September 23, 2023

వాయువు

రచన:  రసజ్ఞ

 

పంచభూతాలలో రెండవది, మానవ మనుగడకి అత్యంత ఆవశ్యకమయినది వాయువు. దీనినే వ్యవహారికంగా గాలి అంటాము. దీనికి శబ్ద, స్పర్శ అనెడి ద్విగుణాలున్నాయి. భాగవతం ప్రకారం ఆకాశం నుండీ వాయువు ఉద్భవించినది. వాయువుకి అధిదేవత వాయుదేవుడు. ఈయన వాయువ్యానికి దిక్పాలకుడు. ఈయన భార్య అంజన, వాహనం దుప్పి, ఆయుధం ధ్వజం, నివాసము గంధవతి. తైత్తరీయోపనిషత్తులో వాయువుని “త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి” (నువ్వు ప్రత్యక్ష బ్రహ్మవి) అని సంబోధించారు. సర్వదా చరిస్తూ ప్రతీచోటా నిండి ఉన్నా, వాయు ప్రవర్తన అన్ని వేళలా ఒకే విధముగా ఉండదు. ప్రాణవాయువై ప్రాణులకి జీవాన్ని పోస్తుంది, ఎన్నో వ్యాధుల నుండీ రక్షణనిస్తూ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, పిల్ల తెమ్మెరలతో మానసికోల్లాసాన్నీ, ఆహ్లాదాన్నీ కలిగిస్తుంది, బరువెక్కిన మేఘాలను ఆత్మీయంగా తాకి వర్షాలను కురిపిస్తుంది, ఎన్నో కబుర్లను, రుచులను చేరవేస్తుంది, వెదురులో చేరి సంగీతాన్ని పలికిస్తుంది, అప్పుడప్పుడు భయంకరంగా మారి భీభత్సాలను, ఉత్పాతాలను సృష్టిస్తుంది. అందువలననే పర్వతాలను, భూమిని సైతం పెకిలిస్తూ (టెక్టోనిక్ ప్లేట్ లో కదలికలు రావటం వలన భూకంపాలు వస్తాయి) ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగల వాయు శక్తిని ఒక దేవతగా అభివర్ణించారని ఋగ్వేదంలో చెప్పబడింది. ఈ వాయువు యొక్క గుణాలను ఆధారంగా చేసుకుంటే ఇవి దేవయానాలు (రాజస గుణ వాయువులు), పితృయానాలు (తామస గుణ వాయువులు) అని రెండు రకాలుగా ఉంటాయి.

వాయువులని మరుత్తులు అని కూడా అంటారు. వీరి జనన, నామకరణ వృత్తాంతం అంతా రామాయణంలో బాలకాండలో విశాలనగరంలో దితి తపస్సు చేసిన చోటుని చూసిన రామలక్ష్మణులకి విశ్వామిత్రుడు చెప్తునట్టు వస్తుంది. ఆ ప్రకారముగా, దేవ దానవ యుద్ధములో దానవులంతా ఇంద్రుడి చేత సంహరింపబడితే, ఆ బాధతో, పగతో, దితి తన భర్తయిన కశ్యప ప్రజాపతిని శక్ర హంతారం (ఇంద్రుడిని చంపే కొడుకు) కావాలంటుంది. దానికాయన వెయ్యి సంవత్సరాలు నియమ నిష్టలతో, శుచిగా తపోనిష్టలో ఉంటే అటువంటి పుత్రుడు పుడతాడు అని వరమిస్తూ దితిని స్పృశించి తపస్సుకి వెళిపోతాడు. ఇంద్రుని మీద పగ తీర్చుకోవాలని శుక్లప్లవనమునకు వెళ్ళి తపస్సు మొదలుపెడుతుంది దితి. ఆమెకు ఎన్నో సపరియలు చేస్తూ ఆమె తపస్సు చేస్తున్న ఆశ్రమంలోనే ఇంద్రుడు ఆమెను కనిపెట్టుకుని ఉంటాడు. ఇహ తపస్సు పూర్తవ్వడానికి సరిగ్గా పది సంవత్సరాలు ఉందనగా (అనగా ౯౯౦ సంవత్సరాలు గడిచాక) దితి కాళ్ళు పెట్టుకునే వైపు తల పెట్టుకుని నిద్రపోతుంది. అది చేయకూడని పని కనుక ఆమె అశుచి అవుతుంది. సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఇంద్రుడు ఆమె గర్భంలోనికి ప్రవేశించి గర్భంలోని పిండాన్ని ఏడు ముక్కలు క్రింద కోసేస్తాడు. ఆ నొప్పికి తట్టుకోలేని పిండాలు ఏడుస్తుంటే ఇంద్రుడు “మా రుద” (ఏడవద్దు) అని అంటాడు. ఇదంతా తన గర్భంలో జరిగేసరికి దితికి మెలకువ వచ్చి ఇంద్రుడిని బయటకి రమ్మంటుంది. బయటకి వచ్చిన ఇంద్రుడు తన తప్పేమీ లేదనీ, ఆమె అశుచి అవ్వటం వలనే ఇలా చెయ్యవలసి వచ్చిందనీ చెప్తాడు. అది విన్న దితి తన తప్పుని ఒప్పుకుని, తన గర్భస్థ పిండాన్ని చంపినందుకు గాను ఇంద్రుడిని వరం కోరుకుంటుంది.

” బ్రహ్మలోకం చరత్వేకః ఇంద్రలోకే తధాపరః
దివి వాయురితి ఖ్యాతః త్రితయోపి మహాశయాః
చత్వారస్తు సురశ్రేష్ఠ దిశోవై తవశాసనాత్
సంచరిష్యతి భద్రంతే దేవభూతాః మమాత్మజాః
స్వత్కృతేనైవ నామ్నా మారుతాయితి విశృతాః “

ఆ ఏడుగురిలో ఒకరు బ్రహ్మలోకంలో, ఇంకొకరు ఇంద్రలోకములో, మరొకరు భూమి మీద వాయువు అనే పేరుతో ఉంటూ ఈ ముగ్గురూ మహాయశస్సు పొందాలి. మిగిలిన నలుగురూ నాలుగు దిక్కులలో ఉంటూ నువ్వు చెప్పినట్టు వింటూ ఉండేలా చేసి వీరందరినీ దేవతా గణాలలో చేర్చుకో. వీరిని “మా రుద” అని నువ్వు అన్నట్టే మరుత్తులుగా నిశ్చయించాను. ఇకనించీ వీరంతా మారుదులు (మారుతులు) లేదా మరుత్తులుగా ఖ్యాతి పొందేలా చేయి అని కోరుకుంటుంది. దానికి అంగీకరించిన ఇంద్రుడు అలానే దీవిస్తాడు. ఆ విధముగా ఒక రాక్షసుడు కావలసిన వాడు ఏడు దేవతా గణాలు అయ్యి మరుత్తులు జన్మించారు.

 

విష్ణు పురాణం ప్రకారం ఈ ఏడుగురి పేర్లూ అవహము, ప్రవహము, సంవహము, ఉద్వహము, వివహము, పరివహము, పరావహము.

అవహము: మేఘ మండలానికీ, భూమండలానికీ మధ్యన ధ్వనిస్తూ, అంతటా సంచరిస్తూ ఉంటుంది. ఈ వాయువు వలననే సూర్యచంద్రులు, నక్షత్రాల గమనాలు (ఉదయించటం, అస్తమించటం) జరుగుతాయి.

ప్రవహము: సూర్య మండలానికీ, మేఘ మండలానికీ మధ్యన ఉంటుంది. మెరుపు మెరిసినప్పుడు ఆ మెరుపుకి వచ్చే కాంతి ఏదయితే ఉందో అది ఈ వాయువు వలననే కలుగుతుంది.

సంవహము: నక్షత్ర మండలానికీ, చంద్ర మండలానికీ మధ్యన ఉంటుంది. అసామాన్యమయిన వేగాన్ని కలిగి పర్వతాలను సైతం నుజ్జు నుజ్జు చేసే శక్తి కలిగి ఉంటుంది. వృక్షాలలో, చెట్లలో జీవరసం ఏర్పడటానికి ప్రధానమయినది కూడా ఇదే అవటం విశేషం.

ఉద్వహము:  చంద్ర మండలానికీ, సూర్య మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువు చాలా బలమయినది. మేఘాలు వర్షించేలా చేయటమే కాక దేవ విమానాలను (పుష్పక విమానం, మొ) నడిపేది కూడా ఈ వాయువే.

వివహము: గ్రహ మండలానికీ, నక్షత్ర మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువు దివ్యజలాలకు (ఆకాశగంగ, మొ) నిలయం. అమృత నిధి అయిన చంద్రుడు చల్లగా ఉండటానికీ, సూర్య రశ్మి భూమిని చేరటానికి కూడా ఈయనే కారణం.

పరివహము: ధృవ మండలానికీ, సప్తర్షి మండలానికీ మధ్యన ఉంటుంది. ప్రాణాధారుల (ప్రాణము కలిగి ఉన్న ప్రతీదీ) ప్రాణాలను చివరి దశలో తొలగించేది ఇదే. ఈ (పరివహ) వాయు ధర్మం ప్రకారమే మృత్యువు, యముడు నడుచుకుంటారు.

పరావహము: సప్తర్షి మండలానికీ, గ్రహ మండలానికీ మధ్యన ఉంటుంది. ఈ వాయువును ఎవరూ అతిక్రమించలేరు అంటూ వీరు నిత్యం నెరవేరుస్తున్న కార్యాలను నారద పురాణము వివరిస్తోంది.

దితి పుత్రులు మరుత్తులు అయ్యారు అని తెలిసింది కదా! మరి దితికి (వైవస్వత మన్వంతరానికి) ముందు ఉన్న మన్వంతరాలలో మరుత్తులు ఎవరు? అన్న సందేహం ఒకసారి నారద మహామునికి కలిగి, పులస్త్యుని వద్ద వ్యక్తం చేస్తాడు. దానికి సమాధానంగా పులస్త్యుడు ప్రతీ మన్వంతరంలో వారి జన్మ వృత్తాంతాలను వివరిస్తాడు.

స్వాయంభువ మన్వంతరం: స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు, అతని కుమారుడు సవనుడు. ఈ సవనుడు పిల్లలు లేకుండానే మరణిస్తాడు. దానితో అతని భార్య సుదేవ (సునాభ కుమార్తె) పిల్లలు లేకుండానే చనిపోయాడే అని బాధపడుతుంది. అప్పుడు అశరీరవాణి చెప్పినట్టుగా భర్త చితి మీద ఈమె కూడా కూర్చుని దగ్ధమవుతుంది (సతీ సహగమనం అనమాట). అప్పుడు ఈ దంపతులిరువురూ ఆకాశానికి ఎగిరి వెళ్ళి, అక్కడ సంభోగం చెందగా వచ్చిన శుక్రం ఆకాశం నుండి జారి భూమి మీద పడిపోతుంది. అలా జరగగానే వీరిరువురూ బ్రహ్మ లోకానికి వెళిపోతారు. అయితే ఆకాశం నుండి జారి పద్మంలో పడిన ఆ శుక్రాన్ని సమాన, నళిని, వపుష్మతి, చిత్ర, విశాల, హరిత, అళిని అనే సప్తర్షుల భార్యలు అమృతమని భ్రమపడి, దానిని త్రాగవలెను అన్న కోరికను వారి భర్తలతో చెప్పి, భర్తలను పూజించి త్రాగేస్తారు. త్రాగిన వెంటనే వారంతా బ్రహ్మ తేజాన్ని కోల్పోతారు. అలా దూషిత శీలలు అయిన ఈ ఏడుగురినీ తమ భర్తలు వదిలేస్తారు. ఆ ఏడుగురికీ పుట్టిన పిల్లలు భయంకరంగా ఏడుస్తూ ఉంటారు. వారిని “మా రుద” (ఏడవద్దు) అనటం వలన వారు మరుత్తులుగా స్థిరపడ్డారు. ఆ విధముగా స్వయంభువ మన్వంతరంలో వెలసిన వారు ఆది మరుత్తులు.

స్వారోచిష మన్వంతరం: స్వారోచిష మనువు కుమారుడు క్రతుధ్వజుడు. అతని ఏడుగురు కుమారులూ (అగ్ని సమానులు) ఇంద్రపదవి కోసం బ్రహ్మను గూర్చి తపస్సు చేయటానికి మహా మేరు గిరికి వెళతారు. ఈ విషయం తెలిసి భయపడిన ఇంద్రుడు తపోభంగం కలిగించడానికి అప్సరసలలో శ్రేష్ఠురాలయిన పూతనను పంపిస్తాడు. క్రతుధ్వజుని ఏడుగురు కుమారులూ నదిలో స్నానమాచరిస్తున్న సమయములో పూతన కూడా అదే నదిలో స్నానమాచరించడంతో వీరి మనసు అదుపు తప్పి వారి వీర్యం ఆ నదిలో పడిపోతుంది. ఈ విధముగా తపోభ్రష్టులయిన ఆ ఏడుగురూ తమ రాజ్యానికి వెళిపోతారు. నదిలో పడిన వీరి వీర్యం మహాశంఖుడు అనే మొసలి భార్య శంఖిని మ్రింగేస్తుంది. కొన్ని రోజులకి జాలరి వాళ్లకి ఈ మొసలి (శంఖిని) దొరకడంతో క్రతుధ్వజునికి ఆజ్ఞ ప్రకారంగా ఆ మొసలిని తీసుకెళ్ళి వారి ఇంటి వద్దన ఉన్న బావిలో వేస్తారు. కొంత కాలానికి ఆ శంఖినికి ఏడుగురు పిల్లలు పుడతారు. వారు గట్టిగా, భయంకరంగా ఏడుస్తూ ఉండగా “మా రుద” (ఏడవద్దు) అనటం వలన వారు మరుత్తులుగా స్థిరపడ్డారు.

ఉత్తమ మన్వంతరం: నిషధ దేశాధిపతి వపుష్మానుని పుత్రుడైన జ్యోతిష్మంతుడు పిల్లల కోసం మందాకినీ నదీ తీరంలో తపస్సు చేస్తుండగా అతని భార్య సుందరి (దేవ గురువు పుత్రిక) కూడా భర్తకు పరిచర్యలు చేస్తూ, సమిధలు, పుష్ప ఫలాలు సమకూరుస్తూ ఆమె కూడా అరణ్యవాసం చేస్తుంది. దీని వలన ఆమె బాగా కృశించి, శల్యమై పోతుంది. తపస్తేజముతో వనములో తిరుగుతున్న ఈమెను చూసిన సప్తర్షులు “మీ సద్గుణాలకు మా అనుగ్రహం తోడై మీ కోరిక నెరవేరి, పుత్ర సంతానం కలుగుతుంది, మీరు ఇంటికి వెళ్ళండి” అని వరమిస్తారు. వారివురూ వారి ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకి ఆవిడ గర్భం ధరించడం, భర్త మరణించడం, అది సహించలేని ఆవిడ కూడా సహగమనానికి సిద్ధపడి, తన భర్త చితాగ్నిలో దూకేయటం జరుగుతాయి. అలా దూకటం వలన ఆమె గర్భములో నుండీ ఒక మాంస ఖండం ఎగిరి బయట నీళ్ళల్లో పడి, శైతల్యానికి ఏడు భాగాలుగా విడిపోతుంది. దాని నుండీ ఉద్భవించిన వారే మరుత్తులు.

తామన మన్వంతరం: ఋతుధ్వజుడు అనే రాజు కుమారుల కోసం యజ్ఞం మొదలు పెట్టి, అగ్నిలో తన రక్త, మాంస, అస్థి, రోమ, కేశ, స్నాయువు, మజ్జ, శుక్రం, అన్నిటినీ హోమం చేస్తాడు. సరిగ్గా శుక్రం అగ్నిలో వేసే సమయములో “వద్దు వద్దు వేయద్దు” అనే మాటలు వినపడతాయి. వెంటనే ఆ రాజు చనిపోతాడు. దానితో ఆ అగ్ని (హవ్య వాహనుడు) నుండీ ఎంతో తేజస్సుతో ఏడుగురు శిశువులు ఏడుస్తూ బయట పడతారు. వారే మరుత్తులు.

రైవత మన్వంతరం: రైవతుని వంశంలో రిపుజిత్తనే రాజు, పుత్రులు లేనందున భాస్కరుని ఉపాసించి సురతి అనే పుత్రికను పొందుతాడు. వారివురూ ఒకరి పట్ల మరొకరు ఎంతో వాత్సల్యంతో ఉండేవారు. కొన్నాళ్ళకి రిపుజిత్తు మరణించగా, పితృ వియోగాన్ని భరించలేని ఆమె, సప్తర్షులు వద్దని వారిస్తున్నా వినకుండా చితిని పేర్చుకుని అందులో దగ్ధమవుతుంది. తగలబడుతున్న ఆమె శరీరం నుండీ ఏడుగురు బాలకులు ఉద్భవించగా, వారికి బ్రహ్మ మరుత్తులు అని నామకరణం చేసి దేవతా గణాలలో చేరుస్తాడు. అలా రైవత మన్వంతరంలో మరుద్గణాలు వెలిశారు.

చాక్షుష మన్వంతరం: సప్త సారస్వత తీర్థంలో శుచి వ్రతుడు, సత్యవాది అయిన మంకి అనే తపోధనుడు ఘోరతపస్సులో ఉండగా విఘ్నం కలిగించడానికి తుషితదేవతలు వపు అనే సుందరిని పంపిస్తారు. వపు ఆయన మనస్సును లోబరచుకోగా, ఆయన వశం తప్పడం వలన శుక్రం జారి ఆ సప్త సారస్వత జలాలలో పడుతుంది. వెంటనే తెలివి తెచ్చుకున్న ఆయన ఆగ్రహించి వపును శపించి, తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. ఆ జలములో నుండీ ఏడుగురు పుత్రులు ఏడుస్తూ జన్మిస్తారు. వారే ఆ మన్వంతరంలో మరుత్తులు.

ఈ విధముగా ఒక్కో మన్వంతరంలో ఒక్కో విధముగా మరుత్తులు ఉద్భవించారు. అయితే ప్రతీ సారీ కూడా మా రుద (ఏడవకు) అనటం వలనే మరుత్తులు అయ్యారని తెలుస్తోంది. మరుత్తుల జన్మ వృత్తాంతాన్ని విన్నా, చదివినా పాప పరిహారం కలుగుతుందని వామన పురాణములో వివరించబడింది.

అగ్ని పురాణం ప్రకారం మన శరీరంలో ఉండే మూలాధార చక్రం నుండీ నాడులు బయలుదేరతాయి. వీటిలో ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, హస్తిజిహ్వా, పృథా, యశా, ఆలంబుషా, కుహూ, శంఖిని అనేవి ప్రాణ వాయువులని ప్రసారం చేస్తాయి కావున ప్రముఖమయినవి. ఆ పది రకాల ప్రాణ వాయువులూ ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన, నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయాలు. వీటి స్థాన చలనాలు:

 

” హృది ప్రాణం గుదేపానం ఉదానో నాభి దేశకః
సమానో కంఠ దేశస్థః వ్యాన సర్వ శరీరగః
వాగ్ద్వారే నాగ ఆఖ్యాతః కూర్మాదున్మీలనం స్మృతం
కృకరాత్ క్షుధాజ్ఞేయః దేవదత్తాత్ విజృంభణం
మృతస్యాపి న జహాతి సర్వవ్యాపి ధనంజయః “

ప్రాణ వాయువు: హృదయంలో ఉంటూ జీవాత్మను వృద్ధి చేస్తుంది. ఇది శరీరంలో ఉండే శూన్యత్వాన్ని పూర్తి చేస్తూ మిగతా ప్రాణ వాయువులన్నిటినీ ప్రేరేపిస్తూ ఉంటుంది కావున ఇది మిగతా వాయువులన్నిటికీ అధిపతి. మన శ్వాస రూపములో ఉండేది ఈ వాయువే. ప్రాణి ఆయుర్దాయం తను తీసుకునే ఉచ్ఛ్వాశ, నిశ్వాసల మీద ఆధారపడి ఉంటుంది. వీటిని ప్రాణాయామం ద్వారా అదుపు చేయగలిగితే మనిషి ఆయుర్దాయం పొడిగించవచ్చును.

అపాన వాయువు: ఇది శరీరములో పశ్చిమ భాగములో (గుదము వద్ద) ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి, మల, మూత్ర, శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. అపానయానం (తొలగించటం) చేస్తుంది కనుక అపాన వాయువు అయ్యింది.

ఉదాన వాయువు: ఇది నాభి (బొడ్డు) వద్ద ఉంటూ దేహములో సగ భాగాన్ని పెంచుతుంది. స్పందన (ముఖ, పెదాల, కళ్ళ కదలికలు, మొ.,) కలిగించే వాయువు ఉదానము.

సమాన వాయువు: ఇది కంఠము వద్ద ఉంటూ సర్వ నాడుల పని తీరుని చూసుకుంటుంది. తిన్న ఆహారాన్నీ, త్రాగిన ద్రవాలనీ, వాసన చూసిన వాటినీ రక్త, పిత్త, వాత, కఫములుగా మార్చి సర్వాంగాలకూ సమానముగా పంచుతుంది కనుక సమాన వాయువు అయ్యింది.

వ్యాన వాయువు: ఇది శరీరమంతా ఉంటుంది. శరీర భాగాలను పీడించటం, గొంతు బొంగురు పోయేలా చేయటం, వ్యాధిని ప్రకోపించటం దీని విధులు. వ్యాపన శీలంతో ఉండటం వలన వ్యానము అయ్యింది.

 

ఈ అయిదూ ప్రధాన వాయువులు కాగా మిగతా అయిదూ ఉప వాయువులు. అవే నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలు. వాగ్ద్వారము వద్దన ఉండి మాట వచ్చేలా చేసేది, త్రేన్పు, వాంతి వంటివి తెప్పించేది నాగ వాయువు. కూర్మ వాయువు మనం తిన్నవాటినీ, త్రాగినవాటినీ, మ్రింగటానికే కాక కను రెప్పలు మూసి, తెరవటానికి ఉపయోగపడుతుంది. ఆకలి, దాహం మొదలయిన వాటిని కలిగించేది, తుమ్ము తెప్పించేది కృకర వాయువు. ఆవలింతలు తెప్పించేది దేవదత్త వాయువు. ఇహ మనిషి చనిపోయాక కూడా మానవ శరీరంలోనే కొంతసేపు ఉండగలిగే వాయువు ధనంజయ వాయువు. ఈ ధనంజయ వాయువు వలననే చనిపోయిన శవం కొంతసేపటి తరువాత ఉబ్బుతుంది. ఇవే కాక, ప్రజాపత్య వాయువు అని ఒకటుంటుంది. ఆ వాయు పీడనం వలననే శిశువు తల్లి గర్భము నుండీ బయటకు వస్తుందనీ మార్కండేయ పురాణం చెప్తోంది. ఇలా బయటకు వచ్చే ప్రక్రియలో అలసిపోయిన శిశువుకు ఉత్తేజాన్ని ఇచ్చేది కూడా వాయువే కదా! అలసిన ఒంటికి చక్కని లాలన వాయువు.

 

అథర్వణ వేదంలో మరికొన్ని వాయువుల ప్రస్తావన ఉంది. అవి: సుదనవ వాయువు (మనలో భక్తి భావాన్ని పెంచుతుంది), చిత్రభనవ వాయువు (అగ్నితో మమేకం అవుతుంది), హస్తిన వాయువు (అతి వేగముతో ప్రయాణిస్తూ ఈదురుగాలులను, సుడిగాలులను కలిగిస్తుంది), అహిమన్యవ వాయువు (ఇక వర్షాన్ని కురిపించు అని చెప్పడానికి సంకేతంగా మేఘాన్ని తాకి తొలి చినుకులను విడుదల చేస్తుంది), యువన వాయువు (ఈ వాయువు కారణంగానే మెరుపులు చలిస్తాయి), అధిగ్రవ వాయువు (అపారమయిన ధైర్యాన్ని, శత్రువులని ఎదిరించి నిలబడే సామర్ధ్యాన్నీ ఇస్తుంది), అజ్జోభి వాయువు (అగ్ని త్యాగాలు అనగా సహగమనాలు, అగ్ని ప్రవేశాలు, మొ., వాటిలో ఉంటుంది), వక్షసు వాయువు  (వక్షస్థలం వద్ద ఉంటుంది), చిత్రేయ వాయువు (ఇది కాళ్ళూ, చేతులూ కదల్చడానికి ఉపయోగపడుతుంది), నిమిముక్షు వాయువు (వేటినయినా దగ్గరకి చేర్చడానికి ఉపయోగపడుతుంది, మండేటప్పుడు ఒక్కో అగ్ని కణాన్నీ, వాన కురిసేటప్పుడు మేఘాలనీ దగ్గరకు చేర్చే ముఖ్య వాయువు ఇదే), హిరణ్యేయ వాయువు (దీనినే హిరణ్యేయం అని కూడా అంటారు. ఏ రూపంతోనూ చేరకుండా, పరిభ్రమిస్తూ ఉంటుంది), నర వాయువు (ఇది ఏదో ఒక రూపముతో కలుస్తుంది. అగ్నితో కలిసినప్పుడు “అస్య” అనీ, సూర్యునితో కలిసినప్పుడు “కుక్షి” అనీ రక రకాలుగా పిలుస్తారు), అజ్ర వాయువు (ఎక్కువగా రాత్రిపూట చలిస్తుంది), ఇలా ఎన్నో రకాల వాయువులు మన చుట్టూ ఉంటూ మనకు పరి పరి విధాలుగా ఉపయోగపడుతున్నాయి.

 

పంచభూతాలు ఒకదాని నుంచి మరొకటి ఏర్పడతాయి, ఒక దానితో మరొకటి హరింపబడతాయి, అలానే అదే క్రమములో పునరావృతం అవుతాయి. ఈ మార్పులన్నీ జరగడానికి ముఖ్య కారణం ప్రాణశక్తి. మానవ శరీరం కూడా పంచ భూతాలతో చేసినదే కనుక మనలో ఉండే పంచభూతాలను నడిపేది కూడా ప్రాణశక్తే. మన దేహం అస్వస్థతకు లోనవడానికి ఈ ప్రాణశక్తిలో వచ్చే మార్పులే కారణం. శరీరంలో ఏ భాగానికయినా తగినంత ప్రాణశక్తి అందనప్పుడు (క్రమేణా ఆ భాగం నిర్వీర్యమవుతుంది) లేదా అవసరానికి మించి ప్రాణశక్తి లభించినప్పుడు (అధిక శ్రమకు లోనై) అనారోగ్యం వస్తుంది. ఈ అసమతుల్యాన్ని నివారించాలంటే మనలోని వాయువులన్నీ సక్రమంగా పని చేస్తూ సమతుల్యతతో ఉండాలి. అప్పుడే మన శరీర భాగాల పనితీరు సవ్యంగా ఉండి, సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. అదే విధముగా మన పర్యావరణం కూడా సక్రమంగా పని చేస్తూ, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా కూడా వాయువులన్నీ సమతుల్యతతోనే ఉండాలి. అప్పుడే సుభిక్షతతో వర్ధిల్లుతాము.

 

“ధ్వజ హస్తాయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్”

 

 

19 thoughts on “వాయువు

 1. బంభజ్యమానం బగు నమ్మహాస్తంభంబువలనఁ బ్రళయవేళాసంభూత *సప్తస్కంధ బంధుర* సమీరణ సంఘటిత ….
  అని వ్రాసి యుండుట జూచినాను. నేడు సప్త వాయువుల గూర్చి తెలిసికొంటిని.
  ధన్యవాదములు.

 2. మీరు రాసే వైవిధ్యమైన విషయాలన్నీ చదువుతుంటే నాకెప్పుడూ చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది రసజ్ఞా.. అసలు ఏమేం పుస్తకాలు చదివితే ఇలాంటి కథలన్నీ తెలుస్తాయో కూడా నాకు ఐడియా లేదు. 😛
  ఇలానే రాస్తుండండి.. బోల్డు మంది నేర్చుకుంటారు కొత్త విషయాల్ని.. అభినందనలు.. 🙂

 3. శ్రీ రసజ్న గారికి, నమస్కారములు.

  విజ్నానదాయక విషయాలను తెలియచేశారు. అభినందనలు. ఈ వ్యాసం ద్వారా మరొక విశయంకూడా తెలుస్తుంది: మన వేదాలలో నిగూఢమైవున్న విజ్నానమ్ ఎంత గొప్పదో.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  1. అందుకనే మీకు సంప్రదాయాన్ని అనుసరించి వేద అధ్యయనం చేయడానికి అర్హత ఉంటె వేదాధ్యయనం చేయండి. మీ పిల్లలను మనుమల్లను బంధువులను స్వాధ్యాయం చేయమని ప్రోత్సహించండి.

 4. ఈసారి జ్ఞాన సౌరభాలను ‘వాయువు’ ద్వారా వ్యాపింపజేశారన్నమాట. చాలా బాగుంది మీ వివరణ. అభినందనలు రసజ్ఞ.

 5. మొదట మీ రచనా పటిమ కు అబినందనలు.కాకపోతే ఇది అంతా సైన్సు పరంగా సమర్ధనీయం కాదని సైన్సు విద్యార్థిగా మీకు బాగా తెలుసు.కానీ విషయ సేకరణ అద్భుతం.మీరు మన ప్రాచీన విషయాల్లోని గొప్ప అంశాలను ప్రస్తుతం అవి ఎలా ఉపయుక్తంగా ఉన్నాయో అన్న కోణం లో వ్రాస్తే మరింత బాగుంటుందేమో!అటువంటి అంశాలు చాలా ఉన్నాయి.ఏది ఏమయినా మీ వ్యాసం మరోసారి చాలా ఆసక్తికరంగా ఉంది.

 6. 🙂 థాంక్స్ అండీ! “మన పురాణేతిహాసాలలో ఎన్నెన్ని పరిశోధనలు దాగి ఉన్నాయో” నిజమే అండీ! అవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే ఎంతో విలువయిన సంపద. తప్పకుండా, తీరిక చిక్కినప్పుడల్లా వ్రాస్తూ ఉంటాను. నెనర్లండీ!

 7. రసజ్ఞ గారూ,
  చదవటం మొదలు పెడితే ఏకాగ్రత లోకి తీసుకెళ్తాయి మీ రచనలు. “వాయి దిగ్బంధనం” లా మనసు దిగ్బంధనం చేసేస్తాయి.
  “వాయువు” పై సైతం పురాణ, ఇతిహాస వృత్తాంతాలతో సహా ఎంతో ఎంతో చక్కగా రాశారు. “వాయువు” వెనక ఇన్ని కథలూ, ఇన్ని వృత్తాంతాలూ ఉన్నాయని, ఇలా చూసుకుంటూ పోతే మన పురాణేతిహాసాలలో ఎన్నెన్ని పరిశోధనలు దాగి ఉన్నాయో అనిపిస్తుంది.
  సంస్కృత పద్యాలతో, వాటి అర్ధ వివరణలతో మీ రచాలు చాలా ఆసక్తికరంగా రాస్తారు.
  ఇలాగే మరిన్ని రాస్తూ పోండి, చదువుతూ తెలియనివెన్నో తెలుసుకుంటూ పోతాము.
  ఇంత చక్కని రచనకి మీకు అభినందనలు!

 8. Nice in depth descriptions, lenghtly explanations reflect the comprehensive understanding you developed during your learning of the mythological texts. Good job keep it up

  Regards

  Anand

 9. రసజ్ఞ గారు
  ఎన్నో విషయాలని ఒకేచోట చేర్చి, వాటిని అందరికీ అర్దమయ్యే రీతిలో రాసే మీ ప్రఙ్ఞా పాటవాలకి నా అభినందనలు..
  ***AS USUAL YOUR POST IS SOME THING SPECIAL***

 10. great job
  still now i am in doubt how you did this
  even i am not able to read fast fluently
  I hope this type of writing makes you even more mature to find the real happiness
  all the best
  suresh

  1. ఇవి కథలుగా నేర్చుకోవడం వలన అలా గుర్తుండిపోయాయండీ. మీరు చెప్పింది నిజం, ఆ ఆనందం వర్ణనాతీతం. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

Leave a Reply to ennela Cancel reply

Your email address will not be published. Required fields are marked *