April 19, 2024

ఊహకి వాస్తవానికి మధ్య పూల వంతెనలు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారి కధలు

రచన : మంగు శివరామప్రసాద్

 

ఒక అపురూపమైన అద్భుతమైన కళారూపం ధరించి పాఠకుని కళ్ళెదుట సాక్షాత్కరించే సాహిత్య ప్రకృయ కథ.   సౌందర్యం, ఆనందం, రసానుభూతి మానవుని సహజ  మానసిక స్థితి.  కాని మానవుడు  భరించలేని బాధలతో, వణికించే  భయాలతో, సలసలకాగే ఈరాష్యాసూయలతో ఆ సహజ స్థితినుంచి దూరంగా తొలపోతున్నాడు.

ఒక క్షణం మబ్బులో మెరుపులా ఆ సహజ స్థితిని కలుగజేసేదే కథాశిల్పం. ఈ స్నిగ్ధ  సౌందర్యానికి రూపుకట్టి, అక్షరాల తోరణాలతో, మధురమైన భావచిత్రాలతో ఆ కళారూపాన్ని ఆవిష్కరించిన కథాశిల్పి   ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి  విశాఖ మండలం సాహితి కేదారంలో పూచిన  మందారం.  ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారు   1911 ఆగష్టు 29 న విశాఖపట్టణం జిల్లా వీరవల్లి తాలుకా మాడుగుల ఆస్థానంలో జన్మించారు. కొవ్వూరు ఆంధ్ర  గీర్వాణం విద్యా పీఠం   ఉభయ భాషా  ప్రవీణలో  ఉత్తీర్ణులైనారు.   1934  నుంచి   1964  వరకు  రామచంద్రాపురం  బోర్డు హై స్కూల్లో  1964 నుంచి  1984  వరకు కావలి జవాహర్ కాలేజిలో  సంస్కృత  పండితుడిగా పని చేశారు. తొలి రోజులలో నాస్తికుడు, బ్రహ్మ సమాజ పక్షపాతి.   దేవులపల్లి  కృష్ణశాస్త్రి, చలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గార్ల అంటే  అభిమానం.  నవ్య సాహిత్య పరిషత్తు నిర్వాహకులలో ఒకరు.  మలితరం భావకవులలో ఒకరిగా విమర్శకుడిగా, వ్యాస రచయితగా కథారచయితగా, ఉపన్యాసకుడిగా పేరు ప్రఖ్యాతులు గడించారు.  1948-49 లో  H.M.V  కంపనీవారు నిర్వహించిన పాటల పోటీలలో హనుమచ్చాస్త్రిగారు రాసిన ” సృష్టిలో తీయనిది స్నేహమేనోయ్ ” అనే పాటకు స్వర్ణ పతకము వచ్చింది.  పెండ్యాల సంగీతములో రావు బాలసరస్వతి  పాడిన ఈ  పాటకు చాలా ప్రాచుర్యం లభించింది.

వీరి రచనలు దక్షరామం, కీర్తితోరణం(ఖండ కావ్యాలు), వ్యాసావళి, కాళిదాసు కళామందిరం, సారమతి  నన్నయ్య, ఆరు యుగాల ఆంధ్ర  కవితా చరిత్ర (సాహిత్య వ్యాసాలు),  మొదటి  కథా సంపుటి హనుమచ్చాస్త్రి కథలు ( 1945) — 13 కథలు, విజయ దశమి  కథాసంకలనం (1951) — 10 కథలు, గౌతమి గాధలు కథా సంకలనం (1981) లో ప్రచురించబడ్డాయి. భాస నాటకచక్రం (13 నాటికలు), ఇవి  రేడియో నాటికలు. “మౌనసుందరి –ఇతర కథలు” (2006) లో 28  కథల సంపుటి హనుమచ్చాస్త్రిగారి కుమారుడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మగారు ప్రచురించారు.   1960 లో శాస్త్రిగారు వ్రాసిన “ఐదు రూపాయల నోటు” రేడియో కథ దొరకలేదని అందువలన దానిని ప్రచురింపలేక పోయామని  శర్మగారు అన్నారు.

1929 లో ” స్మృతి కణాలు” అనే పద్య ఖండికలో రచనా వ్యాసంగం ప్రారంభించిన హనుమచ్చాస్త్రిగారు  1987 లో పరమపదం చేరేవరకు రచనలు చేస్తూనే ఉన్నారు.  ఆయన  చిట్టచివరి రచన “ఆరు యుగాల ఆంధ్ర కవిత” అనే కళాత్మక ప్రాచీన కావ్య చరిత్ర తెలిపే  విమర్శ  గ్రంధం. శాస్త్రిగారు సంప్రదయబద్ధంగా సంస్కృతం తెలుగు అధ్యయనం చేసినా ఆయన ద్రుక్పధం మాత్రం ఆధునికం.  గొప్ప అందాలను కనుగొనడం, ఆవేశంతో చలించిపోవడం, అందని అంశాలపట్ల అసంతృప్తి, అందువల్ల తిరుగు బాటు  ధోరణి ఆయనలో  జీరిణ్చుకు  పోయాయి. ఈ హృదయ ధర్మం  సాహితి వ్యాసంగం  నడిచినంత కాలం ఆయనలో ఆరని దీపంలా కొనసాగినది.

మల్లాది రామకృష్ణశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గార్లవంటి వైతాళికులు, ప్రముఖ కథా రచయితలతో తెలుగుకథ నిలువెల్లా తెలుగుతనాన్నిసంతరించుకోవడమే గాక వెనుకటి  తరం భాషకు కథా సాహిత్యంలో ప్రాణ ప్రతిష్ట చేయడమైంది.  ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారు అదే సంప్రదాయాన్ని భాషా   సౌందర్యాన్ని, సౌరభాన్ని సన్నజాజుల పరిమళంతో గుభాలింపజేస్తూ చదువరులకు అందించారు.   తెలుగు భాషలో ఉండే తేజస్సు శ్రీపాదకి, మాధుర్యం మల్లాదికి, జీవశక్తి  చలానికి తెలిసినట్టు నిస్సర్గ సౌందర్యం ఇంద్రగంటికి తెలుసు.   జీవితంలో  స్నేహ సౌరభాన్ని, భాషలో సహజ సౌందర్యాన్ని అర్ధం చేసుకొని, ఆ అమృత ధారలని దోసిళ్ళతో  జుర్రుకోడానికి ఉపకరించే ఇంద్రగంటివారి కథలు: విజయదశమి, మౌనసుందరి, సర్వాణి, రేరాణి, స్వర్గద్వారాలు, చీకటి బ్రతుకులు, అందని ఆశలు.

ఒక వైపు నుంచి భావకవిత్వపు  గాలులు ముమ్మరంగా వీస్తున్నా, నవ్య సాహిత్యోద్యమం ఒకటి రూపు దిద్దుకుంటున్నది.  జాతీయ భావనలు, ఆంగ్ల, వంగ  సాహిత్య ప్రభావాలు, అభ్యుదయ సామ్యవాద భావాలు ఆంధ్ర సాహితివేత్తలను ఉర్రుతలూగిస్తున్న రోజులవి.   అటు నవ్యసంప్రాదాయంలోని భావుకతకి,  ఇటు అభ్యుదయ సాహిత్యంలోని జీవత వాస్తవికతకి  వారధిలా నిలిచి సమకాలిక జీవన విధాన్నాన్ని,జీవిత స్థితిగతులను, వెలుగునీడలను, ఆనంద విషాదాలను. స్వాప్నిక జగత్తును, మానవత్వపు కోణాలను ఉద్ఘాటించిన హనుమచ్చాస్త్రి కథలు తెలుగు కథ సాహిత్యములో ఉత్తమ శ్రేణికి  చెందినవి.

వంశపారపర్యంగా తానూ నేర్చిన ప్రాచీన సాహిత్య సంప్రదాయం సంస్కృతి మాత్రమే గొప్పవని, కరుడుగట్టిన సనాతన  చాందస వాదులలా  కొత్తదన్నాన్ని పరిహసించి, నిరసించి  పరిత్యజించలేదు.   విద్యార్ధి  దశలోనే సమకాలీన సాహిత్య ధోరణుల్ని ఆకళింపు చేసుకున్నారు. అధ్యయనం చేసి తనంత తానుగా మంచి చెడ్డల్ని బేరీజు వేసుకున్నారు.  పాత కొత్తల లేబిళ్ళకి  అతుక్కు పోకుండా గుణదోషాల్ని  బట్టి మంచిని మనస్ఫూర్తిగా  ఆహ్వానించారు.   అక్కరుకురాని భేషజాలను తిరస్కరించారు.   నిత్య పల్లవశీలమైన  సాహిత్యం ఎన్నటికి మోడుకారాదనే  ఆయన  ఆకాంక్ష, ఆవేదన  చదువరుల గుండెలని తాకుతాయి.

సాంప్రదాయాన్ని బాగా ఎరిగి కూడా మార్పుని  విశాల హృదయముతో హ్సనుమచ్చాస్త్రిగారు  ఆహ్వానించారు.  ప్రాచీన, నవీన సాహిత్యాన్ని బాగా తెలిసినవాడు అవడముచేత  పాత కొత్తలకి అతీతమైన, సార్వకాలికమైన  ఒక మానవ  చైతన్యాన్ని  గుర్తించగలిగారు.  అందువలనే  అయోధ్యలోని  కైకలోనూ, లంకలోని విభీషణునిలోను, శూద్రక మహాకవి రచనలలోను కూడా ఆయన అదే నిత్య పల్లవమైన ధోరణిని గమనించగలిగారు.  అన్నిరకాల   ధోరణినలను, వాటి నేపథ్యాలను అధ్యయనం చేయాలని, సందర్భానుసారంగా  సమన్వయించుకోవాలని భావించేవాళ్ళు అర్ధం కావడం కష్టం.  ఇంద్రగంటివారికీ     ఇటువంటి  సమన్వయ దృష్టి  ఎక్కువ.  ఆయన తాను స్పృసించిన ప్రతి  సాహిత్య విషయములోను, దేనినీ  నిరాకరించకుండా,  అగౌరవ పరచకుండా పరస్పర విరుద్ధముగా కనిపించే విషయాలని కూడా చక్కగా సమన్వయ పరుస్తూ కనిపిస్తారు.

అందుకే  అటు సంప్రదాయవాదులు  ఇటు అభుదయవాదులు కూడా ఆయనని తీవ్రంగా విమర్శించారు.  ‘ప్రతిభ’ పత్రిక 1936  ఆగష్టు సంచికలోని  ఒక వ్యాసంలో కధ గురించి  చెప్తూ  ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారు “కధానిక”  అంటే చిన్న కధకు ప్రాచీన భారతీయ సాహిత్యవేత్తలు పెట్టిన ముద్దు పేరు అన్నారు.  తెలుగులో చిన్న కథ అనే  ప్రక్రియకు “కథానిక” అనే పేరును సూచించి ప్రచారంలోకి తెచ్చి దానికి గుర్తింపు తెచ్చారు హనుమచ్చాస్త్రిగారు.

అజ్ఞాత వాంఛలు, అవ్యక్త భావోద్విగ్నత, అనుభూతి తరంగాలు, అవ్యాజమైన ప్రేమ, సౌందర్యారాధన, అనుస్యూత  సంస్కృతి అనే జీవ  లక్షణాలను తన కథలలో ప్రతిఫలింపజేశారు హనుమచ్చాస్త్రిగారు.  ఎంత మధుర గీతాలలో నైనా ఏదో తెలియని అపశ్రుతి, చల్లని సెలయేటి స్వచ్చమైన నీటిలో కూడా ఏదో వేడిమి, తియ్యటి  తేనెలో కూడా  ఏదో  చిరుచేదు— జీవతం అంటే  ఇంతేనేమో  అనే తాత్విక చింతన ఉద్దీపన  కలిగించే ఒక అపురూపమైన అనుభూతి అనుకంపన శాస్త్రిగారి రచన.   ఒకానొక నిశితమైన, రహస్యమైన అనుభవాన్ని, అపురూపమైన అనుభూతితో అవగాహన చేసుకొని, ఆ  అపూర్వ అనుభవానికి,  రసరమ్యత కలిగించే రీతిలో,  మనోహరమైన  కథారూపాలలో మలచడంలో శాస్త్రిగారి ప్రతిభ ప్రకాశిస్తుంది.

అంచులు చెరిగిపోయి, ఎల్లలు కరిగిపోయి, తెలుగుదనం పేరుకుపోయిన ఒక యుగంలోని  ఇతివృత్తాలుగా మారిపోయే కథలను ఎక్కువగా వ్రాసిన హనుమచ్చాస్త్రిగారి రచనలలో నీతి, సందేశం,సూచన వంటి పడికట్టు పదార్థాలు లేక పోయినా రంగు, రుచి, వాసన, రసాస్వాదన ఉన్నాయి.  తెలుగు జాతి జీవన స్రవంతిలోనుంచి, అంతరించిపోతున్న సంస్కృతిలోనుంచి సంఘటనలను, సన్నివేశాలను, మనస్సులోలోపలి పొరలలోనుంచి తరచి వెలికి తీసి, శృంగారం, భావుకత, సహృదయ చెమరింత, నైసర్గిక తాత్వికతతో  రంగరించి కథకాసారంలో తామరలను పూయించారు శాస్త్రిగారు.   మొదటి  దశ  1935–1945 మధ్య కాలంలో శాస్త్రిగారు తానూ వ్రాసిన కథలలో అధిక భాగం వ్రాసారు.  1949-1987  మధ్య కాలం  అయన రచన వ్యాసంగంలో మలిదశను సూచిస్తుంది.

“దక్షరామం” పద్య ఖండకృతి, పద్య ఖండికలు, “కీర్తితోరణం” కావ్యం, “కాళిదాసు కళామందిరం”, “సారమతి నన్నయ” విమర్శ గ్రంధాలు ఆయనపై  ‘నియో క్లాసిసిస్ట్’ (నవ్య  సంప్రదాయవాది)  అనే ముద్ర వేసాయి.  ఆయనలోని ఆవేశాలు, స్వప్నాలు, ఉద్వేగాలు  సంయమన స్ధితికి చేరుకొని కళాద్రష్టగా తటస్థత సిద్ధించింది.  1950 తరువాత వ్రాసిన ‘తలవంచని పువ్వులు’, ‘నిప్పునుంచి నీరు’, ‘ఎండమావులు’, వంటి కథలు వ్యక్తిగత ఆవేశ స్పర్శ లేకుండా కనిపిస్తాయి.   శాస్త్రిగారి వ్యక్తిగత జీవితం ఆవేశపూరితమైనది, అన్వేషణ బంధురమైనది, లౌకికమైన   ఏ అంశానికైనా ప్రతిస్పదించే లక్షణాన్ని సంతరించుకొన్నది.   ఈ ప్రతిస్పందనలు ఆయన వ్రాసిన కథలలో,  పాటలలో ప్రతిష్టితమై ఉన్నవి.

ఏదో అపూర్వమైన అంశం, అది సౌందర్య స్వప్నం కావచ్చు, సాంగత్యం కావచ్చు, అపురూపమైన అనుభవం కావచ్చు,దానిని కోల్పోయిన స్థితి ఆనాటి  ఆయన  కథలలో కనిపిస్తుంది.  క్రింద తరగతి  అధో జగతి పీడిత తాడిత జనాల ఆకలి  సమస్య, మోసపోవడం సమస్య, దుర్భర  దారిద్ర్యం అనాదరణకు  గురికావడం మొదలైన జీవిత వాస్తవికతలు ఆయన కథలకు  ఇతివృత్తాలు అయినాయి.   శాస్త్రిగారి ‘6 వ నంబర్ గది’, ‘బస్సులో’, ‘వివాహ మంగళం’, ‘వినోదయాత్ర’, ‘స్వర్ణయోగం’, ‘చీకటి బ్రతుకులు,’   అనే కథలు ఒక సంఘటన ఆధారంగా, ఉత్కంటభరితముగా రచింపబడినవి.  శాస్త్రిగారి కథల నిర్మాణంలో ఒక విశిష్టమైన శైలి ముద్ర కనిపించకపోయినా, ప్రతికథను దానికున్న పరిధిలో ఏదో ఒక కొత్తదనంతో చెప్పాలనే తపన ప్రయత్నం  కనిపిస్తాయి.

సంఘటన  ప్రధానంగా కార్య కారణాల సంబందాల అన్వేషణ కథలలో చోటు చేసుకుంటుంది. పాత్రల  మనస్సులలో అట్టడుగు పొరలలో ఉండే స్పందనను కనుగొని చదువరులకు అందించారు.  1935–50 మధ్యకాలంలో సంస్కారవంతులైన, విద్యావంతులైన తెలుగువాళ్ళ ఇళ్ళలో కనిపించే మమతా మాధుర్య విలసితమైన, సుకుమారమైన, స్నేహ సౌహాద్ర భరితమైన, సరళ సుందరమైన జీవితం శాస్త్రిగారి కథలలో తరంగితమౌతుంది. శాస్త్రిగారు కథ చెప్పడంలో ఒక  వైలక్షన్యం కనిపిస్తుంది.  కవిగా శాస్త్రిగారు భావకవితకు  అభుదయ కవితకు మధ్య వెలుగు వారధి.  అలాగే అయన కథలు కూడా అటు ఊహకు ఇటు వాస్తవానికి  మధ్య  ఇరువైపుల  తీరాలను కలుపుతూ నిర్మించిన పూల వంతెనలు.  అనువైనచోట  కథ మొదలై అనుకోని మలుపులు తిరిగి మెరుపు మెరిసి ముగుస్తుంది.

ఏ కథను ఎలా మొదలెట్టాలో, ఎలా నడపాలో, ఎంత వరుకు చెప్పాలో ,ఎన్ని మలుపులు తిప్పాలో, ఎలా ముగించాలో, దాని శృతి, లయ, ధోరణి ఎలా ఉండాలో ఇంద్రగంటివారికి బాగా తెలుసు. మనస్సులో ఉన్నదంతా కక్కేయాలనే చాదస్తం లేకుండా,కొత్త మార్గంలో సుందరమైన కథను నవనవోన్మేషంగా, నిత్య నూతనంగా  చదువరులకు అందించడమే అయన ధ్యేయం.  అనూచానంగా వస్తున్న సాంఘిక,  సాంప్రదాయబద్ధమైన జీవితాలు, మధుర మంజులమైన బ్రతుకులు, తెలుగువారి సంస్కృతికి ఆలవాలమైన రసరమ్య జీవిత విధానాలు, పెళ్లిలు, మనసులు కలబోసుకుని  సాగించే మనుగడలు, అందాలు, ఆనందాలు, చమత్కారపూరిత సంభాషణలు  వీటన్నిటితో  నిండి కన్నుల  పండువగా సాక్షత్కరించే పెళ్లి పందిరిలాంటి చైతన్యవంతమైన  ఆంధ్ర సాంస్కృతిక జీవనాన్ని తమ కథావస్తువుగా స్వీకరించారు  శాస్త్రిగారు.   కథకు ఎన్నుకున్న ఇతివృత్తాన్ని, దానికి అనుగుణ్యమైన రీతిలో, ధోరణిలో,సమర్ధవంతంగా, కళాత్మకంగా, రసవత్తరంగా ఆవిష్కరించే  రచనా శిల్ప కౌశలం అయన స్వంతం.

కథ ఖండకావ్యంలా సాగిపోవాలని బుచ్చిబాబుగారు చెప్పినట్లు ఇంద్రగంటివారి  కథలు ప్రతీకలు, ఉపమానాలు యిలా  సర్వాలంకార  సుశోభిత నవవధువుతో, శరత్కాలపు  వెన్నెలలో  నదిలో పడవ ప్రయాణంలా, ఒక కమనీయ కావ్యంలా, ఒక మనోజ్ఞమైన మధుర గీతంలా  సాగిపోతాయి.  బ్రతుకుని ఖండఖండాలుగా చేసి చూడకుండా, సమగ్రమూ, సరళ సుందరమూ రసప్లావితమూ అయిన జీవితా–  వరణంలో మంద మంజుల  మలయానిల వీచికలతో  తాదాత్మ్యం  చెందారు శాస్త్రిగారు.   జీవితంలోని పేదరికం,లేమి,ఆకలి, దారిద్ర్యం, నిరాశ, నిస్పృహ, నిస్సహాయత, నిర్వేదంతో  కూడిన చేదు నిజాల్ని, చీకటి బ్రతుకుభారాన్ని కూడా తన కథలలో అయన చిత్రించారు.  ‘ఆకలి  మంటలు’, ‘చీకటి బ్రతుకులు’, ‘వెలుగు నీడలు’, ‘ఎండ మావులు’  అటువంటి అధోజగతి  వ్యధార్థ  జీవుల యధార్థ   జీవన గాథలు.

తన  కథలలో కొన్నింటిని సమాజంలో పేరుకుపోయిన కుళ్ళును కెలికి ప్రజల దృష్టిలోకి తేవడానికి శాస్త్రిగారు ప్రయత్నించారు.  కొన్ని కథలు కేవలం శిల్పం కోసం వ్రాయబడినవి. ‘స్వర్ణయోగం’, ‘కళాభాయి’,’యతిప్రాస మహాసభ’ వంటి కథలు పూర్తిగా వ్యంగ్యాత్మకాలు.  దాదాపు అన్ని కథలలోనూ సమజంలోని విపరీతపు తీరుతెన్నులుపై విసురులు కనిపిస్తుంటాయి.  ప్రత్యేక  ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతున్న సమయంలో తెలుగువాళ్ళు అందరు ఏకమై సీమల ఎల్లలు సమసిపోయి, ఒకే భాషలో, ఒకే కందంతో మాట్లాడాలని ఒకే సాంప్రదాయ, అభ్యుదయ  సాహిత్యానురాగబంధంతో అలరారాలానే రచయిత మహత్వపూర్ణ  ఆకాంక్ష ‘కల నిజమయింది’ కథ.

నీళ్ళను  కథావస్తువుగా  తీసుకొని పెద్దిభొట్ల సుబ్బరామయ్య, కాళీపట్నం రామారావు, కొండముది  శ్రీ రామచంద్రమూర్తి గారులు అద్భుతమైన కథలు వ్రాసారు.  నీటి కొరతను కరువు ప్రాంతపువారి పాలిటి శాపంగా పెద్దిభొట్ల చిత్రిస్తే, వర్గ పోరాటానికి అనువైన ఉపకరణంగా కాళీపట్నం స్వీకరించారు.   నిడు జీవితాల్ని బలిగొనే పాములా కొండముది చిత్రించారు.  ఎండ మావులైన    నీళ్ళు ప్రజల కనీళ్ళుగా, ప్రాణాలు నీళ్ళుగా మారి అందరి దాహాన్ని తీర్చిన తీరును గుండెను పిండేట్లుగా వర్ణించారు శాస్త్రిగారు, ‘ఎండ మావులు’ అనే కథలో.    ఒక జీవత విధానం గతించి మరో నూతన జీవిత విధానం ఉదయించబోతున్న సంధికాలంలో  ఇంద్రగంటివారు కలం పట్టి రచనలు చేయడం వలన అయన కథలలో  కాల్పనికవాద భావ కవిత్వపు నీడలు,       అభ్యుదయవాద చ్చాయలు రెండూ ఒకేసారి, వేరుగా మరోసారి, కలగాపులగంగా, దృశ్యాద్రుశ్యంగా కూడా కనిపిస్తాయి.  సాంసారిక మధుర జీవవాహిని చిత్రణ లలితా సుందరంగా ఇంద్రగంటివారి కథలలో మనల్ని పలుకరిస్తుంది.

ఒక లోక విషయాన్నో, ఒక  సన్నివేశాన్నో, ఒక సంఘటననో, ఒక అనుభవాన్నో, ఒక పాత్రనో దేన్నో ఒక దాన్ని ఆధారం చేసుకొని కథను మనోజ్ఞంగా అత్యంత సమర్థవంతంగా నిర్వహించారు శాస్త్రిగారు.   దాంపత్య జీవితంలోకి  అనుమానం అనే నిప్పు రవ్వ ప్రవేశిస్తే, సుఖ శాంతులతో  సాగాల్సిన అ సంసారం            అసూయాద్వేషాలతో కాలి మసి అయిపోవాల్సిందే. పరపురుషుడుతో అతడు ప్రాణ స్నేహుతుడైనా సరే కాస్త ఆత్మీయంగానో, చనువుగానో  భార్య ఉంటే, భర్తలో అనుమాన బీజం మొలకెత్తి, కలుపు మొక్కగా ఎదిగి, అ కాపురంలో చిచ్చురేపి, సంసార  నందనోద్యనాన్ని సర్వ నాశనం చేస్తుంది.  నాగరికతతో బాటు అవగాహనా శక్తి, హృదయ వైశాల్యం లేకపోతే సంభవించే విపత్తు ఇది.

ఈ విషయాన్ని వస్తువుగా తీసుకొని, సున్నితమైన  సమస్యను శృతి మించకుండా, ఎంతో నిర్భారతతోను , హూందాతనంతోను, ఉదాత్తమైన భావంతోనూ ‘విజయదశమి’ కథ ద్వారా ఇంద్రగంటివారు దంపతులకు చక్కని హితబోధ చేశారు. “అతను లావుగా పొట్టిగా పాకెట్  దిక్షనరిలా ఉన్నాడు,” అంటూ ఈ కథలో పాత్రని వ్యంగ్య హాస్య ధోరణిలో వర్ణిస్తూ, సంక్షిప్తత సాధించడంకోసం శాస్త్రిగారు కవితా హ్రస్వలిపిని ప్రయోగించారు. “మగ దూది గుట్టలకి స్త్రీ నిపురవ్వ గాబోలు!   యిట్టే అంటుకుపోతాయి.  అక్కడ  ఉన్న కారణం అల్లా ఒకటే,  అది పూలజడ.  రామాయణ  భారతాల వెనక ఉన్న కీలకం ఇంకేమిటి?” అంటారు శాస్త్రిగారు.

ఇంద్రగంటివారి కథలలో చాలా మట్టుకు స్త్రీలు  ఉదాత్తంగా, ధీరో దాత్తంగామ దృడమైన వ్యక్తిత్వం,స్వాభిమానం, ప్రేమ ఉన్న నిండు మనుషులుగా సాక్ష్త్కరిస్తారు.  నలిగిపోయిన పురుషులని ఓదార్చడానికి, సేద దీర్చడానికి ఎన్ని యుగాలనుంచో భగవంతుడు స్త్రీ హృదయం అనుగ్రహించాడు.   పురుషుడి  మిథ్యా పౌరుషం, అహంకారం, తెచ్చిపెట్టుకున్న కరుకుతనం  అన్నీ స్త్రీ సన్నిధానంలో సూర్య రశ్మిలో మంచులా, వేడి తగిలిన వెన్నలా ద్రవించి పోతాయి అంటారు శాస్త్రిగారు “మౌనసుందరి” కథలో. మానవుడు సుఖమైన కాలాక్షేపానికి మెదడులో కల్పించుకొన్న జాడ్యం  ప్రేమ!   ఇంద్రియం ఉన్నదానికి ఎంత చక్కని పేరు ! తత్వవేత్తలు  వాసనారహితం గొప్ప స్థితి అంటారు.

మనసులో మెదలిన మధురానుభూతి శిల్పసుందరికి  సుషుప్తావస్థలో  ఒక సజీవ ఆకృతినిస్తే, సృష్టిలో ప్రతి అణువు ఆనందకరంగా, సౌందర్యభరితంగా కనిపిస్తుంది.   ఇష్ట పడటం కన్నా ద్వేషించడం అన్న దానికే కారణాలు ఉన్న వ్యక్తి సానుభూతితో సన్నిహితుడైతే, అతని ఔదార్యం, స్నేహ సౌరభంలో నస్తికుడైన కథాకుడుకి దైవ దర్శనం అవుతుంది “మౌనసుందరి” కథలో.  మానవ  జీవితమన్నా ఆశాభంగము అన్నా ఒకటే అర్థం అనే “అందని ఆశలు” కథలో ఆశలు ద్వంసమై పోయాక, కథకుడు “దగ్ధ హృదయాలకు ఆవంత ఊరటను ఈ షున్మాదుర్యాన్ని దయతో అందించే రసవదఅవస్థ ఏదన్నా ఉంటుందేమో” నని  అనుకుంటాడు.

హృదయమంతా  నివాళిగా పట్టి ప్రేమించిన ప్రియురాలు శర్వాణి మరొకరి ఇల్లాలుగా హఠాత్తుగా  దర్శనమిచ్చినప్పుడు రంగు రంగుల ఇంద్రధనస్సు సౌందర్యం తన చేతికి చిక్కిందని, అ వసంత లావణ్యాన్ని  తన గుండెలకు హత్తుకుందామని “అందని ఆశలు” లోని కధకుడు తలిస్తే, అతని ఉద్దేశాన్ని గ్రహించి ఆమె దూరంగా జరిగి సానుభూతితో ” మిమ్మల్ని నేను అపార్థం  చేసుకోను.   నాలోనూ ఉంది జ్వాల.   కాని ఈ శరీరం ఇంకొకరిది. హృదయం ఎప్పుడూ మీది.   దీని  కృతజ్ఞాతకు  మీరు పాత్రులు ,” అంటుంది.   వసంత  శోభ, శరత్కాలపు కౌముది ఎప్పటికైనా తిరిగి వస్తాయి  గాని జీవితంలోంచి  వెళ్లి పోయిన  ప్రియురాలు మరొకరి ఇల్లాలుగా ఎదురుపడటం కేవలం  యాదృచ్చికమైన సంఘటన.  ఇటువంటి సంఘటన ఆధారంగా రూపొందిన కథ “శర్వాణి “లో కథకుడుకి తన ఆరాధ్యదేవత, శర్వాణి ఒక రైలు ప్రయాణంలో కనబడి అతని మానసిక  పరిధిలో తుఫాను లేపి చిన్ననాటి స్మృతులను కెలుకుతుంది.

ఆమె  కంటబడటం ఇష్టం లేని అతడు విజయవాడ స్టేషనులో బండి ఆగగానే దిగి ఒక హోటల్  గదిలో బస చేస్తాడు.  తనకు ఆప్తుడైన అతణ్ణి కలుసుకొని స్నేహపూర్వకంగా మాట్లాడాలని ఆమె కూడా అక్కడే భర్తతో సహా దిగి, అదే హోటల్లో బస చేసి,  అతని  గది తలుపు తోసుకొని లోనికొస్తుంది. “జీవితం అంటేనే రంగుల కల.  ఈ దాంపత్యాలు, స్నేహాలు, విరహాలు,ఈర్ష్యలు  దేన్నీ శాశ్వతంగా తీసుకోనక్కర్లేదు.  ఈ విశ్వమే నమ్మేలా కనబడే అసత్య సుందర ఇంద్రజాలం.  ఎవరు ఎవరికి మనస్సు విప్పుతున్నారు? ” అంటుంది.   మనస్సు నిర్మలంగా ఉంటే ముఖం స్వచ్చంగా శారదాకాశంలా ఉంటుంది.  మనవ జీవతమంటే ప్రేమతోను బాధలతోనూ నవ్విన ఒక  పెద్ద నవ్వు అనే  తాత్త్విక దృష్టి  అలవర్చుకుంటే  జీవితం సాఫీగా సాగిపోతుందనే ధ్వని ఉంది.

ప్రేమకు ద్వేషానికి ఎంత దగ్గర సంబంధం!  రెండు ఒకే చోట  కలిసి  మెలిసి  ఉండటం నిప్పు నీరులా ఎంత అసహజం!   మబ్బు గుండెను  మండిస్త్తూ  మెరుపు అక్కడే ఉంటుంది.   ఎప్పుడూ ఎడతెగని ఘర్షణ, ఉరుములు!   అది ప్రేమా?   ద్వేషమా?  అనే తాత్విక జిజ్ఞాసను రేకెత్తిస్తుంది “నిప్పునుంచి  నీరు” అనే కథ.

లోకంలోని కల్మషానికి దూషణ, భూషనలకు  అతీతంగా ఎంత దుర్భేధ్యమైన పరిధుల్ని నిర్మించుకునా,  ఈ అందమైన ప్రపంచంపై  మోజు  తీరితేగాని,స్వర్గ ద్వారాలు తెరుచుకోవని కవికి మహోజ్జ్వ్లల  దేవతామూర్తులు ముగ్గురు కలలో కనబడి చేసిన హితబోధ “స్వర్గద్వారాలు” కథ భాషా సౌందర్యంతో వెలిగిపోతోంది.  సంఘటనా ప్రధానమైన  “వివాహ మంగళం” మరియు “6 వ నెంబర్ గది” కథలు సున్నితమైన శృంగార పరిమళ మంద  పవన  వీచికలు.

“పెళ్ల్లి పందిట్లో ఆడుగు పెట్టిసరికి చల్లని కొత్త తాటాకుల వాసన, ఇంట్లో అడుగు పెడ్తే వడివడిగా తిరిగే శృంగారవతుల జడలలోని మరువం వాసన.   నట్టింటిలో తివాసీలపై పిల్లలు ఒలకబోసిన పన్నీటి మంచిగంధం వాసన–పెరట్లో గాడి పోయ్య దగ్గర కొత్త చాపల మీద రాసులుగా గుమ్మరించిన ఉడికిన కూరల వాసన– కళాయీలో పడుచు హృదయంలో ప్రేమలా తెగమరిగే తియ్యని సంతర్పణ పులుసు వాసన –మొత్తం మీద పెళ్ళే ఎంత సువాసన”, అంటూ అలనాటి తెలుగువారింటి అద్భుతమైన  పెళ్లి వాతావరణాన్ని మనోవీధిలో మనోజ్ఞంగా ఆవిష్కరింప జేస్తుంది  “వివాహ మంగళం” కథ.   ఒక మధ్య తరగతి  కుటుంబీకుడి కళ్ళతో ప్రయాణ సన్నాహాన్ని,పెళ్లి  వేడుకలో ముచ్చట్లని, రసవద్ఘట్టాలని, చివరికి  విడిది  గదిలో అనుకోకుండా ఒక శృంగార విలాసవతితో సరస సమాగమంలో తెల్ల గులాబీ తలనూనె తీవ్ర పరిమళం కొసమెరుపుగా మెరిపిస్తుంది ఈ కథ.

ఇబ్బందికర పరిస్థితి  ఆకస్మికంగా ఎదురైనప్పుడు సమయస్పూర్తితో దానిలోనుంచి బైటపడే మార్గం కనుగొనడంలో,దానిని తమకు  అనుకూలంగా మలుచోకోవడంలో పురుషులు కన్నా స్త్రీలు నేర్పరులు అనే నిజం నిరూపణ “6 వ నెంబర్ గది” కథ.  గణేశం అనే  ఇన్సూరెన్సు ఏజెంట్  రాత్రి నిద్రమత్తులో, పొరపాటున   తనదనుకొని పక్క గదిలోకి ప్రవేశిస్తాడు.  అప్పుడు అ గదిలో ఒక అందమైన యువతి భర్త కోసం ఎదురు చూస్తూ పక్క సర్దుతూ ఉంటుంది. భర్త వస్తున్న అలికిడి విని ఏమాత్రం తడబాటు లేకుండా, పక్క వేస్తుంటే  మాయదారి తేలు కస్సుక్కున తన వేలును కాటేస్తే, బాధతో తను వేసిన కేక విని ఆగంతకుడు ఆపద్భాన్దవుడులా వచ్చి మంత్రించి  ఆ నొప్పి తగ్గించాడు అంటుంది.  ఆమె ఆడిన నాటకం తనని కాపాడటమే కాక తేలుకుట్టిన దొంగలా ఏమి చేయాలో తెలియని గణేశాన్ని రక్షించడం, భర్తకి అతనిపట్ల కృతజ్ఞత కలిగేటట్లు చేయడం విశేషం.

దుర్భర    దారిద్ర్యం  మనుషులచేత ముఖ్యంగా స్త్రీల విషయంలో మాన మర్యాదలు  మంటగలిపే నికృష్టపు పనులు ఎలా  చేయిస్తుందో చెప్తూ, పట్టెడు మెతుకుల కోసం ఆ  ముదనష్టపు  జీవులు తమ బ్రతుకుల్ని దిగజార్చుకొన్నతీరును వర్ణిస్తాయి  “ఆకలి మంటలు”, “చీకటి బ్రతుకులు”, “వెలుగు నీడలు”కథలు.  “ఆకలి మంటలు” కథలో ఎగిసే ఆకలి మంటని చల్లార్చి ప్రాణం నిలుపుకోడానికి, ముష్టి  యువతి ఇల్లిలూ తిరిగి విసిగి వేసారి చివరికి రెండు రొట్టెలు టీ కోసం టీ కొట్టు యజమాని  యిషేక్  సాయిబు  ఆకలిని కూడా తన శరీరంతో  చల్లార్చింది.   జీవనోపాధి కోసం గతిలేక పడుపు  వృత్తిలో కొనసాగుతున్న ఒక  వార వనిత కటిక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతూ అవస్థపడుతున్నా అభిమానవతి  అని చెప్తుంది “చీకటి బ్రతుకులు” కథ.  బుద్ధి ఎరిగినప్పటినుంచి  ఈసడింపులు, అవమానాలు  మాత్రమే  చవి చూసిన సన్నాసి,ఆకలితో  కడుపుమండి పోతుంటే అర్ధరాత్రి మెళుకువ వచ్చిన ఎరుకల పిల్ల నీలాలు, ఈ ఇద్దరినీ  దగ్గర చేస్తుంది దొంగిలించి పంచుకున్న ఒక మిఠాయి ఉండ “వెలుగు నీడలు” కథలో.   స్వార్ధ వలయాన్ని చీల్చి  నిజమైన మనస్సు తెరచి  మానవత్వం చూపితే మనుషులు ఎంత దగ్గర అవుతారు !   కాని ఈ విషయాన్ని నమ్మక  పోవటమే నేటి నాగరికతలోని కీలకాంశం.

‘ధైర్య సాహసే లక్ష్మీ’ అనే సూక్తిని అనుసరించి, మోసగాళ్ళు, పురుషాధిక్యత ప్రదర్శించే  వారిపై స్త్రీశక్తి   విరుచుకు  పడడం “ప్రేమ దొంగలు”, ” దౌర్జన్యం”, “దొంగాలోస్తున్నారు జాగ్రత్త”,  కథలలోని ఇతివృత్తం.   మనసిచ్చిన మగాడే మోసగాడైతే, సమస్త  మగజాతి పైన నమ్మకాన్ని కోల్పోతుంది “ప్రేమ దొంగలు” కథలోని అందమైన అమాయకమైన  పల్లెపడుచు  చంద్రమ్మ. తన దురదృష్టానికి కుములిపోక ధైర్యంగా బ్రతుకు బాటను వెతుక్కుంటూ ఆ  మోసగాడ్ని విడిచి తన చంటిపిల్లను తీసుకొని వెళ్లి పోతుంది. కుల మత మౌడ్యం, చ్చాందసం మొదలైన భావాల  నిరసన — మానవత్వం,స్నేహ సౌశీల్యం గోప్పవనే  భావన ఉద్దీపన  “దౌర్జన్యం” కథ.  ఈ కథలో సరస్వతి అనే చదువుకున్న అభుదయ  దృక్పథం గల అమ్మాయి  సనాతనుడు, చ్చాందసుడు అయిన అన్నగారిని  ధిక్కరించి మానవతామూర్తి, స్నేహశీలిఅయిన  క్రిస్టియన్  యువకుడు జోసఫ్తో   జీవితం పంచుకోడానికి వెళ్ళిపోతుంది.

స్త్రీ యౌవ్వన విలాసాలకు గుండె  చెదిరి, ప్రేమ అనుకోని ఆత్మవంచన  చేసుకొని  ఏ అమాయకురాలైనా  దొరికితే ద్రోహం చేసి దాహం తీర్చుకొని, తమ దారిన పోయే మొగజాతి  నీచ బుద్ధిని గడ్డి కరిపించి నేలరాసే గుణపాఠం “దొంగలున్నారు జాగ్రత్త” కథ. అలనాటి అమాయక శకుంతల మాయదారి దుష్యంతుని దొంగ ప్రేమ వలలో పడినట్లు గాక, ఈ కథలో ఆధునిక శకుంతల రాజారావు అనే యువకుడు తన మీద ప్రేమ వల విసరడానికి ప్రయత్నిస్తే, అతను ప్రేమలేఖ గాలానికి  చిక్కుకుని విలవిలలాడే చేపపిల్లని కానని తగిన రీతిలో అతనికి బుద్ధి  చెప్తుంది.

నిరుపేద అయిన కళాజీవి విదర్భదేశ  శిల్పి చంద్రమౌళి.  సిరిసంపదలతో తులతూగే  మాళవదేశ నరేశుడు  కళాభిమాని  అయిన మాహారాజు.   ఒక వైపు కళాకారుడు, మరో వైపు కళా  పోషకుడు.   రెండు దూర మానవ హృదయాలను దగ్గరగా చేర్చి, ఇతోధికంగా ఆ కళాజీవికి మేలు  చేకూర్చే శక్తి, లోకోత్తరమైన శిల్పకళకు లేదనే  నిష్ఠురమైన నిజాన్ని వివరిస్తుంది  “తలవంచని పూలు” కథ.  సాంప్రదాయ నందనోద్యానంలో పూచినవి  ఈ పువ్వులు.   చంద్రమౌళి తన నైపుణ్యంతో  ఏనుగుదంతంతో  చేసిన  పూలమాలను మాహరాజుకు కానుకగా సమర్పించదల్చాడు.   మాహారాజు మెచ్చుకొని ఇచ్చే విలువైన బహుమతితో భార్యను, చిన్నారి కూతురును  సంతోష పెట్టలనుకున్నాడు.  కాని అతనికి  రాజదర్శనం     లభించలేదు. రాజును చేరవలసిన పూలమాల రావిచెట్టు మొదట్లో ధ్యానముద్రలోనున్న బుద్ధ దేవుని పాదాల చెంత చేరింది.  ఇహికమైన సుఖంకోసం అధికార దర్పానికి తలవంచడంకంటే,  దయామయుడైన బుద్ధ దేవుని సేవిస్తే  మోక్షం లభిస్తుంది అనే ధ్వని ఉంది.

మనుషల   వేషభాషలను చూసి మోసపోవడం అనే ఇతివృత్తంతో  రూపొందిన హాస్య వ్యంగాత్మక  కథలు “బస్సులో” మరియు “స్వర్ణయాగం”.  రెండు కథలుకు  సంఘటనలు  ఆధారం.  “బస్సులో” కథలో ఒక గజదొంగ జైలునుంచి  తప్పించుకొని బస్సు ప్రయాణంలో ఒక యువకుడుకి  కూర్చోడానికి తన సీటులో సగం స్థలం ఇచ్చి అతనితో కబుర్లు చెబుతూ  అతని యాభై రూపాయలున్నపర్సు తస్కరించి

బస్సు ఆగినప్పుడు దిగి చక్కా పోతాడు.   “స్వర్ణయాగం” కథలో ఒక బైరాగి యాగం చేసి బంగారం తయారు చస్తానని ఊరిలోని జామిందారుని  మోసం చేసి తెల్లవారేసరికి కాంతా కనకంతో పరారి అవుతాడు.  కపట సన్యాసుల మీద దొంగ బైరాగుల మీద వారి మాయ మాటల్ని నమ్మేవారి మీద విసుర్లు ఈ కథలలో కనిపిస్తాయి.

సాంప్రదాయ  కాల్పనిక భావ కవిత్వ భాషా సౌందర్యం, సౌమ్య భావ లాలిత్యం,ఊహ మాధుర్యం మొదలైన ప్రతిభా పాటవాలతో పునీతమై, అభ్యుదయ జీవిత  వాస్తవికతతో  ఓతప్రోతమైనది ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారి హరివిల్లు రంగులు వెదజల్లే రశ్మిమంతమైన రచనాశిల్పం.   ఇతివృత్త  పరికల్పనలో,   కథను  ఎత్తుకోవడంలో, సన్నివేశాన్ని,సంఘటనని  కల్పించడంలో, పాత్రను తీర్చి దిద్దడంలో,పాత్రలకు సంఘటనలకు మధ్య  అనుసంధాన  సంయమనం సాధించడంలో, పూలు గుచ్చి మాల అల్లినట్లు సంఘటనలను ఒక చోట చేర్చడం, చదరంగంలో పావులను కదిపినట్లు కథలలో పాత్రలను వ్యూహాత్మకంగా జీవిత చదరంగంలో నడపడం మొదలైన  మెలుకువలు శాస్త్రిగారికి కరతలామలకాలు.

 

======================================================

             { 29. 08.2011 నుండి  29.08.2012 వరకు ఇంద్రగంటి హనుమచ్చాస్త్రిగారి శత జయంతి సందర్భంగా నివాళి }

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *