May 25, 2024

సంపాదకీయం: మార్పు

– కంకణంపాటి శ్వేత

కొత్త సంవత్సరం అందరికి కొత్త ఆశలని రెక్కలు కట్టుకు తెస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వచ్చింది. ముఖ్యంగా మహిళాలోకానికి కొత్త చట్టాలు, ఉన్న చట్టాల సవరణ లాంటివి ఆశలు పెంచడం హర్షనీయం. గత నెలలో జరిగిన నిర్భయ అత్యాచారాన్ని ఖండిస్తూ, మాలిక ఈ పత్రిక బృందం తఱపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఇక అందరు చేసినట్టు ఖండించేసి, నోరు పారేసుకున్న రాజకీయ నాయకులని కసి తీరా తిట్టేసుకుని, ఈ సమస్య పరిష్కరించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే అని ఎదురుచూడటం మాత్రమే పరిష్కారం కాదని ఒక ఆలోచన. సమాజం అనేది మనుష్యులందరం ఏర్పరచుకున్నది. అలా ఏర్పరచుకున్న సమాజంలో కొన్ని అనివార్య ఘటనలు సంభవిస్తే, అది కేవలం ఒక సభ్యునికో, వర్గానికో వదిలెయ్యటం సబబు కాదు. నవసమాజ నిర్మాణానికి అందరం బాధ్యులమే. ఇక మనసుని రోదనతో , బాధతో రగిలించే నిర్భయ పై జరిగిన అత్యాచార ఘటనలాంటివి జరగకుండా చూసుకునే బాధ్యత కూడా మనందరిపైన ఉన్నాయి.

మార్పు రావాలంటే ఎక్కడో కాదు, ముందు మన మనసుల్లో, మన ఇంట్లో మార్పులు తెచ్చుకోవాలి. ఇదేంటి , అక్కడేదో జరిగిందని మనలో మార్పులు అని మాట్లాడుతున్నారు అని ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మార్పు మన నుండి మొదలవ్వాలి, ఎక్కడా అని అడిగితే మన అలోచనా ధోరణి నుండి అని అంటాను. పురుషాధిక్యతా భావాన్ని పురుషుల్లో ఉండకూడదు . అది చిన్నపిల్లలప్పుడే , చిన్నపిల్లలకి తలిదండ్రులు ముందుగా మనం మనుష్యులం, ఆ తరవాతే ఆడ మగా అన్న భావన కలిగించాలి. తరచుగా అమ్మాయివి కదా , ఇలా ఉండాలి అలా ఉండాలి అన్న కట్టుబాట్లతో అదేవిధంగా అబ్బాయివి కదా పరవాలేదులే అన్న అహంకార బీజాన్ని అబ్బాయిలలో మొక్కలోనే తుంచేయాలి. విషాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు భయపడి, పిల్లల మీద ఉన్న మమకారం కొద్దీ మరింత దిగ్బంధించి, గాజు ఇళ్లల్లో  పెట్టినట్టు అపురూపంగా చూసుకోవటం సహజం. అది చాలా మంది తెలియక చేసే పెద్ద పొరపాటు. ధైర్యంగా ఉండాలన్న విషయాన్ని, తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పుకుని, పాసిటివ్ అట్టిట్యూడ్ ని పెంచాలి. పురుషులు, స్త్రీలు సమానంగా పని చేసే యుగం ఇది. సమయానుసారం గా అత్యాచారాలు జరుగుతాయనుకుంటే అది అవివేకం. పగలు జరిగిన అత్యాచారాలు ఎన్నో , బలై పోయిన అమ్మాయిలు ఎందరో . సమయం తో పనిలేదన్నట్టుగానే వేషధారణ కి జరిగే అత్యాచారాలకి సంబంధం లేదు. గ్లోబల్ గా అందరూ ఒక విషయం పై పోరాటం సాగిస్తుంటే, మన దేశం లో ఇంకా మహిళల భద్రత కై పోరాటం చేస్తుండటం సిగ్గు చేటు. అత్యాచారాలు జరగటానికి కేవలం ఒక మనిషి వికృతాలోచనలే కారణం. స్త్రీలంటే చులకన భావం నరనరల్లో జీర్ణించి ఉండటం, దాన్ని సమాజం అంతా కాకపోయినా, కొద్ది మంది ప్రోత్సాహించటమే కారణం. ఇలాంటి సంఘటనలని అవకాశాలుగా తీసుకొని కొంతమంది స్త్రీవాదులు వెదజల్లే పురుషద్వేషం  స్త్రీ పురుషుల మధ్య అంతరాలను పెంచుతోందే గానీ సమాజానికేమీ మేలు చెయ్యట్లేదు. ఈ హీన భావాన్ని ఆదిలోనే త్రుంచి ఒక నవ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *