June 25, 2024

నాకు నచ్చిన పుస్తకం

రచన : డా. ఏల్చూరి మురళీధరరావు

 

“నాకు నచ్చిన పుస్తకం” అన్న శీర్షికతో వ్యాసరచన పోటీకి భావనిర్భరమయిన ఒక వ్యాసాన్ని రచింపవలసినదిగా ఇరవైఆరేళ్ళక్రితం – 1985లో అనుకుంటాను, నా విద్యార్థులను కోరినప్పటినుంచీ, శారదిక మధురచంద్రికలా ఈ విషయం నా హృదయంలో తళతళ మెరుములీనుతూనే ఉన్నది.

 

కళాశాల శరత్సమాపనవేళకు మునుపు ఈ విషయాన్ని పోటీకి ప్రకటించిన వెంటనే, ఒక విద్యార్థి – పులిపాటి జయరాం ప్రసాద్ అతని పేరు – నా దగ్గరి చనువుతోనూ, నాపైని అభిమానంతోనూ ఆరోజు నన్ను ప్రశ్నించాడు సూటిగా: “మాష్టారూ! మరి మీ అభిమానగ్రంథం పేరేమిటి? అని.

 

ఆ యువకుని నిరంతర విస్ఫారితనేత్రాలలోకి చూస్తూ నాలో నేను విలీనంగా నిలబడి ఉన్నాను. అతను మళ్ళీ రెట్టించి అదే మాట అడిగాడు.

 

అనభ్యూహితమైన అతని ప్రశ్నకు ఉలికిపడి, ఏవేవో పుస్తకాల పేర్లు స్మృతిపథంలో నుంచి నా పెదవులపైకి కదలివస్తుండగా, ఏదో పరధ్యానంలో మునిగిపోయి నేను నిరుత్తరంగానే అక్కడినుంచి కదిలి ముందుకు నడవసాగాను.

 

అతని ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే.

 

నా ఉదాసీనతను గర్వంగా భావింపక, దయతో అతడు నన్ను మన్నించాడనే ఆశిస్తాను.

 

నిజానికి, ఆనాటి అతని ప్రశ్నకు సమాధానంగానే, నా చిరకాల మౌనహృదయ ప్రతిస్పందనను ఈ అక్షరాలకు అంకితం చేశాను . . .

 

చిన్నప్పటినుంచీ మా అమ్మ చదివి నాకు ఇవ్వగా – నేను చదివిన పుస్తకాలన్నీ, అచ్చంగా మా అమ్మలాగే, నాకు ఆత్మీయతనూ, ఆప్యాయాన్నీ చూరయిచ్చాయి. వాటితోనే అసలు నా చిన్ననాటి స్నేహాలన్నీ. చందమామ పత్రిక వెలువడే రోజున, వాడుక చొప్పున కొట్టువాడు ఇంట్లో పడవేసేలోపుగా కొట్టుచుట్టూ తారట్లాడి, స్వహస్తాలతో, నేనే దానిని అందుకొని, వీథిదీపం నులివెలుగులో అయినా చదవడం పూర్తిచేసి, ఇంటి కిటికీలోంచి లోపలికి విసిరివేసేవాణ్ణి. నేను పడవేసిన పుస్తకాన్ని అప్పుడే వచ్చినట్లుగా ఆతురతతో నాకన్నా ముందే ముగించాలని మా అక్కయ్య చదువుతుంటే నాకెంతో సంతోషంగానూ, గర్వంగానూ ఉండేది.

 

ఇన్నాళ్ళు గడిచినా ఇంకా నిన్నటివిలాగే మురిపిస్తున్నాయి, బాల్యపు ఆ అనుభూతులూ, ఆ గ్రంథాలతోపాటు నన్ను వెన్నంటి వచ్చిన ఆ అనుభవాలూనూ.

 

ఆ తరువాత మొదలయింది: ఆశలూ, నిరాశలూ, ఆశయాలూ – ఆ ఆశయాలను అందుకోలేకపోయామే అన్న నిస్పృహా. చిన్నప్పుడు నాకెంతో నచ్చిన ఆ “జ్వాలాద్వీపరహస్యం”లోని బంగారు కలల రాజకుమారుని కథ నా కిప్పుడు పిల్లలకు చెబుతున్నపుడు చెప్పలేని నిరాశను కలుగజేస్తోంది. “తోకచుక్క – మకరదేవత”ను చదివినప్పుడు నిజమనుకొన్న ఊహల లోకం ఇప్పుడు గాలిమేడలా కూలిపోతున్నది. నాదే అనుకొని నాకోసం నేను నిర్మించుకొన్న ప్రపంచంలో తాడే పామై కరుస్తున్నది. నేను వెలిగించగలననుకొన్న దీపం వత్తిని ఏదో అదృశ్యహస్తం దయలేకుండా మెలిపెడుతుంటే ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తూ నిలుచొని ఉక్కిరిబిక్కిరవుతున్నాను.

 

ఇన్నాళ్ళయినా, నాకు కొద్దిగానయినా చేతకాలేదు ౼ జీవితంలో సరిపుచ్చుకొనడం, సర్దుకొనిపోవడమున్నూ.

 

అందుకు ప్రతిఫలం ఏమిటి? అసంతృప్తి. ఎప్పటికప్పుడు మనస్సును తీరని అలజడులు అలముకొంటాయి.

 

మరి అసంతృప్తే అసలు ప్రగతికి త్రోవచూపుతుందని అంటారు. గురుదేవులు మా పండితారాధ్యుల వీరేశలింగం గారయితే దుఃఖాలనూ అచ్చంగా సుఖాలలాగే శివానుగ్రహంగా స్వీకరించగలరు. అంత నిండైన పరిపాకంతో జీవితాన్ని పండించుకోవడం అందరికీ చేతనైన విద్య కాదు. కానీ – ఏదేదో కావాలనుకొని సాధించే ప్రగతి కంటే, తామరాకుపై నీటిబొట్టులా నిర్లిప్తంగా ఉంటూ ఉన్నదానితో సరిపుచ్చుకోవడంలోనే మనిషికి మనశ్శాంతి ఎక్కువగా కలుగుతుందేమో!

 

“పూత మెరుగులు ఎన్ని ఉన్నా, మనిషికి కావలసింది మనశ్శాంతి” – అనుకుంటాను, మరీ మరీ ఈనాడు నేను.

 

నాకు నచ్చిన పుస్తకం నాకెంతో ఆత్మసంతృప్తినీ, మనశ్శాంతినీ ప్రసాదించింది. కొన్నాళ్ళుగా చీకటి కమ్మినట్లుగా చైతన్యవిరహితమై ఉన్న నా జీవితంలోకి ప్రవేశించి ఆ పుస్తకం నన్ను ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేసింది. భయానకమైన విషాదానుభవాలనూ, అసూయను కలిగించే ఉత్సాహప్రేరణలనూ ఆనందరత్నాలుగా పరిగణించిన ఆ రచయిత హృదయవైశాల్యం నాకు ఆశ్చర్యాన్నీ, అమేయానందాన్నీ కలుగజేసింది. ఎంతో విలువైన ఆయన అనుభవాల సంపుటిని నిర్గతికమైన నా జీవితంతో పోల్చిచూసుకొని నేను నాకొక గమ్యాన్నీ, ఒక లక్ష్యాన్నీ ఏర్పరచుకొన్నాను. నా ఆలోచనాధారను విభ్రమాస్పదమైన ఎగుడుదిగుళ్ళ ఎత్తుమీదినుంచి ప్రశాంతమూకీభావసీమలకు మళ్ళించిన ఆ అపురూపమైన పుస్తకంపైని – నెనరూ, అనురాగమూ తొణికిసలాడే అక్షరాలతో ఆయన సంతకం చేసియివ్వడం నాకు మరీ అపురూపమైన వరంగా భావిస్తాను నేను.

 

నాకు నచ్చిన ఆ పుస్తకం రచయిత శ్రీ ఆచంట జానకిరామ్ గారు. అది ఆ మహనీయుని ఆత్మకథే. ఆ పుస్తకాన్ని చదువుతున్నంత సేపు – కన్నులవిందైన పొందూరు ఖద్దరు లాల్చీ పైజమాలు ధరించి, గాలిలో గమ్యం లేకుండా ప్రసరిస్తుండే అమాయికమైన చూపులతో, గాలితాకిడికి సుతారంగా పైకెగిరి కదలాడుతుండే ముంగురులతో, అనురాగవికాసముఖర ముఖరేఖలలో ఉట్టిపడే లావణ్యంతో ఆయన రూపధేయం మనకు భాసిస్తుంది. అందమైన ఆ రూపానికి ప్రతిబింబమే ఆయన శైలిలోనూ, రచనలోనూ ఇనుమడించి ప్రకాశించే మృదుస్వభావం, సంస్కారశీలమూ.

‘సాగుతున్న యాత్ర’ అన్న పేరిట వెలువడిన ఆయన ఆత్మకథను చదివిన చాలా రోజులకు ఆయనను నేను సందర్శించుకోగలిగాను. మా నాన్నగారికి మనసుమెచ్చిన మంచి మిత్రులాయన.

 

అచ్చమూ నేను ఊహించిన రూపే అది. కానయితే కనుబొమ్మలకు పునుగు రాసుకొని, చెవుల వెనుకా మెడ దగ్గరా మంచిగంధం అలదుకొన్న దృశ్యాన్ని మాత్రం నేను ఏమాత్రం చిత్రించుకోలేకపోయాను. వాఙ్మయమూర్తులను విలేఖించి, వర్ణచిత్రాలను విరచించి, కలాన్నీ కుంచెనూ కళాత్మకంగా పట్టుకొన్న ఆయన మృదువైన చేతులలో ఎర్రని గులాబీలు, వెల్వెట్ కంటే మృదువుగా నిగనిగలాడేవి, అతిసుకుమారంగా పెదవి విప్పి ప్రియుని చెవిలో ఏదో రహస్యాన్ని చెప్పబోతున్నట్లు వికసిస్తూ వికసిస్తున్న పువ్వులున్నాయి.

 

ఒక గులాబీ పువ్వు కాడను మునివ్రేళ్ళతో గాలిలో తిప్పుతూ ఆయన అన్నారు:

 

“జీవితం కూడా ఒక పువ్వే.

 

ఎంత పరిమళభరితమో, అంత క్షణికం.

 

జీవితాన్ని ప్రేమించడమే జీవితం అంటే”

 

అని.

 

ఆ విలువైన వాక్యాలే ఆయన ఆత్మకథకు సమీక్షారేఖలూ, నా ఆత్మకథకు దారిదీపాలూ !

 

 

“సాగుతున్న యాత్ర” జానకిరామ్ గారి జీవిత సత్యాన్వేషణ తత్పరతకూ, నిశ్చలమైన ఆశాభావానికీ నిదర్శనం. ఆంగ్లసారస్వతంలో సుప్రసిద్ధమైన ‘పాపియాన్’ కథానాయకునిలా అగుపిస్తారాయన నాకెప్పుడూ. స్వాతంత్ర్యంకోసం తిరుగుబాటు చేశాడని అతడిని ఫ్రెంచి గయానా ప్రభుత్వసైన్యాలు కారాగారంలో ఏకాంత నిర్బంధంలో కట్టడిచేస్తాయి. అన్నపానాలు లేకుండా చీకటిగదిలో కొసవూపిరితో కొట్టుమిట్టుకులాడుతున్నా అతనికి స్వేచ్చాకాంక్ష అణగిపోదు. ప్రాణం నిలుపుకొంటూ వెలుగువెల్లువకోసం ఎదురుచూస్తుంటాడు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. అతను చివరికి ఖలీల్ జిబ్రాన్ ‘ప్రాఫెట్’ కృతిలో నాయకునిలా తన జనులను చేరుకొనేసరికి తనను తానే గుర్తుపట్టలేనంతగా మారిపోతాడు శారీరికంగా – ఒంటినిండా కాలం వేసిన చెరగని ముద్రలతో. ఆ కథను చదివి ముగించిన తర్వాత మనకు మళ్ళీ జీవితంపైని సరికొత్తగా అభిమానమూ, అభిరుచీ కలుగుతాయి. మనపైని మనకే మళ్ళీ నమ్మకం ఏర్పడుతుంది. అంత గంభీరమైన శక్తిగల రచన అది.

 

సరిగ్గా అంతటి అనుభవమూ జానకిరామ్ గారి కథను అధ్యయనం చేశాక నాకు కలిగింది. మరొకరైతే ఆత్మహత్య చేసుకోవాల్సిన సన్నివేశాలను ఎదుర్కొని కూడా, సున్నితమైన తన మనస్సు నలిగిపోతున్నా – ఆయన జీవితాన్ని ఎంతో ప్రేమింపగలిగారు, మంచిరోజులు తప్పక వస్తాయని నమ్ముతూ! వమ్ముకాని ఆ నమ్మకం కోసమే నేను ఆయన జీవితోదంతాన్ని మననం చేసుకోగలిగాను.

 

ఎన్నో విలువైన అనుభూతులను మరచిపోకుండా జ్ఞాపకం ఉంచుకొని పొందుపరచిన తన గ్రంథంలో జానకిరామ్ గారు తన జననకాలాన్ని ఎందుకనో పేర్కొనలేదు. ఆ తర్వాతెక్కడో చదివాను: 1902లో జన్మించారని ఒకచోట, 1903 జూన్ 16న జన్మించారని వేరొకచోట. అయినా అనుభవాలూ జ్ఞాపకాలూ కొల్లలుగా ఉన్న పరిచయాలలో తారీఖులూ, దస్తావేజులతో పని ఉండదు.

 

ఈ తేదీలూ పుట్టిన రోజుల కన్నా ఎంతో అమూల్యమైన తన జీవితాన్ని తెరిచిన పుస్తకంలా అధ్యయనం చేసేందుకు వీలుగా ఆయన అక్షరాలకు అంకితం అయ్యారు. మాలో మాకుగల చేరరాని దూరాన్నీ, చేరువైన పోలికలనూ నేను కుతూహలంతోనూ, భక్తిభరితంగానూ గమనించడం మొదలుపెట్టాను.

 

ఆయన కొన్నాళ్ళు బొంబాయి, ఢిల్లీలలో ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేసి, 1938లో మద్రాసు ఆకాశవాణిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత విజయవాడలో తెలుగు కార్యక్రమాలను ప్రారంభించారు. తన ఉద్యోగనియామకాన్ని గురించి ఆయన నెమరు వేసికొన్న సన్నివేశం ఎంతో ప్రభావకీలకంగా ఉంటుంది. చేస్తున్న ఉద్యోగం పట్ల విసుగు పుట్టి ఆయన కొత్తగా ప్రారంభింపనున్న ఆకాశవాణిలో చేరాలని ఢిల్లీకి వస్తారు. ఆధ్యాత్మికవేత్తలు మరణానంతర జీవితాన్ని గుఱించి అంతరంగవీథుల్లో గవేషించినట్లు ఇన్స్యూరెన్స్ ఏజెంట్ల కృషిసర్వస్వం మరణానంతరం వచ్చే డబ్బుకోసం సృష్టిస్తున్న ఆరాటంగా ఆయనకు నిర్లిప్తతను కలిగిస్తుంది. రెండు ఉద్యోగాలూ ఒక తీరువే అన్న భావంలో ఉన్న వ్యంగ్యం గమనింపదగ్గది. జేమ్స్ కజిన్స్ గారి శిక్షణలో థియాసఫీ పరిచయమైన నాటినుంచి మతం పట్ల ఆయనలో వచ్చిన మార్పు సంగతి తెలిసిందే. మంచు కురిసే చలికాలపు తెల్లవారుజామున ఆయన ఢిల్లీలో  ఆకాశవాణి స్టేషన్ డైరెక్టరు లయోనెల్ ఫీల్డెన్ దొరను కలుసుకోవాలని – అలవాటైన వేసవి కాలపు లఖ్నవీ దుస్తుల్లోనే – ఆయన ఇంటికి వెళ్తారు. ఫీల్డెన్ ప్రశ్నలన్నీ ఈయన జ్ఞానవిజ్ఞానాలను గుఱించి గాక – వ్యక్తిగతంగా ఉంటాయి. జానకిరామ్ గారు తన కథంతా – అనుకొన్నదంతా చేజాఱిపోవటం, ఆశలు, వైఫల్యాలు – అన్నీ సంక్షిప్తంగా ఆయనకు వివరిస్తారు. ఫీల్డెన్ ఆయనను ఉద్యోగంలో చేర్చుకొంటూ –

 

“జీవితంలో కొంత సుఖదుఃఖాల అనుభవం కలిగి, ఆశనిరాశలను చవిచూసినవారే ఆకాశవాణిలో ఉద్యోగానికి తగినవారు.”

 

అని “సాగుతున్న యాత్ర”లో ఆయనకు చెప్పిన సన్నివేశాన్ని చదువుతున్నపుడు ఆ ప్రసారమాధ్యమంలో పనిచేసేవారికి ఎంతైనా గగుర్పాటు కలుగక మానదు.  ఆ ఉద్యోగంలో చేరవచ్చునా? అని జానకిరామ్ గారు ఆత్మీయులను సంప్రతించారట. తండ్రిగారికది నచ్చినట్లు లేదు. అక్కయ్య, బావగారి ప్రోత్సాహం కొద్దీ ఆయన ఆకాశవాణిలో ఎనౌన్సరుగా చేరారు. తొలిసారిగా తెలుగులో “ఆకాశవాణి” అని అశేషాంధ్రప్రజానీకానికి వినిపించి, ఆ ప్రసారమాధ్యమానికి శ్రీకారం చుట్టారు.

 

నేను కొన్నాళ్ళు ఆకాశవాణిలో పనిచేసి, ఇన్స్యూరెన్స్ ఉద్యోగంలో కాదు కానీ నాకు అభిమానపాత్రమైన అధ్యాపకవృత్తిలోకి ప్రవేశించాను.

 

ఒక మర్చిపోలేని జ్ఞాపకం: మద్రాసు విశ్వవిద్యాలయంలో నా ఎం.ఫిల్ చదువు పూర్తవుతున్న తరుణంలో 1978లో ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చినపుడు – ఆ నియామకపత్రాన్ని చూసి మా నాన్నగారు చదువు కొనసాగించమని, ఇప్పుడప్పుడే ఉద్యోగం అనవసరమని అన్నారు. విశ్వవిద్యాలయంలో మా గురువు గారు ఆచార్య గంధం అప్పారావు గారు వెంటనే పిహెచ్.డి.లో చేరమని; ఉద్యోగం వద్దని గట్టిగా చెప్పారు. సందిగ్ధావస్థలో పడ్డాను. చేతికి వచ్చిన ఉద్యోగాన్ని ఎలా వదులుకోవడం? “చేరనా?” అని నాకు చనవున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారింటికి వెళ్ళి ఆయనను అడిగాను. ఆయన కొంత సందేహిస్తూనే, “సరే” నన్నారు. ఆ తర్వాత నాన్నగారికి ఆప్తమిత్రులు, ప్రముఖకవి దాశరథి గారిని సంప్రతించాను. ఆయనయితే, “వెంటనే చేర”మని మఱీ మఱీ ప్రోత్సహించారు. ఏం చేయాలో తోచలేదు. అనిసెట్టి సుబ్బారావు గారితో కలిసి నేనూ, మా నాన్నగారూ గొల్లపూడి మారుతీరావు గారింటికి వెళ్ళాము. ఆయన వారిద్దరికీ మంచి మిత్రులు. అంతకు ముందే మారుతీరావు గారు నాకు రేడియోలో తొలి కవితాపఠనకు అవకాశం కల్పించి, ఒకరోజు చదివిన కవితకు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు శ్రీ యన్టీ రామారావుగారి ద్వారా కవిపరిచయం కూడా చేయించారు. (ఆ తర్వాత హైదరాబాదు స్టేషను డైరెక్టరుగా పనిచేసిన పి.యస్. గోపాలకృష్ణ గారు కూడా ఆ రోజు కవితలు చదివారు.) ఆయనతో నా పరిచయనేపథ్యం అది.

 

మారుతీరావు గారు, “నాయనా! ఉద్యోగం వచ్చింది కాబట్టి వెళ్ళి చేరితే చేరు కానీ నువ్వెలాగూ కాలేజీలోనో, యూనివర్సిటీలోనో ఉండాల్సిన వాడివే. ఆ ఉద్యోగం రాగానే మారకుండా ఉంటావా?” అని – ఆ భవిష్యద్దర్శనులు సహృదయంతో ఆదేశించారు. వారన్నట్లే నేను రేడియోలో పనిచేసినట్లే పనిచేసి, కొన్నాళ్ళకు నాకిష్టమైన అధ్యాపకవృత్తిలో చేరిపోయాను.

 

జానకిరామ్ గారు ఢిల్లీనుంచి విజయవాడ మీదుగా మద్రాసుకు వెళ్ళారు. నేను మద్రాసు నుంచి విజయవాడ ఆకాశవాణి మీదుగా ఢిల్లీకి వచ్చి చేరాను.  మా ఇద్దరి జీవితాలలోనూ హస్తిమశకాంతరంగా జరిగిన తులనీయఘటనలివి. తన సమకాలంలోని అసంఖ్యాక రసజ్ఞుల హృదయాలను అలరించిన ఖ్యాతి ఆయనకు లభింపగా, నా సమకాలంలోని జిజ్ఞాసువులతో శైష్యోపాధ్యాయికను నెరపి వారి అభిమానాన్ని చూరగొనే ప్రయత్నం మాత్రమే నాదయింది. నేను అన్నివిధాల మా నాన్నగారిని ఆరాధించి, అనుకరించడానికి ప్రయత్నం చేయగా – అటువంటి పూనికే నాకు నచ్చిన పుస్తకంలోనూ సాక్షాత్కరించి, మా ఇరువురి ఆలోచనల సామ్యానికీ నేను ఆశ్చర్యాన్నే పొందాను. ఇన్ని విధాలుగా అందులోని అనుభవాల సంపుటిని నేను నాదిగా సంపుటీకరించుకోగలగటమే నా అభిమానానికి కారణం.

 

 

అంతేకాదు. ‘సాగుతున్న యాత్ర’ గ్రంథంలో శ్రీ ఆచంట జానకిరామ్ గారితో కలిసి నడిచిన పెక్కుమంది పెద్దలనూ, సాహిత్యికులనూ నేనూ స్వయంగా కలుసుకోగలిగాను. వారందరి అనర్ఘమైన కృతిదీధితుల స్వరూపమైత్రి నాకు కలిగింది. తెలుగు సాహిత్యాన్ని వేలుపట్టుకొని ముందుకు నడిపించిన మహాకవులు అబ్బూరి రామకృష్ణారావు గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, మల్లవరపు విశ్వేశ్వరరావు గారు, శ్రీశ్రీ గారు – వీరంతా ఇప్పుడు లేరు. ఆ ప్రభావశీలి మహావ్యక్తుల కవిత్వాలనూ, వ్యక్తిత్వాలనూ సన్నిహితంగా ఉండి పరిశీలింపగల అదృష్టం జానకిరామ్ గారికి తండ్రిగారి ప్రసిద్ధి మూలాన, ఉద్యోగరీత్యానూ వశపడింది. నాకూ అదే కారణవశాన సాధ్యమయింది. వారందరిని దర్శింపగలిగాను. అందులో అడుగడుగునా విరాజిల్లే సుగృహీత నామధేయులు  రాయప్రోలు సుబ్బారావు గారు, తల్లావఝల  శివశంకరశాస్త్రి గారు, నోరి నరసింహశాస్త్రి గారు, వేదుల సత్యనారాయణశాస్త్రి గారు, పాటిబండ మాధవశర్మ గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు, కొంపెల్ల జనార్దనరావు గారు, అడవి బాపిరాజు గారు, నండూరి సుబ్బారావు గారలను దర్శించి, వారి సన్నిధిరూపమైన పెన్నిధికి నోచుకొనే భాగ్యం నాకెన్నడూ కలుగనే లేదు. అయితే, ఆ తర్వాతి తరంలో ప్రభావశీలి వ్యక్తులైన వారి సంతతి – రాయప్రోలు రాజశేఖర్ గారిని, తల్లావఝల కృత్తివాసతీర్థులు గారిని, నోరి మంగళాదేవి గారిని, పాటిబండ ఝాన్సీలక్ష్మి గారిని, వేదుల వారి కుటుంబసభ్యు లందరినీ, జలసూత్రం ప్రసాద్ గారిని నేను ఎన్నో మార్లు కలుసుకొని ఎన్నో అనుభవాలను గ్రహింపగలిగాను. ఆ గ్రంథంలో సాక్షాత్కరించే మహాకవులూ,  మహామహులు – విశ్వనాథ సత్యనారాయణ, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, అయ్యగారి వీరభద్రరావు, జనమంచి రామకృష్ణ, మల్లంపల్లి ఉమామహేశ్వరరావు, ఆరుద్ర, దాశరథి, బెజవాడ గోపాలరెడ్డి గారలను మాత్రం – భగవదనుగ్రహం వల్ల వారందరూ సజీవులై ఇంకా కళా సాహిత్యరంగాలను సుసంపన్నం చేస్తూ ఉండిన కాలంలో కలుసుకొని, వారి వారి జీవితానుభవాలనూ, అభిప్రాయాలనూ అన్వీక్షించడానికి ‘సాగుతున్న యాత్ర’ నాకొక సాధ్యనిర్దేశం అయింది. అనివార్యమైన కాలపు క్రమపరిగతిలో సంభవించే ఎన్నో మార్పులను ఈ కవులలో గుర్తించడానికి కూడా నాకు ఆ గ్రంథమే ఆధారం అయింది.

 

మరొక విరోధాభాసం సంగతి చెప్పాలి. ‘సాగుతున్న యాత్ర’ కృతిలో నేను చదివిన కృష్ణశాస్త్రి గారు నిండు యౌవనంలో, ఉబికే ఉద్రేకశీలంతో, భావకవితా సవితల కవితల ఉద్యమవ్యాప్తికి కృషిచేస్తున్న కార్యకర్తగా భాసింపగా – నేను చూసిన కృష్ణశాస్త్రి గారు పండు వయస్సులో, ప్రశాంత భావుకత్వంతో, స్తిమిత గంభీరగమనంతో నన్ను ఆకట్టుకొన్నారు. లవణాన్ని (ఉప్పును) ఎండలో పెడితే మెరిసే మెరుముల నానావర్ణసమ్మిశ్రణాన్ని “లావణ్యం” అంటారట. ఆ లావణ్యాన్ని మించిన వర్ణనీయమైన వర్ణశబలత కనుపించింది నాకు ఆయనలో. వారింటికి ప్రతిరోజూ వచ్చే మహాకవులు, మహావిద్వాంసులు, నటీనటులు, గాయనీగాయకులు, కళాకారులు, చలనచిత్రరంగానికి చెందిన పెద్దలందరినీ పేరుపేరున కలుసుకొనే అదృష్టం నాకు దక్కింది.

 

“సాగుతున్న యాత్ర”లో జానకిరామ్ గారి యౌవనపు రోజుల్లో శ్రీనాథుడిని ఆరాధిస్తూ, సారస్వత సేవాహేవాకతత్పరులై కవిగా రూపుదిద్దుకొంటుండిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు నాకు తెలిసే నాటికి స్వయంవ్యక్తిత్వాన్నీ, సొంత గొంతునూ సంతరించుకొని, పరిణతినీ పరిపక్వతనూ సాధించిన మహాకవి. శాశ్వత మహాగ్రంథకర్త. కవులకు సామాన్యమైన ఇంద్రియప్రవణతకు అతీతమైన సంయమనాన్ని కలిగి, నిరాధార ధారాకౌశలవశంగతమైన అప్రతీత పదప్రయోగాభిమానాన్ని పరిహరించి, మహాకవిత్వదీక్షితుడైన ఆ ఋషితుల్యునితో మెలగటం నాకొక అపూర్వానుభవం. ఆ తర్వాతి కాలంలో నాకు ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు, జానకీ బాల గారు ఆత్మీయులయ్యారు.

 

ఇంకా ఎందరో ఉన్నారు. అప్పట్లో పద్యకవిగా లోకాన్ని ఆకర్షించి, విభ్రాంతామరుకాన్ని వేత్తృమోహనంగా ఆలపించిన పిలకా గణపతిశాస్త్రి గారు ఆ తర్వాత వచనరచయితగా స్థిరపడ్డారు. ఆయన మనోహర గానకళాకౌశలం, వ్యాకృతశీలసంపద, శాస్త్రనిష్ఠ నన్ను మరీ మరీ ఆకర్షించేవి.

 

“సాగుతున్న యాత్ర” లోని చలం గారు మా నాన్నగారికి బాల్యవయోవస్థ నాటినుంచీ సుపరిచితులు – నాకు తెలిసేనాటికే తమ సాహిత్యాన్నీ, నాస్తికధర్మాన్నీ, ఆదర్శపరంపరనూ త్యాగంచేసి అతీంద్రియ దర్శనానికై రమణాశ్రమానికి వెళ్ళిపోయారు. నేను వారిని చూడలేదు. జానకిరామ్ గారితో స్వస్థమైత్రీబంధం కలిగిన సౌరిస్ గారి రచనలతోనూ, వజీర్ రెహమాన్ “ఎక్కడికి పోతావీ రాత్రి” సంపుటి కవిత్వానికి చిత్రాలను వేసిన రెడ్డెప్ప నాయుడు గారి ద్వారా రెహమాన్ గారి సాంద్ర కవితామూర్తితోనూ నాకు శ్రుతపరిచయం మాత్రమే ఏర్పడింది. నా ప్రాణమిత్రులైన ప్రముఖ చిత్రకారులు శ్రీ రెడ్డెప్ప నాయుడు గారు చలం గారి కంటె వజీర్ రెహమాన్ గారినే అనుక్షణికం తలచుకొనేవారు. నాకు రెహమాన్ గారితో కలిగిన పరిచయమల్లా “సాగుతున్న యాత్ర” అధ్యయనస్మృతిపరంపరల నుంచే.

 

ఆ రోజుల్లో రంగస్థలం పైనీ, రేడియో లోనూ నటులుగానూ, గాయనీగాయనులుగానూ పైకి వస్తుండిన కన్నాంబ, ఋష్యేంద్రమణి, బాలసరస్వతి, చిత్తూరు నాగయ్య, జంధ్యాల గౌరీనాథశాస్త్రి గారలు – చిత్రసీమలోకి ప్రవేశించి, వెండితెర పైని ధ్రువతారలుగా వెలుగొందారు. జానకిరామ్ గారు వారి స్వభావ వర్ణచిత్రాలను మూర్తికట్టించిన తీరు మనోహరంగా ఉంటుంది. ఆ వ్యక్తిత్వాలే గాక వ్యక్తులు కూడా మనకు పరిచయ మైనట్లుంటుంది. “సాగుతున్న యాత్ర”లో అప్పటికింకా జీవితాదర్శాలను వాస్తవానుభవాలుగా మలచుకొనే ప్రయత్నంలో ఉన్న యువరచయిత త్రిపురనేని గోపీచంద్ అనంతరకాలంలో తనను తాను ఆవిష్కరించుకొని, కాలధర్మానికి లొంగని ఉత్తమరచనలు చేశారు.  ఆయన రచనలనూ; అందులోనూ ‘అసమర్థుని జీవయాత్ర’ నవలనూ, ‘మమకారం’, ‘దేవుని జీవితం’ వంటి కథలనూ కళాశాలలో విద్యార్థులతో కలిసి పాఠ్యాంశాలుగా మరొక్కసారి చదివే అదృష్టం కలిగింది నాకు. ఆ ముద్రితప్రతులను చూచినపుడల్లా నాకు జానకిరామ్ గారే జ్ఞాపకానికి వస్తారు.

 

ఇంత విస్తారమైన ఆధునికయుగానికి ప్రథమపరిచాయక దార్శనికసమీక్షగా నాకు ఈ కృతి  చెప్పుకోదగినదిగా స్ఫుటగోచర మవుతున్నది.

 

 

రచనారీతిని పరికిస్తే జానకిరామ్ గారి సన్నివేశకథనశైలి చిత్రాలకు చిత్రిక పట్టిన కుంచె కదలికల వేగంతో కలాన్ని కదిలిస్తూ కదను తొక్కించిన నాటకీయ దృశ్యంగానూ, కళాత్మకంగానూ, భావశబలత నిండారి సహృదయ హృదయంగమంగానూ, అతి రమణీయంగానూ ఉంటుంది. ఆ రమణీయత ఆ వ్యక్తిలో నుంచి అభివ్యక్తిలోకి ప్రసరించింది. రవీంద్రుడు ఆయన అభిమానకవి. కాళిదాసూ, భవభూతీ ఆరాధ్యదేవతలు. “అద్వైతం సుఖదుఃఖయోః” అన్నది ఆదర్శం. భావ లాలిత్యానికి, శబలతకూ మనికిపట్టులై ఆయన పలుకులు ఒక్కొక్కసారి మరీ అందంగా ఉంటాయి. ప్రతి సన్నివేశానికీ శీర్షణ్యంగా ఒక ప్రాచీనకవి సుభాషితాన్ని, ఒక ఆధునిక కవి కవితాఖండికనూ అలంకరింపజేస్తారు. ఆ వాక్యశకలాలకు వ్యాఖ్యానంగా ఆయన సమకూర్చే పంక్తులలో తొణికిసలాడే సహృదయత, కావ్యానుభవం అపురూపమైనవి. తన సమకాలపు కవులలో కవిగా, నాయకులలో నేతగా, వక్తలలో వక్తగా, ఉత్తమవ్యక్తిగా జీవించి, అద్యతనయుగాన్ని స్వర్ణయుగంగా దర్శించిన ఆ దార్శనికుని వ్యక్తిత్వసౌరభం అన్నింటికన్నా మరింత అపురూపమైనది. ఎంతమాత్రమూ దాపరికం లేని నిర్మమతా, అహంభావపు లేమి – ప్రతి అనుభవాన్నీ పదిలపరచుకోవాలనే ఎనలేని కుతూహలం – జానకిరామ్ గారికి సంసారయానంలో వెలుగుబాటలు పరిచాయి.

 

నాకెందుకో పుస్తకాన్ని చదివి ముగించి, రచయితను తలపోసినప్పుడల్లా అందులోని ఎంతోమంది ఆయన సమకాలికులు పథికృత్తుల వలె కన్నుల ముందుకు వచ్చి నిలుస్తారు. ఆయన రూపులోనూ, చూపులోనూ అడవి బాపిరాజు గారి ప్రభావం అగుపిస్తుంది. ఇద్దరూ కవులే. ఇద్దరూ చిత్రకారులే. ఇద్దరూ పదశిల్పులే. కానీ బాపిరాజు గారి పద్యం అమరావతీ శిల్పాల తెలుగుదనాన్నీ, నాజూకునూ పుణికిపుచ్చుకొని, మధురమైన సంగీత భంగీతరంగాలలో తేలివస్తూ ఎంత అందంగానో ఉంటుంది. ఆయన వచనమూ అంతే. తుఫాను. జానకిరామ్ గారు బాపిరాజు కాలేకపోయారు. ఆయనలాగే ఆలూరి బైరాగి గారికి కూడా జీవితంలో ఆదర్శాల వెదుకులాట ఎక్కువ. కానీ అది అసంతృప్తిగా సాంద్రతను చెందకపోవటం వల్ల జానకిరామ్ గారు బైరాగి కాలేదు. కావాలనుకొనక కాలేకపోయారేమో తెలియదు. మైత్రిని మాత్రం మిగుల్చుకొన్నారు. కృష్ణశాస్త్రి గారింటిలో తఱచు బైరాగి గారిని కలుసుకొన్నప్పుడు ఆ మైత్రిలోని సురభిళ పరిమళస్వరూపం నాకు స్ఫుటగోచరం అయింది.

 

జానకిరామ్ గారు ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి గారి కుమారులు. ఆ రోజుల్లో అందరూ హాస్యానికి చెప్పుకొనే చమత్కారిక ఒకటుండేది – దేశంలో మూడే వైద్యవిధానాలని: 1. అల్లోపతీ, 2. హోమియోపతీ, 3. లక్ష్మీపతీ అట! భారతదేశమంతటా శాఖోపశాఖలుగా విస్తరించిన మహావటవృక్షం లక్ష్మీపతి గారు. సుగృహీతనామధేయులు. ప్రముఖాచార్యులు. బహుగ్రంథకర్త. తండ్రిగారి కనుసన్నలలో అన్నీ గ్రహించటమే గాని ఆయన సన్నిధిరూపమైన పెన్నిధికి జానకిరామ్ గారు అంతగా నోచుకోలేదనిపిస్తుంది.

 

జానకిరామ్ గారి తల్లి వారి నాలుగవయేటే పరమపదించారు. ఆమె జ్ఞాపకాలు కొన్ని లీలగా వినిపిస్తాయి. జీవితానుభవాలను, కలిమిలేములను, సుఖదుఃఖాలను యథాయోగ్యంగా స్వీకరించటం; దృశ్యమానజగత్తులో ఇంద్రీయాతీతమైన సౌందర్యదర్శనం ఆమె గర్భశుక్తిముక్తాఫలానికీ అలవడింది.

 

జానకిరామ్ గారి పినతల్లి ఆచంట రుక్మిణమ్మగారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధినేతల్లో ఒకరు. అవిభక్త మద్రాసు రాష్ట్రంలో ఆరోగ్యశాఖకు మంత్రిత్వం వహించారు. వారితో జానకిరామ్ గారికి అంతగా చనవు ఏర్పడినట్లు లేదు. కాని, ఆమె యుక్తసమయాలలో తనకు చేసిన సహాయాలను, మార్గదీపనను ఆయన కృతజ్ఞతాపూర్వకంగా సంస్మరించారు.

 

జానకిరామ్ గారు అడయార్ దివ్యజ్ఞానసమాజంలో జగమెఱిగిన అధ్యాపకుడు జేమ్స్ కజిన్స్ గారివద్ద చదువుకొన్నారు, ఇంగ్లీష్ లోని మెళుకువలన్నీ. జానకిరామ్ సన్నిహితసఖుడు ద్వారకానాథ తిలక్ కూడా ఈ కజిన్స్ గారి శిష్యులే.

 

విజ్ఞానశాస్త్రాధ్యయన నేపథ్యం వల్ల జానకిరామ్ గారు కొన్నాళ్ళు బెంగళూర్లో శాస్త్రవేత్తగా పనిచేసి, ఆ పని వదలి జీవితభీమా కంపెనీలో చేరారు. “భీమా” అనగానే తెలుగువారిలో “భీమా డిండిమ” చెరకువాడ నరసింహం పంతులు గారినీ, జానకిరామ్ గారినీ, మాధవరావు గారినీ తెలియనివారుండరనేవారట. ఇన్స్యూరెన్స్ ఏజెంటుగా ఉన్నా ఉద్యోగం ఒకవైపూ, హృద్యోగం మరొకవైపూ తప్పలేదు. ఎప్పుడూ కవులూ గాయకులూ రచయితలతోనే సంచారం. సంగీత సాహిత్య కలశరత్నాకరాన్ని చిలికి వెన్నతీయడం; మీగడతఱకలను తీసి నలుగురికీ పంచిపెట్టడం.

 

“సాగుతున్న యాత్ర”లో జానకిరామ్ గారి ఆకాశవాణి ఉద్యోగం తీరుతెన్నులు ఆకర్షణీయంగా భాసిస్తాయి. వృత్తితో ప్రవృత్తి మమేకమై, ఉద్యోగంతో హృద్యోగం సమ్మిళితమై ఆయన గుండెల నిండుగా ఆనందాన్ని నింపుకొన్నారు. భుజకీర్తులను తొడుక్కొని, భేరీభాంకారాలతో ఊరేగింపులకు వెళ్ళే స్వభావం లేనందువల్ల ఆయన చెప్పకపోయినా ఆ ఆనందాన్ని తనవద్దకు వచ్చిన నలుగురికీ నిండు మనసుతో మండుగా పంచిపెట్టేవారని ఆ సన్నివేశాలు మనకు చెప్పకనే చెబుతాయి. అకాశవాణికి వచ్చిన కవులు, కళాకారులతో వివిధానుభవాలను ఆయన చెప్పిన తీరుతీయాలు హృద్యంగా ఉంటాయి. అందులోనూ ఋష్యేంద్రమణి, కన్నాంబ, ఎం. సుబ్బులక్ష్మి గారల రికార్డింగు అనుభవాలు, పర్వీన్ సుల్తానా గారి తొలి ప్రసారవిశేషాలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి దైవదత్తమైన గానకళావిశ్వరూపం తొలి రోజుల్లో ఆకాశవాణి మూలాన సువ్యక్తమైన సంవిధానం; వివిధ కవులు, రచయితలు, పాత్రికేయుల స్వరూప స్వభావాల అవగాహన మనకు ఏ మాత్రం లేకపోయినా “సాగుతున్న యాత్ర” గ్రంథాన్ని చదువుతున్నంతసేపూ మనకొక అపురూపమైన గంధర్వలోకం, ఒక కళాస్వర్గం, ఒక సౌందర్యసీమ, అతీతకాలపు తెఱ వెనుక దృశ్యాదృశ్యంగా కనుపించే ఒక తేజోమయ దీపకళిక కన్నులముందు వింత వెలుగులతో వచ్చి నిలుస్తాయి.

 

సౌందర్యారాధకులు కావడాన జానకిరామ్ గారికి కొంచెం రసదృష్టీ ఎక్కువే అనుకోవాలి. అంతే కదా, మఱి! ఒకటి రెండుసార్లు చిక్కులూ తప్పలేదు.  భార్య శారదాదేవి గారు స్వయంవ్యక్తిత్వం కలిగిన విదుషీమణి. “పగడాలు”, “ఒకనాటి అతిథి”, “మరీచిక”, “పారిపోయిన చిలక”, “వానజల్లు” మొదలైన మంచి కథాసంపుటాలను ప్రచురించారు. మంచి స్వతంత్రవ్యక్తిత్వం కలిగిన సహృదయిని. దాంపత్యంలో పొడచూపిన పొరపొచ్చాలను, తమ సంకోచాన్ని జానకిరామ్ గారు నిస్సంకోచంగా వెల్లడించారు. సౌందర్యానికీ సత్యాన్వేషణకూ అద్వైతమే కదా.

 

ఆ రోజుల్లో ప్రఖ్యాత సంపాదకులు ఖాసా సుబ్బారావు గారు ‘సైడ్ లైట్స్’ అనే పేరిట దైనందిన సంఘటితాలను సున్నితంగా విమర్శిస్తూ పదునైన హాస్యాన్ని గుప్పించేవారు ఒక ఆంగ్ల దినపత్రికలో. ఆయన ఒకసారి ఇలా రాశారట:

 

“ఈ ఊళ్ళో ఒక అందమైన కారుంది. దానికి అంతకన్నా అందమైన డ్రైవరు. కారు బీచి ఒడ్డున,

2 thoughts on “నాకు నచ్చిన పుస్తకం

  1. nenu ee pusthakanni-chala patha copy- 1985 lo delhi lo murali intiki vellinappudu yana daggara theesu koni okaroju;o chadivi ichchanu..all india radio lo udyogm chesthunnavaru thappaka chadavalsina pusthakam. aarojullo all india radio lo udyogamante antha gowravamga adrustmga bhavinchevaru.
    andulo achanta janakiram garu bhavakulu..sowndarya pipasi..manavathavadi…ika aa udyoganiki vanne thechhchru..madras ,thiruchi modalaina kendrala lo chithasudhi tho panichesaru..antha adi adarsavanthamga panichesevaru all india radio lokani doordarshan lo unnara?annitikante ayana cheppina oka vakyam eppudu naa chevullomoguthunnadi:A.I.R LO PANICHESEVARU BAYATA EKKADAINA OKA VYAKTHINI KALISTHE AYANA VALLA RADIO KU, RADIO SROTHALAKU EMAINA UPAYOGAPADUTHARA? ANI ALOCHINCHALI

  2. aaptha mitrulu sri elchuri muralidhara rao gaaari rachana -” naaku nachhina pustakam”- lo sri achanta janikiram gaaari “saaguthunna yaatra” nu sameekshinchina teeru hrudyam gaa vundi.indulo konni vishayaaalanu- aa madhya vaarihto phone lo sambhaashinchinappudu muralidhara rao garu natho prasthaavinchaaru. ee vyaasaanni chduvuthoonte- maroka maaru aa jnaapakaalu manasulo musiraayi. naaku ade anipusthundi. vyakthula aatama kadhalanu manam amithamgaa isthapadathaamu.anduku pradhaana kaaranamu , mana nija jeevithamlo manaku tatasthapadina sanghatanalu inchuminchu konni andulo chotu chesukovade .mana katha nu manam vraasi chaduvukunna anubhoothi manaku kaluguthundi. maa muralidhara rao gaariki manasaaraa naa abhinandanalanu teliyajesthunnaanu..-voleti venkata subbarao , vernon hills IL-USA.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *