April 19, 2024

జీవుడే దేవుడు

రచన: వసంతరావు

 

దేవుడో దేవుడంచు దేవులాడనేలరా

నిన్ను నీవు తెలుసుకుంటె నీవే దైవంబురా

 

మూఢ నమ్మకాల జిక్కి వ్యసనాలకు బానిసవై

నిరక్షరాస్యత కోరలలో నిర్జీవిగ మారినావు

 

కోర్కెలీడేరునంచు ముడుపులెన్నొ గట్టినావు

లెక్కలేని దేవుళ్ళకు మొక్కులెన్నొ మొక్కినావు

 

నిజతత్త్వం గానలేక మొక్కులెన్నొ మొక్కినావు

కాలసర్ప కోరలలో బందీగా జిక్కినావు

 

గొర్రెదాటు ఆచారాలు గొప్పగ పాటించి నీవు

అజ్ఞానపు మంటలలో మిడుతవోలె మాడినావు

 

మారెమ్మల మైసమ్మల మంత్రాలలొ జిక్కి నీవు

చేతబడులంటు నీవు చాదస్తం బెంచినావు

 

గుడులు గోపురాలంటూ వీధులన్ని దిరిగినావు

గుండెలోని దైవాన్ని గాంచలేకపొయి నీవు

 

తీర్థ యాత్రలెన్నొజేసి తిప్పలబడి పోయినావు

పుష్కర స్నానంబుజేసి పుణ్యమాశించినావు

 

గుడిలోని ప్రతిమనుగని చెంపలు వాయించినావు

చెయ్యని తప్పుకు నీవు శిక్ష ననుభవించినావు

 

కర్మమర్మం దెలియక నువు కంప్యూటర్ జాతకంతొ

భవిష్యత్తు నిర్ణయించి భంగపడి పోయినావు

 

 

నీవే దైవంబన్న నిజతత్త్వం దెలియలేక

కస్తూరి మృగంవోలె కారడవుల దిరిగినావు

 

జీవభ్రమలొ జిక్కి నీవు దైవత్వం మరచినావు

ద్వైత భావంబుతోడ దేహంబని భ్రమసినావు

 

జగన్నాటకంబులోన ప్రేక్షకునిగ  మిగిలిపోక

చక్కనైన పాత్ర తోడ శాశ్వతంగ నిలిచిపో

 

అజ్ఞానం తరిమికొట్టి ఆత్మసిద్ది పొంది నీవు

ఆనందపు టనుభూతుల నిత్యం మది నింపుకో

 

దీనత్వం వీడి నీవు దైవత్వం వైపు నడచి

నీలొగల దివ్యత్వం నిండుగ ప్రకటించుకో!

 

                                                                                                                                                                                                          

 

 

6 thoughts on “జీవుడే దేవుడు

  1. “దేహమే దేవాలయం జీవుడే దేవుడు” అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శృతి “జ్ఞాన హీనః పశుభిస్సమానః” అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్ధం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన 4 మహావాక్యములు అంటే 4 వేదాల సారము (1) “అహం బ్రహ్మాస్మి”=నేనే పరబ్రహ్మమును (2) “అయమాత్మాబ్రహ్మ”=నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు(3) “ప్రజ్ఞానం బ్రహ్మ”= విశేషణమైన జ్ఞానమేదికలదో అదియే బ్రహ్మ (4) “తత్వమసి”=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు.

  2. దేహమే దేవాలయం జీవుడే దేవుడు” అనే వేద ప్రమాణానుసారం, సృష్టిలో ఉండే ప్రతి జీవి దేహం ఒక దేవాలయమే. ప్రతి జీవి కూడా పరబ్రహ్మమే. అయితే ఇక్కడ మానవులు మినహా ఇతర ప్రాణులకు ఈ విషయం అనుభవంలోకి రాలేదు ఎందుకంటే వాటికి పుట్టుకతోనే విచక్షణాజ్ఞానం లేకుండా పుడతాయి, అదే బలహీనతను ఆసరా చేసుకొని మానవుడు ఇతర జీవుల పట్ల తనకున్న విచక్షణా జ్ఞాన్ని ఉపయోగించుకొని తన స్వార్ధం కోసం తన వశంలోకి తెచ్చుకొని ప్రయోజనాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శృతి “జ్ఞాన హీనః పశుభిస్సమానః” అంటే జ్ఞానం లేని ప్రతి వ్యక్తి పశువుతో సమానమని అర్ధం. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటని విచారిస్తే చతుర్వేదముల నుండి గ్రహించబడిన 4 మహావాక్యములు అంటే 4 వేదాల సారము (1) “అహం బ్రహ్మాస్మి”=నేనే పరబ్రహ్మమును (2) “అయమాత్మాబ్రహ్మ”=నా ఆత్మయే బ్రహ్మ అంటే దేవుడు(3) “ప్రజ్ఞానం బ్రహ్మ”= విశేషణమైన జ్ఞానమేదికలదో అదియే బ్రహ్మ (4) “తత్వమసి”=ఏదైతే దేవుడు పరబ్రహ్మము ఉన్నదో అది నీవే అయి ఉన్నావు.
    పై నాలుగు మహావాక్యములు నీవే భగవంతుడవు అనే నగ్న సత్యాన్ని మన ముందుంచినా “సముద్రము తలాపున ఉంచుకొని , చేప నీళ్ళకు ఏడ్చినట్లుగా” మనం జ్ఞాన స్వరూపులం, అఖండ సచ్చిదానంద స్వరూపులం అయి ఉండి కూడా నాకు ‘సుఖం ‘ లేదు ‘శాంతి ‘ లేదు అని బాధపడుతూ ఆ సుఖం, శాంతిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మనం పొందే సుఖం పరావర్తన సుఖం అంటే మన నుండి ఉద్భవించిన సుఖం అవే జ్ఞానం

  3. వసిష్టాది బ్రహ్మరుషులు ఎవనియొక్క వేదసారమైనట్టి జీవేబ్రహ్మైక్య ప్రతిపాదకమగు (ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్త్వమసి, ఆయనాత్మ బ్రహ్మ అను) నాలుగు మహావాక్యములచే చతురులై మహాత్పదమును చెందిరో అట్టి పద్మజుడగు చతుర్ముఖబ్రహ్మను భజించుచున్నాను.

  4. దేహమే దేవాలయం; ఆత్మయే దైవం. (వేదాంతుల వాక్కు)
    దేహమే దేవాలయం; జీవుడే దేవుడు. (మహర్షుల మాట)
    ఈ దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం; దీని లోపల ఆత్మయే దైవం

    B.Rathnam 9972876980

  5. శ్రీరామకృష్ణ పరమహంస శిష్యుని శ్రేయస్సు కోరడం ద్వారా గురువు పాత్ర పరిపూర్ణమవుతోంది
    శ్రీ రామకృష్ణ పరమహంస ఆత్మనాలోను, నీలోను, మనందరిలోను, ఈ చరాచర జీవకోటిలో ఉన్నది
    శ్రీ రామకృష్ణ పరమహంస సర్వవ్యాపకుడైన ఆత్మ నీయందును, నాయందును కూడా ఉన్నాది
    శ్రీ రామకృష్ణ పరమహంస గురువు గొప్పవాడైతే శిష్యునికి సిద్ధి కలుగు తుంది శిష్యుడు గొప్ప వాడైతే గురువుకు ప్రసిద్ధి కలుగు తుంది ఒక గొప్ప శిష్యుని చూసి అసూయ పడ్డ గురువు ఆ గురుత్వానికే అనర్హుడు.
    మనలో కొంత మంది వివిధ పేర్లతో ఉన్న దేవుళ్లను పూజిస్తారు. కొంత మంది రాముని, మరి కొంత మంది కృష్ణుని, అల్లా, క్రీస్తు, దేవీలను పూజిస్తారు. అయితే కంటికి కన్పించే దేవుళ్లలో గురువు కూడా ఒకరని తెలుసుకోవాలి. మనుషులు ఒకచోటినుంచి మరొకచోటికి వలసపోవడం ఆదిమానవులకు తెలుసు కనక ఎన్నో ఏళ్ళుగా “అలవాటుపడ్డ” శరీరాన్ని వదిలి వెళ్ళవలసిన అవసరం ఆత్మకు కూడా ఏదో ఒకనాడు కలుగుతుందనేది గురువు కి సహజంగానే అనిపించి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *