February 21, 2024

తెలుగు సినిమాల్లో జానపద కధలు

రచన: వెంకట్ హేమాద్రిబొట్ల                                                                                                                                    

అదంతా ఒక ఎడారి లాంటి ప్రాంతం.  ఎక్కడా జనసంచారం కానీ, ఇతర ఏ విధమైన కదలికలు కానీ లేవు.  గాలి కూడా ఎవరో చేత్తో పట్టి ఆపినట్టు స్తంబించి ఉంది.  అంత నిర్మానుష్యమైన ప్రదేశం లో శిధిలావస్త లో ఉన్న ఒక కట్టడం మాత్రం ఉంది.  అందులోంచి పెద్దగా మంత్రాలు వినపడుతున్నాయి.  ఇంతలో, టక్ టక్ … టక్ టక్ మని దూరం నుంచి గుర్రం డెక్కల చప్పుడు లీలగా వినపడుతోంది.   క్రమంగా ఆ గుర్రం ఇటే దూసుకుని వస్తునట్టుగా ఆ శబ్దం పెద్దదవుతూ వచ్చింది.   అంతలో ఆ గుర్రం పై వేగంగా స్వారి చేస్తూ వస్తున్న రాజకుమారుడు కనబడ్డాడు.   అలా వస్తున్న రాజ కుమారుడిని చూసి, రెండు చేతులు చెరో వైపు కట్టేసి ఉన్న రాకుమారి కళ్ళు ఆనందంతో వెలిగాయి.  ఇది చూసి బిగ్గరగా మంత్రాలు చదువుతున్న బారెడు గడ్డం ఉన్న మాంత్రికుడు స్వరం ఇంకా పెంచి చేతిలో గుప్పెడు భస్మం తీసుకుని ఎదురుగా ఉన్న మంటలో వేసాడు.  అందులోంచి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చి రాకుమారుడిని అడ్డగించాడు.  వాడితో హోరాహరి గా తలపడి, చివరికి గాలిలో ఆరు అడుగులు పైకెగిరి తన చేతిలో ఉన్న కత్తితో వాడిని హతమారుస్తాడు ఆ రాకుమారుడు.  అదే ఊపులో లో వెళ్ళి ఆ మాంత్రికుడి తల తెగనరుకుతాడు.  అది వెళ్ళి అగ్ని గుండం లో పడుతుంది.  అంతే, రాకుమారి చేతులకి కట్టి ఉన్న తాళ్ళు మాయమవుతాయి.  అప్పుడు ఎదురుగా ఉన్న పెద్ద కాళికామాత ప్రసన్నురాలై వారిద్దరిని దీవించి అంతర్ధానమవుతుంది.   రాజకుమారుడు రాకుమారిని అమాంతం గాలిలోకెత్తి గుర్రం పై ఎక్కించుకుని రాజ్యం వైపు దూసుకుపోతాడు. 

అప్పటి వరకు కథలో లీనమై, వేరే లోకంలో విహరిస్తూ సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఈ లోకంలోకి వస్తారు.  వారిలో ఒక విధమైన సంతోషం కనపడుతుంది.  చిత్ర విచిత్రమైన మలుపులు తిరిగే ఒక కథని చూసిన సంతోషం అది.   ఇదంతా నిజం కాదు, కేవలం కథే అని తెలిసినా, కాసేపు ఆలోచన అంతా పక్కన పెట్టి (suspension of belief), తెరపై జరుగుతున్న సన్నివేశాలలో లీనమైపోవడం వల్ల వచ్చిన అనుభూతి అది.   ఎందుకంటే, అలా చేయడం వాస్తవాన్ని, అందులోని బాధల్ని కాసేపు మరిచిపోయేలా చేస్తుంది కాబట్టి.  రాజులు, రాణులు, మాంత్రికులు, మంత్ర దండాలు, మాయలు, గుర్రపు స్వారీలు, కత్తి యుద్దాలు – ఒక వేరే లోకంలో విహరించి వచ్చినట్టుగా ఉంటుంది.  అందుకే అందరికి ఎంతో నచ్చుతుంది, ఆనందాన్నిస్తుంది.   ఇలాటి సినిమాలు చిన్నపిల్లలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. పెద్దవాళ్లు కూడా ఇటువంటి సినిమాలను పూర్తిగా లీనమై చూస్తారు. ఆ కొద్ది గంటలుపాటు మరో లోకానికి వెళ్లిపోతారు

అవును, తెలిసిందేగా.  అందుకేగా పిల్లలని తీసుకుని వెళ్ళి హ్యారీ పోటర్, నార్నియా, లయన్ కింగ్ వంటి సినిమాలు చూసేది.   వాటి గురించే కదా మీరు మాట్లాడేది? 

కాదు, కాదు, కాదు.  ఈ రోజుల్లో, ఇంతటి సాంకేతికత అందుబాటులో ఉండి, వాటిని ఉపయోగించి తీస్తున్న సినిమాలు గురించి కాదు నేను చెప్పేది. 

అవునా, మరి వేటి గురించి?  – వేటి గురించి అంటే, ఈ టెక్నాలజీ, ఫొటోగ్రఫి, కంప్యుటర్ యానిమేషన్ వంటివి అభివృద్ధి చెందని కాలంలోనే అద్బుతమైన చిత్రాలు తీసి ప్రేక్షకులని కుర్చీలకి (లేదా బెంచీలకి ఇంకా మాట్టాడితే నేలకి) కట్టిపడేసి, వారిని కల్పనా జగత్తి లో విహరింపచేసిన చిత్రాలు గురించి.  జానపద చిత్రాల గురించి. 

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో రకాల చిత్రాలు వచ్చాయి.  పౌరాణికాలు, సాంఘిక చిత్రాలు.  అలాగే జానపద చిత్రాలు.  మిగితా వాటిలాగే, ఇవి కూడా ఎంతో జనాదరణ పొందాయి.    

పాతాళ  భైరవి,మల్లీశ్వరి,  జయసింహ, గులేబకావళికథపిడుగురాముడుగోపాలుడుభూపాలుడుకంచుకోటరాజమకుటంగుణసుందరి కథచండీ రాణీ, బాల రాజు, కీలుగుర్రం, జగదేక వీరుని కథ,  – ఎన్నో, ఎన్నెన్నో  చిత్రాలు.  ఇవన్నీ ఆ కాలం లో ఎంతో పాపులర్ అయ్యాయి.  జానపద బ్రహ్మ గా పేరుగాంచిన విఠలాచార్య గారు తీసిన – ఆలీబాబా 40 దొంగలు, భలే మొనగాడు, అగ్గి బరాటా, చిక్కడు దొరకడు, బందిపోటు – ఇలా ఎన్నో చిత్రాలు బహుళ ప్రజాదరణ పొందాయి.  ఎన్.టి. రామరావు గారికి, కాంతారావు గారికి ఎంతో పాపులారిటీ తెచ్చి పెట్టాయి.  ఎంతో మంది విలక్షణమైన నటులు ఈ చిత్రాలలో నటించి అలరించారు.  ఆ చిత్రాలు వారికి ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాయి.  అలాంటి చిత్రాల గురించి, వాటిలో కొన్ని చిత్రాల కథాంశాల గురించి ఇవాళ చూద్దాం.  

ముందుగా, జానపద చిత్రం అనగానే అందరికీ గుర్తొచ్చే చిత్రం పాతాళ భైరవి.   ఒక సామాన్యుడుతోటమాలి గా పనిచేసుకునేవాడురాకుమారిని చూసి అర్జంట్ గా ప్రేమించిఆ ప్రేమ కోసం ఎన్ని పాట్లు పడ్డాడుఎన్ని సాహాసాలకి ఒడిగడతాడు అన్నది ఈ చిత్రం కథాంశం.  ఆ తరువాత ఇలాంటి కథతో ఎన్ని చిత్రాలు వచ్చాయో లెక్క లేదు.  పేద హీరో డబ్బున్న అమ్మాయిని ప్రేమించడంఆ క్రమం లో కష్టాలు ఎదురుకోవడంవిలన్స్ తో ఫైట్ చేయడంచివరికి గెలుపొందడం – ఇలాంటి కథాంశంతో తరువాత అసంఖ్యాకమైన చిత్రాలు వచ్చాయి.  పాతాళ భైరవి చిత్రంలో ఒక కథకి కావలసిన అన్ని అంశాలు ఉన్నాయి.   ఇందులో ప్రేమ కోసం పడ్డ తపన ఉందిసాహస కృత్యాలు ఉన్నాయిమంచి హాస్యం ఉందిచివరికి సమయ స్ఫూర్తి తో వ్యవహిరించడం ఎలా అని కూడా చూపించారు.  ఎన్టీఅర్ఎస్.విరంగా రావు పోటీ పడి నటించిన ఈ చిత్రం విడుదలై ఆరు దశాబ్దాలు దాటినా దాని పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదుఈ రోజుకీ సాహసం సేయరా డింభకా అంటూ ఏదైనా పని చేయమని ప్రోత్సాహించడంవాడా?  వాడుప్రేమ కోసమై వలలో పడ్డాడు అంటూ జాలి పడడంఎవరినైనానీకు ఏదైనా కావాలాఅని అడగాలంటేసింపుల్ గా కాక, “నరుడా ఏమి నీ కోరిక” అంటూ అడగడం ఈ చిత్రంఅందులోని మాటలు ఎంత ప్రజాదరణ పొందాయి అనడానికి తార్కాణాలు.  

మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్న సమయంలో రాజు తమ్ముడు కానీ లేక మంత్రి, సేనాధిపతి ఎవరో రాజుని చంపి రాజ్యాన్ని చేజిక్కించుకునేందుకు కుట్ర పన్నడం, రాకుమారుడు రహస్యం గా పెరగడం, పెద్దైన తరువాత వారి ఆటలు కట్టించి తిరిగి రాజ్యం దక్కించుకోవడం, ఈ కథాంశం తో వచ్చేవి చిత్రాలు.  ఆ క్రమం లో కథ ఎన్నో మలుపులు తిరగడం, మధ్యలో హాస్యం పండిచడం, గుర్రాల పై చేజ్ చేయడం, కత్తి యుద్ధాలు – ఇలా అన్ని కలిసి ఉన్న జనరంజకమైన చిత్రాలు వచ్చాయి.  

జయసింహ చిత్రంలో జయసింహుడు (రామారావు) యువరాజు.  మహారాజు మరణించగా అతని తమ్ముడు రుద్రసింహుడు (ఎస్.వి. రంగారావు) రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు.  జయసింహుడుని అంతం చేసి పూర్తిగా రాజ్యం తన వశం చేసుకుందామని కుట్ర పన్నుతాడు.  అది తెలుసుకున్న జయసింహుడు రహస్యం గా పొరుగు రాజ్యం వెళ్లిపోతాడు. అక్కడి రాజుని శత్రువుల నుంచి కాపాడుతాడు.  ఆ దేశపు రాకుమారి తో ప్రేమలో పడుతాడు.  ఆ రాజ్యపు దుష్ట సేనాధిపతి (రాజనాల) ఆట కట్టిస్తాడు.  అక్కడ నుంచి తన రాజ్యానికి వచ్చి  రుద్రసింహుడిని ఎదురుకుంటాడు.   ఆ ప్రయత్నం లో రుద్రసింహుడి కుమారుడు విజయసింహుడు (కాంతా రావు) జయసింహుడు కి అండగా నిలుస్తాడు.  రాజద్రోహం తలపెట్టిన రుద్రసింహుడు చివరికి తన కొడుకు చేతిలోనే మరణిస్తాడు.  జయసింహుడు రాజ్యాన్ని తిరిగి చేజ్జిన్కుంచు కుంటాడు.   అలాగే, రాజమకుటం చిత్రంలో కథలో ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. మంత్రియైన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. కానీ ఆ హత్యా నేరం వేరే వారి మీద మోపి వారికి మరణ శిక్ష పడేలా చేస్తాడు.  అలా మరణ శిక్ష పడిన వారిలో కథానాయిక ప్రమీల (రాజ సులోచన) అన్న కూడా ఉంటాడు.  ఇదంతా తెలుసుకున్న యువరాజు, తన తల్లి తో కలిసి తెలివిగా దుర్మార్గుడైన మంత్రి ఆట ఎలా కట్టిస్తాడు అనేది చూసి తీరాల్సిందే.  కథ ఆద్యంతం మలుపులతోఆసక్తికరం గా సాగుతుంది.  ఇక్కడ ధైర్య సాహసాలే కాకతెలివి తేటలు కూడా ఎంత అవసరమోచాక చక్యం గా వ్యవహిరించడం కూడా ఎంత ముఖ్యమో చూపించే పలు సన్నివేశాలు ఇందులో ఉన్నాయి.  చివరికికేవలం కత్తి యుద్ధాలే కాకుండాఒక మంచి కథ చూసిన అనుభూతి ప్రేక్షకులకి కలుగుతుంది. 

ఈ కాలంలో వచ్చిన ఇంకొక అద్భుతమైన చిత్రం మల్లీశ్వరి.     రాయల పాలన కాలం నేపధ్యం లో జరిగే కథ ఇది.  ఈ చిత్రంలో ఎన్.టి.అర్ నాగరాజు గా శిల్పి పాత్ర లో భానుమతి మల్లి గా గాయని గాబావా మరదళ్ళు గా నటించారు.  ఒకానొక సందర్భం లో,  శ్రీకృష్ణ రాయలుకి, ఆయన ఆస్థానకవి అల్లసాని పెద్దన్నకి నాగరాజు, మల్లి  ఆతిధ్యం ఇచ్చి మర్యాద చేయడంతో అనుకోకుండా భానుమతి కి రాణివాసం (మహారాణి అంతఃపురంలో లో ఉండే అవకాశం ) దక్కుతుంది.  వారు ఇచ్చే బహుమానాలకి, కానుకలకి ఆశపడి ఋష్యేంద్రమణి (భానుమతి తల్లి పాత్రలో), ప్రేమించుకున్న బావ మరదళ్ల ని విడదీసి, మల్లి ని అంతఃపురానికి పంపుతుంది.  మల్లి అంతఃపురంలో ఉన్నా, మహారాణి ఇష్ట సఖిగా మారినా, నాగరాజు లేకపోవడంతో దిగాలుగా ఉంటుంది.  అటు నాగరాజు కూడా మల్లి కోసం బాధ పడుతూతను చెక్కే ప్రతీ శిల్పం లో మల్లినే చూసుకుంటూ ఉంటాడు.   ఇదంతా తెలుసుకున్న రాజుఒక సారి రాణివాసం లో చేరిన స్త్రీలు మగవారిని చూడకూడదుబయటకి వెళ్ళ కూడదు అన్న నియమం ఉన్నాఅవన్నీ పక్కన పెట్టి పెద్ద మనసు తో వారిద్దరినీ ఒకటి చేస్తాడు.  ప్రేమ – ఐశ్వర్యం మధ్య,  అమాయకత్వం – అత్యాశ మధ్య సాగే ఘర్షణ ఎంతో అందంగా చిత్రీకరించిన ఈ చిత్రం లోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాలని హత్తుకుంటుంది. 

ఇక భానుమతి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం చండీరాణి.  ఒక పాత్ర అమాయకంగా ఉండడంమరొక పాత్ర ధైర్య సాహసాలతో కూడి ఉండడం ఈ చిత్రం కథాంశం.  రెండు పాత్రల లోనూ భానుమతి అవలీలగా నటించారు.  ఈ చిత్రం కూడా ఎంతో ప్రజాదరణ పొందింది.  ఈ కథాంశం తో వచ్చిన హేమ మాలిని నటించిన “సీతా ఆర్ గీతాఅలాగే జమున గంగ మంగమొన్న మొన్నటి శ్రీదేవి చాల్బాజ్” చిత్రాలు ఎంత ప్రజాదరణ పొందాయో మీకు తెలిసిందే కదా.  ఇదే కథాంశంగా మళ్ళీ ఒక కొత్త హీరోయిన్ తో ఇంకొక చిత్రం వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు.  

ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో చిత్రాలు, వాటిలో ఎన్నెన్నో మలుపులు తిరిగే కథలు.  ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది.  ఇది వ్యక్తిగతంగా నాకు ఎంతో ఇష్టమైన విషయం కూడానూ.  అది, ఈ చిత్రాలలో ఉన్న పాటల గురించి.  అద్భుతమైన పాటలు.  సూపర్ హిట్స్.  ఎంతో హాయి గొలిపే పాటలు.  ఆ తరానికి, మన తరానికి, తరతరాలని అలరించే పాటలు.  వాటిలో కొన్ని:

సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే (రాజమకుటం) 

ఊరేది పేరేది ఓ చందమామా (రాజమకుటం)

ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు (రాజమకుటం)

మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే (మల్లీశ్వరి)

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు (మల్లీశ్వరి)

ఎంత హాయి ఈ రేయి నిండెనోఎన్నినాళ్ళకీ బతుకు పండెనో (మల్లీశ్వరి)

ఈనాటి ఈ హాయీ…కలకాదోయి నిజమోయీ (జయసింహ) 

ఊహలు గుస గుస లాడే (బందిపోటు)

వగల రాణి వి నీవే, సొగసుగాడను నేనే (బందిపోటు) 

ఏమో ఏమో ఇది, నాకేమో ఏమో అయినది (అగ్గి పిడుగు) 

శివశశంకరి (జగదేకవీరుని కథ)

 జలకాలాటలలో  (జగదేకవీరుని కథ) 

ఇంకా ఎన్నో, ఎన్నెన్నో పాటలు.

ఈ పాటలకి, చిత్రాలకి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు అనేందుకు 1994 లో బాలకృష్ణ హీరోగా వచ్చిన భైరవ ద్వీపం చిత్రమే నిదర్శనం.  రొటీన్ కథలతో, హెచ్చు మీరిన వయోలెన్స్ వల్గారిటీ తో విసిగిపోయిన ప్రేక్షకులు, ఇలాంటి చిత్రాలు మళ్ళీ వస్తే ఆదారిస్తారు అనడం లో సందేహం లేదు.  ఎందుకంటే, ఇలాంటి కథలు చెప్తూ, చక్కటి హాస్యం పండిస్తూ, శ్రావ్యమైన పాటలు వినిపిస్తూ, వేరే ప్రపంచం లోకి విహరింపచేస్తే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *