October 16, 2021

“వలస పోతేనేం.. విద్వత్తు ఉంటే!”

రచన : మంథా భానుమతి

“కుమారయ్యా! కుమారయ్యా!”

గుండీ నదీ తీరాన, మోకాలి లోతు నీళ్లల్లో కాళ్లు ముంచి కూర్చుని, ఆలోచనలో నిమగ్నుడైన కుమారయ్య తండ్రిగారి పిలుపు విని, పాదాలను నదీ ప్రవాహంలో నుంచి బైటికి తీసి నెమ్మదిగా లేచి నిలుచున్నాడు. చింతతో మ్లానమయిన వదనాన్ని, దాచే ప్రయత్నంలో.. తల వంచి, నడుంకి కట్టిన అంగ వస్త్రంతో నుదుటి మీది స్వేద బిందువులని తుడవ సాగాడు.

సూక్ష్మగ్రాహి అయిన అభిమాన చంద్రుడు చెమ్మగిల్లిన తన కుమారుని కన్నులను, ఎర్రబడిన మోమును చూడనే చూశాడు. హృదయం ద్రవించగా, కుమారయ్య వద్దకు వచ్చి తనే వస్త్రాన్ని తీసుకుని, సుతారంగా పుత్రుని మోము అద్ది, అక్కున చేర్చుకున్నాడు. అంతకు మించి ఏమీ చెయ్యలేడు.

ప్రియ సుతుని విచారాన్ని తీర్చగలిగే పరిస్థితి చెయ్యి దాటి పోయింది.

మానవ సంబంధాలని అధిగమించి ప్రజల్ని శాసిస్తున్న మత ఛాందసుల్ని ఎదిరించలేడు. తో్టి మనుషుల్ని ఈ విధంగా నిర్దేశించే హక్కు ఎవరికి ఎవరిచ్చారు? “పదుగురాడు మాటే” వేద వాక్కు అయిపోయింది. వారి చేతలే ఆందరికీ ఆమోద యోగ్యాలయిపోయాయి. అగ్రహారాన్ని మొత్తం శాసించగలిగిన అభిమానం కొరగానిది అయిపోయింది.

నాగరికత నేర్చిన నాటినుంచీ ప్రపంచ చరిత్రలో మతం అత్యధిక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. మతం ప్రాతిపదికగా రాజ్యాలు తలక్రిందులయిపోయాయి. ఏదైనా ఒక మతంలోని పద్ధతులు, సూక్తులు, వ్యావహారిక నమ్మకాలు నచ్చని పక్షంలో ప్రజలు కొత్త పుంతలు తొక్కడం మామూలే. అది ఏ ఒక్కరితోనో ప్రారంభం అయి ప్రజా జీవన శైలిని కదిలించి వేస్తుంది.

పది, పదకొండు శతాబ్దాల మధ్య తెలుగు నాడులో అనేక మార్పులు వచ్చాయి. ఆంధ్ర, తెనుగు భాషలుగా అక్కడక్కడ తెలిసి నప్పటికీ, అప్పటికి ప్రాచుర్యంలో ఉన్న సంస్కృత ప్రాకృతాల చత్ర చాయ నుంచి తెలుగు నుడికారం  ఆవిర్భవించడం తెలుగు సాహిత్య చరిత్రలో అద్భుతమైన ఆరంభం. ఆ తరువాతే మౌఖిక వ్యాప్తి నుంచి, లిఖిత స్థాయికి విస్తృతంగా అందుకుందని విజ్ఞుల విశ్వాసం.

కన్నడ, ఆంధ్ర సాహిత్యాలు కవల సోదరుల్లా అభివృద్ధి గాంచాయి. రాష్టకూటులు, చాళుక్యులు, చోళులు యుద్ధాల ద్వారా గాని, వైవాహిక సంబంధాల ద్వారా కానీ దక్షిణా పధాన్ని ఏలుతూ, అనేక ఆలయాలనూ, శాసనాలనూ చరిత్ర తెలిపే సాధనాలుగా జనావళికి ప్రసాదించారు.

మత పరంగా..  వైదిక సాంప్రదాయపు క్రతువులకి వ్యతిరేకంగా జైన బౌద్ధమతాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ముఖ్యంగా జైన మతం ప్రస్థుత కర్నూలు, ఒంగోలు, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో అధిక ప్రాచుర్యం పొందింది.

కర్నూలు, ఒంగోలు జిల్లాల్లో ప్రవహించే గుండ్లకమ్మనదిని, గుండీ నది అని పిలిచేవారు. ఆ నదీ తీరం లోని ఏడు అగ్రహారాలు, నిరంతరం వైదిక క్రతువులను జరిపే బ్రాహ్మణుల వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేవి. ముఖ్యంగా వంగీపురం యజ్ఞ యాగాదులకు ప్రశస్తి చెందింది.

పదవ శతాబ్ది పూర్వార్ధం..  వంగీపురంలో (నేటి బాపట్ల దగ్గరి వంగిపర్రు).. కుమారయ్య తరం వరకూ వారి వంశం వైదిక మతానికి ప్రతీకగా నిలిచింది. వానో వరదో వస్తే తప్ప ప్రతీ నిత్యం ఏదో ఒక యాగం జరగ వలసిందే. ఆ విధంగా వారి పూర్వీకులు తీర్చి దిద్దారు. అగ్రహారంలో అధిక సంపద వారిదే. అంతా ఒక క్రమ పద్ధతిలో సాగిపోతున్న సమయంలో కుమారయ్యకి, భీమనప్పయ్య అనే కొడుకు రూపంలో సంకటం వచ్చింది. చాలా కాలం ఇంట్లో తెలియనియ్యకుండా కాచుకున్నాడు.

పదే పదే మనుమడు క్రతువులలో పాల్గొనక పోవడం, దానిని కుమారయ్య ఏదో రూపంలో సమర్ధించడం చూసి అభిమాన చంద్రుడు ఒక రోజు నిలదీశాడు. ఆ లోగా భీమనప్పయ్య మిత్రులు తాతగారి చెవిని వెయ్యనే వేశారు. ఊర్లో కూడా చాలా మందికి తెలిసిపోయింది. సమయం కోసం వేచి చూస్తున్నారు.

“భీమనప్పయ్యా!” తాతగారి గర్జన విని కొంచెం కూడా భయపడలేదు మనుమడు. పుట్టినప్పట్నుంచీ ఎంతో గారం చేసిన తాతగారు అపర దూర్వాసుడవగా చూడడం అదే మొదటిసారి. తాను పసివాడుగా ఉన్నప్పుడు ఒడిలో కూర్చుని ఆడుతూ ఎన్నోసార్లు లాగేసినా ఏ మాత్రం కోపం తెచ్చుకోని తాతగారు, అదే జంధ్యాన్ని రెండుచేతులతో సాగదీస్తూ, విశాలమైన వీధి వరండాలో అటూ ఇటూ పచార్లు చేస్తూ ఉగ్రరూపం దాల్చి పిలుస్తుంటే.. గవాక్షం వద్ద నిలిచి సూటిగా ఆయన కన్నుల్లోకి చూశాడు.

“నే విన్నది, చూస్తున్నది నిజమేనా?”

“నేనే చెప్దామనుకుంటున్నాను తాతగారూ!” భీమనప్పయ్య గంభీర కంఠస్వరం విని గృహాంతర్భాగం నుంచి, స్త్రీజనం సహా.. అందరూ బైటికి వచ్చేశారు.

కుమారయ్య అరుగు మీద కూర్చుని గాయత్రీ మంత్రం జపిస్తూ, వణుకుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకొనసాగాడు. అతనికి తెలిసిపోయింది.. ఎప్పట్నుంచో తను రాకూడదని అనుకుంటున్న సమయం రానే వచ్చిందని.

“తరతరాలుగా పాటిస్తున్న సాంప్రదాయాన్ని కాదని కొత్త పుంతలు ఎందుకు తొక్క వలసి వచ్చింది? నీకు సకల విద్యలూ నేర్పించింది ఇందుకేనా? స్వయంగా యజ్ఞ క్రతువులు నిర్వహించగల సామర్ధ్యాన్ని పొంది, రేపో మాపో మా వారసత్వాన్ని అందించాలని అనుకుంటున్న తరుణంలో ఈ వార్త ఎంతటి క్షోభని కలిగిస్తుందో ఆలోచించావా? ఈ వయసులో నాకు ఇది తగునా? వంశప్రతిష్ఠ సర్వనాశనమైపోదూ? మా తండ్రి గారు మాధవ సోమయాజి గారి ఆత్మ ఎంత ఆక్రోశిస్తుందో ఆలోచించావా?” గద్గద స్వరంతో అడిగాడు అభిమానచంద్రుడు.

“అన్ని విద్యలూ అభ్యసించి, సకల శాస్త్రాలూ చదివాను కనుకనే, ఈ ఛాందస భావాల్ని సమర్ధించలేకపోతున్నాను తాతగారూ! యజ్ఞాల పేరుతో జరిగే పశుహింస, ఎంతో శ్రమపడి తయారు చేసిన సంభారాలు అగ్నిహోత్రునికి అర్పించడం.. ఇవేమీ నాకు నచ్చలేదు. అందుకే అహింస, భూతదయ ఉన్న జైన మతమే నాకు సరైనదని నిశ్చయించుకున్నాను.” తన నిర్ణయాన్నినిర్భయంగా చెప్తున్న మనుమడ్ని కించిత్తు క్రోధంగా, ఎంతో బాధగా చూశాడు అభిమానచంద్రుడు.

“సరే! నీ నిర్ణయమే అదైతే తక్షణం ఈ ఇంటిని వదిలి బైటికి నడు.” విసవిసా నడుస్తూ నదీ తీరానికి వెళ్లి నదిలో మునక వేశాడు.

భీమనప్పయ్య, భార్యతో పసివాడైన పద్మప్పతో ఇల్లు వదిలి, ఇటువంటి రోజు వస్తుందని ఊహించి, నది ఒడ్డున నిర్మించుకున్న కుటీరంలోకి ప్రవేశించాడు.

ఇదంతా గతం.. ఒకటో రెండో వత్సరాలు గడిచాయేమో! దినమొక యుగంగా గడుస్తున్న కుమారయ్యకి కాల గమనమే తెలియడంలేదు. చాటునుంచి పుత్ర పౌత్రులని చూసుకుంటూ సాంత్వనం పొందుతున్నాడు. మరి ఇప్పటి ఈ ఆకస్మిక వ్యాకులతకి కారణం?

అది గ్రహించి ఓదారుస్తున్న తండ్రి వక్షస్థలం మీద తల ఆనించి నిశ్శబ్దంగా కన్నీరు కార్చ సాగాడు.

అంతలో.. నీరసంగా ఉన్నా పెద్ద పెద్ద అంగలు వేస్తూ భీమనప్పయ్య అక్కడికి వచ్చాడు.

“ఇంటి నుండి వచ్చేశాక మీతో ఒక్క పలుకైనా పలుకలేదు. ఇక్కడ, ఈ నదీ తీరాన.. ఈ ప్రకృతి కులమత భేదాలు లేకుండా అందరిదీ అని భావించుకుని, నే నొక మాట చెప్పవచ్చా తాతగారూ?”  ఆజానుబాహుడై, కండలు తిరిగిన శరీరంతో ఉండే భీమనప్పయ్య చిక్కి శల్యమైనాడు. ముఖంలో కళ్లు, ముక్కు తప్ప ఇంకేమీ కానరావట్లేదు. అయినా.. ఆ కళ్లల్లో ధృడ నిశ్చయం. పట్టు వదలని పంతం.

…………………………..

ఎన్ని రోజులయింది.. తన ప్రాణంలో ప్రాణం.. చూడకుండా ఎలా ఉండ గలిగాడు? ఎటువంటి వాడు ఏ విధంగా అయిపోయాడు? కానీ ఇదే భావం వానికి కూడా ఉండాలి కదా! ఎందుకంత పట్టుదల? కడుపులో కదలిపోతున్న పేగులని అదుపులోకి తెచ్చుకుని, భృకుటి ముడిచి మనుమడిని చూశాడు అభిమానచంద్రుడు.

కాదు.. కాదు.

ఇప్పుడితడు తన మనుమడే కాదు. వేదాలు ఉద్భవించిన నాటి నుంచీ నరనరానా జీర్ణించుకుని పోయిన ధర్మాన్ని వదిలి.. మాతా పితరులని వదిలి, కుటుంబాన్ని, అనుబంధాలను తృణప్రాయంగా త్రోసి వేసిన మూర్ఖుడు.

చేతిలోని కర్రని పైకి లేపి నేలకి దాటించి తల కొద్దిగా పైకి లేపాడు.. చెప్పవచ్చు అన్నట్లుగా!

“ఇంక అగ్రహారంలో ఉండలేము తాతగారూ! ప్రతీ వ్యక్తికీ వారి వారి నమ్మకాలు ఉంటాయి. ఆ స్వేఛ్ఛని గౌరవించలేని చోట మనుగడ దుర్భరం అవుతుంది. ఇంత కాలం తండ్రిగారు రహస్యంగా మాకు సహాయం చేస్తూ మా ఊపిర్లు నిలిచేలా చేశారు. ఇపుడు దానిని కూడా వ్యతిరేకిస్తున్నారు అగ్రహారపు పెద్దమనుషులు.

మేము ఎవరికీ అడ్డు రాకుండా పొలం పనులు చేసుకుంటూ, అడవిలో దొరికిన పళ్లు, కాయలు తింటూ జీవించడం కూడా కంటకమై పోయింది. వంశ పారంపర్యంగా వచ్చే ఆస్థిపాస్థులకి మేము అనర్హులమయ్యాము మీ దృష్టిలో.. నా మానాన, నేను నమ్మిన జైన మతగ్రంధాలని పఠించుకుంటూ ఉంటే ఆ గ్రంధాలని అగ్ని పాలు చేశారు. ఆకలినైనా తట్టుకోగలము కానీ నా విశ్వాసాన్ని దెబ్బతీసే చోట ఉండలేను. సెలవు తాతగారూ!” చేతులు కట్టుకుని నిలబడ్డాడు భీమనప్పయ్య. వెనుకే సహధర్మచారిణి, తల్లి కొంగు గట్టిగా పట్టుకుని అమాయకంగా చూస్తున్న రెండు సంవత్సరాల పద్మప్ప.

భీమనప్పయ్య చేతిలో కర్ర, భుజానికి వేళ్లాడుతున్న సంచీ.. అందులోనుంచి తొంగి చూస్తున్న చిరుగులు పట్టిన వస్త్ర సముదాయం. ఇంకేమీ లేదు.

“ఎక్కడికి వెళ్దామని? అక్కడ ఏమి చేద్దామని? ఏ విధంగా మనుగడ సాగిద్దామని? ముక్కుపచ్చలారని పసికందుని అష్టకష్టాల పాలు చేసి ఏం నిర్వాకం చేద్దామని? ఇప్పటికైనా మించింది లేదు.. ప్రాయశ్చిత్తం చేయిస్తా. వైదిక మతాన్ని స్వీకరించు. హాయిగా కుటుంబంతో కలిసిపో. తరతరాల వారసత్వాన్ని నిలుపు.. నీ సంతానానికి ప్రాప్తింపజేయి..” అభిమానచంద్రుడు బ్రతిమాలుతున్నట్లు, సౌమ్య స్వరంతో అడిగాడు.

“లేదు తాతగారూ! మీ నమ్మకాలని మార్చుకొమ్మని నేను అడగనప్పుడు నన్ను ఈ విధంగా నిర్బంధించడం ఉచితం అనిపించడం లేదు. నన్ను వెళ్లనివ్వండి. ఉత్కృష్టమైన ఈ మానవ జన్మని ప్రసాదించినందుకు సదా నా తల్లిదండ్రులకు, వంశ పెద్దలకు కృతజ్ఞుడనై ఉంటాను.” వణుకుతున్న తాతగారి గద్గద స్వరం వింటుంటే భీమనప్పయ్య కన్నులు చెమరించినా ధృడనిశ్చయంతో అన్నాడు.

“అగ్రహారాన్ని వదిలివెళ్లడానికే నిశ్చయించుకున్నావా?” కుమారయ్య ఆఖరి ప్రయతంగా అడిగాడు.

“అవును తండ్రీ! జినేంద్ర ధర్మాన్ని విసర్జించలేను.”

“ఎలా బ్రతుకుతావు? భార్యా బిడ్డల్ని ఏవిధంగా పోషిస్తావు? ఇన్నిన్ని సిరి సంపదల్ని వదలుకుని.. ఎక్కడ..” కుమారయ్య దుఃఖంతో మాట పూర్తి చెయ్యలేకపోయాడు.

“జైన మతాన్ని, జైనుల్ని ఆదరించే పల్లెలు, ప్రభువులు ఉన్న చోటికి. ఇదే మన ఆఖరి చూపు..”

తాతకి, తండ్రికి పాదాలంటి నమస్కరించి, వెను తిరగకుండా కదిలారు.. భీమనప్పయ్య, పద్మప్పని భుజాలమీద కూర్చుండబెట్టుకున్నాడు. భార్య వెనువెంట నడిచింది.

……………………….

అపరాహ్ణం దాటింది.. సూర్యోదయం అయిన వెంటనే బయలుదేరినా ఒక యోజనం కూడా నడిచినట్లు లేదు. దక్షిణ, పశ్చిమ దిశగా పయనం సాగించారు భీమనప్పయ్య కుటుంబం. జినేంద్ర ధర్మం అటు పక్కనే ఆదరించబడుతోందని వినికిడి.

పసిబిడ్డతో, సరైన అన్నపానాదులు లేక క్షీణించిన శరీరాలతో నడక ప్రాణాంతకంగా ఉంది. సూర్యాస్తమయం లోగా ఏదయినా పల్లె, వసతికి సత్రం దొరుకుతాయో లేదో సందేహమే. అంతలో పద్మప్ప ఏడుపు మొదలు పెట్టాడు.. ఆకలికి తాళలేక అని తెలుస్తూనే ఉంది. వెంట తెచ్చుకున్న కదళీ ఫలాలని ఎప్పుడో ఆరగించేశాడు. దిక్కు తోచక ఒక చెట్టునీడన చదును చేసుకుని విశ్రాంతి తీసుకుందామనుకున్నారు.

తాము వచ్చిన దారి వెంట ఏవో శబ్దాలు వినిపిస్తే పరికించి చూశాడు భీమనప్పయ్య.

నలుగురు బోయీలు తేలికైన పల్లకీ మోసుకుని వస్తున్నారు.

ఎవరో.. కలిగిన కుటుంబంలోని స్త్రీలకోసం వెళ్తున్నాది కాబోలు. వంగీపురం సరిహద్దు పల్లె విక్రమపురం బోయీల్లాగ ఉన్నారు.. ఎచటికో వారి పయనం.. కొంత దూరమైనా పసివాడినీ, తల్లినీ..

ఒక్కసారి తన ఆలోచనకి తనే సిగ్గుపడ్డాడు. పోనీ పసిబిడ్డకి కాసిని క్షీరబిందువులైనా.. ఆ మేనా తమ వద్దకే వచ్చి ఆగింది. కిందికి దించి, ఒక బోయీ భీమనప్పయ్య దగ్గరగా వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

“తాతగారు పంపారండి. అమ్మగారిని, చిన్న గురువుగారినీ మేనాలో ఎక్కించి, మిమ్మల్ని సబ్బినాడులో దించి రమ్మన్నారు.”

కాళ్లు తేలిపోతున్నట్లుండి, పక్కకి ఒరిగిపోతున్న భార్యని రెండు చేతులతో పొదివి పట్టుకున్నాడు భీమనప్పయ్య. నెమ్మదిగా చదును చేసిన స్థలంలో కూర్చుండ బెట్టాడు. మేనా కింది తొట్టిలో నున్న సంభారాల్ని చూస్తుంటే భీమనప్పయ్యకి కంట నీరు ఆగలేదు. ఒక మాసం పైగా సరిపోతాయవి తమకి.

“ముందుగా ఈ పళ్లు ఆరగించండి బాబుగారూ! ఈ లోగా మేము పొయ్యి ఏర్పాటు చేసి వెలిగించి ఉంచుతాము.. అమ్మగారికి వీలుగా.. వంటకి గిన్నెలు కూడా ఇచ్చారండి తాతగారు. ఇవిగో ఈ నాణాలు మీకందించమన్నారు. కొత్త చోటు ఇబ్బంది పడకూడదని.. కాస్త నిలదొక్కుకునే వరకూ! మిమ్మల్ని జాగరూకతతో ఉండమన్నారు. వీరశైవులు మా వలే అగ్రహారం నుంచి పంపించి ఊరుకోరని చెప్పమన్నారు.” బంగారు నాణాల మూట ఇచ్చాడు బోయీ.

కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూశారు భార్యాభర్తలు.

రక్తపాశం అన్నింటికంటే గొప్పది. ఏ మతమూ దానిని అడ్డుకోలేదు. ఊరి పెద్దగా అగ్రహారీకులని నొప్పించలేక ఊరుకున్నారు కానీ.. తాతగారు తమని వెళ్లనిచ్చేవారా?

అభిమానచంద్రుని హెచ్చరిక సముచితమైనదే.

సింధు నాగరికత నాటి నుంచీ వైదిక మతం, జైన మతం సమాంతరంగా వృధిపొందుతూ వచ్చాయి. శ్రమణ పద్ధతిలో యోగము, అహింస, వైరాగ్యము, శాకాహారము ఆదిగాగల నమ్మకాలతో ఉన్నది జైనమతం. యజ్ఞయాగాది క్రతువులతో, వేద విరచితమైన ధర్మాన్ని పాటించేది వైదిక మతం. అనేకమంది రాజులు జైనమతాన్ని అనుసరించేవారు. ఎనిదవ శతాబ్దం నుండీ ఆదిశంకరుని వైదిక మత పునరుద్ధరణ ఆదిగా జైనమతం ప్రాముఖ్యతని కోల్ఫొవడం ఆరంభించింది. సుందర పాండ్య చక్రవర్తి, తనతో వైదిక మతం ఆచరించడానికి నిరాకరించారని ఎందరో తమిళ జైనులని మతద్వేషంతో హింసించాడు. మరింతగా దక్షిణానికి వెళ్తే తమకీ అదే గతి పడుతుందని తాతగారి భయమనుకున్నాడు భీమనప్పయ్య.

నిజమే.. కన్నడ ప్రాంతానికి దగ్గరగా నున్న సబ్బినాడు (నేటి నిజామాబాద్ ప్రాంతం) జైనులకి సురక్షితం. బహుధాన్యపురి (బోధన్) రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఛాళుక్యులు పాలిస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలు తెలుగు వారయినా దేశాన్నేలే ప్రభువులు కన్నడీగులు. రాజభాష కన్నడం. గ్రామాలలో పాలన అప్పగించిన డెబ్భైరెండు నియోగాలవారిలో కర్ణాటకము నుండి వచ్చిన వారే అధికులు.

భాష ఏదయితేనేమి.. తను నమ్మిన సిద్ధాంతం ముఖ్యమనుకున్నాడు భీమనప్పయ్య.

…………………………………

వాయవ్య దిశగా సాగింది మేనా. సూర్యాస్తమయం అవకముందే కృష్ణా తీరాన్ని దాటి గార్థపురి ప్రాంతం చేరారు. బోయీలు చాలా అనుభవం ఉన్నవారు. అటు తూర్పున కళింగ దేశం నుంచీ ఇటు పశ్చిమాన ధార్వాడ పరగణాల వరకూ తరచుగా తిరుగుతూనే ఉంటారు.

ఆ కాలంలో సబ్బినాడు నేలే రాజు యుద్ధమల్లుడు. అతని కుమారుడు ఇమ్మడి నరసింహదేవర, రాష్ట్రకూట చక్రవర్తికి దగ్గరి బంధువు. స్వయాన బావమరదే నంటారు. సామంతుడైన నరసింహదేవర, చక్రవర్తి తరఫున ఎన్నో యుద్ధాలలో పాల్గొని విజయాలు సాధించాడు. సప్త మాళ్వ దేశాలను (మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాలు) ఓడించి ఆ ప్రభువుల చేత కప్పం కట్టించుకున్నాడు. గంగాతీరం వరకూ సాగి ఘార్జర దేశాన్ని జయించి గంగలో తానమాడాడు.

ఆ జైత్ర యాత్రలలో భాగంగా శాంతి చిహ్నంగా అనేక కుటుంబాలలో వైవాహిక సంబంధాలు కూడా ఏర్పడుతుండేవి. నవ వధువులు, వారితో పరివారము.. అటూ ఇటూ వలసలు వెళ్ల వలసిందే. అదిగో.. ఆ విధంగానే భీమనప్పయ్య కుటుంబాన్ని మేనాలో తీసుకెళ్లే బోయీలకి ఆ ప్రాంతాల మార్గాలన్నీ కరతలామలక మైపోయాయి. ఏ చోట ఏ పల్లె ఉంటుందో.. ఎక్కడ తమకి వసతి సదుపాయాలు దొరుకుతాయో మార్గ రచన చేసుకోవడం తెలుసును. ఎక్కడ మత ఛాందసులు వాదోపవాదాలకి దిగి కయ్యానికి కాలు దువ్వుతారో ఆ ప్రాంతాలని తప్పించుకుని వెళ్లడం కూడా తెలుసు. అభిమాన చంద్రునికి భవిష్యత్తులో జరగబోయే సంఘటన తెలుసును కనుకనే, ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు.

తాతగారు ఈ విధమైన ఏర్పాటు చెయ్యడంతో భీమనప్పయ్యకి నెత్తిమీది భారమంతా దిగినట్లయింది. అడుగులు బోయీలతో సమంగా పడసాగాయి. మధ్యలో ఏర్లు దాటారు. కొండల్లో కోనల్లో నడిచారు. పల్లె కానరాని చోట, నెగడు పట్టుకుని, ఆరుబయటే నిద్రించారు.. వంతు ప్రకారం కాపలా ఉండి.

సబ్బినాడుకు చేరేనాటికి.. భీమనప్పయ్య, భార్య, కొడుకు వారి సహజ శరీర ధారుడ్యాన్ని పొందారు.. రోజుకి రెండు మార్లు కడుపునిండా భోజనం దొరుకుతుండడంతో.

దారి అంతా భీమనప్పయ్య జినేంద్ర ధర్మ ప్రాశిస్థ్యాన్ని వివరిస్తూ వచ్చాడు. ఇక్ష్వాకు వంశ మూలపురుషుడైన వృషభ తీర్థంకరుడి నుంచీ, వర్ధమాన మహావీరుడి వరకూ ఇరవై నలుగురు తీర్థంకరుల గురించి, పద్యాలలో పాటలలో వివరించాడు. మేనా తెర తొలగించి పద్మప్ప అక్షరం పొల్లుపోకుండా అంతా విన్నాడు. ఆ పసివాడికి ఏమర్ధమయిందో మరి.. లీలావతి కడుపులో ఉండగానే ప్రహ్లాదుడు నారాయణ మంత్రం తెలుసుకోలేదూ? ఏదీ అసంభవం కాదు. కాలక్షేపానికి భీమనప్పయ్య చెప్పిన కథలు ఏ మహాకావ్యానికి నాంది పలుకనున్నాయో!

సబ్బినాడుకు చేరాడే కానీ ఎక్కడికి వెళ్లాలి? ఏం చెయ్యాలి? భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది?

సత్రం వద్ద మేనా దించి, చేతులు కట్టుకుని నిలబడ్డాడు బోయీల పెద్ద.

“రేపు సూర్యోదయంతోనే బయలుదేరి వెనుకకు మళ్లుతామయ్యా! తాతగారికి మీ యోగక్షేమాలు చెప్పాలి.”

నీళ్లు నిండిన కన్నులతో వీడ్కోలు పలికి కొన్ని నాణాలను ఇవ్వబోయాడు భీమనప్పయ్య.

“వద్దు బాబుగారూ! మీరు కొత్తప్రాంతానికి వలస వచ్చారు.. స్థిర పడడానికి కొంత కాలం పట్టవచ్చు. ఉండనివ్వండి. మాకు తాతగారు తగిన మూల్యాన్ని ఇచ్చారు. మీరు చాలా బాగా పాటలు, పద్యాలు చెప్తారయ్యా.. బ్రతుకు తెరువు మీకు కష్టమేమీ కాదు..”

నిజమే! విద్యత్తు ఉంటే అవనిలో ఏ ప్రాంతమయినా ఒక్కటే..

మరునాడు ఉషోదయంతో కను మరుగవుతున్న మేనాకి అద్దిన తళుకులు, ఎర్రని సూర్యకాంతుల్ని స్తంభం వద్ద నిలబడిన పద్మప్ప మీదికి ప్రతిబింబిస్తూ ఉంటే.. ఆ పాపని మోము భాస్కరుని బింబంతో పోటీపడి, భీమనప్పయ్యకి ఆశాజనకమైన భవిష్యత్తును గోచరింపచేసింది.

*——————————-*

3 thoughts on ““వలస పోతేనేం.. విద్వత్తు ఉంటే!”

  1. భానుమతి గారు కథ చాలా బాగు౦ది. కథల్లో వైవిధ్య౦
    ౦ చూపి౦చట౦లో మీకు మీరేసాటి అనిపి౦చుకున్నారు

  2. కదా చాల బావుంది పిన్ని! ఇలా చరిత్ర లో మరుగునపడ్డ తెలియని వాస్తవాలు ఎన్నో ఎన్నోన్నో కదా! చాల బాగా రాసావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *