June 25, 2024

ప్రమోషన్లు… పరీక్షలు.

 రచన: డి.వి.హనుమంతరావు,

YOU ARE THE ONLY LOT IN MY SERVICE WHO ARE TRAVELLING IN A FIRST CLASS COMPARTMENT OF THE TRAIN …

ఇలా అన్నది మరెవ్వరో కాదు… సాక్షాత్తూ ఆ ట్రైన్ గార్డ్.. ఎవరితోనో కాదు సాక్షాత్తూ …  భారతీయ స్టేట్ బ్యాంక్ లో భావి ఆఫీసర్లమైన మాతో…..

 

కాంపిటీటివ్ పరీక్షకు ఎలిజిబిలిటీ వచ్చింది. ఇంటర్వ్యూలో నెగ్గితే ఆఫీసర్ గా ప్రమోట్ చేస్తారు. మా వాళ్లు చాలా ముందు నుంచి బ్యాచ్ లుగా ఏర్పడి హోరాహోరీ చదివేస్తున్నారు. బ్యాంక్ ఖర్చు మీద హైదరాబాదు ఫస్ట్ క్లాసులో వెళ్లి పరీక్ష వ్రాయాలి. అప్పటికి  ఫస్ట్ క్లాస్ లోఎప్పుడూ ప్రయాణించలేదు. .. పరీక్షకు మేము నలుగురం కలసి చదువుతున్నాం కాని ..పెళ్లిళ్లయిపోయి, కొంచెం వయస్సొచ్చాక చదవడం అందునా ఉద్యోగం చేసి వచ్చి రాత్రిళ్లు  చదవడం కొంచెం కష్టమే .. మేనేజిమెంట్ తన ప్రోగ్రాము ప్రకారము పరీక్షతేదీ ప్రకటించేసారు

ఎప్పుడు బయల్దేరాలి,.. ఎలా కలవాలి… చర్చలు మొదలు.

సూర్యచందర్రావు ”  ,,,, టైము  వేస్ట్ కాకుండా ట్రైనులో బాగా చదవాలి” అన్నాడు.

మళ్లీ చదువంటాడేమిటిరా బాబూ .. ఫస్ట్ క్లాస్ ఎంజాయ్ చెయ్యకుండా.. అని నేను మూలిగాను.

” ఫస్ట్ క్లాసులో హిందూ పేపరు, ఇంగ్లీషు నవలలు చదవాలికాని, చీపుగా టెక్శ్ట్ బుక్స్ ముందేసుకుని చదివితే బాగుండదు.”అన్నాడు యల్లంరాజు

” ఏ వేరుశనక్కాయలో తింటూ అలా కిటికిలో నుంచి ప్రకృతిని చూస్తూ ఉంటే.. భలే బావుంటుంది కదా” అన్నాను నేను.

“నీ మొహం .. టిక్కూ టిక్కూ కొట్టుకుంటూ ఆవేరుశనక్కాయలు తిని, ఆ తుక్కు అక్కడ పోస్తే ట్రైనులోంచి దింపేస్తారు” అన్నాడు యల్లంరాజు క్లాస్ గా

శ్యామశాస్త్రి  ట్రైనులో చదువుదాం అన్నవిషయానికే ఓటేసాడు..

“మనం పాసంజరులో వెళ్దాం..ఎక్కువసేపు చదవొచ్చు” అని క్రొత్త ప్రొపోజల్ పెట్టాడు.

“పాసింజరుకి ఫస్ట్ క్లాసు ఉండదేమో కదా..” నాగోల నాది.

“అబ్బే హైదరాబాదు పాసింజరుకు ఫస్ట్ క్లాసు ఉంటుందిట..” అన్నాడు శ్యామశాస్త్రి.

ఇంత ఫస్ట్ క్లాసు.. అలా చీప్ గా పాసింజరులో వెళ్లడమేమిటి.. అదీకాక పాత కంపార్ట్ మెంట్స్ వేస్తాడు అని గొణుక్కున్నాను.

అప్పట్లో రాజమండ్రి స్టేషనులో రిజర్వేషన్ కౌంటర్. రిజర్వేషనుకోసం వెళ్లిన టైములో తరవాత  మేం ఎక్కాల్సిన  పాసింజరు వచ్చిఉంది.. తర్వాత ఎక్కవలసినది అందులోనే కదా “రండి చూద్దాం ” అని శ్యామశాస్త్రి లోపలికి తీసుకెళ్లాడు..కొత్త కంపార్ట్ మెంట్ చక్కగా కారిడార్ టైపులోబాగుందనిపించింది..

 

“ఫస్ట్ క్లాసులో వెళ్తున్నానోయ్” మా ఆవిడకి చెప్పా..

” గుడ్..ఏ ట్రైను” అంది..

“హైదరాబాదు పాసింజరు” అన్నా…

“మీ మొహంలా ఉంది” అంది పుస్తెలు కళ్లకద్దుకొని.

“ఫస్ట్ క్లాసులో వెళ్తున్నా మీ పాసింజరు  బుద్ధులు మారవు” అని కూడా .. కొంచెం నా ముహం ఎర్రబడింది.

……..ర్ర బడ్డ మొహం చూసి,. “అందులో వెడితే  (ముహంలో కాదు) దారిలో తినడానికి ఏమీ దొరకవు..ఏమైనా చేసి ఇస్తాను..

మొత్తం మీరెంతమంది”. అంది. అందుకే ఆవిడంటే నాకిష్టం.

“అడిగి చెప్తా”నన్నా.. జవాబుగా ఏమందామనుకుందో కాని మళ్లీ పుస్తెలు అద్దుకుంది కళ్లకు..

“ఎంతమందో మీకు తెలియదా” అని కూడా అంది. “అదికాదోయ్ ఈ ప్రొపోజల్ మా వాళ్లకి చెప్తాను” అన్నాను..

ఒప్పుకోవడమే కాకుండా  పాపం.. మేం కూడా ఏమైనా తెస్తాం అన్నారు మా వాళ్లు.

వెళ్ల వలసిన రోజు వచ్చింది.. అందరం స్టేషనుకు చేరాం.. పుస్తకాలు, నోట్స్ లతో నిండిన ఓ గన్నీ బ్యాగ్, అండ్ మా బట్టలు వగైరాలు పెట్టిన ఓ పెట్టె, అండ్ దారిలో మేతకు కావలసినవాటితో ఓ పెద్దక్యారీరు/ప్యాకింగు, అండ్ మంచినీళ్లతో కూజాసైజు ఫ్లాస్కులు.. లండన్ ప్రయాణానికి వెళ్లే నలుగురు బారిష్టర్ పార్వతీశాల్లాగా  లగేజీలతో స్టేషనుకు చేరుకున్నాము.  మేం ఎక్కవలసిన రైలు మరీ జీవితకాలం కాదు కాని కొంచెం లేటుతో వచ్చింది.

మా కంపార్ట్ మెంట్ చూడగానే నేనొక్కసారి గతుక్కుమన్నాను. అది కారిడార్ టైపు కాదు. పాత మోడల్. అంటే తలుపు తీయగానే డైరెక్ట్ కంపార్ట్ మెంట్ లో ఉంటాము. ఫస్ట్ క్లాస్ కనుక ఇటు గుమ్మంనుంచి అటు గుమ్మందాకా అటూ ఇటూ సోఫాల్లా రెండు పొడుగు సీట్లు.. . అటు ఇద్దరూ, ఇటు ఇద్దరూ. అంతే కంపార్ట్ మెంట్…..పైన అటూ ఇటూ రెండు బర్తులు..

“ఆ రోజు స్టేషన్ కు వెళ్లినప్పుడు నాకు మచ్చు చూపినప్పుడు కారిడార్ కంపార్ట్ మెంట్ చూపావు ,  ఇఫ్పుడీ మోసం ఏమిటీ..” అని శ్యామశాస్త్రిమీద నా కోపం చూపాను. ఫస్ట్ క్లాస్ సరదా పోయింది..”రేప్పొద్దున్న మా ఆవిడకు మొహం ఎలా చూపనూ” అని ఎడమ పిడికిలి నోట్లో పెట్టుకుని లెఫ్ట్ ప్రొఫైల్ లో వగచాను. జరగకూడనిది జరిగిపోయింది అని నన్ను నేనే సంబాళించుకున్నాను..

అప్పటికే మావాళ్లు  గళ్లలుంగీలు కట్టేసారు.. ఆ రోజుల్లో రాత్రి రైల్లో వెళ్లాలి అంటే అందరూ (మగాళ్లే లెండి) ఏదో నియమం లాగా గళ్లలుంగీలు కట్టేసేవారు.. నాకూ తప్పలేదు.

ట్రైను బ్రిడ్జి మీదకు వచ్చింది..కంపార్ట్ మెంటులోని వారిని గోదావరి గాలి  ఆప్యాయంగా పలకరించింది. మా ఆవిడ చేసిన పిండి పులిహోర గుబాళింపు ఆ చిన్నకంపార్ట్ మెంట్ లో ముక్కులకు విందు చేస్తోంది…తిండి మొదలెడ్దాం అని కళ్లతో చెప్పుకున్నాం.. కొవ్వూరులో ట్రైను ఆగగానే గార్డ్ మా కంపార్ట్ మెంటులోకి ఎక్కి టిక్కట్టు చెక్కింగు చేసాడు.. అప్పుడు టి.సిలు ఉండేవారు కాదు అని  గుర్తు.. vestible కూడా కాదు. లేపోతే పాసింజరు గౌరవమేమో మరి ఇది. అతనిక్కూడా కొంచెం మా పులిహోర పెట్టాము.. ఇంగ్లీషులోనే మాట్లాడాడు మా యల్లంరాజు. మేము ఊఁ .. ఆఁ … అప్పుడప్పుడు చిన్ననవ్వు.. అన్నీ తెలుగులోనే..అన్నాము. పసివేదలలో ఆగగానే గార్డ్ దిగాడు. పాసింజరు అన్ని స్టేషన్స్ ఆగుతుంది అన్న ప్రాధమిక సూత్రం మరవరాదు. చల్లగాలి ఆగిపోయింది.. గాలాడటం లేదు.. చూస్తే పంకా ఆడటం లేదు.. గట్టిగా చూస్తే కంపార్ట్ మెంటులో కరంటు లేదు.. ఎలా… ఎలా… అనుకున్నాం కాస్సేపు. వ్యవస్థను తిట్టుకున్నాం మరికొంతసేపు… చీకటిపడితే, లైట్లు లేకపోతే చదువు మరి అని కొంతసేపు. అంతేకాని ఇంకా డే లైటుంది చదవొచ్చు కదా అని మాత్రం అనుకోలేదు. సరే నిడదవోలు రాగానే గార్డ్ గారికి చెప్దాం.. అని తీర్మానించాము..

“ఫస్ట్ క్లాసు యొక్క పాసింజర్లం కదా .. పాసింజర్ యొక్క ఫస్ట్ క్లాసులో వెళ్లడం ఏమిటి మన ఖర్మ కాపోతేను.” అని నేను మళ్లీ గొణుక్కున్నాను.

మధ్యలో బ్రాహ్మణ గూడెం.. తర్వాత నిడదవోలు జంక్షన్ లో ఆగింది.. శ్యామశాస్త్రి తెచ్చిన జంతికలు కర కరలాడుతూ బాగున్నాయి.

ముందు సూర్యచంద్రరావు దిగి గార్డుకోసం వెతికాడు.. మా ప్రక్కదే గార్డ్ కంపార్ట్ మెంట్….

“సార్ ! మా ఫస్ట్ క్లాసు కంపార్ట్ మెంట్ లో లైట్లు లేవు, కరెంట్ లేదు… బాత్ రూముల్లో నీళ్లు కూడా సన్నగా పడుతున్నాయి..” అని కంప్లైంటులు ఏకరవు పెడ్తుంటే.. నేనూ, యల్లంరాజు దిగాము.

యల్లంరాజు చాలా సీరియస్ గా ముహం పెట్టి గార్డ్ దగ్గరకి వెళ్లి…”వ్హాట్ ఈజ్ దిస్, నో కరెంట్ నో లైట్స్.. ద వెరీ పర్పస్ ఆఫ్ అవర్ ట్రావెల్లింగ్ ఇన్ ఎ ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ ఆఫ్ ఎ పాసింజర్ ట్రైను ఈజ్ టోటల్లీ  డిఫీటెడ్…” అని ఇంగ్లీషులో వాయించాడు.

జంతికల డబ్బా పెట్టిలో సర్దాక … అప్పుడు శ్యామశాస్త్రి దిగాడు.. “ఏమిటంటాడు యల్లంరాజు” అని నన్నడిగాడు.

“ఇది ఏమయి ఉన్నది. లేదు విద్యుచ్ఛక్తి, లేదు దీపములు… మా పాసింజరు రైల్లో మొదటి శ్రేణి డబ్బాలో ప్రయాణము యొక్క ప్రయోజనము మొత్తంగా ఓడిపోయినది…” అని తర్జుమా చేసి చెప్పాను..

మొహం ఎర్రగా చేసుకుని ఆ గార్డ్ మావైపు చూసి…  పైన చెప్పిన మాటలు అన్నాడు….

“You are the only lot in my service who are travelling in a first class compartment of a Passenger Train… ఏం చెయ్యమంటారండీ మమ్మల్ని.. అని నా భుజం మీద చెయ్యివేసి… కొంచెం దూరంగా తీసుకెళ్లి.. లాంగ్ సైటులో రైలు కంపార్ట్ మెంట్ క్రిందకు చూపి…”అక్కడ చూడండి..ఏమన్నా కనపడుతున్నాయా ?” అని అడిగాడు..

చెప్పొద్దూ ఆయన నరసింహావతారం చూసి కొంచెం భయమేసింది.. ” ఆఁ.. రైలు చక్రాలు…”  భయం భయంగా  నసిగా…

“నీ మొహం” అన్నట్టు చూసి… “కాదండీ…అక్కడ ఖాళిగా ఉంది చూసారా…అక్కడ దీని బ్యాటరీ ఉండాలి.. అదికాస్తా స్మగుల్ చేస్తారు కల్ ప్రిట్స్. దానిలో దొంగ తనంగా బియ్యం బస్తాలు అవీ రవాణా చేస్తారు.. మేం ఏం చేయగలము.. మా కష్టాలు మీకేం అర్థమౌతాయి….” అని వాపోయాడు

నాకు జాలేసింది.. “సర్లెండి.. మా కష్టాలు మావి”  అన్నా , నావైపు చూసి అంత స్టేట్ మెంట్ ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అనాలిగా అని.

“ఆ కష్టాలేమిటి” అన్నట్టు చూసాడు, “మాకు మల్లే మీరు రైల్వే రిజర్వేషన్ కోసం క్యూలో నించో అక్కరలేదుగా ” అన్నా సీరియస్ గా..

అర్థం అవడానికి కొంచెం టైము తీసుకుని ఫకాలున నవ్వి ….

“విజయవాడ వచ్చాక ఏదో ఒకటి చేద్దాం అందాక ఓపిక పట్టండి ప్లీజ్” అని అనునయించాడు.

ముందుకు సాగింది రైలు.. ఇవి తినేయండిరా బాబూ అంటూ శ్యామశాస్త్రి అనుకుంటా తను తెచ్చిన తాపేశ్వరం కాజా, వేరుశనగుండలూ ఇచ్చాడు.. చక్రకేళీ అరటిపళ్లు కూడా లాగించాము.. చదవాలిసినది ఎప్పుడైనా చదవొచ్చు కాని తెచ్చిన సరుకు మిగిలిపోతే పాడై పోతుంది, విషయం తెలిస్తే ఇచ్చిన తల్లులు బాధ పడతారు అన్నదే మా ఇది తప్ప తిండిమీద యావ కాదని పాఠకులకు మనవి…..

వెలుతురుగా ఉందని సూర్యచంద్రరావు పుస్తకాలు తీసాడు.. ప్రశ్నలు సంధించాడు.. తిండెక్కువై జోగుతూ సమాధానాలు చెప్పాము.

విజయవాడ స్టేషనుకు చేరింది మా పాసింజర్… ఎవరో ఒకరు వస్తారు, కంగారు పడకండి అని చెప్పి…గార్డ్  టా టా చెప్పి వెళ్లాడు.. అప్పటికి చీకటి పడింది.. కంపార్ట్ మెంటులో బొత్తిగా చీకటి..బెజవాడ స్టేషనులో చాలా సేపు ఆగుతుంది కదా అన్న ధైర్యంతో… లుంగీల అందాలు చూసుకుంటూ… మేము పచార్లు చేస్తున్నాము…..కాకీ పాంటూ, తెల్ల షర్టూ వేసుకుని ఒకతను అతని వెనకాల ఇంకో అతను.. వచ్చారు.. మా కంపార్ట్ మెంటుకి రెండవగుమ్మం లోంచి లోపలికి వెళ్లారు…  తర్వాత  కాకీ పాంటూ, వైట్ షర్ట్ మా దగ్గరకి వచ్చాడు..

“ఈ ఫస్ట్ క్లాసులో వెళ్తున్నది .. మీరేనా సార్..: అని ప్రశ్నించాడు..

ఎంత పాసింజరులో వెళ్తే మాత్రం ఆ ఫస్ట్ క్లాసు వర్ఛస్సు ఎక్కడికి పోతుంది అనుకున్నాన్నేను.

“.. యా….స్స్” అన్నాడు స్టైల్ గా యల్లంరాజు.. “మీరు చూస్తే ఫస్ట్ క్లాస్ పాసింజరులు, ఇక్కడ చూస్తే లైట్స్ లేవు. మీరు నోరుమూసుక్కూర్చున్నారేంటి.. అడగండీ… లేపోతే ఆ లం.కొ.లకి పట్టదు..” నిషాలో వాయించేటప్పటికి మా ఫస్ట్ క్లాస్ నిషా దిగిపోయింది. అది ఫస్ట్ క్లాసు కంబైన్డ్  ఆర్.ఎమ్.ఎస్ కంపార్ట్ మెంట్..అని అప్పుడు గమనించాము.. నిషా ఓనరు పోస్టలు ఉద్యోగి.. బెజవాడనుంచి డ్యూటి. పోస్టల్ వ్యవస్థనీ, రైల్వేవ్యవస్థనీ కడుపునిండా తిట్టి పోసాదు…సీరియస్ గా స్టేషనులోకి వెళ్లాడు. రైలు బయల్దేరుతోందని అనౌన్స్ మెంట్. మేం లోపలకి ఎక్కేసాము. ఎప్పుడు వెళ్లారో కాని, శ్యామశాస్త్రి,, యల్లంరాజు పరుగెత్తుకు వచ్చి రైలెక్కారు. ఈలోగా సౌండ్ సిస్టమ్ లో అనౌన్స్ మెంట్.. “the electrician should attend to the first class combined r.m.s  compartment  of …passenger train to hyd. immediately”. రాజు,శాస్త్రి కాలరెగరేసారు.వాళ్ల కంప్లైంట్ వల్లనేకదా అని. రైలు బయల్దేరింది. పోస్టల్ మిత్రులుకూడా ఎక్కారు.. రైలు ప్లాట్ ఫారం వదులుతుంటే పరుగెడుతూ ఎక్కాడు….ఎలక్ట్రీషియన్..మధిర స్టేషను వచ్చేటప్పటికి లైట్లు వెలిగాయి, పంకాలు తిరిగాయి.  ఇంక చదువుదామా అన్నాడు సూర్యచంద్రరావు.. తప్పదురా బాబూ అంటూ నోట్స్ తీసా…అటు  చూద్దును కదా..ఇంగ్లీషులో కష్టపడిన యల్లంరాజు, తెలుగులో కష్టపడిన శ్యామశాస్త్రి పై బర్తులెక్కి ఆనందంగా నిద్రోతున్నారు… సిన్సియర్ గా సూర్యచంద్రరావు చదువుతూ…”లైటింగు మధ్యలో అలా తగ్గుతోందేమిటి ” అన్నాడు… “డ్రైవరు వత్తి తగ్గిస్తున్నాడేమో” అన్నా… “గో హెల్ విత్ యువర్ జోక్స్ అని యల్లంరాజు ఇంగ్లీషులో కలవరించి, మళ్లీ అటుతిరిగి నిద్ర కంటిన్యూ చేసాడు…..కూర్చుని చదువుతున్నవాడ్ని నెమ్మదిగా ప్రక్కమీదకి వరిగా… కిటికీలోంచి ఆకాశం… అమావాస్య రోజులేమో… నల్లని ఆకాశంలో మిల మిలా మెరుస్తూ నక్షత్రాలు… చల్లగా మెల్లగా వచ్చే పిల్లతెమ్మెరలు … అలా హాయిగా… ఆనందంగా… ప్రశాంతంగా చూస్తూ… ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో…లేచేటప్పటికి ఎనిమిదైంది…బ్రష్ చేసుకున్నాము..ఏదో చిన్నస్టేషన్ లో ఆగింది..టీ వాలా వచ్చాడు. కాఫీ లేదా అని అడిగాము .. కాఫీ నాయ్, చాయ్ అన్నాడు..  మేంతాగబోతుంటే … బాగోదు. ఇది ఫస్ట్ క్లాసు అన్నాడు యల్లంరాజు.. గో హెల్ విత్ యువర్ ఫస్ట్ క్లాస్.. లేపోతే నాకురోజు స్టార్ట్ అవదు అన్నాడు శ్యామశాస్త్రి.. ఇంకా రెండుగంటలట హైదరాబాదుకి.. ఆకలి.. తెచ్చిన బిస్కట్లున్నాయి కదా. తినేసాము. పిండి పులిహోర , స్వీట్స్ ఉండిపోయాము.. ఆ లగేజీ ఇంకా మోయడం నావల్లకాదు.. అన్నా.. సరే తర్వాత స్టేషనులో ఎవరైనా వస్తే ఇచ్చేద్దాము అని డిసైడ్ అయ్యాము.. నెక్స్ట్ స్టేషనులో కాని ఆ తర్వాత నెక్శ్ట్ స్టేషనులో కాని ఎవడూ రాలేదు..

“అందుకనేరా పాసింజరులో రానన్నది.. ముష్టోడిక్కూడా ఖాతరులేదు.”.. సరే! ఆకులపళంగా పట్టికెళ్లి ప్లాట్ ఫారం పై సిమెంట్ కుర్చీమీద పెట్టి వచ్చాను…

భాగ్యనగరాన దిగాము.. రోదసీ ప్రయాణికుల్లా.. కాచిగూడాలో లాడ్జి బుక్ చేసాడు మా సూర్యచంద్రరావు ఫ్రెండ్. అక్కడికి వెళ్లి మా స్నానాదులు అయ్యేటప్పటికి ఆ ఫ్రెండ్ వచ్చాడు.. అతనికి రిటర్న్ టికట్స్ బుక్ చేయమన్నాము… అడిగితే ఇంకా చెయ్యలేదన్నాడు. అతనికి రేసుల పిచ్చి. ఆ డబ్బులు రేసుల మీద పెట్టేసి ఉంటాడు.. మీరు పరీక్ష వ్రాసి వచ్చేటప్పటికి చేసేస్తానన్నాడు..పాసింజరు మాత్రం వద్దన్నాము.. మేం పరీక్షవ్రాసి రూమ్ కు వచ్చిన కాసేపటికి వచ్చాడు.. టిక్కట్లు దొరికాయి .. ఎక్స్ ప్రెస్సుకు లేవు, రేపు పాసింజర్ కు దొరికాయి అన్నాడు… హతోస్మి… ఫస్ట్ క్లాసు పాసింజర్లం మళ్లీ పాసింజరు ఫస్ట్ క్లాసులోనా…..

1 thought on “ప్రమోషన్లు… పరీక్షలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *