March 28, 2024

అక్రూరవరద మాధవ

రచన : ఆదూరి హైమవతి

                     

‘కృష్ణాష్టమి’ శ్రీకృష్ణుడిజన్మదినం’గా వేడుకచేసుకుంటాం.ఎవ్వనిచేజనించుజగమెవ్వనిలోపలనుండు లీనమై –అన్నట్లు సృష్టి స్థితి కారుడైన భగవంతునికి పుట్టుట గిట్టుట అనేవి లేనేలేవు కదా! ఐనా మనకు భగవంతుని జన్మదినాలను జరుపుకోడం ఆనవాయితీగా వస్తున్నది. శ్రీముఖ నామ సం శ్రావణ బహుళ అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. కృష్ణాష్టమిని “గోకులాష్టమి” శ్రీకృష్ణజన్మాష్టమి”, “శ్రీకృష్ణజయంతి” ,”జన్మాష్టమి” అనికూడ అంటాం. భగవంతుడైన కృష్ణుడు దుష్టశిక్షణ , శిష్టరక్షణకోసం  యుగయుగాల్లోజన్మిస్తుంటానని చెప్పడంవలన మనం పండుగలు జరుపుకుంటూ ,మనలోని రాక్షసగుణాలను రూపుమాపుకుని, శాంతం, సేవాతత్పరత, దానం, సమిష్టిపూజలూ, చేసుకుని మనలో స్నేహభావాలను పెంపొందించుకోను ప్రయత్నిస్తుంటాం.

 

‘కృషితీతికృష్ణః ‘అంటే హృదయభూమిని సాగుచేయువాడు అనిఅర్ధం, ‘కుష్ తీతి కృష్ణః ‘నిరంతరం ఆనందంగాఉండేవాడని అర్ధం, భగవంతునికి ఆనందం కాకమరేమిటి! ,’కర్షతీతికృ‘సర్వమానవాళినీ ఆకర్షించేవాడని అర్ధo.

 

ఐదువేల సం.పూర్వం ద్వాపరయుగంలో ధనంతో మదించిన రాజులు మానవాకారంలో ఉన్న దానవుల వలె చెలరేగి సాధువులను, సామాన్య జనులను పీడించసాగారు. ఈ అధర్మవర్తనులను భరించలేక భూమాత మహావిష్ణువును ” ఈ పాపభారాన్నిమోయలేకున్నానని ” మొరపెట్టుకోగా శ్రీమహావిష్ణువు భక్తరక్షణకై తాను మానవాకారం దాల్చుతానని ఆమెకు మాట ఇచ్చాడు. దేవతలు భూలోకంలోయాదవులుగా జన్మించగా , తాను దేవకీదేవి అష్టమగర్భమున జన్మించాడు.

 

‘ పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం-   ధర్మసంస్థాపనార్ధాయసంభవామియుగేయుగే …’ అని ప్రవచించిన కృష్ణభగవానుడు కంసుడు, చాణూరుడు మొదలుకొని ,పూతన వంటి ఇంకా అనేక దుష్ట రాక్షసులనూ ,శిశు పాలుడు, పౌండ్రక వాసుదేవుడు, చివరగా పాండవుల ద్వారా దుష్ట దుర్యోధనాదులనూ సంహరిస్తాడు, ధర్మస్థాపనకు ఈ దుష్టసంహారం తప్పదని ఆయన నిర్ణయం.

 

యయాతి కుమారుడైన  ‘ యదు ‘ సంతతే యాదవులు,యాదవుల ప్రభువు’శూరుడు’, అతడికి ఇద్దరు కుమారులుకాగా , రాజ్యాన్ని రెండుగా విభజించి ‘ మధుర ‘ను ఉగ్రసేనునికి,  ‘శూరసేన’భాగాన్ని దేవకునికి ఇలా ఇద్దరు కుమారులకూ పట్టం కడతాడు. ఉగ్రసేనుని కుమారుడు,  ’కంసుడు’, దేవకుని కుమార్తె దేవకి. కంసునికి సోదరి దేవకి అంటే అమిత ప్రీతి. దేవకీదేవికి వసుదేవునితో వివాహం జరగ్గానే. దేవకిని భర్త ఇంట దించడానికి వెళుతున్నకంసునికి “ఆకాశవాణి వాక్కు ” ఈమె అష్టమగర్భాన జన్మించేవాని వలన నీకు ప్రాణహాని ” అని వినిపించగానే కంసుడు ఆమెను సంహరించబోతాడు . వసుదేవుని విన్నపంతో వారిని చెఱసాలలోఉంచి , పుట్టిన బిడ్డలందరినీ చంపసాగాడు.

 

శ్రీమహావిష్ణువు అష్టమగర్భాన దేవకీదేవికి జన్మించి, వ్రేపల్లె చేరటం,యశోదనందుల బిడ్డగా పెరుగుతూ యాదవులతో, గోపకాంతలతో ఆటపాటల్లో మునిగి, చిలిపిపనుకు, లీలలూ చూపటం , కంసుడు పంపే రక్కసులందరినీ సంహరించటం, చివరకు కంసుని చంపి తల్లిదండ్రులకు చెఱసాల నుండి విముక్తి ప్రసాదిస్తాడు. పాండవులను అడుగడుగునా కాపాడుతూ భక్తరక్షకుడౌతాడు. కృష్ణావతార ప్రధానలక్ష్యాలు గీతాబోధ, ఎవరిధర్మాన్ని వారు నిర్వర్తించాలని[ మమధర్మ] బోధించడం, దుష్టశిక్షణ, భక్తరక్షణ,శరణాగతసంరక్షణ. బ్రతికిననాళ్ళు నీ భజన తప్పనుగాని  -మరణ కాలమునందు మరతునేమో

 

ఆవేళ యమదూతలాగ్రహమ్మునవచ్చి-ప్రాణముల్ పెకలించి పట్టునపుడు

 

కఫవాతపైత్యముల్ కప్పగా భ్రమచేత  -కంప ముద్భవమంది కష్టపడుచు

 

నాజిహ్వతోనిన్నునారాయణాయంచు -పిలుతునో శ్రమచేత పిలువలేనో

 

నాటి కిప్పుడెచేసెద నామభజన -తలచేదను చేరి వినవయ్య   ధైర్యముగను –

 

అని నారసింహ శతకంలో అన్నమాటను —-

 

కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరానం -అద్వైవమే విశతు మానసరాజహంసః|| –

 

ప్రాణ ప్రయాణసమమే కఫవాత పిత్తై -కంఠావరోధనవిదే స్మరణం కుతస్తౌ||

 

ఓ కృష్ణా! మరణసమయంలో నిన్ను తలంచుచూ నీపాదధూళీలోఐక్యమవాలనే కోరిక నామనస్సులో ఉంది కానీ ఆ సమయాన కఫవాతపైత్యములచే నా కంఠం మూసుకుపోవచ్చు, అపుడు నిన్నుస్మరించగలనో! లేనో? అనే భయంతో  ఇప్పుడే నా ‘మానస రాజహస’ను శతృ అభేద్యమైన ..నీపాద పద్మపంజర లోఉంచు తున్నాను తండ్రీ…! సమ్మతించు. — అని స్మరిస్తాం.

 

భక్తమానసచోరుడైన శ్రీ కృష్ణుడు భక్తుల ఆ ప్రార్ధన మనః పూర్వకంగా ఉందా లేదాని పరీక్షించిన తర్వాతే ప్రసన్నుడవుతాడు.ఆపదలో ఉన్నద్రౌపదిని ఎన్నోమార్లు కాచిన దయామయుడు. సంపూర్ణ శరణాగతులైన పాండవులను అడుగడుగునా కాచి కాపాడుతూ భక్త విజయం గావించిన భగవంతుడు శ్రీకృష్ణపరమాత్మ.

 

అక్రూరవరద మాధవ -చక్రాయుధ ఖడ్గపాణి శౌరిముకుందా

 

శక్రాది దివిజ సన్నుత- శుక్రార్చిత నన్ను కరుణ జూడుము కృష్ణా!

 

దుర్మార్గులను సైతం కరుణించే కృష్ణభగవానుడు తన భక్తులను కంట కాపాడటంలో వెను కాడడు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున బాల కృష్ణుని ఇంట్లోకి ఆహ్వానించను ఇంటి ముంగుట నుండి లోపలికి బియ్య పుపిండి లేదా ముగ్గుతో బాలగోపాలుడి పాదాలను చిత్రిస్తాం. ద్వారాలకు\ మావిడాకులు, వివిధ పూవులతో తోరణాలు కట్టి, గుమ్మానికి పసుపు రాచి కుంకుమబొట్లుపెడతాం. కృష్ణుని విగ్రహాన్ని శుభ్రపరచి, చందనం,కుంకుమలతో తిలకందిద్దుతాం. కృష్ణుని విగ్రహాన్ని, పూజా మందిరాన్ని పూవులతో అలంకరిస్తాం.అక్షింతలు, ధూపదీపాలతో పూజిస్తాం. శొఠిపొడితో ,వడపప్పు, పానకం , అటుకులు నైవేద్యంచేసి అoదరికీ పంచుతాం. ఇది పిల్లలు పెద్దలూ స్త్రీ పురుషులు  అందరూ ఆనందించే పండుగ. విష్ణ్వా లయాలను అత్యంతవైభవంగా అలంకరించి నిర్బహించే పర్వదినం, సాయంకాలం ఉట్టికొట్టడం,భజనలూ, నాట్యాలూ చేసికృష్ణ లీలలను గుర్తుకు తెచ్చుకుని సంతోషించడంతో పాటు మనలోని రాక్షసగుణాలను రూపుమాపే\ ప్రయత్నం కొంతైనా చేయవలసిన పండుగ  జన్మాష్టమి.   కొన్ని ఆలయాల్లో ఈ కృష్ణాష్టమిన శ్రీకృష్ణ శతక పద్యాలపోటీలు నిర్వహిస్తారు, ఎంతో మంచి ఆలోచన ! ఇలాగైనా పిల్లలు పద్యాలు , తెలుగు భాషను మరువకుండా ఉండే ప్రయత్నం హర్షణీయం కదూ! !

 

జయతు జయతు దేవో దేవకీ నందనోయం

జయతు జయతు కృష్ణో వృష్ణి వంశ ప్రదీపః

జయతు జయతు మేఘ శ్యామలః   కోమలాంగో

జయతు జయతు పృధ్వీభారనాశో ముకుందః.. .!

3 thoughts on “అక్రూరవరద మాధవ

  1. చాలా బాగా వ్రాశారండీ!
    దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్ |
    గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్ |
    వాసుదేవాయ విద్మహే రాధా ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్ |

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *