March 28, 2024

వాణి – మనోహరిణి (ప్రప్రధమ అంతర్జాల అష్టావధానం)

గత శనివారం 20-10-12 నాడు మాలిక పత్రిక ఆధ్వర్యంలో నిర్వహించబడిన ప్రపధమ అంతర్జాల అవధానం యొక్క సమగ్ర నివేదిక మీకోసం..

 

కంది శంకరయ్య:

కవిమిత్రులకు, తెలుగు భాషాభిమానులకు స్వాగతం. ఇతర భాషలకున్న సాధారణ శక్తులను మించిన అసాధారణ ప్రజ్ఞలను ప్రదర్శించడానికి అవకాశాలున్న భాష తెలుగు. తెలుగు మాట్లాడే జాతి గర్వించదగ్గ ప్రక్రియ అవధానం. ఇది తెలుగువారి సొంతం. ఈ అవధాన విద్య తెలుగు సంస్కృతిలో ప్రధానమైన అంతర్భాగం. అవధానం అంటే చిత్తం యొక్క ఏకాగ్రత అని స్థూలార్థం. చేస్తున్న పనిపట్ల ఏకాగ్రత, అప్రమత్తత ఉండే చిత్తస్థితియే అవధానం. 13వ శతాబ్దం నాటికే ఎన్నోరకాల అవధానాలున్నట్లు తెలుస్తున్నది. కాలక్రమంగా కొన్ని మరుగునపడ్డాయి. ‘విద్యలలోపల నుత్తమ విద్య కవిత్వమ్ము’. ఆ కవిత్వాన్ని ప్రదర్శనాత్మక కళగా తీర్చిదిద్దింది అవధానప్రక్రియ. కొఱవి గోపరాజు అష్టావధానాన్ని 64 కళల జాబితాలో చేర్చాడు.

ఈకాలంలో అంతర్జాలం సర్వవిషయాలకూ నిలయమై పోయింది. ఎందరో ఆంధ్రభాషాభిమానులు తమ వెబ్‌సైట్‌ల ద్వారా, బ్లాగుల ద్వారా తెలుగు సాహిత్యానికి చెందిన అన్ని ప్రక్రియలను, అన్ని కోణాలలో అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ ప్రశంసార్హులు. వారికి మా వందనాలు.

బ్లాగు గురువులై తమ వివిధ బ్లాగుల ద్వారా వైవిధ్యమైన అంశాలపై క్రమం తప్పకుండా పోస్టులను ప్రకటిస్తూ తెలుగు అంతర్జాల రంగంలో తమ కంటూ ఒక సుస్థిర స్థానాన్ని పొంది ఉన్న జ్యోతి గారి ఆలోచనకు రూపకల్పనే ఈ ‘అంతర్జాల అష్టావధానం’. అవధానం గ్రూపును తయారు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ మార్గదర్శనం చేస్తున్నారు.

తిరుపతి వాస్తవ్యులు మాడుగుల అనిల్ కుమార్ గారు ఈ మొట్టమొదటి అంతర్జాల అవధానం చేయడానికి అంగీకరించినందుకు సంతోషం.

అష్టావధానానికి ఎంచుకోదగ్గ అంశాలు చాలా ఉన్నాయి. కాని చాలావరకు అష్టావధానాలలో క్రింది అంశాలు ఉండడం సాధారణమైపోయింది. నిషిద్ధాక్షరి, సమస్యాపూరణం, దత్తపది, వ్యస్తాక్షరి, వర్ణన, పురాణపఠనం, ఘంటా(పుష్ప)గణనం, అప్రస్తుతప్రశంస.

పై అంశాల్లో వ్యస్తాక్షరి, పురాణ పఠనం, ఘంటా(పుష్ప)గణనం ప్రత్యక్ష అవధానంలో ముఖాముఖిగానే సాధ్యమౌతాయి, శోభిస్తాయి. అందువల్ల నేటి అవధానంలో వాటి స్థానంలో సమస్యల, దత్తపదుల సంఖ్య పెరిగింది. ఈ విధమైన అంతర్జాల అవధానంలో ఇది మొదటి ప్రయత్నం కనుక ఈ సర్దుబాటు చేయవలసి వచ్చింది. మునుముందు ప్రత్యక్ష అంతర్జాల అవధానాలలో అన్ని హంగులూ, అంశాలూ ఉండే ప్రయత్నం చేద్దాం.

అవధానికి పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి శుభాశీస్సులు….

కవి శ్రీ మాడుగులాన్వయానిల కుమార్ కావించు నుత్సాహియై

యవధానమ్ము రసజ్ఞ రంజకముగా నంతర్మహాజాల వై

భవ సంరంభము వెల్గ నీకటుల సేవల్ చేయు విద్వన్మణిన్

భవదీయామృత దృష్టి ప్రోచుత సదా వాణీ! మనోహారిణీ!

పోచిరాజు సుబ్బారావు గారి శుభాకాంక్షలు….

స్తవనీయప్రతిభ మెఱయ

వివరించుచు  మాకు  నీవు  వేడుకతోడన్

నవ రస భరితముగా నీ

యవధానము  సేయు మయ్య ! యనిల కుమారా !

ఇక అవధాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా?

ముందుగా నా పరిచయం…

ఈ అవధాన కార్యక్రమానికి నేను ‘మేనేజర్’నట! (అలా అని జ్యోతి గారు చెప్పారు)

38 సంవత్సరాలు తెలుగు పండితుడిగా పని చేసి విశ్రాంతి తీసుకుంటున్నాను. చెప్పుకోదగ్గ రచనలేవీ చేయలేదు. ‘శంకరాభరణం’ పేర బ్లాగు నిర్వహిస్తున్నాను.

Lanka Giridhar:

సభకు నమస్కారం.నా పేరు గిరిధర్, ఇంటిపేరు లంక.సింగపూరు వాస్తవ్యుఁడను. భావజాలావిష్కృతి అను పేరిట ఒక బ్లాగు ఉన్నది కానీ, జన్మానికో శివరాత్రి అన్నట్టు వ్రాస్తూ ఉంటాను అక్కడ.పొద్దులో ఒక పద్యకథ వ్రాసాను. పుష్కరిణీ లో ప్రచురితమవుతున్న సనాతన శతకము వ్రాస్తున్నాను.ఇంతకు ముందు జాలకవిసభలలో పాల్గొన్న అనుభవం మెండుగా ఉన్నది.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

నన్ను రాంభట్ల పార్వతీశ్వర శర్మ అంటారు. నా వయసు  23 సం.లు ఇప్పటి వరకూ 26 అష్టావధానాలు గావించాను. ప్రస్తుతం ఆంధ్ర విశ్వకళాపరిషత్ లోతెలుగు శాఖలో పరిశోధన చేస్తున్నాను.

సంపత్ కుమార్ శాస్త్రి

అవధానిగారికి, గురువుగారు శ్రీకందిశంకరయ్యగారికి, శ్రీచింతారామకృష్ణరావుగారికి మరియు ఇతరకవిమిత్రులకు, భక్తిపూర్వక వినమ్రప్రణామములు. వృత్తి రీత్యా హైదరాబాద్ వాస్తవ్యుణ్ణి. తెలుగుభాషాభిమానము మెండుగాకలవాణ్ణి. మొట్టమొదటిసారిగా అవధానములో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగాను ఒకింత గర్వంగానూ కూడా ఉన్నది. ఈ మహద్భాగ్యాన్ని ప్రసాదించిన గురువులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు.

అప్రస్తుత ప్రసంగం:- చింతా రామ కృష్ణా రావు.

శ్రీ గురుదేవు రాఘవుల శ్రీచరణంబులు భక్తి మ్రొక్కి, స

ద్భోగిశయాను సంస్మరణ పూర్వక చిత్తుఁడనై, వధాన స

ద్యోగిఁ బ్రశంసఁ జేసి, శుభ యోగ ఫలంబుగ నిచ్చటుండి, నే

సాగెద, రామకృష్ణుఁడను జక్క నప్రస్తుత పృచ్ఛకుండనై.

గోలి హనుమచ్చాస్త్రి:

అయ్యా! నా పేరు గోలి హనుమచ్చాస్త్రి. నేను గుంటూరు నివాసము ఉంటున్నాను. గృహనిర్మాణ సంస్థ లో సహాయక ఇంజనీరుగా పనిచేయు చున్నాను. చిన్నతనము నుండి పద్యములంటే ప్రీతి.అడపా దడపా గతములో అకాశవాణి సరసవినోదిని కి సమస్యాపూరణలు పంపేవాడిని.శ్రీ శాంకరార్యుల “బ్లాగు “  పరిచయంతో వారి ప్రోత్సాహంతో ఇప్పటికి యేడెనిమిది వందల పూరణలు “శంకరాభరణం” లో చేయగలిగాను.ఈ కార్యక్రమములో దత్తపదిని ఇచ్చి పాల్గొనే భాగ్యం కలిగించిన మీ అందరకూ ధన్యవాదములు.నేను శ్రీ శంకరార్యుల స్ఫూర్తి తో “సమస్యలతో”రణం” (“పూ”రణం) మరియు కవి”అల” అలలు  అను బ్లాగులను నిర్వహించుచున్నాను.

 

అవధానిగారి దైవ, గురుస్తుతి:

హరిః ఓమ్

శ్రీ గురుభ్యో నమః

శ్రీ మహా గణాధిపతయే నమః

శ్రీ శారదాంబాయై నమః

నమస్సభాయై

సభయందాసీనులైన ముఖ్య అతిథి గారికి , సభాధ్యక్షులవారికి , పృచ్ఛక కవిమిత్రులకు సవినయ నమస్కారాలు.

ముందుగా గణపతి స్తోత్రం తో అవధానాన్ని ప్రారంభిస్తున్నాను.

అగజయా నుతయాంబికయా కృతం
వరమనోహర సుందర విగ్రహమ్  l
సరసిజాభ ముఖేన విభాసితం
గణపతిం శివపుత్రముపాస్మహే ll

భావం : –    పార్వతీదేవి తయారుచేసిన శ్రేష్ఠమైన , మనోహరమైన వినాయకుడను విగ్రహము కమలము వంటి ముఖముతో ప్రకాశించుచున్నది.అటువంటి గణపతిని ఉపాసిన్చుచున్నాము.

 

ఉ . దంతమునొక్కపట్టుననుదారముగా  పెకలించి లేఖినీ

ప్రాంతముగానొనర్చి కురువంశ చరిత్రను భారతంబు   స

త్కాంతముగా లిఖించె త్రిజగత్పతి సూనుడు , తద్గజాస్యు  ఉ

ద్దంతము నాకొంగుత సుధారసమొల్కు  కవిత్వ మియ్యెడన్ ll

 

శ్రీ సరస్వతీ స్తుతి :

శా. అంతర్జాలమునన్ వధానమును సేయంబూని సద్భక్తితో

స్వాంతంబున్ నుతియింతునమ్మ బుధులాస్వాదించి మెచ్చంగ వృ

త్తాంతంబుల్ మధురోజ్జ్వలావాహ మరందంబీ కవిత్వంబునం

దింతింతై ప్రవహింప మిక్కుటముగానివ్వందగున్ భారతీ ll

దుర్గా స్తుతి :-

నియమిత పదబంధైః స్తోత్ర ముక్తాఫలైస్త్వాం
కలుషరహితభక్త్యా యాచనార్థీ సిషించే l
విలసతు ధిషణాయాం భావనాలోలలీలా
నివసతు హృదయే మే శాంభవీ సుప్రసన్నా ll

భావం :- ఓ దుర్గాదేవీ ! తగిన పదబంధములు అను స్తోత్ర ముత్యములతో , నిష్కల్మషమైన భక్తితో నీ అభిషేకము చేస్తున్నాను. నా భావనా వ్యాపారమున విహరించు నీవు నా బుద్ధియందు విలసిల్లుచూ నా యందు ప్రసన్నముగా ఉండుము.

 

తిరుపతి వేంకటకవుల స్తుతి :

చం . తిరుపతి వేంకటేశ కవిధీరులు ముందవధాన సత్క్రియన్

జరిపిరి తెల్గుభాషలొ పసందగురీతి యశోవిభూషితుల్

పరమపవిత్రమైన సురభారతియందొనరించి , రెండు భా

షల యవధాన్లు వారి జలజాంఘ్రియుగంబు నమస్కరించెదన్ ll

 

గురు ప్రార్థన :

చం. అలఘువధానవిద్యను మహాద్భుతమౌ తన మంత్రశక్తితో

మలచె మదీయ మస్తమున మాన్యులు మద్గురువర్యులైన శ్రీ

కలపట  భాస్కరార్యులు జగన్నుత కీర్తి విశేషశేషితుల్

తలతు తదీయ పంకజ పదద్వయమున్ గురుభక్తిపూర్ణుడై   ll

 

తే .గీ . వృత్తరత్నాకరాదులన్ తత్తదవస

రానుగుణము లక్షణము లక్ష్యంబులెల్ల

నేర్పి  వాత్సల్యముంజూపె , నిజ గురువగు

శ్రీ యుతులు లక్ష్మణయ్యకు జేతునుతులు

 

శ్రీ కంది శంకరయ్యగారికి :

చం. చతురతరావధానమను సాహితి ప్రక్రియ నేర్పబూని సం

తత కృషిసల్పుచుండిన బుధాగ్రణి శ్రీయుత కందిశంకర

య్య తగుచు నిర్వహింపజనెనార్యులు మెచ్చవధాన కార్యమున్

స్తుతమతి శంకరయ్యను యశోధను దల్చి నమస్కరించెదన్ ll

శ్రీమతి వలబోజుజ్యోతి గారికి :

శా. ప్రాచీనాంధ్ర కవిత్వ రక్షణను దుర్వారంబుగాజేయ నా

లోచించెన్ వలబోజుజ్యోతి , బుధులాలోకించి మెచ్చంగ పూ

ర్వాచారంబవధానమే మిగుల సేవ్యంబంచు లెక్కించి వి

ద్యా చాతుర్యము మెచ్చగా యువత , అంతర్జాలమున్నెంచుచున్

నా చేతన్నవధానమేర్పరచె మాన్య జ్యోతికిన్ మ్రొక్కెదన్ ll

పృచ్ఛక కవిపండితులకు :

శా.  అయ్యాపృచ్ఛకులన్న భారతిసుతుల్ అష్టావధానంబుకై

సయ్యంచుందగ వచ్చిరిచ్చటకు మీ సౌహార్దముం జూపుచున్

కయ్యంబుల్ అలనాటివయ్యెను చమత్కారంబె నేడుండెగా

సయ్యాటౌ నవధానమిద్దియని  మెచ్చంజేయనూహించుచున్

నెయ్యంబారగ పృచ్ఛకోత్తములకుంజేతున్  నమస్కారముల్ ll

పృచ్ఛకోత్తములకు నమస్కారాలతో

శ్రీ రామకృష్ణారావు గారికి :

కం . చేరెన్నప్రస్తుతమున్

పేరోలగమున్ వినోద  విందున్ గూర్చన్

శ్రీ రామ కృష్ణారావు , అ

పార ప్రజ్ఞా ధురీణు ప్రణతులనిడెదన్ ll

శ్రీ సుబ్బారావు గారికి :

కం . శ్రీ సుబ్బారావార్యా !

చూసితి మిము చిత్రమందు శోభిలుచుండన్

బాసకు కొడుకని తెలిసితి

చేసెద నే వందనమ్ము శ్రేయముగొనగన్  ll

శ్రీ పార్వతీశ్వర శర్మ గారికి :

కం . శ్రీ పార్వతీశ శర్మా !

చూపించితివో యపార సుమధుర ప్రజ్ఞన్

ఆ పత్రికలో  చదివితి

ఏపారగజేయు వేంకటేశుడు నిన్నున్ ll

శ్రీ గోలిహనుమచ్ఛాస్త్రి గారికి :

కం . ఆలోకించి సరస్వతి

నాలాపించెన్ కవిత్వ మద్భుతసరణిన్

గోలి హనూమచ్ఛాస్త్రి , వ

చో లాస్యుని యతనిదల్చి జోతలనిడెదన్ ll

శ్రీ. సంపత్కుమార శాస్త్రి గారికి :

కం . సంపత్కుమార శాస్త్రికి

సొంపౌ దత్తపదినిచ్చి చొక్కగ ప్రజ రా

ణింపంజేయంగా నను

ఇంపౌ పద్యమ్మునందునిదె నుతియింతున్ ll

శ్రీ లంకా గిరిధర్ గారికి :

కం . గిరిధరు లంకా వంశజు

డరుదైన సమస్యనివ్వ నది రుచిరంబై

సరసార్థ పూరణమును యొ

నరించు గాత ! బుధునతని నమస్కరింతున్  ll

శ్రీ కామేశ్వర రావు గారికి :

కం. శ్రీ కామేశ్వర రాయా !

ప్రాకటమవధానమందు వర్ధిల్లంగా

చేకొన జయములనెప్పుడు

మీకై నుతులాచరింతు మేలగు నాకున్ ll

శ్రీ సనత్ శ్రీపతి గారికి :

కం. సనత శ్రీపతి గార్కి స

వినయమునందించుచుంటి విద్వాంశునకున్

సునిశిత వర్ణన ప్రష్టకు

అనవరతము విజయమొందనంజలులిచటన్  ll

శ్రీ భరద్వాజ్ గారికి :

తే.గీ.  ఆ భరద్వాజు ద్రోణునికయ్యె తండ్రి

తల్లియు  ఘృతాచి , ద్రోణు బోల్ ధన్యుడైన

శ్రీ భరద్వాజు పగ్గముల్ చేతబట్టి

స్యందనము త్రోలు అంతర జాలమందు

నావధానము జరుగ , మాన్యాత్మ నుతులు.

Dr. Madugula Anil Kumar:  ఇక నిషిద్ధాక్షరి మొదలు పెట్టవచ్చు.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

అవధాని గారూ…

నిషిద్ధాక్షరి అంశం:

“దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. ఇవాళ మూల పూజ. కనుక ’దేవి’ని సరస్వతీ అవతారంలో స్తుతించండి.

కందంలో..

ప్రత్యక్షర నిషేధం చేయదలచానండి.

ప్రథమాక్షరం అందుకోండి.

’ ణ ’ కారం   నిషేధం

Dr. Madugula Anil Kumar:

“వా”

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

’ వ ’ కారం   నిషేధం

Bhairavabhatla Kameswara Rao: వాణిని తీసుకురాకుండా “ణా” నిషేధం చేసారు. బాగుంది!

dr.madugulaanilkumar:  దే

Giri: వాణి నిషేధము కాబట్టి, వాగ్దేవి వస్తుందనుకున్నాను..కానీ అవధానిగారు మఱొక దారిలో వెళ్ళారు.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

’ మ ’ కారం   నిషేధం

Dr. Madugula Anil Kumar:  స్థా

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

సంస్కృతం పట్టుకున్నారు. బావుంది.

’ ద ’ కారం   నిషేధం

Dr. Madugula Anil Kumar:  రా

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:

” జ్ఞ ” కారం నిషేధం

Dr. Madugula Anil Kumar: మా

Bhairavabhatla Kameswara Rao: అద్భుతం! మొదటి పాదం పూర్తయ్యింది.

Goli Hanumath Shastri: అవధాని గారు చక్కగా పాదం మోపారు.

Rambhatla: అభినందనలు. ప్రథమ పాదం పూర్తయింది. బావుంది. ధన్యవాదములు

Vaman Kumar: ప్రధమ పాదం అమోఘంగా పూర్తి అయ్యింది.

మొదటిపాదం: వా దే శ స్థా  రామా

Dr. Anilkumar: దత్తపది

అప్రస్తుతం వారు ప్రస్తుతంలో ఉన్నారా ?

Chinta Ramakrishnarao:

ఆర్యా!

అవధాన వేళలో మిము

వివశునిగా చేయు వనిత ప్రేమకు పాత్రం

బవనుందురొ? కాకుందురొ?

వివరింపుడు మాకు మీరు విజ్ఞత తోపన్.

అవధానుగారూ! అవధాన సమయంలో మిమ్ములను వివశులుగా చేసే వనిత యొక్క ప్రేమకు పాత్రమగుదునంటారా? అలా అవనంటారా? వివరించండి!

ప్రథమ దత్తపది గోలివారిది……

చేప – మేక – కోడి – పంది.

( ఫై వాటితో మాంసాహారము కాకుండా శాకాహారము వండాలి. )

పై పదాలను ఉపయోగిస్తూ ఆ యా అర్థములలో కాకుండా  శాకాహారము పై పద్యం.స్వేచ్చా చందము లో…

Kameswara Rao:  మొత్తానికి అవధానిగారి చేత వంటకూడా చేయిస్తున్నారన్న మాట! 🙂

Dr. Anil Kumar: చేపడితి నూనె గిన్నెను

Rambhatla: వంట బాగానే ప్రారంభించారు.

Vaman Kumar: వంట నేర్చువాడు నింట గెల్వగలడు

Dr. Anil Kumar: ఆ పని చేయింప నన్ను అదియే మేలౌ

Hanumath Sastry: అవధాని గారు వంటను చక్కగా “చేప” ట్టారు..

Kameswara Rao: చేపను చేతిలో పట్టేసారు! బాగుంది. గోలివారిచ్చిన దినుసులతో కంద వండుతున్నారన్నమాట! 🙂

Rambhatla: చేపడితి నూనె గిన్నెను

Kandi Sankaraiah: రెండవ దత్తపది సంపత్ కుమార్ శాస్త్రి గారు…

Chinta Ramakrishna Rao:

అవధానిగారూ!

తల్లిని మించిన దైవము

ముల్లోకములందు లేదు, పూజింపు డటం

చెల్లరు పలుకుచు, సభలను

తల్లిని తలపక గురువును తలచుట తగునా?

Hanumath Sastry: అయ్యా! చేప నూనె గిన్నెతో ఉన్నది. జారి పోకుండా చూడండి.

Sampath Kumar Sastry: సభకు నమస్కారం.

దత్తపది కి నేను ఇస్తున్న పదాలు…….

జయము, రయము, లయము, మయము,

రాయబారఘట్టములో శ్రీకృష్ణుని పలుకులు ( వీలైతే చంపకములో )

Chinta Ramakrishna Rao:

అవధానిగారూ!

పతికి వామభాగమునందు సతి వసించు.

పటములందున పరికింప నటులె యుండు.

ప్రభువు వేంకట నాయకు పటమునందు

నేల కుడివైపునుండెనల్మేలు మంగ?

Dr. Anil Kumar (For Dattapadi):  చం. జయమగునే బలమ్మున ప్రశంశల నొందెడు పాండవేయులున్

Kandi Sankaraiah: ఇప్పుడు లంకా గిరిధర్ గారు మొదటి సమస్యను ఇవ్వాలి. గిరిధర్ గారూ, ఉన్నారా?

Chinta Ramakrishnarao: అడిగిన చెప్పక యుండుట

అడిగించుచు మురియుటకనొ ఆలస్యమనో?

Dr. Anil Kumar: జయమగునే బలమ్మున ప్రశంశల నొందెడు పాండవేయులున్

లంకా గిరిధర్ గారి సమస్య…..

‘సేదముఁ ద్రావినన్ దొలఁగు వేదన సాంత్వన నొందు చిత్తమున్.’

Rambhatla: అయ్యా.. సేదము అన్నది సమస్య ప్రారంభమా? టైపింగ్ పొరపాటా?

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

అడిగిన చెప్పక యుండుట అడిగించుచు మురియుటకనొ ఆలస్యమనో?

Dr. Anil Kumar: అయ్యా మీరు మీసాలు దువ్వుకుంటూ ఎన్నైన అడుగుతారు. మీకు తప్ప అందరికీ టైపింగ్ సమస్య

ఏమండి “సేదము” నా “స్వేదము” నా త్వరగా చెప్పాలి!

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

మీసాలు దువ్వజూచిరి

ధ్యాసను నా పైన నిలిపి,యడిగిన దానిన్

మీసము లెవ్వరు చెప్పగ

ఆశించుతును మీసువాక్కులందుటకిపుడున్.

Kandi Sankaraiah: అది ‘స్వేదమే’ … టైపాటు మన్నించాలి.

Dr. Anil Kumar: ఆ దొర సాని చిక్కె హృదయమ్మును దోచుచు సందె వేళలో

Rambhatla Parvateeswara Sarma:

మీ సము లెవ్వరు? చెప్పగ..చింతా వారు.. బావుంది

Chinta Ramakrishna Rao:

అవధానిగారూ!

నావైపిటు చూడండీ!

భావింపకనన్ను చెడుగ పరమ దయాళూ!

భక్త బంధువైన పరమేశుఁడా గొప్ప?

భక్త సులభయైన భవుని సతియ?

భక్తి కలుగు నాడు భగవంతుఁడే తోడు.

భక్తి దూరులకు విముక్తి యెట్లు?

Dr. Anil Kumar: ఇవన్నీ ఆలోచిస్తే తెల్లారుతుందండి.

Kandi Sankaraiah:  రెండవ సమస్య పోచిరాజు సుబ్బారావు గారిది…

“కారు తిరిగె విచ్చలవిడి గగనమునందున్”

Dr. Anil Kumar: ఔరా ! సమస్య యే యిది

Kameswara Rao: చింతావారూ, అప్రస్తుతం మాట ఎలా ఉన్నా మీ ఆశువులు అత్యద్భుతంగా ఉన్నాయండీ!

Kandi Sankaraiah: ఆరంభ మ్మదిరెను పో

Kandi Sankaraiah: భైరవభట్ల వారూ… ఇక మీ సమస్య.

మూడవ సమస్య భైరవభట్ల కామేశ్వర రావు గారిది…

వలలోఁ జిక్కెఁ గరీంద్రయూధము యశోభాతిన్ హరీంద్రమ్ముతో

Dr. Anil Kumar: తలలో అంతర జాలమందు కవితాధారామృతం బల్లుచున్

Sampath Kumar Sastry: గోరంతలవింతలెల్ల గొప్పగచేయన్

Kameswara Rao Bhairavabhatla: అప్పుడే చిక్కు విప్పేసారే!

Sampath Kumar Sastry: అవధాని గారిని వలలో వేద్దామనే ఆలోచనా??

Goli Hanumath Sastry: అవధాని గారు “వల” కవ “తల” వెళ్ళారు….

Kandi Sankaraiah:   వర్ణన అంశం సనత్ శ్రీపతి గారిది   “వనములే కరవౌతున్నవేళ వన్యప్రాణుల వెతలు తీర్చలేని వనరాజు (సింహం) వేదనను మహాస్రగ్ధరలో గానీ చక్కని ఎత్తుగీతి గల సీసంలో గాని వర్ణించండి”

Chinta Ramakrishnarao:

సంచిత సత్కవితాశ్రయ

మెంచుడు సద్గుణ వరేణ్య!ఇందరిలోన

న్నుంచిరినేనెట పోదును

దంచితమగు దీనివీడియసదృశప్రతిభా!

Dr. Anil Kumar:

ఆఫ్రికా అడవులే అవని భారతికన్న

ఎంతైన మేలుగా వింత గాదె

సింహాసనమ్మందు శ్రీ దుర్గ అలరారె

చింతావారినుద్దేశించి: అబ్బే మీకున్న ప్రతిభ నాకెక్కడిది లెండి ( ప్రతిభ అనే అమ్మాయి మీకున్నదని)

ఇప్పుడు నిషిద్ధాక్షరి 2 వ పాదం

Kameswara Rao: వాగ్దేవీపుత్రులందరకూ ప్రతిభా పుత్రికలుంటారు. అందుకు మీరూ మినహాయింపు కాదు అవధానిగారూ!

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

మీ ప్రతిభ మీకు తెలియదు.

సప్రతిభులు మీరు కనగ సరస కవితలన్

అష్టావధాని” రాంభట్ల పార్వతీశ్వర శర్మ: ’వ’ కారం నిషేధం

Dr. Anil Kumar: మోద

Chinta Ramakrishnarao:

ద్రోణ, భీష్మ, జయద్రధ, దాన కర్ణ,

ముఖ్య వీరులు కొందరు ముందుగానె

చంపఁబడినారు నాచేత. చంపుమింక

యనిన కృష్ణుని మాటల కర్థ మేమి?

Dr. Anil Kumar: అంతా  నేనే చేస్తాను. నాకు ఏమౌతుందో తెలుసు అని. అంతే  కాని కృష్ణుడంటే మీరు కాదు.

Goli Hanumath Sastry:  అవధాని గారూ! శ్రీ రాంభట్ల వారు ప్రతిసారీ ___”కారం” నిషేధం అంటున్నారు.  నా వంటలో మాత్రం కారం ఉండేట్లు చూడండి..

Dr. Anil Kumar: మీ కింకేమి కావాలి ఆకలా ఉప్పు కారమా

“అష్టావధాని” రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  ”ప” కారం నిషేధం

Chinta Ramakrishnarao: మీ ధర్మమా అని ఉపకారాన్ని మాత్రం నిషేధించ లేదు.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  అవధాని గారు మోద  తర్వాత ఏమైన చెప్పారా?

Dr. Anil Kumar: ద  చెప్పానుగా, తరువాత “క”

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: సరే… మీ ఇచ్ఛకు తరువాతి అక్షరం విడిచిపెడుతున్నాను

Dr. Anil Kumar: మ్రా

Chinta Ramakrishnarao:

అవధాని యెదను నిలిచిన సువిధేయులు ధన్యులిలనుశోభిలుదురిటన్.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: మరల మీ ఇచ్ఛకు తరువాతి అక్షరం విడిచిపెడుతున్నాను

Dr. Anil Kumar: స్య

Kameswara Rao: ఎక్కడో తప్పినట్టుంది. “మోద కమ్రాస్య”? “క” గురువవుతుంది కదా?

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: ” న ” కారం నిషేధం

Sri Raghava Kiran Mukku:   కవనములో మునిగిన నిక నవధానికి మిగిలినయవి యప్రస్తుతమౌన్ 🙂

Dr. Anil Kumar: మోదదకమ్రాస్య

Chinta Ramakrishnarao:

అవధాని యెదను నిలిచిన

సువిధేయులు ధన్యులిలనుశోభిలుదురిటన్.

భవదీయ సుదశ కలిగిన

యవధానియు నన్ను చూచిహాయి గొలపరే.

Dr. Anil Kumar: బ్రో

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: చ కారం నిషేధం

Dr. Anil Kumar: పూ

కంది శంకరయ్య:  ఆసక్తికరంగా సాగుతున్నది నిషిద్ధాక్షరి… పృచ్ఛకులు, అవధానులు ఎదురెదురుగా కత్తులు దూసి నిలుచున్నారు.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: యతి తర్వాత  ” జ ” కారం నిషేధం

Dr. Anil Kumar: తా

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

పండుకొనిబెట్టయత్నించు నిండు హృదయ!

పండితాళికి మధ్య నే పండుకొనిన

దండనముసేయకుందురో? దయన కనుచు

నిండు మదితోడ చెప్పడు నేర్పు మీర.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  చాలా “పవిత్రంగా” పూత పూశారు.  “మ” కారం నిషేధం

goli hanumath sastry: అయ్యా ! ఇద్దరూ కలసి కవితా సేద్యాన్ని పండిస్తున్నారు.

సంపత్ కుమార్ శాస్త్రి: ఇంతవరకు వచ్చిన పాదము ఇదేనాండీ…… “మోదదకమ్రాశ్యబ్రోవపూతా”

Dr. Anil Kumar: వాక్

Sri Raghava Kiran Mukku: సంపత్ గారూ, ఔనండీ. మీరు అవధానిగారిచేత ఇప్పుడే ధారణ చేయించేసేలా ఉన్నారు. 🙂

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  సంపత్ కుమార్  శాస్త్రి   గారూ…. మీరు అలా అందించ కూడదు. ఇక ధారణ అంశానికి ప్రయోజనమ్ ఉండదు.

సంపత్ కుమార్ శాస్త్రి: పదాలు అనే కత్తులు తరిగిపోతున్నా యుద్ధము మాత్రము ఆగడములేదు…. చాలా ఆసక్తికరంగా ఉంది.

goli hanumath sastry: అయ్యా ! నా వంట మాడు తున్నదేమో చూశారా!…

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  ”ద” కారం నిషేధం

Dr. Anil Kumar: మా

సంపత్ కుమార్ శాస్త్రి: హనుమచ్చాస్త్రిగారు,  మీ వంటకు కావలసిన వేడిని నిషిద్ధాక్షరినుంచి తెస్తున్నారుగా…..

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: వాజ్మా … అని అనునాసికం చేస్తారా అవధాని గారూ?

Dr. Anil Kumar: నిషిద్ధాక్షరి 2 వ పాదం అయిపొయింది

Dr. Anil Kumar: దత్తపది 2 వ పాదం   వేపుడున మమేకమౌచు వేయించితి గా

Kameswara Rao:  భలే! వంటలో బాగా మమేకమవుతున్నారు. 🙂

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

ఒక్కని చేసి మిమ్ములనకుంఠితరీతిని ప్రశ్న చేయుచున్

జిక్కని పద్య భావముల శీఘ్ర గతిన్ వచియింప కోరు బల్

చక్కని యూహపుట్టినది సద్గుణ సన్నుత జ్యోతి మాతకు?

నిక్కము చెప్పుడయ్య మహనీయ! మనంబున కందుచుండిరో?

Dr. Anil Kumar: 2వ దత్తపది

రయమున యుద్ధ రంగమున ప్రాణము దీతురు మీరలెల్లరున్

1 వ సమస్య 2 వ పాదం

మొదమోసంగునట్లుగ విభూతి నొసంగి వధాన సత్క్రియన్

Kameswara Rao: చాలా బాగుంది! రాంభట్లవారన్న త్రోవ తొక్కలేదీ సమస్యకి!

Dr. Anil Kumar:  2వ సమస్య 2 వ పాదం

ఆ రాముని ధర్మపత్నిఅపహరణముకై

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

అప్రస్తుతమిది యనుచు

నా ప్రశ్నలు వినరొ మీరు.నాపై కినుకో?

నాప్రార్థన మన్నింపుడు

నాప్రశ్నలు కూడ కనుడు నలుగురు మెచ్చన్.

Dr. Anil Kumar:

3 వ సమస్య 2 వ పాదం

కలలో నూహల జేయునట్టి గతులన్ కాంక్షింపగా  పృచ్ఛకుల్

కంది శంకరయ్య: ఇక వర్ణన…

Dr. Anil Kumar:

కాని కాననమున కనగ రాదు

చెట్లన్ని గూల్చుచున్ కట్టిరి మేడలన్

మేమెట్లు  జీవించి మెలగవలయు

నిషిద్ధాక్షరి 3 వ పాదం?

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

శంకరార్య మనసు శంకతో  కూడె. నా

వంకచూడకుండ వరల నెంచె.

ఇంక నన్ను గాంచ నెవరు కల్గిరి సభ.

శంక బాపుడయ్య. సరస హృదయ.

కంది శంకరయ్య: రాంభట్ల వారూ, ప్రత్యక్షర నిషేధమన్నారు. ఇంకా కొనసాగిస్తారా? మిగితా పాదాలు కొనసాగిస్తారా?

Dr. Anil Kumar: నిషిద్దం చేస్తారా

Rambhatla: మీ అభిమతానుసారమే నా అడుగు. ఇంకా అడుగుదాం అనుకొంటున్నా. సరే మిగిలిన రెండు పాదాలలో     ఏవైనా చెరొక అక్షరం చెబుతాను. అవి రాకుండా ఆ రెండు పాదాలు చెప్పేస్తే బావుంటుంది. ఏమంటారు?

Dr. Anil Kumar: ఈ రూల్ ఎక్కడ లేదండి.

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

ప్రస్తుతమగు నప్రస్తుత

నిస్తేజము చూడమనసు నీరగు చుండెన్.

పుస్తిని కట్టిన భార్యకు

నప్రస్తుత పృచ్చకునకునన్యాయంబా?

Kandi Sankaraiah:

సుంతైన పలుక రేమని

చింతావారికి కలిగెను చింతయె సభలో

వంతను దీర్చగ వేడెద

సంతసము నిడగ సభికుల సద్వాక్యములన్.

Dr. Anil Kumar: విడాకులే ? మీకా

Kameswara Rao: చింతావారూ, మీరు అప్రస్తుతానికి బదులు ఛందోభాషణం చేస్తూంటే అవధానివారు అలగరూ మరి! 🙂

Dr. Anil Kumar: శంకరయ్యగారినుద్దేశించి: అయ్యా ఇది మయ సభ కాదు, ఆయన దుర్య్పోధనుడు  కాదు.

Vaman Kumar:

చింతా వారి ప్రయత్నము

ఎంతో ప్రశంసనీయమీదినము కదా.

ఎంతైనా(సుంతైనా) కవిమిత్రులు

చింతించుట యవసరంబు చిత్తముతోడన్.

రాంభట్ల పార్వతీశ్వర శర్మ: సరే.. మీ స్వేచ్ఛ… కానివ్వండి. 3, 4, పూర్తి చేయాల్సిందిగా మనవి.

సంపత్ కుమార్ శాస్త్రి: మీయొక్క నిర్ణయము??

Chinta Ramakrishnarao:

శంకరార్యా!

అవధాని పలుక వలెనుగ?

సవిధంబుగ నుత్తరువుల జాలము నందున్

జవనాశ్వము పరుగుపగిది

నవనవ సత్కవితలల్లి నను గన వలెగా.

Dr. Anil Kumar:

తా దయ జూపన్ వలె నీ

పాదాబ్జంబుల పూజ జేతు భారతి భక్తిన్

Kameswara rao: చివరిపాదం మరోసారి చూడండి.

Chinta Ramakrisharao: పాదాబ్జము పూజ సేతు

Sri Raghava Kiran Mukku:  రామకృష్ణ పెదనాన్నగారూ, ఐనా… అవధానమున నిషేధము కవనంబునకే పరిమితకార్యంబు కదా. 🙂  పాదంబుల అన్నా సరిపోతుంది.

Chinta Ramakrishnarao: నిజమే రాఘవా! ఐతే నాకు సందేహం రావడంలో గల ఔచిత్యాన్ని గమనించలేకపోతావా నువ్వు.

Dr. Anil Kumar:

1 వ దత్తపది 3 వ పాదం , 4 పాదం

రూపొందె పకోడియొకటి

ఆపందినుసులు వదలుచు అన్యములెపుడున్ ll

Vaman Kumar:  అవునండీ. పకోడీలు చాలా రుచిగా ఉన్నాయి.

Chinta Ramakrishnarao:

ఆర్యా! రాంభట్లవారూ! కొంపతీసి మీరుకానీ అప్రస్తుత ప్రసంగం నిషేధం అన్నారా  ఏమిటి?

నన్ను అవధానిగారు పూర్తిగ నిషేధించేసారు?

Dr. Anil Kumar: 2 వ దత్తపది 3,4 పాదము

లయమగునట్లు గాకయె తలంపగ సఖ్యత చూపగా దగున్

నియమితుడైతి చిన్మయ మునిన్ అనె కృష్ణుడు రాయబారమున్

రాంభట్ల పార్వతీశ్వర శర్మ:  ఆయన నన్నే నిషేధించి నట్టునారు చింతావారూ….  ప్రస్తుతానికే లేదు… అప్రస్తుతం కూడానా మాస్టారూ…

VAMAN KUMAR:  2వ దత్తపది, నాల్గవ పాదంలో మయము అనే పదం వాడవలసి ఉన్నది. నియమ అనే పదం వాడబడింది.

సంపత్ కుమార్ శాస్త్రి:  మయము ను చిన్మయముగా పూరించిన విధము శ్లాఘనీయము.

VAMAN KUMAR:  సంపత్ కుమార్ గారికి ధన్యవాదములు. నాదే పొరపాటు

Chinta Ramakrishnarao:

అవధానిగారూ!

మహిత రక్తవర్ణ, మాంసనిష్ట, గుడాన్న

ప్రీతి మానసయని ప్రేమ కొలిచి

దుర్గ పూజ సేయుదురుకదా! మహితాత్మ!

మాంస నిష్ట యగునె మాత దుర్గ?

ఆర్యా! దుర్గాంబను రక్త వర్ణ యని, మాంస నిష్ట యని, గుడాన్న ప్రీతి మానస యని పిలుచుచు పూజింతురు.

జగదంబయైన దుర్గ మాంస నిష్టయా? వివరించ గలరు.

Dr. Anil Kumar:

సమస్య 3, 4 పాదాలు

ఆ దొరసాని చిక్కె హృదయంబుల దోచుచు సందె వేళలో

మోద మొసంగునట్లుగ విభూతినొసంగి వధాన సత్క్రియన్

ఔ దలపోయగా అమృత మౌ కవితా ఝరియుక్త సీమలో

స్వేదము ద్రావినన్ దొలగు వేదన సాంత్వన నొందు చిత్తమున్

2 వ సమస్య:

చేరిన రావణు  దురహం

కారు తిరిగె విచ్చలవిడి గగనము నందున్

Sri Raghava Kiran Mukku:  అవధానిగారూ, మన్నించాలి, మీరెక్కడ పుష్పకాన్ని కారంటారో అనుకున్నాను… రావణదురహంకారుణ్ణి చూపించారు, భళా. 🙂

Dr Anil Kumar:

3 వ సమస్య 3 వ పాదం

కలలో నూహల జేయనట్టి గతులన్ కాంక్షింపగా పృచ్ఛకుల్

3 వ సమస్య 4 వ పాదం

గలరే వచ్చిరి కీర్తి చంద్రికల సాకారంబునం గూర్చ నా

Kameswara Rao:  బాగుందండి. మొత్తానికి నా ఊహని కలగా మిగ్లేసారన్న మాట 🙂

Chinta Ramakrishnarao:

కంది వదాన్యుల గురుతర

సుందర సద్వచనమధువు శోభిల జేయన్

బంధుర కవితా ప్రతిభుల

మందిరమిదియగుట నిచట మాన్యుడనయితిన్.

Dr. Anil Kumar:

వర్ణన

అనుచు దలచుచుండె నా జంతు రాజులున్

భారతోర్వి ప్రజలు మారరేమొ

ఆ.వె. వనవిహార మౌనె వసుధా క్రమణ మున్

చాల దాయె  జనులు శక్తి మీర

జంతు రక్షణమ్ము కొంతైన చేయరా

అవని విభులు నౌర  అచ్చె రువగు

Kameswara Rao:  బాగుందండి. ఒకసారి అన్నీ ధారణ చేస్తారా. అవధానం సంపూర్ణమవుతుంది.

VAMAN KUMAR: అసలు చింతా వారిది అప్రస్తుతం కానే కాదు. వారు మరొక అవధాని.

అనిల కుమారుండిచ్చట

ఘనముగ యవధానమందు కవుల సమస్యల్

మనసుకు నచ్చెడు రీతిన

వినిపించెన్ పూర్తి జేసి వినయము తోడన్.

Dr Anil Kumar:  ఆర్యా ధారణ చేయాలంటే నా  కంప్యుటర్ టైప్ చేయడానికి చాలడం లేదు.

Chinta Ramakrishnarao:

ఆర్యులారా!

జన్మ ధన్యమయ్యె. చరితార్ధునైతిని..సద్వధానప్రతిభు సరసనుండి. జ్యోతి గారి కృషికి జోహారు. మా కంది శంకరయ్యగార్కి సద్వినుతులు. పృచ్ఛకాళికెల్ల, విద్వాంసులకునెల్ల, పాఠకాళికెల్ల వందనములు. మాడుగులఅనీలు మహితావధానికి ధన్యవాదములిడి, తలతు శుభము.

 

కవిమిత్రులారా, భాషాభిమానులారా,

ఈనాటి ఈ అంతర్జాల అష్టావధానం ఇంతటితో పూర్తయింది. ఇది మొదటి ప్రయత్నం కనుక కొన్ని లోపాలు కనిపించాయి. ఏది ఏమైనా అవధానం నిరాటకంగా సహృదయ మనోరంజకంగా కొనసాగింది.ఈ అవధానం ఈ విధంగా విజయవంతం అయిందంటే ముఖ్యకారకురాలు జ్యోతి గారు. వారికి ధన్యవాదాలు.తమ సర్వతోముఖ ప్రతిభతో సమర్థవంతంగా అవధానాన్ని పూర్తిచేసి, అందరినీ అలరించిన అవధాని మాడుగుల అనిల్ కుమార్ గారికి ధన్యవాదాలు. పృచ్ఛకులుగా పాల్గొన్న అష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి, చింతా రామకృష్ణారావు గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, లంకా గిరిధర్ గారికి, పోచిరాజు సుబ్బారావు గారికి, భైరవభట్ల కామేశ్వర రావు గారికి, సనత్ శ్రీపతి గారికి ధన్యవాదాలు. అతిథులుగా మధ్య మధ్య తమ వ్యాఖ్యలందించిన వామన్ కుమార్ గారికి, రామకృష్ణ గారికి, భరద్వాజ గారికి ధన్యవాదాలు. ప్రత్యక్ష అవధానంలో పాల్గొనకపోయినా ఆశీస్సులను, శుభాకాంక్షలను తెలిపిన పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారికి, సుబ్బారావు గారికి, నేదునూరి రాజేశ్వరి గారికి, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారి సందేశము…

అంతర్జాలమునుండి మాడ్గులకవీ! యష్టావధానంబు మీ

రెంతో చక్కగ జేయుచుండిరి భళీ! యీ కార్య మాంధ్రావనిన్

సంతోషంబిక నందజేయగలదో సన్మానపాత్రా! యశ:

కాంతాసంగతి మీకు గల్గు ననిలాఖ్యా! సర్వసౌఖ్యంబులున్.శుభమస్తు!

అవధానిగారి కృతజ్ఞతాంజలి

కం .శ్రీ కంది శంకరయ్య గారికి :

ప్రాజ్ఞులైన యట్టి  ప్రష్టలన్ గూర్చిప్రో

త్సాహ మందజేసె సాహిత్య పోషిశ్రీ

కందిశంకరయ్య వందనములు .

శ్రీమతి వలబోజు జ్యోతి గారికి :

తే.గీ.శ్రీమతి వలబోజు జ్యోతి స్త్రీ లలామ

తలచెనౌర అంతర్జాల కలిత లలిత

అతుల అవధాన మార్గమ్ము , నమలుపరచె

అందు నవకాశమిచ్చె ఏన్ ముందుకెదుగ

జ్యోతి వలబోజుగారికి జేతు నుతులు .

పృచ్ఛకులకు :

ఆ.వె. పెద్దవారలెల్ల పృచ్ఛక స్థానంబు

నలరి జయము గూర్చి రలఘు బుధులు

సాధ్యమౌనె నాకు సార సరస్వతీ

సుతులటంచునెన్ని నుతుల జేతు .

 

విన్నపము :

మ. సిగలో చంద్రుని కంఠమందు విషమున్ చేపట్టి భూతేశుడున్

జగముల్ బ్రోవుచునుండినట్లు విబుధుల్ సారస్వతంబందు నా

దగు తప్పొప్పులు సంగ్రహించి గుణముల్ అత్యాదరంబుంచి  మె

చ్చగ దోషంబులు గొంతుదాచగ నమస్కారంబు గావించెదన్   l|

ధారణ:

శ్రీ రామ

వాణీ మనోహరిణి అంతర్జాల అష్టావధానం

“అవధాని రత్న”, సాహిత్య శిరోమణి

డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్

 

అంశాలు 1. నిషిద్ధాక్షరి 2. దత్తపది 3. దత్తపది 4. సమస్య 5. సమస్య 6.సమస్య 7.వర్ణన 8. అప్రస్తుత ప్రసంగము

1.నిషిద్ధాక్షరి

శ్రీ సరస్వతీ స్తుతి :

కం. వా దేశ స్థా రామా

మోదద కమ్రాస్య బ్రోవు పూతా వాక్ మా

తా దయ జూపన్ వలె నీ

పాదాబ్జము పూజజేతు భారతి భక్తిన్  ll

వా= నోటి ., దేశ స్థా = ప్రదేశంలో ఉండుదానా ., మోదద = ఆనందింప జేయుదానా .,

కమ్రాస్య = మనోహరమైన ముఖము కలదానా ., పూతా = పవిత్రమైన ., రామా = స్త్రీ ., వాక్ మాతా= సరస్వతీ., బ్రోవు= రక్షింపుము. భారతి = ఓ సరస్వతి ., దయజూపన్ వలె = నాపై  దయ చూపించాలి. నీ పాదాబ్జము = నీ పాద కమలమును ., భక్తిన్ = భక్తితో ., పూజజేతు= పూజిస్తాను.

 

2.  దత్తపది: చేప , మేక , కోడి ,పంది అను పదాలతో మాంసాహారం కాకుండా శాకాహారం వండాలి.

కం. చేపడితి నూనె గిన్నెను

వేపుడున మమేకమౌచు వేయించితిగా

రూపొందె పకోడియొకటి

ఆపం దినుసులను తినుట అన్యములెరుగన్ ll

 

3. దత్తపది : జయము ,రయము ,లయము , మయము అను పదాలతో శ్రీ కృష్ణ రాయబారాన్ని చంపకమాలలో వర్ణించాలి .

చం. జయమగునే బలమ్మున ప్రశంశల నొందెడు పాండవేయులున్

రయమున యుద్ధరంగమున ప్రాణముదీతురు మీరలెల్లరన్

లయమగునట్లుగాకయె తలంపగ సఖ్యతజూపగా వలెన్

నియమితుడైతి చిన్మయమునిన్ అనె కృష్ణుడు రాయబారమున్  ll

 

4.  సమస్య :    స్వేదము ద్రావినన్ దొలగు వేదన సాంత్వన నొందు చిత్తమున్

ఉ. ఆ దొరసాని చిక్కె హృదయమ్ముల దోచుచు సందె వేళలో

మోదము నొందునట్లుగ విభూతి నొసంగు వధానసత్క్రియన్

ఔదల పోయగానమృతమౌ కవితాఝరియుక్త సీమలో

స్వేదము ద్రావినన్ దొలగు వేదన సాంత్వన నొందు చిత్తమున్ ll

 

భావము :-  ఆ సరస్వతి సాయం సమయంలో సాహితీ ప్రియుల హృదయాలను దోచుకుంటూ దొరికింది. ఇది అంతర్జాల అవధానము. ఇందులో పృచ్ఛకులకు కరెంటు పోవడము , కంప్యూటర్ సమస్య ఏర్పడటము జరిగింది. ఇటువంటి సమయం లో అవధాని ఏమి చెప్పినాడో తెలియక పోవడము , మెసేజ్ లు సరిగా చేరక తికమక పడటము జరిగింది. అప్పుడు కాస్తో, కూస్తో  స్వేదము పై పెదవి నుండి జారి నోటికందినా కవితామృత ప్రవాహంలో ఆ బాధ తొలగి మనసుకు ఆనందంగానే ఉంటుంది.

5.సమస్య :- కారుతిరిగె విచ్చలవిడి గగనమునందున్

కం. ఔరా ! సమస్య యేయిది

ఆ రాముని ధర్మ పత్ని అపహరణముకై

చేరిన రావణు దురహం

కారుతిరిగె విచ్చలవిడి గగనమునందున్ ll       ( భావము :- సులభ గ్రాహ్యము )


6.సమస్య :- వలలోజిక్కె కరీంద్రయూథము యశో భాతిన్ హరీంద్రమ్ముతో

మ. తలలో అంతరజాలమందు  కవితాధారామృతంబల్లుచున్

కలలో నూహల జేయనట్టి గతులన్ కాంక్షింపగా , పృచ్ఛకుల్

కలరే , వచ్చిరి కీర్తిచంద్రికల సాకారంబునుం గూర్చ , నా

వలలోజిక్కె కరీంద్రయూథము యశోభాతిన్ హరీంద్రమ్ముతో ll

భావము :- మత్తేభాలు , హరీంద్రముల వంటి పృచ్ఛకులు నా అంతర్జాల అవధానంలో పాలు పంచుకొని నాకు కీర్తిచంద్రికలు వ్యాపింప జేశారు. అటువంటి మత్తేభాలు , హరీంద్రములు నా వలలో పడినారు.

 

7.వర్ణన :- తమ జాతి అంతరించి పోతున్నదని సింహము ఆవేదన . సీసము లేక మహా స్రగ్ధర లో వర్ణించాలి.

 

సీ. ఆఫ్రికా అడవులే అవని భారతికన్న

ఎంతైన మేలుగా వింత గాదె

సింహాసనమ్మందు శ్రీదుర్గ యలరారె

కాని కాననమందు కానరాదె

చెట్టులు గూల్చుచున్ కట్టిరి మేడలన్

మేమెట్లు జీవించి మెలగ వలయు

అనుచు దలచుచుండ ఆ జంతురాజులున్

భారతోర్వి ప్రజలు మార రేమొ

ఆ.వె. వనవిహారమౌనె వసుధాక్రమణమునన్

చాలదాయె జనుల శక్తి మీర

జంతు రక్షణమ్ము కొంతైన జేయరా

అవని విభులునౌర ! అచ్చెరువగు.

భావము :- సులభ గ్రాహ్యము.  ఈ ప్రజలు శక్తికి మీరి భూమిని ఆక్రమిస్తున్నారు.జంతు రక్షణ చేపట్టడం లేదు, అని సింహాల ఆవేదన.

 

 

మాలిక బృందం నుండి:ఈ అవధానాన్ని నిర్వహించినవారికి, పాల్గొన్నవారికి, అవధానిగారికి, వీక్షకులకు, ఇతరత్రా ప్రోత్సాహం అందించినవారికి మన:పూర్వక కృతజ్ఞతలు.

10 thoughts on “వాణి – మనోహరిణి (ప్రప్రధమ అంతర్జాల అష్టావధానం)

  1. అంతర్జాల అవధానం చాలా రసవత్తరంగా ఉన్నది. ధారణ చేసిన పద్యాలు ఇక్కడ చదివి, విని, చాలా సంతోషించాను. ఈ ప్రక్రియ మొదటి సారిగా చేపట్టి కృతకృత్యులైన మాలిక పత్రిక నిర్వాహకులకు, ప్రత్యేకించి ఈ ఆలోచన తట్టిన సోదరి జ్యోతి గారికి నా శుభాభినందనలు.

  2. చింతా వారి క్రమాలంకార పూరణ చాలా బాగుంది.నిదానంగా , అనుభవం తో ఆలోచిస్తే అటువంటి సమయ స్ఫూర్తి వస్తుంది.

  3. అవధాన సమయంలో నా ప్రయత్నాన్ని తిలకించండి.
    నిషిద్ధాక్షరి జోలికైతే మాత్రం నేను పోలేదు.
    ఇక దత్త పది, సమస్యా పూరణము, వర్ణనము మాత్రమే ప్రయత్నించాను.
    దోషభూయిష్టమై ఉన్నా ఆశ్చర్యపోనక్కర లేదు.
    తిలకించండింక.
    ౧. చేప – మేక – కోడి – పంది.
    శాకాహార వంటకం.

    ముదము “చేప”ట్టితీవంట. మధుర పలల
    మే కనగ రాదు. రుచులలో మేలు తర ప
    కోడి వండితి తినుడయ్య గొప్పగాను.
    పందియము పెట్ట నెగ్గెడి ప్రతిభ గనుడు.

    ౨. జయము – రయము – లయము – మయము.
    చంపక మాలలో కృష్ణ రాయబారంలో కృష్ణుని మాటలుగా.

    “జయము “నిజంబు సత్యమున చక్కగ నుండెడి పాండవాళికిన్
    “రయము”న సంధి చేసుకొని రక్షణ పొందుట మేలు మీకు నా
    “లయము”న నుండ సాధ్యమగు . లక్ష్యముతో వినరేని మీ రయో
    “మయము”న కూరి పోవుదురు . మాట వినుండయ సంతసించెదన్.

    ౩. స్వేదము ద్రావినన్ దొలగు వేదన సాంత్వన నొందు చిత్తమున్.

    మోదముతో శ్రమించినను ముందుగ వంటికి పట్టు నేమి?
    యా దగ పోవ జేయు జల మత్తిరి ఏమి యొనర్చు వారికిన్?
    ఏది మదిం దలంచ నది యింపుగ నబ్బిన నెట్టులుండునో?
    స్వేదము. ద్రావినన్ దొలగు వేదన. సాంత్వన నొందు చిత్తమున్.

    ౪. వలలో జిక్కె గరీంద్ర యూధము యశో భాతిన్ హరీంద్రమ్ముతో.

    మెలపున్ సత్సు వధానమందు కలుగ న్నేనున్మహత్ కందియున్
    చలమున్ సత్ కవి రామ కృష్ణ విసిరెన్ జాలంబు ప్రశ్నాళితో.
    కొలువున్ సత్కవినయ్యు శంకరులతో కుంచించి తేమందు నే.
    వలలో జిక్కె గరీంద్ర యూధము యశో భాతిన్ హరీంద్రమ్ముతో

    ౫. కారు తిరిగె విచ్చలవిడి గగనమునందున్.

    కోరికతో వైజ్ఞానిక
    ధీరుల పరిశోధనమున తీరెను కోర్కెల్
    చేరెను పడవలు నభమును
    కారు తిరిగె విచ్చలవిడి గగనమునందున్.

    ౬. సింహవేదనము.
    అలనాడు కలనైన తులలేని యటవులు – తిరిగితి నెల్లెడ తిరుగు లేక.
    వెలయించితిని మించి వీరత్వమును నాడు. పలలము లొసగుచు ప్రభువునైతి.
    వెలవెల బోయె కువలయంబు నడవులు – ధ్వంశమగుట చేసి దాని చేత
    పలలమబ్బకయుండె . పాపాత్ములడవిని – పాడు చేసిన దాని ప్రతిఫలమిది.
    నన్నునాశ్రయించిన వారి మన్నికనిక
    నెన్న గన నౌనె? దుర్దశ నెట్లు బాప
    వలయు ?పరమాత్మ! నీవిక వెలయుము భువి.
    యడవులను గాచి మమ్ముల నాదుకొనగ.

    నేను అప్రస్తుత ప్రసంగ పృచ్ఛకునిగా నున్న కారణమున అంత ఏకాగ్రత చూప లేకపోయిన కారణంగా పద్యాలు నీరసంగా ఉండి ఉండ వచ్చును. ఏదో ప్రయత్నించి వ్రాసానంతే.
    అవధానిగారి రచన అద్భుతం. సందేహం లేదు. వారికి పృచ్ఛకులకు, నిర్వహించిన శంకరయ్య గారికి, జ్యోతి గారికి ఇక మలక్ పేట రౌడీ గారికీ నా హృదయ పూర్వక అభినందనలు.

  4. ఇంతకు మునుపెన్నడన్నా ఇటువంటి కార్యకమం నిర్వహించబడినదేమో తెలియదు. అసలు ఈ ప్రక్రియను ఇంటర్నెట్‌లో చేపట్టవచ్చునన్న ఆలోచన ఎలా వచ్చిందో!

    మాలిక పత్రిక బృందాన్ని మనఃపూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి పథనిర్ణేత కార్యక్రమాలు మరిన్ని చెప్పట్టగలరని కూడా ఆశిస్తున్నాను…

    Great job team. All the best for your future endeavors…

  5. పఠించితి నప్పుడే అవధానము
    వింటిని వీనులవిందుగ నిప్పుడు తమితో
    ఎంతెంతని ఎన్నుదును ఈ అంతర్జాల అవధాన ప్రక్రియను
    అంతై ఆకాశమంత నిండె మాన్యులు మెచ్చన్…

  6. నిజముగా యెంత చక్కటి ప్రక్రియ.అవధానము మన తెలుగుకే
    ప్రత్యేకము.మరి టెక్నాలజీ ని ఇలా ఉపయోగించ వచ్చు అని
    ఆలోచన వచ్చిన,జ్యోతి గారికి ,భరద్వాజ్ గారికి ,మాలిక వారికి
    అభినందనలు.ఎన్ని మాటలు చెప్పినా తక్కువే.
    ఇక అవధాని గారికి,ప్రుచ్చకులకు,నడిపించిన పెద్దలకు
    నమస్సులు

Leave a Reply to శశికళ Cancel reply

Your email address will not be published. Required fields are marked *