August 11, 2022

చింపాజీలపై పరిశోధనలో అగ్రగామి – జేన్ గుడాల్

రచన : శ్రీనివాస చక్రవర్తి

 

 

స్త్రీ స్వాతంత్ర్యం అంతంత మాత్రంగానే ఉన్న యుగంలో, ఇంకా ఇరవైలు దాటని ఓ చక్కని బ్రిటిష్ యువతి, ఒంటరిగా ఆఫ్రికా అడవుల్లో సంచరిస్తూ, చింపాజీల ప్రవర్తన గురించి లోతుగా అధ్యయనాలు చేస్తూ, చింపాజీలకి, మనిషికి మధ్య ఉన్న పరిణామాత్మక సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకుని, ఆ రంగంలో అగ్రగామి అయిన శాస్త్రవేత్తగా ఎదిగింది. ఆ యువతి పేరే జేన్ గుడాల్.

1934 లో లండన్ లో పుట్టిన జేన్ కి చిన్నప్పట్నుంచి జంతువులంటే మహా ఇష్టం ఉండేది. జంతువులతో ఆడుకుంటున్నట్టు, మాట్లాడుతున్నట్టు కలలు కనేది. ‘టార్జాన్,’ ‘డాక్టర్ డూలిటిల్’ (ఈ మనుషుల డాక్టరు మనుషుల కన్నా జంతువులకే ఎక్కువగా చికిత్స చేస్తూ ఉంటాడు) వంటి పిల్లల పుస్తకాలు చిన్నతనంలో ఈమెకి ఎంతో స్ఫూర్తి నిచ్చేవి. అందరిలాగానే ‘పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్’ అవ్వమన కుండా తన తల్లి ‘వాన్నే’ కూతుర్ని తనకి నచ్చిన దారిలోనే ముందుకి సాగమని ప్రోత్సహించేది. “నీకు ఏం కావాలంటే అది అవ్వు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా అందులో  బాగా పైకొస్తావని నాకు తెలుసు,” అనేది ఆ తల్లి.

ఇరవై రెండేళ్ల వయసులో జేన్ కి తన జీవితాన్ని మార్చేసే ఓ గొప్ప అవకాశం దొరికింది.  ఓ లండన్ ఫిల్మ్ స్టూడియో తో పాటు ఆఫ్రికాకి వెళ్లే అవకాశం దక్కింది. అయితే ప్రయాణానికి కావలసిన ఖర్చులు కూడా తన వద్ద లేవు. వెంటనే ఓ హోటల్ లో వెయిట్రెస్ గా పనిలోకి దిగి, రాత్రనక పగలనక పని చేసి నాలుగు డబ్బులు వెనకేసింది. తగినంత ధనం పోగవగానే ప్రయాణానికి సిద్ధం అయ్యింది.

ఆ ప్రయాణం 1957 లో మొదలయ్యింది. ముందుగా ఆఫ్రికాలోని మొంబాసా లో దిగింది. మొంబాసాలో ‘లూయీ లీకీ’  అనే పేరుమోసిన పురావస్తు శాస్త్రవేత్త ఉండేవాడు. జేన్ ఆయన్ని కలుసుకుని తన ఆశయాల గురించి విన్నవించుకుంది. జేన్ లోని ఉత్సాహం, శక్తి, జంతువుల పట్ల ఆమెకి సహజంగా ఉండే ప్రేమ మొదలైన లక్షణాలు ఆయన్ని అకట్టుకున్నాయి. వెంటనే తనకి అసిస్టెంటుగా పనిచేసే ఉద్యోగం ఇచ్చాడు. టాంజానియాలో ఓ చెరువు సమీపంలో ఉండే చింపాజీలని అధ్యయనం చేసే పనిలో ఆమెని పాల్గొనమన్నాడు. చింపాజీల జీవన రహస్యాలు అర్థమైతే మనిషి యొక్క పరిణామ గతం గురించి ఎన్నో రహస్యాలు తెలుస్తాయని ఆయన ఆలోచన.

ఈ అధ్యయనాలు 1960 లో మొదలయ్యాయి. ఆ రోజుల్లో జేన్ తల్లి కూడా కూతురుతో పాటు పర్యటించేది. యవ్వనంలో ఉన్న స్త్రీ ఆఫ్రికా అడవుల్లో ఒక్కర్తీ పర్యటించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కనుక కూతురితో పాటు ఈ పర్యటనలు ఆ తల్లికి తప్పలేదు. మొదటి రెండు వారాలు జేన్ కి కలిగిన అనుభవాలు కాస్త నిరుత్సాహ పరిచాయి. తనని అంత దూరంలో చూడగానే చింపాజీలు పరుగు అందుకునేవి. పోనీ తను చూసినంత మేరకు కూడా చింపాజీల ప్రవర్తనలో తనకి విశేషంగా ఏమీ కనిపించలేదు. వచ్చిన పని విఫలమయ్యింది అన్న బాధ మనసులో దొలిచేస్తుండగా అనుకోకుండా ఓ సంఘటన జరిగింది.

చింపాంజీలు శాకాహారులు అని అంతవరకు జేన్ అనుకునేది. కాని ఒకరోజు ఓ విచిత్రమైన సంఘట కనిపించింది. ఓ చింపాజీ ఓ చెదల పుట్ట పక్క కూర్చుని ఓ పొడవాటి పుల్లని పుట్టలోకి దూర్చి దాంతో చెదలు “పట్టి” తింటోంది. పుల్లని ఓ పనిముట్టుగా వాడి, దాంతో ఆ పురుగులని “వేటాడి” తినడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది. గిట్టలు, కొమ్ములు, ముక్కులు, పంజాలు మొదలైన దేహాంగాలని కాకుండా మరో వస్తువుని పనిముట్టుగా వాడి ఆహారాన్ని సేకరించడం జంతులోకంలో అరుదైన విషయం. ఆ రోజుల్లో పెద్దగా తెలియని విషయం.  పనిముట్లు వాడే దశ ఆదిమానవుడి పరిణామ క్రమంలో ఓ ముఖ్యమైన మలుపుగా చెప్పుకుంటాం. అలాంటి పనిముట్ల వినియోగం ఈ జంతువులలో కనిపించడం విశేషం.

చింపాజీలలో ఈ పనిముట్ల వినియోగం గురించి ప్రొఫెసర్ లీకీ కి వివరంగా ఉత్తరం రాసింది. ఆయన సంతోషం పట్టలేకపోయాడు. “ దీంతో ‘పనిముట్టు’, ‘మనిషి’ మొదలైన పదాలకి కొత్త నిర్వచనాలు ఇవ్వాలి, లేదా చింపాజీలు మనిషితో సమానమని ఒప్పుకోవాలి,” అంటూ ఆయన ఉత్సాహంగా జవాబు రాశాడు.

తరువాత జేన్ ధ్యాస చింపాజీలలో సాంఘిక  జీవనం మీదకి మళ్లింది. మనుషులలో లాగానే చింపాజీలలో కూడా విస్తృతమైన సాంఘిక పారంపర్యం ఉంటుంది. ‘నువ్వెక్కువా? నేనెక్కువా?” అన్న భేటీ మగ చింపాజీల  మధ్య తరచు వస్తుంటుంది. బలప్రదర్శనతో మగ చింపాజీలు ఇతర చింపాజీల మీద  తమ ఆధిక్యతని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ బలాబలాల పోటీ గెలిచిన మగ చింపాజీని ‘ఆల్ఫా మేల్’ (మొదటి మగాడు!) అంటారు. అతడే ముఠా నాయకుడు అవుతాడు. అయితే అంతకన్నా బలమైన చింపాజీ రంగప్రవేశం చేసినప్పుడు, ఇంద్రపదవి లాగా ఈ పదవి చేతులు మారిపోతుంటుంది!

చింపాజీలు సాధు జంతువులు ససేమిరా కాదని తెలుసుకుని జేన్ నిర్ఘాంపోయింది. చింపాజీ ముఠాల మధ్య కొట్లాటలు తరచు జరుగుతుంటాయి. ఒక “ముఠా నాయకుడు” తన ముఠాతో సహా వెళ్లి శత్రు ముఠా మీద యుద్ధం ప్రకటిస్తాడు.

ఆ యుద్ధంలో బలమైన చింపాజీలు బలం తక్కువైన చింపాజీలని తీవ్రంగా గాయపరచి, ఆ గాయలతోనే ప్రాణాలు వొదిలే స్థితికి తెస్తాయి. మనుషుల్లో ‘గ్యాంగ్ వార్’ లకి ఈ కలహాలకి పెద్దగా తేడా ఉన్నట్టు లేదు.

జేన్  చేసిన ఈ ప్రప్రథమ అధ్యయనాలన్నీ చక్కని ఫోటోలతో సహా ఆ రోజుల్లోనే ‘నేషనల్ జ్యాగ్రఫీ’ పత్రికలో అచ్చయ్యాయి. ఆ ఫోటోలు తీసిన హ్యూగో వాన్ లావిక్ ని ఆమె తరువాత వివాహం చేసుకుంది. ఇద్దరి కృషి ఫలితంగా అక్కడ “గోంబే స్ట్రీమ్ రీసెర్చ్ సెంటర్” అనే గొప్ప పరిశోధనా కేంద్రం  వెలసింది. కొన్ని దశాబ్దాలుగా ఈ కేంద్రం చింపాంజీల పరిశోధనలో ప్రపంచంలో అగ్రస్థాయిలో నిలిచింది. కేంద్రంలో సిబ్బంది పెరిగారు. చింపాంజీల జీవన విధానంలో ఎన్నో అంశాలని ఈ బృందం క్రమబద్ధంగా అధ్యయనం చేస్తూ వచ్చింది. ఇరవై అయిదేళ్ల పాటు ఆమె చేసిన పరిశోధనలు 1986  లో “గోంబే చింపాజీస్ – పాటర్న్స్ ఆఫ్ బిహేవియర్” (గోంబే చింపాంజీలు – వాటి ప్రవర్తనలో విశేషాలు) అనే పుస్తకంగా వెలుడ్డాయి.  జేన్ గుడాల్ కృషి నుండి స్ఫూర్తి పొందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు చింపాంజీల మీద పరిశోధనలు చేసి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. జేన్ గుడాల్ చేసిన వైజ్ఞానిక కృషికి గుర్తింపుగా ఎన్నో జంతు జాతుల, వృక్ష జాతుల పేర్లలో ఆమె పేరు కలిపారు. ఆమె సుదీర్ఘ వైజ్ఞానిక జీవితంలో ఆమె పొందిన అవార్డులు కోకొల్లలు.   స్త్రీలు వైజ్ఞానిక రంగాల్లో కేవలం రాణించడమే కాదు, తలచుకుంటే వారి వారి రంగాల్లో ప్రపంచంలోనే అగ్రగాములుగా ఉండగలరని జేన్ గుడాల్ నిదర్శనం మనకి స్పష్టం చేస్తోంది.

 

 

 

2 thoughts on “చింపాజీలపై పరిశోధనలో అగ్రగామి – జేన్ గుడాల్

  1. రసజ్ఞ గారు,
    “గోంబే చింపాజీస్ – పాటర్న్స్ ఆఫ్ బిహేవియర్” నేను చదవలేదు. కాని నెట్ లో, గూగుల్ బుక్స్ లో చూసినంత మేరకు ఆసక్తికరంగా అనిపించింది. ఇలాంటి పుస్తకాలు తెలుగులో ఉంటే బావుంటుంది. అందుకోసం ఇటు శాస్త్రం, అటు తెలుగు తెలిసిన మీ బోటి వాళ్ళు పూనుకుంటే ఇంకా బావుంటుంది!

  2. చాలా ఆసక్తికరంగా ఉందండీ, “గోంబే చింపాజీస్ – పాటర్న్స్ ఆఫ్ బిహేవియర్” చదవాలనుంది. ఆంత్రోపాలజీ చదువుకునేటప్పుడు వీటి (స్కల్ పేట్టర్న్స్) గురించి కాస్త తెలుసుకున్నాను కానీ ఇది చదివాక ఇంకా తెలుసుకోవాలనుంది. ఆవిడ ఆసక్తికి తగ్గట్టు ఆవిడకి లభించిన ప్రోత్సాహం ప్రశంసనీయం.
    మీకు ధన్యవాదాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *