచెనో, ఏ సీతకొరకు మహాబలుడైన వాలిని వధించెనో, ఖరదూషణాదులతోగూడ రాక్షససేనను సంహరించెనో, ఏ సీతకై అపూర్వ సేతునిర్మాణము చేసి, సముద్రమునుదాటి, మహావీరులగు రాక్షసులను వధించెనో, ఆ చిరకాంక్షిత అయిన సీత ఇప్పుడు తనకు అత్యంత సమీపములో, ఏ అడ్డులేక హస్తగతయై ఉన్నను , ఆమెను వెంటనే స్వీకరించుటకు ధర్మప్రధానుడైన  రామునకు వీలులేకపోయినది.

 

సీతాహృదయ ప్రతిష్టితుడైన రామునకు ఆమె హృదయము తెలియును. సకల సుఖములను, బంధుమిత్రములను వదలి తనవెంట అరణ్యవాస కష్టములనుభవించుటకు, తనకు దుఃఖసహాయ అగుటకు సంతోషముతో స్వేచ్ఛతో అడవికి తనను అనుసరించిన సీతకు తనపైగల ప్రేమను, పాతివ్రత్యధర్మమందు ఆమెకుగల నిష్టను రాముడెఱుగును. తనను నమ్మివచ్చి, తన భాగ్యవిపర్యయము వలన తనకు దూరమై, రాక్షసచెఱలో దీనయై, దుఃఖితయై, భీతయై, ఘోరరాక్షసీ సంవృతయై, వారి మాటలచే పీడితయై రక్షణకొఱకు దిక్కులు చూచిన సీతపై ఆనృశంసాపరుడైన రామునకు జాలి ఉన్నది. రాముడులేని జీవితము వ్యర్థమని శరీరత్యాగమునకు సిద్ధపడియు, బ్రతికిఉంటే రామునిని దర్శింపవచ్చునను ఆశతో జీవితము నిల్పుకొనిన సీతాహృదయభావము నెఱిగిన రాముడు- “భాగ్యవశమున బ్రతికి ఉన్నావు”(దిష్ట్యా జీవసి ధర్మజ్ఞే – యుద్ధ.౧౧౬-౯) అనిన రామునకు సీతానురాగముపై విశ్వాసమున్నది. రావణవధ జరిగిన తర్వాత సీతకు హనుమంతునిద్వారా సందేశమునిట్లు పంపినాడు-” సీతా! భాగ్యవశమున బ్రతికి ఉన్నావు! నీకు ప్రియము చెప్పుచున్నాను. ఇంకా, సంతోషము కలిగించుచున్నాను. మనకు జయము లభించినది. రావణుడు వధింపబడినాడు. లంక ఇప్పుడు మన వశములో ఉన్నది. ఇక స్వగృహములో ఉన్నట్టుగా ఊరడిల్లుము”(యుద్ధ. ౧౧౬-౯,౧౦,౧౩). సీతావ్యసనమును తలచి తలచి దుఃఖితుడైన రామునకు- ఆమెకు ప్రియము చెప్పి సంతోషింపచేయు సమయము రాగా, తన మనస్సు ఆనందమయముకాగా క్షణకాలము పట్టుదప్పిన మనస్సునుండి అనురాగము, ఆనందము చిన్నచిన్నవాక్యములుగా రాముని నోటినుండి వెలువడినవి. రాముని ఈ స్థితినిబట్టి ఆయన సీతను సంతోషింపచేయుటకై ఎంత ఆతురతతో ఉన్నాడో, ఆమెపై ఆయనకెంత అనురాగమున్నదో వ్యక్తమగుచున్నది. అయినను అవిచారముగా వెనువెంటనే ఆమెను స్వీకరించుటకు రామునకు అవకాశము లేకపోయినది. సీతను స్వీకరించుటకు రామునకు రావణుని అడ్డుతొలగినను, ధర్మము అడ్డునిలచినది. రామునకు సీతయందున్న విశ్వాసముగాని, ప్రేమగాని, జాలిగాని, ఆమె పాతివ్రత్యనిష్టపై ఆయనకున్న మెప్పుగాని- ఇవి ఏవియు రాముడు వెంటనే అవిచారముగా సీతను స్వీకరించుటకు సహకారులు కావు. ఇవి అన్నియు రాముని వైయక్తికాభిప్రాయములు. ధర్మదీక్షాపరతంత్రుడైన రామునకు, వ్యక్తిగతాభిప్రాయములున్న రామునితో సంబంధము లేదు. ఈ రాముడు ధర్మాచరణములో కాఠిన్యమును పూనును, కోపమును తెచ్చుకొనును, నిష్టురముగా మాటాడును, హృదయము జాలితో ఆర్ద్రము కాకుండా జాగరూకుడగును. కావుననే తానున్న దీనదయనీయ స్థితిలోనే రామునిని చూడదలచిన సీతను, అట్లుగాక ” శిరఃస్నాతయు అలంకృతయు ” అయిన పిమ్మట చూడదలచినాడు.

 

ఇంతవరకు వానరరాక్షసులు సీతానిమిత్తమై మహాయుద్ధము చేసిరి కాని, ఆ యుద్ధమునకు కారణమైన సీతను వారు చూడలేదు. సహజ కుతూహలముతో వారు సీతను చూడ మార్గనిరోధము చేయుచుండగా, విభీషణుని ఆజ్ఞచే వేత్రధారులు వారిని తరిమివేయసాగిరి. కోపకారణముల నన్వేషించుచున్న రామునికిది ఉపకరించుచున్నది. విభీషణుని కోపించుచూ రాముడు-“ఈమె యుద్ధభూమిలో ఉన్నది. క్లిష్టస్థితిలో ఉన్నది.(సైషా యుద్ధగతా చైవ కృచ్ఛ్రే చ మహతి స్థితా- యుద్ధ. ౧౧౭-౨౮). అట్టి ఈమెను నా స్వజనమైన వీరు చూచుటలో దోషములేదు” అని తీవ్రముగా పలికినాడు. ఇట రాజసభకు దండనార్థము కొనితేబడిన దోషిస్థానము సీతకిచ్చినాడు. అందుకే నిరావరణముగా బాహాటముగా సీతను ప్రవేశింపచేసినాడు, అందరు ఆమెను చూచుటకు అనుమతించినాడు. సీత ఉన్న క్లిష్టస్థితి ఏమిటో రాముడింకను ప్రకటింపకున్నను, రాముని ఇప్పటిమాటలు, చూపులు, కోపము చూచిన హనుమల్లక్ష్మణసుగ్రీవాదులకు రాముడు సీతను స్వీకరించు స్థితిలో లేడని తలచిరి, అందరును భయభ్రాంతులయిరి.

 

రాముడు దోషిస్థానములో తనను నిలిపినను తనలో ఏ దోషము,మాలిన్యము లేకపోవుటవలన ఆమె మొగము నిర్మలమైన చంద్రబింబమువలెనున్నది-(“విమల శశాంకనిభాననా”). నిర్దోషిపై దోషారోపణము చేసిన కోపమాలిన్యము రామునిలో ఉండుటవలన ఆయన మోము ఎఱ్ఱబాఱి అప్పుడే ఉదయించిన చంద్రబింబమువలెనున్నది.(….ప్రియస్య, వదన ముదిత పూర్ణచంద్రకాంతం – యుద్ధ. ౧౧౪-౩౬) యుద్ధభూమిలో సర్వులముందు దోషిగా నిలిపిన సీతపై రాముడిట్లు దోషారోపణము చేయుచున్నాడు- “రావణుని గాత్రస్పర్శవలనను, వాని క్రూరదృష్టితో చూడబడుటవలనను, శత్రువునింట చాలకాలముండుటవలనను నీ చారిత్రము సందేహాస్పదమై ఉన్నది. తన ఇంటనున్న దివ్యరూపిణివైన నిన్ను చూచుచు రావణుడు సహించి ఉండలేడు. ఇట్టి స్థితిలో నీపై నాకెట్టి ఆసక్తియులేదు. నీవు నీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చును, నీ ఇష్టమైనవారిని ఆశ్రయింపవచ్చును. అయితే ఇంత ప్రయాసపడి, ప్రాణసంశయమును పొందించు మహాయుద్ధము చేయుట ఎందుకనిన- పరకృత ప్రధర్షణమును సహింపని క్షాత్రధర్మమును కాపాడుకొనుటకు, సీతను రక్షింపకపోయిన రాముడు నిర్వీర్యుడు, నిరమక్రోశుడు అను అపవాదము రాకుండుటకు, ప్రఖ్యాతమైన రఘువంశమునకు కల్గిన అపకీర్తిని పోగొట్టుకొనుటకు- అందుకేగాని ఈ రణపరిశ్రమము నీ కొఱకుగాదు.నీవు యథేచ్ఛముగా వెళ్ళవచ్చును.నీయందు నాకాసక్తిలేదు(నాస్తిమేత్వయ్యభిషంగో- యుద్ధ. ౧౧౮-౨౧)”.

 

రాముడు సీతపై దోషారోపణముచేసి ఆమెను దోషిస్థానములో నిలిపినాడు. సీత తన నిర్దోషిత్వమును నిరూపించుకొనవలసి ఉన్నది. ఆమె ఇట్లనుచున్నది-“ప్రభో! మనమిరువురము చాలకాలము కలిసిపెరిగితిమి, కలిసి జీవించితిమి. అట్టిస్థితిలో నీవు నన్ను పరీక్షించియే ఉందువు. నా స్వభావము నీకు అర్థమయియే ఉండవలయును. అట్లు కానిచో నేను శాశ్వతముగా నశించినదాననగుదును. నాకు పరగాత్రస్పర్శ కలిగినదనగా, నా శరీరము పరాధీనమై ఉన్నది. కాని నా అధీనమందున్న మనస్సు నీయందే ఉన్నది. కేవలము నన్ను సామాన్యమైన ఆడుదానిగా మాత్రమే చూచితివిగాని నా శీలము, నా జన్మమును గూర్చి విచారింపవైతివి. చిన్నప్పుడే నా పాణిని గ్రహించితివి, అప్పటినుండి నా శీలము, నాకు నీపై ఉన్న భక్తి- అన్నింటిని వెనుకకు నెట్టి, వైవాహికబంధమును ప్రమాణముగా స్వీకరింపక, ఎవరో కొందర దురాచరణముచే స్త్రీజాతినంతను శంకించుచున్నావు. నా పాతివ్రత్యముపై శపథము చేతును, నన్ను విశ్వసింపుము.-(యుద్ధ. ౧౧౯-౬,౧౬). తనపై దోషారోపణము చేసిన రామునిని సీత తన శీలమునకు, నిర్దోషిత్వమునకు సాక్షిగా ఎన్నుకొనినది. ఈ సాక్ష్యము కేవలము రాముని విశ్వాసము మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు రాముడు-“ఆమె చెప్పినది నిజము, ఆమె పతివ్రత,పవిత్రురాలు, ఆమె శీలముపై నాకు విశ్వాసమున్నది” అని చెప్పినచో లోకము రాముని ఈ మాటలను విశ్వసింపదలచినచో రామునకు ఆమెపై దోషారోపణము చేయవలసిన పనిలేదు. కావున ఇట తన సాక్ష్యమునకు, విశ్వాసమునకు ప్రసక్తిలేకపోవుట వలననే రాముడేమియి బదులు చెప్పక, తన నిశ్చయముపై(సీతా పరిత్యాగముకై) స్థిరముగా ఉన్నాడు.

 

హనుమంతుడు, రాముడు సీతకై వ్యథచెందుటకు నాలుగు కారణములూహించినాడు- స్త్రీ అను కారుణ్యము, ఆశ్రితురాలను జాలి, భార్య అను శోకము, ప్రియురాలు అను అనురాగము. ఇప్పుడు రాముడు, “యుద్ధ పరిశ్రమము నీ కొఱకుగాదు” అనుటలో పై నాలుగు హేతువులు వర్తించిన సీతకని అర్థము కాదు, నాల్గవది అయిన “ప్రియురాలు” అను భావము మనస్సులో పెట్టుకుని “యుద్ధము నీకొఱకు కాదు” అనినాడు. అనగా “కేవలము నీవలన వ్యామోహితుడనై యుద్ధము చేయలేదు” అని రాముని భావము. ఇక మిగిలిన మూడు భావములు రాముడు యుద్ధము చేయుటకు హేతువులే. రాముడు తన రణపరిశ్రమమునకు కారణములను చెప్పుచూ,” క్షత్రధర్మచరణమును, అపవాద నిరాసమును” అందులో చేర్చినాడు. “స్త్రీని, ఆశ్రితురాలను” రక్షింపజాలకపోయినాడను అపవాదము పోగొట్టుకొనుట, భార్యాప్రధర్షణమును సహింపని క్షత్రధర్మాచరణమును చేయుట – అను కారణముల వలన రాముడు సీతను చెర విడిపింపవలసి వచ్చినది. కావున రాముడు యుద్ధము చేయుటలో పై మూడు కారణములున్నవి. ఇక నాల్గవ కారణము కేవలము తన వ్యక్తిగత విషయము. సీత తనకు ప్రియురాలు అగుటవలన ఆమె వియోగమును సైపలేక, వ్యామోహముతో, ఆమెను తిరిగి పొందుటకు యుద్ధము చేయలేదని రాముని భావము. అనగా మొదటి మూడు కారణములలో రాముని వైయక్తిక విశేషమేమియు లేదు. అవి క్షత్రియులందరికీ వర్తించునవి, అందరును ఆచరింపవలసినవి. అందువలన వానిని ప్రమాణముగా తీసికొని రాముడు యుద్ధము చేసినాడు. నాల్గవ కారణము వ్యక్తిగతమగుటవలన, యుద్ధమున కది కారణము కాదని రాముని ఆశయము. ఇప్పుడు రాముడు స్వీకరించినచో మిగిలిన మూడు హేతువులకంటె నాల్గవది బలవంతమై, రూఢమై, లోకములో రాముడు కాముకుడై సాపవాదయైన సీతను(భార్యను) స్వీకరించినాడను హేతువు స్థిరపడును. “సాపవాదముతో కూడిన అర్థకామములను స్వీకరింప”నను రాముని ధర్మనిష్ఠకు భంగము కలుగును. కావున సాపవాదయైన భార్యను త్యజించినాడు.

 

అయితే సీతపై వ్యక్తిగత సదభిప్రాయము, ఆమె శీలముపై విశ్వాసమున్న రాముడు ములుకుల వంటి పలుకులు పలుకుచు, ఆమె ముఖములోకి నేరుగా చూడలేక “తిర్యక్ప్రేక్షిత లోచనుడై”నాడు(అడ్డచూపులు చూచినాడు. యుద్ధ -118 -12). హనుమంతుడు రామవిజయమును సీతకు నివేదించి “ఆమె తమను చూడగోరుచున్న”దని రామునికి సీతాసందేశమును చెప్పినపుడు రాముడు “తనలో ఏదో ధ్యానించుకొనుచు కన్నీరు పెట్టుకొనినాడు”, (అగచ్ఛత్ సహసాధ్యానమీషద్బాష్ప పరిప్లుతః.117-5). పిమ్మట వేడి నిట్టూర్పు విడిచి, నేలచూపులు చూచుచు “శిరస్స్నాతయు, అలంకృతయు” అయిన సీతను చూడకోరినాడు. విభీషణుడు సీతను తీసికొనివచ్చి “ఏదో స్మరించుకొనుచు పరాకుగా ఉన్న       ” రామునకు సీతా ఆగమనమును చెప్పినాడు. హనుమంతుని ద్వారా సీతకు సందేశము పంపిన తర్వాత సీతాపరిత్యాగమునకు రాముడు నిశ్చయించుకొనినాడు.. కావుననే యథాస్థితిలో ఉన్న సీతను చూడకోరలేదు. అట్లు నిర్ణయించుకొనినను సీత తనయందే మనసు నిల్పినదని, రావణుడామె దాపునకు పోజాలడని, అగ్నిశిఖవంటి ఆమెను రావణుడు మనస్సుతోనైనను స్పృశింపజాలడని రామునకు తెలియును.  ఇట్లు తెలిసియు ఆమెను స్వీకరింపలేక వైవాహిక బంధమును త్రెంచుకొనుటకు సిద్ధమైనాడు. సీత శీలము, అనురాగము, తత్సంబంధములైన అనేక విషయములను స్మరించుకొనుచు ధ్యాననిమగ్నుడైన  రాముడు కన్నీరు పెట్టుకొనినాడు. అట్లే, జనసభలో భర్తచే విడువబడిన తనకు మరణమే శరణమని తలచిన సీత, రాముని అనుమతితో లక్ష్మణుడు చితిపేర్చగా, రామునకు ప్రదక్షిణము చేసి అగ్నిలో ప్రవేశించిన సీతను చూచి రాముడు బాష్పపూరిత నయనుడైనాడు. ఈ పరిశీలనమును బట్టి రామునకు సీతపై విశ్వాసము, అనురాగము గలవనియు, వానిని ప్రకటించుటకు, లోకమును నమ్మించుటకు వీలులేని స్థితియందుండుటవలన సీతనట్లు కఠినములాడుట, ఆమెను పరిత్యజించుట, ఆమె అగ్నిప్రవేశమును ఉపేక్షించుట జరిగినదని తలంచవలెను.

 

రాముని అపూర్వమైన ఈ దృఢధార్మికనిష్ఠకు దేవతాప్రపంచమంతయు కదలి వచ్చినది. బ్రహ్మ, శంకరుడు, లోకపాలురు, దేవతలు, పితృదేవతలు వచ్చిరి. అగ్నిదేవుడు దివ్యమాల్యాంబర ధారిణియై, అక్షతయై, పావితయైన జానకిని రామునకు సమర్పించుచూ – “త్రికరణములతో ఈమె నిన్నెపుడు అతిచరించలేదు. రావణుని బెదిరింపులు, ప్రలోభములను లక్షింపక నీయందే మనసు నిల్పినది. ఏ పాపమెఱుగనిది. అట్టి ఈమెను మాఱుపలుకక స్వీకరింపుము, నిన్ను ఆజ్ఞాపించుచున్నాను”-(యుద్ధ -121-10)అని పలికినాడు.

 

సీతఎడ తన హృద్గతభావము తనయందే ఇముడ్చుకుని కన్నీరు పెట్టుకొను రామునకు తన విశ్వాసము దైవసాక్షిగా నిజముకాగా దానినిప్పుడు బహిర్గతము చేయుటకు అవకాశము లభించినది. కావున రాముడు సీతను గూర్చి – “ముల్లోకములలో సీతపై పాపమారోపించుట ఎంతమాత్రము తగదు. ఈమె త్రిలోకములలో అత్యంత పరిశుద్ధురాలు. సూర్యునకు తేజస్సువలె ఈమె నాకంటె వేరయినది కాదు. ఇట్టి ఈమెను త్యజించుట అశక్యము.(యుద్ధ. ౧౨౧-౧౩,౧౬,౨౦). అట్లయిన ఇంతకుముందు అట్లేల దోషారోపణము చేసి గర్హించి, త్యజించినాడనిన – ’అవి’ కాలాంతరముననైనను సీత శీలస్వభావము నెఱుగని లోకులు వాకొను నిందాలాపములు- వారు అట్లు నిందించుటకు వీలైన హేతువులను రాముడు తానుగా చూపినాడు. లోకదృష్టిని తనపై ఆరోపించుకొనిన రాముడు ఇట్లనుచున్నాడు -” నా ఎదుట నిల్చిన నీ ప్రవర్తనము సందేహాస్పదమై ఉన్నది. కావున నీ దర్శనము నేత్రరోగికి దీపదర్శనమువలె ప్రతికూలమై ఉన్నది.” రాముని ఈ మాటలలో దీపమునకువలె సీతలో దోషములేదని నేత్రరోగికివలె రామునియందు సందేహదోషమున్నదని విశదమగుచున్నది. ఇది లోకదృష్టిని తనపై నారోపించుకొనిన రాముని దృష్టిగాని, సీతాచరితముపై అచంచల విశ్వాసమున్న , సీతాహృద్గతభావము నెఱిగిన రాముని దృష్టి కాదు. అందుకే ముందుగా తన విశ్వాసమును ప్రకటింపక, లోకదృష్టితో సీతను సందేహించి, అగ్నిపూత అయిన పిమ్మట తన అభిప్రాయమును వ్యక్తము చేసినాడు. అపరీక్షితముగా తాను సీతను స్వీకరించినచో లోకదృష్టి ఎట్లుండునో రాముడిట్లు చెప్పుచున్నాడు -“ఈమె చిరకాలము రావణాంతఃపురమున ఉండుటచే అపవాదమునకు అవకాశమున్నది. ఈమెను నేను పరీక్షింపక పరిగ్రహించినచో ’రాముడు కాముకుడని,మూర్ఖుడని సజ్జనులు నిందింతురు.” ఇట్టి లోకాపవాదము తమకిద్దరకు లేకుండుటకే సీత అగ్నిప్రవేశమును రాముడు ఉపేక్షించినాడు.

 

ఇట్లు రాముడు సీతశీలముపై తన విశ్వాసముకంటె లోకాభిప్రాయమునకు ప్రాధాన్యమిచ్చినాడు. లోకప్రభువుగా పరిపాలనము చేయవలసిన రాముడు లోకమున కాదర్శప్రాయుడై మనవలసియున్నది. అట్టి స్థితిలో తన శీలము శుద్ధమై, సంశయ రహితమై, అపవాదమునకు దూరమై, స్పష్టమై, సర్వ విదితమై ఉండవలయును. అట్టి రాజశీలము ప్రజలకు అనుసరణీయమగును. సర్వవిదితమైన శీలపారిశుద్ధ్యమును అపేక్షించువాడు కావుననే సీతపై తనకున్న విశ్వాసమునకు ప్రాధాన్యమీయక. లోకసుఖము తన సుఖముకంటె విశాలమైనది అగుటవలన సీతపై తనకున్న అనురాగమును త్యజించి, సీత అగ్ని ప్రవేశమును ఉపేక్షించినాడు. చిత్రకూటమునకు ససైన్యముగా వచ్చుచున్న భరతుని చూచి, తమపై దండెత్తి వచ్చుచున్నాడని భ్రాంతిపడి ఉగ్రుడై ధనుస్సు ధరించుమని రామునిని ప్రేరణ చేయుచున్న లక్ష్మణునితో “తండ్రికి-(రాజ్యము భరతునకిత్తునని, పదునాలుగు వత్సరములు తానరణ్యవాసినగుదునని) మాట ఇచ్చి, ఇప్పుడు ఇటకు వచ్చుచున్న భరతుని చంపి, లోకాపవాదముతో కూడిన రాజ్యమును నేనేమి చేసికొందును?” అని సాపవాదమైన రాజ్యరూప అర్థమును త్యజించినాడు. ఇప్పుడు లోకాపవాదమునకు అవకాశమున్న సీతను పరిత్యజించినాడు, ఆమె అగ్నిప్రవేశమును ఉపేక్షించినాడు. భరతునికిచ్చిన మాట ప్రకారము భరతునిచే సభక్తికముగా తనకు నివేదింపబడిన రాజ్యమును స్వీకరించినాడు. అట్లే అగ్నిపూతయై, అపవాదరహితయైన సీతను స్వీకరించినాడు. దీనినిబట్టి రాముని అర్థకామములు ధర్మబద్ధమై, అపవాదరహితమై ఉన్నవని స్పష్టమగుచున్నది. ఇట్లు ధర్మార్థకామములలోని సూక్ష్మాంశముల నెఱిగినవాడు గనుకనే ఆయనను-“ధర్మకామార్థ తత్త్వజ్ఞః” అని ప్రశంసించిరి.

1 thought on “రాముని భర్తృధర్మము

  1. సుబ్బారావుగారూ! చాలా చక్కని వ్యాసమును అందించిన మీకు ధన్యవాదములు. లంకలో సీత అగ్నిపరీక్ష గురించి చాలా బాగా విశ్లేషించి చూపినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *