March 29, 2024

సీత… సీమచింత చెట్టు

రచన : సుప్రజ

 

‘ఓయ్..రామ చిలుకలూ..ఇదిగో చూడండీ..చెప్పానా అమ్మనడిగీసారి పచ్చ గౌనూ ఎర్ర రిబ్బన్లూ కొనించుకుంటానని .. ఇప్పుడు మనందరం ఒకటే. మీరూ ఈ చెట్టూ నా గౌనూ పచ్చా.. మీ ముక్కూ, ఆ కాయలూ నా రిబ్బన్లూ ఎరుపూ… కదూ’  సీమ చింత చెట్టు  కిందికొస్తూనే  చూపించా నా గౌను చిలుకలకి.

కొరికేసిన కాయలు రాల్చి గోల గోలగా లేచెగిరిపోయాయి  చెట్టు మీద రామ చిలకలన్నీ. నా  చిలుకాకు పచ్చ గౌను కుచ్చులు విప్పుకున్నట్టుంది  వాటి రెక్కల్లో….. ఎంతందము ఆ రెక్కల్లో! ఎంత గర్వమో అలా  ఎగరడంలో. ముక్కుల్లో ఆ ఎరుపెక్కడిదో వీటికి.!   సీమ చింత కాయలది కాబోలు. అబ్బురంగా చూస్తూండిపోయాను చిలుకల వైపు.

చెట్టు  వైపు  తిరిగా. జిలేబీలని దారాలకి కట్టి వేలాడ దీసారా అన్నట్టున్నాయి  పచ్చగా ఎర్రగా సీమ చింతకాయలు వేలాడుతూ. చెట్టు మురిసిపోతూ చూస్తున్నట్లే అనిపించింది నన్ను .. అచ్చం అమ్మలా. గర్వంగా నాన్నలా. ఎప్పుడూ  తోడుండే నా నేస్తంలా. ‘ఎంతిష్టమో నాకు నువ్వంటే…  చూడు నీ పేరు నా పేరు ఎంత బాగా కలిసిందో. నీ మొదటక్షరం చివరక్షరం కలిస్తే నేను!  అమ్మెందుకు  పెట్టిందో నాకీ పేరు. మరి నీకెవరు పెట్టారా పేరు? అమ్మ నడిగితే చెప్పింది నీ విత్తనాలు వేరే దేశం నించి తెచ్చి ఇక్కడ నాటారంటా! . నాకు భలే ఆశ్చర్యమేసింది తెలుసా ఎక్కడినుంచో నువ్వు నా కోసమే ఇంత దూరం వచ్చినట్లు’ చెట్టు తో కబుర్లు మొదలెట్టా..

‘సీతా..’ అమ్మ పిలుపది.

‘వస్తున్నానమ్మా’ చిలుకలు  రాల్చిపోయిన కాయలు ఏరుకుంటూ అమ్మతో చెప్పా..

‘వచ్చేయ్ త్వరగా  . పద్మ కూడా వచ్చేసింది’ అమ్మ మళ్ళీ పిలిచింది.

‘ఉండమని చెప్పు పద్మనీ.ఇదిగో ఇప్పుడే వస్తున్నా’ ఏరుకున్న కాయలు  గౌనులో పోసుకుంటూ అన్నా అమ్మతో..

ఎర్రగా పండిన కాయలు. చుట్టలు చుట్టలుగా భలే  ఉన్నాయి.. పొట్టలు పగిలి లోపల నల్లటి గింజలు కనబడుతూ సీమ చింతకాయలు నవ్వుతున్నట్టుంది.  నా పచ్చ గౌనులో పోసుకున్నాక చూసుకుంటే పచ్చగా ఎర్రగా తెల్లగా నల్లగా  ఆ చెట్టు  దిగి ఈ  చెట్టెక్కినట్టున్నాయి కాయలు..

‘ఎందుకే అవన్నీ.. మళ్ళీ అన్నం తినవూ’ గోంగూర  పచ్చడి మీగడా వేసి కలిపిన అన్నం ముద్దలుగా చేసి పెడుతూ అంది అమ్మ.

‘తింటా గాని ..అమ్మా, నాకూ.. ఈ సారి కూడా పచ్చ పరికిణీ… దానికి ఎర్రంచుండాలి ..సరేనా… ‘ అమ్మ  ముద్దలు పెడుతుంటే కాసిని సీమ చింతకాయలు పుస్తకాల సంచిలో సర్దుకుంటూ గుర్తు చేశానమ్మకి.

‘సరే గాని..పద్మ నీకోసం ఎదురు చూస్తుంది. టిఫిన్లో నీకిష్టమైన ముద్దపప్పూ గోంగూరా  పెట్టా. మొత్తం తినేయాలి.. బడయిపోయాక నేరుగా ఇంటికొచ్చేయి. ఈ రోజు చెరుకు తోటకి నాన్న బండి కడతానన్నారు..’ బొట్టు దిద్దుతూ చెప్పింది అమ్మ.

‘నిజమా! పద్మ ని  కూడా తీసుకెల్దామా  మనతో పాటు..ఏ పద్మా ‘ పద్మకేసి తిరిగా.

సరేనంది పద్మ. అమ్మ చేతికిచ్చిన బాక్సు పుస్తకాల సంచిలో  సర్దుకుని సీమ చింత కాయల్ని  మరో సారి చూసుకుని పద్మతో కలిసి రోడ్డెక్కాను.

‘పద్దూ, ఇవి మొలకొస్తాయి  కదూ ‘ సంచీలో పోసి తెచ్చికున్న సీమ చింత కాయలు వొలిచి అందులో నల్లటి గింజలు  తీసి  దారి పొడవునా అక్కడోటి అక్కడోటి విసురుతూ అన్నా పద్మతో.

వొగురొగురు  సీమ చింతకాయలు తిన్నవి తిని మిగతా వొలిచేసి గింజలు అలా దారంతా చల్లుతూ  నడుస్తుండేదాన్ని  బడికి.

‘సీతా, నిన్న మా అత్త వాళ్ళింటికి పోతున్నప్పుడు రోడ్డు పక్కన ఈ అగ్గిపెట్ట దొరికిందే!’ బద్రంగా దాచుకున్న అగ్గిపెట్టె సంచీలో నుండి తీసి లేబుల్లని జాగ్రత్తగా చింపుతూ  చూపిచ్చింది పద్మ..తామర పువ్వు బొమ్ముంది  లేబులు పైన. రకరకాల  అగ్గిపెట్టెల లేబుళ్ళు సేకరించడం మాకు అలవాటు,,,

దానసలు పేరు పద్మజ. పద్దూ , పద్మా అని పిలుస్తుంటా. మూడో తరగతి చదువుతున్నాం మేమప్పుడు. మేమిద్దరం కలిసే ఎక్కడైనా. పద్మతో తొక్కుడు బిళ్లా, చెరుకు తోట గట్ల మీద  అమ్మ దగ్గర నేర్చుకున్న మట్టి  బొమ్మలూ, గడ కర్ర తో వెళ్లి వొడి నింపు కొచ్చిన సీమచింత కాయలూ.  ఆనంద్. వినోద్, జీవన్ విజయ్ అన్నయ్యలతో  వీధి దీపాల కింద పొద్దు పోయే దాకా ఆటలూ, గాలి పటాలూ, గడ్డివాముల్లో మాగిన ఈత పండ్లూ, పశువుల వెంట పరుగులూ, బెల్లం బట్టీల చుట్టూ ఆశర్యాలు. అమ్మా నాన్నా అన్నయ్యా………… అన్నిటిని మించి నా సీమచింత చెట్లూ …చిలుకలు…….. అదొక అందమైన లోకం.

 

**************************************

 

‘రజితా.. కొద్దిగా వేయనా నా అన్నం కూడా’  లైనులో వెళ్లి  పెట్టించుకొచ్చిన గోదుమన్నం పళ్ళెంతో  రజిత పక్కన కూచ్చుంటూ అడిగా..

‘వొద్దు సీతా..ఇదే ఎక్కువైపోద్ది.’  నా గుడ్ల నిండా నీరు చూసాక జాలి పడిపోయింది.

‘అబ్బ వేసుకోవే.. నీకీ రోజుకూడా కోవా బిళ్ళ కొనిస్తాగా’..కోవా బిళ్ళ ఆశ చూపించి రోజూ నా పళ్ళెం లో  అన్నం రజితకి పెట్టేస్తుండేదాన్ని

రజిత గిన్నె నా వైపుకి జరిపితే గబగబ నా పళ్ళెంలో  అన్నమంతా అందులో  వేసేసా.. ఈ లోగా ఎక్కడ చాలంటుందో అని భయం.

 

నేను మూడో తరగతి అయిపోయాక అమ్మ నాన్న అన్నయ్యా  అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చేసాము. నాన్న అక్కడ చెరుకు తోటలూ ఇల్లూ అన్నీ అమ్మేసాడనీ  ఇక ఆ ఊరు వెళ్ళమనీ తెలియలేదు అప్పుడు.  అమ్మమ్మ వాళ్ళూరిలో బడిలేదు. పక్క ఊరు నడిచి వెళ్ళాలి. మామయ్యల పిల్లలంతా బోర్డింగ్ స్కూళ్ళల్లో చదువుతున్నారు అప్పటికే. అమ్మ నన్నూ  అన్నయ్యని కూడా బోర్డింగు స్కూల్లో చేర్పించింది. ట్రంకు పెట్టె, కొత్త బట్టలూ, పుస్తకాలూ, అంతా సరదాగా అనిపించిందప్పుడు  హాస్టలు కి వెళ్ళడం. కొత్త కదా..

 

 

అమ్మకి సీత  వ్రాయునది,

అమ్మా నాకిక్కడసలు  ఉండాలని లేదు. ఆ గోదుమన్నం మింగుడు పడట్లేదమ్మా. దొడ్డుగా  జిగటగా ఉంటుంది. ముక్క పురుగులూ ఉంటాయి. మధ్యాహ్నమూ రాత్రి పెట్టె అన్నమూ అంతే. ముద్ద మింగుడు   పడనీకుండా కన్నీళ్ళ న్నీ  గొంతులో అడ్డం పడుతున్నట్లే ఉంటుంది. వార్డెను  తలుపు దగ్గరే నుంచుంటుంది . ఖాళీ ప్లేటు చూపిస్తే గానీ బయటికి వదలదు. పది  పైసలు పెట్టి కోవా బిళ్ళ కొనిస్తే గాని రజిత ఆ అన్నం వేసుకోదు. నువ్వేమో రోజుకి పది పైసలే గా కొనుక్కోమన్నావూ . ఆకలేస్తుందమ్మా…

నాలుగు రోజులకోసారి మొక్క జొన్న గటక  పెడతారు. అది భలే ఉంటుంది కానీ అందులో  వేసే గోంగూర పచ్చడే. అస్సలు బాగోదు. నువ్వు నాకోసం గోంగూర పచ్చడి చేసేదానివిగా. అది తలుచుకుని తింటున్నా.. మరి నువ్వెప్పుడూ గోధుమన్నం  ఎందుకు వండలేదూ. నువ్వు వండినదే  అనుకుని తినేదాన్నిగా రోజూ … అమ్మా, ఒకటగానా నిన్ను .. ఈ వార్డన్లూ  టీచర్లూ మంచిదే తింటారుగా.మరి  మాకెందుకు ఇలాంటిది  పెడుతున్నారు?..

బాత్రూం పోవాలంటే భయం. పెద్ద పెద్ద బల్లులున్నాయ్ గోడల  మీద. అవి దయ్యాలంట. అక్క వాళ్ళు చెప్తుంటే ఎంత భయమేసిందో.  నీళ్ళు కూడా ఉండవు. పాచి పట్టేసి ఎక్కడో అడుగునుంటాయి తొట్టిలో.  స్నానం చేసి పది రోజులైంది. తలనిండా పేలు కూడా.

పనులన్నీ చేపిస్తున్నారు మా చేత. మన జ్యోతి అయితే పేడ ఎత్తుతుంది పాపం. ఇటుకలు  మోయిస్తారు. గడ్డి కోపిస్తున్నారు. మొన్న నా వేలు తెగింది గడ్డి కోస్తుంటే.. మొక్కలకి ఎన్ని నీళ్ళు మోయాలో..  చీకట్లోనే నిద్ర లేపుతారు. నాకేమో ఇంకా నిద్రొస్తూ ఉంటుంది.

గేటు దాటి ఎక్కడికీ వెళ్ళే వీల్లేదు. కట్టేసినట్టుగా ఉందిక్కడ నాకంతా. మనమెందుకొచ్చాం మనూరొదిలి . అక్కడే బాగుంది. పద్దూకి  ఎన్ని అగ్గిపెట్టెలు కొత్తవి దొరికాయో. పాపం అదెంత దిగులు పడుతుందో నేను లేక.

మా బడి వెనక ఓ  సీమ చింత చెట్టుంది. ఇప్పుడు దానికింద కూర్చునే నీకీ ఉత్తరం రాస్తున్నా. ఇక్కడ కూచ్చున్నంత సేపే  నాకు బాగుంటుంది. ఇదొక్కటే నాకిక్కడ తోడు. కానీ పెట్టె తెరిచి పచ్చ గౌను కనిపిస్తే ఏడుపొస్తుంది. ఎర్ర రిబ్బన్లెవరో కొట్టేసారు. నీకోటి చెప్పనా అమ్మా. మా డాన్సు టీచరు  నేను డాన్సు బాగా నేర్చుకుంటున్నాను అన్నారు. టీచరు మెచ్చుకుంటుంటే సంతోషమేసింది. కాని డాన్సు స్కూల్లో ఏదైనా  పండగోస్తేనే నేర్పిస్తారట. ఎప్పుడూ ఉండదు.

ఇంకా చాలా చాలా చెప్పాలి నీకు. నువ్వు త్వరగా వస్తావు కదూ…

-సీత

 

నోటు బుక్కులో మధ్య పేజీలు  చింపి అమ్మకుత్తరం రాసా. ఉత్తరం రాయడమైతే తెలిసింది గాని ఆ తర్వాత అదేం చెయ్యాలో తెలియలేదు. అడ్రస్ తెలియదూ, పోస్ట్ చేయడం తెలియదు. అలాగే పట్టుకుని కూర్చున్నా చెట్టు కింద.

‘సీతా.. రా.. గంటకోట్టేసారు అన్నానికి’ రజిని పిలిచింది.

రజిని రజితా అక్కా చెల్లెళ్ళు. వాళ్ళ నాన్న రిక్షా లాగుతుండేవాడు. అదేంటో ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు అన్నం ఎంత పెట్టినా తినేసేవారు. నాకున్న మరో దిక్కు వీళ్ళిద్దరే అక్కడ. అన్నం పడేస్తే కొడతారు మరి.

‘ఏం చేస్తున్నావు’ రజిని దగ్గరికొస్తూ  అడిగింది.

‘మా అమ్మకి ఉత్తరం రాసా.. ఇదిప్పుడు ఏం చేయాలో తెలీట్లేదు’ చెప్పాను రజినీ తో.

‘ఒక అక్క చెప్పిందీ. మనకి అడ్రస్ తెలియక పోతే ఉత్తరం రాసి ఓ రాయి కింద పెట్టాలంట. కళ్ళు  మూసుకుని దేవుడికి దండం పెట్టుకుంటే  చేరాల్సిన వాళ్లకి దేవుడే  ఇచ్చేస్తాడటా. అలా చేద్దామా’ అంది..

‘నిజమా’ నమ్మకం కలగక అడిగాన్నేను.

‘అవును, కావాలంటే మూడు రోజులు తర్వాత వచ్చి చూడు ఇక్కడ మీ అమ్మ రాసిన  ఉత్తరం ఉంటుంది.’ నమ్మకంగా చెప్పింది రెండో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ళ రజిని

ఉత్తరం మడిచి సీమ చింత చెట్టు మొదట్లో  జాగ్రత్తగా పెట్టి దానిమీదో రాయి పెట్టి ఎండిన సీమ చింత ఆకులు కప్పి పెట్టాను. చేతులు జోడించి కళ్ళు మూసుకుని ‘సీమ చింత చెట్టుని’ తలుచుకున్నా!

 

నాలుగో రోజు పొద్దున్నే పరిగెత్తాను చెట్టు దగ్గరికి. ఆ రాత్రి కురిసిన వానకి  ఆకులన్నీ కొట్టుకు పోయి  మడతలు చెదిరి మరకలు పడి కనిపించిందో కాయితం. తడిసి అంటుకున్న ఆకుల్ని ఏరేసి అమ్మ రాసిందేమో నని చూసా. ఏమీ తెలీలేదు. అక్షరాలూ చెరిగిపోయాయి. నా ఉత్తరం అమ్మకి చేరిందా నా చేతిలో ఉన్నది అమ్మ పంపిన ఉత్తరమా  అయోమయంగా చూసా చెట్టు కేసి.  మౌనమునిలా నున్చునుంది చెట్టు ఎప్పట్లానే!  ‘నా సీమ చింత చెట్టు’. దిగులు నిలువునా కమ్మేసినా  ఏడుపైనా వచ్చింది కాదు.

 

వచ్చి నాలుగు నెలలయ్యింది అప్పటికి. నెలకోసారి అమ్మో నాన్నో వచ్చేవారు చూడ్డానికి. నెలంతా  ఎదురు చూస్తే తీరా వచ్చాక ఎన్నో చెప్పాలనున్నా మాటకేదో అడ్డం పడేది. . అమ్మని చూసిన  ఉద్వేగంలోనో కాసేపుండి వేల్లిపోతుందన్న దిగులో!.. అమ్మ వెళ్లిపోతుంటే గేటు చువ్వలు పట్టుకుని అమ్మ కనిపించినంత దూరమూ చూస్తూ నిలబడి పోయేదాన్ని.

ఆ తర్వాత ఎవ్వరి తోనైనా మాట్లాడడమే మానేసాను. కోపమోచ్చేది కాదు ద్వేషముండేది కాదు ఎవరి మీద…   ఉన్న ఒక్క ఓదార్పు ఆ సీమ చింత చెట్టు.  కాయలు దక్కేవి కాదు చిలుకలు వాలేవి కావు……..బయటంతా అందమైన లోకం అన్నట్టు, లోపల నేను రెక్కలు తెగి పడ్డట్టూ  వేల వేల ప్రశ్నలు రాత్రీ పగలు నా తోడై ఉండగా పదవతరగతి వరకూ గడిచింది బోర్డింగు స్కూల్లో.

 

‘సీతెప్పుడూ  అంత దిగులుగా ఉంటుందే’…’అవునూ. ఎప్పుడూ  నవ్వదూ   ఎవరితోనూ మాట్లాడదూ…ఎందుకో’ .. పదో తరగతిలో ఉండగా నా  తోటి అమ్మాయిలు మాట్లాడుకుంటుంటే విన్నాను.. నిశబ్దంగా అక్కడ్నించి వెళ్ళిపోయాను

 

**************************************

 

బస్సు దిగి ఊర్లోకి  నడుస్తున్నా.. ఊరంటే  అదో  మధ్యరకం టౌను. అటు పెద్దదీ కాదు ఇటు చిన్నదీ కాదు.

టౌన్లో సినిమా హాళ్ళూ, పెద్ద పెద్ద షాపులూ, కాలేజీలూ, రైల్వే స్టేషన్  ఉన్నాయి. ఓ  పెద్ద షుగరు ఫాక్టరీ కూడా ఉంది టౌను మొదట్లో.  మొత్తానికి ఆ టౌను  పట్నం పిల్ల పరికిణీ ఓణీ కట్టుకున్నట్టు ఉంటుంది చుట్టూ వరి  పొలాలూ, చెరుకు తోటలూ, పరుచుకున్న పచ్చదనంతో. ఆ పిల్ల నడుముకి వడ్డాణం లా ఓ వైపు పారుతున్న వాగు.

నడుస్తుంటే అడుగడుగునా ఏదో ఆత్మీయ స్పర్శ హత్తుకుంటున్నట్లే  ఉంది.

నడుస్తూ నడుస్తూ

‘జయశ్రీ’ ఇల్లు దాటుతుండగా  సీత కనిపించింది నాకు . బొమ్మరిల్లు పేరుస్తున్నారిద్దరూ .. నా మనసు మళ్ళీ పిళ్ళై  గంతులేసింది ఆ ఇద్దర్నీ చూసి.

‘శ్రీ వెంకటేశ్వరా ట్యుటోరియల్స్.’ స్కూలు గేటు దగ్గరికి రాగానే అంత మంది పిల్లల్లో సీత కోసం వెదికాయి నా కళ్ళు. అదిగో  ఒప్పుల కుప్ప ఆడుతోందక్కడ… ఆనందమేసింది నాకు.

‘రైలు పట్టాలు’ పక్కగా రోడ్డు మీద నడుస్తుండగా .. రైలు పెట్టెలు లెక్కబెడుతూ కనిపించారు  సీతా ఇంకా తన  గుంపులో పిల్లలంతా….  నాలో ఉత్సాహం రెక్కలు విప్పుకున్నట్లైంది

‘గడియారం బంగాళా’ దాటాను. అదో పాత బంగళా. దాని గోడకి పెద్ద గడియారమోటి ఉంటుంది. అందుకే దాన్నలా  పిలుస్తారు.  బడెగ్గొట్టి తన జట్టంతా బంగాళా వెనక ఏట్లో  చేపలు పడుతుంటే వాళ్ళు చూడకుండా వెనగ్గా చేప  పిల్లల్ని తిరిగి ఏట్లో  వదులుతుంది సీత. నాకైతే  వెళ్లి సీతకో  ముద్దివ్వాలని పించింది.

‘ఈసు పుల్లయ్య ఇల్లు’ దాటాను  గోరింటాకు దూసుకుంటున్న   పద్మా సీత ని చూస్తూ..

‘శివాలయం’ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ  కనిపించారు మళ్ళీ ఆ ఇద్దరే! …….ఓ క్షణమాగి నేనూ దణ్ణం పెట్టుకున్నాను..

‘రాజమ్మ హోటలు’..అదో గుడిసె హోటలు. సీత వాళ్ళ నాన్నతో కారపు చుట్టలు  కొనిచ్చుకుంటుంది అక్కడ.

‘శీను కొట్టు’ ఉన్న మలుపు తిరుగు తుండగా .. కొట్టులో  అంప్రో బిస్కెట్టు పాకెట్టు  కొనుక్కుని తుర్రుమంటోంది  ‘సీనూ సీనూ  సిగరెట్టూ సీనూ పెళ్ళాం బిస్కేట్టూ……….’ పాడుకుంటూ సీత. శీను కొట్టులో  శీను నవ్వుకుంటున్నాడు……..అల్లరి పిల్ల!

‘కుమ్మరి కనకయ్య’ ఇంటి ముందు ఆగా. చక్రం  తిరుగుతుంటే మట్టిముద్దని కనకయ్య  కుండగా మలుస్తున్న వైనాన్ని ఆశర్యంగా చూస్తోంది సీత పక్కనే గొంతి కూర్చుని. ముచ్చటేసింది నాకు.

‘చిన్న తాతయ్య ఇల్లు’ అబ్బో ఇంటి చుట్టూ సీమ చింత చెట్లే!. ఓ సీమ చింత చెట్టు చాటుగా సీత కేసి దిగులుగా చూస్తున్నాడు నందూ.  ‘ఇక మీ ఊరెళ్ళి పోతున్నావా  తిరిగి  కనబడవా’  అన్నట్లుంది అతని చూపు. ఏదో చెప్పాలనీ, అది చెప్పలేకా ఎన్నో భావాలు కళ్ళ నింపుకుని చూస్తున్నాడు సీతనే. పరికిణీ ఓణీలో ముచ్చటేస్తోంది సీత. అదేంటో మరి  అతని వైపోసారి చూసి తలొంచుకొని  వెళ్ళిపోతోంది……. నోచ్చుకున్నాను నేను.

 

ఎటు చూసినా సీతే కనిపిస్తుంది కదూ..!

 

ఇంతకీ ఎవరు ఈ ‘నేను’ అనుకుంటున్నారా..నేనేనండీ. ఆ సీతనే!

నేను పుట్టిన ఊరు ఇది. ఊరెంతో  మారినా చెరగని  ముద్రలా మిగిలిన గుర్తులని  తడుముకుంటూ నడుస్తుంటే ‘నా చిన్నప్పటి నేను’ కనిపిస్తుంది ప్రతి చోటా.   ముప్పైయేళ్ల  తర్వాత ఈ ఊరొస్తున్నాను సీమచింత చెట్టుని చూడ్డానికి. ఓ సారొచ్చాను  లెండి పదో తరగతి అయిపోయాక వేసవి సెలవల్లో. అప్పుడిక్కడ  అత్త వాళ్ళింట్లో గడిపింది మూడు రోజులే. ఆ మూడు రోజుల పరిచయమే అత్త కొడుకు ఫ్రెండు నందూ!

 

ఇక సీమచింత చెట్టు సంగతి ఏం చెప్పమంటారు.. ఏ ఊరైనా  వెళ్తున్నప్పుడు బస్సు లోంచో ట్రైన్ లోంచో చూడటం తప్ప…. వెళ్లి హత్తుకోవాలనుంటుంది. నిజ్జం.. ఒక్క సారైనా అసలు తాకలేదు కూడా. ఇక కాయలేం తింటాను. ఓ సారి అమ్మమ్మ వాళ్లూరిలో  అదే ఇప్పుడు మేముంటున్న  ఊరిలో మా ఇంటి గోడ పక్కన ఓ సీమ చింత మొలక కనిపించింది నేను పదో క్లాసు లో ఉన్నప్పుడు. అక్కడెక్కడా అలాంటి చెట్లు లేవు. మరదక్కడ ఎలా మొలిచిందో ! నేను మళ్ళీ సెలవులకి వచ్చే సరికది  లేదు. అప్పట్నించీ ఇప్పటివరకూ సీమ చింత చెట్టుకీ  నాకూ మధ్య దూరమే..

 

అదండీ సంగతి! అవునూ ఇక్కడ వరుసగా సీమ చింత చెట్లుండాలేవీ?. కొట్టేసి ఇంతెత్తున  గోడ కట్టించేసినట్టుంది  చిన్న తాతయ్య. ఇందాక జయశ్రీ వాళ్ళింటి ముందు కూడా కనిపించలేదు. భాస్కర్ మామయ్యా వాళ్ళ చెట్టూ.. ఇప్పుడు లేదు … పద్దూ వాళ్ళ ఇంటి వెనకో..  అదేంటి పొలాలు ఇక్కడి వరకూ వచ్చేసాయి! ఊరవతల  పొలాల మధ్య పాత బంగాళా ఏది? ఆ గోడలలో సీమ చింత చెట్లుండాలి అప్పుడు.  ఓ  రైసు మిల్లోచ్చేసిందే ఇక్కడా!. జయత్త వాళ్ళ బావి దగ్గరిదో..అరె బావి ఎప్పుడు పూడ్చేసారో.

ఒక్కటీ కనిపించదే..

 

సరే, ఈ రోజుకి బడి దాకా వెళ్లొస్తాను.  రాజమ్మ హోటలు దాటి, ఈసు పుల్లయ్య ఇంటి మలుపు తిరిగి, శివాలయం రోడ్డెక్కి, పొలాలు దాటితే, చెరువు ఆ కట్టవతల  మా  స్కూలు!  శివాలయం  పక్కన అప్పటి ఖాళీ జాగాలో ఇప్పుడు  ఇల్లు పడ్డాయే. ‘హరిజన వాడ’ అట. బోర్డుంది. ..అదిగో అక్కడోటి రోడ్డు పక్కగా…. ఓ  సీమచింత చెట్టు!!

గభ గభా  అతడుగులేసాను అటువైపు. పచ్చ రంగు చీరకట్టుకున్న పడుచు పిల్లలా కళ కళ  లాడుతోంది చెట్టు.  కొమ్మల్లో వేలాడుతున్న దోర పండిన సీమ చింత కాయల గుత్తులు చిరు గాలికి ఊగుతున్న ఆ పిల్ల ఎర్ర రాళ్ళ జూకాల్లా ఉన్నాయి. చిలుకలు అల్లరల్లరిగా కబుర్లాడుకుంటున్నాయి చెట్టు కొమ్మల్లో..  వీచిన గాలితో పాటు ఓ ఊహ ఉక్కిరి బిక్కిరి చేసింది నన్ను.  ఆ వెంటనే ఓ అనుమానం..అది నిజమే అయితే. ఈ చెట్టు వయసు ఓ ముప్పై మధ్య ఉంటె ..అంటే ఇది……………నేను చల్లుకుంటూ పోయిన విత్తనాల్లో  ఒకటా! …. చెట్టు కేసి చూసా ..నా సీమ చింత చెట్టు! గర్వంగా చూస్తోంది.

 

18 thoughts on “సీత… సీమచింత చెట్టు

  1. థాంక్యూ మధురవాణి గారు.
    సీమ చింతకాయలు కాస్త వగరుగా గొంతుకడ్డం పడ్డట్టుగా కూడా ఉంటాయి. తినడం కష్టమే! కాని చూడడానికి మాత్రం భలే భలే ఉంటుంది చెట్టు. ఎర్రగా పచ్చగా ఊరిస్తున్నట్టు గాలికలా ఊగుతూ.. సీమ చింత చెట్టు మీదున్న ఇష్టంతో రాశానీ కథ. మీకు మీ జ్ఞాపకాలన్నీ గుర్తు తెప్పించిందన్నందుకు సంతోషమండీ.

  2. Beautiful and nostalgic!
    నాకసలు సీమ చింతకాయలంటే ఇష్టం ఉండదండీ.. కానీ, స్కూల్లో ఉన్నప్పుడు నా ఫ్రెండు రూప వాళ్ళింట్లో సీమచింత చెట్టుండేది. దానికి చాలా ఇష్టం ఆ కాయలు.. వాళ్ళింట్లో ఉన్న చింత చెట్ల కింద తెగ ఆడేవాళ్ళం.. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి మీ కథ చదవడంతోనే.. చాలా అందంగా రాసారు. అభినందనలు.

  3. పసి పిల్లల్ని చూసినప్పుడు అనిపిస్తుంది. ‘ఈ అమాయకత్వము ఇలానే మిగలనిస్తే బాగుణ్ణు’ అని….

    కాని జీవితం ఒకోసారి అనుకోని మలుపులు తిరుగుతుంది. అప్పుడు కష్టంగా అనిపిస్తుంది. ఆ కష్టాల్లోంచే సుఖం సాధ్యమయినప్పుడు ఆప్పటి కష్టాలు తరువాత భలే నచ్చేస్తాయి. సీత విషయంలో లో జరిగిందడే. సో సీతకి కూడా హాస్టల్ లైఫ్ నచ్చేసింది!

    థాంక్యూ వెంకటేశ్వర్ రావు గారు

  4. థాంక్యూ కిరణ్ గారు. లైటు పురుగులైతే పరవాలేదు అప్పుడే పడుంటాయి లైట్ల కింద కూర్చుని తింటున్నప్పుడు. ఎవరూ ఏం చేయలేరు. కాని ముక్క పరుగులూ గట్రా అయితే ఎన్నో ప్రశ్నలు …ఆ పెట్టిన వాళ్ళైతే తింటారా అలాంటి అన్నం? ఇలా… థాంక్యూ అండి….

  5. కథ చాలా బాగుంది మనసుకు హత్తుకునేలా ఉంది. గ్రామాల్లో జేవావం, హాస్టల్ లైఫ్ వంటివి చక్కగా ఆవిష్కరించారు, హాస్టల్ లైఫ్ నాకు నచ్చింది. పిల్లల అమాయకత్వాన్ని బాగా రాసారు

    ఉత్తరం పోస్ట్ చేయడం గురించి … నచ్చింది… అందుకే ఈ మది ఇక్కడ ఒక స్కూల్ వాళ్ళు పిల్లల్ని పోస్ట్ ఆఫీసు మరియు పోలీసు స్టేషన్ తదితర ప్రభుత్వ కార్యాలయాలకు తీసుకు వెళ్లి పని తీరు చూపించేరు. అది గుర్తుకు వచ్చింది. నిజమే అలా చేయడం అవసరమే అనిపించింది ఈ కథ చదివాక. మంచి కథ చదివామామన్న అనుభూతి మిగిలిస్తుంది

  6. సుప్రజా గారు, కథ నాకు చాల నచ్చినది. ఒక్క సారిగా నేను నా చిన్నతనం లోకి వెళ్ళిపోయాను, హాస్టల్ లలో రుచి లేని తిండి తినటం,రాత్రిళ్ళు తింటుంటే పోసిన రసంలో కనబడే లైటు పురుగులు, చండ సాశానుదయినా వార్డెను మన తల్లి దండ్రులు రాగానే మన మిద ప్రేమ ఒలకపోయటం…. అబ్బో ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో.అవి కాక మరెన్నో తీయటి జ్ఞాపకాలను మీ కథ వల్ల నేను గుర్తుకు చేసుకోగలిగాను. మీకు చాల చాల ధన్యవాదాలు.

  7. “పిల్లలు పిలుస్తున్నారు..అబ్బా ..వెనక్కి తిరిగి రావాలా…!!!”… పిల్లల్ని తీసుకుని వెళ్ళండి ఓ సారి.!
    btw నా కథ మీ ఊరిని మీ ఊరిని తలపించినందుకు సంతోషం! థాంక్యూ ennela గారు…

  8. mee ooru maa alwal laagaane undandee…seema chintha chetlatho sahaa…akkadikellipoyyaa..pillalu pilustunnaaru..abbaa..venakki thirigi raavaalaa????!!!!

  9. రసజ్ఞ గారు, థ్యాంక్యూ ‘అత్యద్భుతం’ అనిపించిందని చెప్పినందుకు! ఇది నా తొలి ప్రయత్నం కథగా..

  10. మాటల్లో చెప్పలేనంత బాగుందండీ! అత్యద్భుతం! కథ ఏకబిగిన చదవలేకపోయా, మధ్యలో చాలా బాధ వచ్చేసింది, మనసు ఏవేవో ఆలోచనలతో జ్ఞాపకాల వైపు పరుగులు తీస్తోంది

  11. నాగార్జున గారు.. నాకెలాంటి అభ్యంతరం లేదు. మీరు సేవ్ చేసుకోవచ్చండి. థ్యాంక్యూ కథ కి ప్రతిస్పందించినందుకు…

  12. ఎంతో సున్నితంగా, చాలా బాగుంది.
    కథను సేవ్ చేసుకుంటున్నాను, మీకు అభ్యంతరం ఉండదనుకుంటూ…

  13. చాలా బావుంది, పల్లె వాతావరణం, పట్టనీకరణం…..,
    hostel లో స్టూడెంట్స్ ఎలా ఉంటారో, వారి మనోభావాలు కళ్ళకు కట్టినట్టు చెప్పారు…
    మొదట నవ్వించిన చివర్లో చాలా చాలా ఏడిపించేసారు…..
    really superb post…

Leave a Reply to Supraja Cancel reply

Your email address will not be published. Required fields are marked *