March 28, 2024

అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం

రచన : డా. ఎన్.రహంతుల్లా

 

తెలుగుభాష అమలు గురించి పత్రికలకు నేను రాయడం మొదలుపెట్టి 33 సంవత్సరాలు గడిచిపోయాయి. తెలుగు భాష అధికారికంగా కార్యాలయాల్లో అమలు కావడానికి ఎంతోమంది సూచనలు చేస్తున్నారు. అయితే ఎవరెవరు ఏమేం చేశారో ఎలా చేసి సఫలీకృతులయ్యారో తెలియజేస్తే ఇంకా బాగుంటుందని అనిపించి. భాష అమలు కోసం ఎవరెవరు ఏమేం చేశారో తెలిపితే ఔత్సాహికులకు ప్రోత్సాహకంగా ఉంటుందని భావించి నా అనుభవాలు రాస్తున్నాను. ఏం చేస్తే బాగుంటుందో గూడా మళ్ళీ చెబుతున్నాను.

ఆనాటి అధికార భాషా సంఘం అధ్యక్షులు గజ్జెల మల్లారెడ్డిగారు నేను గుమాస్తాగా పనిచేస్తున్న ఒక కార్యాలయ తనిఖీకి వచ్చారు. పూర్తిగా తెలుగులోనే ఫైళ్ళు నిర్వహించే ఉద్యోగి ఎవరైనా ఉన్నారా అంటే అందరూ చర్చించుకొని ఆయన్ని నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన నేను రాసిన ఫైళ్ళన్నీ చూసి తెగ సంబరపడ్డారు. ఈ కుర్రవాణ్ణి చూసి మీరంతా నేర్చుకోవాలి. తెలుగు పదాలు దొరక్కపోతే ఏ మాత్రం సంకోచించకుండా ఇంగ్లీషు పదాలనే తెలుగులో రాశాడు. ఇతని వాక్య నిర్మాణం చాలా సులువుగా సహజంగా అందరికీ అర్థమయ్యేలా ఉంది. ఇదే మేము కోరుకునేది. అంటూ నన్ను అభినందించారు. అది హైదరాబాద్‌లోని డైరెక్టరేట్‌కార్యాలయం కావడంతో అక్కడ పనిచేసే ఉర్దూ సోదరులు ఆంగ్ల మేధావుల మధ్య నాకూ నా భాషకూ ఒక గుర్తింపు వచ్చింది. పూర్తిగా తెలుగులో ఫైళ్ళు నిర్వహించవచ్చు అనే సత్యం అందరికీ తెలిసింది.

తెలుగులో జవాబులు :

పశ్చిమ గోదావరిలో ఎమ్మార్వోగా ఉండగా 23 రిట్‌పిటీషన్‌లకు పేరావారీ జవాబులు తెలుగులోనే రాసి పంపాను. కలెక్టరేట్‌నుండి ఫోన్‌ తెలుగులో ఎందుకు పంపారనే ప్రశ్న. తెలుగులోనైతే జవాబులు తప్పుల్లేకుండా సూటిగా స్పష్టంగా ఇవ్వగలననీ. అర్థంకాకపోవడమనే సమస్యే రాదనీ వాటిని యధాతథంగా హైకోర్టుకు సమర్పించమనీ కాదు కూడదంటే ఇంగ్లీషులోకి తర్జుమా చేయించి జిల్లా కేంద్రం నుండే హైదరాబాద్‌కు పంపించండనీ వేడుకున్నాను. అధికార భాషా చట్టం పుణ్యాన వారు వాటిని హైకోర్టులో నివేదించారు. యధాతథంగానో, ఆంగ్లంలోకి మార్పించో నాకు తెలియదుగానీ అన్ని కేసులూ గెలిచాం. ఆలోచన మన అమ్మ భాషలోనే పుడుతుంది. అమ్మ భాషలో వాదిస్తే గెలుపు ఖాయం అనే సంగతి అందరికీ అర్థమయ్యింది.

తెలుగులో దరఖాస్తులు :

ఇంకో మండలంలో ఎమ్మార్వోగా ఉండగా ధరఖాస్తు ఫారాలు నింపడానికి నా ఆఫీసు బయట ఒక ప్రైవేటు వ్యక్తి పనిచేస్తూ ఉండేవాడు. వచ్చిన వ్యక్తుల అవసరాలనుబట్టి ఇంతింత ఈ ఫారం నింపడానికివ్వాలని వసూళ్ళు చేస్తున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. ఆ ఫారాలు ఇంగ్లీషులో ఉండేవి. ఏయే పనుల కోసం ఈ ఆఫీసుకు ప్రజలు వస్తున్నారు. ఏమేమి ఫారాలు వాళ్ళు పూరించి ఆఫీసులో ఇవ్వాలో తెలుసుకున్నాను. ఓపికగా ఆయా ఫారాలన్నీ తెలుగులోకి అనువదించాను. నాలుగైదు తరగతులు చదివిన వారెవరైనా సులువుగా పూర్తిచేయటానికి వీలుగా అన్ని రకాల ధరఖాస్తు ఫారాలు తయారయ్యాయి. వాటిని ఆ ఊళ్ళోని జిరాక్సు షాపులన్నిటికీ ఇచ్చి కేవలం అర్థరూపాయికే ఏ ఫారమైనా అమ్మాలని చెప్పాము. ఎవరికివారే ఫారాలు నింపుకొని వస్తున్నారు. ప్రతిఫారమూ నాలుగైదు దశలు దాటివచ్చే పద్ధతి తీసేశాం. గ్రామ పాలనాధికారి రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌సంతకాలు చేస్తే చాలు. వాటిపైన నేను సంతకం చేసేవాడిని. ఆఫీస్‌లో గుమాస్తాల ప్రమేయం తగ్గింది. పత్రాల జారీ వేగం పెరిగింది.

పిల్లల బాధలు :

నేను హైస్కూల్‌ చదువుకు రోజూ 7 కి.మీ.బాపట్ల నడిచి వచ్చే వాడిని. కుల, ఆదాయ దృవీకరణ పత్రాల కోసం తహసీల్‌దార్‌ ఆఫీస్‌కు వారం రోజులపాటు తిరిగేవాడిని. ఎండకు తాళలేక బాపట్ల తహసీల్‌దారు ఆఫీసు ఆవరణలో చెట్టు కింద నిలబడేవాడిని. ప్రతిరోజూ డఫేదారు దగ్గర ఒకటే సమాధానం. ‘‘దొరగారు క్యాంపుకెళ్ళారు. రేపు రండి’’. ఆనాడు ఆ చెట్టు కింద అనుకున్నాను ‘‘నేను గనక తాసీల్దారునైతే చిన్న పిల్లలకు చకచకా సంతకాలు చేసి పంపిస్తాను’’ అని. తహసీల్దారునయ్యాక మాట నిలుపుకున్నాను.

స్కూళ్ళు తెరిచే జూన్‌ మాసంలో సర్టిఫికెట్ల కోసం పిల్లలు బారులు తీరేవాళ్ళు. రద్దీ ఎక్కువగా ఉన్నపుడు ఆ పిల్లల చేతనే సర్టిఫికెట్లపై నంబర్లు వేయించి స్టాంపు సీలు కొట్టుకోమనేవాడిని. అరగంటలో పిల్లలంతా ఉత్సాహంగా తమ పని ముగించుకొని, సర్టిఫికెట్లతో వెళ్ళిపోయేవారు. అంతా తెలుగులోనే. తెలుగు పిల్లలు తెలుగులో ఎంతో వేగంగా పనిచేసే వాళ్ళు. నా 13 సంవత్సరాల ఎమ్మార్వో పదవీ కాలంలో తెలుగు పిల్లలు ఎక్కడా పొరపాటు చేయలేదు. మా రిజిస్టర్లన్నీ చక్కటి తెలుగులో మన తెలుగు పిల్లలే నిర్వహించారు. ఆ కాలమంతా నాకు మధురానుభూతి. మండలంలోని అన్ని హైస్కూళ్ళ ప్రధానోపాధ్యాయులకూ ఒక ఫ్రొఫార్మా ఇచ్చి వారి స్కూల్లోని పిల్లలందరి కులం, స్వస్థలం, పుట్టినతేదీ… మొదలైన వివరాలు నింపి ధ్రువీకరించి పంపమని కోరాను. ఆయా గ్రామ పాలనాధికారులు కూడా ఆ వివరాలను ధ్రువీకరించారు. పిల్లలెవరూ మండల కార్యాలయానికి రానక్కరలేకుండా శాశ్వత కుల, నివాస స్థల, పుట్టిన తేదీ ధ్రువపత్రాన్ని వారి ఫొటోలు అంటించి వారి వారి పాఠశాలల్లోనే పంపిణీ చేశాం.

 

రైతులకోసం;

పట్టాదారు పాసు పుస్తకాలు రైతుల ఇళ్ళకు పంపిణీ చేయించాం. వీటన్నిటిని తెలుగు రాత పనిలో మంచి చేతిరాత కలిగిన గ్రామ సేవకులు, ఉపాధ్యాయులు, గ్రామ పాలనాధికారులు, విద్యార్థుల్ని కూడా ఉపయోగించుకున్నాం. ఎలాంటి తప్పులూ దొర్లలేదు. ఏ ఊరి ప్రజల పని ఆ ఊళ్ళోనే ఆ ఊరి వాళ్ళే చేసుకున్నందువలన ఎంతో స్పష్టంగా పని జరిగింది. పల్లెటూళ్ళ అందం వాళ్ళు రాసిన తెలుగు అక్షరాలతో మరింత పెరిగింది. తల్లి భాషకు దూరమైన రోగులు పల్లెటూళ్ళకెళ్ళి ప్రాణవాయువెక్కించుకోవచ్చుననే అనిపించింది.

లిపి బాధలు;

ప్రజలకు అవకాశం ఇస్తే వాళ్ళు మాట్లాడే భాషలోనే శక్తివంతంగా జ్ఞానయుక్తంగా దరఖాస్తులు పెడుతున్నారు. విన్నవిస్తున్నారు. పోరాడుతున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఆంగ్లం వారికి అరగటం లేదు. తెలుగు చక్కగా జీర్ణమౌతున్న అమృతాహారం. మాటలవరకైతే ఎంతో బాగుంటుంది కానీ అప్పు తెచ్చుకున్న సంస్కృతాక్షరాలు వరుసవావి లేకుండా తయారుచేసిన లిపి మన పిల్లలకు అరక్కపోవడమేగాక మళ్ళీ దాని జోలికి వెళ్లటానికి బెదిరిపోయే పరిస్థితి వచ్చింది. 18 లక్షరాలతో తమిళ లిపి  తమిళులకు వరమయ్యింది. 50 అక్షరాలు వత్తులు, గుణింతాలు మనకున్నా, అవి శాస్త్రీయంగానూ క్రమపద్ధతిలోనూ పిల్లల మనస్సులపై సుళువుగా ముద్రవేసేవిగానూ లేనందువల్ల తెలుగు లిపి మనకు మనమే తెచ్చిపెట్టుకున్న చేటుగా మారింది. ఇది భాష తప్పు కాదు. దాన్ని చెడగొట్టిన మన పెద్దల తప్పు.

కర్త కర్మ క్రియలతో సంబంధం లేకుండా అసలు వాక్యం అర్థమయితే చాలునని ఇంగ్లీషు వాళ్ళు తమ భాష వాడకానికి సడలింపులిచ్చారు. మరి మనవాళ్ళో, అసలీ కర్త, కర్మ, క్రియ అనే పదాలు పల్లెటూరి తెలుగువాళ్ళు పలుకుతారా? పలకరు. చేసినవాడు, చేసినపని చేయించుకున్నవాడు… అంటారు. అలా అంటే సంస్కృత పండితులు ఊరుకోరు. శతాబ్దాల తరబడి వీళ్ళు చేసిన పెత్తనం వల్లనే మన తెలుగు వికృతం అయ్యింది. మన కూడిక సంకలనం అయ్యింది. మన తీసివేత వ్యవకలనం అయ్యింది. మన సాగు సేద్యం అయ్యింది. మన నెత్తురు రక్తంగా మారింది. మన బువ్వ అన్నం అయ్యింది. మన జనం పలికే తెలుగుపదాలు సంస్కృత పదాలుగా మార్చి, మన పూర్వీకుల నాలుకలు సంయుక్తాక్షరాలు పలికేలా సాగగొట్టిన ఘనత ఈ సంస్కృత పండితులదే. వీళ్ళ వల్లనే తెలుగుకు పురాతన భాష హోదా దక్కకుండా పోయింది. నన్నయ్యకు ముందు తెలుగు కవులెవరూ లేరనే పిడివాదం మనకు మనమే తగిలించుకున్న గుదిబండ.

ఇక ఇప్పుడు తెలుగు వాడకంలోంచి సంస్కృతం ఇంగ్లీషు,ఉర్దూ పదాలను తీసివేయలేము. అవి మన భాషలో అంతర్భాగాలైపోయాయి. అక్కరలేని ఆపరేషన్‌ఎవరు చేయించుకుంటారు? చేసినా గాయాలవడం తప్ప మరే మేలూ కలుగదు. అందువలన మన భాష సంకరమైన బలమైన హైబ్రీడ్‌భాషలాగా తయారైనందుకు సంతోషపడుతూ ఈ సంకర తెలుగు భాషలోనే ఆఫీసులో ఫైళ్ళు నడిపితే అదే పదివేలుగా భావించాలి. చాందసవాదులు వాళ్ళు చెయ్యరు. ఇంకొకళ్ళను చేయనివ్వరు. ఒకవేళ ఈ పనిని వాళ్ళకప్పజెబితే ఎవరికీ అర్థంగాకుండా పాడుచేస్తారు. ప్రజలు ఇంతకంటే ఇంగ్లీషే నయమని వాపోయేలా చేస్తారు. మన శాసన సభలో ఎమ్మెల్యేలు ఈ మూడు భాషల పదాల కలగలిపి మనోరంజకంగా మాట్లాడుతున్నారు. అదే నేటి తెలుగు. వాడుక తెలుగు. వారు అడిగింది అడిగినట్లుగా తెలుగు లిపితో, సాగదనుకుంటే ఆంగ్లలిపినే వాడుకోండి. మన మాట ముఖ్యం. వాళ్ళు ప్రజాప్రతినిధులు. వాళ్ళు మాట్లాడుతున్నది మన ప్రజల భాష. ఆ భాషలో యాసలో జీవోలు రావాలి. అప్పుడే తెలుగు అధికార భాషగా విరాజిల్లుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *