March 29, 2024

ఓ, ఓరీ, ఓయీ, ఓసీ— సంబోధనా ప్రథమా విభక్తి…..

రచన: పద్మ పోడూరి

రఘు నుంచి మెయిల్ వచ్చింది, దయచేసి నన్ను మీరు అని పిలవకండి అని. రఘు మా స్నేహితుని మేనల్లుడు. ఈ మధ్యనే పరిచయమయ్యాడు. నా మనసులో ఒక కొంటె ఆలోచన వచ్చింది. మళ్ళీ సారి కనిపించి నప్పుడు మా అమ్మలా, ఒరేయ్ అనిపిలిస్తే ఎలా వుంటుంది అతనికి అని ఆలోచించా.  చిన్నగా నవ్వుకున్నా.

ఇంట్లో అందరికన్నా చిన్నదాన్ని అవడం వలన అంతా నువ్వు అనే అంటారు నన్ను. స్కూల్ లో అంతా నువ్వు అనే పిలిచేవారు. కాలేజీలో చేరాక, మొదటి సారి గా నన్ను మీరు అని పిలవడం మొదలు పెట్టారు. నిజం చెప్పొద్దూ, చాలా సరదా వేసేది. ఏదో పెద్దరికం వచ్చినట్టు ఫీల్ అయిపోయా. నన్ను వాళ్ళు గౌరవిస్తే నాకు బాగానే వుండేది. కానీ, కాలేజీ లో ప్రతి రౌడీ వెధవల దగ్గరనుంచి గారు, మీరు అంటూ మాట్లాడడానికి మనసు వప్పుకునేది కాదు. ఆ మధ్య ఒక యోగ టీచర్ చెప్పాడు. అందరిలోనూ ఆత్మ వుంటుంది, ఆ ఆత్మే భగవంతుని రూపం. అంటే మనలోనే దేముడు వున్నాడు. అలానే అందరిలోనూ దేముడు ఉన్నాడని ఆలోచిస్తే, లోకమంతా స్వర్గమయం అవుతుంది అని. అయితే, మనలో దేముడు వున్నాడు అంటే బాగానే అనిపిస్తోంది, కానీ అవతలి వాడి లో మాత్రం రాక్షసుడు కనిపిస్తున్నాడు.. అదీ ప్రాబ్లం. వాడిని నువ్వు అంటే, వాడెక్కడ ‘ఒసేయ్’ అని పిలిచేస్తాడో అని భయం వేసేది. తెలుగు భాషలో ఈ ప్రాబ్లం వుంది కనుక చాలా మందితో ఇంగ్లీష్ లో మాట్లాడితే బెటర్ అనిపించేది. కానీ అవతలి వెధవకి ఇంగ్లీష్ వచ్చి చావాలి కదా.

ఈ ‘ఒరేయ్, ఒసేయ్ పదాలు చాలా విచిత్రమైన పదాలు. పుస్తకాల్లో చదివాము అనుకోండి, ఓరి, ఓసి, ఓయి అనగానే, ‘ఓరీ దురాత్మా’ అనే పదమే గుర్తుకు వస్తుంది. మనకి కావలిసిన వాళ్ళు పిలిచే ఈ పదాలు ఎంతో ప్రేమగా అనిపిస్తాయి, అయితే, రోడ్డున్న పోయే ఏ వెధవో, ఏమే, ఒసేయ్ అంటే మాత్రం పళ్ళు రాల గొట్టాలని అనిపిస్తుంది కదామరి.

మా అమ్మగారు కనిపించిన ప్రతీ వాడిని, ‘ ఒరేయ్ అని సంభోదిస్తుంది. ఒకసారి మా అమ్మగారు స్నేహితురాలింటికి నన్ను వెంట తీసుకుని బయలు దేరారు. దారి మధ్యలో, నడుస్తున్న మా అమ్మ గారు, ఒక నిముషం ఆగి, “ఒరేయ్, మీ అమ్మ ఇంట్లో వుంది రా?” అని గట్టిగా కేక వేసింది. నేను గతుక్కు మన్నాను. ఎవరిని ‘ఒరేయ్ : అంటోందా అని. మేము ఎవరింటికి వెళ్తున్నామో వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి అటూ ఇటూ చూసి, నా వైపు కొంచం సిగ్గు పడుతూ చూసి , ‘ఉన్నారండి” అని సమాధానం ఇచ్చాడు.

‘ మీ ఇంటికే వెళ్తున్నాములే’ అనేసి ముందుకు సాగారు మా అమ్మగారు.

నేను కొంచం దూరం వెళ్ళాక, ‘ఏమిటమ్మా, అలా అందరిని ‘ఒరేయ్’ అంటావు? పాపం ఆ అబ్బాయి ఎలా సిగ్గుపడ్డాడో చూసావా ” అని విసుక్కున్నాను.

మా అమ్మ గారు ‘ఏమిటే నువ్వు మరీనూ, వాడేమైనా మీ నాన్నగారా , ఏమండీ అని పిలవడానికి? ” అంటూ ఎదురు ప్రశ్న వేసింది. “అదేమిటి నాన్నగారు కాక పోతే కనిపించిన ప్రతీ వాళ్ళనీ ఒరేయ్ అంటామేమిటి? అని అడిగాను. ‘లేకపోతే, ఆ బొడ్డూడని వెధవని ఏమండీ అనాలా? ” అంటూ మరో ప్రశ్న వేసింది. ఈవిడతో ఇక మాట్లాడడం కష్టం అనుకుని, నోరుమూసుకుని ఊరుకున్నాను.

మా అమ్మని అమ్మగారు అని పిలవను కదా, ఏదో పనిమనిషి పిలిచినట్టు వుంటుంది. కానీ, ఇలా ఆలోచిస్తూ వుంటే, మనం పిలిచే పిలుపు, మనకి ఆ వ్యక్తి మీద వుండే గౌరవానికీ ఏమీ సంబంధం వుండనవసరం లేదు. నాన్నగారిని నాన్న గారు అని కొందరు అంటారు, నాన్న అని కొందరు అంటారు. అమ్మ కన్నా మనకి ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కువ? కానీ అమ్మని మన దక్షిణ భారతీయులు “నువ్వు” అనే అంటాము కదా. ఉత్తర భారత దేశం లో తల్లిని మీరు అని పిలవడం చాలా సామాన్యం. కానీ మన మనసుకి దగ్గరగా వున్న వ్యక్తులని ‘ఒరేయ్, ఒసేయ్, నువ్వు’ అంటూ పిలిస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. మా చిన్నాన్న గారి అమ్మాయిలూ, అబ్బాయిలు, మా అన్నయ్యలూ, మావయ్యలూ, అత్తయ్యాలూ, ఏమే, ఒసేయ్ అంటూ వుంటే, ఆ పిలుపులో ఎంతో ప్రేమ ఆప్యాయత అనిపిస్తుంది.

మా అత్తవారి ఇంట్లో ఏమే, ఒసేయ్, ఒరేయ్ పిలుపులు లేవు. పేరుపెట్టి పిలుచుకోవడమే. అందుకనే, చాలా కాలం తరవాత, పుట్టింటికి వెళ్తే, అక్కడ మా బంధువులు ‘ఏమే పద్మా బాగున్నావే, ఒసేయ్ రేపు మా ఇంటికి భోజనానికి రావాలేవ్ అంటూ మాట్లాడుడుతూ వుంటే, “అయ్యో, నన్ను ప్రేమించే వాళ్ళందరికీ దూరం అయ్యానా అనిపిస్తుంది.

నేను ఒకసారి మా పుట్టింటికి వెళ్ళినప్పుడు, చిన్నాన్న గారి అబ్బాయి వచ్చాడు వాడి కొడుకు మహి తో వచ్చాడు. ‘ఏరా రామం బాగున్నావా?” అని పలకరించా. ఏమేవ్ ! నువ్వెప్పుడు వచ్చావే’ అంటూ ఎంతో ప్రేమగా వాడు నాతో మాట్లాడాడు. ఓ గంట తరువాత, వెళ్ళిపోతూ వుంటే వెళ్ళే లోగా మా ఇంటికి భోజనానికి రావే అని పిలిచాడు. అలాగేలేరా అన్నాను. మర్నాడు ఏదో పని మీద వెళ్తూ ఒక్కడే వచ్చాడు. (అప్పటికి) మా నాలుగేళ్ల కొడుకు, రామాన్ని చూస్తూనే, ‘ఒరేయ్ రామం మావయ్యా, మహిగాడిని తీసుకురాలేదిమిరా ?” అని అరిచాడు. నేను సిగ్గుతో చచ్చిపోయా. మా రామం పక పకా నవ్వేసాడు. “నిన్నే మా ఇంటికి తీసుకుని వెళ్దామని వచ్చానురా” అంటూ. బహుశా మా అబ్బాయి, నేను రామాన్ని ఒరేయ్ అని పిలవడం విన్నట్టున్నాడు. తప్పురా, ఒరేయ్ అనకూడదు అన్నా, మరి నువ్వు అంటున్నావు అని అడిగాడు. మరి మావయ్య నీకన్నా పెద్ద కదా అందుకని అలా పిలవ కూడదు” అన్నా.

వాడేదో ఆటలలో పడి సరే అని వెళ్లి పోయాడు. లేక పోతే, వాడి ప్రశ్నలకి జవాబు చెప్పడం కష్టం.

నేను మా ఆయనా, పెళ్లి కాక మునుపునుంచి చాలా పరిచయం వున్నవాళ్ళం. అందుకే మా ఆయన్ని ‘ఏమండి’ అని పిలవను. నువ్వు అనే సంభోదిస్తా. అలా అని ప్రేమగా ‘ఒరేయ్’ అంటానని మాత్రం అనుకోవద్దు. అయితే, నాతో పని చేసే ఒకాయన, వాళ్ళ ఆవిడని, ‘ఏరా’ ‘ఒరేయ్’ అంటూ పిలవడడం చాలా సార్లు విన్నా. మొదట్లో ఎవరో మొగాడితో మాట్లాడు తున్నాడని అనుకున్నా.. తరవాత అతని భార్యనే ‘ఒరేయ్, ఏరా’ అంటున్నాడని తెలిసింది. అతను అలా మాట్లాడు తూ వుంటే, ఏదో “దోస్తానా” సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది.

ఈ ఒరేయ్, ఒసేయ్ లాగానే, వాడు, వీడు అనే పదాలు కూడా కొన్ని సార్లు ఇబ్బందిలో పెడతాయి. మా అక్క కొడుకు, ఒక సారి, వీధిలో ఆడుకుంటూ వుంటే, ఇంటికి వచ్చిన వ్యక్తిని చూసి, ” అమ్మా, ఇంటి ఓనరుగాడు అద్దె కోసం వచ్చాడే” అని కేక వేసాడు. చెప్పొద్దూ మాకు నవ్వు వచ్చింది. కానీ ఆ ఇంటి ఓనరు గాడి మోహం చూడాల్సిందే.

మా పక్కింట్లో సుశీలమ్మ గారు అని వుండే వారు. ఆమె మనవరాలు, కొడుకు కూతురు ఒక మూడేళ్ళ పాప రాధ చాలా ముద్దు ముద్దుగా వుండేది.. చిన్న పిల్ల అయినా మాట స్పష్టంగా వుండేది. సుశీల అమ్మగారి కూతురి పెళ్లి కుదిరింది, కానీ పెళ్లి ఒక రెండు సంవత్సరాల తరవాత చెయ్యడానికి నిశ్చయమయింది. కాబోయే అల్లుడు వస్తూ పోతూ వుండే వాడు. ఆ అబ్బాయి వచ్చినప్పుడు ఈ మూడేళ్ళ పాపా, ఆ అబ్బాయి గురించి, “అమ్మా, వాడు ఎవడో వచ్చేడే ఒకసారి, ‘ వీడు మళ్ళీ వచ్చేడే’, అంటూ ఇంట్లోకి పరిగెత్తుకుని వచ్చి చెప్పేది. . ‘తప్పమ్మా అలా వాడూ వీడు అనకూడదు’ ‘మావయ్య వచ్చాడు అని చెప్పాలి. అని చెప్పేది వాళ్ళ అమ్మ

ఆ తరవాత, ఆ పాపకి ఎప్పుడు కోపం వచ్చినా, “వాడూ, వీడు” అంటూ వుండేది. ‘వాడూ వీడూ” అంటే అదేదో తిట్టు అనుకునేది. అంటే, డానికి కావలిసిన బొమ్మా ఇవ్వలేదనుకోండి, వాళ్ళని ‘ వాడు, వీడు” అని తిట్టేది. వాళ్ళ అమ్మ తనకి కావలిసిన డ్రెస్ వేసుకో నివ్వక పోతే, “వాడు వీడు” అని తిట్టేది. ఇలా కొంత కాలం జరిగాకా, సుశీలమ్మ గారు, మెల్లిగా ఆ పాపకి నచ్చ చెప్పేరు. తప్పమ్మా, అలా మాట్లాడ కూడదు. ఎవరైనా కొత్తవాళ్ళు పలకరిస్తే, ‘నమస్కారమండి, బాగున్నారా? మా ఇంటికి మీరు తప్పకుండా రావాలి’ అని పిలవాలి. … ఇలా అన్నీ నేర్పించింది మనవరాలికి.

రెండు రోజులు పోయాకా, రెండు వీధుల ఆవతల పేరంటానికి వెళ్తూ సుశీలమ్మ మనవరాలిని వెంట వేసుకుని బయలు దేరింది.

ఇంతలో, “అమ్మా బాగున్నారా?” అనగా విని సుశీలమ్మ ఆగారు. “ఏమే రాములమ్మా బొత్తిగా కనిపించడం లేదు, ఈ ఊళ్లోనే వున్నావా అని అడిగింది సుశీలమ్మ. బాగానే ఉన్నానమ్మ, అనకాపల్లి వెళ్లి ఈ మధ్యనే వచ్చా.. ఈ పాప ఎవరమ్మ అని అడిగింది. నా మనవరాలే, నా కొడుకు కూతురు అని చెప్పింది సుశీలమ్మ.

వెంటనే తడుము కోకుండా, ‘నమస్కారమండి, బాగున్నారా? మా ఇంటికి తప్పకుండా రావాలి” అని గడ గడా అప్పచెప్పినట్టు చెప్పేసి, రెండు చేతులూ జోడించింది. ఆ రాములమ్మ ఓ రెండేళ్ళ క్రితం వాళ్ళ ఇంట్లో పనిమనిషి. సుశీలమ్మకి నోట మాట వస్తే వట్టు.

4 thoughts on “ఓ, ఓరీ, ఓయీ, ఓసీ— సంబోధనా ప్రథమా విభక్తి…..

  1. పద్మ గారు, బాగా రాసారండి. అందరికి దగ్గరలో వున్నా అంశాన్ని ఎన్నుకున్నారు. ‘ఒసేయ్’ అని, ‘ఒరేయ్’ అని దగ్గర బధువులలోను, స్నేహితులలోను, అనుకుంటే బాగానే వుంటుంది ఆప్యాయంగా! అయితే, ఎంత తేడా వచ్చిందో చూడండి, ఒకప్పుడు, మొగుడు పెళ్ళాన్ని ‘ఒసేవ్’ అని, ‘నా కంచంలో కండి పచ్చడి తగలెయ్’ అన్నప్పుడు, అది ఆప్యాయత అనిపించుకోదేమో! బహుసా మగ మహారాజు చేసే గాండ్రింపు అయింది. అంతే. అయితే ఇప్పుడు పైన కృష్ణ గారు చెప్పినట్లు, వాళ్ళ ఆయన్ని, ముద్దుగా ‘ఏరా’ అంటే బాగానే వుంటుంది. ఇదొక ట్రాన్సిషన్ పీరియడ్ అనుకుంటా. మరి ఆ సరసము విరసంబైనను, అది ఆడ పులి చేసే (అదే లెండి, మహా రాణి గారు చేసే) గర్జన కింద మారుతుందేమో?

  2. “మన మనసుకి దగ్గరగా వున్న వ్యక్తులని ‘ఒరేయ్, ఒసేయ్, నువ్వు’ అంటూ పిలిస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. మా చిన్నాన్న గారి అమ్మాయిలూ, అబ్బాయిలు, మా అన్నయ్యలూ, మావయ్యలూ, అత్తయ్యాలూ, ఏమే, ఒసేయ్ అంటూ వుంటే, ఆ పిలుపులో ఎంతో ప్రేమ ఆప్యాయత అనిపిస్తుంది.”
    పెళ్ళైన మూడోరోజు మావాడి (అదేలెండి మావారి)తో అన్నా, నిన్ను మీఇంట్లో అందరూ ఏరా ఒరే అని ఆప్యాయంగా పిలుస్తున్నారుగా నేనూ అలాగే పిలుస్తాను అని. కొత్తపెళ్ళాన్నికదా సరే అన్నాడు. వేరేవాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం నువ్వు అనేదాన్ని. రెండు వారాలు పోయాక ఢిల్లీలో మాచిన్నాన్న ఇంటికి వెళ్ళాము. ఈరెండువారాల అలవాటుతో అందరూ ఉన్నప్పుడే ‘భలేవాడివిరా-అలాచేసావేంరా’ అని అన్నాను. మాచిన్నాన్న ముఖం చూడాలి! అప్పట్నుండీ ఆప్యాయత తగ్గించేసా!!

  3. భలే ముద్దుగా ఉందీ వ్యాసం. మా ఇంట్లో కూడా ఇదివరకూ, అంటే మా అత్తయ్య మావయ్యల జెనెరేషన్లో ఒరేయ్ ఒసేయ్ లు బాగానే వినపడేవి.. మా జెనరేషన్ వచ్చేసరికి నాగరీకం పెరిగో, లేకపోతే అపేక్షలు తగ్గిపోయో, ఆ పిలుపులు వినపడటం మానేశాయి 🙁

Leave a Reply to శాయి రాచకొండ Cancel reply

Your email address will not be published. Required fields are marked *