April 20, 2024

సంపెంగలూ సన్నజాజులూ — నవలా సమీక్ష

రచయిత: అవసరాల రామకృష్ణారావు
సమీక్షకులు: మంగు శివరామప్రసాద్

1960-70 దశకంలో వెలువడిన అవసరాల రామకృష్ణారావు గారి నవలలు ఆనాటి సామాజిక సమస్యలను వివిధ కోణాలనుంచి పరిశీలిస్తూ సమకాలీన సాంఘిక చైతన్యాన్ని ప్రతిఫలింపచే్స్తూ, పాఠకులను ఆకర్షించాయి. వీరి సహజ హాస్య వ్యంగ్యశైలి, మధ్యతరగతి కుటుంబాల్లోని వాస్తవిక అంశాలను వస్తువుగా గ్రహించి, జీవితంలో ఎదురయ్యే సమస్యలకు సవాళ్లకు సరైన పరిష్కార మార్గాలను సూచిస్తూ, తెలుగుదేశం ఉట్టిపడే విధంగా సరళంగా, స్వాభావికంగా, సంసారపక్షంగా చెప్పేవిధానం ఆయనకు పాఠకుల హృదయపీఠంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.

ఇతివృత్తం, పాత్రచిత్రణ, సామాజికాంశాలు, వర్ణన, శైలి, శిల్పం, మనస్తత్వ విశ్లేషణ, తాత్విక చింతన ఏ దృష్టికోణంతో దర్శించినా రామకృష్ణారావు గారి రచనలలో ఒక విలక్షణం గోచరిస్తుంది. ప్రతి నవల సారాన్నిన గ్రహించి అన్నింటిని కలిపి ఓక మాల కడితే అవసరాల రామకృష్ణారావు గారి వ్యక్తిత్వ అంతస్సూత్రంగా ఒక నవరత్నమాలిక సరస్వతీదేవి కంఠాభరణంగా అలరారుతుంది.

1960 దశకంలో స్త్రీ విద్యోద్యమం తెలుగునాట తారాస్థాయికి చేరుకుంది. ఆ కాలంలో వచ్చిన అనేక నవలల్లో ఈ ఇతివృత్తాన్ని వివిధ కోణాలనుంచి ఆవిష్కరించడానికి అనేకమంది రచయితలు, రచయిత్రులు ప్రయత్నించారు. స్త్రీ విద్య, ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనా ధోరణిని ప్రతిబింబిస్తూ వచ్చిన ఈ రచనలలో ప్రముఖ స్థానాన్ని అలంకరించింది అవసరాల రామకృష్ణారావుగారి సంపెంగలూ సన్నజాజులూ అనే నవల.

స్త్రీవిద్య ప్రాతిపదికగా రూపొందిన “సంపెంగలూ సన్నజాజులూ” అనే నవలలో ఒక అభ్యుదయ ప్రగతి శీల దృక్పథం మానవ సంబంధాల సున్నితమైన నేపథ్యంలో ఆవిష్కృతమవుతుంది. స్త్రీ చదువుకోవడం మంచిదే కాని ఆ సదుద్దేశం కన్న అసహాయ స్థితిలో కూడా తన కాళ్లమీద తను నిలబడి ఇతరులకు భారం కాకూడదనే స్త్రీ వ్యక్తిత్వంలోని ఔన్నత్యం మహత్తరమైనదని చెబుతుందీ నవల.

తెలుగువారి జీవిత నందనోద్యానంలో పూచిన పూపొదరిల్లు సంపెంగలూ సన్నజాజులు నవల. విరిసిన ఆ పూలు వెదజల్లిన గాఢమైన, సున్నితమైన, గంభీరమైన, సుకుమారమైన పరిమళాల గుబాళింపులే దీనిలోని వ్యక్తుల ఆప్యాయతలు, అనుబంధాలు, మనస్తత్వాలు కలబోసిన భావచిత్రాలు. మృదువైన ఆర్ద్రమైన అంతరంగాల్ని ఒక చిత్రకారుడు తన కుంచెతో కాన్వాస్‌పై వేసిన వర్ణచిత్రంలా రామకృష్ణారావుగారు అక్షరశిల్పిగా తన కలంతో చిత్రిస్తారు.

అన్నాచెల్లెళ్ల అపరూపమైన అనుబంధంలోని స్నిగ్ధ నిసర్గ నిర్మల భావ సౌందర్యరూపం ఈ నవలలో ప్రకాశిస్తూ గొప్ప అనుభూతిని అనుభవైకవేద్యం చేస్తుంది. అన్నయ్య వదిన చెల్లెలు ఈ ముగ్గురి హృదయవైశాల్యాన్ని, ఆత్మీయతను రచయిత వ్యక్తం చేసిన తీరు అద్భుతమైనది. చెల్లెలి వ్యక్తిత్వ వికాసం అని జ్యోతిని వెలిగించడానికి అన్నయ్య, వదినా ఒత్తి చమురులా వ్యవహరించారు. చెల్లెలి జీవితాన్ని వెలుగుమయం చేయడానికి అన్నయ్య తన జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగించుకున్నాడు.

సహజమైన మధ్యతరగతి కుటుంబ వాతావరణంలో ఆటుపోట్లు, మానవ మనస్తత్వపు చీకటి లోయలు, మమతానురాగాల జలపాతాల  హోరులు,  మానవత్వపు విలువల మహోన్నత శిఖరాగ్రాలూ అన్నీ ఈ నవలలో నవనవోన్మేష అంకురాల్లా అంతరంగపు అధోలోకపు అంతఃఫొరల్ని ఛేదించుకుని జాజ్వల్యమానంగా ప్రభవిస్తాయి. కథానాయిక మంజుల -మంజు- మనోజ్ఞమైన దృష్టిపథంతో ఆమె కంఠస్వరంలో ఈ నవల ఒక పర్షియన్ కార్పెట్‌లా పరుచుకుని పాఠకులకు సాదర ఆహ్వానం పలుకుతుంది.

ఈ నవలలో కేంద్ర భూమిక మంజు. ఆమె కళ్లతోనే పాఠకులు ఈ నవలను చూడగలరు. దీనిలో కనిపించే ముఖ్యమైన పాత్రలు ఆమెతో వారికి గల సంబంధాన్ననుసరించే పరిచితమై అలాగే సంబోధితమై ఆమె చుట్టూ పరిభ్రమిస్తాయి. ఉదాహరణకు మంజు అన్నయ్య వదినలు వారి పేర్లు ప్రసాదరావు మంగళలుతో కాకుండా అంతటా అన్నయ్య, వదిన గానే పేర్కొనబడతారు. ఈ సంబోధనలతో కొనసాగడం వారి మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనం. మంజు భర్త రామమోహన రావు ఆయనగానే పాఠకులకు దర్శనమిస్తాడు. హైందవ సంస్కృతిని, కుటుంబ వాతావరణాన్ని, వైయక్తిక సాన్నిహత్యాన్ని చూపేందుకు ఈ సంబోధనలు ఉపకరిస్తాయి.

ఐదో తరగతి చదువుతున్న మంజు చదువు ఆపేసి తండ్రి ఆమెకు పెళ్లి చేద్దామనుకుంటూంటే చక్కగా చదువుకుంటున్న పిల్లకు అప్పుడే పెళ్లేమిటని అన్నయ్య వాదించడంతో నవలా రంగస్థలంపై తెరలేస్తుంది. ఈ వాగ్వివాదంలో పట్టుదలతో చివరకు అన్న నెగ్గాడు. కాని ఆర్థికంగా ఇదొక జటిలమైన సమస్య. కట్నం తీసుకోవడం తన జీవితాశయానికి విరుద్ధమైనా, చల్లెలి భవిష్యత్తు, పై చదువుకోసం అన్నయ్య కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక ఉన్నతాశయం కోసం మరో ఆశయం బలిపీఠం ఎక్కపలిసి వస్తుంది. చెల్లెలు అన్నయ్య నిర్ణయాన్ని ప్రతిఘటిస్తుంది  కాని ప్రయోజనం ఉండదు.

స్త్రీవిద్య తన చారిత్రక అవసరం నేపథ్యం నుండి పుట్టి సమకాలీన సమాజ జీవన చిత్రణం మధ్యతరగతి మానవ జీవిత చిత్రణ ప్రధాన లక్షణంగా రూపొందిన ఈ నవలలో కళాత్మకత అంతా జీవితంతో ఉండే సంబంధ బాంధవ్యాల వైరుధ్యాల చిత్రంతో పదునెక్కి ఇతివృత్తం వికసిస్తుంది. సంప్రదాయ సంస్కృతికి కుటుంబ పేరు ప్రతిష్టలకు వారసురాలిగా మిగిలిపోవడమే తప్ప స్వంత వ్యక్తిత్వంతో నిలబడే అవకాశం స్త్రీకి లేని వాతావరణం నుండి ఆమెను బయటకు తెచ్చి, తనదైన గుణగుణాల చేత, చదువుతో వికసించే వ్యక్తిత్వం చేత, క్రియాశీలత చేత స్వంతంత్రంగా నిలబడగలిగిన వ్యక్తిగా చేయవలసిన ఆవశ్యకతను గూర్చి మంజు పాత్ర ద్వారా ప్రతీకాత్మకంగా చెబుతుందీ నవల.

అన్నయ్య ప్రసాదరావు పెళ్లి మంగళతో అయాక, మంజుల పెళ్లి రామమోహన రావుతో జరుగుతుంది. భర్త కట్నం తీసుకున్నందుకు మంజు బాధ పడుతుంది. ఆ కట్నం డబ్బు తండ్రి తన పెళ్లి కోసం ఉంచిందేనని ఆ డబ్బుతో కట్నం రామమోహన్ తన చదువుకయిన అప్పులు తీర్చి తనకు నగలు చేయిస్తాడని తెలుసుకుని ఆమె తృప్తి చెందుతుంది. కట్నం తీసుకోవడం ఒక సాంఘిక దురాచారమైనా, ఆ ధనరాశిని సదుద్దేశంతో ఒక మంచికి వినియోగిస్తే అందులో తప్పేమీ లేదని ధ్వని ఉంది.

అన్నయ్య ప్రోత్సాహంతో పెళ్లయ్యాక భర్తతో కలిసి బెనారస్ యూనివర్శిటీలో ఎమ్.ఎ కి ప్రైవేటుగా తొలి సంవత్సరం పరీక్ష రాస్తుంది. మంజు, తల్లిగా గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఆమె ఎమ్ఎ పరీక్ష పాస్ అవుతుంది. కాని ఆమె భర్త రామమోహన రావు విఫలమవుతాడు. దానికి కారణం అతనికి చదువంటే ఇష్టంలేకపోవడమే. ఆమెను కూడా ఇక చదవద్దంటాడు. కాని ఆమె ఉద్యోగం చేయనని మాట ఇచ్చాక అందుకు ఒప్పుకుంటాడు. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలతో చిన్న చిన్న తగవులతో మంజు బెనారస్ వెళ్లి పరీక్ష రాసి ఎంఎ డిగ్రీ సంపాదిస్తుంది. అనారోగ్యంతో, ఉన్న ఉద్యోగం ఊడటంతో ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకున్న అన్నయ్య తన విషయాలు చెల్లెలికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. చివరికి వదినద్వారా అన్నయ్య గురించి మంజు తెలుసుకునేసరికి పరిస్థితి విషమించి అతడు మరణిస్తాడు. అన్నయ్ కుటుంబాన్ని ఆదుకోవడానికి మంజు కాలేజీ లెక్చరర్ పోస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు పెట్టడానికి భర్త అనుమతి కోరితే అతడు ఆమె ఉద్యోగం చేయదలిస్తే విడాకులిస్తానంటాడు.

తను ఆలోచించిన పద్ధతిలోనే తన భర్తకూడా ఆలోచిస్తాడనుకోవడం మంజు పొరపాటు. అలా జరగకపోతే ఆశాభంగం, మనస్తాపం కలగడం సహజం. తనకోసం సర్వస్వం అర్పించిన అన్నయ్య కుటుంబాన్ని తమతో ఉంచుకుని రుణం ఈవిధంగా తీర్చుకుందామనుకుంటే అందుకు భర్త విముఖతతో కలతే చెందిన ఆమె మనస్సు గాయపడుతుంది. ఆమెకోసం నువ్వు దేనికయినా సిద్ధమే కదూ, సరే విను. ఆ పరిస్థితి ఏమిటో తెలుసా. నువ్వూనేనూ ఒకరికొకరు శాశ్వతంగా దూరం కావడమే, అంటాడు అతడు. ఇద్దరం కలిసి ఆలోచించి ఓ నిర్ణయానికి వద్దాం. పిల్లలను తీసుకుని ఆవిడింటికి ఆవిడను వెళ్లిపోమను. మన వీలునుబట్టి నెలకు పదో పాతికో పంపుదాం అంటాడు. మంజు వదినా పిల్లలను తమతో ఉంచుకోవడం వారిపోషణ కోసం ఆమె ఉద్యోగం చేయడం తనకెంతమాత్రం ఇష్టం లేదనీ అలా అయితే తన దారి తాను చూసుకోమనీ మనువులు చెడిపోయినా అతుక్కుంటాయోమే, మనస్సులు విరిగిపోతే మాత్రం అతుక్కోవు అని నిశ్చయంగా అంటాడు.

ఆ సంభాషణ అంతా తనగురించే నని తెలిశాక, అలా వినడం సభ్యత కాకపోయినా వదిన వినేసింది. కాదననని ముందే మంజు చేత వాగ్దానం చేయించి, మర్నాడు పొద్దుటే పిల్లల్ని తీసుకుని వాళ్ల ఊరు వెళ్లిపోతున్నానంటుంది వదిన. గదిలో మంజువదినలమాటలు చీకట్లో నిలబడి విన్న రామమోహన రావు వదిన వ్యక్తిత్వంలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని బాహ్యమైన పశుప్రకృతి నుండి ఆత్మగతమైన అంతస్సౌందర్యం వైపుకి మీ శీలం నన్ను మళ్లిస్తోంది అని ఆమెతో అంటాడు. అవమానపరిచే అజ్ఞానంతో కాక, ఆరాధించే విజ్ఞాపనతో తను చేసిన తప్పుల్ని క్షమించి తన కుటుంబాన్ని విడిచి ఎక్కడికీ వెళ్లలేదని పెద్ద దిక్కుగా వాళ్లతోనే ఉండమని అభ్యర్థిస్తాడు.

మర్నాడు పొద్దుట ఒక ఉత్తరం రాసి పెట్టి పిల్లలతో తన సామానుతో వదిన తన ఊరు వెళ్లిపోతుంది. ప్రపంచంలో కుచేలుడి కన్న గొప్పవాడు లేడని తెలుసుకునే జ్ఞానం ఆయన -అన్నయ్య- నాకు ప్రసాదించినప్పుడు నా కంటే నిర్భాగ్యురాలు లేదనుకోవడం ఎంత వెర్రితనం. మీరు చిరునామా ఎరుగని చోటుకే నేను పోవడం లేదు. మా ఊరికే మా ఇంటికే వెళుతున్నాను. నేను అక్కడ ఉండటం మీకు ఇష్టమైతే నా కెటువంటి సహాయమూ చేయవద్దు. నా పిల్లల్ని నేను పోషించుకుని ఆయన అడుగుజాడలలో పెంచగల అభిమానవతిగా నేను తయారవాలని మీకుంటే నాకెటువంటి ఉపకారమూ చెయ్యవద్దు, అని ఆమె వాళ్లిద్దరికీ రాసిన ఉత్తరంలో అంటుంది.

ఈ నవల ప్రారంభంలో మంజుల తాను రాసుకున్న ఈ కింది పద్యం చదువుకొని పరవశించిపోతుంది.

వసుధ సుధజల్లు మానవ వనమునందు
కొన్ని విలువైన విరులైన కోసితెచ్చి
నీదుపాదాల ముంగిట నిలిపి తేని
ధన్యమైనట్టు జననము తలుతు దేవ,

తనకు కావలసిన వాళ్లంతా పువ్వులంత సున్నత హృదయులు. కాని పోల్చుకునే శక్తి ఉంటే ఎన్ని రకాల సుమాలో అన్ని రకాల సువాసనలు. అందుకనే తన జీవిత చరితం పలు విధ పరిమళ భరితం అంటుంది.

ముగింపులో తను తన భర్త రామమోహనరావు ఇద్దరూ కొంచెం ఘాటు వాసన గల సంపెంగలనీ, తన అన్నా వదినా వాళ్లిద్దరూ మాత్రం అలా కాదని, అన్ని కాలాలలోనూ సుగంథం వెదజల్లే సన్నజాజులు వాళ్లని అంటుంది. ఈ ప్రపంచంలో అలాంటి వారున్నారనే భావన మనస్సులో మాధుర్యం నింపి మరి నాలుగు కాలాలపాటు బతకాలనే ఇచ్చను ప్రసాదిస్తుదనేది ఈ నవలకు అమృత సదృశ్యమైన భరతవాక్యం. పూల పొట్లాల వంటి మనస్సులను విప్పి చూపుతూ, సంపెంగలు సన్నజాజుల లాంటి సున్నితమైన ఆ మనస్సుమాల పరిమళాలను వెదజల్లుతుందీ నవల. మంజుల రామమోహనరావుల మంగళ ప్రసాదరావుల మనస్తత్వాలెలాంటివో తెలుసుకుని హృదయాలు ఆర్ద్రమవడంతో ముగుస్తుందీ నవల.

సహనమూ, శాంతమూ, సాధారణమూ అనే ఈ మూడు పేటల గొలుసుగా అలంకరించుకున్న మోహనమూర్తివి నువ్వు అంటూ భార్య మంగళ అంతరంగ సౌందర్యాన్ని ఆవిష్కరించే సహృదయుడిగా సౌజన్యమూర్తిగా అన్నయ్య ప్రసాదరావు దర్శనమిస్తాడు. ప్రసాదరావుతో పాటు విడదీయరాని ఎడబాయని విశిష్ట భూమిక అతని భార్య మంగళ వదిన భర్తను పూర్తిగా అర్థం చేసుకున్న అర్థాంగి కనుక అతడి అనారోగ్య ప్రస్తావనలో కూడా నిరాశ అనేది ఆయనకు జీవితంలో ఎప్పుడూ లేదు గాని ఒక విధమైన నిస్పృహ ఆవరించిందేమోనని నాకు భయంగా ఉంది మంజూ. నీ పరీక్షలని ఇన్నాళ్లు ఆగగలిగేను, అంటుందే తప్ప తమ భయంకర వాస్తవాన్ని మరింత బెంబేలెత్తేవిధంగా చెప్పదు.

వ్యక్తిత్వ వికాసానికి తనని సంస్కారవతిగా తీర్చిదిద్దుకోవడానికి విద్య ఎలా ఉపకరిస్తుందో చెప్పడానికి మంజుల -మంజు- పాత్రను మనోజ్ఞంగా మలచారు రచయిత. అన్నయ్య శిక్షణ, తండ్రి మనోవేదన, స్వయం సామర్థ్యం, భర్త అనురాగం అన్నింటినీ సమన్వయపరుస్తూ తన వ్యక్తిత్వ నిర్మాణం చక్కగా చేసుకున్న పాత్రగా, మనస్సులు, మమతలు ఎరిగిన మనిషిగా మంజుల ఈ నవలలో కనిపిస్తుంది. అనారోగ్యంతో ఉన్న అన్నయ్యకు రాసిన ఆఖరి ఉత్తరంలో ఆమె ఈ ఉత్తరం అందిన పది రోజులలో నాకు సంతృప్తి కలిగించే సరైన సమాధానం రాకపోయిందో నేను మాత్రం వచ్చేస్తాను. నా భర్తా పిల్లా ఏమయినా సరే. నీకు పూర్తిగా ఆరోగ్యం కలిగే దాకా అక్కడే ఉండిపోతాను. నువ్వు నీ భార్యా పిల్లలూ తన్ని తగలేసినా సరే, అని చెప్పడంలో అన్నయ్యపై ఎనలేని అభిమానం ప్రదర్శించడంలో మంజు పాత్ర చిత్రణ పరిపూర్ణత్వాన్ని సంతరించుకుంది.

అన్నయ్య ఆర్థిక ఇబ్బంది, అనారోగ్య పరిస్థితి అతనికున్న వెయ్యి రూపాయల అప్పు గురించి పక్కింటి నిర్మల నుంచి తెలుసుకొని తన చంద్రహారాన్ని అమ్మి అప్పు తీర్చిన మంజు తర్వాత ఈ విషయం భర్తకు ఆమె చెప్పినప్పుడు చెలరేగిన గొడవలకు ఆమె భయపడదు. అన్నయ్య వదినా ఇద్దరూ ఆమెను ఆప్యాయంగా చూసుకుంటారు. వారిది ఆంక్షలు లేని నిష్కల్మషమైన ప్రేమ. మంజు భర్త రామమోహనరావుల ప్రేమ అభిప్రాయ భేధాలతో స్వార్థంతో సంకుచితత్వంతో అప్పుడప్పుడు రగిలే అగ్నిజ్వాల వంటిది. భార్య దేనిలోనూ తనను మించకూడదనే పురుషాహంకారం అతనిది. ఈ నిజాన్ని బహిరంగంగా ఒప్పుకునే ధైర్యం అతనికున్నదనేందుకు నిదర్శనగా తన మనోభావాలను అతను బయటపెడతాడు. సంఘటనల పరిణామ క్రమంలో అతని ప్రవర్తన మార్పు చెందడం గమనార్హం. భార్య విద్యార్హతలు భర్తకన్న ఎక్కువైతే ఆ భర్త ఎలా వ్యవహరిస్తాడు అనే దానికి దృష్టాంతంగా మంజు భర్త రామమోహన రావు ఒక అసాధారణ వ్యక్తిగా నిరూపించబడ్డాడు. భార్యపై అంతరంగం ప్రేమ, బహిరంగ అవహేళన అనే ద్వంద్వాల మధ్య నలిగిపోయాడు అతడు.

అతడి అవస్థను అర్థం చేసుకున్నా తన ఆశయాలను వదులుకోవడానికి సిద్ధంగా లేని ధీరోదాత్తగా మంజు వ్యక్తిత్వ ఎదుగుదల శిఖరాయమానమవుతుంది. అసహాయ స్థితిలో ఉన్న వదినా పిల్లలను ఆదుకోవడానికి ఆమె ఉద్యోగం చేయనని భర్తకిచ్చిన వాగ్దానాన్ని భగ్నం చేయడానికి కూడా మంజు వెనుకాడలేదు. ఒక మంచి పని చేయడం కోసం ఎటువంటి కష్టనిష్టూరాలైనా మంజు ఎదుర్కొగల స్వభావం గలది. అదృష్టవశాత్తూ ఆమె జీవితం అల్లకల్లోలం కాకముందే వదినగారి నిష్క్రమణ ఈ సమస్యను సులభంగా పరిష్కరించింది.

అన్నాచెల్లెళ్ల అపురూప అనుబంధానికి ఒక అపూర్వమైన నిర్వచనంగా, ఆదర్శవంతమైన దాంపత్య జీవితానికి సౌందర్యదీప దర్శనంగా, ఒక అవ్యక్తానుభూతిని అనుభవైకవేద్యం చేసిన హృద్యమైన, రమణీయ రసమయ దృశ్యకావ్యంగా సంపెంగలూ సన్నజాజులూ అనే నవల పాఠకుల హృదయసీమలో విరిసిన పూపొదరింటిలా పరిమళాలను వెదజల్లుతుంది. గోధూళి వేళ నింగిలోనుండి తొంగి చూస్తున్న తారకల మిలమిలను అక్షరాలలో ని గలగలలో ప్రతిఫలింపజేసే విభూతి అవసరాల వారి సాహితి.

ఒక అక్షర శిల్పిగా రామకృష్ణరావు గారికి అక్షరాలతో ఎలా ఆడుకోవాలో, వాటితో ఆక్రోబాటిక్స్ అనగా సాముగరిడీలు ఎలా చేయించాలో తెలుసు. అక్షరాలకు చక్కిలిగింతలు పెట్టి హాస్య, వ్యంగ్య పసిడి పంటలు పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గంభీరమైన సన్నివేశాలను, జటిలమైన సమస్యలను చిక్కుముడులను చివరికి విప్పి చూపడంలో, ప్రతిపాదితమైన ఆశయాలను పట్టువిడవక ఆమోదయోగ్య ఆచరణలో ప్రతిఫలింపజేయడంలో తనదైన ప్రత్యేక పాదముద్రలు వేశారు.

స్త్రీలకు విద్య అవసరమా, అనే విషయమై చర్చ ఆరంభించి దాని ఆవశ్యకతను నిరూపించి, దానికి ఎదురయ్యే ప్రతికూల వాతావరణాన్ని, ఆటంకాలను, జీవిత వాస్తవికతను మనముందుంచి, సంయమనంతో ఆయా సమస్యలను పరిష్కరించుకున్న స్త్రీమూర్తి కమనీయ కథనాన్ని ఉపాఖ్యానాలతో సంక్లిష్టమైన సంఘర్షణలను ఆలోచనాత్మకంగా విశ్లేషిస్తూ రమణీయంగా వివరించారు రామకృష్ణరావు గారు.

స్త్రీ విద్య విషయమై చరిత్రను పునర్నిర్మాణం చేసుకోవడానికి ఈ నవల ఎంతగానో ఉపకరిస్తుంది, అని ‘ఈ నవల పరిమళాలు నిలిచి తీరు తరతరాలు,’ అనే శీర్షికతో వ్రాసిన ముందుమాటలో ఆచార్య కోలవెన్ను మలయవాసిన ఈ నవలకు ఒక చారిత్రాత్మక ప్రశంసాపత్రాన్ని అనుగ్రహించారు. పరిమళించే పువ్వులు ఈ నవలకు శీర్షికగా ఒప్పడమే కాక మొదలు మరియు ముగింపులో కూడా కథానాయిక మంజు జీవితపు పుటల్ని తిరగవేస్తూ ఆనందానుభూతుల్ని నెమరు వేసుకుంటూ ఆ పూల పరిమళాన్ని ఆస్వాదించడం ప్రతీకాత్మకమే కాకుండా మరియు రసాత్మకం కూడా.

1964లో నాటి ఆంధ్రపత్రిక వీక్లీలో సీరియల్‌గా వచ్చి, నవలగా 1965లో మొదటి ముద్రణ, 1977లో రెండవ ముద్రణ, 2000లో మూడవ ముద్రణ పొందడం ఈ రచన అమిత జనాదరణకు నోచుకుందనడానికి ప్రత్యక్ష ప్రమాణం. స్త్రీవిద్య ఉద్యోగం పట్ల సమకాలిక ప్రగతిశీలక సమాజంలో తలెత్తుతున్న నవనవోన్మేష ఆలోచనాంకురాలపై కాంతి కిరణాలను ప్రసరించపజేసే రచనలలో సంపెంగలు సన్నజాజులూ నవలకు ప్రత్యేక స్థానముంది. వాడని పూలు వీడని పరిమళం.

మంగు శివరామప్రసాద్
విశాఖపట్టణం
మొబైల్ 9866664964
Email: sivaramprasad.24@gmail.com

4 thoughts on “సంపెంగలూ సన్నజాజులూ — నవలా సమీక్ష

  1. నవలంత గొప్పగానూ వుంది మీ సమీక్ష! హృదయపూర్వక అభినందనలు

  2. నవలంత గొప్పగానూ వుంది మీ సమీక్ష! హృదయపూర్వక అభినందనలు!

  3. sivaram,baagaa sameekhana chesaru.ee contextlo chinna aananda rekha………naa short story anthology manasuna manasaiki jesta litt award vachinapudu,bharago avasaraala sampangelu,sanna jaajulu sameekshimche vedika ichaaru.ivaala aa iddaru leru.kaanee aa poola parimalaalu manam aaswaadisthunnaam.thank u.kb.lakshmi.

  4. sampengalu sannajaajulu kadhanam bavundi.ilanti manchi kadhanu andinchinanduku Malika brundaniki krutajnatalu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *