April 19, 2024

వేణీ సంహారం – ఒక పరిచయం

రచన : రవి ENV..

 

 

ఉపోద్ఘాతము

 

“నాటకాంతే సాహిత్యం” – అని లక్షణకారుడి తీర్పు. హితమును కూర్చేది సాహిత్యమయితే, సాహిత్యానికి చివరి ప్రస్థానం దృశ్యకావ్యాలు. వేదాలు ప్రభుసమ్మితాలు, పురాణాలు ప్రియసమ్మితాలు కాగా కావ్యాలు కాంతాసమ్మితాలు. అంటే – వేదాలు సమాజ జీవన నియమాలను ప్రభువు వలే శాసించి చెబితే, పురాణాలు అనునయంగానూ, కావ్యాలు ప్రేమగానూ చెబుతాయి. కావ్యాలలో దృశ్యకావ్యాల స్థానం అనుపమానం. చాతుర్వర్ణ్య వ్యవస్థలో వేదాధ్యయనాధికారం అన్ని వర్ణాల వారికీ లేదని, అందుకు ప్రత్యామ్నాయంగా పంచమవేదంగా “నాట్యశాస్త్రం” వేదార్థసారంతో కూర్చినట్టు భరతమహాముని చెప్పాడు. ఈ నాట్యశాస్త్రం ఆధునిక కాలంలో లభించిన గ్రంథాలలోకన్నిటిలోకి  ప్రాచీనమైనది. దశవిధరూపకాల విభజనతో బాటు, రూపకానికి చెందిన అనేక అంశాలను స్పష్టంగా, వివరంగా ఐదువేల శ్లోకాలతో భరతముని వివరించారు.

 

 

 

 

నాటకానికి మూడు ప్రధానమైన అంగాలు. 1. వస్తు (ఇతివృత్త) (Plot) 2. నాయక (Hero) 3. రసము (Sentiment)

 

కావ్య నేత, లేక నాయకుడు నాలుగు రకాలు. అందులో నాటక మనే రూపక భేదానికి ధీరోదాత్తుడు నాయకుడు కావాలని శాస్త్రనియమం. “మహాసత్వోऽతిగంభీరః, కృపావానవికత్థనః” – ఇవి ధీరోదాత్తుని లక్షణాలుగా ప్రతాపరుద్రీయయశోభూషణకావ్యకర్త విద్యానాథుడి వివరణ. (అవికత్థనుడంటే – ఆత్మప్రశంస చేసికోనివాడు) ఇక మూడవ అంగం రసం.రసమంటే – కావ్యము వలన పాఠకుని మనసులో కలిగిన స్పందన. కావ్యానికి కావలసిన ప్రధానలక్షణం రసమని అని అలంకారికుల భావన.

 

ధీరోదాతుడి లక్షణాల ప్రకారం నాయకుడు “కృపావాన్” – కృపాంతరంగుడు కావాలి. అలాగే అవికత్థనుడు అయి ఉండాలి. ఈ రెండూ ఈ నాటకంలో భీముడికి (ఇంకా అనేక నాటకాలలో నాయకులకు) వర్తించవు కదా అని సందేహం వస్తుంది. అందుకు సమాధానంగా – అభినవగుప్తపాదుల వ్యాఖ్య – “కావ్యోపనిబద్ధధీరోదాత్తాద్యవస్థానుకారశ్చతుర్విధాభినయేన తాదాత్మ్యాపత్తిర్నాట్యమ్ ||”  అంటే – నాట్యానికి సంబంధించి ధీరోదాత్తాది లక్షణాలు అవస్థాభేదసూచకాలే తప్ప, జాతిసూచకాలు కావు అన్నది స్పష్టమవుతుంది.

 

రూపక సాహిత్యపు లక్షణాలు చాలా విస్తృతంగా వేదకాలానికే వేల శ్లోకాలతో భరతముని విరచించియున్నారు. భరతుని నాట్యశాస్త్రం ప్రస్తుత ప్రతిలో ఐదువేల శ్లోకాలున్నప్పటికీ, ఒకప్పుడు పండ్రెండు వేల శ్లోకాలతో కూడి ఉండేదని ఒక వాదం ఉంది. నాంది, నిష్కంభకము, సంధులు, అర్ధప్రాకృతులు, అవస్థలు, సంధులు, సంధ్యంగాలు, భరత వాక్యం మొదలైన అనేక దృశ్యరూపక సంబంధిత విషయాలను భరతముని, తదనంతర లాక్షణికులు, సోదాహరణంగా విస్పష్టంగా విపులీకరించారు.

 

భారతీయ నాటక సాహిత్యంలో లక్షణశాస్త్రాన్ని చక్కగా అనుసరిస్తూ, ఆనందవర్ధనుడు (ధ్వన్యాలోకము), దండి (కావ్యాదర్శం), ధనంజయ కవి (దశరూపకం), మమ్మటభట్టారకుడు (కావ్యప్రకాశం), వామనభట్టు (అలంకారసూత్ర వృత్తి) వంటి కవిపండితులు వివిధ సందర్భాలలో ఉటంకించిన ఒకానొక చక్కటి నాటకం, భట్టనారాయణ కవి విరచిత వేణీ సంహార నాటకం. నాటకంలో ప్రధాన రసం వీరం.

 

ఇతివృత్తం

 

ఈ నాటకానికి ఆధారం మహాభారతేऽతిహాసం. నిండుసభలో ద్రౌపదిని దుశ్శాసనుడు, దుర్యోధనుడు అవమానిస్తే, దుశ్శాసనుని ఉరము చీల్చి రక్తం తాగుతానని, దుర్యోధనుని ఊరువులను చూర్ణం చేస్తానని, అతని రక్తం ద్రౌపది కేశాలకు అలది వేణీ బంధం వేస్తానని  భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు. అదే వేణీసంహార నాటక బీజం.

 

వేణీ సంహారం అంటే –

వేణి (ముడివేయడం) కొరకు సంహారం

వేణి వలన (జరిగిన కౌరవ) సంహారం

వేణి కి సంహారం (నివృత్తి)

అని మూడు రకాల నిర్వచనాలు ఊహిస్తే, మొదటి నిర్వచనం (చతుర్థీ విభక్తి) నాటకానికి దగ్గరగా సరిపోతుందని నాటకంలో ఓ శ్లోకం ద్వారా తెలుస్తుంది.

 

ఈ రూపకానికి నాయకుడు ఎవరు అన్న విషయం మీద కొన్ని మీమాంసలు ఉన్నవి.

 

“అధికారః ఫలస్వామ్యధికారీ చ తత్ప్రభుః |” – ఫలస్వామ్యము – జూదంలో కోలుపోయిన రాజ్యము తిరిగి పొందడమైతే, ఆ ఫలస్వామ్యానికి ప్రభువు ధర్మరాజు కాబట్టి, ఆయనే ఈ నాటకానికి నాయకుడు అని కొంతమంది వాదిస్తున్నారు. ఆ వాదం ఇంకాస్త పొడిగించి – ధర్మరాజు నాయకుడైనప్పటికి, ధర్మరాజు ప్రసంగం కేవలం చివరి అంకంలో వస్తుంది కాబట్టి, ఔచిత్యం సరిగ్గా కుదరలేదని విమర్శించిన వారు ఉన్నారు. అయితే వేణీ సంహారానికి (ద్రౌపది జుట్టు ముడవడానికి) ఫలస్వామి భీముడు కాబట్టి, నాయకుడు నిస్సందేహంగా భీముడే అని ఎక్కువమంది పండితుల అభిప్రాయం.

 

కథ

 

మహాభారత కథ తెలిసినదే కాబట్టి ఆరు అంకాలలో నాటకీకరించిన ఈ కథను సంక్షిప్తంగా చెప్పుకుందాం.

 

మొదటి అంకం:-

భీమ, సహదేవుల సంభాషణతో, నాటకం ప్రారంభమవుతుంది. తన తమ్ములమీద, యాజ్ఞసేని మీద లేని అనురాగం దాయాదుల మీద చూపిస్తున్నాడని, భీముడు అన్న ధర్మరాజు మీద ఆగ్రహంగా ఉంటాడు ఒక్కరోజు తనకు, ధర్మరాజుకు తమ్ముడు కాకుండా ఉండే అవకాశం వస్తే, ఆ ఒక్కపూటే కౌరవులను పరిహరిస్తానంటాడు. మాటలాడుకుంటూ ద్రౌపది గృహం (చతుశ్శాల) కు చేరతారు ఇద్దరూ. ద్రౌపది కోసం నిరీక్షిస్తూ, తమ సంభాషణ కొనసాగిస్తారు. అన్నయ్య కృష్ణుణ్ణి రాయబారం కోసం పంపాడని, రాయబారంలో భాగంగా ఐదు ఊళ్ళు ఇచ్చినా సంధి జరుపుకోడానికి సన్నద్ధమని తెలిసి భీముడు కృద్ధుడవుతాడు. ఇంతలో ద్రౌపది వచ్చి, వీరి మాటలను చాటుగా విని ఆనందిస్తుంది. కాసేపటికి ద్రౌపది ఆగమనం భీమ సహదేవులు గుర్తిస్తారు. ఇంతలో భగవంతుడైన కృష్ణుడిని దుర్యోధనుడు బంధింపబూనితే, అతడిని విశ్వరూపంతో భీతావహుణ్ణి చేసి, కృష్ణుడు తిరిగి వచ్చాడని, సంధి బెడిసికొట్టిందని తెలుసుకుంటారు.

 

రెండవ అంకం:-

అప్పటికి యుద్ధం మొదలయి పది రోజులయ్యిందని నిష్కంభకం ద్వారా తెలుస్తుంది. (కథను కథాపాత్రల ద్వారా కాక, ఇతరుల వల్ల తెలిపే ప్రక్రియకు నిష్కంభకం అని పేరు. అవి ఐదు విధాలు.వాటిలో ఆకాశభాషణం అనే ప్రక్రియ ఈ ఘట్టంలో కవి ఉపయోగించాడు) ఆ రోజు యుద్ధంలో అభిమన్యుణ్ణి సంహరించిన ఆనందంలో దుర్యోధనుడు, భానుమతిని వెతుకుతూ బయలుదేరాడు. భానుమతికి ఓ దుస్స్వప్నం వచ్చి ఉంటుంది. ఆ స్వప్నంలో నకులుడు (నకులః పుల్లింగం అంటే ముంగిస) నూరు సర్పాలను సంహరిస్తాడు. ఈ వృత్తాంతం తన చెలికత్తెకు ఉద్యానవనంలో వివరిస్తూ, చింతాక్రాంతురాలై ఉంటుంది. ఆ సమయంలో దుర్యోధనుడు ఓ చెట్టు చాటుగా ఆమె మాటలు వినడం మొదలెడతాడు. స్వప్న వృత్తాంతంలో నకులుడు భానుమతిని అనుసరిస్తూ వచ్చి, తను కూర్చున్న తిన్నెపై, పక్కనే కూర్చుంటాడు. విశాలమైన చేతులతో తన పమిట చెంగు మీద చేయి వేస్తాడు. చాటుగా వింటున్న దుర్యోధనుడు, భానుమతి మాద్రీసుతుడితో రమిస్తుందని అపార్థం చేసుకుని ఆమె శీలాన్ని శంకిస్తాడు. ఎలాగైనా ఆ రోజు యుద్ధంలో నకులుణ్ణి చంపాలని అనుకుని బయలుదేరబోతుండగా, భానుమతి చెప్పిన వృత్తాంతం స్వప్నమని ఆమె మాటలద్వారానే తెలుస్తుంది. తొలగిన అపార్థంతో ఆమెను చేరుకుంటాడు. ఆమెతో సల్లాపాలు ఆరంభిస్తాడు. ఇంతలో ఓ ఝంఝామారుతం వీస్తుంది. ఆమెను తోడుకుని, మందిరానికి వెళతాడు. ఇంతలో తన చెల్లెలు దుస్సల, జయద్రథుడి తల్లి వస్తారు. అభిమన్యుడి చావుకు ప్రతీకారంగా అర్జునుడు, తనభర్తను సంహరిస్తానని తీవ్ర శపథం చేశాడని దుస్సల చెబుతుంది. ఆమెను అనునయించి, రథంపై యుద్దానికి బయలుదేరతాడు కురుసార్వభౌముడు.

 

మూడవ అంకం:-

యుద్ధంలో చచ్చిన అనేకుల రక్తమాంసాలను ఓ రాక్షసజంట భక్షిస్తూ ఉంటుంది. ఆ రాక్షసజంటకు నాయకురాలు హిడింబి. వారికి, భీముడిని ఆవహించమని ఆమె సూచించడంతో వారు భీముడున్న దిశగా వెళతారు.

 

అశ్వత్థామకు తన సైన్యంలో వారు భీతితో పరుగులెత్తడం కనిపిస్తుంది. గొప్పయోధుడు, అప్రతిహత వీరుడు అయిన తండ్రి సైన్యాధిపత్యంలో ఈ వింత యేమిటని ఆలోచిస్తూ ముందుకు వెళుతుంటే, తన తండ్రి రథసారథి వచ్చి, ద్రోణుడు అశ్వత్థామ హతుడయ్యాడన్న వార్త ధర్మరాజు నోట విని, అస్త్ర సన్యాసం చేశాడని, అతడిని ధృష్టధ్యుమ్నుడు హతమార్చాడని వివరాలు చెబుతాడు. అశ్వత్థామ దుఃఖతప్తమానసుడౌతాడు. పాండవులను ఎలాగైనా నిర్మూలించాలని అనుకుంటాడు. ఇంతలో కృపుడు అక్కడికి వస్తాడు. కృపుడు అశ్వత్థామను సర్వసైన్యాధ్యక్ష పదవి వహించమని, అందుకై రారాజును ఒప్పించడానికి బయలుదేరతాడు. అక్కడ ఆ సరికే కర్ణుడు దుర్యోధనుడు అశ్వత్థామపై, ద్రోణునిపై నిందలు మోపి, రారాజు మనసు విరిచేసి, తను సర్వ సైన్యాధిపతిగా నియమితుడయానని సుయోధనునితో మాట పుచ్చుకుంటాడు. ఇంతలో అశ్వత్థామ, కృపుడు అక్కడికి వస్తారు. కృపుడు అశ్వత్థామ విషయం రారాజుతో సంప్రదిస్తాడు. పక్కనున్న కర్ణుడు అశ్వత్థామతో ద్రోణుడు పాండవపక్షపాతి అని నిందిస్తాడు. ఇద్దరికీ వాగ్వివాదం జరుగుతుంది. కర్ణుడు బ్రతికి ఉన్నంతవరకు, తను యుద్ధం చేయనని అశ్వత్థామ శపథం చేస్తాడు. నేపథ్యంలో భీముడు దుశ్శాసనుడితో భీకరయుద్ధం చేస్తున్నట్టు కలకలం వినిపిస్తుంది. యువరాజును ప్రతిజ్ఞాభంగం చేసైనా రక్షిస్తానని అశ్వత్థామ బయలుదేరితే అశరీరవాణి ఆపుతుంది. భీముణ్ణి ఆవహించిన రాక్షసుడు దుశ్శాసనుణ్ణి చంపగానే ఉరం చీల్చి రక్తం త్రాగుతాడు.

 

నాలుగవ అంకం

దుశ్శాసన, భీముల మధ్య యుద్ధం జరుగుతుండగా, మూర్ఛితుడైన సుయోధనుణ్ణి, సూతుడు రణరంగం నుండి తప్పించి దూరంగా ఓ సరోవరం వైపు తీసుకుని వస్తాడు. అక్కడ కొన్ని పరిచర్యల తర్వాత రారాజు మేల్కొని, ఎక్కడ భీముడు అంటూ యుద్ధానికి బయలుదేరుతాడు. సారథి అతడికి జరిగింది చెబుతాడు. యుద్ధరంగం నుండి తనను తీసుకువచ్చినందుకు సారథిపై కోపం ప్రదర్శిస్తాడు సుయోధనుడు. ఇంతలో సుందరకుడనే సేవకుడు సుయోధనుణ్ణి వెతుకుతూ అక్కడికి చేరుకుంటాడు. రారాజుకు నమస్కరించి, యుద్ధవిశేషాలు చెప్పటం ఆరంభిస్తాడు. దుశ్శాసనుడు పడిపోయిన తర్వాత, కర్ణుడు మహా రోషంతో భీమునిమీదకు యుద్దానికి వెళతాడు. భీమునికి సహాయంగా అక్కడకు అర్జునుడు వస్తాడు. వచ్చిన అర్జునుడికి, కర్ణుడి పుత్రుడు వృషసేనుడికి మధ్య మహాభయంకరమైన యుద్ధం జరుగుతుంది. వృషసేనుడు మహాశౌర్యంతో పాండవమధ్యముణ్ణి చీకాకు పరుస్తాడు. ఇరువర్గాల వారు, కర్ణుడు, భీముడు కూడా తమను తాము మర్చి, ఈ యుద్ధాన్ని చూస్తారు. యుద్ధంలో కొంతసేపు తర్వాత, దట్టమైన శరపరంపర కనులను కప్పేస్తుంది. చివరకు ఆ యుద్ధంలో వృషసేనుడు అస్తమిస్తాడు. పుత్రశోకంతో కర్ణుడు, సుందరకుణ్ణి పిలిచి, రారాజుకు అందజేయమని ఓ తెల్లటి గుడ్డపై, తన రక్తం సిరాగా బాణం మొనతో ఓ లేఖ వ్రాస్తాడు. “మహారాజా! ఇది నా చివరి లేఖ. వత్సుడు, దుశ్శాసనుణ్ణి కాపాడలేని నిస్సహాయుడిని అయితిని. ప్రతీకారం కూడా నెరవేర్చలేకపోతిని. ఇక నీవే శౌర్యంతోనో, కన్నీటితోనో నీ దుఃఖం నీవే ఉపశమింపజేసుకొనుము”. ఈ వివరాలు చెప్పి సుందరకుడు ముగిస్తాడు. సుయోధనుడు మిత్రుశోకంతో, మిత్రుని సుతుడు, తన అంకంపై ఆడించుకున్న వృషసేనుడు మరణించిన శోకంతో, తమ్ముడి మరణశోకంతో బాధపడతాడు. ఇంతలో ధృతరాష్ట్ర, గాంధారులు వచ్చారన్న వార్త తెలుస్తుంది. వారి వద్దకు వెళతాడు.

 

ఐదవ అంకం

ధృతరాష్ట్ర, గాంధారులు దుర్యోధనునికి యుద్ధం మానమని, మిగిలిన ఒక్క కొడుకైన నిన్నూ పోగొట్టుకోలేమని నచ్చజెప్పప్రయత్నిస్తారు. సంజయుడు కూడా మంచిమాటలు చెబుతాడు. దుర్యోధనుడు వారికి సమాధానం చెబుతాడు. ఇంతలో సూతుడు వచ్చి కర్ణమరణవృత్తాంతం చెబుతాడు. హతాశుడౌతాడు సుయోధనుడు. ఇంతలో అక్కడికి భీమార్జునులు వస్తారు. భీముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేస్తాడు. ధృతరాష్ట్ర, గాంధారులను వారు విమర్శిస్తారు. దుర్యోధనుడూ ప్రతివిమర్శ చేస్తాడు. ఇంతలో ఆ రోజు యుద్ధం ముగిసిందని, భీమార్జునులకు, ధర్మరాజుచేత కబురందుతుంది. అశ్వత్థామ అక్కడికి వస్తాడు. ఇప్పుడైనా తనకు ’అపాణ్డవం’ చేయడానికి అవకాశం ఇమ్మని రారాజును అశ్వత్థామ అడుగుతాడు. మిత్రుని మరణంతో క్రుంగిపోయి ఉన్న రారాజు అశ్వత్థామను ఆదరించడు. అశ్వత్థామ విషయంలో నిరాదరణ తగదని ధృతరాష్ట్రాదులు దుర్యోధనునికి నచ్చజెబుతారు. ఆ మాటలు పెడచెవినపెడతాడు దుర్యోధనుడు. సంజయుని తోడుగా పెద్దలను పంపివేసి, దుర్యోధనుడు రథారూఢుడై సాగుతాడు.

 

ఆరవ అంకం

శల్యమరణానంతరం దుర్యోధనుడు సమంతపంచకమనే మడుగులో దాగి ఉంటాడు. అక్కడికి భీమార్జున నకులసహదేవులతోబాటు కృష్ణుడు వెళతాడు. ఆ మడుగు పక్కనున్న అడుగుజాడలను బట్టి దుర్యోధనుడు ఆ మడుగులో జలస్థంభన విద్య సహాయంతో దాగి ఉన్నట్టు తెలుసుకుంటారు. ఇక్కడ ధర్మరాజు, ద్రౌపది ఉన్న చోటికి చార్వాకుడు అనే రాక్షసుడు, విప్రవేషంలో వస్తాడు. ఈతడు దుర్యోధనుని మిత్రుడు. ధర్మరాజు, ద్రౌపది ఈతని సముచిత రీతిని సత్కరిస్తారు. ఆ చార్వాకుడు వీరికి సమంతపంచకం వద్ద జరిగిన కథను క్రింది విధంగా చెబుతాడు.

“సమంతపంచకంలో దాగిన దుర్యోధనుని భీముడు ఈసడించి, నిందిస్తాడు. దుర్యోధనుడు బయటకు వచ్చి, వాళ్ళకు బెదిరి కాదని, తన విశ్రాంతి కోసమే మడుగులో దిగానని ధిక్కరించి చెబుతాడు. కృష్ణుడు అక్కడున్న నలుగురు పాండవులలో ఎవరో ఒకరిని ఎంచుకుని వారితో యుద్ధం చేయమని దుర్యోధనుడికి చెబుతాడు. ఆ పిమ్మట భీమదుర్యోధనుల యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుని చేతిలో నిహతుడౌతాడు.”

 

చార్వాకుడు చెప్పడం ముగించగానే ద్రౌపది, ధర్మరాజాదులు మూర్ఛపోతారు. ద్రౌపది ధర్మరాజుతో యుద్ధమైన చేయమని, లేదా ప్రాణత్యాగానికి సిద్ధపడమని అంటుంది. సమంతపంచకం దగ్గరకు వెళదామంటే చార్వాకుడు ధర్మరాజును వారిస్తాడు. తన గుట్టు బయటపడుతుందని అతడి భయం. ధర్మరాజు, ద్రౌపది ఇద్దరు కలిసి చితిలో దూకి మరణించడానికి నిశ్చయించుకుంటారు. చితి వ్రేలుస్తుండగా, ఒకానొక యోధుడు రక్తంతో మలినమైన దుస్తులతో, చెదరిన శిఖతో గద చేతబట్టుకుని సింహనాదం చేస్తూ అక్కడికి వస్తాడు. ఆతడు దుర్యోధనుడని తలచి ధర్మరాజు ఆతణ్ణి ద్రౌపది దగ్గరకు వెళ్ళకుండా నిలువరించడానికి అతణ్ణి పట్టుకుంటాడు. ద్వంద్వయుద్ధం చేయమంటాడు. ఇంతలో కంచుకి భీముణ్ణి గుర్తించి ధర్మరాజాదులకు చెబుతుంది. సంభ్రమాశ్చర్యాలకు లోనై ధర్మరాజు ఆనందిస్తాడు. వేణీ సంహార ఉత్సవానికి భీముణ్ణి పురమాయిస్తాడు. చార్వాకుణ్ణి నకులుడు సంహరించాడని అక్కడికి చేరుకున్న కృష్ణుడు చెబుతాడు. ద్రౌపది జుట్టు ముడివేయడంతో నాటకం ముగింపు.

 

కవికాలాదులు

 

సంస్కృత సాహిత్యంలో ఇతర కవులలాగానే ఈ కవి కాలం కూడా స్పష్టంగా లేదు. ఈ కవి గురించి ఇతర కవుల ఉటంకింపుల వల్ల, కవి కాలాన్ని ఉరామరికగా అంచనా వేశారు. ఆ ప్రకారంగా ఈ కవి కాలం క్రీ.శ. 750-850 మధ్యకాలమని తేల్చారు. గౌడవంశస్థుడు, వంగదేశ ప్రభువు అయిన ఆదిశూరుడి కాలంలో కన్యాకుబ్జం (కనౌజ్) నుండి వలస వచ్చిన ఐదుగురు బ్రాహ్మణుల సంఘానికి భట్టనారాయణుడు నాయకుడు. ఆదిశూరుడు భట్టనారాయణుడికి, అనుచరులకు కలిపి ఐదు ఊళ్ళు ఇచ్చాడని, ఆ సంఘటన యొక్క ఛాయను నాటకంలో జొప్పించాడని ఒక అనుకోలు. ఆ ఐదు ఊళ్ళతో మొదలుపెట్టిన ఆతని వంశం క్రమక్రమంగా విస్తరించి, ప్రత్యేక రాజ్యంగా మారిందని కొందరి ఊహ. ఆ వంశమే నేటి కాలపు ప్రఖ్యాత ఠాగూర్ వంశమని ఒక నమ్మిక.

 

ఈ కవి “కవులలో మృగరాజు” గా అభివర్ణితుడు. అలాగే రాత్రిని గురించి అద్భుతమైన వర్ణనలు చేశాడని “నిశానారాయణుడని” మరొక పేరు. భట్టనారాయణుడికి చెందిన మరో రెండు కావ్యాలున్నవని దండి మహాకవి పేర్కొన్నాడు. అవి ఏవో తెలియదు. కొందరు దశకుమారచరిత పూర్వపీఠిక భట్టనారాయణుడిదని వాదిస్తున్నారు. ఈ కవి భవభూతిని అనుసరించాడని ఆధునిక కాల విమర్శకులు పేర్కొంటున్నారు.

 

భట్టనారాయణుడు ఒక్క వేణీసంహారాన్ని మాత్రమే వ్రాశాడని అనేకులంటున్నారు. మానవల్లిరామకృష్ణ కవిగారు మాత్రం “కృత్యారావణ నాటకం” అని మరొక నాటకం భట్టనారాయణవిరచితమేనంటున్నారు.

 

ఈ తతంగమంతా ఇట్లా ఉంటే – మహాభారతం ఆంధ్రీకరణలో నన్నయభట్టునకు సహకరించిన నారాయణభట్టే భట్టనారాయణుడని, నిశానారాయణుడంటే “చీకట్ల” అన్న ఇంటి పేరు గలవారని, నారాయణభట్టు ఇంటిపేరు బహుశా అదే అయి ఉండవచ్చునని, కవిమృగరాజు అంటే మృగరాజుగా ప్రఖ్యతి చెందిన ఒక చోళవంశ మహారాజవంశజుడిచేత మన్ననలందుకొన్న కవి అని ఒకానొక పండితుడు ప్రతిపాదించినాడు. ఆ తర్వాత ఇద్దరి కాలాలకూ సరిగ్గా అన్వయం కుదరక, నారాయణభట్టు తాతగారే భట్టనారాయణుడని ఆయనే మరో వ్యాసం వ్రాశారు. ఈ వ్యాసాలు భారతి పత్రికలో వచ్చినాయి. ఈ వ్యాసాలలో ప్రతిపాదనలు దూరాన్వయాలు, విపరీతమైన ఊహలు మాత్రమేనని శ్రద్ధగా గమనిస్తే అర్థమవుతుంది. కాలం సరిగ్గా తెలియని కవులను తమ వాడని చెప్పుకుందుకు సువిశాల భారతదేశంలో భిన్న భాషల వారు ప్రయత్నించడం కొత్తకాదు. అందుకు ఆంధ్రులూ మినహాయింపు కాదు.

 

కవిత్వం, శైలి, అలంకారాదులు

 

కావ్యరచన 3 రీతులని లాక్షణికులు పేర్కొన్నారు. సమాసభూయిష్టము, ప్రౌఢమైన రీతి గౌడీ రీతి, ప్రాసాద గుణభరితము, లలితము ఐన రీతి వైదర్భీరీతి, వాటి మధ్యనున్నది పాంచాలీ రీతి. భట్టనారాయణునిది పాంచాలీ రీతి.

 

చంచద్భుజభ్రమిత చండ గదాభిఘాత

సంచూర్ణితోऽరు యుగళస్య సుయోధనస్య

స్త్యానవనద్ధ ఘనశోణితసిక్తపాణి

రుత్తంసయిష్యతి కచాంస్తవ దేవి! భీమః ||

 

వసంతతిలక వృత్తంలో వ్రాసిన ఈ శ్లోకం – వేణీసంహారంలో ప్రఖ్యాతమైనది. వీరరసానికి ఉదాహరణగా ఈ శ్లోకం, ఆ సందర్భం ఉదాహరణలని ఒకరిద్దరు లాక్షణికులు చెప్పారు. అందుకు సందేహం లేదు.

 

ఈ శ్లోకం అర్థం ఇది. “ద్రౌపదీ! వేగంగా కదులుతున్న భుజముల యొక్క చండ గదాఘాతంతో తుత్తునియలయిన ఊరుయుగళం కలిగిన సుయోధనుని రక్తమును దట్టంగా అలదుకున్న చేతితో భీముడు నీ సిగను అలంకరిస్తాడు.”

 

ఈ శ్లోకం ద్వారా భీముడే రూపక ఫలస్వామి అవుతాడని పండితులు పేర్కొంటున్నారు. నాటకంలో అర్థప్రకృతులకు (కావ్యప్రయోజన సిద్ధికారకాలు), అవస్థలకు (లక్ష్యసిద్ధి కోసం నాయకుడు చేసే ప్రయత్నాలు) మధ్య జరిగే సమ్మేళనాలను సంధులు అంటారు. ఆ సంధులకు అనుబంధంగా సంధ్యంగాలు ఉంటాయి. పై శ్లోకం – ముఖసంధిలో పరిన్యాసమనే సంధ్యంగానికి ఉదాహరణగా అభినవగుప్తపాదుడు పేర్కొన్నాడు. .

 

భట్టనారాయణుడు కవిమృగరాజుగా తనను తాను అభివర్ణించుకున్నాడు. సంస్కృత శ్రవ్యకావ్యసాహిత్యంలో పదసంపదకు మాఘుడు పెట్టింది పేరు. నవవర్షగతే మాఘే నవ శబ్దం న విద్యతే- అని ఒక సూక్తి. అంటే మాఘంలో తొమ్మిది ఆశ్వాసాలు చదివిన తర్వాత కొత్తపదాలు దొరకవుట. సంస్కృత శబ్దజాలం మొత్తం తన తొమ్మిది ఆశ్వాసాలలో ఇమిడి ఉందని అర్థం. భట్టనారాయణుడు కూడా కొన్ని విలక్షణమైన, రమణీయమైన శబ్దాలు ఉపయోగించాడు.

 

లోలాంశుకస్య పవనాకులితాంశుకాంతం

త్వద్దృష్టిహారి మమలోచనబాంధవస్య

అధ్యాసితం తవ చిరం జఘనస్థలస్య

పర్యాప్తమేవ కరభోరు మమోరుయుగ్మమ్ ||

 

మణికట్టునుండి చిటికినవ్రేలు మొదలు వరకు ఉన్న హస్తోపరితలభాగం పేరు “కరభం”. కరభోరు – అంటే కరభము వంటి ఊరువులు కలిగినది. (ఈ శబ్దం ఎంత అందమైనదో ఒకసారి మీ అరచేయి చూసి తెలుసుకోగలరు.:))

 

“కరభోరు!  గాలిచేత చలించిన వస్త్రపు కొసలు కలిగి, నీ చూపును ఆకర్షించే నా ఊరుద్వయం, కదులుచున్న చీరతో కూడి, నా కన్నులపండువైన నీ జఘనములను మోయుటకు సమర్థములు.” –  దుర్యోధనుడు ఈ విధంగా భానుమతితో సరససల్లాపాలాడుతూ, ఆమెను తన తొడలపై కూర్చోమని అడిగే క్షణంలో సరిగ్గా సేవకుడు, “భగ్నం, భగ్నం” అని అరుస్తాడు. (గది బయట ఝంఝామారుతానికి దుర్యోధనుడి రథధ్వజం విరిగిపడి ఉంటుంది.) కథాపరంగా నాటకీయతకు అవకాశాలు ఎక్కువగా లేనప్పటికీ, సన్నివేశాలలో చూపడం ఈ కవి నేర్పరితనం. రెండవ అంకంలో “నకుల” శబ్దాన్ని శ్లేషకు చక్కగా వాడుకున్నాడు. అలాగే ఆరంభంలో నాటక ప్రస్తావనలో ధార్తరాష్ట్రులు అనే శబ్దాన్ని హంసలకు, కౌరవులకు అన్వయిస్తూ చక్కని శ్లోకం చెప్పాడు కవి.

 

“కోణాఘాత”మన్న శబ్దం ఓ చోట యుద్ధ సందర్భంలో ఉపయోగిస్తాడు కవి. అంటే – నూరువేల (లక్ష) ఢక్కలు,నూరువందల (వేయి) భేరులు మోగిన శబ్దమట.

 

ఈ కవి వైవిధ్యంగా, విస్తృతంగా భిన్నభిన్న ఛందస్సులను ఉపయోగించాడు.  శార్దూలవిక్రీడితము, పథ్యావక్త్రము, వసంత తిలకము, స్రగ్ధర, లలిత,మందాక్రాంత,ఔపచ్ఛందసిక,మాలినీ, ఆర్యా, ద్రుతవిలంబితము,ప్రహర్షిణి, పృథ్వీ – ఇవి కవి ఉపయోగించిన ఛందస్సులలో కొన్ని మాత్రమే. ఇన్ని ఛందస్సులను ఒక దృశ్యకావ్యంలో ప్రయోగించిన కవి బహుశా ఈయన ఒకరేనేమో.

 

ఉపమా, ఉత్ప్రేక్ష్యాద్యలంకారాలతో బాటుగా చక్కటి శబ్దాలంకారాలు కవిమృగరాజు వేణీసంహారంలో గుప్పించాడు.

 

ప్రశంసలు, అభిశంసలు

 

ఈ కావ్యానికి సంబంధించిన ముఖ్యమైన (ఘాటైన) అభిశంసలు ప్రొఫెసర్ విల్సన్, బారువాలు చేశారు. అవి క్లుప్తంగా ఇవి.

 

మొత్తం నాటకంలో నాటకీయత లోపించింది. కల్పనలు పేలవంగా ఉన్నాయి.

 

మొదటి అంకం భీమ, సహదేవ, ద్రౌపదుల మధ్య నడుస్తుంది. ఆ తర్వాత దుర్యోధనుడు, భానుమతిలతో రెండవ అంకం నిండి ఉంది. మూడవ అంకం అశ్వత్థామ, కృప, కర్ణ దుర్యోధనుల మధ్య నడుస్తుంది.ఇలా ఒక్కో అంకం ఒక్కోలా ఉండి, సరళప్రవాహం, ఐక్యత లోపించాయి. ఆంగ్ల నాటకాలలో- Unity of action,Unity of place,Unity of time అన్నవి ముఖ్య నియమాలు. Unity of action ఈ నాటకంలో లోపించినట్టు పై విమర్శ సారాంశం.

 

దృశ్యకావ్యాలలో కనిపించే విదూషక పాత్రలేదు. నాటకంలో హాస్యం పాలు లేదు.

 

పాత్రను క్రమంగా అల్లుకుంటూ రావడం అన్నది లేదు. (శకుంతల, సీత పాత్రల లాగ) ఈ నాటకంలో ద్రౌపది మొదటి అంకంలో ప్రవేశించి, తిరిగి ఐదవ అంకంలో కనిపిస్తుంది.

 

రెండవ అంకంలో ఒకపక్క యుద్ధం జరుగుతూ ఉండగా ప్రతినాయకుడు (దుర్యోధనుడు) భానుమతితో విహారానికి ఆతురత పడడం పేలవమైన చిత్రణ. ఈ విమర్శలో నిజం లేకపోలేదు.

 

ఉపసంహారం:

 

వేణీ సంహార నాటకం – మహాభారత ఆధారితమై, పాశ్చాత్యులచేత కొన్ని విమర్శలకు గురయినప్పటికీ, దృశ్యకావ్య పరంపరలో ప్రత్యేక స్థానం నిలుపుకున్నది. ముఖ్యంగా లక్షణకారులు ఈ నాటకాన్ని బహువిధాలుగా ప్రశంసించారు. ఈ నాటకపు ఆంగిరసం వీరరసం కావడం మరొక ప్రధానమైన విషయం. వీరరస ప్రధానంగా వచ్చిన నాటకాలు రూపక సాహిత్యంలో తక్కువ. ఆ విధంగా ఈ నాటకానికి ప్రత్యేక స్థానం ఉన్నది. తెలుగునాట ఈ నాటకం చాలా ప్రసిద్ధి పొందింది. ఈ నాటకం అనేక నాటకసమాజాలవారు ఆడేవారుట.

 

ఈ పరిచయం చాలా సంక్షిప్తమైనది. ఇది కొండను అద్దంలో చూపించే ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నం ఔత్సాహికులకు, పఠనాభిలాషులకూ ఒక చిన్న సూచిక కాగలదని వ్యాసకర్త ఆకాంక్ష.

 

 

4 thoughts on “వేణీ సంహారం – ఒక పరిచయం

  1. రవిగారు: ఏ అభిప్రాయం మీదో, ఏది ఇతరులు చెప్పినదో తెలియకుండా ఉంది. ఈ వ్యాసరచనలో మీకుపకరించిన సామగ్రి పట్టీ ఇచ్చి ఉంటే బాగుండేది. ఆధునిక కాలంలో శ్రీ బేతవోలు రామబ్రహ్మం ఈ కావ్యాన్ని మంచి వ్యాఖ్యానంతో పాటుగా అనువదించారు. మీరు చదివి ఉండవచ్చు. “పాశ్చాత్యులచేత కొన్ని విమర్శలకు గురయినప్పటికీ” అన్నారు. కొన్ని పేర్లు చెప్పగలరా! ఇక్కడ కూడా గత 30 ఏళ్ళ కాలంలో చాలా మంచి అనువాదం, వ్యాసాలు వచ్చాయి. You may like to check David Gitomer’s work.

    Regards, — Sreenivas

    1. శ్రీనివాస్ గారు, చాలా రోజుల తర్వాత మీ వ్యాఖ్య ఇప్పుడే చూశాను.

      బేతవోలు రామబ్రహ్మం గారి పుస్తకం నేను చదివాను. ఈ వ్యాసంలో మొదటి ఛాయాచిత్రం, ఆ పుస్తకం తాలూకు అట్టయే.చూడండి.

      ప్రొఫెసర్ విల్సన్, అనే విమర్శకుడు వేణీసంహారంపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ విషయం వ్యాసంలో పేర్కొన్నాను. వీటికి సమాధానం ఎం. ఆర్. కాలే గారు చెప్పారు. మీరు చెప్పిన డవిద్ గితొమెర్ గురించి నాకు తెలియదు.

  2. రవిగారూ!

    అద్భుతమైన వ్యాసం అందించిన మీకు అభినందనలు మరియు ధన్యవాదములు. “వేణీసంహారం” పేరు చాలాకాలంగా పరిచితమే అయినప్పటికి, ఇందులోని కథాక్రమం సరిగా తెలియదు (మహాభారతముకు సంబంధించినది అని మాత్రమే తెలుసు). మీరు అంకములవారీగా కథను విశదంగా తెలిపిన తీరు చక్కగా ఉంది. నిజంగానే ఇది ఒక విలక్షణ నాటకం.

    మీ లేఖిని నుండి మరికొన్ని ఇలాంటి అమూల్య వ్యాసములు వెలువడి సాహితీపిపాసులను రంజింపజేయాలని ఆకాంక్షిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *