April 20, 2024

‘మానసపుత్రి’ …. (శ్రీ శారదాంబ ప్రియ పుత్రిక కథనం)

రచన: కోసూరి ఉమాభారతి

 

[బంగారు భవిష్యత్తుకై ఉన్నత విద్యల ఆశలతో, కలలతో విశాల ప్రపంచంలోకి అడుగిడుతున్న నేటి యువతకి,

వారి కలలు సాకారమవ్వాలని ఆశీరభినందనలతో, శుభాకాంక్షలతో, ఈ ‘మానసపుత్రి’ కథానిక అంకితం.

‘మానసపుత్రి’ నృత్య రూపకంగా, అమెరికాలో విశ్వవిద్యాలయ విద్యార్ధుల గౌరవార్దం

ప్రదర్శించ బడిన కథాంశం – కోసూరి ఉమాభారతి]

 

 

 

సకల చరాచర ప్రపంచంలోని జీవ, నిర్జీవ రాసులన్నీ బ్రహ్మదేవుని కను సన్నలలో, శివుని ఆజ్ఞ మేరకు జీవనాన్ని సాగిస్తున్నాయి. బ్రహ్మదేవుని సృష్టి నిరంతరం కొనసాగుతూనే ఉంది. అంతటి  బృహత్తర కార్యంలో మానవ కోటి లోని ప్రతి జీవి యొక్క తలవ్రాత  వ్రాస్తూ, ఆ అనంత నిరవధిక ప్రక్రియలో మునిగి తేలుతున్న ఆ బ్రహ్మదేవునికి, ఆనంద రూపిణి, అర్ధాంగి ఐన సరస్వతీదేవి తన వంతు సహకార సహాయాలని అందిస్తున్న దేవతా మూర్తి. దైవాంశ సంభూతమైన కళలని, విద్యలని, విజ్ఞాన పరిజ్ఞానాలను అర్హులైనవారికి ఆపాదిస్తూ, వరాల జల్లులు కురిపిస్తూ మేధావులుగా, శాస్త్రజ్ఞులుగా, పండితులుగా, సంగీత విద్వాంసుల గానో, నృత్య కళల కోవిదులు గానో   రాణించే   సామర్ధ్యాన్ని  ప్రసాదించి, పూజ్యురాలవుతున్నది ఆ దేవత.

 

చతుష్షష్టి కళలను అనుగ్రహించి, సంగీత రస స్వరూపమైన నెమలి వాహనంగా, ధవళ వర్ణ వస్త్రాలను ధరించి, అక్షమాలను, వీణను రెండు చేతులతో ధరించి, చందన చర్చితమైన దేహంతో దర్శనమిచ్చే సరస్వతీదేవికి ముల్లోకాలు నిత్యం నివాళులర్పిస్తుంటాయి.

 

   కీర్తన

 

బాధ్యతాయుతమైన ఆ ప్రక్రియ ఆమె హృదయాన ఓ చిరు కోరికకు, ఓ కమ్మని కలకు బీజం వేసింది. తనకీ ఓ కుమార్తె కావాలనీ, తానూ మాతృత్వాన్ని చవి చూసి తల్లిగా సంతృప్తి చెందాలనీ ఆశించింది.  ఆ కుమార్తె, అందచందాలలో  ,  అట పాటలలో మేటియై, సంగీత నృత్య కళలలో నిష్ణాతురాలై ఈ సృష్టికే వెలుగునిచ్చే ఓ తారలా వెలుగొందాలని, ఓ మాతృముర్తిలా గుండెలలో ఆకాంక్ష నింపుకొంది  ఆ దేవత. ఓ నిశ్చల చల్లని సాయంత్రపు వేళ తన కోరికని, బ్రహ్మ దేవునికి   విన్నవించుకొంది ఆమె.  బ్రహ్మదేవుడు అచ్చెరవొందినా, అబ్బుర పడ్డాడు. అయితే, “చూడు దేవీ, బిడ్డ ప్రాపకంలో ఆనందాలతోపాటు కష్టసుఖాలు, అసహనాలు ఉంటాయి, బిడ్డకీ తనదైన ఆలోచనా, నడవడి తప్పక ఉంటుంది   క్రమశిక్షణల్లో  పెంచినా, వాగ్వివాదాలు, పట్టువిడుపులు తప్పవు సుమా!,” అని సరస్వతీ దేవికి తెలియ చేస్తూ, సున్నితంగా హెచ్చరించాడు బ్రహ్మ.  ఇరువురి సంకల్పం ఒకటయిన వేళ, చిన్నారి దేవత ‘మానస’ సరస్వతీ దేవి మానసపుత్రిగా, పసికందై  ఆమె వడిలో అవతరించింది.  తలితండ్రుల మనస్సులు సంతోషాల సంద్రమే అయ్యాయి.  ఆ చిన్నారి జీవనం ఆనంద డోలికలై సాగింది.

 

పాపాయికి ముద్దు మురిపాలు,

తప్పటడుగుల బుజ్జాయికి బంగారు మువ్వలు,

కౌమార్యాన స్నేహాలు, ఆటపాటలు,

చిన్నారి జీవన ప్రస్థానం ఆనందమయం

 

స్వర్గాన విరబూసిన నందన వనాలు

బారులు తీరిన జాజి సంపెంగలు

కొమ్మకొమ్మకీ  తీయని రాగాల కోయిలలు

నింగి కెగసిన సంద్రాల జలపాతాలు

నేలనంటి పెట్టుకొని నీలి మేఘాలు

అంతా వన్నె చిన్నెల స్వర్గ ధామం

నిత్యం మానసకి మానస సంతోషాలే!

 

ఇంతటి మనోహరమైన  వాతావరణంలో ఓ గురుకులమే ఏర్పాటు చేసారు బ్రహ్మదేవులు తమ కుమార్తెకు.  ప్రపంచ నలుమూలల నుండి సంగీత సాహిత్య నృత్య గురువులు,  గణితశాస్త్ర నిపుణులు,  వేద పండితులు,  పలురకాల  విద్యల మేటి ఉపాధ్యాయులు సరస్వతీ బ్రహ్మదేవుల ఆస్థాన గౌరవ గురువులుగా కొలువై, మానసకి తమ వంతు విజ్ఞానాన్ని  శ్రద్ధతో పంచారు.

 


గురుశిష్య  పరంపర


శంకరా!

ఆధ్యాత్మక చింతన, అభినవ శాకుంతలం నుండి అధ్వైత వేదాంతం వరకు బోధించారు, మానసకి.  మానస, సంగీత నృత్యాలందు అత్యంత ఆశక్తి కనబరచింది. ఆమెకు రామాయణ, భారత, భాగావతముల నుండి విభిన్న కథాంశాలందు జిజ్ఞాస కలిగింది.  ఆధునిక సంగీత నృత్యాభ్యాసన క్కూడా మినహాయింపు లేకుండా, అన్నమయ్య కీర్తనలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు, జావళి లాంటి నాట్యాంశాలంటే మక్కువ పెరిగింది.

 


అన్నమయ్య కీర్తన

 

శ్రీ రామచంద్రుడు,  శ్రీ కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు భగవత్స్వరూపులైనా, మానవమాత్రులుగా పుడమిన వారు సాగించిన జీవనయానం,  వారు ఎదుర్కొన్న పరిస్థితులు, మహా పురుషులుగా మానవ జాతిని సన్మార్గాన నడిపించిన వైనాలు, మానసని ఉత్తేజ పరిచి ఆమెలో ఉత్సుకతని నింపాయి.  అంతే కాదు,  శ్రీ కృష్ణుని కొనియాడుతూ సాగే సంగీతమన్నా, నృత్యాలన్నా ప్రేత్యకంగా అభ్యసించి పాడుతూ, నాట్య మాడుతుండేది.

 


కృష్ణ శబ్దం


శిక్షణ

భూలోకం, మానసకి ఓ అధ్బుతమైన, అద్వితీయమైన ప్రపంచంగా తోచింది. ఎప్పటికైనా తాను భూలోకాన్ని సందర్శించాలనీ, ఆ సౌందర్యాన్ని తిలకించి, ఆ పరిసరాలలో విహరించి ఆనందించాలని ఆమె మనసున బలమైన కోరిక నాటుకొంది. పదహారు వసంతాల ప్రాయాన,  ముగ్ద మనోహర రూపంతో, విద్యల్లో పరిపక్వత చెందిన మేధస్సుతో, లలిత కళలందు అత్యంత నిష్ణాతురాలై తలితండ్రులకి ఎనలేని సంతోషాన్ని కలిగించింది నవయవ్వని మానస.  అభిమానం, ఆత్మీయతలతో తనవారికి తలలో నాలుకలా ఆత్మబంధువై, అందరి హృదయాలని చూరగొన్నదా చిన్నారి దేవత, మానస.

 

ఆమె మనస్సులో భూలోకానికి వెళ్ళాలన్న కోరిక పరవళ్ళు తొక్క నారంభించింది.  అదే ఆలోచనలో రేయి పవలు ఉండిపోయేది.  తన భూలోక పర్యటన కల ఎప్పుడు నిజమౌనోనని ఎదురుచూడ సాగింది మానస. మానస  పద్దెనిమిదవ  పుట్టినరోజు వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి .  ఎందరెందరో అతిధులు ముల్లోకాల నుండి విచ్చేశారు.  వేద పఠనం, నృత్య సంగీతాలు, బహుమతులు, దీవెనలు అన్నీ అయ్యాయి. మానస తలితండ్రులకు  పాదాభివందనం గావించి, ” అమ్మా, నాన్నగారు, మీ పుత్రికనయ్యే భాగ్యం నా జన్మకి ఓ దివ్య వరమే, మీ ప్రాపకంలో నేను నేర్వని విద్య గాని, అభ్యసించని కళ గాని, తెలుసుకోని విషయా విశేషణాలు గాని లేవు.  నాకు లభించిన ఈ పరిజ్ఞానంతో ప్రపంచాన్ని శోధించాలనీ, మరెన్నో వింతలు విశేషాలు స్వయంగా కనుగొనాలనీ, వీక్షించాలనీ, అందుకు గాను భూలోక పర్యటన చేయాలని నా కోరిక,  మీకు నా విజ్ఞప్తి”, అంటూ బ్రహ్మ, సరస్వతీల ముందు చేతులు జోడించింది తనయ మానస.  ” నా చదువులు ముగించి అన్నిటా ఉత్తీర్ణురాలనయ్యాను.  మీరు అనుమతించిన వెంటనే బయలు దేరుతాను”, అని మానస తలి తండ్రుల ముందు భక్తితో మోకరిల్లింది.

 

వ్యాకులతతో మదనపడుతున్న సరస్వతీదేవిని గమనించిన బ్రహ్మ దేవుడు, “ఈ రోజు వస్తుందనీ, మన పుత్రిక లోగిలి వీడి విశాల ప్రపంచంలో అడుగిడుతుందనీ, ఊహించినదే కదా!,” “మరీ దిగులు పడక, మానసని దీవించుదాము,” అన్నాడు బ్రహ్మ దేవుడు అర్ధాంగితో.  మానసని ఆశీర్వదించి ఆమె పర్యటనకి ముహూర్తం పెట్టించారు ఆ తలితండ్రులు. తన బిడ్డ చిన్నతనంలో ఆడిన ఆటలు, పాడిన పాటలు, ముద్దు ముచ్చట్లు జ్ఞాపకం చేసుకొని, మానస పుట్టినరోజు సంధర్బంగా, ప్రకృతికి, సూర్య చంద్రులకి, పంచభూతాలకి, తన బిడ్డ ఎంతటి అపురూపమైనదో తెలియజెప్పింది ఆ తల్లి సరస్వతీ దేవి.

 

పసిడి తల్లి …..

ఆ నును లేత చెక్కిళ్ళకు

అమ్మ ముద్దుల తళుకులు తప్ప

తాక లేదు కన్నీటి వెచ్చదనం

 

తప్పటడుగుల వైనాలు దాటి

అంబరమంటే సంబరాల

మయురాల భంగిమల

అప్సరలా నాట్యమాడె నేడు

 

నాటి బోసినోటి కేరింతలు

నేడు చిలిపినవ్వుల సంగీతాలు

ఉప్పెనలా ఆగని ఆమె పలుకులు

సేద తీర్చె అలిసిన మనసుల

 

చిట్టి పావడ కట్టి

చిరుమువ్వ లెట్టి

నడయాడినట్టి చిట్టిది

నేడు జలతారు వోణీల

అందాల వైతరణి

 

నీలికన్నుల మెరుపులు

చిరునవ్వు జోడై

అద్దాల చెక్కిళ్ళపై

చిందులాడె నేడు

 

వెతలెరుగని కనుదోయి

తమ్మిరేకుల పోలి

సొగసుచూపులు చిందించె నేడు

తరలి  పోయె  ఆ పసితనం

పొంగై  వచ్చె యవ్వనం

పరుగులెట్టేనిక ఆ సోయగం

 

ఎగిసిపోయె ఆమె ఆశలు

గగనమంటె ఆమె తలపులు

పొరలిపోయె ఆమె కలలు

 

సహకరించి చేయూతనిచ్చి

సంతసించి సంతోషాన్ని పంచి

ఆమెని ఎదగనిచ్చి

హాయిగా వొదగనిద్దాం!

 

అంటూ ఆ తల్లి శారదాంబ, మానసపై కోటిదీవెనల జల్లు కురిపించింది.  అటపై, మానస పర్యటన గురించి తెలియజెప్పి, తన బిడ్డని కరుణతో చూడమని, అలిసి సోలిసి నపుడు సేద తీర్చమని, పుడమితల్లిని, ప్రకృతిని, సప్తసముద్రాలని వేడుకొంది. మానస నాట్యాలు, నయగారాలు కూడా పరవశంతో తిలకించమని కోరుకొంది.

చిలుక కులుకుల కొలికి

(తనయ భూలోక పయనమయిన సమయాన, ప్రకృతికి, సరస్వతీదేవి విన్నపాలు)

అద్దాల చెక్కిళ్ళ , వయ్యారి నడకల

లేలేత మునివేళ్ళ సుతి మెత్తని తాకిడల

ముత్యాలు చిందునట్టి చిరుసిరి నగవుల

కుశల మడుగుతున్నట్టి  కలువ కన్నుల

దేవతలా నిను తాకి దయ చూపుతున్నటుల

ఆడింది పాడింది చిన్నారి సిరి మల్లి

 

పసిమి ఛాయల మేనుపై జలతారు పయ్యెదల

మన్మధ ఛాపమును తలపించు సొగసుల

నీలాల కురులు మరిపించె చీకటుల

చిలిపి చూపుల కోణంగి రమ్మని పిలిచినటుల

 

మైమరచి పరుగులెత్తి తచ్చట్లాడకుమా!

అల్లంత దూరాన ఆగి తిలకించుమా!

సొగసు కని  క్షణమైనా ఈర్ష్య పడబోకుమా!

పసిడి తల్లి అది ప్రేమతో చూడుమా!

 

నింగీ, నేలా, వెండి మబ్బులారా!

నీటి కెరటాల దాగున్న చిరు చేపలారా!

అతి మృదువుగ లాలించి, దయతో దీవించి

నవ్వించి, సేద తీర్చి, స్నేహంగా మీరంతా

ఆ చిన్నారి దారులలో వెలుగులే నింపుమా!

 

ఎంతో హృద్యంగా వేడుకొంది ఆ దేవత.  ఆమెకి తప్పక చేయూత నిస్తామని వారంతా సద్భావనతో సరస్వతీ దేవికి వాగ్దానం కుడా చేసారు.

 


ఆగమన

మానస పర్యటన మొదలై,  చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా సాగుతుంది. నును లేగ దూడలు, వయ్యారాల గొల్లభామలు, రంగుల హరివిల్లులు, పారే సెలయేరులు, పురి విప్పిన నెమళ్ళు, పంచవన్నెల రామ చిలుకలు, ఒకటేమిటి,  ప్రకృతిలోని ప్రతి జీవితో, ప్రతి కదలికతో  మమేకమై నాట్యమాడింది, పాట పాడింది, మైమరిచి పులకించి పోయింది మానస.  స్నేహితురాళ్ళకి, మానసకి అన్నిటా, అన్నివేళలా  పండుగలా, ఓ వేడుకలా సాగింది వారి భూలోక పర్యటన……

 


ఈ జగమే నాట్యమయం

అలా మానస పయనం సాగుతూనే ఉంది….


శ్రీ శారదాంబకి నివాళి!

 


6 thoughts on “‘మానసపుత్రి’ …. (శ్రీ శారదాంబ ప్రియ పుత్రిక కథనం)

  1. I read and listened to the audios. It is very well done. You have very creative mind and used your talent to write a beautiful story. Congratulations. Keep it up.

  2. ఆ శారదాంబ దివ్యానుగ్రహం కోసం వచ్చిన విద్యార్ధులకోసం ఉద్దేశించబడి, ప్రదర్శించబడిన ఈ “మానసపుత్రి..”
    రసహృదయులను రంజింపచేసేదిగా వుంది. కోసూరి ఉమాభారతిగారూ, మనఃపూర్వక అభినందనలు.

    1. Lalitha garu, Yogi garu, Bhavani garu,

      సమయం తీసుకొని చదివి, స్పందించి, చక్కని వ్యాఖ్య రాసినందుకు ధన్యవాదములు….

      Uma

  3. Uma garu

    I checked the links it just now. Very interesting

    ఆ.వె.||శారదశరణమది శాశ్వతశిబిరంబు

    శ్వాశస్వాదములును స్వాంకికమ్ము!

    శారదాంబ నృత్యసారమతిశయించె

    స్వాంతశాంతిసాంత్వశమనమొందె !

    Very nice depiction of the storyline.

  4. your fire brand description reminded me of sri sri ‘s sahityam. you can very easily write,direct,act,produce, choreograph ,artistic movies and educate masses..we look forward to read some of your thoughtful creations on present day corruption in society.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *