March 29, 2024

ఔను ….నేను కూడా మామూలు మనిషినే

రచన : తన్నీరు శశి

 

”ఏమి వెళతారు లోపలికి….రండి టీ తాగి వెళుదురు.”

పిలిచింది పక్కింటి ప్రేమ.ఉదయాన్నే వరండాలో పడిన పేపర్ కోసం వచ్చాను లేచి.

ఆదివారం కాబట్టి పిలిచింది ఇలాంటి ఆప్యాయతలకు లొంగి ఈ కాంప్లెక్స్ వదలలేకున్నాను.

”లేదు…లేదు …ఈ రోజు ఒకామెను రమ్మన్నాను ఇల్లు శుభ్రం చెయ్యటానికి

ఆమె వచ్చే లోపల వంట చెయ్యాలి”చెప్పాను.

”అవునా యెంత ఇస్తాను అన్నారు డబ్బులు?”

”ఎక్కడ దొరుకుతున్నారండి  పని వాళ్ళు?.ఈమె ఏదో ఆకుకూరలు అమ్ముతూ ఇంటికి వచ్చింది.పని వాళ్ళు కావాలంటే ,రోజు కూలి ఇస్తే తనే వస్తాను అంది,సరే రమ్మన్నాను”అన్నాను.

ఈ లోపల టీ తీసుకొని వచ్చింది.వద్దు అనలేని బలహీనత మంచు కమ్మేసినట్లు లొంగదీసుకొని….కొంచం స్పృహ వచ్చేసరికి చేతిలో వేడిగా టీ కప్పు….ఇంక పని అయినట్లే.

”మీరు మరీ అమాయకులండి(నిజమే సుమీ)

రోజు కూలి అంటే యెంత ఇస్తున్నారు?”అడిగింది.

”యెంత అంటే రెండు వందలు ”

”రెండు వందలా?బాబోయ్ …మీ అమాయకత్వంతో ఆడుకుంది.రోజు కూలి నూట యాబై రూపాయలే” వివరంగా అరటిపండు చేతిలో పెట్టినట్లు చెపింది.

వినగానే మొహం ఉదయాన్నే సూర్యున్ని చూసిన కలువలాగా వాడిపోయింది నాకు”నిజమా…అయ్యో …సరేలే ప్రేమా..పని వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు….అదీ కాక బతికి చెడ్డ మనిషి లాగా ఉంది.ఎక్కడ పని చెయ్యదు లాగా ఉంది.రెండు వందలకు ఆశ పడి వస్తూ ఉంది. మాట ఇచ్చేస్తిని .ఇంకేమి చేస్తాము”

దిగులుగా చెప్పి లోపలి వెళ్లాను.

చేతిలో డబ్బులు అవి యెంత అయినా కాని వృధాగా పొతే యెంత బాధ.”ఎలాగైనా ఆ డబ్బులకు సారి పొయ్యే పని ఎక్కువ చేయించుకోవాలి” మనసులో గట్టిగా అనుకున్నాను.

ఇంతలో వాణి వచ్చింది ”రా …రా…నీకోసమే ఎదురు చూస్తున్నాను. రోజు కూలి అడిగితివి ఇంత లేట్ గా వస్తే ఎలా” అడిగాను పై చెయ్యి నాదనే దర్పం తో . .

”లేదమ్మా ఇంటికి వెళ్లి అన్నం తిని వస్తున్నా …ఇంక వెళ్ళకుండా పని చెయ్య వచ్చు అని”

ఎప్పుడూ మాటలు పడిన మనిషి కాదు కాబోలు …..కళ్ళలో కొంచం బాధ మబ్బేసిన చందమామ కాంతి లేకుండా పోయినట్లు……

ఏ మాటకు ఆ మాటే చెప్పుకవాలి….చాలా బాగా సామాన్లు అన్ని తీసి ఒక్కోటి శుభ్రంగా తుడుస్తూ ఉంది.సరే నేను మాట మంతీ   చెపుతూ కూర్చున్నాను.

అలాగైతేనే ఈ పని వాళ్ళు బాగా పని చేస్తారు.ఎక్కువ డబ్బులు ఇస్తున్నా ఎక్కువ పని చేయించుకోవాల్సిందే కదా….

”ఏమి వాణి ఏ ఊరు మీది ”చెప్పింది ”ఓహో దగ్గరే అన్న మాట”

అదిగో ఆ బ్యాగులు, డబ్బాలు  అన్నీ పాతవి శుభ్రం  చేసి  సర్దు”పురమాయించాను..

అటక పై నుండి అన్నీ దించ సాగింది.ఎన్ని రోజులు అయిందో శుభ్రం  చేసి.

ఒకటే దుమ్ము…ఒకటే తుమ్ములు…నేను బయటకు వచ్చేసాను.

లోపల తుమ్ముతూ,దగ్గుతూ అన్నీ దించింది.బయట పెట్టుకొని తుడవసాగింది.

మళ్ళీ  కూర్చొని అన్నీ తుడుస్తూ ఉంది

”పిల్లలు యెంత మంది ?

మీ ఆయన ఏమి చేస్తుంటాడు”అడిగాను.

తన కన్నీళ్ళలో కన్నటి చెలమ….మెల్లిగా ఊరుతూ…

”లేదమ్మా పోయిన ఏడాది చచ్చిపోయిండు” కారణం అడుగుదాము అనుకున్నాను….అయినా ఏముంటాయి పెద్ద కారణాలు వీళ్ళకి తాగుడు తప్ప.అయినా ఆడ మనసుకు జాలి అనిపించింది.

ఇదిగో ఈ బ్యాగ్ లు నువ్వే తీసుకో పాతవి ఇచ్చేశాను.

(నేను కాబట్టి ఇంత డబ్బులు ఇచ్చి బ్యాగ్ లు కూడా ఇచ్చాను. గర్వంగా అనిపించింది)

బాబోయ్ ఇప్పుడు ఏడుస్తూ పని లేట్ చేస్తుందేమో…..

‘సరే…సరే పిల్లలు ఎందరు?””ఇద్దరు….ఇద్దరు ఆడపిల్లలు.

పెద్ద దానికి పెళ్లి అయిపొయింది.చిన్నది ఏదో తరగతి”చెప్పింది.

ఇది చూస్తె చిన్న వయసుగా ఉంది…..బాగా నీట్ గా తయారు అయ్యి వచ్చింది. మొగుడుపోతే ఇలాగేనా  ఉండటం.పిల్లకు పెళ్లి అయింది అని చెపుతుంది…..

”యెంత వయసు పిల్లలకు ”ఆసక్తిగా అడిగాను.

ఇదిగో ఈ బట్టలు మడత పెట్టి సర్దు అని పాట బట్టలు కుప్ప ముందు వేశాను….ఇంత డబ్బులు ఇచ్చి పని చేయించుకోక పొతే ఎలా?

(ఇయ్యేమి పాత బట్టలో.ఒక అలమారుకు సరిపోతాయి…అన్ని వందలు,వందలు పోసి కొన్నవి…ఈ పిల్లలు ఏమో పట్టటం లేదంటారు.చూస్తూ ఒకరికి ఇవ్వాలంటే ప్రాణం ఉసూరుమంటూ ఉంటుంది .అలా అని ఉంచుకొంటే స్ధలం అంతా  వాటికే సరి పోతుంది)

వాణి చెపుతూ ఉంది.పెద్ద దానికి పద్నాలుగు, చిన్నదానికి పన్నెండు.

”మరి పెద్దదానికి పెళ్లి చేసావా?ఇంత చిన్న వయసులో?”

ఏమి ఆలోచిస్తారు వీళ్ళు అంత చిన్న పాపకి పెళ్ళా?”

నా మనసు నీరు అయిపోతుంది.గుండెలో ఏదో భారం నొక్కుతూ ఉంది. మనసు మెల్లిగా కరిగిపోయింది.

”ఏమి చేస్తామక్కా…ఈయనకు బాగా లేకుండా ఉంది.రేపో మాపో చనిపోతున్నట్లున్నాడు. కనీసం బిడ్డ పెళ్లి చూసి చచ్చిపోతాడు అని చేసేసాను”

గుడ్లలో నీళ్ళు కక్కుతుంది…గుండ్ల కమ్మ లాగా ….

”ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం…అప్పుడు ఉండాలి తెలివి.ఇంతకీ ఆ బిడ్డ నీ దగ్గర ఉందా?”అడిగాను ఏమి వినాల్సి వస్తుందో అని బయపడుతూనే.

ఊహించినదే చెప్పింది.”ఆరు నెలల క్రితం పెద్దమ్మాయి అయింది.అందుకే కాపురానికి పంపేసాను”ఇంకా చెపుతూనే ఉంది.

నాకు ఒక్క సారి గుండె ఆగినట్లు అయింది.”కాపురానికా…అంత చిన్న పిల్లని”

”దాని మొగుడు మంచోడేనా ….ఏమి చేస్తాడు”

ఎలాగైనా ఆ బిడ్డ బాగుండాలి అని మనసు మెలిక తిప్పుతూ కోరుతూ ఉంది నాకు.

కట్టలు తెంచుకున్న దుఃఖం వరదలా ఉరికింది.

”లేదక్కా ….వాడు బెల్దారి పనికి పోతాడు,పది ఏళ్ళు పెద్ద దాని కంటే….రాత్రికి తాగటం,తన్నటం”వెక్కిళ్ళ మధ్య చెప్పింది.

యెంత ఘోరం….ఇప్పుడేమిటి చెయ్యటం ?ఎలాగోలా కొంత అయినా సహాయం చెయ్యాలి.

”ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడ ఉంది?”అడిగాను.

”ఆడే ఉంటె వాడి దెబ్బలకి చచ్చి పోద్ది అని  ఇంటికి తీసుకుని వచ్చాను.నా దగ్గరే ఉంది”చెప్పింది

కొంత సౌలభ్యం వాళ్లకి….మధ్య తరగతి వాళ్ళు లాగా చచ్చి పోయినా భర్త దగ్గర ఉండాలి అనరు.

”అందుకే నాకు వేరే దారి లేక కూరలు అమ్ముతున్నాను.ఇప్పుడు నువ్వు పిలిస్తే కూడా పిల్లలకి  బట్టలకైనా వస్తాయి అని వచ్చాను.నేను ఇలా శుబ్రంగా తయారు అయినా ఊర్లోవాళ్లకి బాధే. అయన బతికి ఉన్నప్పుడు ఇలాగా ఉండాలి అనేవాడు.అలాగే అలవాటు అయింది.మిగిలిన అందరు ఇప్పుడు నేను కూరలు అమ్మటం లేట్ అయినా చెవులు కోరుక్కుంటారు.ఇద్దరు ఆడ పిల్లలను కాపాడ లేక నన్ను నేను కాపాడుకోలేక అవస్త పడి పోతున్నాను”చెప్పింది.

”బాధ పడకు ఆ బట్టలన్నీ నువ్వే తీసుకుపో”చెప్పాను కరిగి నీరైన మానవత్వంతో.

అప్పటికి సగం పని అయింది.ఇంకా బయట కిటికీలు తుడవాలి. పొద్దు పోతుంది.పంపించాలంటే నాకు మనసు ఒప్పటం లేదు.

రెండొందలు ఇచ్చి పూర్తి పని చెయ్యక పొతే ఎలా?

”ఇదిగో వాణి మిగిలిన పని రేపు వచ్చి చెయ్యి….అప్పుడే బట్టలు తీసుకొని వెళ్ళొచ్చు  కాని”లోపల పెట్టేసాను.

దిగులుగా చూసింది…బట్టల వైపు చూస్తూ”రేపు కూడానా ?”

ఎవరు ఏమంటారో అనే భయం తన కళ్ళలో  రెపరెప లాడుతూ ఉంది.

”కనీసం డబ్బులు అయినా ఇయ్యక్కా…బియ్యం కొనుక్కొని వెళ్ళాలి”

(అమ్మో రేపు రాక పొతే మిగిలిన పని ఎవరు చేస్తారు….ఇచ్చేది లేదు )

అయినా లెక్క చెయ్యలేదు.

”అవును రావాల్సిందే….మిగిలిన పని పూర్తీ చెయ్యాల్సిందే,అప్పుడే ఇస్తాను డబ్బులు కూడా ”మౌనంగా  వెళ్లి పొయ్యింది…..దిగులుగా తల వంచుకొని.

 

నేను మాత్రం ఏమి చేస్తాను…నేను మీలాగే మామూలు మనిషినేగా…

 

6 thoughts on “ఔను ….నేను కూడా మామూలు మనిషినే

  1. .”మధ్య తరగతి వాళ్ళు లాగా చచ్చి పోయినా భర్త దగ్గర ఉండాలి అనరు.” చాలా కరెక్టు గా చెప్పారు. తాగినోడి దెబ్బలకంటే వాగినోడి మాటలకే మధ్యతరగతి జడిసేది. అయినా ఆత్మాభిమానం అంటూ ఒకటుండాలి కదండీ! మధ్య తరగతికైనా? దానికంటే ఆ ‘మద్య’ (మందు) తరగతోడిదే కరెక్టేమో!!!
    రాజా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *