May 25, 2024

సంపాదకీయం: అసలు తప్పెవరిది?

ఈ మధ్య కాలంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలనీ, ఉగ్రవాద దాడుల్నీ, మతకల్లోలాలనీ చూస్తుంటే ఒకటే అనిపిస్తోంది – అసలు మనిషి ప్రాణానికి విలువ ఉందా అని.

ఇలాంటి సంఘటనలను నివారించవలసిన అధికారుల అలసత్వానికి కారణం అడిగితే తక్కువ సిబ్బందంటారు. ఎక్కువమందిని నియమించచ్చుకదా అంటే నిధుల కొరత అని సమాధానం. కానీ పేపర్లలో మాత్రం దేశం పురోగమిస్తోంది, అభివృద్ధి చెందుతోందని ఒకటే ఊదరగొట్టటం. “ఏమిటిది?” అని నిలదీశేవాళ్ళు లేకనేకదా ఇదంతా?

ఇక ఈ అధికారులని నియమించి నియంత్రించే ప్రభుత్వాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు. కోట్లు ఖర్చయ్యే పార్లమెంటు సెషన్లలో చర్చలకి కేటాయించే సమయం బహు స్వల్పం – వాకౌట్లకూ, జుట్లు పట్టుకుని కొత్టుకోవటానికే సమయం చాలదు కదా మన నాయకులకు. ప్రతిపక్షాలు దీనికి కారణం ప్రభుత్వమే అంటాయి. ప్రభుత్వమేమో ప్రతిపక్షాల పాలనలో కూడా పరిస్థితి ఇలాగే ఉండేదని తప్పించుకుంటుంది. మొత్తానికి ఫలితం శూన్యం.

ఇక పోతే వీటన్నిటికీ అసలు కారణం – ప్రజలు, అంటే మనమే. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే ఈ పనులు వెలగబెడుతున్నది మరి. ంఅనం చేసే పనులు ఇతర దేశ ప్రజలకు ఎంత హాని చేస్తాయో, తద్వారా భవిష్యత్తులో మనపై దాని ప్రభావం ఏమిటోనన్న సంగతి ఒక్క సారయినా ఆలోచిస్తామా? తండ్రికి ఆఫీసు రాజకీయాల గోల, తల్లికి టీవీ సీరియళ్ళ గోల, కొడుక్కీ, కూతురికీ స్నేహితుల గోల. ఇవేవీ లేనివారికి ఇంటర్నెట్టూ, ఫేస్ బుక్కుల గోల. దుర్ఘటనలు జరిగినప్పుడు మాత్రం “ఈ దేశం ఏమయిపోతోంది?” అని ఒక గంట లెక్చర్లు దంచటమయితే బహు బాగా వచ్చు, కానీ ఇలాంటి దుర్ఘటనలని నివారించాలంటే ఏం చెయ్యాలి అంటే మాత్రం సమాధానం ఉండదు. పోనీ మనమేమీ చెయ్యక్కరలేదు, చేసే వాళ్ళని ఎన్నుకుందామా అంటే మనం ఎన్నుకునేది కులం, మతం లేక సీనీ గ్లేమర్ ప్రాతిపదికమీద. ఫేస్ బుక్ పేజీల మీద అన్నా హాజారే ఫోటో పెట్టి (అది కూడా మనం తీసింది కాదు.. వేరేవరిదో షేర్ చేస్తాం) మనం కూడా పోరాటం చేస్తున్నామని జబ్బలు చఱచుకుంటాం. “జరుతున్నదానికి మనం తప్పా ప్రతీ ఒక్కళ్ళూ బాధ్యులే” అని చివరకు ఒక ముక్తాయింపు మాత్రం ఇస్తాం.

మనంతట మనం మారనంతకాలం దేశాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా బాగుచెయ్యలేడు.

శ్రీశ్రీ గారికి క్షమాపణలతో వారి పరిభాషలోనే చెప్పాలంటే

నేను సైతం కులమతాలకు లొంగిపోయి ఓటు వేశాను
నేను సైతం నీతి లేని నాయకులనే ఎన్నుకున్నాను
నేను సైతం పచ్చనోట్ల జిలుగుబిలుగుల కమ్ముడుపోయాను
నేను సైతం దేశమాతకు లెక్కలేని తూట్లుపొడిచాను
శిశిర ఋతువే గ్రీష్మమైనా ధరణీతాపం గుర్తురాలేదే!
మంచుకొండలు కరిగిపోయినా రాతిమనసులో చలనమేలేదే!
లక్షలాది రూకలముందు భూమి విలువే తెలియనేలేదే!
నేను సైతం మానవాళి అంతానికి కారణమయ్యాను

లంచగొండులు డబ్బులడిగితే నాకునేనుగా ఒప్పుకోలేదా?
తక్కినవారిని సైతమీదారిలో వెళ్ళమనినే ప్రోత్సహించలేదా?
దేశవ్యాప్త మహమ్మారి అవినీతికినే కారణంకాదా?
నేను సైతం కోరి నీతిని హత్యచేసిన భ్రష్టుడనయ్యాను

సాటినరులే నేలకూలినా అంతరాత్మకి జాలిలేదసలు
నాకు ముఖ్యం ప్రపంచంలో నేను నా భార్య నా సుతులు
ఎక్కడైనా ఎప్పుడైనా కానరావే మానవుల వెతలు
నేను సైతాన్ జన్మనెత్తి నాకు నేనే శత్రువయ్యాను!

 

2 thoughts on “సంపాదకీయం: అసలు తప్పెవరిది?

  1. భరద్వాజ్ గారూ! మీ ఆక్రోశం, ఆత్మనింద అర్ధం చేసుకోవచ్చు. ‘నేను సైతం’ కాదు మేము సైతం అనీ చెప్పుకొని, ఒప్పుకొని లెంపలేసుకోవాల్సిందే. అంతటితో ఆగకూడదు. లెంపలు వాయించాలి కూడా. శ్రీ శ్రీ మాట ఎత్తారు కాబట్టి చెబుతున్నాను– దొంగ లం– కొడుకులసలే మెసిలే ధూర్తలోకం —
    హనుమంత రావు గారూ! టివీ గురించీ, అందునా మన తెలుగు కార్యక్రమాల గురించీ ఎంత చెప్పుకున్నా సరిపోదు. అందులోవాటినే ప్రామాణికంగా తీసుకుంటున్న మహిళలు, పిల్లలు ఎంత దుష్ప్రభావానికి లోనవుతున్నారో– చెప్పనలవి కాదు.
    ‘సుడిగుండాలు’ బాగానే కోట్ చేశారు. అలాగే ‘మరో ప్రపంచం’ గురించి కూడా నేమరువేసుకోవచ్చు ఈ సందర్భంగా. గాంధీ మహాత్ముడి కులం గురించి మనం పాఠాలు నేర్చుకున్నాం. ఆ దుస్థితి నుండి బయటపడాలంటే, సమూలంగా విద్యావ్యవస్థను మార్చాలి. అంతెందుకు — రాజ్యాంగాన్ని సమీక్షించి కొత్తగా వ్రాసుకోవాల్సిన సమయం.
    రాజా.
    gksraja.blogspot.in

  2. తప్పు ఎవరిదంటే ఎవరు ఒప్పుకుంటారు ? … ఎవరిమటుకు వారు… తన వలన పని జరిపించేవారి పట్ల ఎంత నిజాయితీగా వ్యవహిరిస్తున్నాను… కొంతైనా మారుదాము అని ఆలోచిస్తే మెఱుగు పడే అవకాశముంటుందేమో… దిశానిర్దేశం చేయగల నాయకులకు కుర్చీ గురించి తప్ప మరో ఆలోచన లేదు.. వారు ఉపయోగించే భాష అన్ పార్లమెంటరీ అన్న పదానికి క్రొత్త నిర్వచనం చెప్తున్నది. సౌకుమార్యం, కోమలత్వం, సున్నితమైన మనస్సు… స్త్రీమూర్తుల స్వంతం.. వారిని ఎంత కర్కశ హృదయులుగా టి.వి.సీరియల్స్ లో చిత్రీకరిస్తున్నారో చూస్తున్నాము… విదేశాలలో ఈమధ్య జరిగిన ఒక ఘటన ఇద్దరు చిన్న పిల్లలు రెండువేర్వేరు సందర్బాలలో పిల్లలను హత్య చేసి దొరికారు.. ఎందుకు చేసారంటే టి.వి.గేమ్స్ లో చూపిన ఆటల్లో ప్రత్యర్థిని ఎంత కర్కశంగా చంపితే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి.. నిజంగా చేస్తే వచ్చే థ్రిల్ కోసమన్నారు…… మన పిల్లలు టి.విలకు అతుక్కుపోతున్నా, కంప్యూటర్ లో ఆడవాళ్ల చేసే కర్కశమైన కుస్తీ పోటీలు చూస్తున్నా నాగరికతగా భావించే తలిదండ్రులను చూస్తున్నాంగా…. “సుడిగుండాలు” సినీమాలోలాగా… నా దేశం ఏమైపోతోంది… ఏమైపోతోంది……అనుకోవడమే మనకు ఇక మిగిలింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *