March 29, 2023

“బాకీ”

రచన : మంధా భానుమతి
పాత ఆల్బంలు తిరగేస్తూ ఒక పేజీ దగ్గర ఆగిపోయాను. స్వరాజ్యందీ నాదీ ఫొటో చూసి. ఏనాటి మాట! యాభై ఏళ్లయినా నిన్న మొన్న జరిగినట్లుంది. నా పధ్నాలుగో పుట్టిన్రోజుకి అమ్మ ఇచ్చిన డబ్బుతో స్టూడియోకి వెళ్లి తీయించుకున్నది..
కోపంతో, ఏమీ చెయ్యలేని అసహాయతతో గుండె బరువెక్కిపోయి, అంత బరువు గుండే దడదడా కొట్టుకోవడం నాకు చాలా చిన్నప్పుడే.. అంటే పన్నెండేళ్ల వయసప్పుడే అనుభవంలోకి వచ్చింది. అదేవిధంగా ఉద్వేగంతో గుండె తేలికయిపోయి అసలు గుండె స్థానంలో ఏమీ లేదేమో.. ఖాళీ ఏమో అనిపించే అనుభవం కూడా అయింది. రెండింటికీ మధ్య ఇరవైఏళ్లు కాలం గడిచింది. రెండూ కూడా మా స్వరాజ్యం వల్లనే.
ఎనిమిదో తరగతి నుంచీ కొత్త బడి. పన్నెండేళ్ల వయసులో.. స్వరాజ్యంతో, జ్యోతితో, కమలతో కలిసి మైలు దూరం నడిచి వెళ్లి వచ్చేప్పుడు ఎన్నో ఆకర్షణలు. అటూ ఇటూ చూడకుండా నడిచేసేదాన్ని. చూస్తే.. కనకాంబరాల దగ్గర్నుంచీ అన్ని రకాల పూలూ పెట్టుకుని ఉన్న బళ్లు, వేడి వేడి మిరపకాయ బజ్జీలు వేస్తున్న నర్సమ్మ బడ్డీకొట్టు, పప్పుండలు, కారం మరమరాలు, బఠాణీలు.. తెల్లగా ఒక్క మరకైనా లేని సీసాల్లో పెట్టి సైకిలు బండి తొక్కుతూ, గణ గణా గంట మోగిస్తూ, మేం దగ్గరికి రాగానే మా పక్కనే నెమ్మదిగా నడిచే మీర్ సాయబు.. అబ్బో! ఎన్నో అడ్డంకులు.
అందరం బోలెడు కుచ్చిళ్లున్న రంగు రంగుల పరికిణీలు, అందులో ముక్క తోనే కుట్టించిన మోచేతులు దాటిన చేతులతో పొడవాటి జాకెట్లు వేసుకుని, రెండేసి జళ్లు, ఒక జడలో పూలు పెట్టుకుని, ఆ జడ ముందుకేసుకుని.. ఇప్పుడు ఊహిస్తే రంగురంగుల పూలబాలల గుంపు ఊరేగింపుకి వెళ్తున్నట్లు ఉండేది ఆ పయనం అనిపిస్తుంది.
ముందురోజు రాత్రి వెళ్లిన సినిమాలో పేర్లనుంచీ శుభం వరకూ స్వరాజ్యం చెప్తుంటే బడికెప్పుడు చేరామో తెలిసేది కాదు. నా కంటే రెండేళ్లు పెద్ద స్వరాజ్యం. అయినా నా క్లాసే.  పెద్ద పెద్ద కళ్లు తిప్పుతూ మాట్లాడేది. సంతోషం కానీ దుఃఖం కానీ కళ్లలోనే తెలిసిపోయేది. అప్పటికే వోణీలు వేసుకుని ఆరిందాలా కబుర్లు చెప్పేది. తను లీడర్లాగ ఉంటే మేమందరం ఒబ్బిడిగా తన వెనుకే ఉండే వాళ్లం.
స్వరాజ్యం గేటు దగ్గరున్న బండి మీద వేడి వేడి ఇడ్లీ, పప్పుల పచ్చడో.. పూరీ, ఉల్లిపాయ బంగాళాదుంప నీళ్లకూరో తిని లోపలికొచ్చేది. ఆ బండి అబ్బాయి దగ్గరో పుస్తకం ఉండేది.. అందులో ఏదో రాసే వాడు. నాకు మొదట్లో తెలిసేది కాదు.. డబ్బులు తీసుకోకుండా ఇస్తున్నాడేంటి చెప్మా అనుకునేదాన్ని. నెలంతా అయ్యాక ఎంత బాకీ పడిందో లెక్క వేసి తీసుకుంటాట్ట బండబ్బాయి.
“నెలయ్యేసరికి ఐదు రూపాయలకి, ఓ రూపాయి ఎక్కువ తీసుకుంటాడు.. మరి ఉత్తినే ఇస్తాడేమిటి?” స్వరాజ్యం చెప్పింది ఒకరోజు.
“అంటే.. వడ్డీనా? ఇంట్లోనే తిని రావచ్చు కదా? ఏమీ అనరా?” వడ్డీ అనేది మనం చేసే లెక్కల్లోనే ఉంటుందేమో అనుకునేదాన్ని అంతవరకూ. నెలకి ఐదు రూపాయలకి ఒక రూపాయి వడ్డీ అంటే, సంవత్సరానికి ఎంత శాతం? మనసులో గుణించుకుంటే గుండె గుభేలుమంది.
మా ఇంట్లో అలా బైట తినే ప్రసక్తే లేదు. తొమ్మిదింటికల్లా వంటైపోతుంది.. అన్నం తినేసి, డబ్బాలో పెరుగన్నం పెట్టుకుని వెళ్లి పోవడమే. అందుకే నాకు స్వరాజ్యం పూరీ తింటుంటే నోరూరిపోతుంది, మా ఇంట్లో ప్రతీ శనివారం అంతకన్నా రుచిగా చేస్తున్నా సరె. పొరుగింటి పుల్లకూర కదా మరీ.
“మా పిన్నికి పొద్దున్నే వంట చెయ్యడానికి కుదరదు. అందుకే తప్పదు నాకు. పిన్ని చూడకుండా మా నాన్న నాకు నెలకి పది రూపాయలిస్తాడు. ఆర్రూపాయలు బండివాడికివ్వగా మిగిలింది పరికిణీ లోపల జేబుల్లా కుట్టుకుని అందులో పెట్టుకుంటాను. పుస్తకాలకీ, పెన్సిళ్లకీ, అన్నింటికీ అదే.”
అవును.. విన్నాను. స్వరాజ్యంకి అమ్మ లేదట. వాళ్ల నాన్నకి బదిలీ అయితే ఈ సంవత్సరమే మా బళ్లో చేరింది. స్వరాజ్యం వచ్చిన రోజునుంచే తనంటే ఇష్టం ఏర్పడింది. తను ఏం మాట్లాడినా వింతే నాకు.
“మరి మధ్యాన్నం ఏం తినక పోతే ఆకలెయ్యదూ?” నాకైతే డబ్బా కాకుండా జంతికల్లాంటి చిరుతిళ్లు కూడా పొట్లం కట్టి సంచీలో పెడుతుంది అమ్మ. ముందు నోట్లో నానబెట్టి టీచరు చూడకుండా క్లాసులో లాగిస్తుంటాను.
“అలవాటయిపోయింది.” నీరసంగా నవ్వింది స్వరాజ్యం. తేనుపొచ్చేలా అన్నం తిని మంచినీళ్లు తాగుతున్న నాకు కొరపోయింది. పొట్లం లోంచి చేగోణీలు తీసి ఇచ్చాను. ముందుమొహమాటపడినా, నామీదొట్టు అనేసరికి తీసుకుంది స్వరాజ్యం. రూపాయకాసుకంటే ఓచుట్టు మాత్రమే పెద్దగా ఉన్న ఇడ్లీలు.. మూడు తింటే మాత్రం ఎంతసేపుంటాయి?
సరిగ్గా గమనించలేదు కానీ స్వరాజ్యం మొహం దోసకాయ చెక్కలా అంత పొడవు, కళ్లు ఆల్చిప్పల్లా అంత పెద్దగా ఉండడానికి కారణం అప్పుడు తెలిసింది. పొద్దున్నించీ రాత్రి వరకూ ఒక్క అన్నం ముద్దకి సరిపొయ్యే ఫలహారం కడుపులో ఏ మూలకొస్తుంది? ఇది జరిగిన రెండు రోజులకి..
“లక్ష్మీ టాకీస్లోకి కొత్త సినిమా వచ్చింది. ఇవేళ ఇంటికి తొందరగా పరుగెట్టాలి.” స్వరాజ్యం గబగబా నడుస్తూ అంది. చెప్పొద్దూ.. నాకు భలే కుళ్లు వేసింది. అన్నం పెట్టదు కానీ వాళ్ల పిన్ని సినిమాలకి తీసుకెళ్తుంది.. విడ్డూరంగా లేదూ? మా ఇంట్లో అయితే రెండు నెలలకి ఒకటి చూస్తే గొప్ప.
“నన్ను కూడా తీసుకెళ్తే గానీ నాన్న డబ్బులియ్యడు. అదీ కాక..” ఆపేసింది స్వరాజ్యం సగంలోనే. నేను చేగోణీలు ఇచ్చినప్పుడే చెప్పాను, ఇద్దరం ప్రాణ స్నేహితులమని. నా దగ్గిర రహస్యాలా? బుంగమూతి పెట్టాను.
“ఏం లేదు సీతా! సినిమాలకి తీసుకెళ్లిందనుకో.. అప్పుడు నేను ఎక్కువ చదవలేను కదా! నేను చదువుకోవడం పిన్నికి ఇష్టం లేదు. చదువొస్తే చెప్పిన మాట విననని. నాన్నతో ఎప్పుడూ మానిపించెయ్యమని కొట్లాడుతుంటుంది. కనీసం పదన్నా అవకపోతే పెళ్లి అవదని నాన్న చెప్తే ఒప్పుకుంది.” తప్పదన్నట్లు మొహమాటంగా చెప్పింది స్వరాజ్యం. చటుక్కున తన చెయ్యి పట్టుకున్నాను.. అంతకంటే ఏమీ చెయ్యలేక.
అప్పట్నుంచీ ఆకలి తీరట్లేదని రెండు గిన్నెల కారియర్లో పప్పన్నం, పెరుగన్నం కూడ పెట్టమని చెప్పాను అమ్మకి.
స్వరాజ్యం అంత సులభంగా ఒప్పుకుంటుందా! పొద్దున్న తను బండబ్బాయి దగ్గర తినేది కొంచెం నేను కూడా తింటేనే.. అని షరతు పెట్టింది, తనకి బాకీ పడటం ఇష్టం లేదని అంది పైగా. నాలుగు రోజులు ఇద్దరం స్కూలు గ్రౌండ్లో దూరంగా వేప చెట్టుకింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. రోజూ తినేవే అయినా ఎంత రుచిగా ఉన్నాయో.. అమ్మ నాకిష్టమైన పకోడీలు, చిప్స్ లాంటివి కూడా పెట్టింది నంచుకోడానికి.
మర్నాడు స్వరాజ్యం బడికి రాలేదు. నాకు ఏమీ తోచలేదు. ఆ మర్నాడు కూడా రాలేదు. ఇంక ఉండ బట్టలేక ఇంటికెళ్లేటప్పుడు తిన్నగా వాళ్లింటికి వెతుక్కుంటూ వెళ్లాను. మరి ఇల్లెక్కడో.. ఆంజనేయస్వామి గుడి వెనుక వీధిలో అని అన్నట్లు గుర్తు. వీధి మొగలోనే పెద్దగా అరుపులు వినిపిస్తున్నాయి. మొదటి ఇంటి గేటు దగ్గర నిలుచున్న ఒక పెద్దాయన్ని అడిగాను. గేట్లోంచి చూపించాడు లోపలికి వెళ్లమని.
సగం కాంపౌండువాలు విరిగిపోయిన ఆవరణ. డాబాఇల్లే.. వెల్లలు వేసి ఎన్నాళ్లయిందో మాసిపోయి ఉంది.
“ఒక్క క్షణం ఆగు పిన్నీ! ప్లీజ్. మొన్నటివి ఎండుతున్నాయి. కాలి మీదయితే కనిపించవు. లంగా కొంచెం పైకి తీస్తాను.” స్వరాజ్యం గొంతు దీనంగా..
“అంటే.. ఆగుతే నాకోపం తగ్గుతుందనా? అదేం కుదరదు. చెయ్యి చాపు.”
ఇంకేం మాటలు వినిపించలేదు. నేను గుమ్మం పక్కగా నిలబడిపోయాను. కొంచెం సేపటికి ఒకావిడ, మా అమ్మ కంటే చిన్నగా ఉంది.. నన్ను చూడకుండా విసవిసా నడుచుకుంటూ బయటికి వచ్చి వీధిలోకి వెళ్లి పోయింది.
ఆవిడే స్వరాజ్యం వాళ్ల పిన్ని అయుంటుంది. ఒక్క గెంతులో లోపలికి వెళ్లాను. అలా వెళ్తే స్వరాజ్యం ఇబ్బంది పడుతుందేమోనని ఆలోచనే లేదు. అంత అమాయకత్వం.
స్వరాజ్యం రెండు చేతుల మీదా ఎర్రటి వాతలు.. రెండు కళ్లల్లోంచీ ధారగా కారుతున్న నీళ్లు. రెండు రోజుల్లోనే ఎంతో చిక్కిపోయింది. మొహంలో కళ్లు తప్ప ఇంకేమీ కనిపించడం లేదు.
నన్ను చూడగానే భోరుమంది. అప్పుడే.. స్వరాజ్యాన్ని ఆ స్థితిలో చూసి, నా గుండె బరువెక్కిపోయి, దడదడా కొట్టుకుంది.
………………….
పదో తరగతి అయ్యాక మేము భాగ్యనగరం వెళ్లిపోయాం, నాన్నగారికి బదిలీ అవడంతో. స్వరాజ్యంతో కొన్నాళ్లు ఉత్తరాలు నడిచాయి. ఆ తరువాత ఆగిపోయాయి. నాక్కూడా చదువు, పెళ్లి, ఒకానొక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం.. ఇద్దరు పిల్లలు, సంసార బాధ్యతలతో పదిహేనేళ్లు గడిచిపోయాయి. ఆ లోగా ఎప్పుడో నేను బికామ్ చదువుతున్న రోజుల్లో స్వరాజ్యం గురించి వినకూడని మాట విన్నాను.
“స్వరాజ్యం ఎవరితోనో లేచిపోయింది..” కాకతాళీయంగా నాకు ఎగ్జిబిషన్లో కలిసిన కమల నిరసనగా చెప్తుంటే ఒక నిముషం అలా నిలబడిపోయాను. కళ్లముందు చీకటి కమ్మినట్లయింది. వెన్నెల్లో చందమామలా వెలిగే స్వరాజ్యం మొహం గోచరించింది. నిజానికి జీవితం ఎలా మలచుకోవాలో నాకు అమ్మకంటే ఎక్కువ స్వరాజ్యమే చెప్పింది. అటువంటి, అన్నీ తెలిసిన స్వరాజ్యం.. ఒకందుకు మాత్రం సంతోషించాను.. ఇప్పటికైనా ఇల్లనే ఆ చెరనుంచి బయటపడినందుకు.
కానీ బోనులోంచి పులినోట్లో పడిన కుందేల్లా అవలేదు కదా! అవకూడదని అందరు దేముళ్లకీ మొక్కాను, నిశ్శబ్దంగా కళ్లు మూసుకుని. ఆ తరువాత తన జాడే లేదు. నెమ్మదిగా మనసు పొరల్లోకి తప్పుకుంది స్వరాజ్యం.
నిన్ననే.. ఇంటినుంచి ఆఫీసుకి వెళ్తూ ఒకటో నంబరు బస్సులో కడ్డీ పట్టుకుని నిల్చున్న నా భుజం మీద ఎవరిదో చెయ్యి పడినట్లనిపించింది. చివాలున వెనక్కి తిరిగాను, ఆకతాయి వెధవలేమో కడిగి పారేద్దామని.. ఆశ్చర్యం! స్వరాజ్యం నవ్వుతూ చూస్తోంది. ఆ నవ్వునీ, కళ్లనీ ఎలా మర్చిపోగలను? కొద్దిగా లావయింది. మొహం నీరసంగా ఉంది. పెదవులు నవ్వుతున్నాయి కానీ కళ్లలో విషాదం. ఏమయింది? ఆ వెధవ మోసం చేసి వదిలేస్తే.. ఇంక ఆలోచించలేక పోయాను.
“సీతా! ఎలా ఉన్నావు? ఇద్దరు పిల్లలుట కదా? నీ విశేషాలు తెలుస్తున్నాయి. కానీ అడ్రస్ దొరకలేదు. ఇప్పుడు కలిశావు.. ఎంత ఆనందంగా ఉందో తెలుసా?” ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తున్న స్వరాజ్యంతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోయాను.
స్వరాజ్యం వెంటనే కనిపెట్టేసింది.
“వచ్చే స్టాప్లో దిగిపోదాం. నీతో చాలా మాట్లాడాలి.” కోటీ బస్స్టాప్లో కొంచెం చిరాకుగానే దిగాను తన వెనుకే. పక్కకి తీసుకెళ్లి చెయ్యి పట్టుకుంది.
“నా సంగతి తెలిసిందా? నేనేం తప్పు చెయ్యలేదు సీతా! మా మేనమామ.. నాకంటే ఆరేళ్లు పెద్దవాడు, చదువయి ఉద్యోగంలో చేరాక మా ఇంటికొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగాడు. పిన్ని ఒప్పుకోలేదు. నాకిష్టమేనా అని అడిగి, నాన్నా, పిన్నిల ఎదురుగానే నా చెయ్యి పట్టుకుని బైటికి తీసుకెళ్లాడు. రిజిస్ట్రార్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నాక, ఆశీర్వదించమని ఇంటికి వెళ్తే మొహం మీదే తలుపేసింది పిన్ని. అందరితో నేను లేచిపోయానని..” పిన్ని తొడలమీద వాతలు పెట్టిన మరునాడు నవ్వుతూ తల ఎత్తి బడికొచ్చిన స్వరాజ్యం, తలదించి కళ్లు వాల్చేసింది. రెండు కన్నీటి చుక్కలు నా చేతి మీద పడ్డాయి.
చేతి గడియారం చూసుకున్నాను. ఆ రోజు ఆఫీసులో చెయ్యాల్సిన పని గుణించుకున్నాను. ఫరవాలేదు.. సగం రోజు సెలవు పెట్టచ్చు.
స్వరాజ్యం చెయ్యి పట్టుకుని కామత్ హోటల్కి లాక్కెళ్లి, మూలగా ఉన్న బల్ల దగ్గర కూర్చుని, అక్కడే ఉన్న జగ్గులో నీళ్లు గ్లాసులో వంపుకుని తాగాక కానీ నా మనసు స్థిమిత పడలేదు.
స్వరాజ్యం మొహం పది లంఖణాలు చేసిందాన్లా ఉంది. వెయిటర్ని పిలిచి, ఒక ప్లేటు ఇడ్లీ, ఒక దోశ చెప్పి.. మంచి నీళ్ల గ్లాసు తన దగ్గరగా జరిపాను.
“చెప్పు..” అంటూ అప్పుడు స్వరాజ్యం కేసి పరీక్షగా చూశాను. మెళ్లో పసుపుతాడు, దానికి కట్టిన పసుపుకొమ్ము స్పష్టంగా కనిపిస్తున్నాయి, ముతక చీర పమిట పైకి పడి. నా చూపులు గమనించి చటుక్కున లోపలికి తోసేసింది. రెండు చేతులకీ నాలుగేసి ఎర్ర రబ్బరు గాజులు. మొహంలో ఎంతో దైన్యం. వాళ్ల పిన్ని వాతలు పెట్టినప్పుడు కూడా ఇలా లేదు.
నా చూపుల్ని పసి కట్టింది స్వరాజ్యం. ఏదో చెప్ప బోయింది.. నోట్లోనుంచి ఏవేవో శబ్దాలు తప్ప మాట సరిగ్గా రాలేదు.. అంతలో వెయిటర్ పళ్లాలు తెచ్చాడు.
“ముందు తిను.. తర్వాత మాట్లాడుకుందాం. ఇవి రెండు నీకే. నేను భోంచేసి బయలుదేరా.” నా మాట పూర్తవకుండానే స్వరాజ్యం తినడం మొదలుపెట్టింది. నా కేసి చూడకుండా తినేస్తోంది. ఎంతొ మొహమాటంగా పౌరుషంగా ఉండే స్వరాజ్యమేనా!
తినడం అయిపోయాక, గ్లాసెడు నీళ్లు గడగడా తాగేసి, తల వెనక్కి వాల్చి, గట్టిగా ఊపిరి పీల్చింది. మొహంలోకి కాస్త కళ వచ్చింది.
“ఏమనుకోకే సీతా! నాలుగు రోజుల్నుంచీ బండి మీద బన్ను, టీ తప్ప ఇంకేమీ లేదు. అందుకే..” నాకు మెదడు మొద్దుబారిపోయి కళ్లలో నీళ్లు తిరిగాయి. అందులోంచి తేరుకోకుండానే అస్సలు ఊహించని ఇంకో కోరిక కోరింది.
“ఒక్క యాభై రూపాయలుంటే ఇస్తావా?”
నా ఎదురుగా ఉన్నది స్వరాజ్యమేనా? అభిమానపడి ఎన్నో రోజులు పస్తులున్న స్వరాజ్యాన్ని బలవంతం మీద తినిపించడం గుర్తుంది నాకు. నెలాఖరులో తను బండబ్బాయి ఇడ్లీలు నాకు పెట్టించకపోతే, ససేమిరా నా దగ్గర అన్నం తినేది కాదు. ఏమీ మాట్లాడలేకపోయాను.
“మేము బాగానే ఉండే వాళ్లం సీతా! మాకు పిల్లలు లేరు. తను ఎలిమెంటరీ స్కూల్లో టీచరు. మాది బెజవాడ దగ్గిర పల్లెటూరు. వచ్చింది పొదుపుగా వాడుకుంటూ, సాయంకాలాలు పిల్లలకి తెలియనివి చెప్తూ హాయిగా ఉండే వాళ్లం. అంతలో మామయ్యకి.. అదే మా ఆయనకి జబ్బు చేసింది. కిడ్నీ పాడయిందని అన్నారు. ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లమన్నారు. ఆపరేషన్ చేశారు. మధ్యలో మందులు వికటించాయి. మారుస్తూ వచ్చారు. ఇక్కడికి వచ్చి నెల పైగా అయింది. దానికి తోడు నాలుగు నెలల్నుంచీ జీతాలు ఇవ్వట్లేదు. నేను ఆస్పత్రిలోనే ఉంటున్నాను. ఇవేళ తెలిసున్న బంధువుల దగ్గిర డబ్బేమైనా దొరుకుతుందేమోనని బయలు దేరాను. వాళ్లకీ బొటాబొటీగా సరిపోతుందిట. అందుకే..”
ఒంటిమీదున్న కొద్ది బంగారం వెళ్లిపోయిందని తెలుస్తూనే ఉంది.
“అలా చూడకు సీతా! ఏదో ఒకటి మాట్లాడు. దేముడు పంపించినట్లు కనిపించావు. వారం రోజుల్లో ఇంటికి పంపించేస్తారుట. నీ డబ్బు వెసులుబాటు చూసుకుని ఇచ్చేస్తాను. ఒకవేళ వీలుకాకపోతే ఏమీ అనుకోను.” స్వరాజ్యం గొంతు బొంగురుపోయింది. అప్పటికి కానీ నాకు తెలివి రాలేదు. కొందరు కష్టాలు అనుభవించడానికే పుడతారా? స్వరాజ్యం ఆశగా నాకేసి చూస్తోంది.
“అబ్బెబ్బే! నీ సంగతులు, ఇక్కట్లు వింటుంటే ఏమనాలో అర్ధం అవలేదు. ఇన్నేళ్లకి ఈ స్థితిలో నిన్ను చూస్తుంటే..” కారుతున్న కన్నీటిని తుడుచుకుని బాగులో వెతికాను. ముందురోజు వచ్చిన అరియర్స్ ఇంట్లో పెట్టెయ్యలేదు.. నయమే! రెండు వందలున్నాయి. తీసి స్వరాజ్యం చేతిలో పెట్టి అన్నాను,
“ఇంతకంటే ఏమీ చెయ్యలేను.. నాకు సంసారం, ఉద్యోగం బాధ్యతలూ. సరిపోకపోతే ఆఫీసుకి ఫోను చెయ్యి. ఇదిగో నంబరు.”
అప్పుడు చూశాను స్వరాజ్యం కళ్లలో సంభ్రమాన్ని, ఆనందాన్నీ, ధైర్యాన్నీ. స్నేహితురాలికి కొంచెం అయినా ఆసరా ఇవ్వగలిగినందుకు ఆనందం వేసింది.
“నీ మెలు ఈ జన్మలో మర్చిపోలేను సీతా! మా జీవితాలు నిలబెట్టావు.” ఇంకా ఏదో అనబోతున్న స్వరాజ్యాన్ని తీసుకుని బయటికి నడిచాను, కౌంటరు వద్ద బిల్లు కట్టి.
……………….
ఆ తరువాత స్వరాజ్యం జాడలేదు. కొన్నాళ్లు, అప్పుడప్పుడు మా వారు మాత్రం గుర్తు చేస్తుండేవారు.. నీ ఫ్రెండు బాకీ ఏదీ అంటూ. ఆ తరువాత మేము రెండిళ్లు మారి, ఊరికి దూరంగా వనస్థలిపురంలో చిన్న ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్లిపోయాం. నా అఫీసు కూడా మారిపోయింది, ప్రమోషను, బదిలీతో.
రోజువారీ ఉరుకులు, పరుగులతో కాలం ఎలా గడుస్తోందో తెలియడం లేదు. స్వరాజ్యం మళ్లీ మరుగున పడిపోయింది. ఐదేళ్లు గడిచిపోయాయి. ఆరోజు.. రాత్రి తొమ్మిదయింది. పిల్లలు వాళ్ల గదిలో చదువుకుంటున్నారు. మేము ఇద్దరం చెరో పుస్తకం పట్టుకుని మధ్య మధ్య కష్ట సుఖాలు కలబోసుకుంటున్నాం. బైట సన్నగా వాన పడుతున్న చప్పుడు..
వీధిలో గుమ్మం దగ్గర ఆటో ఆగిన చప్పుడయింది. వెంటెనే గేటు తీసిన శబ్దం. ఈ వేళప్పుడు ఎవరబ్బా! వరండాలోకి వెల్లి గ్రిల్స్ లోనుంచి చూస్తూనే గుర్తు పట్టాను. నెత్తి మీద కొంగు కప్పుకుని వస్తోంది స్వరాజ్యం. వీధి దీపం కాంతిలో స్పష్టంగా కనిపించింది. సంభ్రమాశ్చర్యాలతో, తలుపుతీసి గట్టిగా పట్టేసుకున్నాను.
నవ్వుతున్న మొహం.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంది స్వరాజ్యం.
“ఎక్కడ్నుంచీ.. ఎలా వచ్చావు? మీ వారు బాగున్నారా? ఆటో పంపించెయ్యి..” తడబడుతున్న మాటలతో అన్నాను. అన్నేళ్ల తరువాత చూసిన నెచ్చెలిని  రెండ్రోజులుంచుకోవాలని నా ఆశ.
“లేదు సీతా! వెళ్లిపోవాలి. రెండ్రోజుల్నుంచీ తిరుగుతున్నా నీ అడ్రస్ పట్టుకోవాలని. అప్పుడు నువ్విచ్చిన ఫోన్ నంబర్ తప్ప ఇంకేమీ లేదు. మీ పాత ఆఫీసు కనుక్కుని అక్కడికి వెళ్లి, అక్కడ్నుంచి మీ కొత్త ఆఫీసుకి ఫోన్ చేసి.. మొత్తానికి సాయంత్రానికి దొరికింది. ఇప్పుడు బస్సుకెళ్లి పోతూ వచ్చాను. ఇంకో అరగంటలో మెయిన రోడ్డు మీద ఎక్కాలి. ఇదిగో.. అప్పుడు నువ్విచ్చిన డబ్బు. నువ్వు మంచి మనసుతో చేసిన సహాయం వల్ల, మా వారికి నయమైంది. పూర్తిగా కోలుకుని, మామూలుగా పనులు చేసుకోడానికి రెండేళ్లు పట్టిందనుకో. మళ్లీ ఇంకోసారి వస్తా. ఈసారి నువ్వు పిల్లల్నీ, మీ ఆయన్నీ తీసుకుని రా. ఆ కవర్ మీదే అడ్రస్ కూడా రాశాను. ఉంటా..” ఎలా వచ్చిందో అలాగే మెరుపులా వెళ్లిపోయింది.
వరండా తలుపు వేసేసి, లోపలికి ఎలా వెళ్లానో నాకు గుర్తు లేదు.
“ఇందులో నాలుగొందలున్నాయి. ఎవరొచ్చారు సీతా?” నా చేతిలో కవర్ తీసి చూసిన మా వారు అంటున్న మాటలు.. ఎక్కడ్నుంచో వినిపిస్తున్నట్లుంది.
అదిగో.. అప్పుడే నాకు హృదయం ఉండాల్సిన చోటు ఖాళీగా అనిపించింది.
*————————–*

5 thoughts on ““బాకీ”

  1. ధన్యవాదాలు దీప్తీ, లక్ష్మిగారూ, హైమవతిగారూ. మీ వ్యాఖ్యలు చదువుతుంటే సంతోషంగా ఉంది.

  2. కథ చాలా బాగుందండీ. అమాయకమైన చిన్ననాటి స్నేహాన్ని చాలా బాగా వర్ణించారు. ముఖ్యంగా “నామీదొట్టు..” అన్న మాట సందర్భోచితంగా వుంది. ఆరోజుల్లో అలాగే ఒట్లు పెట్టేసుకునేవారు. అభిమానధనురాలైన స్వరాజ్యం స్వభావం చివరిదాకా మారకపోవడం బాగా చూపించారు. అభినందనలు.

  3. బానుమతిగారూ! అబ్బా! స్నేహ బంధాన్నీ, స్నేహ మాధుర్యాన్నీ, స్నేహాన్ని నిలుపుకోడంలోని నిజాయితీని ఎంచక్కా వివరించారండీ!
    ఆదూరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Subscribe to మాలిక పత్రిక

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

ఇటీవలి వ్యాఖ్యలు

కొత్త టపాలు

Categories

Archives

December 2012
M T W T F S S
« Oct   Jan »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31