June 24, 2024

రంగాజమ్మ…

రచన : జి.ఎస్.లక్ష్మి

రంజిత అక్కయ్య రంగాజమ్మ కొడుకు పెళ్ళి. పెళ్ళంటే మామూలు పెళ్ళి కాదు. ఆ పెళ్ళికోసం బంధువులంతా ఎప్పట్నించో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే పెళ్ళికొడుకు మంచి చదువు, గొప్ప జీతంతో అమెరికాలో డాలర్ల మీద డాలర్లు సంపాదించేస్తున్నాడు.
రంగాజమ్మ కొడుకు ఇంగితఙ్ఞానం ఉన్నవాడు. ఎవరికేం కావాలో అతనికి బాగా తెలుసు. అందులోనూ తల్లి గురించి ఇంకా బాగా తెలుసు. రంగాజమ్మకి డబ్బన్నా, డబ్బున్నవాళ్ళన్నా మహా ఇష్టం. ఆ డబ్బుని రకరకాలుగా ప్రదర్శించడంలో ఆవిడకి గొప్ప నేర్పుంది.
అందుకే తల్లికి ప్రతి నెలా మర్చిపోకుండా డబ్బు పంపుతాడు. తల్లి ఫోన్ చేసినప్పుడల్లా అడుగుతాడు, “అమ్మా, డబ్బు సరిపోతోందా? నువ్వు దేనికీ కష్టపడకమ్మా. డబ్బు పడేసి నలుగురు మనుషుల్ని పెట్టుకో..” అంటాడు.
కొడుక్కి తనమీదున్న ప్రేమకి పొంగిపోతుంది రంగాజమ్మ. కొడుకు పంపిన డబ్బుతో దర్జాగా బతుకుతూ, ఆ దర్జా అంతా తన కొడుకు ఇచ్చిందే నని అందరితో గర్వంగా చెప్పుకుంటుంది కూడానూ.
సంపాదనలో మాత్రవే పడిపోకుండా కాస్త ప్రయోజకుడు కూడా అవడం వల్ల అమెరికాలోనే ఉన్న ఓ మాంచి బిజినెస్ ఫ్యామిలీలోని పిల్లని ప్రేమించి పడేసేడు. వాళ్ళు గుజరాతీలు. అప్పటికి క్రితం తరం వాళ్ళెవరో అమెరికా ఉద్యోగం కోసం వెళ్ళి, అక్కడ నెమ్మదిగా వ్యాపారం లోకి దిగి, ఇండియాలో మాత్రమే దొరికేవీ, అక్కడ దొరకనివీ అమెరికాలో అమ్మడం మొదలుపెట్టేరు. అమెరికాలో ఇండియన్లు అభివృధ్ధి చెందినట్టుగానే వాళ్ళ వ్యాపారం కూడా వృధ్ధి చెంది, ఆ ఒక్క కుటుంబమే కాకుండా వాళ్ళ బంధువులందరూ అక్కడికి చేరిపోయి, వ్యాపారాలన్నీ మూడుపూవులూ, ఆరుకాయలుగా విస్తరించేరు.
అదిగో… ఆ కుటుంబం లోని అమ్మాయినే రంగాజమ్మ కొడుకు రవీంద్ర ప్రేమించేడు.
ఆడపెళ్ళివారి చుట్టాలందరూ అమెరికాలోనే ఉన్నాకూడా రవీంద్ర బలగం చాలామంది ఇండియాలోనే ఉండడం వల్ల, అందరూ అమెరికా పెళ్ళికి రావడం కష్టం కనక పెళ్ళి ఇండియాలోనే.. అందులోనూ హైద్రాబాదులోనే పెళ్ళి చెయ్యాలని పట్టు పట్టింది రంగాజమ్మ.
కొడుకు పెళ్ళిలో అత్తగారి హోదా చూపించుకోవాలని ఆవిడకి కొడుకు పుట్టినప్పట్నించీ ఉన్న ఆశే. అందుకే కొడుకు ప్రేమించింది వేరే ప్రాంతం వాళ్ళనయినా వాళ్ళకి బోల్డు డబ్బుందనే ఈ సంబంధానికి అంగీకారం తెలిపింది. రంగాజమ్మ కుటుంబంలో పెళ్ళి జరిగేటప్పుడు జరిగే సాంప్రదాయాలూ, ఆనవాయితీలూ అన్నీ వాళ్ళకి చెప్పింది.
వియ్యపురాలి లాంఛనాలూ, ఒక్కగానొక్క ఆడపడుచు లాంచనాలూ కావలసినంత ముందుగానే తీసుకుంది. పెళ్ళిలో ప్రతి చిన్న తంతూ జరిపించాలని పురోహితుణ్ణి సంప్రదించి అన్నీ ఎంత గొప్పగా జరిపించాలో లిస్ట్ రాసి మరీ ఇచ్చింది.
తను కూర్చున్నప్పుడల్లా వెండితొడుగు ఉన్న పీట వెయ్యాలనీ, నిల్చున్నప్పుడు వెండిగొడుగు పట్టాలన్నంత లెవెల్లో ఉందా లిస్ట్.
రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదవా అన్నట్టు డాలర్ లలో వ్యాపారం చేసుకునేవాళ్ళకి ఇండియాలో పెళ్ళి చెయ్యడానికేం. విత్తం కొద్దీ వైభోగం అన్నట్టు వీళ్ళు అడిగినదానికన్న ఎక్కువగానే చెయ్యడానికి నిర్ణయించుకున్నారు వాళ్ళు. పాపం వాళ్ళు మగపెళ్ళివారిని ఒక్కటే అభ్యర్ధించేరు. అదేవిటంటే వీళ్ళ సంప్రదాయాలతో పాటు వాళ్ల సంప్రదాయాలు కూడా చేసుకుందుకు ఒప్పుకోమన్నారు. “అంటే ఏవిటంది” రంగాజమ్మ.
“ఏం లేదండీ. మీలాగే మేము కూడా సంప్రదాయాన్ని గౌరవిస్తాము. మావి కూడా చిన్న చిన్న తంతులుంటాయి. మీలాగే పెద్దవాళ్ళకి బట్టలు పెట్టడమూ, మా దేవునికి పూజా..”అంటూ ఆపేసేరు.
“వాటికేం భాగ్యం? అలాగే చేసుకోండి..” అంది రంగాజమ్మ.
“సంప్రదాయంతో పాటు ఈ రోజుల్లో పిల్లలు వీడియో కోసం కొత్త కొత్తగా సినిమాల్లో చూపించేటట్టు కూడా్ చేద్దామంటున్నారు. అందుకని అవన్నీ మాకు తెలీవు కనక ఇక్కడ ఎవరినైనా ఈవెంట్ మేనేజ్ మెంట్ వాళ్ళకి మొత్తం అప్పజెప్పేద్దామనుకుంటున్నాం. “అన్నారు వాళ్ళు.
అంతకన్నానా అంది రంగాజమ్మ. హైద్రాబాద్ సిటీలో పెద్దపేరున్న ఈవెంట్ మేనేజర్ ని కాంటాక్ట్ చేసేరు. ఇంకేముంది? అంతా అంగరంగ వైభోగమే. డబ్బు పెట్టేది డాలర్లలో. డిమేండ్ చేసేది మగపెళ్ళివారు. వీళ్ళ డిమేండ్ లకి తగ్గట్టూ, ఆడపెళ్ళివారి స్తోమతకు తగ్గట్టూ, ఈ రోజుల్లో వీడియో కోసం పిల్లల సరదాకి తగ్గట్టూ అన్ని ఈవెంట్సూ కలిపేసి, ఒక మూడురోజుల పాటు పట్టే ప్రోగ్రామ్ తయారుచేసేరు వాళ్ళు.
అదంతా ముందుగానె ఇరువైపులవారికీ, ఒక పెద్ద పుస్తకమంత ఉన్న షెడ్యూల్ ని పంపించేసేరు. మూడురోజుల పెళ్ళి కనకా, రామోజీ ఫిల్మ్ సిటీలో ఫంక్షన్ కనకా బంధువులందర్నీ సెలవులు పెట్టుకుని తప్పకుండా రమ్మని నెల ముందుగానే చెప్పింది రంగాజమ్మ. ముఖ్యంగా చెల్లెలు రంజితని ఏవైనా మర్చిపోతే గుర్తు చేసేందుకు రెండువారాల ముందుగా వచ్చి తన పక్కనుండమంది..
ఆడపెళ్ళివారు నియమించుకున్న ఈవెంట్ మేనేజ్ మెంట్ వారు అరేంజ్ చేసిన పొడుగుపాటి కార్లు రెండూ, ఒక స్వరాజ్ మజ్దా వేనులో అనుకున్న సమయానికి మగపెళ్ళివారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఫంక్షన్ హాలు చేరుకున్నారు. వీరు వాహనాలు దిగడం ఆలస్యం అందరి నెత్తిమీదా సన్నటి చిరుజల్లుగా పన్నీరు చిలకరించబడింది. మంగళవాద్యాలు వీనులవిందయేయి. ఎంతో శ్రధ్ధగా శిక్షణ పొందిన పదిమంది యువతీయువకులు సాంప్రదాయబధ్ధంగా నృత్యం చేస్తూ మగపెళ్ళివారి మీద పూలరేకులు చల్లేరు.
అందరికీ అంతటి ఆహ్లాదకర స్వాగతానికి మనసులు సంతోషంతో నిండిపోయేయి. అందులో కొందరికి రంగాజమ్మ అదృష్టం మీద అసూయ కూడా కలిగింది. ముఖ్యంగా పక్కనే ఉన్న చెల్లెలు రంజితకి. రంజిత కొడుకు పదేళ్ళవాడు. ఈ ఆహ్వానం చూసిన వెంటనే రంజిత మనసులో రేప్పొద్దున్న తన కొడుకు ఏ జాతి అమ్మాయిని చేసుకున్నా ఫరవాలేదు కాని వాళ్లకి డబ్బు మటుకు దండిగా ఉండాలని అనుకుంది.
మరింక విడిదిలో దిగినప్పటినుంచి వీళ్ళకి ఎంతెంత మర్యాదలో. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులున్నాయో అన్ని రంగుల చీరలూ రంగాజమ్మకి పెట్టేరు.
ఏ అకేషన్ కి ఏ రంగు వెసుకోవాలో అక్కడి ఫేషన్ డిజైనర్లు ముందే ప్లాన్ చేసి, రెడీ చేసి ఉంచేసేరు.
ఆ సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ బిల్డింగ్ లో దిగిన అయిదు నిమిషాల లోపే సూటేసుకున్న ఒకాయన యూనిఫామ్ లో ఉన్న నలుగురు అమ్మాయిల్నీ, అబ్బాయిల్నీ వెంటబెట్టుకొచ్చేడు. ఒక పదిపేజీల బుక్ లెట్ అందరికీ పంచేడు. అందులో ఏరోజు ఏ ప్రోగ్రామ్ ఉందో, దానికి రిహార్సల్స్ బ్రెక్ ఫాస్ట్ అయాక ఏ హాల్లో ఉంటాయో, లంచ్ ఎక్కడ, ఏ ప్రాంతంది అరేంజ్ చేసేరో, లంచ్ అయేక డ్రెస్ రిహార్సల్స్ ఏ హాల్లో ఉంటాయో, స్నాక్స్ అయాక అసలు ప్రోగ్రామ్ ఎక్కడ మొదలౌతుందో, ఈ వివరాలన్నీ ప్రతి దానికీ టైమింగ్స్ తో సహా ఉన్నాయి.
అసలు ప్రోగ్రామ్ అప్పుడే ఎ టు జెడ్ వీడియో తీస్తారనీ, నెలల పిల్లల దగ్గర్నుంచీ ఆ గ్రూప్ లో ఉన్న డెభ్భైయేళ్ళ వయసువారి వరకూ అందులో చోటు కల్పించేమనీ మొత్తం అందరికీ వివరించి చెప్పేరు.
ఆడపెళ్ళివారు ముందుగానే చెప్పినవన్నీ గుర్తు పెట్టుకుని ఆ ఈవెంట్ మేనేజ్ మెంట్ వాళ్ళు చాలా కళాత్మకంగా జరిపించేరు.
కాని రంగాజమ్మే పెళ్ళిలో జరిగే అన్ని కార్యక్రమాలూ ముందే చెప్పినా కూడా తెచ్చినవి బాగులేదనీ, రంగు బాగులేవనీ, సైజ్ సరిపోలేదనీ ఏవేవో వంకలు మొదలుపెట్టింది.
అన్నింటికన్న విడ్డూరం అప్పటిదాకా ఎవ్వరూ వినని ఆడపడుచు అలకపాన్పు అని కొత్తదొకటి మొదలెట్టింది. రంగాజమ్మబంధువు లందరూ ముక్కున వేలేసుకున్నారు. పెళ్ళిలో ఎక్కడైనా పెళ్ళికొడుకు అలకపాన్పు ఎక్కడం వుంటుంది కాని ఈ ఆడపడుచు అలకపాన్పు ఏమిటో వాళ్లకి అర్ధం కాలేదు. పాపం ఆ ఆడపడుచు తల్లి మాట కాదనలేక విడిదిలో కూర్చుండిపోయింది. పెళ్ళి టైమ్ కి ఆడపడుచు రాదు. ఎందుకంటే అలిగిందన్నారు. ఏం కావాలంటే డైమండ్ నెక్లెస్..
రంజిత అక్కగారు రంగాజమ్మని పక్కకి తీసికెళ్ళి చెప్పింది. “ఒసే అక్కా, ఇస్తున్నారు కదా అని ఇలా ఉన్నవీ లేనివీ చెప్పి తీసుకోడం బాగుండదే. మనని మనం చిన్నబుచ్చుకున్నట్టుంటుంది.” అని.
రంగాజమ్మ రంజిత మాటల్ని కొట్టిపడేసింది. “హొసి వెర్రిమొహవా.. ఈ రెండురోజులేనే మనం అడిగినా వాళ్ళు ఇచ్చినానూ. తర్వాత వాళ్ళెలాగూ అమెరికా పోతారు. ఇంక ఓ వియ్యాలవారనీ, పండగనీ పేరంటం అనీ ముద్దుముచ్చట్లు ఏవీ ఉండవు. అందుకే ఇప్పుడే అన్నీ పుచ్చేసుకోవాలి. ఈ టైమ్ దాటిపోతే ఇంక వాళ్ళు మనకి దొరకరు.” అంటూ బ్రహ్మ రహస్యంలా చెప్పి కావల్సినవన్నీ కావల్సినదానికన్న ఎక్కువగానే జరిపించుకుంది.
పెళ్ళైన వారం లోపలే ఎవరింటికి వాళ్ళు జేరుకున్నారు. ఈ వారంరోజుల్లోనూ కోడలు రంగాజమ్మ ఇంట్లో వున్నది ఒక్కపూట మాత్రమే. కోడలి పేరు ఈషా అని ఒక్కటి తప్ప ఇంక కోడలి గురించి రంగాజమ్మకి ఏమీ తెలీలేదు.
మూడురోజుల పెళ్ళికీ కలిపి పదమూడు పెద్ద డిజిటల్ ఆల్బములూ, అయిదు డివీడీలు ఇచ్చేరు ఈవెంట్ మేనేజ్ మెంట్ వాళ్ళు రంగాజమ్మకి. ఇంక ఎవరైనా వాళ్ళింటికి వెళ్ళడం పాపం ఆ ఆల్బమ్ లకి, డివీడీలకి బలైపోయేవారు వాళ్ళు.
పెళ్ళైన మొదటి సంవత్సరమంతా ఆ వీడియోలు చూసుకుంటూ గడిపేసింది రంగాజమ్మ. రెండో సంవత్సరం ఫొటోలు చూసుకుంది. మూడో సంవత్సరం నుంచి నెలకోసారి చూసుకునేది. నాలుగో సంవత్సరం వచ్చేసరికి వాటిని బీరువాలో పెట్టేసి తాళం పెట్టేసింది.
దగ్గరి చుట్టాలకే కాకుండా దూరపుబంధువులకి కూడా అవన్నీ చూపించుకోడం అయిపోయింది. స్నేహితులు సరే.. ఎప్పుడో అయిపోయేరు. ఇంక అప్పట్నించీ కొడుకు మీదకి దృష్టి పోయింది రంగాజమ్మకి.
కొడుకుని మించిపోయి అసలు కంటే వడ్డీ ముద్దన్నట్టు మనవడు కూడా పుట్టి అప్పటికే యేడాది అయింది. పుట్టినప్పట్నుంచీ వాడివి ఎన్ని ఫొటోలు, వీడియోలూ చూసినా అసలు పిల్లాణ్ణి హత్తుకున్నట్టుండదుకదా. అందుకే ఈ మధ్య కొడుకుని మరీ మరీ అడుగుతోంది కోడలినీ, మనవడినీ తీసుకొచ్చి చూపించమని.
“ఈ యేడు కుదర్దమ్మా… జాబ్ వదిలేసి స్వంతంగా కంపెనీ పెట్టుకున్నాను. అస్సలు ఖాళీ లేదు. “అంటూ ఇంకాస్త ఎక్కువ డాలర్లు పంపడం మొదలెట్టేడు.
తర్వాతి సంవత్సరం మళ్ళీ అడిగింది. “ఈ యేడైనా రారా అబ్బాయ్..”అంటూ.
“ఈ యేడు కుదర్దమ్మా.. మా అత్తవారి వైపు బంధువులందరం కలిసి యూరప్ టూర్ పెట్టుకున్నాం.. ”  అంటూ అతను తల్లికి పంపించే డబ్బు మరికాస్త పెంచేడు.
ఆ తర్వాతి సంవత్సరం బతిమాలింది.
“అస్సలవదమ్మా. మేం అక్కడి కొచ్చినా వుండలేం. అందులోనూ నీ మనవడు ఆ పొల్యూషన్ కీ, సౌండ్ కీ అస్సలు తట్టుకోలేడు. అన్నట్టు నీకు పంపే డబ్బు సరిపోతోందా..?ఈసారి నుంచి ఇంకొంచెం ఎక్కువే పంపుతాలే. నా బిజినెస్ బాగా నడుస్తోందమ్మా..” అంటూ ఫోన్ పెట్టేసేడా కొడుకు.
రంగాజమ్మ జుట్టు పీక్కుంది. ఆ బేంక్ పుస్తకాలన్నీ చించి పడెయ్యాలన్నంత ఉక్రోషం వచ్చేసింది.
అప్పటికి కాని ఆమెకి చెల్లెలు రంజిత “అతి సర్వత్ర వర్జ్యయేత్..” అన్నమాట అర్ధంకాలేదు.

———————————————————————————————–

3 thoughts on “రంగాజమ్మ…

  1. అచ్చికచ్చిక బాగయ్యింది :):) మనుషుల బదులు నోట్లని ప్రేమిస్తే ఇలానే ఉంటుంది అని చాలా చక్కగా చెప్పారండీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *