April 25, 2024

అంచనా వెయ్యకు

రచన : కావలి కోదండరావు

 

ఒక గొంతే అరిచిందని చులకన చేయకు.

కాసేపట్లో మరో పది గొంతులు శృతికలిపితే

ఆ కోరస్ నింగినున్న చుక్కను తాకుతుంది.

చీమలైనా క్రమశిక్షణతో నడిస్తే

బండరాళ్లే అరిగిపోతాయి.

 

ఒకడే నడుస్తున్నాడని హేళన చేయకు.

ఇంకో నలుగురు ఆ నడకకు జతకడితే,

కారడవైనా దారి విడవక తప్పదు.

 

ఇప్పటి ఈ నదులన్నిఒకప్పుడు

ఏ కొండల్లోనో తప్పటడుగులు వేసినవే.

చినుకేనని చూస్తుండగానే,

అది వర్షోదయానికి తొలిపొద్దే అవుతుంది.

దానికి కాలం కలిసొస్తే ఉప్పెన అయి ముంచేస్తుంది.

వేరుగా పడివుంటే ఇటుకలు ఒట్టి మట్టిబెడ్డలే

కలిసాయంటే మేడలై,మిద్దెలై అవి విభ్రమణని కల్గిస్తాయి.

 

చిటికెలో తయారవలేదు ఏ చరిత్ర

అది ఎన్నో సంఘర్షణల సమాహారం,

అది మరెన్నో త్యాగాల సమూహతీరం.

అష్టావధాని అయినా ఆరంభం లో

అ,ఆలు నేర్చినోడే,ఓనామాలు వల్లించినవాడే

 

ఆదిలోనే అంచనా వెయ్యకు,

ఎప్పుడూ ఏ మార్పునీ.

కాలం అనే మహాకావ్యమే,

వివరించగలదు ఆ తీర్పుని.

4 thoughts on “అంచనా వెయ్యకు

  1. ee sanchikalo.. 14th item pai click chesthe amma bhaasahlo vaadisthe gelupu khayam ane seershika kinda vere kavitha vastondi daya chesi gamaninchagalaru ..veelaithe saricheyandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *