June 9, 2023

శ్రీ లక్ష్మి నారాయణ హృదయం

రచన : పద్మిని భావరాజు

 

భగవంతుడిని మాతృ  రూపాన పూజించడమే దేవి ఉపాసన. ఆమె మహా శక్తి- మహా మాయా.–మహా విద్య. శక్తి భగవంతుడి తేజో స్వరూపం. మూలాధార చక్రంలో సర్పాకారంలో ఉండేది ఆ పరాశాక్తే. ప్రపంచమంతా ఆ శక్తే నిండి ఉంది. సూర్యునిలోని ప్రకాశం, పూవులలోని సుగంధం, ప్రకృతి లోని సౌందర్యం, ఇంద్రధనస్సు లోని వర్ణాలు, మనస్సులోని వివేకం, భక్తులలోని భక్తి, యోగుల లోని యోగం, ఇంద్రియ నిగ్రహం ఆమె.

 

ఈ సృష్టి ఏర్పడినది ప్రకృతి- పురుషుల కలయిక వల్లనే. పురుషుడు తండ్రి అయినాడు- ప్రకృతి తల్లి అయ్యింది. అనాదిగా వారిరువురూ అభేదత్వాన్ని కలిగి ఉన్నారు. పుట్టుకయే లేని నారాయణుడు ప్రకృతి అయిన జగన్మాత తో కలవడం వల్లనే, శ్రీమన్నారాయణుడు అయ్యాడు. పురుషుడు కూడా జగన్మాత వల్లనే శ్రీమంతుడు అవుతున్నాడు కనుక వేదం జగన్మాత అయిన ఈ శ్రీనే, శ్రీదేవిగా శ్రీసూక్తం ద్వారా స్తుతించింది. భగవద్గీతలో, భగవానుడు, ఈ కనిపించే విశ్వమంతా, స్థూల ప్రకృతి అని, శ్రీ మహా లక్ష్మి దేవి దైవీప్రకృతి అని చెప్పారు. అందుకే, శ్రీ లక్ష్మి సహస్ర నామాల్లోని మొదటి నామ స్తోత్రం ‘ప్రకృతిం’ అని ప్రారంభించబడింది.

 

ఈ దివ్య దంపతులు సర్వదా తమ కృపా దృష్టిని మనపై ప్రసరిస్తూ ఉంటారు. మనం చెయ్యాల్సిందల్లా, పూర్తీ భక్తి విశ్వాసాలతో , వారి మంత్రాలను పఠించడం, నామ జపం చెయ్యడం. కొన్ని స్తోత్రాలు శక్తివంతమయిన మంత్రాలను, బీజాక్షరాలను కలిగి ఉంటాయి. ఇతర పద్ధతుల ద్వారా దుర్లభమయిన దైవ అనుగ్రహాన్ని సులభంగా అందరూ సంపాదించుకోవడానికి, మన ఋషులు/ ఆచార్యులు ఈ బీజాక్షరాలను మంత్రాలలో అల్లి, చదివే మనకు –తెలియకుండా ఇమిడ్చి, ఇవి చదివిన వాళ్లకి వాళ్ళకు తెలియకుండానే సత్ఫలితాలు కలిగే వరాన్ని ప్రసాదించారు. సకల సౌభాగ్యాలను ప్రసాదించగల ‘శ్రీ లక్ష్మి నారాయణ హృదయం’ ఇటువంటి అరుదయిన శ్లోకాలలో ఒకటి.

 

‘అధర్వ రహస్యం’  అనే గ్రంధం లోని ఉత్తర ఖండం లోని శ్రీ  భృగు మహర్షి  కృత ‘లక్ష్మి నారాయణ హృదయం’ ( లక్ష్మి- నారాయణుల మనస్సు) ఎంతో అధ్భుతమయినది. ఇది చదివిన వాళ్లకు సకల సంపదలను ప్రసాదించడమే కాక, మంద బుద్ధులను కూడా విజ్ఞానఖనులను చేస్తుంది. ఇందులో ‘నారాయణ హృదయం’ , ‘లక్ష్మి హృదయం’ అని రెండు భాగాలు ఉన్నాయి. పవిత్రమయిన, పరమ శక్తివంతమయిన ఈ ప్రార్ధన ఎంతో కాలం గుహ్యంగా ఉంచబడింది. ఈ స్తోత్రం, గురు ముఖతా స్వీకరించ వలసిన అవసరం ఉంది. అలా వీలు లేని వాళ్ళు ఎక్కడయినా లక్ష్మీ సమేత హయగ్రీవుని సన్నిధికి వెళ్లి, ఆయనకు నమస్కరించి, హయగ్రీవుడిని గురువుగా భావించి, ఆయన వద్ద ఈ శ్లోకాన్ని ఉపదేశం తీసుకున్నట్లు అనుకోవాలి.

 

ఈ స్తోత్రం చదివేందుకు ఒక విధానం ఉంది. ముందుగా, నారాయణ హృదయం చదివి, తరువాత లక్ష్మి హృదయం చదివి, మరలా నారాయణ హృదయం చదవాలి. ఈ దివ్య దంపతులు సర్వదా విడతీయలేని అభేధ స్థితిలో,  ఏకమయి ఉంటారు కనుక ఈ పారాయణ విధానం చెప్పబడింది.

 

శ్రీ నారాయణ హృదయం:

 

“ఉద్యదాదిత్య సంకాశం పీతవాసం చతుర్భుజం

శంకచక్ర గదాపాణిం ధ్యాయేత్ లక్ష్మి పతిం హరిం”

 

భావం:

ఉదయించే సూర్యుడి తేజస్సుతో, పీతాంబరం( పసుపు వస్త్రాలు) ధరించి, నాలుగు భుజములు కలవాడు, శంఖము, చక్రము, గద, మొదలగు ఆయుధాలు ధరించిన వాడు, లక్ష్మి దేవి పతి అయిన హరిని ధ్యానించుచున్నాను.

 

త్రిలోక్య ఆధార చక్రం తదుపరి కమఠం తత్ర చానంత భోగి,

తన్మధ్యే  భూమి   పద్మాన్కుశ శిఖరదళం కర్ణికాభూత మేరుం ,

తత్రత్యం  శాంత  ముర్తిం మణి మయమకుటం కుండలోత్భాసితంగం ,

లక్ష్మీనారాయణాఖ్యం  సరసిజ నయనం సంతతం చింతయామః

 

భావం:

కలువల వంటి కన్నులు కలవారు, శాంతమూర్తులు, రత్నఖచిత కిరీటము, ఆభరణాలు ధరించినవారు, మూడు లోకాలకు ఆధారమయిన జగదాధార చక్రమందు …ఆదిశేషునితో చుట్టబడిన తాబేలు, మధ్య భూమి పై , అంకుశము వంటి పద్మ దళం పైనున్న బంగారు మేరు పర్వతం పై కొలువున్న లక్ష్మీనారాయణులను ధ్యానించుచున్నాను.

 

అస్య  నారాయణ  హృదయ స్తోత్ర మహా మంత్రస్య , బ్రహ్మ ఋషిః

అనుష్టుప్  ఛందః, నారాయణో దేవతా, నారాయణ ప్రీత్యర్థం జపే వినియోగః ||

బ్రహ్మ ఋషిగా, అనుష్టుప్ ఛందస్సులో రచించిన ఈ నారాయణ హృదయం స్తోత్రాన్ని, నారాయణుడి అనుగ్రహం కోసం  పఠిస్తున్నాను.

 

 

శ్రీ  నారాయణ హృదయం

 

1 . ఓం నారాయణః  పరంజ్యోతిరాత్మ  నారాయణః పరః

నారాయణః  పరం బ్రహ్మ  నారాయణ నమోస్తుతే  ;

భావం: నారాయణుడే పరం జ్యోతి, నారాయణుడే పరమాత్మ, నారాయణుడే పరబ్రహ్మ్మ, అట్టి  నారాయణుడికి నమస్కారము.

 

2 . నారాయణః పరో దేవో ధాతా నారాయణః పరః

నారాయణః పరో ధాతా నారాయణ నమోస్తుతే  ;

భావం: పర దేవతగా, మోక్ష ప్రదాతగా, పర లోకాన్ని చేరుకోవడానికి మార్గదర్శిగా, సహాయకుడిగా ఉన్న నారాయణుడికి నమస్కారము.

 

3.  నారాయణః పరం ధామ ధ్యానం నారాయణః పరః

నారాయణః పరో ధర్మో నారాయణ నమోస్తుతే ;

భావం: పరంధామునిగా,  పరమ ధ్యాన మూర్తిగా, ఆచరించవలసిన పరమ ధర్మంగా ఉన్న నారాయణునికి నమస్కారము.

 

4 . నారాయణః పరో దేవో విద్యా నారాయణః పరః

విశ్వం నారాయణ స్సాక్షాత్ నారాయణ నమోస్తుతే  ;

భావం: దేవతలందరికీ అధిదేవతగా, విద్యలకు అధిపతిగా, ఈ విశ్వమే సాక్షాత్తు తానయిన నారాయణుడికి మ్నమస్కారము.

 

5 . నారాయణాద్  విధిర్జాతో జాతో నారాయణాద్ భవః

జాతో నారాయణాద్ ఇంద్రో నారాయణ నమోస్తుతే  ;

భావం:  బ్రహ్మ, శివ, ఇంద్రాదులు నారాయణుడి నుండే జనించారు. అట్టి నారాయణుడికి నమస్కారము.

 

6 . రవిర్నారాయణస్తేజః చంద్రో నారాయణోమహః

వహ్నిర్ర్నారాయణః స్సాక్షాత్ నారాయణ నమోస్తుతే  ;

భావం: సూర్యుడు నారాయణుడి వల్లనే ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు నారాయణుడి నుంచి కాంతిని(వెలుగును) పొందుతున్నాడు. అగ్ని ప్రత్యేక్ష నారాయణుడి స్వరూపమే! అట్టి నారాయణుడికి నమస్కారము

7 .  నారాయణ ఉపాస్య స్యాద్ గురుర్నారాయణః పరః

నారాయణః పరోబోధో నారాయణ నమోస్తుతే;

భావం: పరమ గురువు గా, పరమ జ్ఞానంగా ఉన్న నారాయణుడిని తప్పక ధ్యానించవలెను. అట్టి నారాయణుడికి నమస్కారము.

 

8 .  నారాయణ పరం ముఖ్యం సిద్ధి నారాయణః సుఖం

హరిర్నారాయణ శుద్ధిర్నారాయణ నమోస్తుతే .

భావం: ప్రాణులు చేరుకోవలసిన పరమ గమ్యం నారాయణుడు. నారాయణుడే విజయానికి, పవిత్రతకు( నారాయణ నామ భజన ద్వారా మనుషుల పాపాలు తొలగించ బడతాయి కనుక) మూల కారకుడు. అట్టి నారాయణుడికి నమస్కారము.

 

9. నిగమ వేదితానంత కళ్యాణ గుణ వారిధే ,

నారాయణ నమోస్తస్తూ నరకార్నవ తారక

భావం: వేదాలచే–అనంతమయిన సుగుణాల రాసిగా స్తుతించబడి , భవ సాగారమనే నరకాన్ని దాటించే వారధిగా ఉన్న నారాయణుడికి నమస్కారము.

 

10.జన్మమృత్యు జరావ్యాధిపారతంత్ర్యాదిభిః సదా,

దోషైరస్పష్ట రూపాయ నారాయణ నమోస్తుతే.

భావం:  బంధాల వల్ల జనించే జన్మ, మృత్యు, జరా, వ్యాధి వంటి ఈతి బాధలకు అతీతమయిన నారాయణుడికి నమస్కారము .

 

11. వేదశాస్త్రార్థ  విజ్ఞాన సాధ్యభక్త్యేకగోచర   ,

నారాయణ నమోస్తేస్తూ,మాముద్దర భవార్నవాత్ .

భావం: వేద శాస్త్రాలు అందించే విజ్ఞానము, భక్తి మూలంగా మాత్రమే అవగతమయ్యే స్వరూపం కళ ఓ నారాయణా! నీకు నమస్కారము. నన్నీ భావ బాధలనుంచి విముక్తుడిని గావించు.

 

12. నిత్యానంద మహోదార పరాత్పర జగత్పతే ,

నారాయణ నమోస్తేస్తూ మోక్ష సామ్రాజ్య దాయినే.

భావం:  పరమానంద స్థితిలో నిత్యం ఉండేవాడు, ఉదారుడు, ఈ జగత్తుకు అధిపతి, మోక్ష ప్రదాయకుడు అయిన నారాయణుడికి నమస్కారము.

 

13. ఆబ్రహ్మస్తంబ పర్యంతం అఖిలాత్మమహాశ్రయ   ,

సర్వ భూతాత్మ భూతత్మన్ ,నారాయణ నమోస్తుతే.

భావం: పిపీలికాది(గడ్డి పోచ) బ్రహ్మ పర్యంతము , సమస్త ప్రాణులలో వ్యాపించి ఉన్న నారాయణుడికి నమస్కారము.

 

14.పాలితశేష లోకాయ ,పుణ్యశ్రవణ కీర్తన ,

నారాయణ నమోస్తేస్తు, ప్రళయోధక శాయినే .

భావం: సమస్త లోక రక్షకుడు, తన నామం విన్నంతనే శుభాలను ప్రసాదించేవాడు, ప్రళయ సమయంలో క్షీర సాగారంపై శయనించేవాడు అయిన నారాయణుడికి నమస్కారము.

 

15.నిరస్త సర్వదోషాయ భక్త్యాది గుణదాయినే  ,

నారాయణ నమోస్తేస్తు ,త్వం వినా నహి మే గతిః

భావం:  అన్నీ దోషాలను, దుర్గుణాలను నిర్మూలించి, భక్తి వంటి సుగుణాలను పెంపొందిన్చేవాడు, అయిన నారాయణుడికి నమస్కారము. నీవు తప్ప నాకు వేరే గతి లేదు స్వామీ, నీవే దిక్కు.

 

16. ధర్మార్ధ  కామ మోక్షాఖ్య పురుషార్థ ప్రదాయినే ,

నారాయణ నమస్తేస్తు పునస్తేస్తూ నమో నమః.

భావం: ధర్మ, అర్ధ, కామా మొక్షాలనే చతుర్విధ పురుషార్ధాలను ప్రసాదించేవాడు అయిన నారాయణుడికి మరలా మరలా అనేక నమస్కారములు.

 

 

అథ ప్రార్థన

 

17. నారాయణ త్వమేవాసి దహరాఖ్యే హృది స్థితః,

ప్రేరిత ప్రేర్యమాణానాం, త్వయా ప్రేరిత మానస

భావం:   ఓ నారాయణా! మనస్సనే ఆకాశంలో నివశించేవాడవు. నేను చేసే ప్రతీ పనికీ కారకుడవు.మనస్సును నడిపించేది కూడా నీవే.

 

18. త్వదాజ్ఞాం శిరసా కృత్వా భజామి జన పావనం ,

నానోపాసన మర్గానాం భవ కృద్  భావభోధకః .

భావం:  నీ ఆజ్ఞానుసారంగా చరించి,  జనులు తమ జీవనం పావనం చేసుకుంటున్నారు. నీ సేవకై అనేక ఉపాసనా మార్గాలు సృష్టించిన నీవే, వాటి అర్ధాలను బోధించి, మేము ఆచరిన్చేలా దీవించు.

 

19.భావార్థకృద్ భావాతీతో భవ సౌఖ్యప్రదో మమ ,

త్వన్మాయామోహితం విశ్వం త్వయైవ పరికల్పితం.

భావం: ఊహింపనలవి కాని స్వరూపం కలవాడవు. ఈ జగత్తంతా నీచే సృష్టించబడి, నీ మాయచే ఆవరింపబడి ఉన్నది. నాకు ప్రశాంత జీవితాన్ని అనుగ్రహించు.

 

20. త్వధదిష్టాన మాత్రేన సా వై సర్వార్థ కారిణి ,

త్వమేవ తాం పురస్కృత్య మమ కామాన్ సమర్దయ .

భావం:  నీ సంకల్ప మాత్రం చేత అన్ని కార్యములూ సఫలమవుతాయి. అట్టి నీవే పూనుకుని, నా కోరికలను నెరవేర్చు.

 

21. న మే త్వదన్యస్త్రాతాస్తి త్వదన్యన్న హి దైవతం,

త్వదన్యం హి నహి జానామి పాలకం పుణ్య వర్ధనం .

భావం: నీవు తప్ప నాకు వేరే రక్షకుడు లేదు. నీవు తప్ప వేరే దైవం లేదు. నీవు తప్ప నాకేమీ తెలియదు. నీవే నా

పాలకుడవు, నా పుణ్య వర్ధకుడవు.

 

22. యవత్సాంసారికో  భావో మనస్స్తో భావనాత్మకః,

తావత్ సిద్ధిర్భవేత్ సాధ్యా సర్వదా సర్వదా విభో .

భావం: నా మనస్సుకు అధిపతివి నీవు. అందుకే నా మనసు నుండి జనించే కోరికలన్నిటినీ నీవే తీర్చాలి, స్వామీ…

 

23. పాపినమహం ఏకగ్రో, దయాళూనాం త్వమగ్రణీః,

దయనీయో మదన్యోస్తి తవ కో అత్ర జగత్రయే .

భావం: పాపులలో నేను మహాపాపిని. నీవు పరమ దయాళుడవు. కనుక ముల్లోకాలలో నీ దయను పొందదగిన అర్హత నాకే ఉంది.

 

24. త్వయాహం నైవ సృష్టశ్చేత్ , న స్యాత్తవ దయాళుతా  ,

ఆమాయో వా న సృష్టశ్చేత్ ఔషదస్య వ్రుధోదయః .

భావం: వ్యాధి లేకపొతే మందులు నిరుపయోగమయినట్లు నీవు నన్ను సృష్టించకుండా ఉంటే, నీ దయ నిరుపయోగంయ్యేది కదా!

 

25.పాపసంగ పరిశ్రాంతః పాపాత్మా పాప రూప druk,

త్వదన్యః కోత్ర  పాపేభ్యః, త్రాతాస్తి జగతీ తలే.

భావం: పాపాలు చేసి అలసిపోయిన వారికి, పాపాత్ములకు, ప్రతీ చోటా పాపమే గోచరించే వానికి, నీవు తప్ప ఈ జగత్తులో వేరే రక్షకుడు లేడు.

 

26. త్వమేవ మాతా చ పితా త్వమేవ ,

త్వమేవ బందుశ్చ సఖా త్వమేవ,

త్వమేవ సేవ్యశ్చ గురుస్త్వమేవ

త్వమేవ సర్వం మమ దేవ దేవ.

భావం:  దేవదేవా ! నా తల్లివీ, తండ్రివీ నువ్వే. నా బంధువువూ, మిత్రుడివీ నువ్వే. నీవే సేవిమ్పతగిన వాడవు, గురుడవు. నాకు అన్నీ నువ్వే.

 

 

 

 

ఫల శ్రుతి

 

27. ప్రార్థనా దశకం చైవ మూలాష్టక మతః పరం ,

యః  పఠేత్ శ్రుణుయాన్నిత్యం , తస్య లక్ష్మి స్థిరా భవేత్.

28. నారాయణస్య హృదయం సర్వాభీష్ట ఫలప్రదం ,

లక్ష్మి హృదయకం స్తోత్రం యది చైతద్వినాకృతం ,

29. తత్ సర్వం నిష్ఫలం ప్రోక్తం లక్ష్మి క్రుధ్యతి సర్వదా,

ఏతత్ సంకలితం స్తోత్రం సర్వాభీష్ట ఫల ప్రదం .

30. జపేత్ సంకలితం కృత్వాసర్వభీష్టమవప్నుయాత్   ,

నారాయణస్య హృదయం ఆదౌ జప్త్వాతథా పరం.

31.లక్ష్మి హృదయకం స్తోత్రం జపెన్ నారాయణం పునః ,

పునర్ నారాయణం జప్త్వా పునర్ లక్ష్మినుతీం జపేత్ .

32. త్ద్వద్ హోమాధికం కుర్యాత్ ఏతత్ సంకలితం శుభం,

ఏవం మధ్యే ద్వివారేణ  జపేత్ సంకలితం అశుభం.

33. లక్ష్మి హృదయకే స్తోత్రే సర్వమన్యత్ ప్రకాశితం,

సర్వాన్ కామానవాప్నోతి ఆధి వ్యాధి భయం హరేత్.

౩4 .గోప్యమేతత్ సదా కుర్యాత్ న సర్వత్ర ప్రకశాయేత్ ,

ఇతి గుహ్యతమం శాస్త్రం ప్రోక్తం బ్రహ్మదిభిహ్పురా

35. లక్ష్మి హృదయ ప్రోక్తేన విధినా సాధయేత్ సుదీ       ,

తస్మాద్ సర్వ ప్రయత్నేనసాధాయేత్ గోపయేత్ సుదీ .

36. యత్రైతత్ పుస్తకం తిష్టేత్, లక్ష్మి నారాయణాత్మకం,

భూత పైశాచ వేతాళ భయం నైవతుసర్వదా .

37. భ్రుగు వారే తధా రాత్రౌ పూజయేత్ పుస్తక ద్వయం ,

సర్వదా సర్వదా స్తుత్యం గోపయేత్ సాధయేత్ సుదీ,

గోపనాత్ సాధనా లోకే ధన్యో భవతి తత్వతః.

భావము:  ఈ పది శ్లోకాలను, నారాయణ అష్టాక్షరీ మంత్రాన్ని చదివినా, విన్నా వారి ఇంట లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ నారాయణ హృదయం చదివి, లక్ష్మి హృదయం చదవనట్లయితే, అది నిష్ఫలం. నారాయణ హృదయం చదివి, లక్ష్మి హృదయం చదివినట్లయితే, అన్నీ కోరికలూ నెరవేరుతాయి. లక్ష్మి కటాక్షం కోసం మొదట నారాయణ హృదయం చదివి, తర్వాత లక్ష్మి హృదయం చదివి మరలా నారాయణ హృదయం చదవాలి. హోమాల్లో నారాయణ హృదయం చదివినా ఇదే పధ్ధతి పాటించాలి. లక్ష్మి హృదయం స్తోత్రం అన్నీ కోరికలనూ తీర్చి, బాధలను, భయాన్ని, రోగాలను పోగొడుతుంది. ఈ స్తోత్రం ఉన్నా ఇంత ఎటువంటి భూత ప్రేత పిశాచ బాధల పీడా ఉండదు. ఈ స్తోత్రం శుక్రవారం రాత్రి చదవాలి. దీనిని గోప్యంగా ఉంచే ప్రయత్నం చెయ్యాలి.

 

 

ఇతి అథర్వ రహస్యే ఉత్తర భాగే శ్రీ నారాయణ హృదయం సమాప్తం

 

 

 

 

 

 

7 thoughts on “శ్రీ లక్ష్మి నారాయణ హృదయం

  1. నారాయణ హృదయ శ్లోకాలకు సులభ శైలి తేట తెలుగులో భాష్యం భావగర్భితంగా చక్కగా అనువదించావమ్మా. లక్ష్మీ హృదయాన్ని కూడా ఆవిష్కరింప జేయాలని అభిలాష. ఒక మంచి రచయిత్రికి అవకాశమిచ్చిమాలిక పత్రిక ప్రతిష్ట పెంచుకున్నారు.

  2. పెద్దలు జయదేవ శాస్త్రి గారికి వందనాలు. అయ్యా, ఒకే సారి నారాయణ హృదయం, లక్ష్మి హృదయం వెయ్యడానికి స్థలాభావం వల్ల కుదరలేదు. వచ్చే రెండు సంచికల్లో లక్ష్మి హృదయం పూర్తీ చెయ్యాలని అనుకున్నాము. మధ్యలో వదిలేది లేదు. వచ్చే సంచికలో వీలుంటే, లక్ష్మి హృదయం పూర్తిగా రాస్తాను. అంతవరకూ వేచి ఉండమని మనవి.ధన్యవాదాలతో…పద్మిని.

  3. మీరు ఇచ్చినది కేవలం నారాయణ స్తోత్రమే ..లక్ష్మి హృదయ స్తోత్రం ఇవ్వలేదు..ఇలా చేయడం అపచారం అనిపించుకుంటుంది..గమనింప ప్రార్ధన..

  4. Very good work Padmini Bhavaraju gaaru … bhaavam kooda vivaristoo chaalaa vivaramgaa raasaaru … thanks very much …

  5. శ్రీ లక్ష్మి నారాయణ హృదయం చదవడం నా అదృష్టం …………………………………. మాలిక పత్రిక ఎడిటర్ గారికి కూడా ధన్యవాదాలు

Leave a Reply to జయదేవానంద శాస్త్రి .చల్లా Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

October 2012
M T W T F S S
« Aug   Dec »
1234567
891011121314
15161718192021
22232425262728
293031