October 16, 2021

ఆధునిక కవిత్వం – సామాజిక నేపథ్యం – భాషావికాసం

రచన : మాడుగుల గురునాధ శర్మ

కవిత్వం… మౌనం నుంచి జనించి, మాటలలోని మాధుర్యాన్ని తెలిపి, ప్రతి హృదయాన్నీ తట్టి లేపి చివఱకు మౌనం వైపు ప్రయాణించేలా చేయగల అద్భుతమైన శక్తి.

ఉదయం లేచినప్పటి నుండీ, విశ్రమించేవఱకూ మనమెన్ని మాటలు మాట్లాడినా కలగని అనుభూతి కవిత అనేసరికి కలుగుతుంది. కవిత అన్నా మాటలే కదా, ఏముంది తేడా? అనే సందేహం చాలామందికి కలుగవచ్చు. కవిత అంటే ముమ్మాటికీ మాటల మూటే. ఇంకా లోతుకు వెళితే మాటలకే అందని అంతరంగాల కూర్పు.

ప్రాచీన కాలం నుండీ నేటి వఱకూ కవిత్వంలో విభిన్నమైన పోకడలు మనం గమనిస్తూ ఉన్నాం. పద్యాలు కంఠస్థం చేశాం.. నోరు తిరగనంత కష్టమైన వచనభాగాన్నీ చదివాం.. గేయ కవిత్వాన్ని ఆలపించాం.. వ్యావహారిక భాషా విన్యాసాలూ తిలకించాం.. మఱొక్క అడుగు ముందుకు వేసి హైకూలు,నానీలు అంటూ స్వేచ్ఛారీతులను ప్రోత్సహించాం…

అన్నిటి ఉద్దేశమేమిటి అని ఆలోచిస్తే కనిపించే, దొఱికే సమాధానమొక్కటే… సమాజాన్ని ఎప్పటికప్పుడు చైతన్యపఱుస్తూ, సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించటం. మఱి నిజానికి ఉద్దేశమిదే అయినప్పుడు సులభశైలిలో చెప్పవచ్చు కదా, ఇన్ని రీతులెందుకు? అన్న సందేహం కలగవచ్చు… స్థాయి తగ్గేకొద్దీ కవిత్వం మామూలు మాటలుగా మిగిలిపోతుంది. సమాజ చైతన్యం ఎంత అవసరమో, భాషావికాసం కూడా అంతే అవసరం. అందుకే పైన చెప్పుకున్న కవితారీతులలో హైకూల నుంచి, పద్యాల వఱకూ ఒక్కొక్క స్థాయిని దాటుతూ పోతే, స్థాయి పెఱిగేకొద్దీ భాష యొక్క సౌందర్యం ఇనుమడిస్తూ ఉంటుంది. ఇంకా కొత్త పదాలు నేర్చుకోవాలన్న తపన కవులలో తీవ్రమవుతుంది. తద్వారా భాష యొక్క వినియోగం పెరిగి, ఆ భాషకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయములకు ప్రత్యేకమైన గుర్తింపు సంతరించుకుంటుంది.

ఒకానొక కాలంలో పోతన భక్తి తత్త్వాన్ని ప్రబోధించినా, కృష్ణశాస్త్రి భావకవిత్వాన్ని ప్రవచించినా,’పదండి ముందుకు…’ అంటూ శ్రీశ్రీ చైతన్యాన్ని ప్రపంచించినా అన్ని రీతులలోనూ సమాజాన్ని అత్యున్నత స్థితిలో నిలబెట్టాలన్న సందేశం అతి సున్నితంగా,సుందరంగా కనిపిస్తుంది. ఆయా రీతులకు తగ్గట్టుగా భాషావినియోగం సరే సరి.

కాలానికి అతీతమైన కవిత్వం గుఱించే మాట్లాడుతున్నా, మనమున్న కాలాన్ని ఆధునికకాలం అంటున్నాం కాబట్టి ప్రస్తుతకాలంలో కవిత్వం యొక్క నేపథ్యమేమిటో ఒక్కసారి గమనిద్దాం.

ఆధునిక కవిత్వమంటే పద్యరచన, గ్రాంథిక భాషావినియోగం కాక చిన్న, చిన్న కవితలనుకోవచ్చు. కానే కాదు. ఏ కవితారీతిలోనైనా ప్రవాహ సదృశంగా భావాలను పలికిస్తూ, ప్రస్తుత సమాజ స్థితి, గతులకు అనుగుణంగా ఎక్కడికక్కడ ఉన్నతమైన, ఉత్తమమైన భావజాలాన్ని ఏర్పరచటమే ఆధునిక కవిత్వం. అయితే నేటి సమాజంలో అదంత సులభం కాదు, అంత కష్టం అసలే కాదు. ఎందుకు సులభం కాదంటే.. ప్రతి మనిషీ తన ఉనికి కోసం అహర్నిశలూ కష్టపడవలసిన సమయం వచ్చేసింది. ఎవరిని పలకరించినా “ఇప్పుడు సమయం లేదండీ,ఈసారి తీరిగ్గా మాట్లాడతాను” అనేవారే. నిజానికి అలాంటివారికే ఉత్తమమైన సాహిత్యాన్ని చదవవలసిన అవసరమున్నది,కానీ చదవటానికి తీరిక దొరికితే కదా. అసలు తీరిక చేసుకోవటానికి ప్రయత్నిస్తే కదా. ఇక కష్టమెందుకు కాదంటే… అసలే సాంకేతిక పరిజ్ఞానం రాజ్యమేలుతున్న రోజులు… గ్రామాలు మొదలుకుని, దేశాలు, ఖండాల వఱకూ ఒక్కటైపోతున్న పరిస్థితి. ఎక్కడినుంచి, ఏ భావజాలాన్నైనా చిటికెలో దిగుమతి చేసుకునే వీలు కలుగుతోంది. ఆ భావజాలం పదిమంది మేలు కోరేది కావాలన్నదే ఎవరి అభిప్రాయమైనా. అలాంటప్పుడు కవిత్వాన్ని కూడా స్నేహితులకో, బంధువులకో, ఒక గ్రామానికో పరిమితం చేయక ఖండాంతరాలకు వ్యాప్తి చేసే వీలు కూడా ఉన్నట్టే కదా. అందుకే నాటి కవులు వనరులు లేక, తాటాకు పత్రాలపై వ్రాస్తే, నేటి కవులు అంతర్జాలంలోనే తమ రచనలన్నీ పొందుపఱచి, వారిలాగా నిజానికి వారికంటే ఎక్కువగా సామాజికస్పృహను పెంపొందిస్తున్నారు. అయితే వచ్చిన చిక్కల్లా ఒక్కటే.. ప్రపంచీకరణ నేపథ్యంలో భాషకు సరైన గుర్తింపు లభించకపోవటం, తద్వారా కవులు కూడా పరభాషకు సంబంధించిన పదాలు ఎక్కువగా వినియోగించటం. వినియోగించటంలో తప్పు లేదు కానీ, ఎంతవఱకూ? ఏ సందర్భంలో? అన్నవి ప్రధానం. ఎక్కువమందికి అర్థమయ్యేలా చెప్పటం కన్నా, చెప్పదలచుకున్న విషయాన్ని తెలిసినంత మాతృభాషలో చెప్పటం వల్ల ఎక్కువమంది స్ఫూర్తి పొందే అవకాశాలూ ఎక్కువే. దానివల్ల భాష నిలబడుతుంది, ఆ భాషలోని భావన శాశ్వతత్త్వాన్ని పొందుతుంది.

ఏది ఏమైనా సమాజంలోని లోపాలను వివరిస్తూ, అత్యున్నతమైన సందేశాలను గుప్పిస్తూ కవిత్వం చెప్పటమన్నది అనాదిగా వస్తున్న సత్సంప్రదాయమే. నేటి కవులు చేయవలసిందల్లా ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా విభిన్నమైన మార్గాలను అన్వేషిస్తూ,తమదైన శైలిలో గొప్ప,గొప్ప భావజాలాలను అందించటమే. దానికి గాను పూర్వకవుల కృషి నుండి, నేటి సమాజంలోని అసమానతల నుండి స్ఫూర్తిపొందటమే కావలసింది. అంతకుమించి భాష పట్ల అవ్యాజమైన ప్రేమ కలిగి ఉంటే ప్రపంచం కీర్తించదగ్గ కవిత్వం అదంతకదే వస్తుంది. మనం కోరుకునే ప్రపంచ శ్రేయస్సు అదంతకదే కలుగుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *