April 16, 2024

ఇల్లెక్కడ?

రచన: గీత పసుపులేటి..

ఇప్పుడే తెలిసింది..

నా కడుపు కంటిలో

‘పాప’ కదిలినప్పుడే..

ఉదర్కపు ఉషోదయం

నా ముందు నిలిచింది

అమ్మా, నేను నెల తప్పాను.

 

నీ అరచేతి పొత్తిళ్ళలో

కళ్ళు తెరిచిన నాకు

నిన్నిప్పుడే చూడాలనిపిస్తోందమ్మా

నన్ను పురుడు పోసుకున్న పుట్టింటనే

నీకు అత్తిల్లయిన నా పుట్టింటనే

నేను అమ్మను కావాలనుంది

అమ్మా, నీ ఓడిలో వాలాలనుంది

నాకైదు నెలలు నిండాయి

 

పుడమి నన్ను మోస్తున్నట్లు లేదు

నేనే పుడమిని మోస్తున్నట్టుంది

కడుపులో వామనావతారం

మూడోపాదం ఎక్కడ పెట్టాలని అడుగుతోంది!

అమ్మా, పాప బావుందా..

నీకంటికి మరో ‘నేను’లా వుందా…

లేక మరో ‘నువ్వు’ లా వుందా…

తొమ్మిది నెలలు నేను మోశాను

ఆ తొమ్మిది నెలలు నన్ను మోసిన నిన్ను…

‘నిన్నే’ కనాలనుకున్నానమ్మా!

చెప్పమ్మా, పాప నీలా వుంది కదూ…!

పురుడు పోసుకున్నది నేనైతే

నా పురిటి నొప్పులన్నీ నువ్వే పడ్డావు

బాలారిష్టాలన్నీ తీర్చి

దిష్టి తీసి నన్ను అత్తింటికి సాగనంపావు

 

అమ్మా, పాపను బళ్ళో చేర్పించారు

కానీ, నా పాప పేరేమిటో

దానింటి పేరేమిటో..

అది నాకేమవుతుందో

దానికి నేనేమవుతానో

నాకిప్పుడే తెలిసింది..!

అమ్మా, పాప పేరు పక్కన నా ఇంటిపేరు లేదమ్మా

అమ్మా, ఇక దాని సర్టిఫికెట్లలో

నా సంతకం కనిపించనక్కర్లేదట!

అమ్మా, నా కన్న నా పాప ఇంటి పేరేమిటి?

నీకు పుట్టిన నా ఇంటి పేరేమిటి?

నిన్ను కన్న తల్లికి ఇంటి పేరేమిటి?

అమ్మా మన ‘ఇంటి’ పేరేమిటి?

అమ్మా, ‘మన’ ఇల్లెక్కడ?!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *