April 24, 2024

ఆంధ్ర సాహిత్యంలో శతకవాఙ్మయం – ఒక పరిశీలన

రచన : దేవరకొండ సుబ్రహ్మణ్యం

శతకాల గురించి తెలియని తెలుగువాడు ఈ తెలుగుగడ్డ మీద ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. మన చిన్నప్పటినుంచి అన్నిటితో పాటు తెలుగువాచకంలో మనకి నేర్పిన వాటిలో ఇవి ఇప్పటికి మన జ్ఞాపకాల్లో చెక్కు చెదరకుండా నిలిచిపోయాయి. వేమన శతకం (ఉప్పుకప్పూరంబు నొక్కపోలికనుండు), సుమతీ శతకం (శ్రీరాముని దయచేతను), కృష్ణ శతకము (నీవే తల్లియు తండ్రియు), దాశరధీ శతకము, కాళహస్తీశ్వర శతకము, లోని పద్యాలు మన చిన్నప్పుడు అర్ధం తెలిసినా తెలియకపోయినా బట్టియం వేసినవాళ్ళమే. తరవాత కాలేజీలలో అంత పెద్దగా చదువక పోయినా చిన్నప్పటి పద్యాలు గుర్తుకొచ్చినప్పుడు అహా ఎంత బాగుంది, ఎంత అర్థం ఉంది అనుకోవటము చాలమందికి అనుభవంలోకి వచ్చిన విషయమే.

సంస్కృత, ప్రాకృత, తమిళ, కన్నడ భాషాసాహిత్యలలో ప్రారంభమైన శతక ప్రక్రియ ఆంద్రసాహిత్యంలో తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. సంస్కృత, ప్రాకృత భాషల్లో జైన బౌద్ధ శతకాలు అనేకం వెలిసాయి. కన్నడ భాషలో మొదటి శతకం మల్లికార్జున పండితునిగా చెపుతారు.  తెలుగులో మొట్టమొదటి శతకము ఏదీ? అనే విషయంలో ఇంకా కొంత వాదనలు ఉన్నా పాల్కురికి సోమనాథకవి 12వ శతాబ్దంలో వ్రాసిన “వృషాధిప శతకము” శతక లక్షణాలను అనుసరించి వ్రాసిన మొదటి శతకంగా చాలామంది పండితులు అంగీకరించిన విషయం. అప్పటినుంచి ఈనాటివరకు ఈ శతకరచన ఎన్నో క్రొత్తదారులు తొక్కుతూ తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ఠ స్థానాన్ని సంపాదించుకుంది. ఆకాలం నుండి నేటివరకు అనేకమంది కవులు ఎన్నో శతకాలను మనకందించారు. కొంతమంది శతకకారులు పదులు వందలలో కూడా శతక రచనలు చేసినట్లు చెప్పుకొన్నారు. అయితే చాలామంది ప్రబంధ కవులు తమ రచనలలో ప్రబంధాలను మాత్రమే పేర్కొని, శతకరచనలు చేసినా వాటిని పేర్కొనలేదు. కారణాలు మాత్రం అంతగా తెలియరావు. ఆదిలో అప్పకవీయం వంటి లక్షణగ్రంధాలలో అలంకార లక్షణాలకు శతకపద్యాలను ఉదహరించినా 20వ శతాబ్దంకి మధ్య కాలానికి వచ్చేసరికి ఈ సాహిత్య ప్రక్రియపై ఆసక్తి సన్నగిల్లిందనే చెప్పాలి. కందుకూరి వీరేశలింగంగారి కవులచరిత్ర లో ఈ శతకకవుల చరిత్రలు పొందుపరచకపోవటం ఇందుకో ఉదాహరణ. ఎందరో కవులు ఎన్నోసందర్భాలలో చెప్పిన శతకాలు ఇప్పటివరకు ఎన్ని అనేది ఒక అంచనాకి రావటం కష్టమే. “కాదేది కవిత కనర్హం” అన్నట్లు శతకాలు ఒక్క భగవంతుని గురించే కాక అనేక సందర్భాలలో అనేక విషయాలలో చెప్పబడ్డాయి. ఇంత వైవిధ్యం ఉన్న శతకాలు లభిస్తున్నప్పటికీ మన శతక కవులు శతక రచనకు కొన్ని నియమాలను, కొన్ని లక్షణాలను ఏర్పరుచుకొని ఆ నియమాలను అనుసరిస్తూనే శతక రచనలను సాగించారు.

శతక లక్షణాలు

1. సంఖ్యా నియమం: శతకం అనగా వంద. ఈ విధంగా చూస్తే శతకం వందపద్యాలకు పరిమితం కావాలి. ఐతే సంస్కృత సంప్రదాయం అనుసరించి శతకాలలో 100, 108, 116 పద్యాలవరకూ వ్రాయటం ఆచారంగా తీసుకొన్నారు. వంద పద్యాలకు తక్కువగా ఉన్న పద్యాలుకల రచనలను శతకం అనటానికి వీలు లేదు. శతక రచనలో సంఖ్యకు ప్రాధాన్యత ఉండటం వలన అంతకు పైబడిన పద్యాల రచనలను ద్విశతి (200), త్రిశతి (300), పంచశతి (500), సప్తశతి (700) అనే సంప్రదాయం ఏర్పడింది. వెయ్యిపద్యాలకు పైన ఒకే మకుటంతో ఉన్న పద్యాలున్న రచనలను కూడా శతకంలో చేర్చారు. వేమన పద్యాలు 3000కు పైగా ఉన్నా ఒకే మకుటంతో ఉండటంవలన వేమన శతకం అని పిలవబడుతున్నది.

2. మకుట నియమం: శతకంలోని చివరిపాదం గానీ, పాదాంతంలో గానీ ఒక పేరును సంభోదిస్తూ ఉంటుంది. దీనినే మకుటం అంటారు. ఈ మకుటం సంభోదనా విభక్తియై అన్ని పద్యాలలో సమానంగా ఉంటుంది. ఉదాహరణకు వేమన శతకంలో విశ్వధాభిరామ వినురవేమ, కాళహస్తీశ్వర శతకంలో శ్రీకాళహస్తీశ్వరా, నారాయణ శతకంలో నారాయణా, అనేవి ఆ శతకాలకు మకుటాలు.

3. వృత్త లేక చంధో నియమం: శతక మకుట నియమం వలన శతకంలోని ప్రతిపద్యాన్ని ఒకటి లేక రెండు వృత్తాలలోమాత్రమే వ్రాయటానికి కుదురుతుంది. అందుచేతనే ఈ నియమం ఏర్పడుతున్నది. ఉదాహరణకు దాశరథీ శతకంలో “దాశరధీ కరుణాపయోనిథీ” అనే మకుటం చంపకమాల, ఉత్పలమాల వృత్తాలకు మాత్రమే కుదురుతుంది. అలాగే కాళహస్తీశ్వర శతకంలోని “శ్రీకాళహస్తీశ్వరా” అనే మకుటం మత్తేభ శార్ధూల వృత్తాలకు మాత్రమే కుదురుతుంది. ఐతే ఒకే వృత్తంలో సంపూర్ణ శతకాలు కూడా చాలానే ఉన్నాయి. సీసపద్య శతకాలు, కందపద్య శతకాలు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

4.రస నియమం : శతకాలన్నిటిలోను ఒకే రసం ప్రతిపాదించబడాలి. భక్తి రస శతకాలలో భక్తిరసంతో కూడిన పద్యాలు మాత్రమే వస్తాయి. వీర, రౌద్ర, హాస్య రసాలకు ఇక్కడ తావు ఉండదు.

దాదాపుగా మన తెలుగు శతక సాహిత్యంలో పై నియమాలను అనుసరిస్తూనే రచనలు చేసారు. ఇప్పటికీ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది కొన్నిచోట్ల ఈ నియమాలను పాటించక రచనలు చేసారు. ఉదాహరణకి సంబోధనా విభక్తి మాత్రమే శతక మకుటలో ఉంటుంది కానీ “రంగశాయి శతకం”లో సంభోదన విభక్తికి బదులు గోపాలుడు రంగశాయి మన పాలగలడు విచారమేటికిన్ అనే మకుటంతో, నార్లవేంకటేశ్వరావు గారి శతకంలో వాస్తవమ్ము నార్లవారి మాట అనే మకుటంతో వ్రాసారు. కొన్ని శతకాలు సంస్కృతాంధ్ర మిశ్రమ రచనలైతే, మరికొన్ని అచ్చ తెలుగు శతకాలు మరి కొన్ని గ్రామ్యభాష లో రచించబడ్డాయి.

దశకవిభాగం: కొన్ని శతకాలలో ఈ దశకవిభాగం అనే ప్రక్రియ కనిపిస్తుంది. అంటే శతకంలోని ప్రతి పది పద్యాలను ఒక విభాగంగా చేసి వానిని ఒక శీర్షిక క్రింద వ్రాయటం. ఉదాహరణకి నారాయణ శతకంలో ఆది, అవతార,, దివ్యరూప, నామ, కృష్ణవతారవిశంతి, జ్ఞానవిశంతి, మోక్షవిశంతి అనే విభాగాలున్నవి. ఇదేవిధంగా భర్తృహరి నీతి శతకంలో, శృంగార, వైరాగ్య శతకాలలో కూడా దశకవిభాగం కనిపిస్తుంది.

శతక వర్గీకరణ

ముందుగా చెప్పినట్లు శతకాలు అనేక విషయాలపై, అనేక సందర్భాలలో రచించినవి కావటంవలన వానిలో అత్యంత వైరుధ్యం కనిపిస్తుంది. ఈ వైరుద్యాన్ని దృష్టిలో ఉంచుకొని శతకాలను ఈ క్రిందివిధంగా వర్గీకరించవచ్చు.

1. భక్తి శతకాలు : ఈ శతకాలు భక్తిరస ప్రాధాన్యాలు. వీనిని మరల (అ) శివభక్తి, (ఆ) విష్ణుభక్తి, (ఇ) దేవీభక్తి (ఈ) ఇతర దేవతా శతకాలు (ఉ) మానవస్తుతి ప్రతిపాదకాలుగా విభజించవచ్చు.

2. శృంగార శతకాలు : భగవంతుని శృంగార లీలలను వర్ణిస్తు చెప్పిన వేంకటేశ్వర శతకము, అంబికాశతకము లాంటి శతకాలతో మొదలై కాలక్రమేణా శృంగార రసముతో శతకాలు వచ్చాయి. స్త్రీ, పురుష విరహ వర్ణన, శృంగార భావనలు ఈ శతకాల ప్రధాన విషయం. కలువాయి శతకం, గోరంట్ల మాధవ శతకం, లావణ్య శతకము, భోగినీ శతకము మొదలైనవి ఈ కోవకి చెందుతాయి.

3. నీతి శతకాలు : మనవ మనుగడకి మూలము ధర్మము నీతి. ఇటువంటి నీతిని మానజాతికి సులభంగా అర్ధమయ్యే రీతిలో తెలియచేయటానికి నీతి శతకాలు ఎంతో దోహదం చేస్తాయి. సుమతీ, భాస్కర, కుమారీ, కుమార, మానినీ వంటి శతకాలు ఈ కోవలోకి వస్తాయి.

4. వేదాంత (తాత్విక) శతకాలు : భగవంతుని చేరే జ్ఞానమార్గాన్ని తెలుపుతూ చేయబడిన శతకాలు. వీనిలో వివిధ మతసిద్ధాంతాలు, తాత్విక విషయాలు, వైరాగ్యమార్గం వంటివి ప్రధాన విషయం. సదానందయోగి శతకము, శివముకుంద శతకము, సంపంగిమన్న శతకము, దత్తయోగీంద్ర శతకము ఈ కోవకి చెందిన శతకాలు.

5. హాస్య శతకాలు : ఇవి హాస్యరస ప్రధాన శతకాలు. ఒక చిన్న విషయాన్ని తీసుకొని నవ్వు పుట్టించే విధంగా వర్ణిస్తూ చెప్పినవి. ఇందులో హాస్యమే ప్రధానాంశం. పొగచుట్ట శతకము, పకోడీ శతకము, విసనకర్ర శతకము, చీపురుపుల్ల శతకము, పిల్లి శతకము లాంటి శతకాలు ఈ కోవకి చెందుతాయి.

6. చారిత్రిక శతకాలు : చారిత్రిక, రాజకీయ సంఘటనల ఇతివృత్తంగా చెప్పిన శతకాలు ఈ కోవలోకి వస్తాయి. ఆంధ్రనాయక శతకము, సింహాద్రి నారసింహ శతకము, భద్రగిరి శతకము, విశ్వేశ్వర శతకము మొదలైనవి ఈ వర్గంలోకి చెందుతాయి.

7. జీవిత చారిత్రిక శతకాలు : గొప్పవారి జీవిత చరిత్రలు శతకరూపంలో కొంతమది కవులు వ్రాసారు. ఉదాహరణకి కృష్ణమూర్తి శతకము ఈ కోవలోకి వస్తుంది.

8. స్వీయచరిత్ర శతకాలు : కొంతమంది కవులు తమ ఆత్మకధను శతకరూపంలో వ్రాసికొన్నారు. హరిహరేశ్వర శతకము, బిల్పేశ్వర శతకము, కామేశ్వరీ శతకము మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.

9. వ్యాజ్య నిందాస్తుతి శతకములు : కొందరు కవులు తమకు కలిగిన కష్టాలను కానీ, సమాజంలోని అన్యాయాలను కానీ చూచి భరించలేక భగవంతుని ఎత్తిపొడుస్తూ, ఆయనలోని గుణాలను లోపాలుగా చూపిస్తు వ్యాజ్యనిందలో స్తుతించారు. ఆంధ్రనాయక శతకం, విశ్వేశ్వర శతకం, భద్రగిరి శతకం, సింహాద్రి నారసింహ శతకం, వేంకటేశ్వర శతకం మొదలైనవి ఈ కోవలోకి వచ్చే కొన్ని శతకాలు.

10. కథా శతకాలు : కొందరు కవులు ఒక కథని వస్తువుగా స్వీకరించి ఆ కథను శతకరూపంలో వ్రాసారు. ముకుందరాఘవ శతకం, లవకుమార శతకం, భాగవత ప్రధమ స్కంధ శతకం, భాగవత దశమ స్కంధ శతకము మొదలైనవి కధా శతకాల కోవలోకి వస్తాయి.

11. సమస్యాత్మక శతకాలు : ఇవి ఇచ్చిన ఒక సమస్యను పద్యపాదమకుటంగా చేసుకొని చెప్పిన శతకాలు. సత్యవతీ శతకం, అనుభవరసిక శతకం మొదలైన శతకాలు ఈ పద్ధతిలో వచ్చిన శతకాలు.

12. నిఘంటు శతకాలు : 12 శతాబ్ధంలో వెలువడిన అచ్చతెలుగు నిఘంటువులు శతకరూపంలో ఉండేవి. వేంకటేశాంధ్రం, సాంబనిఘంటువు, ఆంధ్రభాషార్ణవము, మొదలైనవి నిఘంటు శతకాలు.

13. అనువాద శతకాలు : ఇతరభాషల్లో నుండి తెలుగు భాషలోకి అనువదించిన శతకాలన్ని ఈ విభాగంలోకి వస్తాయి. సూర్యశతకం, సౌందర్యలహరి, గాథాసప్తశతి, శివానందలహరి, మొదలైన అనేక సంస్కృత, ప్రాకృత కావ్యాలు శతక రూపంలో తెలుగులోనికి అనువదించబడ్డాయి.

14. అచ్చతెలుగు శతకాలు : 18వ శతాబ్ధం నుండి మొదలైన అచ్చతెలుగు శతకాలలో ఇతర భాషలు వాడక పూర్తిగా తెలుగు పదాలతోనే శతకరచన చేసిన కవులున్నారు. భళిరా కరివేళ్పు శతకం లాంటివి ఈ కోవకు చెందే శతకాలు.

15. చాటు శతకాలు : సందర్భోచితంగా అనేక విషయాలపై చెప్పిన ఒకే మకుటంగల శతకాలు. రఘుపూరి కేశవ శతకము, రామతీర్థ శ్రీరామ శతకము మొదలైనవి ఈ వర్గంలోకి వస్తాయి.

ఐతే ఈ విధంగా 12వ శతాబ్ధి నుండి ఈ నాటి వరకు వచ్చిన శతకాలు ఎన్నీ అనే విషయంపై ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రావటం కష్టమైన పని. 1957లో పండిత వంగూరి సుబ్బారావు గారు రచించిన “శతక కవుల చరిత్రము” లో దాదాపు 1200 శతకాలు 900 మంది శతక రచయితలను పరిచయం చేసారు. వీనిలో అప్పటికి లభ్య, అలభ్య శతకాలను కూడా చేర్చారు. ఈ సంఖ్య దాదాపు 60 ఏళ్ళ క్రితం వరకు జరిగిన శతకాలను సూచిస్తుంది. ఆ తరువాత అంటే 1957 నుండి ఇప్పటివరకు ఎన్ని శతకాలు వచ్చాయో ఆ వివరాలను కలిపితే ఈ సంఖ్య 3000 నుంచి 5000 వరకు వెళ్ళవచ్చును అనేది ఒక వాదన. ఎన్నో శతకాలు ఆదరణకు నోచుకోక కాలగర్భంలో కలిసిపోయాయి. మన తెలుగు సాహిత్యంలో ఎంతో అమూల్యమైన ఈ శతక సాహిత్యం లో దొరికిన మణులతో పోలిస్తే దొరకని ఆణిముత్యాలు ఎన్నెన్నో అనిపిస్తుంది. ఇప్పటి పండితవర్గంలో, పరిశోధకులలో కూడా ఈ సాహితీప్రక్రియపై  అంత ఆసక్తి ఉన్నట్లు తోచదు. అంతర్జాలంలో కూడా ఏ సాహిత్య సంబంధిత సైటులో చూసినా 10 నుండి 15 శతకాల కంటే ఎక్కువ కనపడవు. తెలుగు వికిలో కూడా దాదాపు ఇదే సంఖ్య ఉన్నట్లు గుర్తు. మిగిలిన శతకాలు వాటి వివరాలు వాటి అతీగతి ఎవ్వరికి పట్టినట్లు కనిపించటం లేదు. తెలుగు సాహిత్యాభిమానులకు గర్వకారణమైన ఈ శతక సాహిత్యాన్ని కాలగర్భంలో కలిసిపోక ముందే రక్షించుకొనే అవసరం ఎంతైనా ఉంది. అటు ప్రభుత్వం ఇటు పండితులు, సాహిత్యాభిమానులు కలిసి ఇంత అద్భుతమైన మన సాహిత్య సంపదను కాపాడుకోకపోతే శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.

 

ఉపయుక్త గ్రంధాలు:

1. “శతకకవుల చరిత్రము”, పండిత వంగూరి సుబ్బారావు పంతులు, 1957, revised edition, కమల కుటీర్ ప్రెస్ అండ్ పబ్లికేషన్స్, నరసాపురము.

2. “శతకవాఙ్మయ సర్వస్వము”, విద్వాన్ వేదము వేంకటకృష్ణశర్మ, ప్రధమ భాగము.

3. “తెలుగువారి సంపూర్ణ చిన్న బాలశిక్ష”, గాజుల సత్యనారాయణ, 2008.

13 thoughts on “ఆంధ్ర సాహిత్యంలో శతకవాఙ్మయం – ఒక పరిశీలన

  1. నేను మదరాసులో శ్రీకన్యకాపరమేశ్వరి బాలకోన్నతపాఠశాలలో చదివేటప్పుడు నా గురువుగారు విద్వత్కవిభూషణ విద్వాన్ వేదం వేంకటకృష్ణశర్మ గారు శతకవాఙ్మయ సర్వస్వము (reference 2) అని ఒక పుస్తకమును వ్రాసినారు. అది DLI లో లభ్యము. విధేయుడు – మోహన

    1. ధన్యవాదములు మోహనరావుగారు. మీరుచెప్పిన ఆ పుస్తకము నేను నా కంప్యుటరులో భద్రపరచుకున్నాను. ధన్యవాదములు.

  2. నా వ్యాసంపై అభిప్రాయాలను వ్యక్తంచేసిన మిత్రులందరికి హృదయపూర్వక ధన్యవాదములు. సుదర్శన్ గారు. మొత్తం సంఖ్య సుమారు ఐదువేలు ఉందవచ్చన్నది పరిశోధకుల అభిప్రాయం. డా.వంగూరి సుబ్బారావు గారి “శతక కవుల చరిత్రము” లొ సుమారు 1200 శతకములు (కన్నవి, విన్నవి కలిపి), 900 శతకకవుల పరిచయము చేసారు. దొరికితే మీరు అది చూడవచ్చును. నేను ఒకబ్లాగు శతకసాహిత్యం పైన మొదలుపెట్టి అందులో దాదాపు 530 శతకాలవరకు పట్టికతయారు చేసాను. ప్రస్తుతం ఒక్కొక్క శతకం చప్పున పోష్టు చేస్తున్నాను. మీకు వీలున్నప్పుడు చూడటానికి వీలుగా లింకు క్రింద ఇస్తున్నాను. మరొక్కమారు అందరికి ధన్యవాదములు

    http://shatakashityam.blogspot.in/

    సుబ్రహ్మణ్యం

  3. శతక సాహిత్యం గురించి చక్కని వివరణను అందించారు మణ్యం గారూ ! ధన్య వాదములు

  4. చక్కని పరిశోధన, అద్భుతమైన వ్యాసము. బాలసుబ్రహ్మణ్యం గారూ, అభినందనలు !

  5. ప్రియ భగవత్ బంధు శ్రీ సుబ్రహ్మణ్యం గారు!

    జై శ్రీమన్నారాయణ. తమరి పరిశోధనాత్మక వ్యాసము చదువుట ఒక అద్భుతమైన అనుభవము. మీ వివరణలు అన్నీ చదివి మన శతకవాజ్మయ గొప్పతనము ఈ తరము వారు అర్ధము చేసుకొనగలరు అనుటలో ఏ మాత్రము సందేహము లేదు.

  6. అయ్యా!దేవరకొండ సుబ్రహ్మణ్యం గారూ ! చాలా చక్కగా శతక సాహిత్యం గురించీన పుస్తకాల వివరాలు అందించారు .చాలా సంతోషం, కృతఙ్ఞతలు. ఆదూరి.హైమవతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *