June 25, 2024

జ్యోతి..

రచన : రసజ్ఞ

 

నిరాకారమయిన బ్రహ్మ జ్యోతి (అగ్ని) స్వరూపం. అందుకే జ్యోతి స్వరూపుడు, స్వయం ప్రకాశితుడు, అనంతుడు, ధనపతి, చైతన్యమయుడు అయిన అగ్ని ఈ సకల విశ్వానికి ఆరాధ్యుడయ్యాడు. ఈయన లేనిదే నాగరికతే లేదని చెప్పవచ్చు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు. శంకరుని అవతారమే అగ్ని అని శ్రీ శివ పురాణంలో చెప్పబడింది. ఋగ్వేదం ప్రకారం అగ్నిదేవుడు పరమాత్మ నోటి నుండి ఉద్భవించాడు. మన పురాణాలలో ఈయన అంగీరసుని పుత్రునిగా చెప్తారు. ఈయన భార్య స్వాహా దేవి, వాహనము తగరు, ఆయుధం శక్తి, నివాసము తేజోవతి. అగ్నికి స్పర్శ, శబ్ద, రూప అనెడి త్రిగుణాలున్నాయి. అగ్ని- భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, పాతాళము, జలము, సూర్య, ఔషధి, వనస్పతి, శరీరం ఇలా ఎక్కడయినా పరిభ్రమిస్తుంది. అగ్ని భక్తులకు విద్యుత్తు, అగ్ని, అజీర్తి, అకాల మరణముల భయము, మొ. ఏ కాలంలోనూ ఉండవు.  అగ్ని భక్షించిన ధూపదీప నైవేద్యాలు, పాలు, పెరుగు, నెయ్యి, చెఱుకు రసం, మొ. వానిని మాత్రమే స్వర్గములోని దేవతలందరూ కూడా స్వీకరిస్తున్నారని శ్రీ శివ పురాణములో చెప్పబడింది. “గుహా హితః గుహాయాం నిహితః” అన్నారు. “అంగీరసుడు” అనబడే మన పూర్వీకుడు మనుషుల అవసరాల కోసం అగ్నిని గుహలో దాచి ఉంచాడుట. అలా దానిని ఉపయోగించుకుని క్రమేణా క్రూర మృగాల నుంచి రక్షణగా కుటీరాన్ని ఏర్పాటు చేసుకునే జ్ఞానాన్ని మనిషి పెంచుకున్నాడుట. అందువలన అగ్ని ముఖ్య పాత్రని పోషిస్తుంది.

పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీభూతం అని మన పురాణాలలో వ్యవహరించారు. అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.

“సోమః ప్రధమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః
తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః”

అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు. “లావణ్యవాన్ గంధర్వః” అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. “అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను “అగ్ని సాక్షిగా” వరుడు స్వీకరిస్తాడు.

వాయుపురాణంలో అగ్ని జనన, అగ్ని వంశ సంబంధిత విషయాల ప్రస్తావన ఉంది. ఆ ప్రకారముగా స్వాయంభువ మన్వంతరంలో అగ్ని బ్రహ్మమానసపుత్రునిగా జన్మించాడు. ఈయన నుండి స్వాహా దేవి పుట్టింది. ఈవిడకి పావకుడు (అపవిత్ర వస్తువులన్నీ అగ్ని సోకితే పవిత్రం అవుతాయి కనుక అగ్నికి పావకుడు అనే పేరు వచ్చింది. ఈయననే పావమానుడు అని కూడా అంటారు), శౌరుడు, శుచి అనే ముగ్గురు పుత్రులు పుట్టారు. వీరిలో పావకునికి పుట్టిన అగ్ని సంరక్షకుడు, శుచికి జన్మించిన అగ్ని హవ్యవాహనుడు (ఇతను అగ్నిదేవతలకు, పితృదేవతలకు హవ్యాన్నీ, రాక్షసులకు హుతమును మోసుకుని వెళ్తాడు). అయితే ఇందులోనే, విద్యుత్తు సంబంధమయిన లౌకికాగ్నిని బ్రహ్మ తొలి పుత్రునిగా చెప్పబడింది. ఈయన పుత్రుని పేరు బ్రహ్మౌదవాగ్ని భరతుడు. నిర్మధుడు అని కవుల చేత వర్ణింప బడిన అగ్నే పావమానుడుగా చెప్పబడిన అగ్ని. ఈయననే గార్హపత్యాగ్ని (త్రేతాగ్నులలో ఒకటి) అని కూడా అంటారు. ఇతనికి హవ్యవాహనుడు అనే ఆహవనీయాగ్నీ, ప్రణీయమానుడు (కుండానికి తీసుకుని వెళ్ళేవాడు) అను ఇద్దరు కుమారులు. వీరిలో ఆహవనీయాగ్నిని శంస్యుడు అనీ, ప్రణీయమానుడుని శుక్రుడు అనీ అంటారు.  పదహారు నదులతో (గోదావరీ, కావేరీ, కృష్ణవేణీ, నర్మదా, యమునా, వితస్థ, చంద్రభాగ, ఇరావతి, విపాచ, కౌశిక, శతద్రు, సరయు, సీతా, సరస్వతీ, హ్రాదిని, పావని) ఈ శంస్యునికి పుట్టిన అగ్నులని ధిష్ణులు అంటారు. వీరిలో ముఖ్యమయిన అగ్నులు సమ్రాట్ (ఈ అగ్నిని ఎనిమిది మంది వేద పండితులు ఎల్లప్పుడూ ఉపాసిస్తూ ఉంటారు), పర్హతే (సమ్రాట్ క్రింద ఉంటుంది), అజైకపాద్ (ఉపాసించడానికి అనువయిన అగ్ని) లేదా అహిర్భుద్యగ్ని లేదా గృహపతి, క్రతుప్రహణం మరియు అగ్నీధ్రం. వీటిల్లో మళ్ళీ పర్హతే అనే అగ్ని నాలుగు అగ్నులు క్రింద చీలుతుంది. అవే బ్రహ్మజ్యోతి (బ్రహ్మ స్థానంలో ఉండే అగ్ని), హవ్యమః (యాగములలో కనిపించే అగ్ని), ఋతుధామం (జ్యోతిర్వంతమయిన అగ్ని) మరియు జౌదుంబరి (మేడి చెట్టులో ఉండే అగ్ని). ఈ విధముగా అగ్నులు చేసే ఒక్కో పని ప్రకారం ఒక్కో రూపంలో అవతరించాయని వాయు పురాణంలో ఉంది.

వీటన్నిటినీ ప్రక్కన పెడితే, అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువబడుతుంది. అవి:


క్రోధాగ్ని:
కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.

బడబాగ్ని: ఇది సముద్రము అడుగుభాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు. దీని జననం వెనుక చాలా కథలున్నాయి.

శ్రీ శివ పురాణం ప్రకారం, మన్మధుని దహనానంతరం కూడా శివుని మూడవ కన్ను నుండి పుట్టిన అగ్ని (క్రోధాగ్ని) అంతా వ్యాపించగా ముల్లోకాలలోని వారంతా భయభీతులై బ్రహ్మని శరణు కోరతారు. అప్పుడు ఆయన ఆ అగ్నిని స్థంబింపచేసి, ముల్లోకాలనూ దహించి వేయగల శక్తి ఉన్న ఆ క్రోధాగ్నిని సౌమ్యమయిన అగ్ని జ్వాలలను వెదజల్లే ముఖము కల బడబా (గుఱ్ఱము) అగ్నిగా మార్చి తానే స్వయముగా సముద్రునికి అప్పగిస్తాడు. అంత భయంకరమయిన అగ్నిని దాచుకున్న ఈ బడబము నోటి నుండి నిప్పులు క్రక్కుతోంది కావున దీనికి సముద్ర జలము మాత్రమే నిత్య భోజనముగా ప్రళయ కాలము దాకా సముద్రములోనే ఉండవలెనని అక్కడ ఉంచటం జరిగింది.

శ్రీ విష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారం, ఒకసారి భృగువులకు, హైహయులకు పెద్ద వైరము వచ్చి హైహయులు వెళ్ళి భృగువులు అందరినీ (గర్భములో ఉన్న పిండాలతో సహా) చంపేస్తారు. అప్పుడు భృగు మహర్షి దుఃఖించి మిక్కిలి తేజస్సు కల “అరుణుడు” అనే శిశువుని ఆయన గర్భమందు ధరిస్తారు. ప్రసవ సమయములో ఆ శిశువు ఆయన తొడను ఛేదించుకుని పుడతాడు. పుట్టిన వెంటనే హైహయులు భృగువులని చంపినప్పుడు దేవతలెవ్వరూ అడ్డుకోనందున దేవతలనందరినీ చంపుతానని కోపముతో బయలుదేరతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు బడబా ముఖదారి అయ్యి ఆ శిశువు శరీరము నుండి వెలువడి సముద్రము అంతర్భాగములోనికి వెళ్తాడు. అంటే దీని ప్రకారము కూడా క్రోధాగ్ని బడబా ముఖములోకి మారుట వలన బడబాగ్ని అయ్యింది.

శ్రీ పద్మ పురాణం ప్రకారం, బడబాగ్ని విష్ణువు ప్రతిరూపమయిన జువ్వి చెట్టు నుండి ఉద్భవించింది. ఆ బడబాగ్ని తాపాన్ని భరించలేని దేవతలు ఈ అగ్నిని సముద్రములోనికి తీసుకుని వెళ్ళి దాచమని సరస్వతీ దేవిని వేడుకుంటారు. బ్రహ్మ ఆజ్ఞానుసారం సరస్వతీ దేవి నది రూపములో ఆ చెట్టు వద్దకు వెళ్ళి విష్ణువు ఆశీర్వచనం చేత తను దహనం కాకుండా ఈ అగ్నిని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి సముద్రునిలో ఏకం చేస్తుంది. దీనిని బట్టి బడబాగ్ని అనేది ముందుగా భూమి మీద పుట్టి సముద్రములో చేరింది అని తెలుస్తోంది.

జఠరాగ్ని: ఇది ప్రతీ ప్రాణి ఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.

“అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం”

అని భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం నిత్యం భోజనం చేసే ముందు చదువుకుని తినటం ఒక అలవాటు. ఇక్కడ అహం అంటే పరమాత్మ, వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల (ఇవి నాలుగు రకాలు – జరాయుజాలు అనగా తల్లి గర్భం నుండి ఉద్భవించేవి, అండజాలు అనగా గ్రుడ్డు నుండి పుట్టేవి, స్వేదజాలు అనగా చెమట నుండి పుట్టేవి మరియు ఉద్భిజ్జములు అనగా భూమిని చీల్చుకుని పుట్టేవి) దేహములో (శరీరములో) ఉన్నాడు. అన్నం చతుర్విధం అన్నారు అంటే నాలుగు విధములయిన పదార్థాలు [అవేమనగా భక్ష్యం (కొరికి తినేవి), భోజ్యం (నమిలి తినేవి), లేహ్యం (నాకి తినేవి), చోష్యం (పులుసు, మొదలయినవి)] మన భోజనములో ఉంటూ ఉంటాయి. మనం తినే భోజనం జీర్ణమయ్యి మన ప్రాణాన్ని నిలపెడుతుంది. అంటే అగ్నిలో ఆహుతయ్యి ఆ అగ్ని (హవ్యా వాహనుడు) శరీరమంతా ప్రాణ వాయువు రూపములో వ్యాపిస్తుంది. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలమూత్ర శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. త్రాగిన వాటినీ, తిన్న వాటినీ రక్తముగా, పిత్తముగా, శ్లేష్మముగా మార్చి శరీరానికి సమానముగా అందించేది సమాన వాయువు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇటువంటి భోజనాన్ని మనలో ఉన్న వైశ్వానరుడు అనే అగ్నికి ఇచ్చే హవిస్సు క్రింద భావించాలి. అప్పుడే మనకి యజ్ఞం చేసినంత పుణ్య ఫలము లభించును. కనుక భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ హోమం చేస్తున్నంత శ్రద్ధగా తినాలి.

“బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా”

అన్నారు. అంటే హవిస్సు బ్రహ్మే, అగ్నీ బ్రహ్మే, హోత అనగా హోమం చేసేవాడూ బ్రహ్మే అన్నీ ఆయనే కనుక మనం చేసిన యజ్ఞం కాని, అన్నం కాని ఏదయినా సరే ఆ బ్రహ్మకే అర్పిస్తున్నాం అన్న భావనతో ఉండాలి. “సర్వం కల్విదం బ్రహ్మ” అన్నారు కదా! అందుకే “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటారు.

జ్ఞానాగ్ని: ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. “జ్ఞానాగ్నిః  సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం. ఈ అగ్ని మనకి ముఖ్యముగా రామాయణములో తారసపడుతుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తే ఈ జ్ఞానాగ్ని మనకి బోధపడుతుంది.

రావణ సంహారం తరువాత తన వద్దకు వస్తున్న సీతాదేవిని చూసిన రాముడు “దీపో నేత్రా తురస్యేవ ప్రతికూలాతి భామిని” అంటాడు. అంటే కళ్ళ జబ్బున్న వాళ్ళు ఏ విధముగా అయితే దీపాన్ని చూడలేరో అదే విధముగా నువ్వు నాకు ప్రతికూలముగా కనిపిస్తున్నావు కనుక నేను నిన్ను చూడలేకున్నాను అంటాడు. అప్పుడే చాలా స్పష్టముగా “బాలిశో పత కామాత్మా రామో దశరధాత్మజః చిర కాలాధ్యుషితాం సీతాం” (అంటే చాలా కాలం రావణుని వద్ద ఉన్న సీతని బాలిశుడై అనగా నీచుడై, కామాత్ముడైన రాముడు ఏలుకున్నాడు) అని లోకం అనుకుంటుందేమో అన్న కంటి జబ్బు నాది కానీ నీలో దోషం లేదు. కనుక లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఈ అయిదుగురిలో ఎవరి వద్దకు వెళతావో నువ్వే నిర్ణయించుకో అంటాడు. ఇది మన అందరికీ తెలిసిన బాహ్యార్థం. అంతరార్ధంలోకి వెళితే, సీతాదేవి జీవుడికీ, శ్రీరామచంద్రమూర్తి పరమాత్మకీ ప్రతీకలు. సీతాదేవి బంగారు లేడిని కోరటం వలన రాముడికి దూరమయ్యింది. అంటే జీవుడికి కోరికలు కలుగుట వలన పరమాత్మ నుండీ దూరమవుతాడు. ఇక్కడ ఉపనిషత్తులలో చెప్పబడిన ఒక చిన్న కథను చెప్పుకోవాలి. శరీరము అనే మామిడి చెట్టు మీద జీవ పక్షి, ఈశ్వర పక్షి ఉన్నాయిట. చెట్టు నిండా ఉన్న మామిడి పండ్లను చూసిన జీవ పక్షి తింటాను అంటే ఈశ్వర పక్షి వద్దని వారిస్తుందిట. అయినా వినకుండా జీవ పక్షి ఆ చెట్టుకి ఉన్న పండ్లన్నీ తినేస్తుందిట. తిన్నాక ఆ వనంలో ఉన్న మరొక చెట్టు, మరొక చెట్టు అలా తినాలి అన్న కోరిక వలన ఎన్నో చెట్లు మారుతూ ఈశ్వర పక్షికి దూరమవుతుంది. అదే విధముగా జీవుడు కూడా కోరికలని పెంచుకుంటూ ఎన్నో జన్మలెత్తుతూ పరమాత్మకి దూరమవుతున్నాడు. ఇలా దూరమయిన జీవుడు పంచభూతాలకి మాత్రమే వశమవుతాడు అది వివరించేందుకే అయిదుగురిలో ఎవరివద్దకన్నా వెళ్ళమంటాడు రాముడు. “బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే” అని భగవద్గీతలో చెప్పినట్టు అసలు నేను ఎవరిని? ఎక్కడ నుండి వచ్చాను అన్న జ్ఞానాన్ని తెచ్చుకున్నప్పుడు కైవల్యం పొంది పరమాత్మ వద్దకు తిరిగి చేరగలడు. ఈ జ్ఞానం సన్యాసాశ్రమంలో తురీయావస్థలో పొందగలరు. సన్యాసాశ్రమం లోకి ప్రవేశించే ముందు వీరి సర్వ కర్మలు, కోరికలు అన్నీ భస్మం చేయటం కోసం విరజా హోమం చేస్తారు. అదే విధముగా సీతాదేవి రూపములో ఉన్న జీవుడు, రాముని రూపములో ఉన్న పరమాత్మను చేరటానికి విరజా హోమమనే జ్ఞానాగ్నిలో అగ్ని ప్రవేశం చేసి, సర్వ కర్మలూ, కోరికలనూ భస్మం చేసి పరమాత్మ అయిన రాముని వద్దకు వచ్చింది అని అంతరార్థం. దీనిని స్వయముగా చేసి జనానికి చూపించటమే సీతమ్మ వారి అగ్ని ప్రవేశ ఘట్టంలోని ఆంతర్యం.

“మర్త్యావతారం త్విః మర్త్య శిక్షణం
రక్షోవధాయై న చ కేవలం విభోః”

అన్నారు. మర్త్యులు (మరణం కలిగిన వారు) అనగా మానవులు. శ్రీహరి మానవావతారం అయిన రామావతారంలో కేవలం రాక్షస సంహారం కోసమే కాక, మానవులు ఎలా క్రమశిక్షణలో ఉండాలి అని ఆయన నడిచి చూపించాడు. అందుకనే రాముడు నడిచినట్టు నడవాలి, కృష్ణుడు చెప్పినట్టు చెయ్యాలి అంటారు.

దావాగ్ని: ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వలన పుడుతుంది. ఎక్కువగా అడవులలో పుట్టడం వలన ఇది కలుగ చేసే నష్టం కూడా తీవ్రమయినది. యజ్ఞ యాగాదులకి ఉపయోగించేది కూడా దావాగ్నే. గుంటలు త్రవ్వి, అందులో కర్రలను పేర్చి, నిప్పును రగల్చి ఉంచేవారు. వీటినే గుండాలు అని అంటారు. మెల్లిగా వీటి నుంచే వాడుకని బట్టీ అగ్ని గుండాలు, హోమ గుండాలు వచ్చాయి.

ఎండు పుల్లల రాపిడితో పాటూ, కవ్వంతో మజ్జిగ చిలికినట్టు అరణిలో మధించి అగ్నిని పుట్టించేవారు. ఈ రకముగా తయారయినటువంటి, యజ్ఞ యాగాదులకి ఉపయోగించే అగ్ని మూడు రకాలు. అవి దక్షిణాగ్ని, ఆహవనీయం (ఆహుతులిచ్చేది), గారహపత్యం (గృహస్థాశ్రమంలో ఉన్నవారు చేసేది). ఈ మూడిటినీ కలిపి త్రేతాగ్నులు అంటారు. ఇది వరకు నిత్యాగ్నిహోత్రులు ఉండేవారు. అటువంటివారు ఈ త్రేతాగ్నులనీ ఖచ్చితముగా వెలిగించేవారు. యజ్ఞము వలన ఉద్భవించిన అగ్ని పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. సప్త జిహ్వాయనుడు (ఏడు నాలుకలు కలవాడు) అని ఈయన పేరుకి తగ్గట్టుగా హోమం చేసిన ఆహుతులని ఏడు నాలుకలతో ఈయన స్వీకరిస్తాడుట.

వజ్రాగ్ని: ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. దధీచి మహర్షి వెన్నుముక వజ్రాయుధం అని మనందరికీ తెలిసినదే. మన పురాణాల ప్రకారం ప్రప్రధమంగా నిప్పును కనుగొన్నది దధీచి మహర్షి. అందుకనే ఆయన గౌరవార్థం మన భారత ప్రభుత్వం ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది. మెరుపులు, పిడుగులు అగ్ని స్వరూపాలే కదా! మన పురాణాల ప్రకారం మెరుపు ఇంద్రుని వజ్రాయుధమనీ, పిడుగు వజ్రాయుధా ఘాతమనీ ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం వెన్నుముకకీ అగ్నికీ ఉన్న సంబంధం. మనిషి వెన్నెముక ఒక గొట్టంలా ఉంటుందనీ అందులో కొన్ని నాడులు ఉంటాయనీ మనకి తెలిసినదే. అయితే ఈ వెన్నెముక అనే గొట్టములో ఉండే ప్రధానమయిన నాడి సుషుమ్న నాడి. ఆ సుషుమ్న లోపల వజ్ర నాడి (దీనినే సూర్య నాడి అంటారు), ఈ వజ్ర నాడి లోపల చిత్ర నాడి (దీనినే చంద్ర నాడి అంటారు) ఉంటాయి. ఈ మూడు (సుషుమ్న, వజ్ర, చిత్ర) నాడులనీ కలిపి spinal cord అంటారు. వీటిలో సుషుమ్న నాడి ఎఱ్ఱగా అగ్ని లాగా ఉంటే, అందులో ఉండే వజ్ర నాడి వజ్రము వలే ప్రకాశముతో ఉంటుంది. ఆ ప్రకారముగా ఈ రెంటినీ కలిపి వజ్రాగ్ని అన్న వాడుక వచ్చింది. అలా వెన్నెముకలో వజ్రాగ్ని ఉంటుంది.

సూర్యాగ్ని
: సూర్యుని రూపములో కనిపించే అగ్నిని సూర్యాగ్ని అంటారు. దీనినే ఆదిత్యాగ్ని అని కూడా అంటారు. “అగ్ని సోమాత్మకం జగత్” అని తైత్తరీయోపనిషత్తులో చెప్పబడింది. అంటే ఈ ప్రపంచం మొత్తం అగ్నీ, చంద్రుల రూపములో ఉందనీ, ఈ అగ్నే సూర్యుని రూపములో ప్రకాశిస్తోందనీ అర్థం. శివ-శక్తులు, ప్రకృతి-పురుషులు, వెలుగు-నీడలు లాగానే సూర్య-చంద్రుల ప్రమేయం సృష్టి వికాసానికి మూలమన్నది వాస్తవం. ప్రశ్నోపనిషత్తులో “కర్మ సాక్షి”గా సూర్యుడిని ఎన్నుకున్నారు అని చెప్పబడింది. అందువలననే అగ్నిసాక్షిగా అని వాడినా సూర్యుని సాక్షి అన్న అర్థం అంతర్లీనంగా ఉంటుంది. ఆ విధముగా రక్షకునిగా, సృష్టి వికాస ప్రక్రియా ప్రేరకునిగా అగ్నిని సాక్షిగా నియమించారని తెలుస్తున్నది.

యోగాగ్ని: అంటే కేవలం యోగము లేదా ఆలోచన వలన పుట్టేది. ఈ యోగాగ్నిని సతీదేవి, దధీచి మహర్షి పుట్టించారు. దక్షయజ్ఞ సమయములో తనకి పరాభవం ఎదురయ్యిందని సతీదేవి బాధతో కన్నీటి చుక్కను వదిలి దానిని కాలి బ్రొటన వేలితో రాసినప్పుడు అగ్ని పుట్టి అందులో ఆవిడ దగ్ధమయ్యింది. అలానే దేవతల ఆయుధాలన్నీ కావాలన్నప్పుడు దధీచి మహర్షి యోగాగ్నిని పుట్టించి దగ్ధమయ్యి తన అవయవాలను ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే గొప్ప వాళ్ళు, మహా యోగులు వారి యోగా శక్తితో తలుచుకున్న వెంటనే అగ్నిని పుట్టించి వారి శరీరాన్ని వారే దగ్ధం చేసుకునేవారని తెలుస్తుంది.

ప్రేతాగ్ని: దీనినే స్మశానాగ్ని అని కూడా అంటారు. దీనిని తలుచుకోగానే నాకు రామాయణములోని ఒక ఉపమానం జ్ఞప్తికొస్తుంది. అదేమిటంటే స్మశానాగ్ని కూడా అగ్నే అయినా మంచి పనులకి ఎలా పనికి రాదో అదే విధముగా రావణుడు ఎంత తేజోసంపన్నుడైనా రాముని ముందు పనికి రాలేదు అని. మానవ దేహం పంచభూతాలతో చేసినదే కనుక మనిషిని దహనం చేసి మళ్ళీ ఆ పంచభూతాలలో ఐక్యం చేస్తారు. ఇలా శరీర దహనానికి ఉపయోగపడే అగ్నినే ప్రేతాగ్ని అంటారు.

మన మంత్రపుష్పంలో ఈ అగ్ని గురించిన ప్రస్తావన ఉంది. ప్రతీ మనిషిలోనూ భగవంతుడున్నాడు. ఎలా ఉన్నాడయ్యా అంటే ఒక అగ్నిశిఖ రూపములో, నల్లని మబ్బులో విద్యుల్లత (మెరుపు) వెలిగినట్టు, సూక్ష్మంగా, పచ్చగా ఉన్నాడుట. ఆ అగ్నిశిఖ మధ్యలో ఉన్న ఈయనే శివుడు, ఈయనే బ్రహ్మ, ఈయనే విష్ణువు అని చెప్పబడింది.

 

మనది పవిత్రమయిన భారత దేశం. భా అంటే వెలుగు లేదా కాంతి. “భాయాం రతః” భారతః అన్నారు. ఎవరయితే ఈ  అగ్ని రూపములో ఉన్న పరమాత్మ వెలుగుని ఉపాసన చేసి మనోవాక్కాయ (“భా” అంటే భావం అనగా మనసు, “ర” అంటే రవం అనగా వాక్కు, “త” అంటే తనువు అనగా కాయం) కర్మలలో ఏకత్వాన్ని పొందుతారో వారే భారతీయులు అని చెప్పబడింది. అంతటి గొప్ప ప్రఖ్యాతలు ఉన్న మనం వీటన్నిటినీ ఆచరించి, ఆలంబించినప్పుడే ఈ జన్మకి, మన పుట్టుకకి ఒక సార్థకత.

 

45 thoughts on “జ్యోతి..

 1. Dear Madam,
  Thanks for giving such a deep insight on the topic.

  Can you help me in finding the origination of the name “Devagnya” for Godess Lakshmi

  Thanks in advance!

 2. ఇన్ని రకాల అగ్నిలు [ ఉన్నాయని,ఉన్నారని ] తెలిపినందుకు ధన్యవాదాలు మేడం.

 3. ధన్యవాదములు. చదివి చాలా తెలుసుకున్నాం. ఇంకా ఇంకా చదవాలని ఉంది. మిగతా పేజీలు శోధిస్తాను..

 4. భారతీయ తత్వాన్ని జ్యోతి ప్రకాశమైన రూపాన్ని ఆయా సందర్బాలలో నుంచి సేకరించి పాటకులకు అక్షరదీపాల వెలుగులు నింపినందుకు శుభాకాంక్షలు
  Dr. V. Vara prasad

 5. Dear Rasajna, I could not find time to see your blog for the last 20 days though I was told about your new postings. Today I have gone through them and I appreciate you for your interest in collecting material and presenting the same in your matured style. I am happy with your Sanskrit knowledge. I congratulate you for creating interest in many people towards our culture and literature.
  Dr Sarma

  1. ఆలస్యంగా అయినా విడువక చదివి, నచ్చిందంటూ స్పందినించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!

 6. అగ్ని సాక్షిగా జరిగే పెళ్లి – ఈ సమాచారం నిజంగా చాలా బావుంది. ప్రతి వ్యక్తీ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఇది.. (ప్రత్యేకించి ఈ రోజుల్లో).
  మొత్తమ్మీద మీ ఈ జ్యోతి ప్రజ్వలనని – అద్భుతమైన సమాచారం అనాలో.. అందమైన వర్ణన అనాలో… ఆత్మానందం కలిగించే జ్ఞానం అనాలో నాకు తెలియట్లేదు. “ఆత్మానందం” అని ఎందుకు అంటున్నానంటే – జ్ఞానం సిద్ధించినప్పుడు ఆత్మకి ఆనందం కలుగుతుంది అని చెప్తారు పెద్దవాళ్ళు. అగ్ని/జ్యోతి గురించి మీరు చెప్తున్న ఎన్నో విషయాలని చదివాను. కానీ మధ్యలో “జ్ఞానాగ్ని” గురించి మీరు చెప్పిన విషయాలని చదివాక, ఆ తరవాతి విషయాలని చదవటం చాలా కష్టమైపోయింది నాకు. ఎందుకో మీకు చెప్పాలి నేను.
  మామూలుగానే రాముడి గురించి ఎవరు ఏం చెప్తున్నా కూడా నేను వొళ్ళంతా చెవులు చేసుకుంటాను. అలాంటిది ఆయన చేసే పనుల వెనుక ఉన్న అర్దాల గురించి చెప్తుంటే పక్కనున్న వాళ్ళ వొంటిమీద కూడా నా చెవులే చేసుకుని మరీ వినేస్తాను. ఇంతకీ విషయం ఏంటంటే – సీతామ్మవారి అగ్నిప్రవేశ ఘట్టం వెనుక, లోకంలో అందరూ అనుకునే మామూలు విషయం కాకుండా మరేదో సందేశం ఖచ్చితంగా దాగి ఉంటుంది అని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే.. ఆమె ఎక్కడో ఉందనే విషయాన్ని అడ్డం పెట్టుకుని అనుమానిస్తూ మాట్లాడటానికి రాముడేమీ మనలాంటి మామూలు మనిషి కాదు. అవతార పురుషుడు. కాబట్టి సీతమ్మని అగ్నిప్రవేశం చెయ్యమని ఆయన చెప్పటం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమయ్యుంటుందా అని ఆలోచిస్తూ ఉండగా.. ఒక రోజున.. మా అమ్మ.. ఈ ఘట్టం వెనక ఉన్న సందేశం ఇదీ అని.. ఇక్కడ మీరు చెప్పినదాన్నే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ అదే విషయాన్ని చదివేసరికి చాలా ఆనందం అనిపించింది. ఈ కాలంలోని కొన్ని వెర్రితలలు..నా రాముడి చర్యలనీ, వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాలనీ సరిగ్గా అర్ధం చేసుకోకుండా, మూర్ఖంగా వాదిస్తూ, ఇష్టానుసారం చిత్రీకరిస్తుండేసరికి విని తట్టుకోలేకపోతున్నాను. కానీ వాళ్ల అర్ధం లేని ఆరోపణలకి, ఇక్కడ మీరు వివరంగా రాసిన “జ్ఞానాగ్ని” సరైన సమాధానం అవుతుందని నమ్ముతున్నాను. అదిగో.. అలా రాముడి గురించి చెప్తుండేసరికి… నా మనసు అక్కడే ఆగిపోయింది.. కళ్ళు మాత్రం కాళ్ళీడ్చుకుంటూ అతి కష్టమ్మీద “ప్రేతాగ్ని” వరకు వెళ్ళిపోయాయి. తరవాత “భారతీయత” వచ్చి మనసుని తట్టి లేపేసరికి మళ్ళీ ఈ లోకంలోకి రాగలిగాను (ఉలిక్కిపడి).

  భారతీయులు స్వయం సేవకులుగా ఉండాలని ప్రబోధిస్తూ “డాక్టర్ కేశోరాం బలీరాం హెడ్గెవార్” “భారత” అనే పదానికి ఇచ్చిన అర్ధాన్ని.. ఎన్నో సంవత్సరాల తరవాత ఇక్కడ ఈ ఆధునిక మాధ్యమంలో చదివాక ఎంతో ఆనందం అనిపించింది. నిజంగా ఈ అర్ధాన్ని చాటిచెప్పే అవకాశం దక్కించుకున్న ఈ ప్రసార మాధ్యమం (ఇంటర్నెట్) ధన్యతని పొందిందని నా అభిప్రాయం.
  అటువంటి పదంతో ఈ వివరణని ముగించిన మీకు జోహార్లు.

  1. ఈ వ్యాసం మీకు ఆత్మానందం కలిగించినందుకు, బాగా నచ్చినందుకు, మీ జోహార్లకు కృతజ్ఞతలండీ!

 7. వ్యాసం చాలా బాగుంది రసజ్ఞ గారూ! అభినందనలు.

 8. శ్రీ రసజ్ఞ గారికి
  నమస్కారం!

  మీ వ్యాసవాణి “జ్యోతి”ష్మంతంగా ఉన్నందుకు హృదయపూర్వకమైన అభినందనలు!

  సర్వ శుభాకాంక్షలతో,
  ఏల్చూరి మురళీధరరావు

  1. @ ఏల్చూరి మురళీధరరావు గారూ
   నమోవాకములు! మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ అభినందనలకు మనఃపూర్వక అభివాదాలు!

 9. మంచిమనస్సుతో చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదములు. లక్ష్మీ అష్టోత్తరనామాలలో స్వాహా, స్వధా అని నామములు కనపడతాయి.. రెండూ లక్ష్మీ స్వరూపమని భావించడమేనా ?

  1. మీరు చెప్పినట్టు లక్ష్మీ అష్టోత్తరం లోనే కాదు “స్వాహా స్వధా మతిర్మేథా శ్రుతిః స్మృతి రనుత్తమా” అని లలితా సహస్రంలో కూడా వస్తుంది కదండీ! కనుక దేవతలంతా ఆ అమ్మవారి స్వరూపాలు అని అర్థం. మనం చెప్పుకునే ఈ దేవతలంతా గోలోకానికి వెళ్లేసరికి గోపికలుగా ఉంటారనీ, రాధా దేవి మాత్రమే అమ్మవారనీ ఉంటుంది. మన దేవీ భాగవతంలో చెప్పినది కూడా అదే! చక్కని ప్రశ్నను అడిగి తద్వారా ఎన్నో విషయాలను కూడా వ్రాయించిన మీకే నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

 10. చాలా లోతైన విషయాలు చాలా చక్కగా అందించారు.. ఈ రచన వెనుక మీ అద్భుతమైన కృషి స్పష్టంగా కనిపిస్తున్నది.. ముఖ్యంగా అగ్నిసాక్షిగా జరిగే వివాహ తంతు బాగా చెప్పారు..
  స్వాహా, స్వధా రెండు అగ్నికి భార్యలుగా ప్రస్తావిస్తారని విన్నాను. దేవతలకు హవ్యములు స్వాహా ద్వారాను, పితృదేవతలకు గవ్యములు స్వధా ద్వారాను.. అందుతాయిట. ప్రతివారి ముఖము అగ్ని స్థానం.. దేవతలు కూడా పరబ్రహ్మతో ముచ్చటించడానికి అగ్నిని ముందు పెట్టుకుని అంటే ముఖస్థానంలో ఉంచుకుని వెళ్తారుట… మనలోపల ఉన్న జఠరాగ్నికి (వైశ్వానరునికి) ముఖంద్వారానే ఆహుతులు… ప్రాణాయస్వాహా, అపానయస్వాహా….ఇలా అందిస్తాము.అవి శరీరములోని అన్ని ఇంద్రియములకు అందుతాయి.. అలాగే పితృతర్పణాలు… స్వధానమస్తర్పయామి అని విడుస్తాము..స్వధా ద్వారా ఆ గవ్యములు పితృదేవతలకు అందుతాయి.. ఇవి మీలాంటివారిద్వారా విన్నవి.. తప్పైతే నన్ను సరిదిద్దవలసినదిగా కోరుతున్నాను..

  1. ముందుగా మీకు నచ్చినందుకు ధన్యవాదాలండీ! అగ్నికి ఒకే ఒక్క భార్యండీ ఆవిడే స్వాహా దేవి. ఈ స్వాహా పదం గురించి మీరిచ్చినవన్నీ సరి అయినవే.

   కాకపోతే స్వధా దేవి మాత్రం అగ్ని భార్య కాదు. బ్రహ్మ వైవర్త పురాణంలో స్వధోపాఖ్యానంలో ఈవిడ జనన, సంబంధిత విషయాలను వివరించారు. ఆ ప్రకారంగా సృష్టి ప్రారంభములో బ్రహ్మ దేవుడు ఏడుగురిని పితృ గణములను సృష్టించాడు. ఆ ఏడుగురిలో నలుగురికి శరీరం ఉండగా మిగిలిన ముగ్గురూ తేజోరూపులు. ఇలా వీరిని సృష్టించాక వీరికి ఆహారం కావాలి కనుక శ్రాద్ధ తర్పణాలను కూడా సృష్టించాడు. అప్పుడు బ్రాహ్మణులు పిండ ప్రదానం చేస్తున్నా కూడా వారికి అవి చేరటం లేదనీ, ఆకలితో బాధపడుతున్నామనీ ఈ పితృ దేవతలు వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆ బ్రహ్మ దేవుడు సుమనోహర, రూప యౌవన సంపన్న శరత్కాల చంద్రుని వంటి కాంతి కల, విద్య, అందమయిన రూపము, సుగుణములు కల, పరిశుద్ధమయిన, వరములిచ్చే, మంచి లక్షణములు కల, పద్మముల వంటి పాదములు, ముఖము కల “స్వధా” అను కన్యను మనస్సు నుండి సృష్టించాడు. అలా ఈమె బ్రహ్మ మానస పుత్రిక. ఈవిడని పితృదేవతలకు భార్యగా ఇచ్చి పిండ ప్రదానాలు, పితృ తర్పణలు చేసేటప్పుడు స్వధాకరాంతము చేర్చాలనీ, అప్పుడే పితృ దేవతల ఆకలి తీరుతుందనీ చెప్పటం జరిగింది. దీనిని బట్టీ స్వధా దేవి పితృ దేవతల భార్య అని తెలుస్తున్నది. సరిగ్గా ఇదే కథ మన దేవీ భాగవతంలో కూడా వస్తుంది. ఆ ప్రకారంగా కూడా స్వధా దేవి పితృ దేవతల భార్య. ఈవిడ కేవలం శ్రాద్ధ సమయాల్లో సమర్పించే కవ్యాలను తీసుకుని వెళ్ళి పితృ దేవతలకు ఇచ్చి ఒక భార్యగా వారి ఆకలి తీరుస్తుందనమాట.

   బహుశా తేజో (జ్యోతి) రూపులయిన పితృదేవతలకు కవ్యమును తీసుకుని వెళ్ళుట వలన “స్వధా” దేవిని అగ్ని భార్యగా పొరపడి ఉండవచ్చును. స్వాహా దేవి జ్యోతిస్వరూపుడయిన అగ్ని భార్య అయి హవ్యముని తీసుకుని వెళ్ళి దేవతల ఆకలిని తీరిస్తే స్వధా దేవి పితృ దేవతల భార్య అయి కవ్యముని తీసుకుని వెళ్ళి పితృ దేవతల ఆకలిని తీరుస్తుంది.

 11. Very important issue (Agni) is delt in the article. Most of the persons are not aware all these. Very usefull to every one.

  1. అవునండీ! అగ్ని అంటే ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఆయనంటే భయపడే వారు ఉన్నారు కానీ ఆయన చేసే మంచి గురించి చాలా తక్కువగా ప్రచారంలో ఉంది. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

 12. అగ్ని పై ‘రసజ్ఞ’మైన వివరణ…
  చాలా బాగుంది మీ ఆర్టికల్…
  అభినందనలు మీకు…
  మీ నుంచి మరిన్ని మంచి పరిశోధనా వ్యాసాలను ఆశిస్తూ…
  @శ్రీ

  1. మీకు అంతలా నచ్చినందుకు ధన్యవాదాలు! తప్పకుండా తీరిక చిక్కినప్పుడల్లా వ్రాస్తూ ఉంటాను! మీ అభినందనలకు అభివాదాలు!

 13. ఇంత చక్కగా వివరిమ్చినందుకు మీకు శిరసువంచి చేతులు జోడించి నమస్కారము చేస్తున్నా

  1. అయ్యయ్యో! భలే వారే! చదివి, మెచ్చి, స్పందించారు అదే చాలు! ధన్యవాదాలండీ!

 14. చాలా చక్కగా వ్రాసారు.ఎన్నో విషయాలు తెలుసుకున్నాము

 15. ఎప్పటిలానే తెలియని విషయాలు ఎన్నో చెప్పావు రసజ్ఞా… చిన్నదానికి అయిపోయావు కాని నీ జ్ఞానసంపదకు ప్రణామములు అర్పించాలని వుంది.

  1. అయ్యయ్యో! పెద్దవారు అలాంటి పనులు చేయకండీ! నాకు ఆయుక్షీణం. మీ అభిమానానికి కృతజ్ఞురాలిని.

 16. ఇంత గొప్ప పోస్ట్ చదివాక నాలో “జ్ఞానాగ్ని” రగిలిందండీ…
  ఆ జ్ఞానాగ్ని ఏం చెప్పిందంటే… “రసజ్ఞాగ్ని” అని ఇంకో రకమైన అగ్ని ఉన్నదనిన్నూ… అంటే రసజ్ఞ గారు రాసిన పోస్ట్ చదివినప్పుడు ఉద్భవిస్తుందనిన్నూ..

  అద్భుతమైన పోస్టు.. కొన్ని డౌట్స్ ఉన్నాయి.. తర్వాత అడుగుతాను..
  మీకు రెండు చేతులూ ఎత్తి నమస్కారాలు చేస్తూ…

  1. జ్ఞానాగ్ని రగిలితే అన్నీ కర్మలనూ భస్మం చేసేదాకా ఊరుకోదుట 🙂 జాగ్రత్త సుమీ! తప్పకుండా! మీ సందేహాలను ఎప్పుడైనా అడగండి! మీ అభిమానానికి నెనర్లు!

  1. జ్యోతినీ, జ్యోతి స్వరూపమయిన అగ్నినీ నాకు తెలిసున్నంతలో పరిచయం చేశాను. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు!

 17. మీదైన శైలి లో వివరణాత్మకంగా చక్కటి అంశమును ప్రస్తావించారు. ఏ అంశమైనను మీలా ఎవరూ చెప్పలేరు. సరిలేరు మీకెవ్వరు, మీకు మీరే సాటి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *