March 28, 2024

కరగని కాటుక

రచన: సుభద్ర వేదుల

పొద్దున్నే వచ్చిన ప్రాణమిత్రుడు విశ్వాన్ని అతని భార్య లతనీ చూసి “హేమా, విశ్వం, లతా వచ్చారు. అందరికీ కాఫీ తెచ్చేయ్!” అన్నాడు రాఘవ.

“ఏరా.. పొద్దున్నే ఎదైనా ప్రోగ్రాం పెట్టావా? చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావ్” అన్నాడు నవ్వుతూ..

విశ్వం నవ్వలేదు. మౌనంగా కుర్చీలో కూలబడ్డాడు ఏదో ఆలోచన ముడిపడ్డ అతని భృకుటిలోనూ, అతని మెదడులోనూ సుడి తిరుగుతోందని గ్రహించాడు. ఒకటా, రెండా, దాదాపు నలబై ఏళ్ళ పై చిలుకు స్నేహం వాళ్ళది. ఒకేఊరిలో పుట్టిన వారితోపాటుగా ఎదిగి స్థిరపడింది. ఉద్యోగరీత్యా మధ్యలో వేరైనా రిటైరయ్యి ఈ మధ్యనే ఇద్దరూ హైదరాబాదులోనే ఉంటున్నారు. ఆలోచనల్లోనూ, అభిప్రాయలలోనూ అంతస్థులలోనూ ఉన్న అంతరాలు వారి స్నేహానికెప్పుడూ అడ్డం కాలేదు.

విశ్వం పూర్తి పేరు విశ్వనాధం. వాళ్ళ నాన్నగారు ఊరిలోనే పెద్ద రైతు చాలా పెద్ద ఇల్లు వాళ్ళది. పెద్ద పెద్ద అరుగులతో, ఒక చిన్న సైజు కోటలా ఉండేది. విశ్వమూ, అతని తర్వాత ఇద్దరు చెల్లెళ్ళూ. దానితో అతను రాజకుమారుడిలా పెరిగాడు భావుకుడు అని చెప్పలేకపోయినా స్వాప్నికుడు అని చెప్పవచ్చు. తాను అన్నమాట మాత్రం నెగ్గాలని మహా పంతం పట్టుదల చిన్నప్పటినించీ.  రాఘవ వాళ్ళ నాన్నగారు ఊరిలోని హైస్కూల్ లో సోషల్ మాస్టారు. అతనూ, అక్కా, తమ్ముడూ, నాలుగు గదుల బొమ్మరిల్లులాంటి పెంకుటిల్లు ఉన్నంతలో తృప్తిగా, హాయిగా ఉండాలని తెలిసిన నైజం.

“ఏమైందిరా?” విశ్వాన్ని అడిగాడు. ఇంతలో రాఘవ భార్య హేమ వచ్చింది అందరికీ కాఫీలతో.

“లతా, రాత్రి లక్ష్మిగారింటికి పేరంటానికి రాలేదేం? అంది. అన్నాకా కానీ ఎర్రబడిన ఆమె కళ్ళని చూడలేదు. “ఏమయింది లతా? ఒంట్లో బావులేదా?” అని కంగారుగా అడిగింది.

“నువ్వెన్నైనా చెప్పమ్మా! వీడి వాలకం చూస్తే ఇవ్వాళ పెదవి విప్పేటట్టు లేడు? అన్నడు లతని చూస్తూ.

“కావ్య.. కావ్య ఫోన్ చేసింది. వాళ్ళీద్దరికీ ఏ మాత్రం పడటం లేదులా ఉంది అన్నయ్యా! దాని మాటల వరస చూస్తే ఇంకెన్నాళ్ళు కలిసి ఉంటారో? అనిపిస్తోంది.. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ అంది లత.

పిడుగు పడ్డట్టు ఉలిక్కిపడ్డారు  రాఘవా, హేమా. “అరే. నిజమా? మాకు ఫోన్ చేసి వారం పైన అయింది. బిజీగా ఉందేమో అనుకున్నను. ఏమయిందిటమ్మా?” అన్నాడు రాఘవ.

“గొడవలంటే ఏవో అందరి సంసారాలలోనూ ఉన్నట్టే ఎవో చిన్నవి అనుకున్నాం కదా! మనం. ఇంతలోనే ఇదేమిటి? “ హేమ కూడా కంగారుగా అంది.

కావ్య  విశ్వం, లతల కూతురు. ఆడపిల్లలు లేనందున రాఘవ, హేమలకి కూడా కావ్య అంటే ఎంతో ప్రేమ. చిన్నప్పటి నించి సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకునేవారు. కావ్యకి కూడా వారిద్దరంటే ఎంతో ఇష్టం. అంతే కాదు, ’ఒకరికొకరు అన్నట్టుగా’ ఉండే వారిద్దరి అన్యోనత అంటే కావ్యకి మరీ ఇష్టం.

తను కోరుకున్న శరత్ ని పెళ్ళి చేసుకుంటానని కావ్య చెప్పగానే ఆమె కొరిక ప్రకారం క్రిందటేడాది ఎంతో వైభవంగా పెళ్ళి చేసారు. పెళ్ళి అయిన రెండు నెలలకే ఇద్దరికీ అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ’చిన్నపిల్లలు’  తొందరలోనే సర్దుకుంటారులే’ అనుకున్నారు. ఇంతలోనే ఇలా.. అదీ కాక, కావ్య ఇప్పటివరకూ తమకి చెప్పకపోవడం ఇంకా విచిత్రంగా అనిపించింది రాఘవకి.

“ఏమిటో అన్నయ్యా? మనం వెతికి తెస్తే సంప్రదాయమూ, కుటూంబమూ అని చూస్తాము తప్ప మనుషులు కలిసిన వాళ్ళ బంధం కంటే గొప్పగా ఉండదు కదా అనుకున్నాము, ఈ పిల్లలేమిటో? ఈ వరసేమిటో? బొత్తిగా అర్ధం కావడం లేదు, కొద్దిగా సర్దుకుపోదామని కావ్యకైనా లేదు” అంది లత.

“ఎందుకు సర్దుకోవాలి? ఆడపిల్ల కనకనా? పిచ్చిదానిలా మాట్లాడకు. అసలు శరత్ మాట్లాడే దాంట్లో ఏమైనా అర్ధం ఉందా? వాడు కాలంతో పాటూ మారలేదు. ఎక్కడో తాతల కాలంలో ఆగిపోయాడు. పాత చింతకాయ బుధ్ధులూ, వాడూనూ. నా బంగారు తల్లికేం తక్కువ? ఊరికే వాడు అన్నమాటలకన్నింటికీ తల ఒంచి పడిఉండడానికి. పట్టలేనంత ఆవేశంతో అన్నాడు విశ్వం.

“ఇదీ అన్నయ్యా! ఈయన వరస.. ఆ పిల్ల చూస్తే ఈయనకి తగ్గ కూతురు. శరత్ కీ నాకూ పడటం లేదు మమ్మీ.. నేను అన్నదేదీ తనకి నచ్చదు, తను అన్నది నాకు. తనదంతా పాతకాలం ఆలోచనలు పధ్ధతులూ… ఇ హేట్ ఇట్. మంచివాడే కావచ్చు కానీ భార్య మనసును అర్ధం చేసుకోలేడు. రోజూ వండే కూర దగ్గరనించీ, వేసుకునే బట్టాలూ ఉద్యోగమూ, ఇలా అన్ని విషయాలలోనూ రోజూ గొడవపడుతూ బ్రతుకుతుంటే ఎంత చిరాగ్గా ఉంటుందో తెలుసా? నీకు తెలుసు కదమ్మా. నేను దేన్నయినా భరిస్తాను కానీ సర్దుకోవడం అంటే నా వల్ల కానే కాదు అని ఒకటే గొడవ” అంధి బాధగా.

భోజనాల వేళ “ఒరే విశ్వం!  నేను ఒకసారి కావ్యని చూసి వస్తాను. విషయమేమిటో దగ్గరుండి కనుక్కుంటే మంచిది కదా, బెంగళూరు పెద్ద దూరం కాదు కదా, పైగా ఇవన్నీ ఫోనులో మాట్లాడే విషయాలు కావు అన్నాడు రాఘవ.

“ఓహో, ఈ విశ్వామిత్రుడు వెళితే కూతురిని తీసుకుని వచ్చేస్తాడు, భరతనారి చరిత్రకే అవమానం” అని మీ చెల్లెలు ఈ మంత్రం చెప్పిందా? అన్నాడు వెటకారంగా.

“ఇందులో లత చెప్పడానికేముంది? కావ్య మీకెంతో మాకూ అంతే, నువ్వూ వస్తానంటే రా, దాని మావయ్యగా అక్కడ ఏం జరుగుతోందో చూడటం నా బాధ్యత.. దీనిలో అంత వెటకారం అక్కరలేదు” అన్నాడు రాఘవ నిదానంగా.

“సరేలే, నువ్వే వెళ్ళిరా,” అన్నాడు విశ్వం. ’వాడి తత్వమే ఇంత, ఎప్పుడూ ప్రధమ కోపం, ముందు కోప్పడి  తర్వాతే వింటాడు ఆలోచిస్తాడు’ అనుకున్నాడు రాఘవ.

“నేనూ వస్తాను. పాపం పిచ్చితల్లి, ఎంత బాధ పడుతోందో ఒక్కర్తీ” అంది హేమ.. “నిజమే హేమా.. నాకు తట్టలేదు. నువ్వూ వస్తే బావుంటుంది.. వీలైనంత తొందరలో వెళదాం” అన్నాడు రాఘవ.

తత్కాల్ లో రెండు టికట్లు కొనుక్కుని రైలు ఎక్కారు రాఘవా, హేమా.. కావ్యకి సర్ ప్రైజ్ ఇవ్వాలని ముందుగా చెప్పలేదు, కావ్యకి ఇష్టమని కొబ్బరి నూజూ, జంతికలూ చేసింది హేమ.

చెట్లనీ, స్తంభాలనీ వెనక్కి తోసుకుంటూ తను ముందుకు దూసుకెళుతోంది రైలు. “చరిత్ర పునరావృతమవడమంటే ఇదేనేమో హేమా, వాడికొచ్చిన సమస్యే వాడి కూతురికీ రావాలా?” అన్నాడు రాఘవ.

“అలా అనకండి, చిన్నపిల్లలు, తెలిసీ తెలియని వయసు. పెద్ద గొడవలేమి అయి ఉండవు, ఈ కాలపు పిల్లల సంగతి మీకు తెలియదూ!  ఓపికలు, ఓర్మీ లేవు. అసలు వాళ్ళకేం కావాలో కూడా వాళ్ళకి తెలీదు” అంది హేమ. రాఘవ మనసు కూడా వెనక్కి పరిగెత్తింది. విశ్వం ఏం.ఏ రెండో సంవత్సరం లో ఉన్నప్పుడు వాళ్ళ మామ్మగారికి పెద్ద జబ్బు చేసింది. దానితో ఆవిడ ’ఒక్కగానొక్క మనవడు, వీడి పెళ్ళి చూడకుండా పోతానేమో, వెంటనే పెళ్ళి చేసేయమని’ పట్టు పట్టుకుని కూర్చుంది, అంతే కాదు పొరుగునే ఉన్న పళ్ళెటూరిలో ఉన్న తన తమ్ముడి వరస అయ్యే అతని కూతురు పరమేశ్వరిని విశ్వానికి ఇచ్చి చెయ్యాలని, అలా చేస్తే రెండు కుటుంబాలూ మరింత దగ్గరిగా ఉంటాయని ఆవిడా ఉద్దేశ్యం.

ఈ సంగతి తెలిసిన విశ్వం మిరపకాయ తిన్న కాకిలా ఎగిరాడు “ఠాఠ్ ఇప్పుడే నాకు పెళ్ళేమిటి? మామ్మ – ఆరోగ్యానికీ, నా పెళ్ళికీ సంబంధం ఏమిటి? ఒకరినొకరు తెలుసుకోకుండా నేను పెళ్ళి చేసుకునేదే లేదు. పైగా ఇంకా చదువే అవ్వలేదు. ’తాదూర కంత లేదని’ “ అని విసుకున్నాడు.

“పోనీలేరా, ఈ ఏడాది చేసుకో, మళ్ళీ ఏడు చదువు పూర్తి అయ్యాకా ఉద్యోగం వచ్చాక అయ్యాయిని నీ దగ్గరకి తీసుకెళ్ళవచ్చు అందాకా కోడలిని మాదగ్గర ఉంచుకుంటాం, మాకూ సరదాగా ఉంటుంది “ అన్నారు విశ్వం అమ్మా, నాన్నా.

అంతేకాదు. “ఫలానా పరమేశ్వరిని చేసుకొవాలి, వాళ్ళకి మాట ఇచ్చేస్తాం “  అని చెప్పగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు.

“మీరు చేద్దామనుకునేది నా పెళ్ళా? మరెవరిదైనానా? అసలు పిల్లని చూడకుండా పెళ్ళేమిటి? ఇంకెవరూ దొరకనట్టు ఆ పల్లెటూరి పిల్లే దొరికిందా? పైగా పరమేశ్వరి అని మోటు పేరేమిటి?” అని అతను వీరంగం వేసాడు.

“ఒరే నువ్వీపెళ్ళి చేసుకోకపోతే నేనివ్వాలే గుటుక్కుమంటాను, ఆనక పాపం నీదే సుమా, పైగా మా తమ్ముడికి వాడు పోయేముందు మాట ఇచ్చాను, ఏమైనా ఈ పెళ్ళి జరిగి తీరాల్సిందే. “ అని వాళ్ళ బామ్మ విశ్వం కంటే ఎక్కువగా భీష్మించుకుని కూర్చునేసరికి మరో దారిలేక దిగివచ్చి ఓ శుభ ముహూర్తాన పరమేశ్వరి మెళ్ళో తాళి కట్టాడు “అమాయికేం రా? చక్కగా, బాపూ గారి హీరోయిన్లా ఉంది. ఊరికే తిక్కవేషాలు వేసి పెద్దవాళ్ళతో తిట్లు తినకు, పేరూ, గీరు అది కావాలంటే తరువాత నీకిష్టం వచ్చినట్టు పిలుద్దువుగాని “ అని రాఘవ నచ్చచెప్పాడు.

“ఆలా ఉందేం నీకు? నాకు మాత్రమ్ కోలార్ గోల్డ్ మైన్ని చూస్తున్నట్టు ఉంది. అంతంత నగలేమిటి? ఆ అలంకారమేమిటి? నిన్ను చేసుకోమంటే తెలిసేది…” అని విసుక్కున్నాడు.

వాళ్ళిద్దరి చదువులూ పూర్తయి, ఇద్దరికీ సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగాలు రావడంతో విశ్వం ఢిల్లీకీ, రాఘవ హైదరాబాద్ కీ  తరలారు.

పరమేశ్వరిని ఢిల్లీ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు రాఘవ ఇంటికి వచ్చాడు.

“నేను నా భార్య పేరు మార్చాలనుకుంటున్నాను, ’లత’ అని… ఎప్పటినించో నాకా పేరంటే చాలా ఇష్టం. “ ఆన్నాడు విశ్వం.

“భార్యని మార్చటం లేదు కదా, సంతోషం” అన్నాడు రాఘవ .

“తనకి ఇష్టమో కాదో కనుక్కున్నావా? “ అన్న రాఘవ తరవాత ప్రశ్నని విననే లేదు.

లత మొదటినించీ నిండుగా ఉండేది.. పెద్ద సన్నం ఎప్పుడూ కాదు, అలాగని లావూ కాదు. ఎప్పుడూ తను పుట్టిన ఊరు వదిలి రాలేదు, ఐదో క్లాస్ తరువాత చదవనూ లేదు. ఆవిడ పాపం విశ్వం తతంగమూ, అతని హడావిడీ చూసి చాలా కంగారు పడిపోయేది. ’భర్త అన్నదే వేదం’ అన్న మాట నరనరనా జీర్ణించుకుపోయిన భారత నారి కనక అతని మాటకి ఎదురు చెప్పడం అనేది ఆ అమ్మాయికి కలలో కూడా చేత కాదు.

ఒక్కసారిగా తనదైన బుల్లి ప్రపంచంలోంచి ఢిల్లీ లాంటి మహానగరం వచ్చి పడడమే గొప్ప అనుకుంటే విశ్వం పోరు ఒకటి. అతను ఆమెని పంజాబీ వాళ్ళ డ్రెస్లూ, ఇంట్లో నైట్ గౌన్లూ అవీ వేసుకోమని, హిందీ, ఇంగ్లీష్ మాట్లడడం నేర్చుకోమని ఒకటే గొడవ పెట్టేవాడు. ఎప్పుడూ పరికిణీ ఓణీలూ, చీరలు తప్ప అలవాటు లేని లతకి ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉండేవి. తనకేమో తెలుగు పాటలంటే ప్రాణం. ఆందునా చిన్నప్పుడు సంగీతం కూడా నేర్చుకుంది, విశ్వం మాట్లాడితే హిందీ, ఇంగ్లీష్ పాటల్లు తప్ప వినడు ఇలా ప్రతీ చిన్న విషయంలోనూ వారిద్దరికీ ఉత్తర ధృవం, దక్షిణధృవంగా ఉండేది.

 

విశ్వం పెళ్ళి అయిన ఏడాదిన్నరకి రాఘవకి హేమతో పెళ్ళి అయింది. మగవాళ్ళిద్దరి స్నేహం కారణంగానో లేక వారిద్దరూ కలుసుకున్న క్షణమో కానీ హేమా, లతా కూడా చాలా మంచి స్నేహితులయిపోయారు తొందరలోనే. పాపం అక్కడెవరూ లేక, ఇంట్లో చెప్పుకోలేకా కలిసినప్పుడో, ఫోన్లోనో అప్పుడప్పుడూ విశ్వం విషయాలు చెప్పి బాధపడేది.

విహార యాత్రకి వెళ్ళి ఒకసారి రాఘవా, హేమా విశ్వం ఇంట్లో దిగినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకుంది. తను చెప్పినట్టు వినకపోతే పుట్టింట్లో దింపేస్తానని అతను అన్నట్టు చెప్పింది.

ఆ రోజు రాత్రి మేడ మీదకి తీసుకువెళ్ళి రాఘవ, విశ్వాన్ని కొంచం గట్టిగానే మందలించాడు.

“ఇలా ఊరు కాని  ఊరు తీసుకొచ్చి ఆ పిల్లని ఇలాగేనట్రా బాధ పెట్టడం? తనకు వచ్చినట్టు తనని ఉండనీ, వీలైతే మెల్లిగా చెప్పి మార్చుకో. అంతే కానీ ఇలానా? మేము వచ్చినప్పట్నించీ చూస్తున్నాను. అమ్మాయి తన ఇంట్లో ఉన్నట్టుగా సంతోషంగా ఉండటం లేదు. ఒక జైలు లో ఉన్నట్టుంటోంది కానీ. ఏం చేసినా, చెయ్యాలన్నానువ్వేం అంటావో? నీకు నచ్చుతుందో, లేదో? నచ్చకపోతే నువ్వేం రంకెలు వేస్తావో? పొద్దున్న లేస్తే తన టైమంతా ఈ  ఆలోచనలతోనే గడిచిపోతోంది. ఇంకేం నేర్చుకుంటుంది? కొంపదీసి నువ్వు లావుగా ఉన్నావని అన్నావా? రెండురోజులనించీ అన్నమే తిన్నడం లేదు” అన్నాడు కోపంగా.

“అను, నువ్వూ అను.  అసలు జీవితమే పెద్ద తలనొప్పి అయిపోయింది. కావలసినవేవీ జరగవవు సరికదా? జరిగిన వాటిని నాకనుగుణంగా మార్చుకోవాలనుకోవడం కూడా నా తప్పేనా? “ అని ఎదురు విసుక్కున్నాడు.

“అలా కాదురా, అమ్మాయేమో  పల్లెటూరిలో తల్ల్లితండ్రుల చాటున పెరిగిన పిల్ల. ఇలా ఒక్కసారి నీ భావాలనీ తన మీద రుద్దేస్తే ఎలా చెప్పు? “ అన్నాడు రాఘవ.

“ఏమన్నాను? కాలానికీ, ఉన్న ఊరికీ తగ్గట్టుగా వేషం, భాషా మార్చుకోమన్నాను. అదీ తప్పేనా? నలుగురిలో తిరగాలంటే ఆ మాత్రం ఉండద్దా? ఎంత చెప్పినా వినకపోతే ఎప్పుడో ఒకసారి ప్రాణం విసిగి. విన్నావా సరే, లేకపోతే మీ ఇంట్లో దింపేస్తాను అన్నాను. దానికి ఈ ఏడుపులూ పెడబొబ్బలూనూ.. చ …  నా స్థానంలో ఉంటే తెలుస్తుంది, ప్రతీ దానికీ సర్దుకుంటూ బ్రతకడం ఎంత చిరాకో? “ అన్నాడు కోపంగా.

“నీ స్థానంలో ఉండక్కరలేదు, ప్రతీ వాళ్ళకి జీవితంలో సర్దుకోవడాలూ, సరిపెట్టుకోవడాలు తప్పవు నాయనా. ఎటొచ్చీ మనవి, మనకు చాలా పెద్దవిగా కనిపిస్తాయి. ఇలాంటివన్నీ అద్దంలో కొండల్లా కనిపించాలి తప్ప జీభూతాలా కాదు. అడిగి చూడు, ప్రతీ వారికీ ఎన్నో ఉంటాయి. కాస్త ఆ అమ్మాయి వైపునించి కూడా ఆలోచించు. లత చాలా మంచి పిల్ల, ప్రస్తుతం నీకు నచ్చినట్లు ఉండడానికి ప్రయత్నిస్తోంది, ఆమెని ప్రేమతో అనునయంతో నీ వైపుకి తిప్పుకో, ఇలా చెప్తున్నానని మరోలా అనుకోకు” అని లక్షవిధాల చెప్పాడు.

తర్వాత వాళ్ళు అడపా తడపా గొడవలు పడినా బాగానే ఉన్నారు. మరొక మూడు నాలుగేళ్ళల్లో లత చాలా మారింది. ఇంగ్లీషూ, హిందీ నేర్చుకోవడమే కాక ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ పాస్ అయింది. కొన్నాళ్ళు పట్టినా, మొతానికి విశ్వం కోరిన రీతిలో తనను మలుచుకుంది. ఆమె కోసం విశ్వం ఏం చేశాడో? అనుకుంటూ ఉంటాడు రాఘవ.

“భూమి గుండ్రంగా ఉండడం అంటే ఇదేనేమో? వాడి కూతురికీ ఇంచుమించు ఇదే రకమైన సమస్య. ఇది యాదృచ్చికమేనా? “ అని ఆశ్చర్యపోయాడు రాఘవ. “తను ఒక తరం లోంచి మరొక తరంలోకి మారినా మారని వాడి తత్వం, అప్పుడూ ఇప్పుడూ ఒకటే. వాడి మాటే నెగ్గాలన్న పంతం. ఇది ఎటు పోతుందో, అప్పుడు భార్య తనకోసం మారాలనుకున్నవాడు తన కూతురి దగ్గరకు వచ్చేసరికి అలా అనుకోలేకపోతున్నాడు. అది వాడి కూతురనా, లేక ఆడా, మగా సమానమేనని నేర్చుకున్నాడా?” అనుకున్నాడు నిట్టూరుస్తూ.

మార్నాడు పొద్దున్నే వచ్చిన రాఘవనీ, హేమనీ చూసి కావ్య ఆశ్చర్యపోయింది మొదట, తర్వాత ఆనందంతో ఉబ్బి తబ్బిబైపొయింది

“అరే! మావయ్యా, అత్తా, ఎలా వచ్చారు? ఒక్క మాటైనా చెప్పలేదే మీరు కానీ, అమ్మా వాళ్ళు కానీ, అంది సంబరంగా.

“మీ అత్త కి నిన్న వడియాలు పెట్టినప్పటినించీ నువ్వే గుర్తుకొస్తునావుట, ఒకటే గొడవ, ఒకసారి చూసొద్దాం, ఎలా ఉందో, ఏమిటో? అని, నించోనివ్వలేదు నన్ను నీకు తెలుసుకదా! మీ అత్త సంగతి, అనుకుందంటే అయిపోవాల్సిందే, అదీ కాక ఎప్పుడో పెళ్ళి అయిన కొత్తలో బెంగుళూరు తీసుకు వస్తాను అని చెప్పానుట కూడానూ” అన్నాడు నవ్వుతూ.

“అదేం కాదులే మావయ్యా, అత్త నోరు తెరిచి అడగ్గానే మనసు తెలుసుకుని ఆనందంగా నువ్వు తీరుస్తావు కనకే అలా అవుతోంది, నేనెన్ని సార్లు చూడలేదు” అంది కావ్య నవ్వుతూ.

ఇప్పటికి శరత్ నిద్ర లేచి వచ్చి నవ్వుతూ ఆనందంగా పలకరించాడు. ’చెప్తే స్టేషన్ కి  వచ్చేవాడిని కదా!’ అన్నాడు ’తెలియని ఊరు కాదు కదా, మిమ్మల్నెందుకు ఇబ్బంది పెట్టడం? అంది రాఘవ.

“ఈ రోజు శుక్రవారం కదా, నేను సెలవు పెడతాను” అంది కావ్య.

“ఒద్దమ్మా, మా కోసం మీ పనులు మానుకోవద్దు, నేనూ మీ అత్తా అలా ఊరు తిరిగి వస్తాము, మీరు ఆఫీసు నించి వచ్చేదాకా అన్నాడు” రాఘవ.

“అవును కావ్యా! ఎప్పటినించో లాల్ బాగ్ చూపిస్తాను అన్నారు. ఇన్నాళ్ళకి కుదిరింది, నువ్వు ఆఫీస్ కి వెళ్ళు “అంది… అంతలో శరత్ దోశల పిండి కొనుక్కొచ్చాడు, హేమా గబగబా పచ్చడి చేసి తనే అందరికీ దోశలు వేసి టిఫిన్ పెట్టింది, “ఆహా ఆంటీ చట్నీ చాలా బావుంది, మా అమ్మ వంట తర్వాత ఇంత మంచి టిఫిన్ తినలేదు అన్నాడు శరత్ కావ్య అతన్ని తినేసేలా చూసింది. అదేమిటి కావ్యా? నువ్వెప్పుడూ తినాలని అనిపిస్తే కొని తెచ్చుకుంటాం లేదా బయటకి వెళ్ళి తినేస్తాం, అంది తేలిగ్గా, అన్నీ నేనొక్కొత్తినే చేసుకోవాలి కదా అంది.

వాళ్ళిద్దరూ ఆఫీసులకి వెళ్ళాకా, కొద్దిగా ఇల్లు సర్ది పెట్టింది హేమ ఎప్పుడూ ఆఫీస్ పనులతో బిజీగా ఉండే నవ దంపతుల ఇల్లుకి కావ్య ఇల్లేమీ మినహాయింపుగా లేదు.

ఎప్పటెప్పటివో డబ్బాలు గిన్నెలూ ఫ్రిడ్జ్ లో, ఉతికినవీ, ఉతకనివీ అన్న తేడా లేకుండా బెడ్రూంలోనూ బాల్కనీలోనూ బట్టలూ, అంగుళం మందాన పేరుకున్న దుమ్మూ, ఇవన్నీ వీలున్నంతలో శుభ్రం చేసింది.

స్నానం చేసి దగ్గరలో ఉన్న షాపుకు వెళ్ళి కూరలు పెరుగూ కొనుక్కొచ్చారు. అవన్నీ సర్దిపెట్టి ఇద్దరూ ఆటోలో లాల్ బాగ్ వెళ్ళి వచ్చారు. అప్పటికి సాయంత్రం అయ్యింది. హేమ అందరికీ వంట చేసింది.

డైనింగ్ టేబిల్ తుడిచి, అన్నీ దాని మీద అమర్చి ఇద్దరూ సోఫాలో కూర్చుని టీ.వీ చూస్తూ కావ్యా, శరత్ ల కోసం ఎదురు చూడసాగారు.

ముందు శరత్ వచ్చాడు “ ఆంటీ, మన ఇంట్లోంచేనా ఈ వాసన, సాంబర్ ఘుమఘుమ” అనుకుంటూ, చాలా సరదా అయిన కుర్రవాడు శరత్. రాగానే కాఫీ ఇచ్చింది హేమ అది తాగి జంతికలు తింటూ కబుర్లు చెప్పసాగాడు.

కావ్య ఆఫీస్ బస్ వీధి చివర ఆగుతుంది, అక్కడనించే ఐదు నిమిషాల నడక, ఇంక రావాలి? అన్నాడు అంటూ “ఏలా ఉందయ్యా? కొత్త కాపురం?” అన్నాడు రాఘవ నవ్వుతూ.

శరత్ నవ్వలేదు “కొత్తగా అని చెప్పుకోవడానికే మీ లేదు అంకుల్, ఇంకొక మనిషీ, ఇంకొక గదీ పెరిగింది అంతే తప్ప నాకేమీ తేడా కనపడటం లేదు” అన్నాడు సూటిగా.

అలాంటి సమాధానం ఎదురు చూడని రాఘవ కంగారు పడ్డాడు. “అదేమిటోయ్? అంత మాట అనేసావ్? ఏమయింది? అన్నాడు.

అప్పటికి కొంచం సర్దుకున్న శరత్. “అబ్బే ఏం లేదు అంకుల్!… ఏదో సరదాకి అన్నాను “ అన్నాడు నవ్వడానికి ప్రయత్నిస్తూ.

“పరవాలేదులే! సరదాకి అయితే.. కానీ శరత్. అధాటుగా వచ్చేది చాలా వరకూ నిజం అవుతుంది ఎందుకంటే అలోచించి చెప్పేది కాదు కనక. మాకు కావ్య ఎంతో, తన చెయ్యి పట్టుకుని మా జీవితాల్లోకి వచ్చిన నువ్వూ అంతే అందుకని నీకేదైనా చెప్పాలంటే ఏ రకమైన ఇన్హిబిషన్స్ లేకుండా చెప్పవచ్చు కావ్యకి మావయ్యనైతే నీకు బాబాయిని అనుకుని” అన్నాడు నవ్వుతూ.

శరత్ మాట్లాడలేదు, కాసేప్పు, తరువాత చెపాడు “కావ్యవాళ్ళతో మీకున్న రిలేషన్ గురించి నాకు తెలుసు అంకుల్, అందుకే నేను అనుకోకుండానే అనేసావేమో మాట. మీకు తెలుసుగా అంకుల్ కావ్యంటే నాకెంత ఇష్టమో. పెళ్ళి కాక మునుపు ఎంత సరదాగ ఉండేవాళ్ళమో, ఇప్పుడేమో రోజూ ఎడముఖం, పెడ ముఖం అన్నట్టుగా ఉంది. నేనేది చెప్పినా తనకి నచ్చదు, నావన్నీ పాతకాలం భావాలంటుంది. నెలలో కనీసం వారం రోజులు కూడా మా ఇంట్లో వంట వండుకోము. నేను చిన్నప్పటినింఛీ హాస్టల్ లో ఉండడం మూలాన నాకు ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటే చిరాగ్గా ఉంటుంది. ఇల్లు చక్కగా నీట్ గా  ఉండాలని, కమ్మగా భోజనం ఉండాలనీ అనుకోవడం పెద్ద తప్పా! ఇంకొకటి. ఈ మధ్య వెర్రితలలు వేస్తున్న ఆధునికతను చూస్తే నాకు చిరాకు, అసహ్యం. ఎప్పుడో ఒకసారి తప్ప పబ్బులూ, డిస్కోలూ అంటూ తిరగడం నాకు నచ్చదు. తనకేమో ఇవన్నీ చాదస్తంగా కనబడతాయి, ఇదీ అదీ అని లేదు ప్రతీదానికీ గొడవే మా ఇద్దరికీ. ఏం చెయ్యాలో తెలీటం లేదు అందుకే ఇలా కొట్టుకుంటూ కలిసి ఉండేకంటే విడిపోవడమే మంచిది అంకుల్. మా ఇద్దరికీ జీరో కంపాటిబిలిటీ. “అని ఇంకా ఎదో చెప్పబోయేంతలో కావ్య వచ్చింది.

“మేమిద్దరం ఓ సారలా తిరిగి వస్తాం, భోజనాలకింకా టైముందిగా!” అని అతనిని బయటకు తీసుకెళ్ళాడు రాఘవ. “మీ ఆంటీకి పుస్తకాల పిచ్చి అది నవలైనా, నాటకమైనా ఒకసారి పట్టిందంటే ఇంకా అది పూర్తి అయ్యేవరకూ హరిహరాదులడ్డం వచ్చినా కదలదు అప్పుడూ వంటైనా, కాఫీ అయినా మనం తంటాలు పడవలసినదే. ఇన్నేళ్ళల్లో అలవాటు మార్చలేకపోయాను. వంట అయ్యేవరకూ చేతికందించకుండా చూడటమే నేను చెయ్యగలిగేది నవ్వుతూ అన్నాడు. చిన్నప్పుడు విశ్వానికి చెప్పినట్టే ఇప్పుడు అతని అల్లుడికీ ఎన్నో విషయాలను చెప్పాడు.

“కావ్య మౌనంగా చూస్తోంది, అప్పుడే స్నానం చేసి వచ్చిన హేమను, లేత రంగు చీర, జాకెట్, హేమ వంటి రంగులో కలిసిపోయింది. చిన్నప్పటినించీ హేమ అంటే ఎంతో ఇష్టం కావ్యకి.

“అత్తా నువ్వు ఎంత అందంగా ఉంటావో, ఇన్నేళ్ళుగా చూస్తున్నాను కదా, ఎప్పుడూ అదే నవ్వు ప్రశాంతత. ఎలా ఉంటావిలా? అసలు నీకెప్పుడూ కోపం రాదా? మావయ్యలాంటి భర్త ఉంటే ఎలా వస్తుందిలే కోపం “ అంది.

మెడ మీద ముడి వేసుకున్న జుట్టుముడిని సర్దుకుంటూ తువ్వలుతో మెడ తుడుచుకుంటూ నవ్వింది హేమ “నిజం అత్తా నువ్వే కాదు, మావయ్యా నువ్వూ కూడా ఎప్పుడూ ఎంత అన్యోన్యంగా ఉంటారో. భార్యా భర్తలంటే మీలా ఉండాలి అనుకుంటాను నేను ఎప్పుడూ.. దా అత్త జడ వేసుకుందువుగాని రా” అని తన గదిలోకి తీసుకెళ్ళింది కావ్య.

మామూలుగా నవ్వుతూ తల దువ్వి జడేస్తానని దువ్వెన తీసుకొచ్చిన లతను చేయిపట్టుకుని ఆపింది హేమ.

“ కావ్యా!! మేమంటే నీకంత ఇష్టమనేనా, మాకేమీ చెప్పకుండా దాచావు? “చిరుకోపంగా  అడిగింది.

“మీ దగ్గర పెరిగిన నేను మీలా దాంపత్యజీవితాన్ని మలుచుకోలేకపోయానని సిగ్గుపడ్డాను అందుకే చెప్పలేదు. అయినా ఇందులో చెప్పడానికేమీ లేదు అత్తా, ఒక్క విషయంలోనూ సయోధ్యలేని ఈ బంధం భరించలేనంత బరువైపోయింది తప్ప ఇందులో ఆనందం లేదత్తా.. ఏమిటీ, ఎందుకూ అంటే నా దగ్గర సమాధానం లేదు. అమ్మంత ఓపికా, ఓర్పూ నాకు లేవత్తా అయినా నేనేందుకు మారాలి? తనే అర్ధం చేసుకోవచ్చుగా, “ బాధగా అంది.

“వద్దమ్మా! నేను చిన్నప్పుడు పెట్టుకునేదాన్ని.. మా అమ్మ రోజూ ఇంట్లో చేసిన కాటుక నా కళ్ళనిండా పెట్టి కాటుక పెట్టిన కన్నేదీ, కలువలు పూచిన కన్నేదీ’ అని పాడేది. మీ మావయ్యతో నా పెళ్ళయి వచ్చేటప్పుడు దగ్గరుండి ఆవునేతితో మెత్తటి కాటుక తయారుచేసి వెండి కాటుక డబ్బానిండా ఇచ్చింది కూడా”..

“మరి? “ అంది కావ్య.

“నేనూ, మీ మావయ్యా హైదరాబాద్ లో కొత్త ఇంట్లో కి దిగిన ఓ నాలుగు రోజుల తర్వాతనుకుంటా పొద్దున్నే నేను నిద్ర లేచి స్టవ్ మీద కాఫీ పెట్టి తీసుకు వచ్చాను. నిద్రలో చెరిగిన కాటుక ముఖమంతా అంటుకుందిట, దానికి తోడు స్టవ్ మసి కూడానూ. అంతే. కాఫీ కూడా తీసుకోకుండా నన్ను చూసి మీ మావయ్య ఒకటే నువ్వు ముఖాన మసి ఏదో, నల్లటి ముద్ద కాటుక ఏదో తెలియకుండా పాముకున్నావు ఇప్పుడా కాటుక పెట్టుకోకపోతేనేం? మసిముద్దలా ఎలా ఉంటుందో? పైగా నేను ఎంతో ముచ్చట పడి కొన్న తెల్ల చీర అంతా అంటించుకున్నావు కూడాను అన్నారు. అప్పుడాయన ముఖమూ, మాట్లాడిన తీరూ నేను ఇప్పటికీ మర్చిపోలేనమ్మా. అప్పటినించీ ఇప్పటివరకూ మళ్ళీ కాటుక పెట్టుకోలేదు, నేను. ఇంకో విషయం చెప్పనా. పెట్టుకుంటే అంత వెక్కిరించిన మీ మావయ్య ఇన్నేళ్ళల్లోనూ నేను కేవలం తనకి నచ్చదనే కాటుక పెట్టుకోవడం లేదనే విషయం ఏనాడూ గమనించనేలేదు. నాతో ఎప్పుడూ చెప్పనూ లేదు. మగాళ్ళు..” అంది మొహం పక్కకు తిప్పుకుంటూ.. ఆశ్చర్యంగా చూసింది కావ్య “ నిజమా.. అత్తా” అంది.

హేమ నవ్వింది.. “నిజమే. ఇప్పుడు పెట్టుకుంటే మరో గంటలో కరిగిపోయే కాటుకకంటే మీ మావయ్య ఇష్టమే కరగని కాటుక అనుకున్నాను, “ అంది.

మర్నాడు బయలుదేరుతున్న వారిని ఇంకో నాలుగురోజులుండమని గొడవపెట్టింది కావ్య. రైలు యెలహంక దాటగానే ఫోన్ మోగింది కావ్య దగ్గరనుంఢి. “ మీరొచ్చి వెళ్ళాకా సమస్యలు మరీ పెద్దవిగా అనిపించడం లేదత్తా, నేనూ కరగని కాటుకనే పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను” అంది. హేమ నవ్వింది.. రైలు పరిగెడుతోంది.

5 thoughts on “కరగని కాటుక

  1. హ్మ్మ్.. కరగని కాటుక బాగుంది. కానీ, మనుషుల మనస్తత్వాలు, ఇగోల మూలంగా వచ్చే పంతాలు నిజంగా ఇంత సులువుగా పరిష్కారమైపోతాయంటారా.. నాకైతే అనుమానమే! 🙂

  2. కథను చాల బాగా, సున్నితంగా చెప్పారు. నాకు బాగా నచ్చింది. ఎలాంటి మరిన్ని కథల కొరకు వేచి చూస్తాను.

  3. కధలో అక్షరదోషాలు చాలా ఉన్నట్టున్నాయి కొంచం సరిచేస్తే బాగుంటుందేమోనండీ

Leave a Reply to శ్రీనివాస్ పప్పు Cancel reply

Your email address will not be published. Required fields are marked *


Notice: Trying to get property of non-object in /var/www/html/maalika/magazine/wp-content/plugins/jetpack/modules/gravatar-hovercards.php on line 238