May 19, 2024

కలసి ఉంటే కలదా సుఖం???

అమ్మా నాన్న, అన్న, తమ్ముడు, అక్క, పిల్లలు. ఇలా ఎన్నో బంధాలతో ఇమిడి ఉండి ఒక కుటుంబం. ఒక స్త్రీ, పురుషుడు కలిసి మరో కుటుంబాన్ని ప్రారంభించి, వంశాన్ని ముందుకు నడిపిస్తారు. తమ పిల్లలకోసం అహర్నిశలు కష్టపడతారు. తాము పడ్డ కష్టాలు తమ పిల్లలు పడకూడదు అని వారికి అన్ని వసతులు సమకూర్చి, చదువులు చెప్పించి, వారు కోరినవి తమ తాహతుకు తగినవి అయినా,  కాకున్నా ఎలాగో అమరుస్తారు… పిల్లలు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలలో స్థిరపడాలని ప్రతీ తల్లితండ్రి కోరుకుంటారు. ఆ పిల్లలు కూడా ఎంతో ఆప్యాయతతో  కలిసి మెలసి ఉంటారు. వారి మధ్య చిన్న చిన్న గొడవలు తప్ప మనసుకు చేర్చుకుని బాధపడేవి, ఒకరిమీద ఒకరికి అనమానం కలిగించేవి తక్కువే ఉంటాయి. ఒకరికొకరు సాయం చేసుకుంటూ, కలిసి సంతోషాన్ని, దుఖాన్ని పంచుకుంటారు. కాని పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత ఎందుకో మరి వారి మధ్య దూరం పెరిగిపోతుంది. ఒకే రక్తం పంచుకుని పుట్టినవాళ్లే నువ్వు , నేను, నీ కుటుంబం, నా కుటుంబం, ఖర్చులు, లెక్కలు అంటూ అనుమానాలు పెంచుకుని ద్వేషించుకుంటూ ఉంటారు. పెళ్లిళ్లు అయ్యాక ఆ దూరం మరింత పెరుగుతుంది. ఒకవేళ పిత్రార్జితమైన ఆస్ధి ఉంటే ఆ గొడవలు మరీ దారుణంగా ఉంటాయి..

 

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబమే ముద్దు అనుకునేవారు కాని ఇపుడు చదువులు పూర్తి చేసుకుని పెళ్ళి కాగానే వేరుగా దూరంగా ఉంటేనే మేలు అని పిల్లలు, తల్లితండ్రులు కూడా అనుకుంటున్నారు అంటే కుటుంబాలలోని  సంబంధ బాంధవ్యాలు ఎంతగా దిగజారుతున్నాయో, ఆత్మీయతా, అనుబంధాలు కూడా యాంత్రికంగా ఎలా మారిపోతున్నాయి. అంతా స్వార్ధం. నువ్వెంత అంటే నువ్వెంత అని వృద్ధులైన తల్లితండ్రుల ముందే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు  తిట్టుకుంటూ, కొట్టుకుంటున్నారు. ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుని కోర్టులో ఆస్థి కోసం పోట్లాడుకోవం ఈరోజుల్లో మామూలైపోయాయి. అందుకే దూరంగా ఉండడమే మేలు అని అందరూ భావిస్తున్నారు. పెద్దవాళ్ల ఈ ప్రవర్తన వారి పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుంది..   వాళ్లు కూడా తమ తల్లితండ్రులను ఆదర్శంగా తీసుకుంటున్నారు. ముగ్గురు నలుగురు సోదరులు తమ భార్యా, పిల్లలలతో ఒకే ఇంట్లో కాపురముండేవారంటే ఇప్పటివారికి ప్రపంచవింతలా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్లకు తల్లితండ్రులతో ఉండడం కూడా ఇరుకుగా, ఇబ్బందిగా ఉంటుంది మరి.. అసలైతే సమానంగా చదువుకుని సంపాదిస్తున్న భార్యా, భర్తల మధ్య కూడా ఆత్మీయత బదులు ఆర్ధిక బంధం పెరిగిపోతుంది..

4 thoughts on “కలసి ఉంటే కలదా సుఖం???

  1. ఒక భయానికో, ఆర్ధిక అవసరానికో లొంగి ఉండే వ్యక్తులు సహజంగానే ఉమ్మడి కుటుంబవ్యవస్థలో సర్ధుకుపోగలుగుతారు అని నా అభిప్రాయం.వ్యక్తి తనను తాను గుర్తించగలిగిన మరుక్షణం, వ్యవస్థకి తనే మూలాధారం అని అర్ధం చేసుకున్న తరువాత తన స్వాతంత్ర్యాన్ని ఏ కారణంతోనూ మరొక శక్తికి దఖలు పరచటానికి అంగీకరించడు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు కనుమరుగవ్వటానికి ఇదే కారణమని అనుకుంటున్నాను.

  2. చాలా బాగా రాశారు జ్యోతి గారూ. కాలంతో పాటే సంఘ విలువలు మారిపోతాయి. నోస్టాల్జియ తియ్యగానే ఉంటుంది కానీ, అన్నివేళలా అనుసరణీయంగా ఉంటుందన్న భరోసా ఉండదు. ధన్యవాదాలు.

  3. మనుషులు ఒకే ఇటంలో ఉండి, మనసుల మధ్య అగాధాలు ఉండటం కంటే దూరంగా ఉండి ఎప్పుడూ పోట్లాడుకోకుండా ఉంటేనే మేలు కదా.. అలా అని తల్లితండ్రులను దూరంగా ఉంచమని కాదు. ఆర్ధికంగా ఎంత కష్టలలో ఉన్నా కన్న పిల్లల్ని అనాథాశ్రమములో ఉంచము కదా? అలాంటప్పుడు తల్లితండ్రులను ఎందుకు వృధ్ధాశ్రమములో ఉంచుతారో అర్ధం కావటం లేదు. జ్యోతి గారు! మంచి ఆర్టికల్ రాసారు. అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *