April 22, 2024

మహాభాగ్యం

రచన: ఆదూరి హైమవతి

” బాబయ్యగారూ! మీ కారు క్షణంలో మెరిసిపోయేలా తుడుస్తాను, మీ బూట్లకు కొత్తవాటిలా పాలిష్ చేస్తాను ,ఒక్కపదిరూపాయలు ఇప్పించండి,నిన్నటినుండీ జబ్బుగాఉన్నఅమ్మ,చూపులేని తమ్ముడు , నడవలేని అక్కఆకలితో నీరసించి పోతున్నారు. కనికరించండి బాబయ్యా! ” అంటూ మండిపోయే ఎండలో కాళ్ళకు చెప్పులు కూడాలేకుండా, కారు దగ్గరకొచ్చి బ్రతిమాలాడు డాక్టర్ రామనాధాన్ని  పన్నెండేళ్ళ పిల్లవాడు.

డాక్టర్ రామనాధం వింతగా  ఆ బాలుడికేసి చూసి ” ఏరా! కాళ్ళు కాలడం లేదా? అలా ఎండలో నిల్చున్నావ్ ?” అని అడిగాడు.
” బాబయ్యా! కడుపులో మంటముందు కాళ్ళమంట తెలీదయ్యా!” అని జవాబిచ్చాడు పేలవంగానవ్వుతూ..
” ఇంతకూ కారు కడిగించుకుని నీకు పది రూపాయలివ్వమంటావ్ ! అంతేనా?” డాక్టర్ రామనాధం అడిగాడు.
” ఔను బాబయ్యా ! మీ బూట్లకు కూడా పాలిష్ చేస్తాను “అంటూనే తన సంచీలోంచీ బూట్ పాలిష్, పాతగుడ్డ , బ్రష్ బయటికి తీశాడు వాడు.

” నీపేరేంటోయ్!” జాలిగా వాడ్ని చూస్తూ అన్నాడు రామనాధం .

” పేరేంటైతేనేంలే బాబయ్యా! పేరుపెట్టినోడు పారిపోయిండు, పేగు తెంచుకుకన్నతల్లి కదల్లేదు కారు తుడిపించుకుని కాసులివ్వండి బాబయ్యా! ” పేరు చెప్పకుండానే నిరాశగానిట్టూరుస్తూనే బ్రతిమాలాడు వాడు.

అవన్నీ వద్దులేకానీ ఇంద పదిరూపాయలు తీసుకో ” అంటూ పది రూపాయలు ఇవ్వజూపిన రామనాధంతో…

” వద్దు బాబయ్యా ! పని చేయందే డబ్బు తీసు కోను .” అంటూ ఖచ్చితంగా చెపుతున్న ఆ పిల్లవాడ్ని నిశితంగా చూశాడు రామనాధం.

ఉంగరాల జుట్టుతో, పఛ్ఛనిమేనిఛాయతో , చురుకైన కళ్ళతో ఆకర్షణీయంగా ఉన్న వాడిని చూస్తూ

” సరే ! బూట్ పాలిష్ చేసి ,కారు తుడిచి,డబ్బుతీసుకో ” అని తన కాళ్ళ బూట్ తీసి ఇచ్చాడు రామనాధం.వాడు జాగ్రత్తగా గుడ్డతో దుమ్ము దులిపి చక చకా పాలిష్ చేసి చొక్కతో పాలిష్ ఆరిందో లేదో తుడిచి చూసి , రామనాధం  ముందు ఉంచి ” చూడండి బాబయ్యా ! మెరవడంలేదూ?  ఈ గోపీగాడు చేశాడంటే అంతే మరి.”అన్నాడు ఆనందంతో మెరిసేకళ్ళతో.

” ఐతే నీపేరు ‘గోపీ ‘అన్నమాట ! ఔనా!” చూశావా నీ పేరు కనిపెట్టేశాను అన్నట్లు అడిగాడు రామనాధం. .
“భలే కనిపెట్టేశారు బాబయ్యా ! మీరు అలాగే కూర్చోనుండండి, నేను క్షణంలో మీ కారు’ కొత్తదా! అనిపించేలా తుడిచేస్తాను.”అంటూ గబగబా తనవద్ద ఉన్న ప్లాస్టిక్ బకెట్ తో గుడివద్ద ఉన్న బావి నుండీ నీరు తోడి తెచ్చి కారుతుడవడంలో లీనమైపోయాడు. పదినిముషాల్లో కారు తళ తళ లాడింది.

” చూశారా బాబయ్యా! మీ కారు కొత్తదిలా లేదూ?” ఆకారు యజమాని తనపనిని మెచ్చుకునోవాలని మెరిసేకళ్ళతో అన్నాడు గోపి.

” ఔను గోపీ ! క్రొత్త కారులాఉంది. ఇంద ఈపాతికా తీసుకో !” అంటూ డబ్బిస్తున్న రామనాధం వైపు ఆశ్చర్యంగా చూస్తూ ,
” అదేంటి బాబయ్యా! పాతిక రూపాయలు ఇస్తున్నారు ? పదేగా..” అంటున్న గోపితో

” గోపీ ! నీవు పనులు చక్కగా చేసినందుకు బోనస్ , సరా! తీసుకో , ఈ డబ్బుతో ఏంచేస్తావు?” కుతూహలం అణచుకోలేక అడిగాడు రామనాధం
” ముందు బన్ రొట్టెలు కొని మా అమ్మకు , అక్కకు , తమ్ముడికి పెడతాను.ఎంతోకాలంగా మా తమ్ముడు ఆపిల్ పండు కావాలని అడుగుతున్నాడు. వాడి కోరిక తీర్చుతాను. ఇదంతా మీదయ వల్ల బాబయ్యా!” అని తన పాదాలకు నమస్కరిస్తున్న గోపీని చూసి ” గోపీ మీ నాన్న ఎక్కడ? ఏంచేస్తుంటాడు?”
” అడక్కండి బాబయ్యా ! ఇందాకే చెప్పాగదా!మమ్మల్నిలా వదిలేసి తన మానాన తాను వెళ్ళి పోయాడు ” అంటున్న వాడి  ముఖం  ఎఱ్ఱగా జేవురించడం చూసిన రామనాధం ఆశ్చర్య పోయి సంభాషణ మరలించి ” సరే గోపీ ! వస్తాను , రేపు కూడా నా కారు కడిగి పెడతావుకదా?” అని కారు స్టార్ట్  చేసి వెళ్ళి పోయాడు రామనాధం.
మరునాడు కూడ అలా పనులు చేయించుకుని పాతిక రూపాయలు ఇచ్చిఒక చెప్పుల జత కూడా ఇచ్చాడు రామనాధం వాడికి. ” బాబయ్యా ! ఇంకొంచెం చిన్నదైతే మా తమ్ముడికి సరిపోయేది , ఈ జత వాడికి పెద్దదౌతుంది బాబయ్యా!” అంటున్న వాడిలోని భాతృ ప్రేమకు రామనాధం గుండె కదిలింది.

“ఇది నీవు వాడుకోరా!ఇలా ఉత్తికాళ్ళతో ఎండనపడి నడుస్తున్నావుగా! నీ తమ్మునికి మరోటి తెచ్చిస్తాన్లే  !” అన్నాడు రామనాధం.

” కాదు బాబయ్యా! ముందు వాడికి కాళ్ళ చెప్పులుకొన్నాకే నేనేసుకునేది! ఈ జతెక్కడ కొన్నారో చెప్పండి బాబయ్యా! నే నెళ్ళి మార్చి వాడికిస్తా.” అంటున్న గోపీ తెలివిని రామనాధం మనస్సులోనే మెచ్చుకున్నాడు.

“మరునాడు రామనాధం వాడికి మరో జత చెప్పులు తెచ్చి ఇచ్చాడు.” ఇంద గోపీ ! ఈ జత నీ తమ్మునికివ్వు.” అంటూ కవర్లోంచీ కొత్త చెప్పుల జత తీసి ఇచ్చాడు రామనాధం.

” బాబయ్యా! మన్నిం చండి ఇలా ఊరికే మీరు ఇస్తుంటే నాకు బావులేదయ్యా! మా అమ్మ ఊరికే ఏదీ తీసుకోవద్దని చెప్పింది , పని చేయించుకుని ఇవ్వండి. అపరిగ్రహం వద్దయ్యా!” అన్నాడు వినయంగా గోపి చేతులు కట్టుకుని తలవంచుకుని.

” ఓరినీ! నీకివన్నీ ఎలా తెల్సురా! పెద్దమాటలు అంటున్నావ్!” ఆశ్చర్యంగా అడిగిన రామనాధంతో,

“.” బాబయ్యా ! చదువంటే నాకెంతో ఇష్టం .మా అమ్మకు జబ్బు చేయకముందు తానే పనిచేసి నన్ను బడికి పంపేది.ఆ చదువు మరిచి పోకుండా మధ్యాహ్నంపూట సర్కార్ బడి కిటికీ వద్ద చేరి రహస్యంగా వింటుంటాను.లోనికి రానివ్వరు కదా!  అప్పుడు చదివిన పుస్తకాలు దాచుకుని రాత్రులు వీధి లైటు క్రింద చదువుకుంటుంటాను బాబయ్యా!మర్చిపోతానని” సిగ్గుపడుతూ చెప్పాడు గోపి.

” నీకు చదువంటే అంతిష్టమా గోపీ! ” మెల్లిగా అడిగాడు రామనాధం.

” ఔను బాబయ్యా! ఐతే నాకా అదృష్టం లేదు, నేను పనిచేస్తేనే మా ఇంట్లో అందరి కడుపులూ నిండేది.ఈజన్మ కింతే బాబయ్యా!” దిగులుగా అన్నాడు గోపి.

” గోపీ! నిన్ను నేను చదివిస్తాను నీవు బడికెళ్ళిచదువువుకుంటావా!?” అని అడిగాడు రామనాధం

అవన్నీ డబ్బున్న మారాజులకయ్యా! మాలాంటోళ్ళకు కడుపుకింత బువ్వదొరికే దేగొప్ప,ఇక చదవులెక్కడ?”

“గోపీ నీకు ఒక ఉద్యోగo ఇస్తాను వస్తావా నాతో?”

“అప్పుడు బాగా నీకిష్ట మైన  చదువు చదవొచ్చు. “

” అమ్మో!బాబయ్యా!కదల్లేని మా అమ్మకెవరు రొట్టెలు తెచ్చిఇస్తారు? అవిటిదైన మా అక్కనెవరు చూస్తారు?కళ్ళు లేని మా తమ్ముడికెవరు దిక్కు? వారిని వదలి మానాన్నలాగా నేనూ వెళ్ళి పోనా? రాను బాబయ్యా రాను.” భయంగా అన్నాడు  గోపీ ఓ వైపు తమను వదిలేసిపోయిన తండ్రిపై కసి కోపం వాడి మాటల్లో వినిపిస్తూనే ఉంది.
” అదికాదు గోపీ!నీవు ప్రతిరోజూ మీవాళ్ళను కలవచ్చు,మీ అమ్మకు అక్కకూ నేను వైద్యం చేయిస్తాను, మీ తమ్ముడికి కళ్ళు వస్తాయేమో చూద్దాం , నేను డాక్టర్ను తెల్సా?” ధైర్యం చెప్తున్నట్లు అడిగాడు డా.రామనాధం
” మీరు వైద్యులా బాబయ్యా! చెప్పారు కారే !మా అమ్మకు నయమైతే చాలు. ఆమే అందరినీ చూసుకుంటుంది. నేను ఎంచక్కా బడికెళ్ళి  చదివి ఉద్యోగంచేసి మావాళ్ళందర్నీ సాకుతాను.మా తమ్ముడికి ముందు కళ్ళుండేవి బాబయ్యా !వాడికి టపాకాయలంటే మహా ఇష్టం,ఒక దీపావళినాడు దేవాలయం వద్ద కాల్చుతున్న చిచ్చుబుడ్డికి దగ్గరగా వెళ్ళడం వలన  ఆ  రవ్వలు కళ్ళలోపడి చూపుపోయింది.వాడికి చూపు వస్తుందా బాబయ్యా?” ఆశగా అడుగుతున్న గోపీని చూసి రామనాధానికి ఎంతో ముచ్చటేసింది.   ” గోపీ పద మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మను చూద్దాం.రా కారెక్కు.” అంటున్న రామనాధాన్ని దేవునిలా చూశాడు గోపీ.

” బాబయ్యా ! నా మురికిగుడ్డలతో కారెందుకుగానీ,తమరు పదండి గుడివెనక ఉన్నకాలనీలోమూడో వీధిలో ఆరో గుడిసె మాది. నేను వెనకాలే క్షణంలో పరుగు తీస్తాను ” .
” గోపీ !నీవేగా కారు తుడుస్తావ్ మురికైతే! పైగా మీ ఇల్లు నేను తెల్సుకోడం కష్టం రా రా ఎక్కు ” అని వాడిని రెట్ట పట్టి కారెక్కించి బయల్దేరాడు రామనాధం. దార్లో చాలా పండ్లు,బిస్కెట్స్ కొన్నాడు రామనాధం.  కారు పోయే దారిలేక దూరంగా కారు ఆపి తాను కొన్నవన్నీ పెట్టిన బుట్ట పట్టుకుని గోపీ వెంట నడిచాడు.

అది ఇల్లు అనడం కంటే  కప్పులేని ఒక పందిరి అనడం మేలు.” అమ్మా! ఎవరొచ్చారో చూడు.! బాబుగారు నే చెప్పానే ఆయన ” అంటూ పరిచయంచేశాడు గోపీ రామనాధాన్ని .కూర్చు నేందుకు  ఒక బండరాయి దులిపి చూపాడు గోపీ” బాబయ్యా ! మాఇంట్లో ఇదే కుర్చీ.  ”

రామనాధం కూర్చుని తాను తెచ్చిన  పండ్లు, బిస్కెట్స్ అన్నీ గోపీతల్లి వెంకమ్మకు ఇచ్చి,  ” అమ్మా! మీ గోపీ చాలామంచి వాడు, నిజాయితీ పరుడు ,ఇలాంటివాడికోసమే నేను వెదుకుతున్నాను. మా ఇంటికి ఉదయాన్నే  ప్రతిరోజూవచ్చి  సాయంకాలంవరకూ ఉండి వస్తే చాలు. మా పిల్లలకు స్నేహితులెవ్వరూ లేరు.వారితో  మాట్లాడి ఆడుకుని సాయంకాలానికి వచ్చి మీతోనే ఉంటాడు.దీనికి నేను జీతం ఇస్తాను, మీకు ఏలోటూ రాకుండా చూసుకుంటాను.మీకు ఇష్ట మైతే మా ఇంట్లోని ఔట్ హౌస్ లో ఉండవచ్చు, గోపీ చదువుకోవచ్చు, మీ అందరికీ నా చేతనైనంత వైద్యం చేయిస్తాను,నేను డాక్టర్ను,నా వల్లకానివీ  ఉన్నాయి, అవి అనుభవించ వలసిందే! ఆలోచించి రేపుచెప్పండి ” అని రామనాధం లేచి వెళ్ళాడు. గోపీ ఆయన్ను సాగనంపి వచ్చి,

” అమ్మా !నీకు బాగైతే అంతేచాలు.నేను ఆ ఉద్యోగంలో చేరనా అమ్మా!” అని అడిగాడు.
వెంకమ్మ ” నీకు ఏది మేలనిపిస్తే అది చేయి నాయనా ! ఆపైన దైవమే ఉన్నాడు, వయసుని మించిన బాధ్యత మోస్తూ మా అందరికీ నీవే దిక్కయ్యావు.” అంది.
“ముందు నేను వెళ్ళి చూసి వస్తాను, కొద్దిరోజులయ్యాక అందరం ఆ బాబుగారు చెప్పినట్లు వారింటి వద్దకే మారిపోదాం , అపుడు మీ గురించి నాకు దిగులుండదు.మనకు ధనంలేక పోయినా భగవంతుడు నాకు పని చేయగల శక్తి ఇచ్చాడు , అదే చాలు .”  అన్నాడు గోపీ తనశరీరంలో పనిచేయగల సత్తా  ఉందనే ధైర్యంతో.
ఆ మరునాడు గోపీ రామనాధంగారితో కలసి వారి ఇంటికి వెళ్ళాడు. గోపికి చాలా ఆశ్చర్య మేసింది , అంత పెద్ద ఇల్లు వాడెప్పుడూ చూసి ఉండలేదు. గేటులోనికెళ్ళాక కారు దిగి రామనాధంగారు,

” రా గోపీ , ఇదే మన ఇల్లు.” అంటూ లోపలికి నడిచాడు. బయట తోటలో ఉన్న కుళాయివద్ద కాళ్ళు చేతులు కడుక్కుని లోనికి వస్తున్న గోపీని చూసి ముచ్చట పడ్డారు రామనాధం , ఆయన భార్య వసుంధర.రామనాధం ద్వారా గోపీ గురించీ విన్న వసుంధర మొదటి చూపులోనే వాడి స్వభావాన్ని అంచనావేసింది.రామనాధంతో పాటుగా లోనికి వెళ్ళి ఆ ఇంటి ఐశ్వర్యాన్ని చూసి భయపడ్డాడు గోపీ , ‘ఇంత ఇంట్లో తాను ఉండగలడా! తను ఏమేం పనులు చేయాలో! ఈ ఇల్లoతా తుడవమంటారా?’ అనుకో సాగాడు.

“గోపీ ! ఇలారా! నీవు చేయవలసిన పని చెప్తాను ” అంటూ హాలు పక్కనే ఉన్న ఒక గదిలోకి దారి తీశాడు రామనాధం ,వసుంధరతో కలసి.ఆ గదిలోని  రెండు మంచాలపైన  ఉన్నరెండు  ఆకారాలను చూపుతూ ” గోపీ చూడూ !మా ఇద్దరు కొడుకులు చైతన్య, కైలాస్ లు .నీపనల్లా ప్రతి రోజూ వీరితో మాట్లాడటం , ఆడుకోడం, పాటలు పాడటం, వీరిద్దర్నీ ఆనందంగా ఉంచడం, వీరితో కలసి చదువుకోడం.. టీచర్లు ఇంటికి వచ్చి చదువు చెప్తారు.వీరు నడువలేరు ,కూర్చోబెడితే కూర్చుంటారు, పుట్టినపుడే ఇలా ఉన్నందున ఏ వైద్యం పనిచేయలేదు. ఉదయం , సాయంకాలం వీరిని వీల్ ఛైర్స్ లో తోటలో తిప్పడం,అంతే!” అంటూ తమ కొడుకులను చూపగా , గోపీ ఆశ్చర్యపడ్డాడు వారిని చూసి, జాలేసింది.

తన అమ్మ ,అక్క, తమ్ములకు సేవచేసి ఉన్నందున , వారికి సహకరించడం పెద్దపనిగా అన్పించలేదు ‘కాళ్ళు, నడుంక్రిందనుండీ చలనంలేని ఆ పిల్లలు ఇంత పెద్దమేడకు,ఈ డాక్టర్ ఆస్థికి వారసులా!’అని . భగవంతుడు తనకు తన తల్లిని, అక్కను,తమ్ముడ్ని తన కష్టంతో సాకగల మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదనుకున్నాడు గోపి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *