June 19, 2024

మంచి నడవడితో జీవించడం మనకు సాధ్యమేనా ?

రచన: G.V. సాయి భరద్వాజ్

 

పుత్రోత్సాహము తండ్రికి

పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా

పుత్రుని కనుగొని పొగడగ

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…!

 

పదిమంది తన కొడుకును పొగుడుతుంటే  అప్పుడు తండ్రికి  పుత్రోత్సాహం కలుగుతుంది అని సుమతీ శతకంలో బద్దెన చెప్పారు.   అటువంటి కొడుకు మంచివాడే అవుతాడు. ఉదాహరణకు రాముడు లాగా అన్నమాట.

అసలు మంచిగా ఉండడం అంటే ఏంటి అన్నవిషయానికి వస్తే , ఒకరి ప్రవర్తన పది మందికి ఆదర్శంగా ఉంది అంటే దానిని మంచి నడవడి అంటారు…అటువంటి వారు ఒక క్రమపద్దతిలో జీవించడానికి ఇష్టపడతారు దానినే క్రమశిక్షణ అంటారు. అంటే  క్రమశిక్షణ, నడవడి ఒకదానికి ఒకటి చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయని అర్దం. మంచి వారికి ఉండే ముఖ్యమైన రెండు లక్షణాలు ఇవే… అవే విజయానికీ సోపానాలు…

మనిషి జీవితంలో క్రమశిక్షణ, నడవడి రెండూనూ కలిగి ఉండడం తప్పని సరి…  కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. మంచి అన్నది కాలాన్ని బట్టి మారుతుంటుంది. ఒకప్పుడు మంచి అయినది మరొకప్పుడు చెడుగా మారవచ్చు.. కాబట్టి కాలాన్ని బట్టి ప్రవర్తించడం కూడా కాస్త అవసరమే..

అసలు మంచి పనులు అంటే ఏంటి?, పదిమందికి ఉపయోగపడడం, వినయం, విధేయత కలిగి ఉండడం,పరోపకారతత్వం కలిగి ఉండడం, పెద్దలు వట్ల గౌరవభావం కలిగి ఉండడం, అబద్దాలు ఆడకుండడం, అందరూ మెచ్చుకొనే పనులు చెయ్యడం అనే వాటిని మంచిపనులు అంటారు.

మంచి నడవడి కలిగిఉండడం, ధర్మానికి కట్టుబడి ఉండడం వల్ల సంఘంలో గొప్పతనం వస్తుంది. అతను పదిమందికి ఆదర్శంగా మారుతాడు.  మనం సంపాదించిన ఆస్తులు, డబ్బు ఇవేమీ పోయేటప్పుడు మనతోరావు. మిగిలేది మనం చేసిన మంచి పనులు మాత్రమే. మంచి అనేది ‘ఎప్పటికీ చెడిపోని పదార్దం’  లాంటిది. అలాంటి మంచివారిని అందరూ గౌరవిస్తారు..  ఎవరో ఇచ్చే గౌరవం, అగౌరవాలు పక్కన పెడితే మన మనసుకు తృప్తి కలిగి ఉండడానికి ఈ మంచినడవడి ఎంతగానో దోహదపడుతుంది.

మంచిగా ఉండడం వల్ల కష్టాలొస్తాయా ?  నిజమే వస్తాయి… మంచి నడవడి ఉన్న ఎంతోమంది అనేక కష్టాలు పడ్డారని మన పురాణాలు చెప్తున్నాయి.  పాండవుల  మంచి తనమే  వారిని కష్టాలకు గురిచేసింది, అబద్దమే ఆడకూడకుండా మంచిగా ఉండాలి  అనుకున్న హరిశ్చంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్పనవసరం లేదు.  మంచితనం ఒక్కోసారి అసమర్ధత కిందకూడా జమకట్టబడుతుంది. అంటే మంచికి కట్టుబడ్డవారు అనేక కష్టాలకు గురైయ్యారు అన్నమాట. ఒక్కోసారి మన మంచితనానికి‘వంచనే’ ఫలితం కావచ్చు. పాండవులలాగా ఎన్నో దుర్మాగాలకు గురి  కావచ్చు.. కానీ, మంచి నడవడి ఉన్న వ్యక్తులు ఈ లౌకిక ఇబ్బందులకు జంకకూడదు. తమ ఆదర్శాలను విడువకూడదు.  అలాంటి వారికి ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్నిది తప్పక గుర్తుంచుకోవలసిన విషయం.

‘ సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్ ’  అని అంటారు. మంచివారిని చూచిన మాత్రం చేత  పుణ్యం లభిస్తుంది అని అర్దం. నిజంగా అలాంటి మంచి నడవడి గల వ్యక్తులు ఈ లోకంలో ఉండడం వల్లనే ఇంకా లోకం సస్యస్యామలంగా, సుఖంగా  ఉందని నా అభిప్రాయం.   మంచి నడవడిని మించిన గొప్పది ఈ ప్రపంచంలో వేరొకటి లేదు. దీనికి ఉదాహరణగా ఆవు-పులి కధనే తీసుకుంటే, తన బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి వచ్చి తనను చంపమన్న ఆవుతో పులి “నీ మంచితనమే నిన్ను కాపాడింది” అనడంలో తెలియడంలేదా మంచితనపు గొప్పతనం.  కాబట్టి మంచిని మించినది ఈ లోకంలో మరోటిలేదు. స్వార్ధపు ఆలోచనలతో,  కల్మషాలతో నిండిన మనసులతో జీవితాలను వ్యర్ధం చేసుకోకండి.

ప్రస్తుతకాలంలో మంచి అన్నదానికి తావేలేకుండా పోయింది. ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా.. అన్యాయాలూ, అక్రమాలూ,నేరాలూ, స్కాములూ!   ఎవరి స్వార్దం వారిది, వృద్దాప్యంలో పెద్దలకు ఆసరాగా ఉండవాలసిన బిడ్డలే, చెయ్యాల్సి వచ్చిందే అనుకొని కసురుకుంటూ, సూటిపోటిమాటలతో పెద్దల మనసును గాయపెడుతున్నారు. మెదట్లో చెప్పిన పద్యానికి పూర్తి విరుద్దం అనమాట. పెద్దలను అగౌరవిస్తూ,లోకానికి అలానే ప్రచారం చేస్తుంటారు. ఇవన్నీ మంచి నడవడి అనిపించుకోవు.. గొప్ప వ్యక్తిత్వం అంటే ఒక ఉద్యోగం సాధించి కాస్త డబ్బు సంపాదించి సమాజంలో హుందాగా తిరగడం కాదు… తన ప్రక్కన ఉన్న వారిని సంతోషంగా ఉంచగలడం లోనే ఉంది. చదువు సంస్కారం , మంచితనాన్ని నేర్పిస్తుంది అంటారు.. కానీ దాన్ని కళ్లతో మాత్రమే చూడగలగేవారు ఎంత చదివినా దాని నుండీ ఏమీ నేర్చుకోరుఅన్నది మాత్రం నిజం. ప్రపంచానికి మాత్రం మంచిగా ఉండడం కోసం ఎన్నో కృత్రిమమైన అలవాట్లు, హావభావాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటూ డబ్బుకట్టిమరీ నేర్చుకొని ప్రపంచాన్ని మోసం చేస్తుంటారు.  ప్రేమ అభిమానం, అప్యాయత అన్నవి కరువవుతున్న ఈ రోజులలో తన వారిని ప్రేమగా చూసుకుంటూ, లోకానికి ఉపయోగపడేలా పైన చెప్పినట్లు ‘మంచి నడవడితో’ ఉండడం ఎంతమందికి సాధ్యమవుతుంది…?

 

1 thought on “మంచి నడవడితో జీవించడం మనకు సాధ్యమేనా ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *