April 25, 2024

భారత జాతీయ సైన్యం (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) ముస్లిం పోరాట యోధులు

రచన:  సయ్యద్ నశీర్ అహమద్.  

                                                                                                                                                          

పరాయి పాలకులను మాతృదేశం నుండి తరిమికొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్య్రపోరాట చరిత్ర చివరిథలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైన్యం) సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుండి అంతం వరకు ముస్లిం పోరాట యోధులు చాలా ప్రధాన భాగస్వామ్యం వహించారు.

1941లో జనవరిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆంగ్ల ప్రభుత్వ గూఢాచారి వ్యవస్థ కళ్ళుగప్పి మహమ్మద్‌ జియావుద్దీన్‌ అను మారు పేరుతో కలకత్తా నుండి తప్పుకుని సాగించిన ‘గ్రేట్‌ ఎస్కేప్‌’ ఏర్పాట్లను మియా అక్బర్‌ షా నిర్వహించగా, ఆ తరువాతి ప్రాణాంతక కాబూల్‌ ప్రయాణంలో అక్బర్‌షా ఏర్పాటు చేసిన సాయుధ పఠాన్‌ యువకులు నేతాజికి అంగరక్షకులుగా నడిచారు. ఆఫ్ఘాన్‌ గుండా పఠాన్‌ వేషంలో నేతాజీ ప్రయాణం సాగించాల్సి వచ్చినప్పుడు, ఆంగ్ల గూఢచారులు, వారి తొత్తులు ఏమాత్రం గుర్తు పట్టకుండా ఆబాద్‌ ఖాన్‌ నేతాజీకి ఆఫ్ఘాన్‌ పఠాన్‌ వ్యవహారసరళి,ఆచార సాంప్రదాయాలలో వారం రోజుల పాటు తన ఇంట రహాస్యంగా ప్రత్యేక శిక్షణ గరిపి ముందుకు పంపారు. 1941 మార్చి 27న  నేతాజీ బెర్లిన్‌ చేరేంతవరకు ప్రమాదకర పరిస్థితులలో ఆయనను కళ్ళల్లో పెట్టుకుని కాపాడి గమ్యం చేర్చడంలో ముస్లిం యోధులు తోడ్పడ్డారు.

భారతదేశం వెలుపల నుండి వలసపాలకులను తరిమిగొట్టడానికి పోరుకు సిద్దపడిన  రాస్‌ బిహారి బోస్‌ మార్గదర్శకత్వంలో 1942 మార్చిలో జరిగిన సింగపూర్‌ సమావేశంలో పాల్గొన్న మేజర్‌ మహమ్మద్‌ జమాన్‌ ఖైని లాంటి వారు ఆ తరువాత ‘భారత జాతీయ సైన్యం’ కమాండర్‌ గా నేతాజీ తరువాతి స్థాయి అధికారిగా గణనీయ సేవలు అందించారు. ఆనాడు రాస్‌బిహారి, ప్రీతం సింగ్‌, కెప్టెన్‌ మాన్‌సింగ్‌ లాంటి నేతల నేతృత్వంలోని ‘కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌’, ‘భారత జాతీయ సైన్యం’లలో  కెప్టెన్‌ మహమ్మద్‌ అక్రం, కల్నల్‌ యం.జడ్‌. ఖైని, కల్నల్‌ జి.క్యూ. జిలాని, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ యస్‌.యన్‌.హుసైన్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ ఇక్బాల్‌లు బాధ్యతలు నిర్వహించగా, ప్రముఖ ఉర్దూ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ రాసిన ‘సారె జహంఁ సేఁ అచ్ఛా హిందూస్తాన్‌ హమార్‌’ గీతాన్ని ‘భారత జాతీయ సైన్యం’ ప్రతి సందర్భంలో గానం చేస్తూ గౌరవించింది.

1941 మార్చిలో స్వదేశాన్ని వీడి జర్మనీ చేరుకున్న నేతాజి జర్మనీలో ‘స్వేచ్ఛా భారత కేంద్రం’ (ఫ్రీ ఇండియా సెంటర్‌)  ప్రారంభించారు. ఆ సందర్భంగా నేతాజీకి పరిచయమైన హైదరాబాది అబిద్‌ హసన్‌ సప్రాని, 1941 నవంబర్‌లో నేతాజీ ఏర్పాటు చేసిన ‘భారతీయ కమాండో దళం’ శిక్షకుడిగా, ఆ తరువాత ‘ఆజాద్‌ హింద్‌ రేడియో’లో నేతాజీ ప్రసంగాల సహాయకుడిగా  బాధ్యతలను నిర్వహించారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్య చరిత్రలో నినాదంగా నిలచిన ‘జైహింద్‌’ సుభాష్‌ పేరును కూడా మర్చిపోయేలా చేసిన ‘నేతాజి’ నామాన్ని  అబిద్‌ రూపొందించారు. అబిద్‌ హసన్‌ సప్రాని కృషివలన ఉనికిలోకి వచ్చిన ‘జైహింద్‌’ ఈనాటికి భారత దేశమంతటా ప్రతిధ్వనించడం అబిద్‌ సృజనాత్మకతకు తార్కాణం.

జర్మనీ నుండి సుభాష్‌ చంద్రబోస్‌  తూర్పు ఆసియాకు  వచ్చేంత వరకు జర్మనీలో సాగిన కార్యక్రమాలన్నిటిలో అబిద్‌ హసన్‌ సప్రాని, ఎం.జడ్‌ కియాని లాంటి ముస్లిం యోధులు, మేధావులు ఆయనకు అమూల్యమైన తోడ్పాటు నిచ్చారు. ఆ తరువాతి కాలంలో అంతర్జాతీయంగా ఏర్పడిన పరిణామాల నేపధ్యంలో విప్లవోద్యమాన్ని సాగిస్తున్న సంస్థలు, నాయకులు సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వం ఆకాంక్షిస్తున్నందున యూరప్‌ నుండి  నేతాజీ దృష్టి తూర్పు ఆసియా వైపుకు మళ్లింది.

ఈ పరిస్థితులు ఇలా ఉండగా జపాన్‌ ప్రభుత్వాధినేతల పట్ల భారతీయ విప్లవోద్యమ నేతలల్లో ఏర్పడిన అభిప్రాయబేధాల కారణంగా తూర్పు అసియా ప్రాంతంలో జనరల్‌ మాన్‌సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన ‘భారతీయ జాతీయ సైన్యం’, ‘కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌’లు 1942 డిసెంబర్‌ 29న రద్దయినట్టు జనరల్‌ మాన్‌సింగ్‌ ప్రకటించగా, విప్లవోద్యమ నేత రాస్‌ బిహరి బోస్‌ నేతృత్వంలో 1943 ఫిబ్రవరి 15న భారత జాతీయ సైన్యాన్ని పునర్‌వ్యవస్ధీకరించారు. ఆ సమయంలో భారత జాతీయ సైన్యం, దాని అనుబంధం సంస్థలను, కార్యకర్తలను, సైనికులకు మార్గదర్శకత్వం వహించేందుకు సుప్రీం మిలటరీ బ్యూరో సంచాలకులుగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ జె.కె.భోన్స్‌లే బాధ్యతలు స్వీకరించగా లెఫ్టినెంట్‌ మీర్జా ఇనాయత్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని, మేజర్‌ మతా-ఉల్‌-ముల్క్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ బుర్హానుద్దీన్‌, మేజర్‌ ఎ.డి జహంగీర్‌, మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌, లెఫ్టినెంట్‌ అల్లాయార్‌ ఖాన్‌, మేజర్‌ మహమ్మద్‌ రజాఖాన్‌, కెప్టెన్‌ ముంతాజ్‌ ఖాన్‌, ఎస్‌.ఓ ఇబ్రహీం, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెంట్‌  మీర్‌ రహమాన్‌ ఖాన్‌, మేజర్‌ రషీద్‌, లెఫ్టినెంట్‌  కల్నల్‌ అర్షద్‌లు ముందుకు వచ్చి ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని జనరల్‌ స్టాఫ్‌ ప్రధానాధికారిగా, సైనికుల శిక్షణాధికారిగా మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌,  రిఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమాండెంట్‌గా మేజర్‌ ముతా-ఉల్‌-ముల్క్‌, చరిత్ర-సంస్కృతి-పౌర సంబంధాల అధికారిగా మేజర్‌ ఏ.జడ్‌ జహంగీర్‌ ప్రధాన భూమికలను చాకచక్యంగా నిర్వర్తించారు.

ఈ పరిణామాల నేపధ్యంలో యూరప్‌ నుండి తూర్పు ఆసియాకు వెళ్ళేందుకు సుభాష్‌ చంద్రబోస్‌ నిర్ణయించుకున్నారు. రావాల్సిందిగా కోరుతున్న విప్లవోద్యమ నేతల ఒత్తిడి మరింత పెరగడం, అవి ద్వితీయ ప్రపంచ సంగ్రామం జరుగుతున్న రోజులు కనుక జపాన్‌-జర్మనీల సహకారంతో బ్రిటన్‌ దాని మిత్రపక్షాల సైన్యాలతో పోరాడుతున్న సుభాష్‌ చంద్రబోస్‌ ఆసియాకు వెళ్ళడం ప్రాణాంతకం కావడంతో బ్రిటీష్‌ గూఢాచారి వ్యవస్థ డేగకళ్ళ నుండి తప్పించుకుని గమ్యస్థానం చేరడానికి నేతాజి రహస్యంగా జలాంతర్గమి ప్రయాణం తప్పలేదు. ఆ ప్రమాదకర పరిస్థితులలో 1943 ఫిబ్రవరి ఎనిమిదిన ఆరంభమైన చరిత్రాత్మక జలాంతర్గమి ప్రయాణంలో తన వెంట సాగడానికి అత్యంత సమర్ధుడు, విశ్వాసపాత్రుడగా పరగణించబడిన అబిద్‌ హసన్‌ సప్రానిని తన ఏకైక సహచరునిగా నేతాజీ ఎన్నుకున్నారు. శత్రు పక్షాల నిఘానీడల్లో మూడు మాసాలపాటు 25,600 కిలోమీటర్లు సాగిన అత్యంత్య భయానక, సాహసోపేత జలాంతర్గమి ప్రయాణంలో సుభాష్‌్‌కు అబిద్‌ హసన్‌ తోడుగా నిలిచి, భవిష్యత్తు కార్యక్రమాల రూపకల్పనలో ఆయనకు తోడ్పడి చరిత్ర సృష్టించారు.

1943 మే 16న సుభాష్‌-అబిద్‌లు టోక్యో చేరుకున్నాక 1943 జూలై నాల్గున సింగపూర్‌లో జరిగిన సమావేశంలో తూర్పు ఆసియాలో సాగుతున్న భారత స్వాతంత్య్రోద్యమం నాయకత్వాన్ని సుభాష్‌ చంద్రబోస్‌ చేపట్టిన నేతాజీ 1943 అక్టోబర్‌ 23న ‘ఆజాద్‌ హింద్‌’ ప్రభుత్వాన్ని ప్రకటించారు. అ మరుక్షణమే మాతృభూమి విముక్తి కోసం, బ్రిటీష్‌ దాని మిత్రపక్షాల మీద యుద్ధం ప్రకటిస్తూ భారత జాతీయ సైన్యానికి ‘చలో ఢిల్లీ’ నినాదమిచ్చారు. భారత జాతీయ సైన్యం పతాకం మీద ప్రప్రధమ జాతీయవాదిగా ఖ్యాతిగడించిన మైసూరు పులి టిపూసుల్తాన్‌కు గుర్తుగా ‘పులి’ చిహ్నంను ఏర్పాటు చేశారు. భారత జాతీయ సైన్యంలో చేరమంటూ భారతీయులను కోరుతూ ఆజాద్‌ హింద్‌ రేడియా కేంద్రం ప్రసారం చేసిన ప్రతి కార్యక్రమంలో, మొగల్‌ చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ స్వయంగా రాసిన గీతంలోని ‘స్వాతంత్య్ర పోరాటం జరుపుతున్న యోధులలో ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం లండన్‌ గుండెల్లో భారతీయుల ఖడ్గం దూసుకపోతూనే ఉంటుంది’ అను చరణాలతో ఆలాపించడం అనవాయితయ్యింది.

భారత జాతీయ సైన్యం సర్వసైన్యాధ్యకక్షులుగా, అజాద్‌ హింద్‌ ప్రభుత్వం అధినేతగా భాధ్యతలు స్వీకరించి సుభాష్‌ చంద్రబోస్‌ పలు ప్రధాన శాఖలకు సైన్యాధికారులుగా లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియానిలకు బాధ్యతలు అప్పగిస్తూ, బషీర్‌ అహమ్మద్‌ను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌ సాయుధ దళాల ప్రతినిధిగా నియక్తులయ్యారు. ఆ తరువాతి క్రమంలో భారత జాతీయ సైన్యానికి సంబంధించిన మూడు డివిజన్లకు గాను రెండిటికి మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ ఖాన్‌, ఎం.జడ్‌ కియానిలు ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టగా, రెజిమెంటల్‌ కమాండర్లుగా ఐ.జె కియాని, ఎస్‌. ఎం. హుసైన్‌, బుర్హానుద్దీన్‌, షౌకత్‌ అలీ మలిక్‌ తదితరులు నియక్తులయ్యారు. ఈ సందర్భంగా  సుభాష్‌ చంద్ర బోస్‌ ప్రత్యేక ఆసక్తితో ఏర్పాటు చేసిన ‘ఝాన్సీరాణి రెజిమెంట్‌’లో ఎం.ఫాతిమా బీబి, సయ్యద్‌ ముంతాజ్‌, మెహరాజ్‌ బీబి, బషీరున్‌ బీబీ లాంటి నారీమణులు పలు బాధ్యతలు నిర్వహించారు.

స్వతంత్ర భారత ప్రభుత్వం, సైన్యం ఏర్పడ్డాక  సాగుతున్న కార్యక్రమాలకు అన్నిరకాల సహాయసహకారాలు అందించాల్సిందిగా సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన విజ్ఞప్తి ప్రతిస్పందిస్తూ రంగూన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి హబీబ్‌ సాహెబ్‌ తన రాజప్రసాదం లాంటి భవంతిని, ఆయనకున్న పొలాలు-స్థలాలు, కోటిన్నర రూపాయల విలువ చేసే ఆభరణాలను ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు ధారాదత్తం చేసి కట్టుబట్టలతో నిల్చోగా ఆయనను ‘సేవక్‌-ఏ-హింద్‌’ పురస్కారంతో నేతాజీ సత్కరించారు. ఈ క్రమంలో బషీర్‌ సాహెబ్‌, నిజామి సాహెబ్‌ అను మరో ఇరువురు సంపన్నులు విడివిడిగా 50 లక్షల రూపాయలను నేతాజీకి అందించగా, మరో ముస్లిం వ్యాపారి తనకున్న మూడు ప్రింటింగ్‌ ప్రెస్‌లను, యావదాస్తిని ‘నేతాజీ నిధి’ పరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయనగరం జిల్లా వేపాడు (ప్రస్తుతం) నివాసి షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ అతి కష్టం మీద కూడపెట్టుకున్న 20వేల రూపాయలను స్వయంగా ‘నేతాజి నిధి’కి అప్పగించి, రైఫిల్‌మన్‌గా భారత జాతీయ సైన్యంలో చేరి సేవలందచేశారు.

1944 ఫిబ్రవరిలో భారత దేశాన్ని విముక్తం చేయడానికి బ్రిటన్‌ మీద యుద్ధాన్ని ప్రకటించిన భారత జాతీయ సైన్యాన్ని వివిధ విభాగాలు, బ్రిగేడ్‌లుగా ఏర్పాటు చేశారు. ఆ బ్రిగేడ్‌లకు లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిరి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ బుర్హానుద్దీన్‌ తదితరులను సైన్యాధికారులగా నియమించారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సాయుధ దళాల ప్రధానాధికారిగా మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టగా కల్నల్‌ యం.జడ్‌ కియాని, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిరి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హబీబుర్‌ రెహమాన్‌ తదితరులతో కూడిన ‘కౌన్సిల్‌ ఆఫ్‌ వార్‌’ ఏర్పాటయ్యింది.

‘చలో ఢిల్లీ’ పిలుపును సాకారం చేయడానికి అరకాన్‌ యుద్దరంగంలో తొలిసారిగా  కల్నల్‌ ఎస్‌.యం మలిక్‌ నేతృత్వంలోని భారతీయ జాతీయ సైన్యం బ్రిటీష్‌ సైన్యాలను మట్టికరిపించి మాతృభూమి మీద అడుగు పెట్టి మణిపూర్‌లోని మొయిరాంగ్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఆ తరువాత భారత జాతీయ సైన్యంలోని రెండు డివిజన్‌లకు విడివిడిగా నేతృత్వం వహిస్తున్న కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ జనరల్‌ ఎం.జడ్‌ కియానిలో ప్రళయకాళరుద్రుల్లా ముందుకు దూసుకు పోతున్న భారత జాతీయ సైనికులను ఉత్సాహపర్చుతూ ఇంఫాలా, కోహిమాల వైపు దృష్టి సారించారు.  ఈ ప్రాంతాల మీద పట్టుకోసం ఇరు పక్షాల మధ్య సుమారు ఐదు మాసాలు భీకర సమరం సాగింది. ఈ సందర్భంగా జరిగిన వివిధ పోరాటాలలో మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ బాధ్యతలు నిర్వహించగా కల్నల్‌ యం.జడ్‌ కియాని, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిరి, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌ ఖాన్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హబీబుర్‌ రెహమాన్‌, కల్నల్‌ ఇనాయత్‌ కియాని, కల్నల్‌ మున్వర్‌ హుసైన్‌, కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, కల్నల్‌ బుర్హానుద్దీన్‌, లెఫ్టినెంట్‌ నజీర్‌ అహమ్మద్‌, కల్నల్‌ మలిక్‌, మేజర్‌ మహబూబ్‌ అద్వితీయమైన ప్రతిభతోపాటుగా ప్రాణాంతక పరిస్థితులలో కూడా శత్రువు మీద దాడులు చేయడంలో దృఢసంకల్పాన్ని ప్రదర్శించారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోని వివిధ శాఖలలో అధికారులుగా బాధ్యతలను  నిర్వహించిన యోధులలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన నక్కి అహ్మద్‌ చౌదరి, అష్రాఫ్‌ మండల్‌, అమీర్‌ హయత్‌, అబ్దుల్‌ రజాఖ్‌, ఆఖ్తర్‌ అలీ, మహమ్మద్‌ అలీషా, అటా మహమ్మద్‌, అహమ్మద్‌ ఖాన్‌, ఎ.కె. మీర్జా, అబూ ఖాన్‌, యస్‌. అఖ్తర్‌ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్‌ రహమాన్‌ ఖాన్‌ లాంటి వారున్నారు. ఈ క్రమంలో యుద్ధరంగంలో  చిట్టచివరివరకు శత్రువుతో పోరాడిన, తమ ప్రాణాలను అడ్డువేసి శత్రువును నిలువరించిన పలువురు యోధులలో హకీం అలీ, మహమ్మద్‌ హసన్‌, అబ్దులా ఖాన్‌, యాసిన్‌ ఖాన్‌, అబ్దుల్‌ మన్నాన్‌, ఖాన్‌ ముహమ్మద్‌ లాంటి వారు స్వయంగా నేతాజీచే ప్రసంశించబడి ‘వీర్‌-యే-హింద్‌’ ‘సర్దార్‌-యే-జంగ్‌’, ‘తంగాహ్‌ా-యే-బహదూరి’, ‘శత్రునాశ్‌’ లాంటి గౌరవ పురస్కారాలు పొందారు.

చరిత్ర సృష్టించిన ఈ పోరాటంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముస్లింలూ భారీ సంఖ్య భాగస్వాములయ్యారు. మన రాష్ట్రం నుండి అబిద్‌ హసన్‌ సప్రానితోపాటుగా ఖమురుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌, హైదరాబాద్‌ చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్‌ కూడా భారత జాతీయ సైన్యంలో పనిచేశారు. హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్‌, అబ్దుల్‌ సయీద్‌ ఉస్మాని, అబ్దుల్‌ లతీఫ్‌, ఇమాముద్దీన్‌, ముహమ్మద్‌ ఖాన్‌ లాంటి పలువురు నేతాజీ బాటలో నిర్భయంగా నడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వేపాడు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, ప్రకాశం జిల్లా దర్శి తాలూకా చెందిన షేక్‌ బాదుషా, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్‌.అబ్దుల్‌ అలీ,చిత్తూరు జిల్లాకు చెందిన మహమ్మద్‌ అఫ్జల్‌ సాహెబ్‌, పుంగనూరుకు చెందిన పి.పి.మహమ్మద్‌ ఇబ్రహీం, కడపజిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌, పశ్చిమగోదావరి జిల్లా తణుకు చెందిన షేక్‌ అహమ్మద్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పోరాటాలలో భాగస్వాములయ్యారు.

 

ఇంఫాలా-కోహిమాలను ఆక్రమించి అస్సాంలోకి అడుగుపెట్టాలని ముందుకు సాగుతున్న భారత జాతీయ సైన్యానికి ఒకవైపున ప్రకృతి మరోవైపున ఆహారం, ఆయుధాలు, రవాణా తదిరల అవసరాల తీవ్ర కొరత దెబ్బతీసింది. ఈ లోగా భారీ సైనిక బలగాలను సమకూర్చుకున్న బ్రిటన్‌ దాని మిత్ర పక్షాల సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది. బ్రిటీష్‌ వైమానిక దాడుల నుండి భారతీయ జాతీయ సైనికులకు, జపాన్‌ సేనల రక్షణ కరువయ్యింది. పర్వత-అటవీ ప్రాంతాలలో ఎదురవుతున్న పూర&ఇత ఆనారోగ్య పరిస్థితులు భారత జాతీయ సైన్యాన్ని కుంగదీస్తుండగా ఒకవైపున కుండపోతగా వర్షం, మరోవైపున వైమానిక దాడులు, విరామం లేకుండా కురుస్తున్న శత్రువు తుపాకి గుండ్లకు ఎదురొడ్డి ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధులు పోరాడసాగారు.

ఆ తరుణంలో భారత జాతీయ సైన్యానికి అరకొరగా నైనా ఆర్థిక-ఆయుధ మద్దత్తు ఇస్తున్న జపాన్‌ దారుణంగా దెబ్బతిన్నది. మరోవైపున జర్మనీ కుప్పకూలింది. బ్రిటన్‌-ఆమెరికాలు పక్షాలు విజయం సాధించాయి. ఆ కారణంగా 1945 ఆగస్టు 15న జపాన్‌ తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేయగా భారత జాతీయ సైన్యం కూడా యుద్దరంగం నుండి తప్పుకోవాల్సి రావడంతో  నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ యుద్దరంగం నుండి తప్పుకుని రష్యాకు బయలుదేరాలనుకున్నారు. ఆ ప్రయాణంలో తొలుత ఇతర అధికారులతోపాటుగా మేజర్‌ అబిద్‌ హసన్‌ సప్రాని, కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ తదితరులు సిద్దంకాగా, చివరకు ఆగస్టు 18న కల్నల్‌ హబీబ్‌తో కలసి నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ బాంబర్‌ విమానంలో బయలుదేరారు. ఆకాశంలోకి ఎగిరిన ఆ విమానం ఫోర్‌మొసా ద్వీపంలో కూలిపోవడంతో తీవ్రంగా గాయపడిన సుభాష్‌ చంద్రబోస్‌ ఆగస్టు 19న కన్నుమూశారు. ఆయనతోపాటు ప్రయాణించిన కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ చికిత్స అనంతరం బతికి బయటపడ్డారు. ఆ దుర్భర క్షణాలలో ‘హబీబ్‌, నాకు తుది ఘడియలు సమీపించాయి. జీవితాంతం నేను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాను. నేను నా దేశ స్వాతంత్య్రం కోసం మరణిస్తున్నాను. భారత స్వాతంత్య్ర పోరాటం సాగించమని నా ప్రజలకు తెలియజెయ్యి. త్వరలోనే భారత దేశం విముక్తి చెందుతుంది’ అని సుభాష్‌ చంద్రబోస్‌ కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ ద్వారా భారతీయులకు తన చివరి సందేశం పంపారు.

జపాన్‌, భారత జాతీయ సైన్యం ఆధీనంలో ఉన్న భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆంగ్ల ప్రభుత్వం భారత సైనికులను, అధికారులను వివిధ ప్రాంతాల నుండి అరెస్టు చేసి, శిక్షలు విధించింది, కొన్ని చోట్ల కాల్చి చంపింది. అసఖ్యాకులను ఇండియాకు తరలించింది. ఆ క్రమంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధుడు రషీద్‌ అలీకి ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించగా భారత దేశంలో నిరసన వెల్లువెత్తింది. దానికి తోడు మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌, కల్నల్‌  ప్రేమ్‌ కుమార్‌ సహగల్‌, కల్నల్‌ ధిల్లాన్‌ మీద ‘దేశద్రోహం’ నేరారోపణలు చేసి సైనిక విచారణ నిమిత్తం ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్భందించడంతో భారతదేశమంతా అట్టుడికినట్టయ్యింది. భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షలు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తగు చర్యలు తీసుకుని ఆసఫ్‌ అలీ, పండిట్‌ నెహ్రూ లాంటి ప్రముఖులతో ‘డిఫెన్స్‌ కౌన్సిల్‌’ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ముస్లిం లీగ్‌ నాయకుడు మహమ్మద్‌ అలీ జిన్నా స్వయంగా వచ్చి మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌ను కలసి ఆయన పక్షంగా మాత్రమే న్యాయస్థాంలో వాదిస్తానని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తూ, ‘స్వాతంత్య్ర సమరంలో మేం భుజం భుజం కలిపి పోరాడాం. మా నాయకత్వం స్ఫూర్తితో మా కామ్రేడ్స్‌ యుద్ధభూమిలో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు వదిలారు. నిలబడినా, నేలకూలినా కలిసే ఉంటాం’, అని స్పష్టం చేసిన షా నవాజ్‌ ఖాన్‌ మతం పేరుతో మనుషులను వేరేచేసే ప్రయత్నాలను వమ్ముచేశారు.

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అద్భుత ఘట్టాన్ని సృష్టించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇండియా నుండి జర్మనీకి బయలుదేరిన ప్రయాణంలో మియా అక్బర్‌ షా తోడుకాగా, ఆ తరువాత ప్రమాదకరంగా సాగిన జలాంతర్గమి ప్రయాణంలో నేతాజీ వెంట మేజర్‌ అబిద్‌ హసన్‌ సప్రాని ఉన్నారు. బ్రిటన్‌ దాని మిత్రపక్షాల మీద సాగిన యుధ్దంలో అన్నివిధాల మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ జనరల్‌ మమ్మద్‌ జమాన్‌ ఖియాని, కల్నల్‌ మల్లిక్‌ లాంటి యోధులు సుభాష్‌ వెంట సాగారు. చివరకు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతిమ విమాన ప్రయాణంలో కూడా ఆయన వెంటనున్న వ్యక్తి, భారతీయులకు ఆయన చివరి సందేశాన్ని అందించిన కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ వరకు ముస్లిం పోరాట యోధులు మాతృభూమి విముక్తి పోరాటంలో ప్రధాన భాగస్వామ్యం వహించడం ముస్లిం సమాజం గర్వించదగిన చారిత్రక విశేషం.

 

 

REFERENCE BOOK :

01.     My Memories of  I.N.A and Its Netaji, Major General Sha Nawaj Khan, Rajkamal Publications, Delhi,               1946.

02.     My Adventures with the INA, KR Palta, Lion Press, Lahore, 1946.

03.     Forgotten Warriors of Indian War of Independence 1941-1946 (Indian National Army), Three Volumes,          by Captain SS Yadava, INA,  All India INA Committee, Hope India Publications,  Delhi, 2005.

04.     Subhash Chandra Bose (The Springing Tiger), Hugh Toye, Jaico Book Publishing House, Mumbai,             2010.

05.     The Forgotten Army, Indian’s Struggle for Independence 1942-1946, Peter Ward Fay, Rupa & co, New        Delhi, 2005.

06.     Indian National Army : Role in India’s Struggle for freedom, Gurbachan Shing Manqat, 1992.

07.     Rediscovering Bose and Indian National Army, Brig. RP Singh, Manasa, New Delhi, 2010.

08.     Great Muslims of Undivided India, Nikhat Ekbal, Kalpaz Publications, Delli, 2009.

09.     Indian National Army, A Documentary Study, TR Sareen, GPH, New Delhi, 2004

10.     Nathaji Collected Works, 12 Volumes, Nethaji Research Bureau, Kolkata, 2002.

And other Several Books.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *