April 22, 2024

అడవి దేవతలు సమ్మక్క సారలక్క

రచన : పి.యస్.యమ్.లక్ష్మి

వరంగల్ జిల్లాలో పేరుపొందిన జాతర ఈ సమ్మక్క సారలక్క జాతర. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ జాతర రెండు సంవత్సరాలకొకసారి మాఘ శుధ్ధ పూర్ణిమనాడు మొదలయి నాలుగు రోజులు సాగుతుంది. ఆంధ్ర ప్రదేశేకాకుండా మధ్య ప్రదేశ్, చత్తిస్ గర్, ఒరిస్సా, మహారాష్ట్రా, కర్ణాటకా, జార్ ఖండ్, ఉత్తర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలనుంచి కూడా భక్తులు ఈ జాతరకు హాజరవుతారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమంది పాల్గొనే గిరిజన జాతరగా ప్రసిధ్ధిగాంచింది. కుంభమేలా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే ఉత్సవంగా కూడా గుర్తింపబడుంది. ఈ జాతరలో వేదోక్త పూజలు వుండవు. పూర్తిగా గిరిజన సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది.

భక్తులు ఇక్కడవున్న జంపన్న వాగులో స్నానాదికాలు పూర్తి చేసుకుని, అత్యంత భక్తి ప్రపత్తులతో, అపరిమిత విశ్వాసాలతో ఈ తల్లులను దర్శించుకుని కానుకలుగా బంగారం (బెల్లము), కొబ్బరికాయలు, కొత్తబట్టలు సమర్పించుకుంటారు. ఈ జాతర సమయంలో సమ్మక్క, సారలక్కలుల అక్కడికివచ్చి, తమని ఆశీర్వదిస్తారని వారి నమ్మకం.

ఇక్కడ దేవతలకు గుళ్ళు, గోపురాలు వుండవు. అసలు దేవతలకు విగ్రహాలే వుండవు. దేవతా చిహ్నాలుకూడా ఎప్పుడూ ఇక్కడ వుండవు. సమ్మక్కకు, సారలక్కకు, వారి భర్తలు పగిడిద్దరాజు, గోవిందరాజులకు విడివిడిగా అరుగులు వుంటాయి. వాటినే గద్దెలంటారు. ఇవి మొదట్లో 12వ శతాబ్దంలో గిరిజనులు ఏర్పరుచుకున్నారు. కాకతీయుల సమయంలోనే ప్రారంభమైన ఈ జాతరలో ప్రతాప రుద్రుడు కూడా ఈ దేవతలకు స్వాగతం పలికాడని, తర్వాత నిజాంకాలంలో కూడా ఈ ఉత్సవాలని నిర్వహించారనీ చెప్తారు.

ఈ దేవతా చిహ్నాలుకూడా ఎప్పుడూ ఇక్కడ వుండవు. రెండేళ్ళకొకసారి జరిగే నాలుగు రోజుల ఉత్సవంలో మొదటి రోజున సమీపంలోని కన్నేపల్లినుంచి సారలమ్మను తీసుకొచ్చి గద్దెమీద ప్రతిష్టిస్తారు. అదేరోజు పగిడిద్దరాజుని, , గోవిందరాజులనుకూడా వారి వారి గద్దెలమీద ప్రతిష్టిస్తారు. రెండవరోజుసాయంకాలం చిలకలపల్లినుంచి సారమ్మ చిహ్నాలయిన కుంకుమ భరిణ, వెదురు కఱ్ఱలను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి గద్దెమీద ప్రతిష్టిస్తారు. జాతరలో ఇదే విశేష ఘట్టం. అమ్మవారు బయల్దేరేముందు జిల్లా కలక్టరుగారు స్వాగతం పలికితే, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవసూచకంగా గాలిలోకి 10 రౌండ్లు కాల్పులు జరుపుతారు. మూడవ రోజు అధిక సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. నాల్గవ రోజు ఈ దేవతలు తిరిగి వన ప్రవేశం చెయ్యటంతో ఉత్సవం ముగుస్తుంది. ఈ ఉత్సవం పూర్తిగా కోయ పధ్ధతిలో జరుగుతుంది. వివిధ రాష్ట్రాలనుంచి గోండులు, కోయలు, భిల్లులు, సవర మొదలగు ఆదివాసీలేకాక ఇతర భక్తులు అనేకమంది ఈ జాతర సమయంలో ఈ దేవతలను దర్శించుకుంటారు.

1998కి పూర్వము ఈ ప్రదేశాన్ని ఎడ్లబండిమీద, కాలినడకన మాత్రమే చేరుకోగలిగేవారు. 1998లో 1000 సంవత్సరాలనుంచి సాగుతున్న ఈ జాతరను ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించి గద్దెలదాకా చేరుకోవటానికి మంచి తారురోడ్డు వేయించారు. ఇప్పుడు సులభంగా ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు.

ఇది కాకతీయ రాజు ప్రతాప రుద్రుని సమయంలో జరిగిన విశేషం. ఈ ప్రాంతం దండకారుణ్యం. దట్టమైన అరణ్యం. ఒకసారి ఇక్కడ నివసించే గిరిజనులు వేటకోసం అడవిలోపలకెళ్ళారు. అక్కడ వారొక అద్భుతాన్ని చూశారు. ఒక పసికందు, ఆ పాపని సంరక్షిస్తూ పులులు, సింహాలు. కోయదొర ఆ పాపని తమ గూడానికి తీసుకువచ్చారు. ఆ పాప వచ్చినప్పటినుంచి ఆ గూడెం, గూడెంలో ప్రజలు ఎంతో అభివృధ్ధిచెంది సుఖ సంతోషాలతో వుండసాగారు. కోయదొర తమ కొండదేవరే ఆ పాప రూపంతో తమ గూడానికి వచ్చిందని ఆమెకు సమ్మక్క అని నామకరణం చేసి గారాబంగా పెంచసాగారు. సమ్మక్క పులులు, సింహాలెక్కి తిరిగేది. గూడెంలోని ప్రజల అనారోగ్యాలని దూరంచేసేది. సంతానంలేని వారికి సంతానం ప్రసాదించేది. యుక్త వయసు రాగానే సమ్మక్కని మేడారం గ్రామపెద్ద పగిడిద్దరాజుకిచ్చి వివాహం చేశారు. వారికి ఒక కుమారుడు – జంపన్న, ఇద్దరు కుమార్తెలు – సారలమ్మ, నాగులమ్మ కలిగారు. ఆ సమయంలో కాకతీయరాజు ప్రతాపరుద్రుడు ఓరుగల్లుని పరిపాలిస్తున్నాడు. పగిడిద్దరాజు పాలించే మేడారం కాకతీయ సామ్రాజ్యంలోకి వస్తుంది. ఒకసారి వరుసగా నాలుగు సంవత్సరాలు మేడారం ప్రాంతమంతా కరువు కోరల్లో చిక్కుకోవటంవల్ల అక్కడి ప్రజలు శిస్తులు చెల్లించలేకపోయారు. ప్రతాపరుద్రుడు ఆగ్రహించి తన సైన్యాధికారయిన యుగంధరుడి నాయకత్వంలో పోరుకి ఉసిగొల్పాడు. సాహసోపేతులైన గిరిజనులు ధైర్యంగా యుధ్ధానికి దిగారు. ఇరువైపులా అపార జన నష్టం జరిగింది. అక్కడ పారుతున్న సంపెంగవాగంతా యుధ్ధ వీరుల రక్తంతో ప్రవహించింది. ఆ యుధ్ధంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజు, అల్లుడు గోవిందరాజు అసువులు బాశారు. కుమారుడు జంపన్న యుధ్ధంలో సంపెంగ వాగులో ప్రాణాలర్పించాడు. అందుకే ఆ వాగుకి జంపన్నవాగని పేరు వచ్చింది. అప్పడు యుధ్ధంలోకి వచ్చిన సమ్మక్క, కుమార్తె సారలక్క అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి, గిరిజనులకు గెలుపు సంపాదించబోయే సమయంలో వెనుకనుంచి జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. సమ్మక్క తన రక్తం భూమిమీదపడితే ఆ ప్రాంతం కలకాలం క్షామంతో మగ్గుతుందని, గాయానికి గుడ్డకట్టి తన గుఱ్ఱంమీద మేడారానికి తూర్పుదిశగా వెళ్ళి అంతర్ధానమయమపోయింది.

యుధ్ధానంతరం గిరిజనులు సమ్మక్కకోసం వెతుకగాకనబడలేదు. ఒక నాగవృక్షం ఛాయలోవున్న పుట్టదగ్గర ఒక కుంకుమ భరిణ చూశారు. ఆ నాగ వృక్షాన్ని, కుంకుమ భరిణని సమ్మక్క ప్రతిరూపంగా ఆరాధిస్తారు. ఆ నాగ వృక్షంతో చెక్కబడ్డ సమ్మక్కని, కుంకుమభరిణెని జాతర సమయంలో ఊరేగింపుతో అత్యంత కోలాహలంగా తీసుకొచ్చి సారలక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులతో గద్దెలమీత ప్రతిష్టిస్తారు (వీరికి కూడా విగ్రహాలు వుండవు, కర్రలతో చేసిన ప్రత్యేక చిహ్నాలు తప్ప.) వివిధ ప్రాంతాలనుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చిన వీరిన, ఉత్సవం తరువాత ఎక్కడివారిని అక్కడ చేరుస్తారు. అదే వన ప్రవేశం.

గిరిజనులు అప్పుడు ప్రారంభించిన ఈ ఉత్సవాలలో, విషయం తెలుసుకున్న ప్రతాపరుద్రుడు కూడా పాలుపంచుకున్నాడు.

భక్తులు ఉత్సవ సమయంలో జంపన్న వాగులో స్నానాదికాలు పూర్తిచేసుకుని, గద్దెలపై ప్రతిష్టింపబడ్డ సమ్మక్క, సారలక్క, వారి భర్తలు పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించి కానుకలు సమర్పించుకుంటారు. వారు ఎల్లవేళలా తమని కాపాడుతూనే వుంటారని గాఢంగా విశ్వసిస్తారు.

50 ఎకరాల స్ధలంలో జరిగే ఈ జాతరకి కోటిమందిపైన ప్రజలు హాజరవుతారు. ఏ సౌకర్యాలూలేని కుగ్రామంలో, అందులో అడవి ప్రదేశంలో ఇంతమంది జనానికి సౌకర్యాలు కల్పించటానికి ఎంతమంది ఎంత శ్రమిస్తారోకదా. రాను రాను ఈ ఉత్సవాలలో గిరిజనులేకాక అందరూ పాలుపంచుకోసాగారు. ప్రస్తుతం ఇది భారతదేశంలో కుంభమేలా తర్వాత అత్యధిక జనం పాల్గొనే జాతర.

1 thought on “అడవి దేవతలు సమ్మక్క సారలక్క

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *