April 24, 2024

ఉగాది పచ్చడి – ఇది షడ్రసోపేతం

రచన: పాకవేదం (డా.కౌటిల్య)

 

కొత్త ఏడాది వచ్చేసింది. కొత్తసంచికతో మేమూ మీముందుకొచ్చేశాం. మావాళ్ళు ఇది “సాహిత్యసంచిక” అన్నారుకదా అని వట్టి పద్యాలూ, పురాణాలూ చదువుకుంటామా ఏంటి? నోరూరగా చవులు పుట్టే పదార్థాలు లేకపోతే అది పూర్తిసాహిత్యం కాదని నా అభిప్రాయం. అందుకని మా “పాకవేదం” తరపునుంచి ఇవ్వాళ మీకు షడ్రసాలనీ ఒకటిగా చేసి నాలుకకు చూపించే తెలుగింటి “ఉగాది పచ్చడి”ని రుచ్చూపించబోతున్నాం.

 

చిన్నప్పుడు ఉగాదంటే నాకు ఎంత ఉత్సాహమో చెప్పలేను. పిల్లలందరికీ ఇది ఒక సెలవురోజు మాత్రమే! నాకు మాత్రం అల్లాకాదు. ఎందుకంటే ఈ పండక్కి ఉన్న స్పెషలు -“ఎప్పట్లా నైవేద్యం అమ్మ కాకుండా నాన్న చేస్తారు” కాబట్టి..:). నాన్న “అది” తయారు చేస్తుంటే పక్కనే కూచుని చూట్టం నాకో సరదా! వంటంతా అమ్మ దగ్గర నేర్చుకున్నా ఇది మాత్రం పూర్తిగా నాన్న దగ్గరే నేర్చుకున్నదన్నమాట! నాకు ఉత్సాహం కలిగించే ఇంకో విషయం, పట్టుపంచె కట్టుకోటం. అమ్మ ఉగాదికి, ముక్కోటికి తప్ప పట్టుపంచె తీసి ఇచ్చేదికాదు. {ఇప్పుడు నా ఇష్టమొచ్చినప్పుడల్లా కట్టుకుంటున్నాననుకోండి}. రాత్రంతా అదే ఆలోచన. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు స్నానంచేసి పట్టుపంచె కట్టుకుందామా అని. వెనకదోపిన చెంగు ముందుకి చేత్తో విలాసంగా పట్టుకుని నడవటమంటే ఇప్పటికీ నాకెంత సరదానో!

 

ఇక అభ్యంగనం చేసేది కూడా ఈ పండగకే! మిగతా అన్ని పండగలకీ ముందురోజే కుంకుడురసం పెట్టి తలస్నానం చేయించేది అమ్మ. ఉగాదికి మాత్రం తలస్నానం ఆరోజే. కాబట్టి బాగా ఫ్రెష్షుగా అనిపించేది. వంటికి నువ్వులనూనె, సున్నిపిండి కలిపి మొత్తం పట్టించి, తెల్లవారక ముందే తలారా ఉడికించిన కుంకుడు పులుసుతో స్నానం చేయించేది అమ్మ. తర్వాత మా తోటలోంచి తెచ్చిన మామిడాకులు ఇల్లంతా తోరణాలు కట్టి, నాన్న పక్కన చేరేవాళ్ళం. నాన్న ఎంత ఓపిగ్గా చేసేవాళ్ళో ఉగాది పచ్చడి. చాలా చెయ్యాలి మరి, ఊర్లో అందరూ వచ్చి నాన్నదగ్గరే పెట్టించుకు వెళ్ళేవాళ్ళు, బ్రాహ్మలతో సహా. ఎందుకంటే నాన్న వేసినన్ని ద్రవ్యాలుకాని, ఆ రుచికాని ఎవ్వరికీ వచ్చేదికాదు. అందరూ ఏదో చింతపండు పులుసు, నాలుగు వేప్పువ్వులూ కలిపి చేసుకుని అలా నాలిక్కి రాసుకునేవాళ్ళు. నాన్న చేసింది మాత్రం గిన్నెలతో పట్టుకెళ్ళేవాళ్ళు.

 

నేను బయటికొచ్చాక నాన్నని ఫాలో అయిపోయి, ఇంకా దానికి కొన్ని మెఱుగులు దిద్ది చెయ్యటం అలవాటు చేసుకున్నా. మా కాంప్లెక్సుమొత్తం నా ఉగాదిపచ్చడి కోసం ఎదురుచూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. మా ఓనరు వాళ్ళింటికి ఒకసారి ఉగాదికి వాళ్ళ చుట్టాలావిడ, మామ్మగారొకరు వచ్చారు. ఆరోజు అలవాటుగా నా ఉగాదిపచ్చడి పట్టుకెళ్ళి ఇచ్చా. ఆవిడ తిని “ఇలాంటి ఉగాదిపచ్చడి నిజంగా నా ఈ డెబ్భయ్యేళ్ళ అనుభవంలో తిన్లేదు బాబూ” అన్నారు. ఇప్పటికీ ఎప్పుడన్నా వస్తే, నన్ను పలకరించి నా “ఉగాదిపచ్చడి” తలుచుకుంటారు.:)మరీ స్వడబ్బా ఎక్కువైందా!;)… ఇక విషయంలోకొచ్చేస్తాలెండి.

 

అసలు ఉగాదిపచ్చడి చేసుకోవటం చాలామందికి తెలీదు. ఏదో అన్ని రుచులూ ఉండాలి కదా అని కనపడ్డ ఉప్పూ,చింతపండూ,మిరపకాయలూ(ఇది అన్నిటికన్నా దారుణం),కారం, వేప్పువ్వు,బెల్లం కలిపేసి కానిచ్చాం అనుకుంటారు. కొంతమంది మామిడిముక్కలు కలిపి ఇంకా గొప్పగా చేశామనుకుంటారు. అసలు దీన్ని ఉగాదిపచ్చడి అనటం కన్నా “కసాబిసా ఆల్ మిక్సు” అని పేరెట్టుకోటం ఉత్తమం. కొంతమందైతే దీన్ని ఏదో మందు మింగినట్టు గొంతులో వేసుకుని గబుక్కున మింగుతారు. అది అసలు పద్ధతి కాదు. నాలుకకి తెలిసేట్టు తినాలి. కొంతమంది తీపి బాగా ఎక్కువ వేసుకుని, దాన్నో జ్యూసులా చేసుకుని గ్లాసులకొద్దీ తాగుతారు. ఇదీ సరైన పద్ధతికాదు. ఇది అతివృష్టి, అది అనావృష్టి. రెండూ సరైనవి కాదు. అన్నీ రుచులే, తీపొక్కటే రుచికాదు. ప్రతి రుచినీ, దానిలో ఉన్న అనుభూతినీ సరిగ్గా పొందగలిగితేనే మనిషి జన్మ ఎత్తినందుకు మనకీ, మన నోట్లో పుట్టినందుకు మన నాలుకకీ సార్థకత!!!

 

ఉగాదిపచ్చడి ఎందుకు చేసుకుంటాం? దీనిలో ఉన్న అంతరార్థం ఏంటి? ఆరోగ్య విషయాలైమైనా ఉన్నాయా? అని చాలామంది చాలా పత్రికల్లో వ్యాసాలు దంచేస్తుంటారు. అవన్నీ ఇక్కడ నేను చెప్పబోవట్లా. అసలు సిసలు ఉగాదిపచ్చడి ఎలా చేసుకోవాలో మాత్రమే చెప్తాను.

 

కాలపు తొలినాళ్ళలో ఉండే అన్ని భావాల, అనుభూతుల మిశ్రమాన్ని నాలుక ద్వారా మనసుకు, బుద్ధికి ఒక్కసారి తెలియజేస్తే, మిగిలిన ఏడాదంతా అలా జీవితాన్ని దిద్దుకోటానికి ఉపయోగపడుతుందని పెద్దలు చూపిన ఒకమార్గం ఇది. మరి అలా ఆదర్శప్రాయంగా, ఐడియలిస్టిగ్గా తీసుకోవాలనే అనుభూతుల్లో “స్వచ్చత” ఉండాలి కదా! అప్పుడే అది ప్రామాణికమైన అనుభూతి అవుతుంది. ఇక ఆరోగ్యపరంగా అంటారా, వెతుక్కుంటే బోలెడు లాభాలు….

 

“రసో వై సః” అన్నది వేదోక్తి. దీనికి వ్యాఖ్యానాలు చెప్పుకుంటే గ్రంథాలు రాయొచ్చు. ఇప్పటికే చాలామంది రాశారు కూడా. అతిక్లుప్తంగా చెప్పుకుంటే “ఏది రసమో అదే నిత్యమై ఉన్నది” అని. అదే అచ్చమైన అనుభూతి. “రస్యతే ఆస్వాద్యత ఇతి రసః.రస ఆస్వాదనే – ఆస్వాదింపబడునది.” అని “రస” శబ్దానికి వ్యుత్పత్తి. అంటే దేనినైతే జీవుడు, ఆత్మ ఆస్వాదించి, అనుభూతి చెంది మమేకమవుతాయో అదే రసమని అర్థం. ఆ రసాల్ని నిర్దుష్టంగా ఇదమిత్థమని గుర్తిస్తుంది కాబట్టి నాలుకని “రసనం” అన్నారు. మరి అలాంటి నాలుకకి సరైన అనుభూతిని అందించి, దాన్నీ,మన జీవుణ్ణీ సార్థకం చేసే మన తెలుగింటి “ఉగాదిపచ్చడి” ఎలా చేసుకోవాలో ఇక చెప్పేసుకుందామా!

 

ఏమేం కావాలి?

 

ముఖ్యంగా కావలసినవి షడ్రసాలు, అంటే ఆరు రుచులు.

ప్రతి రుచికీ దాని అసలు రూపాన్ని, గుణాన్ని కలిగి ఉండే నిర్దిష్టమైన పదార్థాలు ఉన్నాయి. అవే వాడాలి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, బ్రహ్మసృష్టి మాత్రమే వాడాలి విశ్వామిత్ర సృష్టి వాడకూడదు అని. బ్రహ్మసృష్టి అచ్చమైన సృష్టి, ఒరిజినలు – విశ్వామిత్రుడిది అసలుసృష్టి కాదు డూప్లికేటన్నమాట!..:). బ్రహ్మసృష్టి అంటే ఏ పదార్థంలో అయితే ఆ పదార్థానికి ఉండవలసిన అసలు స్వభావం, అసలు గుణం ఉంటాయో అది. విశ్వామిత్రసృష్టి అసలుదాన్ని పోలి ఉన్న పదార్థాలే కాని, వాటిలో ఉండవలసిన అచ్చమైన గుణాలు ఉండవు. త్రిశంకుస్వర్గం స్వర్గం కాదు కదా!

 

ఇప్పుడు ఆ ఆరురుచులూ, అవి ఉండే పదార్థాలూ తెలుసుకుందాం. మరొక్క మాట గుర్తు పెట్టుకోండి. వేసే ప్రతి పదార్థం కొత్తదే అయ్యి ఉండాలి. కొత్తవాటిలోనే ఆ రుచియొక్క అసలు స్వభావం ఉంటుంది. పాతవాటిలో రుచి తగ్గిపోవచ్చు, మారిపోవచ్చు కూడా. ఒక్కో రుచికీ రెండు,మూడు పదార్థాలు కూడా ఉంటాయి.

 

“తువరస్తు కషాయోస్త్రీ మధురో లవణః – కటుర్తిక్తః ఆమ్లశ్చ రసాః “

ఇవీ షడ్రసాలు. ఒక్కోదాని గురించీ, అవి ఉండే పదార్థాల గురించీ చెప్తాను.

1)  తువరస్తు కషాయో :తువరము, కషాయమూ ఈ రెండూ వగరుకు పేర్లు. తౌతి ఆవృణోతి హినస్తి వా కంఠమితి తువరః – కంఠమునడ్డగించునది తువరము ;     కషతి కంఠం కషాయః. కష హింసాయాం – కంఠమును పీడించునది. ఇవి వాటి వ్యుత్పత్తులు. అంటే “వగరు” స్వభావం కంఠానికి అడ్డుపడ్డట్టు ఉండాలి. వగరుకి అసలు నిర్వచనంలా ఉండే పదార్థం- మామిడి పిందె. బాగా గుర్తు పెట్టుకోండి, మామిడికాయ కాదు. ఇంకా విత్తనం పట్టకుండా ఉన్న కసరు పిందె. వేలుపొడవుకన్నా తక్కువ ఉన్నవి తీసుకోవాలి. ఇంకా వగరు బాగా ఉండే పదార్థం “మావిచిగురు”. బాగా ముదురు ఎరుపు రంగులో ఉన్న చిగురు తెచ్చుకోవాలి. కసరుపిందెలు సరిగ్గా ఉగాది సమయానికే వస్తాయి. తరువాత పులుపెక్కుతాయి.

2) మధురం:- ఇది తీపి. మధు మాధుర్యమస్యాస్తీతి మధురః – మధువు అనగా మాధుర్యము. అది కలిగినది మధురము. మథ్నాతి వాత మితివా మధురః.మంథ విలోడనే – వాతమును పోగొట్టునది. ఇవి రెండూ మధుర శబ్దానికి ఉత్పత్తులు. అంటే తియ్యగా ఉండాలి, వాతాన్ని పోగొట్టాలి. ఆతీపి కూడా పూలమకరందంలో ఉండేదే అసలైన తీపి. మకరందం దొరకదు కాబట్టి, మంచి తేనె  తెచ్చుకోవాలి. బజార్లో దొరికే తేనె అసలు తేనెకాదు. అది ఉత్పత్తి చేసినది. అసలైన పట్టుతేనె లో ఉండేదే అసలు తీపి. గిరిజన్ వాళ్ళతేనె అసలు కొండతేనే. అది వాడుకోవచ్చు. ఇంకా తీపికి కొత్త బెల్లం, చెరకు ముక్కలు, చక్రకేళి అరటిపండు కూడా వేసుకోవచ్చు. బెల్లం పాతది, నాలుగైదు నెలలనుంచీ డబ్బాల్లో మగ్గుతున్నది, అమ్మోనియాలు వేసినది పనికిరాదు.

3) లవణః :-  ఇది “ఉప్ప”దనానికి పేరు. లునాతి వాతం జాడ్యం వా లవణః. లూఞ్ ఛేదనే – వాతాన్ని, జాడ్యాన్ని పోగొట్టేది. అంటే ఉప్పగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ఈ లక్షణంకూడా ఉండాలి. ఈ లక్షణం ఉండి, ఉప్పదనం సమంగా ఉండేది “సైంధవ లవణం”. పచారీ షాపుల్లో దొరుకుతుంది. తెలుపూ, ఎరుపుగా, రాయిలాగా గట్టిగా ఉంటుంది.

4)  కటుః :-  ఇది “కారం” అన్నమాట! అందరూ ఎక్కువగా చేసే బండతప్పు ఇక్కడే! కారం అనగానే మనవాళ్ళకి ముందు గుర్తొచ్చేది మిరపకాయ. అందుకని, పచ్చి మిరపకాయో లేక ఏకంగా ఎండుకారమో వేసేసుకుంటుంటారు. మిరపకాయది అసలుకారం కాదు.  కటతి ఆవృణోతీతి కటుః. కటే వర్షావరణయోః – వ్యాపించునది అని వ్యుత్పత్తి. అంటే మిగతా రుచులకన్నా దీని వ్యాప్తి ఎక్కువ నాలుక మొత్తానికీ. పైగా డామినేట్ చేస్తుంది పాళ్ళు తక్కువైనా. అసలైన కారం “మిరియాలది“. మిరపకారాన్ని, మిరియాల కారాన్ని సరిగ్గా పోల్చి చూడండి, మీకే అర్థమవుతుంది. మిరపకాయ అనారోగ్యకారి. మిరియాలు ఆరోగ్యకారి. చక్కగా నల్లగా ఉన్న మిరియాలు తెచ్చుకోండి.

5) తిక్తః :-  తేజయతి శ్లేష్మమితి తిక్తః. తిజ నిశాతనే.- శ్లేష్మము నల్పముగా జేయునది. ఇది “చేదు”. ఎవరికీ అసలు నచ్చని రుచి. కాని సరిగ్గా అనుభవించ గలిగితే చేదుని మించిన రుచి,ఆరోగ్యకారి ఉండదు. ఈ చేదు సరిగ్గా సమపాళ్ళల్లో ఉండేది, “వేపపువ్వు” లో. చక్కగా ఉగాదికి వేపచెట్లన్నీ పూతతో కళకళలాడుతుంటాయి. దాచి ఉంచిన, రాలిన, వడలిన వేపపూత వాడకూడదు. వాటిలో చేదు తగ్గిపోతుంది. అప్పుడే చెట్టునుంచి తుంచింది వెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, పువ్వుమాత్రమే. కాడలుకూడా పడకూడదు. ఒక్కోపువ్వుని జాగ్రత్తగా తుంచి వెయ్యాలి, చివర్ల ఉన్న చిన్నకాడలు కూడా పడకూడదు.

6) ఆమ్లః :-  ఆమయతీత్యామ్లః. అమరోగే- రోగమును చేయునది, అమ్బతే ముఖశబ్ద హేతుర్భవతీత్యామ్లః. అబి శబ్దే – రుచి చూసేప్పుడు సీత్కారశబ్దమును పుట్టించునది. ఇదీ “పులుపు” కథ. అసలు సిసలు పులుపు అంటే చింతదే. అందులోనూ సరైన పులుపంటే అప్పుడే కొత్తగా వలిచిన “చింతపండు“ది. నిమ్మకాయలూ గట్రా వాడకూడదు.

7) ఇక పైన చెప్పిన ద్రవ్యాలు కాకుండా యాలకులు, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు లాంటి సుగంధద్రవ్యాలు చాలా కొద్దిపాళ్ళల్లో కలుపుకోవచ్చు.

8) కొలతలు చెప్పలేదు కదా! అవసరమంటారా? సరే ఉరామరిగ్గా చెప్తా. రెండు చిన్నమామిడికాయలు, చిన్నసీసా తేనె, వందగ్రాములు బెల్లం, రెండు బాగా మగ్గిన చక్రకేళీలు, నాలుగు చిటికెళ్ళు సైంధవలవణం, నాలుగు స్పూన్లు మిరియాలు, గుప్పెడు వేపపువ్వు, వందగ్రాములు చింతపండు……

 

ఇప్పుడు ఎలా చెయ్యాలో చూద్దాం:

  • చింతపండు మునిగేలా నీళ్ళుపోసి నానబెట్టుకోవాలి.
  • మామిడికాయల్ని బాగా కడిగి సన్నగా తురుముకోవాలి. ఏ గిన్నెలో పచ్చడి కలపాలనుకుంటామో, దాంట్లోకే డవిరెక్టుగా తురుముకోవాలి. లేతకాయలు కదా, ఇలా చేస్తే రసం కారిపోకుండా ఉంటుంది. ముక్కలు వేస్తే రుచులన్నీ సరిగ్గా కలవవు.
  • ఇప్పుడు బెల్లంతీసుకుని సన్నగా తురిమి పైన మామిడితురుములో కలపాలి.
  • మిరియాలు బాగా పొడికొట్టి కలపాలి. చక్రకేళీ మెత్తగా గుజ్జులా చేసి వెయ్యాలి. వేపపువ్వు జాగ్రత్తగా వలిచి వెయ్యాలి. సైంధవలవణం మెత్తగా పొడికొట్టి కలపుకోవాలి.
  •  ఇప్పుడు ముందే నానబెట్టుకుని పెట్టుకున్న చింతపండు పులుసు తీసుకోవాలి. తొక్కలు, చెత్తలేకుండా చూసుకోవాలి. ఈ పులుసుని పై మిశ్రమానికి కలుపుకోవాలి.
  • ఇప్పుడు చెరకుని చెక్కు తీసి బాగా చిన్నముక్కలుగా చేసి కలుపుకోవాలి. తేనె కూడా కలిపెయ్యాలి. ఆపైన గోరంత పచ్చకర్పూరం, కాస్త యాలకులపొడీ వేసుకోవచ్చు.
  • కొంతమంది జీడిపప్పు, బాదంపప్పు,కిస్మిస్సూ గట్రా కూడా కలుపుతారు….:)
  • అంతే! ఆరురుచుల్నీ రంగరించిన తెలుగింటి అసలుసిసలు “ఉగాదిపచ్చడి” సిద్ధం.
  • తయారు చేసుకుని, తిని, ఆస్వాదించి చెప్పండి. మీరొక్కరే తినటం కాదండోయ్! నలుగురికీ పెట్టండి, వాళ్ళూ ఆనందిస్తారు కదా!

 

మరోమాట! ఈ “ఉగాది పచ్చడి” ఉగాదిరోజే కాదు. వీలైనప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆరోగ్యకరం మరి!..:)

 

ఈ “నందన” మీ ఇళ్ళల్లో, మనసుల్లో ఆనందాన్ని, ఆరురుచుల కలయికల్లాంటి అనుభూతుల్నీ కలిగించాలని కోరుకుంటున్నాను.

 

2 thoughts on “ఉగాది పచ్చడి – ఇది షడ్రసోపేతం

  1. ఉగాది నాడు ఉగాది పచ్చడి గురించి చక్కని విషయాలు చెప్పారు ! ఎప్పుడూ సైంధవ లవణం వాడలేదు ఈ సారి వాడి చూస్తాను! అసలు మనం ఏది చేసుకున్నా కనుచూపు మేరలో ఉన్న అందరికీ పెట్టి కానీ మనం తినకూడదు అంటారు దానికి గుర్తుగానే ఉగాది పచ్చడి అందరికీ పంచి పెట్టడం అనే అలవాటు మొదలయ్యిందేమో అనిపిస్తుంది! సంవత్సరారంభంలో చేసినది సంవత్సరాంతం చేస్తూ ఉంటామని చెప్తారు కదా! మీకు కూడా నందన నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *