December 7, 2021

బాలల కథా సాహిత్యంలో మానవతా విలువలు

రచన:   డాక్టర్ మాడుగుల అనిల్ కుమార్

ప్రతి మనిషి పుట్టింది మొదలు చనిపోయే వఱకు  సుఖంగానే ఉండాలనుకొంటాడు. సుఖంగా జీవించడానికి తక్కిన జీవులకన్న మనిషికే  ఎక్కువ అవకాశాలున్నాయి.  కానీ అజ్ఞానం వల్ల, అనుభవం లేమి వల్ల మనిషి చేజేతులా సుఖాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఇటువంటి సమయంలో మనిషిని బాల్యం నుండినే క్రమశిక్షణలో పెంచాల్సిన అవసరం చాల వుంది. మన సనాతన ధర్మాలను తెలుసుకొని మహాత్ముల జీవితాలను, సందేశాలను చదవడం చేత, సంస్కృతి పట్ల సదవగాహన కలిగియుండడం వల్ల మానవతా విలువలను రక్షించవచ్చు. ఇందుకు బాలల కథా సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుంది. మూర్ఖులైన రాజకుమారులను మార్చడానికి విష్ణుశర్మ కథా సాహిత్యాన్నే ఆశ్రయించాడు.

పుట్టిన ప్రతి మనిషి చనిపోక తప్పదు. ” అంట గడించిన కూటికి, ఎంతటి వాడైన కాటికి ” అనే పెద్దల మాటను మరువకూడదు. ఐతే ఈ సూక్తిని గుర్తుకు చేసుకొని నిరుత్సాహ పడకూడదు. సంపాదించి ఏమి చేస్తాం ? చదివి ఏమి సాధిస్తాం ? అని నీరసపడి సోమరితనాన్ని అలవారచుకోరాదు. జగత్తంతా ధర్మం మీద ఆధారపడి ఉందని శాస్త్రాలు చెప్తున్నాయి.సాధరణంగా ధనం ధర్మం ఉన్న చోటే ఉండాలనుకొంటుంది. కాబట్టి మనం సంపాదించే ధనం కూడా ధర్మంగానే సంపాదించాలి. అట్లా సంపాదించిన ధనాన్ని దానం చేయాలి. పిసినారి తనం ఉండకూడదు. అత్యాశ ఉండకూడదు. ఉదా:-

ఒకానొక దేశంలో ఆ దేశాన్నేలే రాజుకు ” ఒక వ్యక్తీ సుఖంగా జీవించడానికి ఎంత భూమి కావాలి ? ” అనే సందేహం వచ్చింది. మంత్రిని పిలచి సందేహాన్ని వ్యక్తం చేశాడు. మంత్రి ఆలోచించి తరువాత చెప్తానన్నాడు. ఈలోపు ప్రజల వద్ద – ” ప్రజలారా ! ఎవరైనా రాజువద్దకు వచ్చి వారికి కావలసినంత భూమిని ఉచితంగా తీసుకోవచ్చు. ఐతే భూమి కావలసిన వారు సూర్యోదయం తాము ఎన్నుకున్న ప్రదేశం నుండి బయలుదేరి సూర్యాస్తమయానికి బయలుదేరిన ప్రదేశానికి చేరవలసి ఉంటుంది. ఇది రాజు గారి ఆజ్ఞ ” అని చాటింపు వేయించాడు.

అది విన్న రైతొకడు బుట్టెడు సున్నం, మధ్యాహ్నానికి భోజనం వెంట తెచ్చుకొని రాజు అనుమతి తీసుకొని భూమిని ఎంపిక చేసుకొనడానికి బయలుదేరాడు. తనకెంత భూమి కావలెనో తనలో తాను ప్రశ్నించుకున్నాడు. వెయ్యి ఎకరాలైన ఉండక పొతే చాలదు, ఇల్లు కట్టుకోవాలి, సేద్యం చేయాలి అనుకొన్నాడు. నడుస్తే ఎక్కువ దూరం పోలేనని పరుగెత్తడం ప్రారంభించాడు. తానే గాక తన భార్యా బిడ్డలు, వారి సంతానం మొత్తం ఏ వంద మందికో సరిపోయేంత ఆస్తి సంపాదించాలని బుద్ధి పుట్టింది. త్రోవలో గుర్తుగా సున్నం వేసుకుంటూ పరిగెత్తుతున్నాడు. అన్నం తింటే సమయం వృథా అవుతుందని తినకుండా పరిగెత్తుతున్నాడు. ఈ ఒక్క రోజు కష్టపడితే జీవితమంతా సుఖంగా ఉండవచ్చనుకున్నాడు. సూర్యాస్తమయం లోగా పరిమితి లేకుండా శక్తి ఉన్నంతా పరుగెత్తాలనుకున్నాడు సూర్యాస్తమయం కావచ్చింది. బయలుదేరిన ప్రదేశానికి చేరుకోవాలి. అందుకు శక్తినంతా కూడగట్టుకొని వేగంగా పరుగెత్తాడు. అలసట వల్ల గమ్య స్థానాన్ని చేరుకొనక మునుపే క్రింద పడి చనిపోయాడు. రాజు, మంత్రి రైతును వెదుకుతూ వెళ్లి ఒకచోట చనిపోయి పడివుండటాన్ని చూశారు. బంధువులు వచ్చి దుఃఖిస్తూ ఆ శవాన్ని ఆరు అడుగుల గుంతలో పూడ్చిపెట్టారు.  మంత్రి రాజుతో – ” రాజా ! ఆనాటి మీ సందేహానికి సమాధానం దొరికింది. మనిషి అత్యాశ చూశారుగా. తృప్తి లేనన్ని రోజులు మనిషికి సుఖం ఉండదు. చివరిగా మనిషికి కావలసినది అతన్ని పూడ్చటానికి ఆరడుగుల భూమి మాత్రమే చాలు ” అని సమాధానం చెప్పాడు. దీనిని బట్టి చూస్తే ప్రస్తుత కాలంలో యువత ధనం కోసం ఏ విధంగా పరుగులు తీస్తున్నది తెలుస్తుంది. అందుకే పరుగెత్తుతూ పాలు త్రాగేదానికన్న నిలబడి నీళ్ళ త్రాగేది మేలు అన్నారు మన పెద్దలు.

బంగారు బాతుగ్రుడ్డు కథ కూడా ఇటువంటిదే. ఒక వేటగాడికి ఒకరోజు ఎగిరే పిట్టలేవీ దొరకక నిరాశగా వెనుదిరిగి పోతున్నాడు. ఒక కొలనులో బాతు కనబడింది. దాన్ని పట్టుకొని ఆపూటకు తినేందుకు సరిపోయిందని ఆనందంగా ఇంటికి వచ్చాడు. దాని గొంతు కోయడానికి కత్తి తీయుసరికి ప్రతిరోజూ ఒక బంగారు గ్రుడ్డు ఇస్తానని తనను చంపవద్దని బాతు వేటగాడిని వేడుకొనింది. అన్న మాట ప్రకారమే బాతు రోజుకొక బంగారు గ్రుడ్డు వేటగాడికి ఇవ్వసాగింది. ఏ కష్టము లేకుండానే వాడట్లా రోజులు వెళ్ళదీస్తున్నాడు. కొద్దిరోజులకు  రోజుకొకటిస్తే ఎన్ని రోజులైనా ఇంతే, అట్లా కాక దీన్ని చంపి దీని కడుపులో ఎన్ని బంగారు గ్రుడ్లున్నాయో అన్నీ తీసేసుకుందామనే ఆలోచన వాడికి వచ్చింది. అంతే, బాతును చంపి పొట్ట చీల్చి చూశాడు. దాని కడుపులో ఒక్క గ్రుడ్డు కూడా కనబడలేదు. అప్పుడు వాడు చాలా  దుఃఖించాడు. అందుకే దురాశ దుఃఖమునకు చేటు అన్నారు పెద్దలు.

కాబట్టి దురాశకు పోకుండా ధనాన్ని ధర్మంగా సంపాదించి దానం చేయాలి. దానం చేసే వారిలో కర్ణుడు అగ్రగణ్యుడని మనకు తెలుసు. అర్జునుడు ఇంద్రుని అంశతో కుంతికి పుట్టినవాడు. అందువల్ల ఇంద్రునికి అర్జునుడంటే ఇష్టమెక్కువ. కర్ణుడు, అర్జునుడు కూడా ద్రోణాచార్యుని శిష్యులు. అర్జునునికి, కర్ణునికి విలువిద్యలో పోటీ ఎక్కువ. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి కర్ణునితో యుద్ధం చేయడం చాల కష్టమైంది. ఇందుకు కారణం కర్ణుని కవచకుండలాలు.దేవతల వరంతో కర్ణుడు పుట్టుకతోనే  కవచ కుండలాలు శరీరాన్ని అంటిపెట్టుకుని వచ్చేలా పుట్టాడు. అర్జునుడు కర్ణుని జయించాలంటే కర్ణునితో ఆ కవచకుండలాలు తీసివేయించాలి. ఇంద్రుడు బ్రాహ్మణుని వేషంలో కర్ణుని దగ్గరకు వెళ్లి కవచ కుండలాలను దానం చేయమని అడిగాడు. కర్ణుడు వెంటనే కవచ కుండలాలను కోసి దానం చేశాడు. అదే విధంగా దధీచి, బలి చక్రవర్తి , శిబి చక్రవర్తి, రంతి దేవుడు మొదలైన ఎంతో మంది మహానుభావులు దానగుణంతో శాశ్వత కీర్తిని పొందారు.

మఱి దానము, ధర్మము తరువాత ఉన్నది విద్య. విద్య ఎందుకు అని ఆలోచించినప్పుడు మన ఆలోచనలు కద్ది దూరం వఱకే వెళ్ళుతున్నాయి. గుడ్డలు నలగకుండా, చేతులకు మట్టి అంటకుండ ఫ్యాను క్రింద కూర్చొని సున్నితంగా చేసే ఉద్యోగాల కొఱకే విద్య అని చాల మంది అభిప్రాయం. విద్య జీవితాన్ని సుఖవంతం చేసుకొనడానికే కాక పేదరికాన్ని పోగొట్టడానికి, సంపద వృద్ధి చేసుకొనడానికి, మానవ సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి, నైతిక విలువలు కాపాడటానికి, దేశ సర్వతోముఖాభివృద్ధికి కూడా. విద్య ఎందుకు ? అనే ప్రశ్నలోనే విజ్ఞానమంతా ఉంది. నదికి రిజర్వాయరు కట్టడానికి కారణం నీటిని నిల్వచేసి కాలువల ద్వారా పంటలకు నీటిని ఉపయోగించుకొనడానికి.  విద్యను పొందడానికి ఆంతర్యం విజ్ఞానాన్ని బీరువాల నుండి తీసుకొని వచ్చి మెదడులో దాచడానికి కాదు, దానిని ఆచరణలో పెట్టి జీవనకార్యకలాపాలలో వినియోగించుకొనడానికి. విద్య విజ్ఞానాన్ని ఇస్తుంది. ఆచరణలో లేని విజ్ఞానం వ్యర్థం. నేడు సాంకేతిక విజ్ఞానం బాగా అభివృద్ధి చెందింది. రేడియో,టెలివిజన్,టెలిఫోన్ మొదలైన వాటిని మనిషి విజ్ఞానంతో తయారుచేశాడు. అదే విధంగా తదుపరి కూడా మనిషి విజ్ఞానం ప్రజోపయోగమైనదిగా ఉండాలి.

ఒకానొక ధనికుడు మంచి ఇల్లు కట్టాలనుకున్నాడు. అందుకోసం తన సేవకుని పిలచి కొంత ధనమిచ్చి గరుకుతనం లేకుండా నున్నగా ఉన్న మంచి కొయ్య స్తంభాలను కొనుక్కొనిరమ్మన్నాడు. సేవకుడు పల్లెలు,పట్టాణాలు అంతా తిరిగి తిరిగి ఎక్కడ చూసిన కొయ్య కొంత గరుకుగానే ఉండడంతో అవన్నీ తన యజమానికి పనికి రావని అనుకున్నాడు.అద్భుతమైన మంచి టేకు కొయ్యను కూడా పై కారణంగానే వదలిపెట్టాడు. చివరకు ఒక గ్రామంలో చిట్టచివరగా గల  అరటితోట పై అతని దృష్టి పడింది. ఆ అరటి స్థంభాలను చూసి ఆహా ! ఇవి ఎంత నున్నగా ఉన్నాయి. గరుకుతనం ఏ మాత్రం లేదు. మా యజమాని అదృష్టం పండింది. ఇక దీనిని వదలకూడదు అని దానికి ఎక్కువ వెల చెల్లించి అన్నింటినీ బండ్లమీదకు ఎక్కించి యజమాని దగ్గరకు తీసుకువెళ్ళాడు. యజమాని వాటిని చూసి ఏమిరా ! ఎందుకు పనికిరాని అరటిస్థంభాలు తెచ్చావు అనడిగాడు. అందుకతడు మీ అదృష్టం పండింది. చక్కని నునుపైన స్తంభాలు దొరికాయని చెప్పాడు. ధనికునికి కోపం వచ్చి ఒరేయ్! పై పైన   నునుపైన నునుపు చూసి తుచ్ఛమైన వస్తువుకు డబ్బులు తగలేశావు. దీనిలో సత్తువ లేదు. ఇది ఎందుకూ పనికిరాదని తిట్టాడు. ప్రాపంచిక జనుల ప్రస్తుత పరిస్థితి కూడా ఇదేలాగా ఉంది. విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోకుండా పై పై మెరుగులు చూసి మోసపోతున్నారు.

బాలలకు విద్య తరువాత కావలసినది క్రమశిక్షణ. విద్యార్థి దశలోనే పిల్లలకు మంచి క్రమశిక్షణ అలవడాలి. విద్య ఉన్నా క్రమశిక్షణ లేకపోతే మనిషి నీచ స్థితికి దిగాజారిపోతాడు. అతడిని ఎవరూ గొప్పగా అనుకోరు,ఆదరించరు. ఉదా:- రావణాసురుడు సకలశాస్త్ర నిష్ణాత. అయినప్పటికీ పరస్తీ వ్యామోహం వల్ల చెడ్డవాడుగా కీర్తింపబడ్డాడు. ఒకసారి చెడ్డపేరు వచ్చిందంటే అది ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోతుంది. సంఘం ఆ చెడ్డపేరు గలవాడి చేడుపనులను మరచిపోదు. ఉదా:-

ఒకానొక గ్రామంలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి సోముడు అని ఒక్కగానొక్క కొడుకు. సోముని బాల్యంలోనే అతని తల్లి చనిపోవడంతో రామయ్య సోముని గారాబుగా పెంచాడు. అందువల్ల సోముడు అల్లరివాడుగా తయారయ్యాడు. ఏ పని లేకుండా ఊరంతా తిరుగుతూ,చీటికీ మాటికీ ఊర్లో అందరితో గొడవపడుతూ ఆ తగువులు ఇంటిమీదకు తెచ్చేవాడు. రామయ్య తనమంచి మాటలతో వారిని సాగనంపేవాడు. వారు వెళ్ళిన తరువాత తనింటి తలుపుకు ఒక మేకు కొట్టేవాడు. కానీ కొడుకును మాత్రం ఏమనేవాడు కాదు. ఇట్లా సోముడు ఇంటిమీదకు తగువులు తెస్తుండటం, రామయ్య తలుపుకు మేకులు కొడుతుండటంతో కొద్దిరోజులకు తలుపంతా మేకులతో నిండిపోయింది. దీనినంత గమనిస్తుండిన సోముడు తలుపుకు మేకులు ఎందుకు కొట్టావని తండ్రినడిగాడు. అప్పుడాయన – ” నాయన ! నీవు తగవులు యింటి మీదకు తచ్చినప్పుడంతా తలుపుకు ఒకమేకు కొడుతూ వస్తున్నాను ” అన్నాడు. ఐతే నేను తగువులు ఇంటిమీదకు తేవడం మానేస్తే మేకులు తీసేస్తావా అనడిగాడు సోముడు. నిన్ను ప్రజలు ఒక్కొక సారి పొగిడినప్పుడు ఒక్కొక్క మేకు తీసివేస్తానని ఆయనన్నాడు. అతడు కొద్దిరోజులు శ్రమించి ప్రజలతో సోముడు మంచివాడుగా మారాడనిపించుకున్నాడు. ప్రజలు సోముడిని పొగడినప్పుడంతా తలుపుకున్న ఒక్కొక్క మేకు తీసివేస్తూ వచ్చాడు రామయ్య. కొద్దిరోజులకు తలుపంతా మేకులు లేకుండా తయారయినది కానీ మేకులు కొట్టిన రంధ్రాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. దీనిని  చూసి సోముడు – “నాన్న ! నేను మంచివాడుగా పేరు గడించాను, నీవు తలుపుకున్న మేకులు తీసివేశావు. కానీ తలుపుకు రంధ్రాలు మాత్రం అలాగే ఉన్నాయి, ఎట్లా ? ” అని ప్రశ్నించాడు. అందుకు రామయ్య – ”  బాబు ! నీవు మంచిపేరు తెచ్చుకునే వేళకు తలుపుకున్న మేకులు తీసివేసినది నిజమే, తలుపుకు రంధ్రాలు ఉండటం నిజమే. తలుపుకు రంధ్రాలు నిలచినట్లే నీవు చేసిన చెడుపనులు కూడా ప్రజలలో నాటుకొని ఉంటాయి. ప్రజలు దానిని మరువరు ” అని చెప్పాడు. అది విన్న సోముడు తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడ్డాడు.      కాబట్టి చిన్న వయసులోనే క్రమశిక్షణ అలవరచుకొంటే తరువాత చింతించవలసిన అవసరం ఉండదు.

ఇంత వఱకు మనం దానం, ధర్మం,విద్య క్రమశిక్షణ గుఱించి తెలుసుకున్నాం. తరువాత సంఘంలో బ్రతకటానికి ధైర్యం కావాలి. ధైర్యం లేనివాడు ఏ పని చేయలేడు. ఒక పెద్దమనిషి తన ఐదేళ్ళ కొడుకుతో చచ్చిన పామును కఱ్ఱతో కొట్టిస్తున్నాడు. ఎలాగు చచ్చింది కదా, దాన్ని మరల కఱ్ఱతో కొట్టిస్తున్నావెందు?కని  దారిన పోయేవారడిగారు. మా అబ్బాయిలో భయం పోవడానికి అలా చేస్తున్నాను, ఇప్పుడు చచ్చిన పామును కొడితే పెద్దవాడైనప్పుడు బ్రతికిన పామును చంపగలడని సమాధానమిచ్చాడాయన. ఆయన మాటలలో సత్యం ఉంది.

మనదేశంలో పెద్దలు పిల్లలను ఇప్పుడిప్పుడు అన్నం పెట్టి కాక భయపెట్టి సాకుతున్నారు. క్రొత్త వారితో మాట్లాడాలన్నా,స్వగ్రామం వదలి దూరదేశం వెళ్ళాలన్నా, నీరు చూసినా,నెత్తురు చూసినా అన్నిటికీ భయం,భయం. భయాన్ని గుఱించి చమత్కారమైన ఒక కథ ఉంది. ఒక గ్రామంలో కలరా వచ్చి చాలామంది చనిపోయారు. ఒక సన్యాసి ఆ గ్రామానికి వచ్చి తిరిగి వెళ్ళుతూ దారిలో కనబడిన కలరా దేవతను ఎందరిని చంపావని అడిగాడు. అప్పుడామె నేను చంపినది పదిమందిని మాత్రమే అని బదులిచ్చింది. వందకు పైగా చనిపోయినట్లు విన్నానే నిజం చెప్పు అని సన్యాసి అడిగాడు. అందుకు కలరా దేవత – నిజంగానే నేను చంపినది పదిమందిని మాత్రమే, తక్కిన వారంతా భయం వల్ల చనిపోయారని చెప్పింది. అలా ఉంటుంది మనలో జీర్ణించుకుపోయిన భయం. భయాన్ని తొలగించుకుంటే తప్ప మన దేశం ప్రపంచంలో అభివృద్ది చెందిన దేశంగా మార్పు చెందదు.

                         పై కథలనన్నింటినీ గమనిస్తే పెద్దలమాట ,సద్దిమూట అనే సామెత నిజమని తేలుతుంది. లోక వ్యవహారం తెలుసుకోవాలంటే సాహిత్యం అవసరం. బామ్మలు , తాతయ్యలు పిల్లలకు కథలు చెప్పేది అందుకోసమే. ఇటువంటి బాలల కథా సాహిత్యంతోనే మానవతా విలువలను పెంపొందించుకోవచ్చు. అంటే కాక మానవ జీవన వికాసానికి తోడ్పడే ఒక గొప్ప ప్రక్రియ బాలల కథా సాహిత్యం.

 

1 thought on “బాలల కథా సాహిత్యంలో మానవతా విలువలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *