May 26, 2024

‘భరతముని భూలోక పర్యటన’….

రచన: ఉమాభారతి

త్రేతా యుగములో, నాలుగు వేదముల నుండి నాలుగు నాట్యాంగములను గ్రహించి,  బ్రహ్మదేవుడు ‘నాట్యవేదము’ నిర్మించెనని ‘నాట్యశాస్త్రము’ చెబుతుంది.  ఐదవ వేదంగా సృష్టించబడిన నాట్యశాస్త్రాన్ని  దేవతలతో పోరాడి శివుని అనుగ్రహంతో మానవకోటికి అందించిన వాడు భరతముని.

‘దుఃఖార్తానాం శ్రామార్తానాం శోకార్తానాం తపస్వినాం

లోకోపదేశజననం కాలే నాట్య మేత ద్భవిష్యతి’

‘నాట్యము’ ఉపదేశాత్మకమే  కాక,  హితమును, ధైర్యమును, క్రీడను, సుఖమును కూడా కలిగించుననీ, దుఃఖార్తులకు, శ్రమార్తులకు, శోకార్తులకు, దీనులకు, విశ్రాంతి కలిగించునని ‘నాట్యశాస్త్రము’ నందు సూచింపబడినది. ఇంకనూ, భావ రాగా తాళ సమ్మేళనమై, త్రైలోక్య అనుకరణమై, మనసుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగింప జేసే నవరస భరితమయిన కళ, ‘నాట్యమే’ నని బ్రహ్మదేవునిచే వివరించబడినది. (నాట్యశాస్త్రము-నాట్యోత్పత్తి)

***

పలు యుగాల అనంతరం, భూలోకాన మానవులు నాట్యవేదాన్ని ఎంత మాత్రం సద్వినియోగ పరుస్తున్నారో  చూద్దామని, స్వర్గలోకాన ఉన్న భరతమునికి  ఓ ఆలోచన కలిగింది.  దానికి రెండు కారణాలు : ఆంధ్రదేశాన ‘నాట్యం’ యొక్క తీరు తెన్నుల్లో చిత్ర  విచిత్ర మైన మార్పులు వచ్చాయని వినడం వల్ల కొంత, స్వర్గలోకంలో నండూరి వారి భావగీతాలు – ఎంకి – జానపద నృత్య రీతి వర్ణనలు విని మరికొంత ఆసక్తి పెరిగింది.

మొత్తానికి మహాశివుని అనుమతితో, తన భూలోక పర్యటనకి ముహూర్తం పెట్టాడు భరతముని.  ఆయనికి సహాయంగా ‘నర్తకి’ అనే కళాకారిణి.  ఆవిడ పుడమిన, నృత్య కళాకారిణిగా పేరు ప్రతిష్టలు గడించి, ఓ మంచి జీవనాన్ని సాగించిన పిదప, స్వర్గం చేరి భరతమునికి సహాయకురాలిగా  పదవి చేపట్టింది.  ప్రస్తుత భూలోక పద్ధతీ మర్యాదలు బాగా తెలిసిన మనిషి కూడా కావడంతో, తన వెంట ‘భూలోక పర్యటనకి’, నర్తకినే ఎంచుకున్నాడు భరతముని. అనుకున్న ప్రకారం, నిర్దేశించిన ముహూర్తానికే  ‘భూలోక పర్యటన’కి బయలుదేరారు భరతముని, నర్తకి.  అలా పుష్పక విమాణంలో పయనించి  శివరాత్రి పర్వదినాన, అర్ధరాత్రి సమయానికి, వారిరువురు శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో ఆగారు. భక్తకోటి జాగరణ కోసం, భజన, హరికథ, ‘శివలీల’ నృత్య నాటిక, మొదలైన ప్రదర్శనలు మహా జోరుగా సాగుతున్నాయి.  అందమైన నృత్య కళాకారిణులు కొందరు శివతాండవ నృత్యము, రావణబ్రహ్మ నటనము వంటి అంశాలు ప్రదర్శించారు.  ఆలయ ప్రాంగణంలో అదృశ్యంగానే ఉండి, ఆ దృశ్యాలని తిలకిస్తూ “సౌందర్య కళా నైపుణ్యంతో యువ  నర్తకీమణులు, ఇలా భావ రాగ తాళ యుక్తముగా నర్తించుచున్న దృశ్యము కంటే, సుందరమైనది  ఈ ప్రకృతిలో వేరు లేదేమో!” అంటూ ఆ అద్భుతమైన నాట్యాన్ని, ఆ మధుర గానాన్ని మెచ్చుకుంటూ, తిరిగి పుష్పక విమాణంలో బయలు దేరారు భరతముని, నర్తకి.

***

స్వర్గాన నండూరి వారి భావ గీతాలు, ఎంకి వర్ణనలు ఆలకించి,  ఆనందించిన భరతముని, ఆంధ్రదేశానికి  ఆయువు  పట్టైన  పల్లెసీమల  వైపు మళ్ళించాడు పుష్పక విమానాన్ని.  ఆ పచ్చని పోలాలవైపు చల్లగా, హాయిగా ప్రయాణం చేస్తున్న సమయంలో, ఆడుతూ పాడుతూ పని చేసుకొంటున్న పల్లె  పడుచులు  కొందరు, చక్కని  జానపద  గీతాలని ఆలపిస్తూ, మరికొందరు, వీరి  పాటలకి  లయబద్దంగా  అడుగులు  వేస్తూ వయ్యారులు ఇంకొందరు  భరతుని  కంటపడ్డారు.   అలుపనేది  తెలియకుండా  పాడుకొంటున్న వారి జానపదాలకి, వారి పల్లెతనపు వేషధారణకి  ముగ్ధుడయ్యాడు భరతముని. ఆయనలోని కళా హృదయం స్పందించి కవిత్వం పెల్లుబికింది ……

ముద్దుల మోమున బొట్టెట్టి

చక్కని చెక్కిట చుక్కెట్టి

నింగిన కదిలే జాబిల్లీ

మనసున విరిసే మరుమల్లే

సిరిగల జుత్తును సిగగట్టి

సన్నని నడుముకు గొలుసెట్టి

పుడమిన ఆడే చిరునెమలి

జగతిన నిండిన వెన్నెలలే

తామర కన్నుల కాటుకెట్టి

మెత్తని పదముల మువ్వలెట్టి

చిరుసిరి నగవులు చిందించి

నటనల నర్తన మాడేలే

అంటూ సాగి, ఆయన గళం నుండి వెలువడిన చక్కని కవితకి, నర్తకి ముగ్దురాలయ్యింది..

“స్వర్గంలో రంభ ఊర్వశులు,  ముక్కెరలు, మంజీరాలు, పట్టు పీతాంబరాలు ధరించి సాంప్రదాయ నృత్యాలు చేస్తారే తప్ప, ఇలా కాళ్ళకి కడియాలు, మోకాళ్ళ వరకు చేలములు, కొప్పు చుట్టూ బంతిపూలు అలంకరించరు కదా! భావగీతాలకి అడుగులు వేయరు కదా! ఎంకి తీరులోనూ, జానపద రీతిలోనూ నవ్యత ఉంది సుమా!” అంటూ భరతముని నర్తకితో పాటు మళ్లీ పుష్పక విమాణంలో బయలు దేరాడు…

తెలుగు వారు సాంప్రదాయ నృత్య కార్యక్రమాల్లో కొంత జానపద నృత్యం కూడా చేస్తూ ఉంటారని, ప్రజాదరణ పొందిన జానపదాల్లో ‘మొక్కజొన్న తోటలో’ అంటూ సాగే ఓ ఎంకి పాటకి నృత్యం ఆహ్లాదకరంగా ఉంటుందని నర్తకి వివరించింది.

***

ఈసారి కళలకి పుట్టిలైన మద్రాసు (చెన్నై) మహానగరం వైపు దారి తీసి, సరాసరి ‘వాహిని’  సినీ నిర్మాణ స్టూడియోలో దిగారు. బాల గాయకుల కోసం చిత్ర నిర్మాతలు ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు.  అంతటా కోలాహలం.  ఎందరో బాల బాలికలు ఆ పోటీలో పాల్గొన్నారు.  చక్కగా  పాడుతున్నారు. వాళ్ళ తల్లితండ్రుల్లో కూడా ఎంతో ఉత్సాహం కనబడింది భరతమునికి.  ప్రత్యేకంగా  ఓ  పదేళ్ళ కుర్రవాడు, ‘పల్లెకు పోదాం, పారుని చూదాం’  అంటూ తానెంచుకొన్న చక్కని పాట ఆలపించి  ఆ పోటిలో నెగ్గి అందరి  అభిమానం పొందాడు.  “బ్రహ్మం గారు చెప్పినట్టు కలియుగాంతానికి ప్రతీ ఇంట ఈ పాటా, ఆటా ఉన్నాయన్నమాట. లలిత కళలన్నా, నాట్య సంగీతాలన్నా ప్రజలకి ఇంత ఆశక్తీ, మక్కువన్నమాటే.  బాగానే ఉంది, నర్తకీ!,”

అంటూ కళాభిమానులైన అక్కడి వారిని  ప్రశంసిస్తూ, నర్తకితో ముందుకు సాగాడు భరతముని.

కొంత దూరంలోనే  మరోప్రక్క, బారులుగా నర్తకులు, కాస్త విభిన్నంగా చేస్తున్న నృత్య దృశ్యాలని చిత్రీకరించడం చూసారు వారివురు .అవి నూతన నాట్యరీతులనీ, అవి నృత్య వేదికలపై ప్రదర్శనలకి కాక,  తెరపై  చూసే వినోదానికి, అంటే  సినిమాకే  పరిమితమని వివరించింది నర్తకి.

అటనుండి వెడలి చెన్నై పట్టణమంతా తిరుగుతూ, అక్కడ జరిగే ఎన్నో నృత్య ప్రదర్శనలు, సంగీత సాధనములు, అలాగే సర్వోపనిషత్సారమైన భగవద్గీత ప్రబోధనలు ఆలకించి, తిలకించి, ఆనందించి, నాట్య, కళా రంగాలలో క్రమంగా చోటు చేసుకుంటున్న మార్పులగురించి నర్తకితో ప్రస్తావిస్తూ, ప్రయాణం సాగించాడు భరతముని.

“నాట్య సంగీతాలకి కూడా ఎదుగూ బొదుగూ ఉండాల్సిందే! కళ అనేది కాలానుగుణంగా పద్ధతిననుసరించి, పరిధిలోనే ఉంటూ కళాత్మకమైన మార్పులని సంతరించుకోక తప్పదు మరీ,”  అన్న భరతముని విశ్లేషణ నచ్చింది నర్తకికి. “భావంలో, గీతంలో, నాట్యంలో నవ్యత రావాల్సిందే  కదా!,

బాగుంది బాగుంది,” అని అయన అనడం విశేషం అని నర్తకి భావించింది.

***

సంక్రాంతి చలిలో, అలా వారి పయనం సరదాగానే సాగి విజయనగరం చేరారు.  విజయనగరం లోని కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణం భక్తులతో,  సంక్రాంతి సంబరాలతో, కిట కిటలాడుతున్న సాయం సమయమది.  సంక్రాంతికి  పిల్లల బోగి పళ్ళు, పెద్దవాళ్ళ గారాబాలు, దేవెనలు అన్నీ  తిలకించారు భరతముని, నర్తకి.  ఆ రోజు సంక్రాంతి పండుగ వేడుకల్లో భాగంగా,  నాయనమ్మ చుట్టూ చేరి మనవలూ, మనవరాళ్ళూ పాడుతూ ఆడుతూ గింగిరాలు తిరగడం చూసి చాలా ముచ్చటేసింది వారివురికీ.

“నాయనమ్మా, నాయనమ్మా వాడని ప్రేమే నీదమ్మ,

అమ్మ నాన్న కొట్టినప్పుడు, ఆదరించి, నను లాలించేవు

అడగక ముందే అన్నీ ఇచ్చి దేవతలాగా దీవించేవు”

అన్న పాటకి  పిల్లలు  వారి నానమ్మల కోసం చక్కగా అడుగులు వేయడం నచ్చింది  భరతమునికి.  ఇదంతా ప్రతి సంక్రాంతికి ఆ గుడి ఆవరణలో ఆ చుట్టు ప్రక్కల కుటుంబాలన్నీ కలిసి జరుపుకొనే సంబరమని, ఆయనకి వివరించింది నర్తకి.   తీర్ధ  ప్రసాదాలనంతరం తిరిగి  పుష్పకంలో

బయలు  దేరారు వారిరువురు.

***

పిదప,  హైదరాబాద్ మహా నగరంలోని అధునాతన నృత్యరీతులందు శిక్షణనిచ్చు స్టూడియోలో అడుగిడిన భరతముని,

సంబ్రమాశ్చర్యాల్లో  మునిగాడు.  అధునాతన దుస్తులు, అలంకరణలు, కదలికలు, గమ్మత్తైన సంగీతం,  గమనిస్తూ  ఆలోచనలో పడ్డాడాయన.

“నాట్యము దేశ, కాల, పాత్ర బద్ధమై  ఉండదని ‘నాట్యశాస్త్రము’ లోనే ప్రస్తావించాము కదా!,   మరి  మారుతున్న  కాలాలు,  చోటు చేసుకొంటున్నమార్పులు, కలిసిపోతున్న సంస్కృతుల ననుసరించి మార్పు తప్పదు కదా!  మార్పు  మంచిది  కావచ్చు  కూడా  నర్తకీ,” అంటూ సాగిపోయాడు భరత ముని.

అదే సంగతిపై  కొనసాగిస్తూ “నాట్యాన్ని ఆధారం చేసుకొని పాశ్చాత్య దేశాల్లో, ఆరోగ్యం మెరుగుదల కోసం వ్యాయామ పరంగా, ఎంతో వినియోగం ఉన్న కార్యక్రమాలు పెద్దెత్తున జరగడం, గమనించి, ప్రశంసించ వలసిందే, గురువుగారూ,”   అని నర్తకి మరో తాజా  సమాచారం అందించింది.

“అంతే కాదు, ’జూంబా’ (Zumba), ‘డిస్కో కార్డియో’ (Disco Cardio), లాంటి వ్యాయామ పద్ధతులకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నృత్య రీతులే ఆధారమయ్యాయి,” అంటూ ముగించింది.

ఎంతో ఉత్సుకతతో వింటూ అంతా గమినిస్తున్న భరతమునితో, నర్తకి, ”అంతే కాదు మునివర్యా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరెన్నో

నృత్యరీతుల్ని, నాట్య పరమైన ఎన్నో విశేషాలు, విషయాలు తెలుసుకోను, మనం వీలు చేసుకొని మరోసారి, మరో పర్యటన చేయవచ్చు,” అంటూ నింపాదిగా అటనుండి కదిలింది నర్తకి, భరతముని ననుసరిస్తూ.  “కాకపోతే , ఈ సారి పర్యటన అంటూ చేసినప్పుడు, అదృశ్యంగా కాకుండా, అన్నీ ప్రత్యక్షంగా తిలకించవలె  నర్తకీ ”  అన్నాడు చిరునవ్వుతో భరతముని.

ఇలా మరో వారం పాటు కోనసీమంతా,  ప్రయాణించి,  తిరిగి స్వర్గలోకం వెళ్ళాలని నిశ్చయించుకొని,  కాసేపు విశ్రాంతి కోసం,  మైసూర్ లోని బృందావనం వైపు పుష్పకం మళ్ళించాడు భరతముని.

వారి పర్యటన ఇలా కొనసాగుతూనే ఉంటుంది………..

 

************************************************

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *