May 25, 2024

పైడికంట్లు

రచన : డా.కౌటిల్య  

 


 

ధనుర్మాసం….

నెలపెట్టి నాలుగురోజులు కావస్తోంది.  తొలికోడి కుయ్యకముందే నిద్రలేచి పొలంబాట పడుతున్న పెదకాపులు చలికాగలేక, తలగుడ్డ చెవులకిందికి దిగలాగి, రొంటిన దోపిన చుట్టముక్క తీసి వెలిగించి, గుప్పుగుప్పున పొగ వదుల్తూ, ఆ వెచ్చదనం ఇచ్చిన హుషారుకి వడివడిగా గట్లమీద అంగలేస్తూ వెళుతున్నారు. గడగడా వణికే అంతటి చలిలోనూ పైన ఉత్తరీయం తప్ప వేరే ఆచ్చాదన లేకుండా, భుజాన ఉన్న తంబురా సరిగ్గా శ్రుతి చేసుకుని ఓ చేత్తో మీటుతూ, మరో చేత్తో చిరతలు ఆడిస్తూ ఊరిమొగదల్లో నిలబడి “ శరణంభవ కరుణామయి” అంటూ తరంగం ఎత్తుకున్నారు దాసుగారు. దాసుగారి పేరేదో ఊళ్ళో చాలా మందికి తెలీకపోయినా, సంవత్సరానికోసారి ప్రత్యక్షమయ్యి, నెలరోజులపాటు భక్తిసాగరంలో ఓలలాడించి వెళ్ళే ఆయన ప్రతి ఒక్కరి మనసుల్లో “హరిదాసు”గానే స్థిరపడిపోయారు. మంద్రంగా పాడే ఆయన గొంతుక్కి ఎన్ని రాగాలొచ్చు అన్నప్రశ్న వేసుకోటం కంటే, అది ఒలికించే భక్తి ముందు ఏ సంగీత చక్రవర్తులూ నిలబడలేరని సమాధానం చెప్పుకోటం సబబేమో! యాభయ్యోపడిలో పడ్డా ఏ మాత్రం బీదపడని ఆయన గొంతులో, ఆ నెల్నాళ్ళూ సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడే ఉండి పలికిస్తాడని ఆ ఊరిజనం గట్టి నమ్మకం.

 

ఊరిమొదటి గడపలో అడుగుపెట్టి, ముందురోజు రాత్రి ఆ ఇంటి ఇల్లాలు కళ్ళాపిచల్లి పెట్టిన ముగ్గులో నిలబడి తాళానికి తగ్గట్టు కాళ్ళు కదుపుతూ “వినతాసుత ఘనవాహన మునిమానసభవనా” అని పాడుతున్నారు.  దాసుగారి పాటకు గబుక్కున లేచి, రాత్రిపూట మంచం తలాపున  ఇత్తడి పంచపాత్రలో పోసి పెట్టుకున్న బియ్యాన్ని తీసుకుని బైటకొచ్చింది ఆ ఇల్లాలు. దాసుగారు కూచుని ఆశీర్వదిస్తుంటే, ఆయన తలమీదున్న కలశంలో బియ్యంపోసి చేతులు జోడించి భక్తిగా నమస్కరించింది. అలా ఒక్కో గడప దాటి వెళ్తూ దేవాలయం వీధికి చేరుకున్నారు. అప్పుడే మెల్లగా తూర్పున తెలుపురేకలు పొడుస్తున్నాయి. అన్ని ఇళ్ళల్లో జొన్నలు దంచుతున్న రోకళ్ళశబ్దం లయబద్ధంగా దాసుగారి పాటలో కలిసిపోయింది. వీధి మధ్యలో ఉన్న నరసప్ప పంతులు గారి ఇంటికి చేరుకున్నే సరికి, ఆయన పాడుతున్న తరంగం చివరికి వచ్చింది.

 

పంతులు గారిది నిండైన లోగిలి. వీధివాకిలికి, ఇంటికి మధ్యన పెద్ద పెరడు. పెరట్లో తులసివనం మధ్యలో నిలబడి పంతులుగారు, పూజకు కావల్సిన తులసీదళాలు తుంచుకుంటూ ఏవో మంత్రాలు సన్నగా గొణ్ణుక్కుంటూ ఉన్నారు. పొద్దున్నే ఆఊరి చెన్నకేశవస్వామి దేవాలయ శిఖర దర్శనం, తర్వాత నరసప్ప పంతులుగారి దర్శనం ఇలా వారి పెరట్లో చేసుకోటం దాసుగారికి ఇన్నేళ్ళమట్ట్టీ వస్తున్న ఆచారం. దాసుగారిని చూడగానే, పంతులుగారు  చెయ్యెత్తి “బావున్నారా!” అన్నట్టు అభయహస్తం పట్టి అడిగారు. దేవుడిదయ అన్నట్టు భక్తిగా కళ్ళు మూసుకున్నారు దాసుగారు. అంతలో వారింటి సింహద్వారం బురదమణ్ణిగానికి పసుపు రాస్తూ, “నను బ్రోవమని చెప్పవే” అని కీర్తన ఎత్తుకున్నారు, నరసప్ప పంతులుగారి అర్ధాంగి, సుగుణమ్మ. పొద్దుటే తలారా స్నానం చేసి, జుట్టు జారుముడేసుకుని, గోచీపోసి కట్టిన పేటంచు మడిచీర, మొహానికి పచ్చిపసుపు,నుదుటిన రూపాయికాసంత బొట్టుతో సుగుణమ్మగారు సాక్షాత్తూ గౌరీదేవిలా అనిపించింది దాసుగారికి. మనసులోనే ఆయమ్మకి నమస్కారం చేసుకుని ఆయమ్మ పాడుతున్న కీర్తనకి గొంతుకలిపాడు. ప్రతిరోజూ ఆ గడపలోకి రాగానే, ఆయమ్మ అప్పటికి ఏ పాట పాడుతుంటే ఆ పాటే ఎత్తుకుని సాగిపోటం దాసుగారికి ఆచారంగా వస్తున్న అలవాటుల్లో ఒకటి.  ఆ పాటికే ఆయనకి ఎదురుగా పంచపాత్ర నిండా బియ్యంనింపుకుని ఆయనవంకే, చక్రాల్లాంటి కళ్ళని విపార్చి చూస్తూ నిలబడ్డ పంతులుగారి ఎనిమిదేళ్ళ మనవరాలు ఆనందవల్లి, ఇక నిలబడలేను అన్నదానికి సంజ్ఞగా తానూ వాళ్ళతో రాగం కలిపింది. అదివిని ముసిముసినవ్వులు నవ్వుకుంటూ ఆయన ఆ పిల్లకు అందేట్టు కిందకి ఒదిగి కూచున్నాడు. కలశంలో బియ్యంపోసి, కలశానికి మూడుసార్లు దణ్ణవెఁట్టుకుని కొండెక్కినంత సంబర పడిపోయింది ఆనందవల్లి. మనసారా ఆశీర్వదించి ముందుకు సాగిపోయారు. ఆయనతో పాటు ఆయనపాట కూడా………

 

నరసప్ప పంతులు గారంటే ఆ ఊరి వాళ్ళందరికీ భయంలాంటి భక్తి, భక్తిలాంటి భయం. ఆయన ముక్కుసూటితనం, నిజాయితీ ఆ ఊర్లో ఆయనకి ఆ రకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కాని అవే ఆయన దాయాదుల్లో కాస్త వైషమ్యాలు పెరగడానికి కూడా కారణమయ్యాయనుకోండి! అరవయ్యోపడిలో పడ్డా ఏమాత్రం తగ్గని శరీరపటుత్వం ఆయన సొంతం. పదహారేళ్ళ యువకుడిలా చకచకా పనులు చేసుకు పోతుంటారు. ఆయన పొలానికొస్తుంటే పాలేర్లు దడదడలాడిపోయేవారు!!!

 

ఇక సుగుణమ్మగారు పేరుకు తగ్గట్టు సుగుణాలరాశి. ఊరందరికీ తల్లో నాలుక.  భూదేవంత సహనం అంటారే, అది ఎంత అని ప్రశ్నపుడితే, “ఇదిగో ఇంత” అని సుగుణమ్మగారిని చూపించొచ్చు. ఆ ఇల్లాలి ఓర్పు, ఎప్పుడూ చెరగని చిర్నవ్వు ఆ ఊరికొచ్చే కొత్తకోడళ్ళకి నిజంగానే చెప్పకనే చెప్పే పాఠాలు. ఆయమ్మ చెయ్యికి ఎముకలేదని అనుకోవచ్చో లేదోగాని, ముద్ద అడిగినవాడికి రెండుముద్దలు పెట్టటం ఆయమ్మకి అలవాటు. అసంతృప్తిగా ఆ ఇంటిగడప దిగినవాళ్ళు లేరనే చెప్పొచ్చు. రోజూ కనీసం పదిమందికి వండి వడ్డిస్తేగాని ఆయమ్మకి తృప్తిగా ఉండేదికాదు. ముద్దపప్పు, నెయ్యేసి పెట్టినా ఆయమ్మ పంచే ప్రేమకి, అది తిన్నవాళ్లకి అమృతప్రాయంగానే అనిపించేది. మొదట్లో పద్నాలుగేళ్ళప్పుడు కాపురానికొచ్చినప్పుడు నరసప్పగారు చెప్పిన మాటలు ఆమెకి నిత్యం చెవుల్లో మోగుతూనే ఉంటాయి. “సుందరీ! నలుగురికి పెట్టిందే మనకు ఉన్నది” అని ఆయన చెప్పినమాట ఆచరణలో పెడుతూనే ఉంది, ఈ నలభైఏళ్ళమట్టీ. ఆయన చెప్పినమాటల్లో సత్యం, రోజూ తినిలేచెళ్ళేవాళ్ల ముఖాలు చూసినప్పుడు రోజూ ఆయమ్మకి కనిపిస్తూనే ఉండేది. అప్పుడు లోపల కలిగే ఆ తృప్తే కదా “మనకు ఉన్నది” అని ఆయమ్మ అనుకోని రోజులేదేమో!

 

ఇన్నేళ్ళూ ఆయన అడుగుజాడల్లోనే నడిచింది. ఆయన సయ్యంటే సయ్యంది. ఆయన కోపమొచ్చి గయ్యిమంటే, ఒదిగిపోయింది.  ఆనందన్నైనా, బాధనైనా, ఆయనలో తప్పునైనా కళ్ళతోనే చెప్పేదికాని, వావిడిచి పలికేదికాదు. నరసప్పగారికి ఆ కళ్ళల్లో బాసలు తెలుసుకామోలు, వాటికనుగుణంగానే నడుచుకునేవారు. గిల్లికజ్జాలూ, సరదావాదాలూ, అలకలూ,ఆదరింపులూ లేనివాళ్ళేం కాదు ఆ జంట. అసలు అవి లేకపోతే అది కాపురం కాదంటారు నరసప్పగారు. కాని పొరపొచ్చాలు లేకుండా సాగిపోయింది వాళ్ల జీవితం. నిత్యం ఇంట్లో పనులు చేసుకుంటూనే భర్త దగ్గర్నుంచి ధర్మసూక్ష్మాలన్నీ గ్రహించింది. రాత్రిళ్ళు సుగుణమ్మని కూచోబెట్టుకుని ఏదో ఒక పాఠం చెప్పేవారు పంతులుగారు. అలానే పంచకావ్యాలూ, భారత,భాగవత,రామాయణాలూ చదువుకుంది. ఊర్లో మంచీచెడూ చెప్పాలంటే నరసప్పగారి తర్వాత సుగుణమ్మగారే!

 

ఆయమ్మ నరసప్పగారికి నిజంగానే అర్థతనువు. ఎన్నడూ సుగుణమ్మగారిని పేరు పెట్టి పిలిచేవాళ్ళే కాదు. ఆపాటున ఏ పిలుపు పిలిస్తే ఆ పిలుపుకే పలికేది. యాభైఏళ్ళు దాటినా సుగుణమ్మ ఆయనకు సుందరమ్మే! ఆమె కాసేపు పేరంటానికెడితేనే ఆయనకి కాళ్ళు చేతులాడవు. ఎక్కడికెళ్ళినా పార్వతీపరమేశ్వరుల్లా ఇద్దరూ కదలాల్సిందే! ఆయమ్మ వండితే తప్ప వేరే చేతివంట తినెరగడు. ఆ ఇద్దరి దాంపత్యం ఆ ఊర్లో కొత్తగా పెళ్ళైన జంటలకి చెప్పే సుద్దులు! ఎవరింట్లో పెళ్ళైనా, సుగుణమ్మగారు మొదట నలుగుపెట్టి పెళ్ళికూతుర్ని చెయ్యాల్సిందే! ఆ దంపతుల అక్షింతలు పడకుండా ఏ జంటా కాపురానికి వెళ్ళేదికాదు. గాలికీ, ధూళికీ పంతులుగారు విభూది పెట్టేవారు. ప్రసవం కష్టమైతే పంచపాత్రెడు జలమిచ్చేవారు, సుఖంగా సాగిపోయేది ప్రసవం. పుట్టిన బిడ్డను తెచ్చి ఆయన చేతికిచ్చి పేరు పెట్టించుకుని, “పంతులుగారు మా పిల్లదానికి పేరెట్టారు” అని తెగ సంబరపడిపోయేవారు.

 

ఇలా వాళ్ళిద్దరి గురించే చెప్పుకుంటూపోతే పెద్ద పుస్తకమే అయ్యిద్ది. వాళ్ళ నోముల పంట ఇద్దరు కొడుకులు రామప్ప, కిష్టప్ప. ఇద్దరికీ పదేళ్ళవారడి. ఆడపిల్లల్లేరని, అక్క కూతుర్ని తెచ్చి పెంచుకున్నారు సుగుణమ్మగారు. ఆ పిల్లకి పెళ్ళిచేసి పంపారు. మగపిల్లలిద్దరూ వేదం చదువుకున్నారు. నరసప్పగారు తాను చదువుకున్న కంచి పాఠశాలకే పంపి వాళ్ళకి వేదం చెప్పించారు. పెద్దవాడు చదువు పూర్తి చేసుకురాగానే కుందనపు మొలకలాంటి పిల్లని తెచ్చి పెళ్ళి చేశారు. ఆర్షేయం, పౌరుషేయం ఉన్న కుటుంబంలోంచి వచ్చిన పిల్ల. అణుకువగా అత్తగార్ని అనుసరించుకుపోయేది. సుగుణమ్మగారు కన్నకూతురికన్నా ఎక్కువగా చూసుకున్నేవారు. పెద్దవాడు నాన్నకి పొలంపనుల్లో తోడుండేవాడు. చిన్నవాడు అలంకార శాస్త్రం చదువుతానంటే కాశ్మీరానికి పంపించాడు పంతులుగారు. పై ఏడాదికి తిరిగొస్తాడేమో!

 

నరసప్పగారు భార్య కీర్తనకి తలాడిస్తూ పూజగదిలోకివెళ్ళారు. మేఘగంభీరస్వరంతో ఆయన చదువుతున్న లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రానికి, కనకధారాస్తవానికి గొంతు కలుపుతూ నైవేద్యానికి పులగం చెయ్యటానికి సిద్ధపడింది సుగుణమ్మగారు. ఆ ఇద్దరూ నిత్యం చేసే ఈ స్తోత్రాలకి ఆ ఆదిదంపతులిద్దరూ ఆనందిస్తూ, వారి నట్టింట్లోనే తిష్ట వేసుక్కూచున్నారు. వేడివేడి పులగం వెండిగిన్నెలో పెట్టుకుని మధ్యలో గురుగు చేసి నిండా నెయ్యిపోసి తీసుకొచ్చింది. జపం పూర్తిచేసుకుని, నైవేద్యం చెల్లించి, హారతిచ్చి మెల్లగా వసారాలోకొచ్చి వాలుకుర్చీలో కూచున్నారు. ఆయన పక్కనే ముక్కాలిపీట మీద కూచుని  బాదమాకులో పులగం పెట్టి ఆయన చేతికిచ్చి, వాకిట్లో ఉన్న మనవరాల్ని కేకేసింది సుగుణమ్మ.

 

గొబ్బెమ్మలు పెట్టుకునే హడావుడిలో నాయనమ్మ మాటలు వినిపించుకోలేదు ఆనందవల్లి.ముగ్గు మధ్యలో పెద్ద గొబ్బెమ్మకి గుమ్మడిపూలు, పిల్లగొబ్బెమ్మలకి దోసపూలు, సొరపూలు పెట్టి పసుపూ కుంకాలతో అలంకరించి, చుట్టుపక్కల పిల్లల్ని చేర్చుకుని పాడుతూ వాటి చుట్టు తిరగసాగింది. ” సుబ్బీ గొబ్బెమ్మా! మల్లెపువ్వంటీ మరదల్నివ్వవే, సుబ్బీ గొబ్బెమ్మా! చామంతిపూవంటి చెల్లెల్నివ్వవే, మొగలీ పూవంటి మొగుణ్ణివ్వవే” అని పాడుతోంది. పాట విన్న నరసప్ప లేచొచ్చి, “అదేం పాటే వల్లీ! మొగలిపువ్వంటి మొగుడొస్తే నిన్ను ముళ్ళతో గీరతాడు. అయినా గొబ్బెమ్మకి గుమ్మడిపూలూ,దోసపూలూ పెట్టి మల్లెపూలూ,చామంతిపూలూ కావాలంటే ఎలానే! అయినా ఈపాట నీకు నేర్పిన మీ నాయనమ్మననాలి” అని ముసిముసి నవ్వులు నవ్వాడు. తాత తనని వేళాకోళం చేస్తున్నాడని అర్థమై ఒక్క ఉదుటున వసారాలోకి పరుగెట్టి, నానమ్మ వళ్ళో వాలింది. “ఇంత సిగ్గే! ఇదిగో సుందరం, మన రామప్పకి చెప్పు! పై వైశాఖంలో మంచి ముహూర్తాలున్నాయి. అప్పన్నశాస్త్రుల్లుగారి మనవడు చక్కగా వేదం చెప్పుకుంటున్నాడట. వాడికిచ్చి కట్టెయ్యటమే!” అన్నాడు మనవరాలి బుగ్గపట్టుకుని సాగదీస్తూ. పెళ్ళి అన్నమాట వినగానే చిన్నకొడుకు గుర్తొచ్చి సుగుణమ్మగారి మొహం వడబారింది.

 

ఆరోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక నరసప్పగారు వాలుకుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నారు. సుగుణమ్మగారు తాంబూలప్పళ్ళెం తీసుకొచ్చి ఆకులకి ఈనెలు తీస్తూ పక్కనే ఉన్న ముక్కాలిపీట మీద కూర్చుంది. నరసప్పగారు ఎంత భోజనప్రియుడో, అంత తాంబూలప్రియుడు. పాందాను ఎప్పుడూ చలువమిరియాలు,జాజికాయ,జాపత్రి, కస్తూరి, పచ్చకర్పూరం, యాలకులతో గుబాళిస్తుంటుంది. ఆకులకు ఈనెలు చివరికంటా తీసి, సన్నగా ముత్యాలపొడి వేసి, ఒక్కోద్రవ్యం వదలకుండా వేస్తూ చిలకలు చుట్టి నరసప్పగారికి అందించింది. ఆయన తాంబూలంమడత సగంకొరికి, మిగతాసగం ఆవిడనోటికి అందించారు.

 

“చిన్నాడికి పైఏటికైనా పెళ్ళి చెయ్యరా? వాడికేంటో ఆ చదువు,పుస్తకాలేగానీ ఇల్లూ,వాకిలీ గుర్తురావేంటో! తల్లీ, తండ్రీ, అన్నా అన్న ధ్యాస ఏకోశానా కనిపించదు. మనం లేకపోతే లేకపోమానె, వాడికన్నా ఓ కుటుంబం కావాలని ఇన్నేళ్ళొచ్చినా అనిపించదు. అగ్రహారం వాళ్లంతా ఇరవయ్యేళ్ళు వచ్చినా పెళ్ళి చెయ్యరేంటీ అనడుగుతుంటే ఏం చెప్పాలో అర్థంకావట్లా! ఇంతమంది పెళ్ళిళ్ళు మన చేతులమీదుగా చేశాం, వాడి పెళ్ళి ఏ చేతులమీదగా జరగాలని రాసిపెట్టుందో మరి!”

 

నరసప్పగారు దీర్ఘంగా నిట్టూర్చి,”పిచ్చమ్మా! వాడిపెళ్ళి సంగతి వాడే చూసుకోవాలి. మనం ఎవరమూ నిర్ణయించలేం. నువ్వేం దిగులు పడమాకు, అంతా సవ్యంగానే జరుగుతుంది.” అని కళ్ళుమూసుకున్నారు.

 

*             *                 *                *                 *                   *                 *                     *                            *                       *

 

వైకుంఠ ఏకాదశి. చెన్నకేశవస్వామి గుళ్ళో ఉత్తరద్వార దర్శనం చేసుకొని, గ్రామోత్సవం, అన్ని హడావుళ్ళూ అయ్యాక ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు నరసప్పగారు. పెద్దకొడుకు పొద్దున్నే దర్శనం చేసుకుని పొలందాకా వెళ్ళొస్తానని వెళ్ళి ఇంతవఱకూ రాలేదు. ఉదయం నుంచీ శకునాలు సరిగ్గాలేవు. ఎడంకన్ను అదురుతూనే ఉంది. సుగుణమ్మ కూడా అదే అన్నది. ఆమె మొహంలో ఏదో తెలీని ఖంగారు. అలా వసారాలో కూచుని వీధిగుమ్మం వంక మాటిమాటికీ చూస్తూ ఉన్నారు ఇద్దరూ….

 

హడావుడిగా నురుగులు కక్కుకుంటూ పరిగెత్తుకొచ్చాడు పెద్దపాలేరు. వాడు చెప్పినమాట విని నిశ్చేష్టురాలైంది సుగుణమ్మ! నరసప్పగారు కూర్చున్నవాడు కూర్చున్నట్టే కుంగిపోయారు. నరసప్పగారి పెద్దకొడుకు, నుంచున్నవాడు నుంచున్నట్టు విరుచుకుపడిపోయాడని ఊరూవాడా గుప్పుమంది……!!!!

 

నెల్రోజులు గడిచాయి. మహాలక్ష్మిలా తమ కళ్ళముందు తిరిగే కోడల్ని అలా చూస్తుంటే సుగుణమ్మగారికి గుండె తరుక్కుపోతోంది. ఆ దంపతులకొచ్చిన కష్టానికి ఊరంతా తమదన్నట్టు దిగులుపడింది. వచ్చినవాళ్లంతా వాళ్ళకి ఓదార్పు మాటలు చెప్పే ధైర్యంలేక మౌనంగానే వెళ్ళిపోతున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నరసప్పగారి ముఖం, గంభీరంగా తయారైంది. ఎఱ్ఱ్రగా జీరవారిన ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం కూడా ఎవరూ చెయ్యలేకపోతున్నారు. సుగుణమ్మగారి మొహంలో ఎప్పుడూ ఉండే ఆ చిర్నవ్వు ఎటుపోయిందో కూడా తెలీట్లేదు. గూడుకట్టిన శోకమూర్తిలా ఉంది ఆవిడ.

 

ఆనందవల్లికి ఇంట్లో పరిస్థితి అర్థమయ్యూ, కానట్టు ఉంది. “నాన్న చనిపోయాడంట! అంటే, ఇంక మనింటికి రాడంట. ఎక్కడికెళ్ళాడో కూడా తెలీదంట!”. ఇక నాన్నచేత ముద్దలు తినిపించుకోలేనని, నాన్న డొక్కలో కాళ్ళు ముడుచుకు పడుకోలేనని అర్థమయ్యింది. ఆ పిల్లదాని నోటివెంట ఈ మాటలు విన్న నరసప్ప మొహంలో రౌద్రదేవత తాండవించింది. ఈరోజు తమ ఈ పరిస్థితికి ఎవరు కారణమో, ఏ ప్రయోగం చేశారో తెలిసుండీ తానేమీ చెయ్యకుండా ఉన్నందుకు తనని తానే నిందించుకున్నారు. ఆయన గుండె ప్రతీకారజ్వాలతో రగిలిపోయింది.

 

ఒకనాడు రాత్రి కోడలూ, మనవరాలూ నిద్రపోయాక, భార్యని కూచోబెట్టుకుని తన నిర్ణయాన్ని చెప్పాడు. అదివిన్న సుగుణమ్మ తలతిరిగిపోయింది. అంత సాత్వికంగా ఉండి, శత్రువుల మంచికూడా కోరే ఆయనేనా ఇలా అంటోంది అని ఆశ్చర్యపోయింది. “ఏమయ్యా! నువ్వే కదా చెప్తుంటావు, ప్రతీకార వాంఛ అనేది మ్లేఛ్ఛలక్షణం అని. అంతకు ఎలా దిగజారాలనుకుంటున్నావు. మనవాడికి ఆయుష్షుచాలక వెళ్ళిపోయాడు. వాళ్ళు చేశారు సరే, తిరిగి మనమూ అదే చేస్తే వాళ్ళ స్థాయికి మనం దిగజారినట్టు కాదా! ఎవరి పాపాన వాళ్ళు పోతారు. వదిలెయ్యరాదా! ఇంతవఱకూ నీ శక్తులని ఎప్పుడూ పరుల మంచికోసమే వాడావుకానీ, నాశనానికి కాదు కదా! అలా చేస్తే అవి తర్వాత వక్రిస్తాయని నువ్వే అన్నావు కదా! ఆ ఆలోచనే విరమించుకోవయ్యా! అదీకాక అభంశుభం తెలీని ఆ పిల్లవాడి మీద ప్రయోగించటం తప్పుకాదా!” అని ప్రాధేయపడింది. కాని, నరసప్ప తన నిర్ణయాన్ని మార్చుకోటానికి ఇష్టపడలేదు. ” దుష్టశిక్షణ చెయ్యాలి. పుత్రశోకం ఎలా ఉంటుందో వాడికీ తెలియాలి. అదే వాడికి శాస్తి. ఈ విషయంలో నీ మాట వినదలచుకోలేదు సోమమ్మా!” అని లేచి వెళ్ళిపోయారు.

 

సుగుణమ్మ కళ్ళల్లో నీళ్ళు…. ఆయన తత్వం తెలిసింది కనుక ఇక ఆయన్ని బతిమాలదలుచుకోలేదు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మర్నాడు రాత్రి నరసప్పగారు చెప్పినట్టే, ఆయన పూజకి, హోమానికి కావలసినవన్నీ సమకూర్చింది. అర్థరాత్రి ఒంటిగంటకి మినప్పిండి రుబ్బుతుంటే ఆమె గుండెల్లో బండలు జారిపడుతున్నాయి. రుబ్బిన మినప్పిండి తీసుకుని నరసప్పగారు తలుపేసుకున్నారు. తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టాల్సింది మరుసటి రోజే, నరసప్పగారి ప్రయోగం పూర్తయ్యేదీ ఆరోజే!

 

మర్నాడు తెల్లారుతూనే తలారా స్నానం చేసి, మడికట్టుకుని, నరసప్పగారి కాళ్ళకు నమస్కరించి పేరంటానికి బైల్దేరింది. తనకొడుకుని తనకి కాకుండా చేసినవాడి ఇల్లని తెలిసీ భారంగా ఆ గడపలో అడుగుపెట్టింది. చూసిన ఊరిజనాలంతా విస్తుపోయారు. ఆయమ్మ మంచిమనసుకు మనసులోనే దణ్ణాలు పెట్టుకున్నారు. ఆలోగిలి తోరణాలతో కళకళలాడుతోంది. పెళ్ళికొడుకుని చెయ్యటానికి, నలుగు పెట్టటానికి అందరూ తయారవుతున్నారు. సుగుణమ్మగారిని చూడగానే ఆ ఇల్లాలు గబగబావచ్చి, కాళ్ళమీదపడి భోరుమంది. ఆమెని లేవదీసి పందిట్లోకి వచ్చింది సుగుణమ్మ. పద్నాలుగేళ్ళ పాలుగారే ప్రాయంలో ఉన్న పెళ్ళికొడుకును చూసి అప్రయత్నంగా ఆమె కళ్ళల్లో నీళ్ళు నిలిచాయి. ఆ ఇంటి ఇల్లాలందించిన నలుగు గిన్నె తీసుకుని, తమ కులదైవాన్నీ, తన దైవాన్నీ తలచుకుని ఆ పిల్లాడికి మొదటి నలుగు పెట్టింది. తన కాళ్లకి సాష్టాంగపడ్డ ఆ పిల్లాడి మీద అక్షంతలు చల్లి, “దీర్ఘాయుష్మాన్ భవ” అని తన ఆత్మశక్తినంతా కూడదీసుకుని ఆశీర్వదించింది. తానిచ్చిన తాంబూలం తీసుకుని మారుమాటాడకుండా తిరిగివెళ్తున్న సుగుణమ్మని చూసి, తన భర్తవంక మార్చి చూసింది ఆ ఇల్లాలు. తన బతుకంతా గోతిలోకి పోయినట్టు కుంగిపోయాడు అతను!!!

 

ఆరాత్రికి హోమం పూర్తి చేసి, గోడకి జారగిలబడి కూచుని కళ్ళు మూసుకున్నాడు నరసప్ప. కొన్ని క్షణాలు గడవగానే, ఆయన మనసు ఎక్కడలేని ఆందోళన పడసాగింది. కాసేపటికి కళ్ళెదుట ఒక భీకరాకారం, కరాళవదనంతో ప్రత్యక్షమయ్యింది.

అది చూసి నరసప్పగారు, ” ఏమే యక్షిణీ! చెప్పిన పనయ్యిందా! ఇలా వెళ్ళి అలా వచ్చావు!” అని గంభీరస్వరంతో అడిగారు.

“స్వామీ! నన్ను మన్నించు. నువ్వు చెప్పినపని చెయ్యలేకపోయాను. నేను నీకు వశమయ్యి ఇన్నేళ్ళైనా ఏనాడూ నువ్వు నన్నుఏదీ కోరలేదు. ఇన్నాళ్ళూ నీ శరీరం నాలాంటి ఎందరికో స్థానంగా ఇచ్చి మమ్మల్ని నిలిపావు. కానీ, నీకు ప్రతిగా ఏమీ చెయ్యలేకపోయాను. ఇది నా శక్తికి మించినపని. ఆ పిల్లవాణ్ణి ఒక మహాశక్తి కాపలా కాస్తోంది. అది ఎవరో కాదు, మహాపతివ్రత అయిన నీ భార్య ఇచ్చిన ఆశీర్వచనబలం. అది ఆ పిల్లవాడికి రక్షగా నిలబడి కాస్తోంది” అని పలికి దీనవదనంతో నిలబడింది.

 

ఆ మాటలు విన్న నరసప్పగారికి సర్వం అవగతమయ్యింది. “తను చేస్తున్న తప్పుని దిద్దటానికి తన అర్ధాంగి ఇంత సాహసానికి పూనుకుంది, దాని ఫలితమేమిటో తెలిసికూడా. తనకు రౌరవాది నరకాలు రాకుండా అడ్డుపడింది. తాను సమిధవ్వబోతున్నది.” అని తలచి, పశ్చాత్తాపంతో క్రుంగిపోయాడు.

కాస్త తేరుకుని, ఆ యక్షిణిని చూచి,” యక్షిణీ! నీవు గర్భయక్షిణివి. నీ ప్రయోగం వృథా కారాదు. నిన్ను ఇలా ఉత్తేజితం చేసి వదిలితే లోకానికి కీడు. కనుక ప్రయోక్తని నేనే గనుక నా ప్రాణాలనే భుజించు” అని గంభీర స్వరంతో పలికాడు.

 

దానికి ఆ యక్షిణి,” అయ్యా! నీకు చెరుపు చేసే శక్తి నాకు లేదు. నీవద్ద ఉన్న మహామంత్రాలు, నీ శరీరాన్ని నెలవు చేసుకున్న దేవతలు, నీ భార్య పాతివ్రత్యం నన్ను నీవంక తేరిపారకూడా చూడనియ్యవు. నువ్వే మరేదైనా తరుణోపాయం చెప్పు” అని ప్రాథేయపడింది.

 

నరసప్పగారు తీవ్రంగా ఆలోచించారు. “సుగుణమ్మకి ఈ విషయం తెలుసు. అయినా ఎందుకిలా చేసింది?”.

అప్పుడు ఆయనకి తన అర్థాంగి మనోభావం అర్థమయ్యింది.

“తాను ప్రయోగించింది, అవతలివాడికి పుత్రశోకం కలగాలని. కాబట్టి తానుకూడా పుత్రులవల్లనే శోకం అనుభవించాలి.”

నరసప్పగారు ఒక ధృఢ నిశ్చయానికి వచ్చినట్టు నిట్టూర్చి, ” ఓసి యక్షిణీ! నాకు పుత్రకారణమైన శోకం మళ్ళా కలగాలని రాసిపెట్టి ఉంది. నా చిన్నకొడుకు నా వరాలపంట. శాపవశాత్తూ నా ఇంట జన్మించిన విద్యాధరుడు. వాడు మా మానవుల ఇరవై సంవత్సరాల కాలాన్ని, ఒక్క సంవత్సరంలోనే తన మనసుతో అనుభవిస్తాడు. అది వాడి జీవుడి లక్షణం. కాబట్టి నువ్వు వెళ్ళి వాడిని ఆవహించు. వాడిని నువ్వేమీ చెయ్యలేవు ఒక్కటితప్ప. వాడికి వివాహ యోగ్యత లేకుండా పోతుంది. నీవల్ల వాడికి త్వరగా శాప విముక్తీ కలుగుతుంది. వాడు పుట్టినప్పుడే వాడికి వివాహంలేదని నేను గుణించాను. అది నీవల్ల ఇప్పుడు ఇలా నిజమవుతుంది.” అని చెప్పి గోడకి చేరగిలబడ్డాడు.

 

యక్షిణి ఆయనకి నమస్కరించి అంతర్ధానమైంది.

 

కాసేపటికి, తలుపు తీసుకుని బయటకు వచ్చారు నరసప్పగారు. సింహద్వారానికి ఆనుకుని కూచునుంది తన అర్ధతనువు. ఆయన్ని చూడగానే లేచి నిలబడింది. ఆమెని చూచి అప్రయత్నంగా చేతులు చాచాడు. ఆయన కళ్ళల్లో పలికిన ఏ భావానికి ఏ భాష్యాలు కనిపించాయో, మెల్లగా నడుస్తూ వెళ్ళి ఆయన చేతుల్లో ఒదిగిపోయింది సుగుణమ్మ.

ఇల్లాలి తల తన ఎదురురొమ్ము కానించుకుని, ” బుచ్చమ్మా! భర్త తప్పుని ఓర్పుతో మన్నించడమే కాదు, అతడి తప్పుని దిద్దగలగడమే అసలైన పాతివ్రత్య ధర్మమని నిరూపించావు. నువ్వు ఈ సనాతనధర్మానికి ప్రతిరూపానివి. సర్వభారతీయధర్మానికీ ఆత్మవు.” ఈ మాటలు చెప్తూ ఆయన గొంతు పూడుకుపోయింది.

 

అప్పుడే వస్తున్న వెలుగు రేకలకి గూళ్ళల్లో పక్షులు కదలాడుతున్నాయి. ఆ దంపతుల మాటలు విన్నాయేమో అన్నట్టు, మామిడి చెట్టు మీది పైడిగంట్లు కిలకిలారావాలు చేశాయి.

 

IIసర్వేజనాస్సుఖినో భవంతుII

 

 

 

2 thoughts on “పైడికంట్లు

  1. ఎంతో అందంగా మొదలుపెట్టిన కథకు అంత విషాదాంతం ఏమిటండీ? చదువుతుంటే మనసు ఏదోలా అయిపోయింది..naadee same feeling..

  2. ఎంతో అందంగా మొదలుపెట్టిన కథకు అంత విషాదాంతం ఏమిటండీ? చదువుతుంటే మనసు ఏదోలా అయిపోయింది.
    ఆయన మంచితనం యక్షిణీ శక్తి వశం అయినా ఎన్నడూ వాడుకోకపోవటంలోనే (ఏదీ కోరకపోవటం) తెలుస్తోంది. అటువంటి ఆయన, అన్నిటినీ అవగతం చేసుకున్న ఆయన కూడా ఆవేశానికి లోనయి అటువంటి పని చేయడానికి పూనుకున్నట్టు వ్రాయటానికి గల కారణం సుగుణమ్మ పాత్రకు బలం చేకూర్చాలనా? లేక ఆయన కూడా వీటికి అతీతుడు కాదు అని తెలియ చేయాలనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *