April 19, 2024

నిత్య సత్యాలు – ఆణి ముత్యాలు

రచన:  నాగులవంచ వసంత రావు,    

 

నిత్య జీవితంలో నిష్కపటంగా, నిజాయితీగా బ్రతకవలసిన మనిషి కపటంగా బ్రతుకుతున్నాడు. దీనికిగల కారణాలనుగనక పరిశీలించినట్లైతే ఒక సామాన్యుడు కపటముగా జీవిస్తూ మందిని మోసము చేసాడంటే బలహీనత లేదా అజ్ఞానం అనుకోవచ్చు. కాని అన్నీ తెలిసిన, బాగా చదువుకున్న వారు, సమాజములో పెద్దలమని, గొప్ప పేరు ప్రతిష్టలుగలవారమని పిలిపించుకొనేవారు, ఇంకా విచిత్రమేమిటంటే గురువులమని చెప్పుకుంటూ భక్తి, యోగం, జ్ఞానం ముసుగులో అమాయకులను మోసం చేస్తూ ఆత్మవంచనకు పాల్పడుతున్నారు. నూటికి తొంబై శాతం మంది కపటత్వంలో బ్రతుకుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇది పచ్చి నిజం. దీనికి కారణం ఏమిటి? రాతలు చాలా బాగుంటాయి కాని చేతలవరకు వచ్చేసరికి విచిత్రంగా, వికృతంగా, స్వార్ధంగా బ్రతుకుతుంటారు.  ఇతరులెరుగ కున్న ఈశ్వరుడెరుగడా అన్నట్లు ఇతరులను మోసం చేసి పబ్బం గడుపుకున్నా తనలోని అంతరాత్మకు తాను తప్పు చేస్తున్నానన్న సంగతి బాగా తెలుసు. కాకపోతే తనలోగల అహంభావం వల్ల, తాను ఇతరులముందు చులకనైపోతానన్న భావనతో తనలోని తప్పులను మనిషి ఒప్పుకోడు.  మమాత్మా సర్వ భూతాంతరాత్మ యనే సూత్రం ప్రకారం తానే అన్ని ప్రాణులలో వివిధ రూపాలలో నివసిస్తున్నాడన్న సత్యాన్ని తెలుసుకోలేక ఇతరులకు అన్యాం చేసి, మోసం చేసి, దగా చేసి తానేదో తెలివైన వాడినని, మాయ మాటలతో మందిని మోసం చేయగలిగానని, తన అతి తెలివికి తానే అతిగా పొంగిపోతూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు.  సంస్కారమున్న ఏ వ్యక్తి ఇతరులకు బాధ కలిగించే పని చేయడు. దుష్ట మానవుడు మాత్రమే తనలోని అంతరాత్మ ప్రబోధాన్ని పక్కకు నెట్టి, స్వార్ధ ప్రయోజనాన్ని ఆశించి వక్ర మార్గంలో తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు. ఐతే తాను చేసే పని తప్పని తెలిసి కూడా మంచిని ఆచరించలేక పోవడం కేవలం తనలోని బలహీనతలవల్లనే. ఇంకా చెప్పాలంటే పరిస్థితుల ప్రభావం అని సర్ది చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాడు. ఏది ఏమైనా తన పనిని ముగించుకోవడానికి ఎంతటి దుష్ట కార్యానికైనా సిద్ధపడుతున్నాడు వక్రబుద్ధిగల మానవుడు.

 

తప్పు చేయడం ఎంత నేరమో, తప్పు చేయడానికి సహకరించడం లేదా అవకాశమివ్వడం కూడా అంతే నేరమౌతుంది.   మోసం చేయడం ఎంత తప్పో, మోసం చేయడానికి సహకరించిన వారిది కూడా అంత తప్పే ఔతుంది. నీ అమాయకవం వల్ల, అవగాహనా రాహిత్యం వల్ల లేదా మూఢ విశ్వాసం వల్ల నిన్ను ఎదుటివాడు మోసం చేయగలుగుతున్నాడంటే అందులో నీ లోపం కూడా ఉన్నట్లే.    నీవు నిండా జాగ్రత్తగా ఉంటే నిన్ను మోసం చేసే అవకాశమే లేదు.   నీవు ఏదో ఒక ప్రలోభానికి లోబడితేనే దానిని ఎదుటివాడు ఆసరాగా తీసుకుని, నిన్ను నమ్మించి నిలువునా నట్టేట ముంచగలుగుతున్నాడు. నీవు తెలివి తెచ్చుకుని, అప్రమత్తుడవై ఉన్ననాడు నీ దరిదాపులకు రావడానికి కూడా వాడు జంకుతాడు. చర్య – ప్రతి చర్య సిద్ధాంతమంటే ఇదేనని తెలుసుకోవాలి. యధా రాజా తధా ప్రజ. యదా భక్తా తదా గురు అనేది నవీన కాలజ్ఞానం.  అంతరాత్మ ప్రబోధాన్ని విస్మరించి సంచరించే మోసపు బాబాలకు ఇంతకన్న మంచి ఉపమానం మరొకటి లేదేమో!  మీరే సావధానంగా ఆలోచించండి.  మంచివాళ్ళకు  మంచిగా  ఉండడం,  చెడ్డవాళ్ళకు చెడ్డగా ఉండడమే సరియైన మార్గం.   అతి మంచితనం కూడా చేతగాని తనం కిందికే వస్తుంది.   కాబట్టి ఏది మంచి, ఏది చెడు అనేది అయా పరిస్థితులనుబట్టి ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అడుగు ముందుకు వేయడమే విజ్ఞతగల మానవుని ప్రథమకర్తవ్యం.
నేటి సమాజంలో హాయిగా, అన్ని వసతులతో, మనసుకు ఎలాంటి నొప్పి కలుగకుండా సంతోషంగా బ్రతకాలని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు.  ఈ కోరికను తీర్చుకోవడానికి నిర్విరామంగా కృషిచేసి ఫలితాన్ని అనుభవించే బదులు, అతి సులువుగా, ఎలాంటి కస్టం లేకుండానే అన్ని ఆనందాలను పొందాలని అడ్డదారుల్లో పయనిస్తుంటారు చాలా మంది.  ఒక్కొక్కరు ఒక్కో విధమైన ట్రిక్కులతో, జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేస్తూ ఉంటారు. ఒకవిధమైన ప్రయోగం ప్రజలకు తెలిసిపోగానే అప్రమత్తమైన మోసగాళ్ళు మరో రకమైన ఎత్తుగడవేసి ప్రజలను చిత్తు చిత్తుగా మోసం చేస్తూ ఉంటారు.  తమకు జ్ఞానం గురించి అంతా తెలుసునని చెప్పుకొనే గురువులు, స్వాములు, బాబాలు కూడా బలహీనతలకు లోనై ఉచితానుచితాలు మరిచి, కామినీ, కాంచన, కీర్తి ప్రతిష్టల మోజులోపడి భ్రష్టులవడమే కాకుండా ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనికి బాధ్యులు బాబాలా లేక అమాయకపు ప్రజలా అనేది చర్చనీయాంశము.

 

నిజం చెప్పాలంటే మనం ఒకరి చేతిలో మోసపోయామంటే ఆ పొరపాటు మనదే.   ఎందుకంటే మోసం చేయడానికి ఎదుటి వ్యక్తికి నీవు అవకాశమ కల్పించావు కాబట్టి.    అవకాశం ఎందుకు కల్పించావంటే అందులో నీ స్వార్ధం దాగివుంది కాబట్టి.   ఎందుకంటే కష్టపడకుండానే నీకు అరచేతిలో స్వర్గం చూపించినట్లు రెడీమేడ్ ముక్తి, మోక్షం కావాలి.   దానికి తగిన సాధన, నియమ నిష్టలు పాటించే తీరిక, ఓపిక నీకు లేదు కాబట్టి బూటక స్వాములను నమ్మి నీ భారమంతా అతనిపై వేసి హాయిగా రిలాక్స్ కావాలనుకున్నావు. ఛివరికి ఏమైంది నిన్ను నిలువునా ముంచేసి అతడు మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు.   నీవు ఈ సత్యాన్ని గ్రహించి జాగ్రత్తపడేసరికే స్వామి చల్లగా జారుకుంటున్నాడు.   చేతులు కాలిన పిదప ఆకులు పట్టిన చందాన నీ ఆత్మ ఘోష అరణ్యరోదనగా మిగులుతుంది. ఎవరికి చెప్పుకుంటావు నీ దీన గాధను.   ఎవరు తీరుస్తారు నీ కష్టాన్ని.   ఎవరు పూడుస్తారు నీకు జరిగిన ఆర్ధిక అగాధాన్ని.    ఎవరు దించుతారు నీ హృదయ భారాన్ని. ఎవరు అందిస్తారు నీకు ఆపన్న హస్తాన్ని?
అర్జునుడు శ్రీకృష్ణునికి స్వయాన బావమరిది ఐనా కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు అన్నాడే తప్ప, నీవు హాయిగా రథం పై కూర్చుంటే నేనే యుద్ధం చేసి నిన్ను గిలిపిస్తానని ఎక్కడా చెప్పలేదు. పైగా రకరకాల జ్ఞాన బోధలు చేసి కార్యోన్ముఖున్ని చేశాడు.    కర్తవ్య పాలనకు కంకణం కట్టుకునే విధంగా ప్రేరణ కలిగించాడు.    పని చేయుటకే అధికారము కలదు కాని కర్మ ఫలాన్ని ఆశించవద్దని హితవు పలికాడు. గోరంత పని చేసి కొండంత ఫలితం ఆశిస్తేనే లేనిపోని దు:ఖాలు చుట్టుముడుతాయి.   ఆశ ఉండవచ్చుగాని అత్యాశ తగదన్నారు పెద్దలు.   కాబట్టి ఏవిధంగా ఆలోచించినా ప్రతి మనిషి కష్టించి పని చేయవలసిందే.   తనకు కావలసిన జీవన సదుపాయాలను సమకూర్చు కోవలసిందే.    ఎవరో దయదలచి మనకు సమకూర్చే వస్తువంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు.    దేనికైనా నీ శ్రమ, శక్తే మూలమని గుర్తుంచుకోవాలి.   నీకు మించిన శక్తి ఈ విశ్వంలో మరొకటి లేదని ఎల్లాప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. జీవితం తెరచిన పుస్తకంలా ఉండాలి.   దిన చర్యను బట్టి అంచనా వేయవచ్చు.  స్నేహితులను బట్టి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చు. జీవన విధానాన్ని బట్టి నిజాయితీని నిగ్గు తేల్చవచ్చు.  మాటలను బట్టి మనోగతాన్ని పసిగట్టవచ్చు.   అలవాట్లను బట్టి ఆచరణను ఆరా తీయవచ్చు.    చేతలను బట్టి గుణగణాలను గుర్తించవచ్చు.    దుస్తులనుబట్టి స్వభావాన్ని సుమారుగా అంచనా వేయవచ్చు.   నడతను బట్టి జీవన నాణ్యతా ప్రమాణాలను నిర్ణయించవచ్చు.  మొత్తంగా జీవితం నడతపైనే నిండా ఆధారపడి ఉంటుంది. వంద పుస్తకాలు రాసినా ఒక్క వాక్యాన్ని నిజ జీవితంలో పాటించలేనప్పుడు ఆ రాతలు నిరర్ధకం.     చెప్పే మాటలను చేతలలో చూపినప్పుడే వాటికి విలువ వస్తుంది.   నిన్ను చూసి నీ ఎదుటివారు ఎన్నో మంచి విషయాలను నేర్చుకోగలగాలి.     అంత ఉన్నతంగా  ఆచరణ ఉన్నప్పుడే నీ మాటలను ఎదుటివారు నిండా నమ్మగలరు.

 

అన్నింటికి ఒక్కటే సమాధానం. అప్పో దీపోభవ.” (నీకు నీవే దిక్కు). నీ క్షేమం కోరేవాడు ఈ ప్రపంచంలో నీకు మించినవాడు మరొకడు లేడు.    ఇది ముమ్మాటికి అక్షర సత్యం.     కావాలంటే ఆత్మ పరిశీలన చేసి చూసుకో.    నీ గురించి నీకు మాత్రమే బాగా తెలుసు.   ఇతరులు నిమిత్తమాత్రులు.   నీవు మాత్రమే నీ గురించి బాగా ఆలోచించగలవు.    సరియైన నిర్ణయాలు తీసుకోగలవు.    నీ జీవితాన్ని ఇతరుల చేతికి అప్పగిస్తే కుక్కలు చింపిన వస్తరిగతి అవుతుంది.    ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకే అర్ధమౌతుంది.    నిన్ను నీవు నమ్ముకోకుండా ఇతరులను నమ్మితే మిగిలేది విషాదమే.     నీవు కస్టపడకుండా ఫలితాన్ని ఆశించడం వెర్రితనమే అనిపించుకుంటుంది.   ఇతరులపై ఆధారపడినంత కాలం మనకు ఎదురుదెబ్బలు తప్పవు.   “ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా, నిజం మరిచి నిదురపోకుమాఅని మహాకవి శ్రీ శ్రీ ఏనాడో మానవాళిని హెచ్చరించాడు కూడా.   ఐనా ప్రతి రోజు ఏదొ ఒక మోసపు వార్తలు మన చెవిన పడుతూనే ఉన్నాయంటే మూఢ నమ్మకాలు ఎంతగా ముదిరిపోయాయో అర్ధమవుతుంది.    బాబాను బగవంతుడని విశ్వసించి నమ్మిన భక్తునికి భంగపాటు తప్పడంలేదు.    ఒకటి కాదు, రెండు కాదు అను నిత్యం టీవీ చానళ్ళలో బాబాల గుట్టు బయటపడుతూనే ఉంది.    రోజుకొక మాయా గారడీ చేసి మందిని మోసం చేస్తున్నారు.    పేరుగాంచిన ప్రముఖులు సైతం ఈ అనైతిక ఉచ్చులో పడడం మిక్కిలి శోచనీయం.   ఎంతటివారైనా కాంతా, కనక దాసులే అన్నట్లు నేటి సమాజంలో జరుగుచున్న అన్యాయాలు, అక్రమాలు, భూ బాగోతాలు ప్రబల నిదర్శనాలు.
విచారకరమైన విషయమేమిటంటే భగవంతునిచే సృష్టించబడిన మనిషి, భగవంతుడి పేరు చెబితేనే భయపడిపోతున్నాడు.   వివిధ రూపాలలో ఉన్న దేవతా విగ్రహాలను చూడగానే భక్తితో కొంతమంది, భయంతో కొంతమంది తోచినకాడికి కానుకలు సమర్పించుకుంటున్నారు. ఐతే అవి ఎంతవరకు సద్వినియోగమౌతాయని ఆలోచించటం లేదు.   గురువుల పేర్లు, బాబాల పేర్లు చెప్పి చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకున్న విధంగా క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది దొంగ బాబాలు. ఇన్ని పత్రికలు పతాక శీర్శికల్లో దొంగ బాబాల వార్తలు ప్రచురించినా, టీవీ చానళ్ళలో సాక్ష్యాధారాలతో కళ్ళకు కట్టినట్లు చూపించినా ఇంకా వాళ్ళను గుడ్డిగా నమ్మే అమాయక ప్రజలున్నారు కాబట్టే వారి ఆటలు సాగుతున్నాయి.  జన విజ్ఞాన వేదిక, నాస్తిక సంఘాలు గొంతెత్తి అరచినా ఆశించిన ఫలితం అంతంత మాత్రంగానే ఉంది.   దీనికి కారణం మూఢ నమ్మకాలు వేళ్ళూనుకుపోవడమే.   ఎత్తుకు పై ఎత్తు అన్నట్లు మోసగాండ్లు రూటు మారుస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.    కాసులకోసమే కాషాయాంబరాలు కట్టుకుని కిరాతకపు పనులు చేసే మేకవన్నె పులులను మొదలంటా తుదముట్టించాలి. లేకుంటే మానవ మనుగడకు మహా ఉపద్రవం రాక తప్పదు.   ఎంతో మంది అమాయకులు బలిపశువులుగా మారే ప్రమాదం మరెంతో దూరంలో లేదు.   అందుకే మహా పురుషులు, యోగులు, జ్ఞానులు రచించిన ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుకుని జ్ఞానాన్ని సంపాదించవచ్చు.    పుస్తకాలతో మనిషికి ప్రమాదం లేదు.    కాని మానవ రూపములో ఉండి మహాత్ములమని, స్వాములమని చెప్పుకొనే మోసపు మనుషులతోనే మానవాళికి మహా ప్రమాదం పొంచి వుంది. ఈ ప్రమాదం నుండి మానవాళి బయటపడడానికి మనవంతు కృషి చేద్దాం.   మతం, భక్తి, యోగం, జ్ఞానం ముసుగులో జరిగే అన్యాయాలను, అక్రమాలను, అమానుషాలను అంతమొందిద్దాం.

 

 

 

4 thoughts on “నిత్య సత్యాలు – ఆణి ముత్యాలు

  1. మన బలహీనతలను అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకునేవాళ్లే మనచుట్టూ ఉన్నారు.. భగవంతుడికి మనం దణ్ణం పెట్తాము.. కాని ఉన్నాడో లేడో అని గజేంద్రుడిలాగా మనకూ అనుమానమే.. భగవంతుడు కావాలనుకునే వారు……పూర్తి విశ్వాసంతో ఆయన్ని వెతుకుతే సరియైన గురువు లభ్యం అవుతాడు.. దారి చూపుతాడు.. అంతేకాని కనపడే కాషాయం కట్టుకున్నవాడి వెనుకా,, నాలుగు భగవంతుడి మాటలు చెప్పేవాడి వెనకా తిరగడం… ప్చ్…
    నిజాలు చక్కగా చెప్పారు…వసంత రావు గారు… నిజం…….

  2. వసంతరావు గారూ! బాగా చెప్పారు. ఎవరు కారణం అన్నారు? మొదట నమ్మినవాడిదే తప్పు. సందేహం లేదు. మనం ఏమిటో మనకు తెలియకుండా భగవంతుణ్ని ఎలా తెలుసుకుంటావు? అది చెప్పడానికీ ఓ గురువు, దానికో భాష ఉండదు. సంస్కృతం లో అర్ధిస్తే అందుబాటులోకి వచ్చే దేవుడు, జపనీయునికి, స్పానిష్ భక్తుడికి ఎలా న్యాయం చెయ్యగలుగుతాడు? ఇక్కడ కావలసింది. అంతరాత్మ మాత్రమే. బయటపడిన మోసాల పట్ల ఆయా దొంగ బాబాల, అమ్మల పట్ల జాగ్రత్తగా ఉంటాం సరే! బయట పడని మోసాలు ఇంకెన్ని ఆశ్రమాల్ని కూలుస్తాయో? కాలుస్తాయో? దేశాధిపతులే మూర్ఖంగా అప్పటికే నేరారోపణలున్న దొంగబాబాల కాళ్ళకు మొక్కితే ఏమి సందేశం వెళుతుంది సామాన్య జనానికి? ఈ లింకు http://gksraja.blogspot.in/2011/04/blog-post_18.html చూడండి.

  3. చక్కని, ఆలోచింప చేసే వ్యాసమండీ! మనుషుల బలహీనతలను ఆధారంగా చేసుకునే ఇలాంటి వాళ్ళు రోజుకొకరు పుట్టుకొస్తున్నారు.

Leave a Reply to dinavahi venkata hanumantharao Cancel reply

Your email address will not be published. Required fields are marked *